Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-16

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 7 – 1959-1967- 4వ భాగం

1966

31. ‘దునియా మే ఐసా కహాఁ సబ్‍కా నసీబ్ హై, కోయీ కోయీ అప్నే పియా కా కరీబ్ హై’ దేవర్; సంగీతం: రోషన్

రోషన్ సాబ్, ఒక సంవత్సరం తరువాత, 1967లో మరణించారు. ఆనంద్ బక్షి తన భార్య, ఇద్దరు పిల్లలతో తిరిగి కలిసిన రెండు సంవత్సరాల తర్వాత ఈ పాట వచ్చింది. 1966 నాటికి బక్షికి మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక చరణంలో, ఆయన ఇలా వ్రాశారు, ‘దూర్ హి రెహేతే హైఁ ఉన్‍సే కినారే, జిన్‍కో మాఝీ పార్ ఉతారే, సాథ్ హై మాఝీ తో కినారా భీ కరీబ్ హై, మే ఐసా కహాఁ సబ్‍కా నసీబ్ హై, తు హై తో జిందగీ కో జిందగీ నసీబ్ హై’. మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండటం ఎంతటి వరదాయకమో వివరిస్తూ, ‘చాహే భుజా దే కోయీ దీపక్ సారే, ప్రీత్ బిఛ్‌తీ జాయె రాహోం మే తారే, ప్రీత్ దీవానీ కీ కహానీ భీ అజీబ్ హై‘ అన్నారు.

32. ‘బహారోం నే మేరా చమన్ లూట్‍కర్ ఖిజాంవోం పె ఇల్జామ్ క్యూఁ దే దియా, కిసీ నే చలో దుష్మనీ కీ మగర్, ఇసే దోస్తీ నామ క్యూఁ దే దియా.’ – దేవర్; సంగీతం: రోషన్

ఇక్కడ, పాటలో కథానాయకుడు తనకు ప్రేమ ఎందుకు దక్కడం లేదని ప్రశ్నిస్తాడు, వసంతం ప్రకృతిలోని అందాన్నంతా తొలగించిందని, శీతాకాలపు నిస్సారానికి కారణమంటూ శరదృతువుపై నింద మోపిందని అంటాడు. చివరి చరణంలో, అతను దేవుణ్ణి నిందించాడు: ‘ఖుదయా యహాఁ తేరే ఇన్సాఫ్ కే, బహుత్ మై నే చర్చే సునే హైఁ మగర్, సజా కీ జగహ్ ఏక్ ఖతావార్ కో, భలా తూనే ఇన్సాఫ్ క్యూఁ దే దియా‘ (దేవుడా, నువ్వు న్యాయంగా ఉంటావని విన్నాను, అయినా అపరాధిని వెళ్లడానికి నువ్వు అనుమతించావు).

33. ‘ఆయా హై ముఝే ఫిర్ యాద్ వో జాలిమ్, గుజరా జమానా బస్‍పన్‍కా, హాయ్ రే అకేలే ఛోడ్ కే జానా ఔర్ నా ఆనా బచ్‍పన్ కా.’ – దేవర్.

నాన్న తన అమ్మని, పదిహేడేళ్ళు గడిపిన రావల్పిండిని మిస్ అవుతున్నారని, ఏదో ఒక రోజు ఆ ప్రదేశాన్ని సందర్శించాలనే కోరిక గురించి తరచూ మాతో అనేవారు. అందువల్ల ఈ పాట మమ్మల్ని ఉద్దేశించినట్టే అనిపిస్తుంది.

34. ‘రూఠే సైఁయా, హమారే సైఁయా, క్యూఁ రూఠే, నా తో హమ్ బేవఫా, నా తో హమ్ జూఠే, చైన్ నా హమే, నీంద్ నా ఆయీ, దేతే రహే సారీ రైన్ దుహాహీ, కోయీ ఉన్‍కీ భూ యూఁ హీ నిందియా లూటే’. – దేవర్.

