[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 7 – 1959-1967- మొదటి భాగం
కాగజ్ కలమ్ దావత్: అగ్రస్థానానానికి వేసుకున్న బాటలు
ఇక్కడి నుండి బక్షి ప్రయాణాన్ని సరళంగా పట్టి చూపడం కష్టం. సినిమాల్లో ఆయన ప్రారంభ జీవితం, ఇంకా మా ఇంటి విషయాలను నేను చెప్పానుకున్నాను – ఎక్కువగా ఆయన కుటుంబం, సన్నిహితులు, కొంతమంది అభిమానులకు తెలిసిన వివరాలివి. ఈ అధ్యాయంలో ఆయన రచించిన మైలురాయి పాటలను, వాటికి సంబంధించిన కొన్ని సంగతులు ప్రస్తావిస్తాను. నాన్న దాదాపు తొంభై ఐదు మంది సంగీత దర్శకులతో, 250 మంది దర్శకులతో కలిసి పనిచేయటానికి ముందు, మొదటి దశాబ్దం నుండి ఆయన పని గురించి చెప్తాను.
ఓ స్వప్నాన్ని మోసుకుంటూ తిరిగిన నంద్ అనే ‘రావల్పిండి అబ్బాయి’ 1962 నుండి ఆనంద్ బక్షిగా అపారమైన ప్రజాదరణ పొందారు. ఆయన పాటలు బినాకా గీత్ మాలా వంటి రేడియో కార్యక్రమాలలో రోజు తర్వాత వారం, వారం ప్రసారం చేయబడ్డాయి. ఇది దాదాపు నలభై సంవత్సరాలు కొనసాగింది (ఈ ప్రదర్శనను అమీన్ సయాని హోస్ట్ చేశారు, దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో నంబర్ 1 సాంగ్-కౌంట్‌డౌన్ షోగా పరిగణింపబడింది). అయితే ఆనంద్ బక్షి స్వయంగా తన హిట్ పాటల జాబితాను రూపొందించారు. 1959 – 1967 సంవత్సరాల మధ్య ఆయన రాసిన నలభై పాటలు అప్పట్లో ‘హిట్’, ‘పాపులర్’గా పరిగణించబడ్డాయి.
ఆయన తన స్వదస్తూరితో నోట్స్‌లో పేర్కొన్న ఈ పాటలను మీకు అందిస్తున్నాను. ప్రతి పాట శీర్షిక పక్కన, ఆయన, రికార్డింగ్ తేదీని, సంగీత దర్శకుడు, గాయనీగాయకుల పేర్లను జాగ్రత్తగా రాసుకున్నారు.
ఇది గాయనీగాయకులకు, స్వరకర్తలకు ఆయన ఇచ్చిన గౌరవంగా నాకనిపిస్తుంది. 2001 ప్రాంతంలో ఆస్తమా నాన్నని లొంగదీసుకోడం మొదలయ్యాకా, ఆయన ఈ నోట్స్ రాయడం మానేశారు. నేను ఇక్కడ పేర్కొంటున్న జాబితా పరిమితమైనది, కానీ ఇది ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల కాలంలో, ఆయన నెమ్మదిగా, స్థిరంగా ఉన్నత స్థాయికి ఎదగడాన్ని ప్రదర్శిస్తుంది.
***
1959
1. ‘బడీ బులంద్ మేరీ భాభీ కీ పసంద్, పర్ కమ్ నహీఁ కుఛ్ భయ్యా భీ, హ్యా జోడీ హై’ – CID గర్ల్ (1959); సంగీతం: రోషన్
ఆయన రాసిన పాటల్లో, ప్రజాదరణ పొందిన మొదటి పాట ‘బడీ బులంద్’, స్వరకర్త రోషన్‌తో ఆయన మొదటి పాట. ఇది రచయితగా బక్షి కెరీర్ ప్రారంభం, సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంలో నాన్న పేరు ఉపకరించనప్పటికీ, మహమ్మద్ రఫీ వంటి స్టార్ సింగర్‌తో పని చేసే అవకాశం లభించింది. బొంబాయికి వచ్చిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు సక్రమంగా పని లేకపోయినా; కాలం, అదృష్టం నాన్న వైపు ఉన్నట్లు అనిపించింది. కనీసం ఒక్క అవకాశం ఇవ్వమంటూ నాన్న నిరంతరం ఆయన వెంటపడినప్పుడు రోషన్ సాబ్ బాగా స్థిరపడిన స్వరకర్త.
