[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 7 – 1959-1967- 5వ భాగం
41. ‘రామ్ కరే ఐసా హో జాయె, మెరీ నిందియా తోహె మిల్ జాయె, మై గావూ తో సో జాయె’ – మిలన్.
ఈ పాట నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది, నాన్న మమ్మల్ని నిద్రపుచ్చడానికి పాడేవారు. ఆయన పొడవాటి మృదువైన చేతివేళ్లు నా కనురెప్పలను నిమురుతున్నట్లు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఆయన ఏదో పాటని శ్రావ్యంగా ఆలాపించడం నాకు వినబడుతోంది, బహుశా అది ఈ పాటే కావచ్చు. ఈ సినిమా విడుదలైనప్పుడు నాకు మూడేళ్ళు. ఆయన పాడిన లాలిపాటల పదాలు లేదా ధున్ నాకు స్పష్టంగా గుర్తులేదు, కానీ ఆయన బలమైన, చురుకైన చేతుల పొడవైన మందపాటి వేళ్లు నా చిన్న తలపై ఉంచిన్నట్లు నాకు స్పష్టంగా గుర్తుంది. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం రాసిన చేతులు అవే.
42. ‘బోల్ గోరీ బోల్, తేరా కౌన్ పియా, కౌన్ హై వో జిస్ సే తూ నే ప్యార్ కియా?’ – మిలన్.
ఆనంద్ బక్షి రాసిన మరో ‘ప్రశ్న-జవాబు’ పాట. ఈ నమూనాలో ఆయన రాసిన చాలా పాటలు అన్నీ రొమాంటిక్ మూడ్‌తో ఉంటాయి. అలాంటి మరొక పాట ‘మేరా గావ్ మేరా దేశ్’ చిత్రంలోనిది: ‘కుచ్ కెహతా హై యే సావన్, క్యా కెహతా హై, షామ్ సవేరే దిల్ మే మేరే తూ రెహతా హై’ 1967లో, ‘నైట్ ఇన్ లండన్’ సినిమా లోని ఆయన మరో పాట ‘బహోష్-ఓ-హవాస్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సూపర్ విజయాలు ఎన్నో వచ్చాయి. నాకు గుర్తున్న కొన్నింటిని నేను వెంటనే చెప్పగలను: ఫర్జ్ (1967), రాజా ఔర్ రంక్ (1968), తక్దీర్ (1968), జీనే కీ రాహ్ (1969), ఆరాధన (1969) (రాజేష్ ఖన్నా స్టార్డమ్కు నాంది పలికిన చిత్రం), దో రాస్తే (1969), ఆన్ మిలో సజ్నా (1970), అమర్ ప్రేమ్ (1971) – ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ హిట్. ఆ తర్వాత, గీత రచయిత ఆనంద్ బక్షి, తన బన్సీవాలే కృష్ణుడికి, తన తక్దీర్ మరియు తడ్బీర్ చిత్రాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, 2002లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవరకు – ఎన్నడూ అవకాశాలు ఇవ్వమని అడగాల్సిన అవసరం రాలేదు. ఆయన జీవిత లక్ష్యం నెరవేరింది. 70ల మధ్య నుండి, సినిమా ప్రతిపాదనలతో సంప్రదించిన పంపిణీదారులు తరచుగా నిర్మాతలను, “ఇస్ ఫిల్మ్ మే ఆనంద్ బక్షి కే గీత్ హై నా?” (ఈ సినిమాలో ఆనంద్ బక్షి పాటలు ఉన్నాయి, కదా?) అని అడిగేవారు. తన కెరీర్ తొలి దశాబ్దంలోనే ఈ మైలురాళ్ళు బక్షికి ఏ రచయిత అయినా కోరుకునే గౌరవాన్ని ఇచ్చాయి. ఆయన ఇకపై, ఏదో అదృష్టవంతుడనో లేదా ‘గాలివాటం’ రచయితగా పరిగణించబడలేదు. అంతేకాకుండా, ‘సాహిత్య వర్గాలలో’ కూడా ఆయన బహిరంగంగా గుర్తించబడిన, గౌరవించబడే వ్యక్తిగా మారారు.