35. ‘ఖత్ లిఖ్ దే సఁవరియా కే నామ్ బాబూ, కోరే కాగజ్ పర్ లిఖ్ దే సలామ్ బాబూ వో జాన్ జాయెంగే, పహ్‍చాన్ జాయెంగే, కైసే హోతీ సుబహ్ సే షామ్ బాబూ‘. – ఆయే దిన్ బహార్ కే; సంగీతం: లక్ష్మీకాంత్ – ప్యారేలాల్.

ఈ రొమాంటిక్ సాంగ్‌లో, కథానాయిక తన ప్రేమికుడికి ఒక లేఖ రాస్తూ ఉంటుంది, అతను ఉద్యోగం కోసం నగరానికి వలస వెళ్లి ఇంకా ఆమెను చూడటానికి తిరిగి రాలేదు. అతన్ని బానిసగా చేసి తన నుండి దూరంగా తీసుకెళ్లిన ఉద్యోగం అతను కోల్పోవాలని ఆమె కోరుకుంటుంది.

36. ‘యే కలీ, జబ్ తలక్ ఫూల్ బన్‍కే ఖిలే, ఇంతజార్ ఇంతజార్ ఇంతజార్ కరో, ఇంతజార్ ఓ భలా క్యా కరేఁ, తుమ్ జిసే, బేకరార్ బేకరార్ కరో’. – ఆయే దిన్ బహార్ కే.

ఈ పాటలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే గుంజాటనని వ్యక్తం చేస్తున్నారు బక్షి. ఆ వ్యక్తి ఆమెను తన ప్రేమకు లొంగిపోవాలని వేడుకుంటాడు, ఆమె అతనిని ఆటపట్టిస్తూ, అతని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, ఓపికగా ఉండమని చెబుతుంది.

37. ‘సునో సజ్‍నా, పపీహే నే కహా సబ్ సే పుకార్ కె, చమన్ వాలోం, సంభల్ జావో, కి ఆయే దిన్ బహార్ కే‘. – ఆయే దిన్ బహార్ కే.

ఈ ఐకానిక్ లవ్ సాంగ్ – సినిమాలో స్త్రీ పాత్ర యొక్క ప్రకటన, తాను ప్రేమలో పడ్డానని; ఈ ఆనందకరమైన క్షణంలోనే తాను శాశ్వతకాలం గడపగలనని ఆమె చెబుతుంది. మరోసారి, గీతరచయిత పపిహా పక్షిని ఉపయోగించి తన వ్యక్తీకరణను తెలియజేసారు, దీని రాక శ్రావణ మాసాన్ని సూచిస్తుంది: ‘బాఘోం మే పడ్ గయే హైఁ, సావన్ కే మస్త్ ఝూలే, ఐసా సమా జో దేఖా, రాహీ భీ రాహ్ భూలే, కే జీ చాహా యహీఁ రఖ్ దేఁ, ఉమర్ సారీ గుజార్ కే’.

38. ‘మేరే దుష్మన్ తూ మేరీ దోస్తీ కో తరసే, ముఝే దర్ద్ దేనేవాలే, తూ ఖుషీ కో తరసే‘. – ఆయే దిన్ బహార్ కే.

ప్రకృతి నుంచి, వ్యక్తుల సంబంధాల నుండి స్వీకరించిన అంశాలను ఉపయోగించి, శాపంగా అనిపించే పాటను రాసినప్పటికీ, అదెన్నడూ దూషణలా అనిపించేలా గీత దాటకుండా దాటకుండా, జాగ్రత్తగా రాసిన ఏకైక గీత రచయిత ఆనంద్ బక్షియే కావచ్చు. మళ్ళీ, ఆయన పాటను సందర్భాన్ని అందించడానికి ఒక నజ్మ్‌తో ప్రారంభిస్తారు: ‘మేరే దిల్ సే సితమ్‌గర్, తూనే అచ్ఛీ దిల్లగీ కి హై, కీ బన్‍కే దోస్త్ అప్నే దోస్తోం సే దుష్మనీ కీ హై’.