‘నేను కుంభవృష్టిలో రోషన్ సాబ్‌ను కలిసి, నా కవితలు వినిపించడానికి వచ్చాననే వాస్తవం వల్ల, ఆయన నా కవితలు వినాలని నిర్ణయించుకున్నారు. నేను చదివినవి ఆయనకి నచ్చాయి, దాంతో నాకు పని ఇచ్చారు. తరువాత, నాకు వరుసగా అవకాశాలొచ్చాయి. కాబట్టి ఇది నా పోరాట రోజుల్లో నాకు ఒక మలుపు లాంటిది. అయినప్పటికీ, నాకు సంతృప్తి అనిపించేలా పని దొరకలేదు, లేదా నా కుటుంబాన్ని లక్నో నుండి తీసుకురావడానికి సరిపోయేంత డబ్బు లేదు. తరువాతి మూడు సంవత్సరాలలో, అప్పుడప్పుడు, నాకు ఒకటి లేదా రెండు పాటలు రాయడానికి అవకాశం దొరికేది, ఇలా నా తదుపరి పెద్ద బ్రేక్ వరకు కొనసాగింది, అది ‘మెహందీ లగీ మేరే హాత్’ చిత్రం, అందులో నాకు అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా విజయవంతమైంది.’
‘బడి బులంద్’ అనే పాటను జూలై 4, 1958న మహమ్మద్ రఫీ పాడారు. ఈ పాటలోని ఒక పాదం ‘సజేగా దుల్హా సెహెరే సే, దుల్హాన్ సజేగి ఘుంఘాట్ సే, పఢేంగే మంతర్ పండిత్ జీ, ఫెరే పడేంగే ఝట్ సే’ అని ఉంది. ఇది కొన్ని పదాలలో, కథలోని పాత్రల సంస్కృతి, వివాహ సంప్రదాయాలను, వివాహం చేసుకోవడంలో ఆ జంట ఉత్సాహాన్ని వెల్లడిస్తుంది. తన కెరీర్ ప్రారంభం నుండి, ఆనంద్ బక్షి నిజమైన సినీ గీత రచయిత; కథ, స్క్రీన్ ప్లే ఇంకా పాత్రలలో లీనమై ప్రేరణ పొందారు. ఆయన రెండవ ప్రసిద్ధ పాట కూడా అదే చిత్రం, CID గర్ల్ నుండి వచ్చింది.
2. ‘హాయ్, దర్ద్-ఎ-దిల్, జరా-జరా, దేతా హై జీ బడా మజా, హఁస్ కే లే, జిస్‍సే మిలే హల్కా-సా థోడా-సా’
ఆనంద్ బక్షి ఈ పాటలో ప్రేమ కథలను ఆటపట్టిస్తారు: ‘రోమియో-జూలియట్, లైలా-మజ్ను, షిరిన్ – ఫర్హాద్, అరె, ఐసే కిత్నే నామ్ మేరీ జాన్ తుమ్ కో యాద్, భరీ జవానీ ఇసీ కి ఖాతిర్ కర్ గయే జో బర్‍బాద్.’
***
1960
3.‘చున్ను పతంగ్ కో కెహతా హై కైట్, బోలో బేటా టింగూ, యే రాంగ్ ఆర్ రైట్?’ – ‘జమీన్ కే తారే’ (1960); సంగీతం ఎస్. మొహిందర్
ఆ కాలంలో ఎస్. మొహిందర్ (మొహిందర్ సింగ్) మరొక సుప్రసిద్ధ స్వరకర్త. ఈ పాటలో, ఒక పిల్లవాడు (జోయా, ఫర్హాన్ అక్తర్‍ల అమ్మ హనీ ఇరానీ పోషించిన పాత్ర) తన తమ్ముడి ఇంగ్లీష్ వొకాబులరీని ఎలా సరదాగా పరీక్షిస్తున్నాడో, ఏది సరైనది, ఏది తప్పు అని అతనికి నేర్పిస్తున్నాడో, తెలియజేస్తారు ఆనంద్ బక్షి. ఈ చిక్కుప్రశ్నలు వారి ప్రాంతం, సంస్కృతిలో పాతుకుపోయినవి. ఇది నాన్న రేడియోలో విన్న ఆయన మొదటి పాట, దీనితో ఆయన చిన్ననాటి కలలలో ఒకటైన ‘ఏక్ దిన్ మేరే భీ గానే రేడియో పె బజెంగే’ నేరవేరింది.