కానీ 1959 నాటికే ఆయన సాహిత్య విలువ తెలిసిన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన తన కెరీర్‌ను రోషన్, ఎస్.డి. బాతిష్, ఎస్. మోహిందర్, నౌషాద్ వంటి సుప్రసిద్ధ సంగీత స్వరకర్తలతో ప్రారంభించి, తరువాతి నలభై ఐదు సంవత్సరాలలో, దాదాపు తొంభై ఐదు మంది సంగీత స్వరకర్తలతో పనిచేశారు. ఆయన లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌తో 303 సినిమాలు, ఆర్.డి. బర్మన్తో తొంభై తొమ్మిది సినిమాలు, కళ్యాణ్‌జీ-ఆనంద్జీతో ముప్పై నాలుగు సినిమాలు, ఎస్.డి. బర్మన్తో పద్నాలుగు సినిమాలు చేశారు. దశాబ్దాల తర్వాత నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఎ.ఆర్. రెహమాన్ వంటి ప్రముఖులతో పనిచేశారు.
వంద మందికి పైగా గాయకులు ఆయన పాటలను పాడారు. లతా మంగేష్కర్ ఇతర గేయ రచయిత కంటే బక్షి పాటలను ఎక్కువగా పాడారు. 60ల దశకంలో ఆయన పాటలు అమీర్బాయి కర్ణాటకి, ముబారక్ బేగం, షంషాద్ బేగం, మధుబాల ఝవేరి, ఖుర్షీద్ బావ్రా, ఆశా భోస్లే, సుమన్ కళ్యాణ్పూర్, సుధా మల్హోత్రా, గీతా రాయ్ (దత్), మన్నా డే, మహేంద్ర కపూర్, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి గొప్ప గొప్ప గాయకులను ఆకర్షించాయి.
‘కొంతమంది ప్రసిద్ధ సంగీతకారులు, గాయకులు, నటులు, దర్శకులు, నిర్మాతలతో అనుబంధం ఏర్పడడం నా అదృష్టం. అంతేకాకుండా, ఆ సినిమాలు బాగా ఆడాయి. ఇక్కడ విజయానికి ఉన్నంత గొప్పదనం మరి దేనికీ లేదు. బాక్సాఫీస్ విజయం తోనే మన విలువ నిర్ణయించబడుతుంది; చిత్రనిర్మాతలకు మరేదీ ముఖ్యం కాదు.’
***
ముగ్గురు అభిమాన స్వరకర్తలు
ఎస్.డి. బర్మన్
ఎస్.డి. బర్మన్ 60లలో అగ్రశ్రేణి సంగీత స్వరకర్తలలో ఒకరు. బొంబాయికి కొత్తగా వచ్చినప్పుడు, బక్షి ఆయనకి తన కవితలు వినించడానికి చాలా ప్రయత్నించారు.
‘మొదట్లో, బర్మన్ దా నన్ను రచయితగా పెద్దగా పట్టించుకోలేదు. నేను గాయకుడిని కావడానికి వచ్చానని, నేను పాడటంపైనే దృష్టి పెట్టాలని ఆయన అనుకున్నాడు. బర్మన్ దాను కలవడానికి నేను లెక్కలేనన్నిసార్లు ప్రయత్నించాను, కానీ ఆయనకు ఎప్పుడూ సమయం దొరకలేదు. ఆయన చాలా గొప్పవాడు, బిజీగా ఉన్నాడు. నాకు అది అర్థమైంది, కాబట్టి ఆయనను కలవడానికి నేను ఖార్లోని ఆయన ఇంటి బయట వేచి ఉండేవాడిని.
ఒకరోజు, సాంగ్-సిటింగ్‌కి శైలేంద్ర రాలేదు, బర్మన్ దా సహాయకుడు నేను కొత్త రచయితనని, ఆయనను చూడాలని కోరుకుంటున్నానని బర్మన్ దా కి చెప్పాడు. దాంతో, బర్మన్ దా నన్ను పిలిపించాడు. నేను చాలా సంతోషపడ్డాను. ఆయనను కలిసి నా కవితలు కూడా వినిపించగలననే ఆశతో, ఆనందంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను. శైలేంద్ర గీత రచయితగా ఉన్న ఏదో సినిమాకి ట్యూన్ కంపోజ్ చేస్తున్నందుకు ఆయన నన్ను కొన్ని నిమిషాలు వేచి ఉండమని అడిగాడు.