నాన్న స్నేహం నేపథ్యంలో అనేక పాటలు కూడా రాశారు. ఉదాహరణకు, ‘షోలే‘ సినిమాలో, హోలీ పండుగ సమయంలో శత్రువులను స్నేహితులుగా మార్చుకునే సందర్భంలోని పాట: ‘గిలే-షిక్వే భూల్ కే దోస్తోం, దుష్మన్ భీ గలే మిల్ జాతే హైఁ; హోలీ కే దిన్ దిల్ ఖిల్ జాతే హైఁ, రంగోం మే రంగ్ మిల్ జాతే హైఁ’. అలాగే ‘దోస్తానా‘ సినిమా నుండి: ‘బనే చాహే దుష్మాన్, జమానా హమారా, సలామత్ రహే, దోస్తానా హమారా’.

***

1967

39. ‘ముబారక్ హో సబ్‍కో సమా యే సుహానా, మై ఖుష్ హూఁ మేరే ఆంశువోం పే నా జానా, మై తో దీవానా దీవానా దీవానా’. – మిలన్; సంగీతం: లక్ష్మీకాంత్ -ప్యారేలాల్

ఈ సినిమా పాటల విజయం – సినిమాల్లో ఆనంద్ బక్షి విజయవంతం కావడంతో ఏదో గాలివాటం అని దేశవ్యాప్తంగా ఉన్న ఓ అపప్రదని తుడిచేసింది. ఈ సినిమా ఆయన మొదటి బ్లాక్‌బస్టర్. ఈ చిత్రంలో సునీల్ దత్ నటించడం నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే 1961లో రాజ్ కపూర్ కార్యదర్శి హిరేన్ ఖేరాతో ఆనంద్ బక్షి సమావేశానికి ఆయనే కారణమయ్యారు, ఆ తర్వాత బక్షి మొదటి హిట్ అయిన ‘మెహందీ లగీ మేరే హాత్‌’ లోని అన్ని పాటలను వ్రాసే అవకాశాన్ని హిరేన్ ఇచ్చారు.

‘మేరా సంఘర్ష్ కా జమానా మిలన్ ఫిల్మ్ తక్ రహా. ఉస్కే బాద్ ముఝే కామ్ ఔర్ పైసోం కీ కమీ నహీ రహీ. మేరే బన్సీవాలే నే మేరే మాసూమ్ సప్నే పూరే కియే.’ (మిలన్ సినిమా తర్వాత నా కష్టాల రోజులు ముగిశాయి. ఆ తర్వాత నాకు పనికి, డబ్బుకు ఎప్పుడూ లోటు రాలేదు. నా అమాయక కలలను నెరవేర్చుకోవడానికి నా శ్రీకృష్ణుడు సహాయం చేశాడు).

ఈ పాటలో నాకు ఇష్టమైన చరణం ఏమిటంటే, ‘యే బోలే సమయ్ కీ నదీ కా బహావ్, యే బాబుల్ కీ గలియాఁ, యే మాంఝీ కీ నావ్, చలీ హో తో గోరీ, సునో భూల్ జావో, నా ఫిర్ యాద్ కర్నా, నా ఫిర్ యాద్ ఆనా మై ఖుశ్ హూఁ మేరే ఆంశువోం పే నా జానా’.

1967లో మిలన్ విడుదల తర్వాత, ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం నాన్నకి ఫోన్ చేస్తే, నాన్న నమ్మలేకపోయారు! ‘మీరు ఖచ్చితంగా నన్నే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా? నేను ఆ సినిమా పాటల రచయితని, నటుడిని కాదు.‘ అన్నారు.

ప్యారేలాల్ గారి మాటల్లో చెప్పాలంటే, ‘లక్ష్మీ, బక్షిజీ ఇంకా నేను పరేల్‌లోని కర్దార్ స్టూడియోస్ నుండి ఒక తమిళ సినిమా ట్రయల్ షో చూసిన తర్వాత బయటకు వచ్చాము, ఆ సినిమాని తరువాత మిలన్ అని మార్చారు. లక్ష్మీ రెగ్యులర్‍గా వెళ్ళే ప్రభాదేవి సమీపంలోని కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాము. కిళ్ళీ సిద్ధం అవుతుండగా, ఈ పెద్ద సినిమాకి మేం ముగ్గురం కలిసి పని చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉన్న బక్షిజీ భావోద్వేగానికి గురై, “ముబారక్ హో సబ్కో, సమా యే సుహానా, మై ఖుష్ హూఁ మేరే ఆంశువోం పే నా జానా” అని అన్నాడు. తరువాత, ఆ వాక్యాలనే ఈ సినిమా కోసం ఒక పాటలో ఉపయోగించారు’.

40. ‘సావన్ కా మహీనా, పవన్ కరే సోర్, జియరా రే ఝూమే ఐసే జైసే బన్ మాఁ నాచే మోర్’.- మిలన్.

‘నేను, లక్ష్మీకాంత్ కలిసి ఫేమస్ స్టూడియోస్ వెలుపల కిళ్ళీ నముల్తున్నప్పుడు “సావన్ కా మహీనా, పవన్ కరే సోర్” అనే ముఖ్‌డా గురించి ఆలోచించాను. పాన్‌వాలా ఎవరినో ఉద్దేశించి పదే పదే – ‘షోర్’ కాదు ‘సోర్’ అని చెబుతున్నాడు. నేను లక్ష్మీకాంత్‌కి ముఖ్‌డా చెప్పాను, అతను దానిని ఇష్టపడ్డాడు. మిగిలిన చరణాలను నేను త్వరలోనే రాశాను.

నా మొదటి హిట్ పాట ఏ పాట అని నేను భావిస్తాను? హిందీ గీత రచయితగా ఒక స్థాయికి వచ్చానని, ‘సాధించానని‘ – నేను ఎప్పుడు నమ్మడం ప్రారంభించాను? నిజంగా ప్రజాదరణ పొందిన పాట మీ నగరం దాటి ప్రయాణించి, ఎటువంటి “మార్కెటింగ్” లేకుండా గ్రామాలకు చేరుకుంటుంది. 60ల చివరలో ప్రజలు నా రాకని గుర్తించడం ప్రారంభించారు. కానీ నేను వారి ప్రశంసల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక రోజు, నేను బొంబాయి నుండి ఢిల్లీకి ఫ్రాంటియర్ మెయిల్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, తెల్లవారుజామున 2 లేదా 3 గంటల ప్రాంతంలో రైలు ఏదో మారుమూల గ్రామంలో, కిరోసిన్ దీపాలతో వెలిగించిన స్టేషన్‌లో ఆగింది. అక్కడ ఎవరో ‘మిలన్’ సినిమా నుండి మన పాట పాడటం విన్నాను.

నాకు ఆశ్చర్యం వేసింది. ఆ చీకటైన, చల్లని, ప్రశాంతమైన శీతాకాలపు రాత్రిలో ఆ పాట ఎక్కడ్నించి వస్తోందో గుర్తించడానికి నేను క్యాబిన్ నుండి బయటకు వెళ్లి రైలు తలుపు వద్ద నిలబడ్డాను. ఆ గాయకుడు స్టేషన్ ప్లాట్‌ఫామ్ అంచున ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని “సావన్ కా మహీనా పవన్ కరే సోర్” పాడుతున్నాడు. రెండు చెక్క పలకలతో చేసిన వాయిద్యం వాయిస్తూ, ఒకదానికొకటి ఢీకొడుతూ భిక్షాటన చేస్తున్న ఫకీర్ అతను. విద్యుత్ కూడా లేని ఒక మారుమూల గ్రామంలో నివసించే ఒక పేదవాడు మా పాటను పాడుతున్నాడు! అతనికి ఓ పూట భోజనం లేదా అంతకంటే ఎక్కువ పొందడానికి సహాయపడే మా పాటలలో ఇది ఒకటి. మా పాట ఎక్కడో ఎవరికో ఆహారం దక్కిస్తోంది. అంతేకాకుండా, ఆ పాట మన దేశం నడిబొడ్డున ఉన్న ఈ ఫకీర్ చెవులకు ఎటువంటి ప్రచారం, మార్కెటింగ్ లేదా సినిమా మ్యాగజైన్ ఫీచర్లు లేకుండా చేరుకుంది. నేను త్వరగా రైలు దిగి అతనికి కొన్ని రూపాయలు అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఈల మోగింది, ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరబోతుండగా రైలు ఎక్కాను.