ఇంతలో బర్మన్ దా అసిస్టెంట్ వచ్చి శైలేంద్ర మరో సమావేశం రద్దయిందని, ఇప్పుడు ఇక్కడికే సాంగ్-సిటింగ్‌కి వస్తున్నాడని బర్మన్ దా తో చెప్పే సమయానికి నేనింకా నా డైరీని కూడా తెరవలేదు. శైలేంద్ర ఏ క్షణంలోనైనా రావచ్చు. ఏ కారణం చేతో, అప్పుడు, నాకు తెలియకుండానే, బర్మన్ దా భయపడ్డాడు. శైలేంద్ర రాకముందే పారిపోమని నాకు చెప్పాడు. బర్మన్ దా ను తాను కలవాల్సిన సమయంలో మరో సాంగ్-సిటింగ్ జరుగుతుండటం చూసి శైలేంద్ర బాధపడవచ్చు. ఆ సమయంలో, శైలేంద్ర చాలా పెద్ద రచయిత, కాబట్టి నేను కూడా భయపడ్డాను. నేను అసమర్థుడిని అని కూడా అనిపించింది.
నేను ప్రధాన ద్వారం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, బర్మన్ దా నన్ను ఆపాడు. లోపలికి వస్తున్నప్పుడు శైలేంద్ర నన్ను చూసే అవకాశం ఉన్నందున ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్లవద్దని చెప్పాడు. వెనుక కిటికీ నుంచి దూకమని చెప్పాడు! నేను దూకాను! కానీ నేను బాల్కనీ ఎత్తైన గోడను సులభంగా ఎక్కలేకపోయాను. దాంతో బర్మన్ దా నన్ను తన గ్రౌండ్ ఫ్లోర్ బాల్కనీ గోడ మీదుగా తోసేశాడు!
తరువాత, 1964లో, నేను బర్మన్ దాతో కలిసి మూడు పాటలు చేసాను, వాటిలో రెండు లతా మంగేష్కర్ పాడారు: “అన్జానే మే ఇన్ హోఠోం పే”, “ధన్వాలోం కా యే జమానా”. దురదృష్టవశాత్తు, ఈ రెండు పాటలు ఎన్నడూ వెలుగు చూడలేదు. 1965లో మహమ్మద్ రఫీ పాడిన “మైనే పూఛా చాంద్ సే” పాటను మేము రికార్డ్ చేసాము. అయితే, ఆ సినిమా ఆగిపోయింది, పద్నాలుగేళ్ళ తరువాత, 1979లో సంజయ్ ఖాన్ ‘అబ్దుల్లా’ (1980) కోసం బర్మన్ దా కుమారుడు ఆర్.డి. బర్మన్ ఆ పాటను మళ్ళీ రికార్డ్ చేశాడు. ఇది నా సొంత ఆనందం కోసం నేను రాసుకున్న కవిత. నిజానికి, నా ప్రతిభను ప్రదర్శించడానికి నేను బొంబాయికి తెచ్చిన అరవై కవితలలో ఇది ఒకటి.
‘బర్మన్ దా తో నేను పూర్తి చేసిన మొదటి సినిమా ‘ఆరాధన’ 1969 లో వచ్చింది. ఆ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి, ఆ సినిమా రాజేష్ ఖన్నాను స్టార్‌గా నిలబెట్టింది. బర్మన్ దా నుండి నేను చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను, అది నాకు కూడా తెలుసు. కానీ ఆయన దానిని నాకు నొక్కి చెప్పారు: సినిమా కథా కథనాన్ని జాగ్రత్తగా వినండి. మీరు రాయాల్సిన పాటలు ఎల్లప్పుడూ కథలో ఉంటాయి. స్టోరీ మే గానా హై.’
ఒక మధ్యాహ్నం, ఆనంద్ బక్షి, అతని ఆప్త మిత్రుడు హరి మెహ్రా కిళ్ళీ తినడానికి ఖార్ స్టేషన్‌లోని ఒక కిళ్ళీకొట్టుకి వెళ్లారు. ఇంటికి వస్తుండగా, ఒక అందమైన అమ్మాయి అటుగా వెళ్తూ కనిపించింది. వారిద్దరిలో ఒకరు (ఎవరో స్పష్టంగా తెలియదు) ‘వా! క్యా రూప్ పాయా హై’ అని అన్నారు. వెంటనే, ఆనంద్ బక్షి శాంతాక్రూజ్‌లోని అనేక పొడవైన గుల్మోహర్ చెట్లలో ఒకదాని కింద కారు ఆపి, హరిని పది నిమిషాలు మాట్లాడవద్దని అన్నారు. ఒక పాట రాయడం ప్రారంభించారు. ఆరాధన విడుదలైన తర్వాత – హరి, బక్షి కలిసి ఆ సినిమా చూశారు. ఆ రోజు గుల్మోహర్ చెట్ల నీడలో తాను రాసిన పాట ఎస్.డి. బర్మన్ స్వరపరిచిన ‘రూప్ తేరా మస్తానా’ అని హరికి చెప్పారు బక్షి.