ఆ గ్రామం చీకటిలో అదృశ్యమై, శీతాకాలపు చల్లని గాలి నా ముఖం మీదుగా వీస్తుండగా, నేను కిటికీ మూసేశాను. నేను పాటలు రాసే మంచి వ్యక్తులు నన్ను అంగీకరించడమే కాకుండా నన్ను ఆదరించి, అక్కున చేర్చుకున్నారని నాకు అర్థమైంది. లోక్ గీత్ (జానపద పాటలు) పాడటం ద్వారా ఆహారం సంపాదించే ఒక ఫకీర్ నా పాటలను పాడుతున్నాడు, నా పాటలు సామాన్యులను చేరుతాయో లేదో నాకింకా తెలియనప్పుడు – పరిశ్రమలో నా తొలినాళ్లలో అది బహుశా నాకు లభించిన అతిపెద్ద బహుమతి.

నేను సినిమాల్లోకి రాకముందు సామాన్యుడిని, ఇక్కడికి చేరే నా ప్రయాణానికి చాలా మంది దిగ్గజాలు స్ఫూర్తినిచ్చారు. కాబట్టి నా సాహిత్యంతో సామాన్యుల హృదయాన్ని తాకాలనుకున్నాను. లోక్ గీత్, లోక్ సంగీత్ (జానపద సంగీతం) రెండూ నా బాల్యం నుండి నాకు ప్రేరణగా నిలిచాయి. నాలుగు దశాబ్దాలుగా నా రచనలో ఈ రెండు రూపాలను ప్రతిబింబించడానికి ప్రయత్నించాను. నా అనేక సాహిత్యాలలో జానపద స్ఫూర్తి ఉంది. నేను ప్రధానంగా పంజాబీ లోక్ గీత్‌ను నా రచనా శైలిలో పొందుపరచుకున్నాను. ప్రజలు నా రచనను ఇష్టపడుతున్నారంటే, నా పాటలు చాలా ప్రసిద్ధ పంజాబీ లోక్ గీత్ శైలిలో వ్రాయబడ్డాయి. అయితే, ఇది “సాధించిన” క్షణం కాదు, ఎందుకంటే నేనింకా నా ఉత్తమమైన పాట రాయలేదని భావిస్తున్నాను’.

ముఖేష్, ఆనంద్ బక్షి ‘సావన్ కా మహీనా‘ పాటకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంటామని ఆశించారు. కానీ గెలవకపోవడంతో, నాన్న చాలా నిరాశ చెందారు. ఆ తర్వాత తానెప్పటికీ  ఆ అవార్డు గెలుచుకోలేనని అనుకున్నారు, ఎందుకంటే తాను బహుశా ఇంతకంటే మంచి పాటను ఎప్పటికీ రాయలేనేమోనని తలచారు. అవార్డు వేడుక తర్వాత నాన్న, ముఖేష్ గారు జుహులోని సన్-ఎన్-సాండ్ హోటల్ బార్‌కి వెళ్లి, చాలా మద్యం సేవించి తమ నిరాశను దానిలో దాచేశారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version