ఆర్.డి. బర్మన్
మీ దృష్టిలో ఆర్.డి. బర్మన్ గారి ఉత్తమ లక్షణం ఏమిటని నేను ఒకసారి నాన్నని అడిగాను. ఆయన సమాధానం, ‘నాకు గానీ దర్శకుడికి గానీ తన ట్యూన్ నచ్చక పోతే పంచమ్ ఎప్పుడూ బాధపడలేదు. అతను వెంటనే మరొక ట్యూన్ పై పనిచేయడం ప్రారంభిస్తాడు. మాకు సంతృప్తి కలిగేంత వరకూ మరిన్ని బాణీలు కట్టేందుకు అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. నేను సూచించిన కొన్ని బాణీలను కూడా అంగీకరించి మెరుగుపరిచాడు లేదా వినయంగా తిరస్కరించాడు. మాకు గొప్ప టీమ్-వర్క్ ఉంది.’
‘ హరే రామ్ హరే కృష్ణ ’ సినిమా కోసం ఒక పాట రాస్తుండగా, ఆర్.డి. గారు నాన్నతో, ‘మీ స్మోకింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఐసా లగ్తా హై ఆప్ సిగరెట్ నహీ పీ రహే హై, ఆప్ “దమ్” మార్ రహే హై (మీరు సిగరెట్ తాగుతున్నట్టు లేదు, గంజాయి దమ్ము కొడుతున్నట్లుంది)’ అని అన్నారట. అది నిజమే. ఎంత పొగ పీల్చాలనుకుంటున్నాడనే దాన్ని బట్టి, నాన్న సిగరెట్‌ను వేర్వేరు సమయాల్లో వేర్వేరు వేళ్ల మధ్య ఉంచేవారు. పంచమ్ గారి ఆ మాటలతో ఆనంద్ బక్షి ప్రేరణ పొందారు. కొంతమంది ‘దమ్ మారో ఔర్ సబ్ భూల్ జావో’ (ధూమపానం చేసి మీ కష్టాలను మర్చిపోండి) అని అనడాన్ని గుర్తుచేసుకున్నారు. వెంటనే ఈ పదాలు రాశారు, ‘దమ్ మారో దమ్, మిట్ జాయే ఘమ్, బోలో సుబహ్-ఓ-షామ్, హరే కృష్ణ హరే రామ్’. అయితే, దేవ్ ఆనంద్ ఈ పాటను సినిమాలో వాడదలచుకోలేదు. ఎందుకంటే ఇది ‘దేఖో ఓ దివానో, తుమ్ యే కామ్ న కరో, రామ్ కా నామ్ బద్నామ్ న కరో’ అనే స్ఫూర్తిదాయకమైన పాటకు ముందు వస్తుంది. అయితే, ఆర్.డి. గారూ, ఆనంద్ బక్షి ఆ పాటని సినిమాలో ఉంచేలా దేవ్ ఆనంద్‌ని ఒప్పించారు. మిగిలినదంతా చరిత్ర.
బొంబాయిలో మద్యపానంపై నిషేధం ఉన్న రోజుల్లో, ఆర్.డి. గారూ, నాన్నా ఖార్ దండా వద్ద ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్లి చవకైన దేశీయ మద్యం తాగేవారు. అప్పట్లో వారు శుద్ధి చేసిన మద్యం కొనలేకపోయారు. పోలీసులు ఆ ప్రదేశంపై దాడి చేయడంతో, వారు అక్కడ్నించి పారిపోయారు, కొంచెం ముందుకు వెళ్తే సముద్రం ఎదురైంది – ఆ కొట్టు ఒక మత్స్యకార గ్రామంలోని ఒక నిర్జన మూలలో ఉంది. వారు చిత్తడి నేలలలో, తెల్లవారుజాము వరకు దాక్కున్నారు, మళ్ళీ ఈ ప్రదేశానికి వెళ్లమని ప్రమాణం చేశారు.
సలీం ఖాన్ సాబ్ ఒకసారి నాతో ఇలా అన్నారు, “మీ నాన్నగారు ఆర్.డి.కి నిజమైన స్నేహితుడు. మేము చాలా మంచి మిత్రులం అయినప్పటికీ, బక్షిగారు ఎప్పుడూ నన్ను ఏ సహాయమూ అడగలేదు. ఆయన నన్ను ఒకే ఒక సాయం అడిగారు, అది కూడా – నాకు తెలిసిన నిర్మాతలు దర్శకులకు వారి చిత్రాలలో పని చేయడానికి ఆర్.డి.ని సిఫార్సు చేయమని. ఆర్.డి. చనిపోవడానికి కొన్ని నెలల ముందు, అతని చివరి చిత్రం ‘1942: ఎ లవ్ స్టోరీ’ విడుదలకు ముందు ఇది జరిగింది. అది మీ నాన్నగారి మంచి ప్రవర్తనకి, వ్యక్తిత్వానికి, వారి లోతైన స్నేహానికి సంకేతమని నాకు అనిపించింది.”
లక్ష్మీకాంత్-ప్యారేలాల్
‘లక్ష్మీ-ప్యారేతో నా భాగస్వామ్యం చాలా బాగా కుదిరింది, ఎందుకంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, పరస్పరం గౌరవించుకున్నాం. ముఖ్యంగా, మేము క్రమం తప్పకుండా హిట్స్ ఇచ్చాము; ఇక్కడ విజయానికి ఉన్నంత గొప్పదనం మరి దేనికీ లేదు. కొత్తగా బాగా రాస్తున్న/చక్కని ప్రదర్శన కనబరుస్తున్న వారి వెంటపడతారు. మీ గత సినిమా విజయమే మీ అసలు విజయంగా పరిగణిస్తారు. ఒకే ఒక్క పరాజయం – సంవత్సరాల నాటి ప్రేమ, స్నేహ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. నా పిల్లలు ఈ పరిశ్రమలోకి రాకాకూడదని నేను కోరుకోకపోవడానికి ఇది మరొక కారణం.
నేను, లక్ష్మీ-ప్యారేలు ఒకరి మూడ్‌లను మరొకరం సరిగ్గా అర్థం చేసుకున్నాము. మా “ట్యూనింగ్” బావుండేది, సంగీత వాయిద్యాలు కలిసి బాగా కలిసిపోతాయి. అందుకే మా జోడి మూడు దశాబ్దాలకు పైగా, 300లకి పైగా సినిమాల వరకు కొనసాగింది. అంతేకాకుండా, ఆ చిత్రాలలో చాలా బాక్సాఫీస్ విజయాలు సాధించాయి. సినీనిర్మాతలు విజయవంతమైన బృందాలతోనే మళ్ళీ మళ్ళీ పని చేయాలని కోరుకుంటారు. ఇది ఒక మూఢనమ్మకాల పరిశ్రమ.’
ప్యారేలాల్ శర్మజీ ఒకసారి నాతో ఇలా అన్నారు, “నేను మీ నాన్నగారిని మొదటిసారి 1961లో కళ్యాణ్‌జీ-ఆనంద్జీ చిత్రం ‘ఫూల్ బనే అంగారే’ (1963) పాటల రికార్డింగ్ సమయంలో చూశాను. అప్పుడు నేను మీ నాన్నగారి పాట ‘చాంద్ ఆహే భరేగా’ కి వయోలిన్ వాయిస్తున్నాను. నాలుగు సంవత్సరాల తర్వాత మేము కలిసి చేసిన మొదటి సినిమా ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ (1964). ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగీ, ఆజ్ రుస్వా, తేరీ గలియోం మే మొహబ్బత్ హోగీ’ పాట సూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఎన్నో బ్యాండ్లు, ఎందరో స్వరకర్తలు ఆ పాటని చాలాసార్లు పునఃసృష్టించారు. నిజాయితీగా చెప్పాలంటే, మీ నాన్నగారు సంగీత దర్శకుడు, గాయకుడు అవ్వాలి, గీత రచన కేవలం ఆయన అభిరుచి అని నేను నమ్ముతున్నాను.”
పాటలు రాయడానికి, ఆనంద్ బక్షి సినిమా కథ ద్వారా ప్రేరణ మాత్రమే పొందలేదు, ఆయన తనలో ఉన్న ఆధ్యాత్మిక విశ్వం నుండి కూడా ప్రేరణ పొంది పాటలు రాశారు.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.