***
1961
4. ‘హోఠోం పే హఁసీ, పలకోం పే హయా, ఆంఖోం మే షరారత్ రహతీ హైఁ’-వారెంట్ (1961); సంగీతం రోషన్
ఇది నాన్న మొదటి ‘హిట్’ పాట. దీన్ని లతా మంగేష్కర్ పాడారు. 6 నవంబర్ 1959న రికార్డ్ చేయబడింది. ఆమె కూడా అప్పటికి స్టార్ సింగర్. ఈ పాటలో, ఆనంద్ బక్షి, ‘ఝాంకో తో నషీలీ ఆంఖోన్ మే, దేఖో తో జరా, సాగర్ కీ భలా, ఫిర్ కిస్కో జరూరత్, రెహతీ హై’ అంటూ ఈ చిత్రంలోని అందమైన కథానాయిక ఆకర్షణీయమైన కనుల లోతును వర్ణించారు.
1961 సంవత్సరంలోనే ఆయన రెండవ సంతానం, ఒక కుమారుడు జన్మించాడు. గోగి (రాజేష్) సెప్టెంబర్ 13న సాయంత్రం 4.30 గంటలకు లక్నోలో జన్మించాడు. గోగి కూడా తన తండ్రి జీవితానికి అదృష్టం తెచ్చిపెట్టినట్లు అనిపించింది, ఎందుకంటే ఆనంద్ బక్షి మొదటి హిట్ చిత్రం, అన్ని పాటలు ఆయనే రాసిన సినిమా, మరుసటి సంవత్సరం వచ్చింది. (ఈ సంవత్సరంలో మరొక హిట్ పాట ఉంది, దానిని నోట్ చేయడం మర్చిపోయారు, రజియా సుల్తానా సినిమా లోని, ‘ఢల్తీ జాయే రాత్’, దీనికి లచ్ఛీరామ్ సంగీతం అందించారు.)
***
1962
5. ‘మెహందీ లగీ మేరే హాత్ రే’-మెహందీ లగీ మేరే హాత్ (1962); సంగీతం కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ (కెఏ).
కెఏతో నాన్న మొదటి సినిమా. తరువాత, ఈ ముగ్గురు 34 సినిమాలకు పనిచేశారు.
సూరజ్ ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, 1965లో ఆనంద్ బక్షి మొదటి సూపర్‌హిట్ చిత్రం (భారతదేశమంతటా), ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’కి కూడా దర్శకత్వం వహించినది సూరజ్ ప్రకాష్ గారే. ఈ పాటలో, బక్షి ఒక వధువు ఉత్సాహాన్ని ఈ పాదంలో అందంగా వర్ణించారు, ‘కర్‌కే చునరియా, సర్ పే నా ఠహరే, దిల్ ధడ్‌కే దిన్ రాత్ రే’ అంటూ.
6. ‘కంకరియా మారే, కర్‍కే ఇషారే, బల్మా బడా బేయీమాన్, ఖుద్ కో హఁసాయె, హమ్‍కో రులాయే, బల్మా బఢా బేయీమాన్’
7. ‘ఆప్ నే యూఁ హీ దిల్లగీ కీ థీ, హమ్ తో దిల్ కీ లగీ సమజ్ భైఠే. ఆప్ నే భీ హమేఁ నా సమఝాయా, ఆప్ భీ తో హఁసీ సమఝ్ భైఠే, హ్యా హువా ఆప్ నే నా పహ్‍చానా, ఔర్ హమే అజ్‍నబీ సమఝ్ భైఠే, జల్ రహా థా ఓ దిల్ హమారా హీ, హమ్ జిసే చాంద్‍నీ సమఝ్ భైఠే’
8.‘తేరీ వో చాల్ హై హి తౌబా, ఐసా కమాల్ హై హి తౌబా, మేరా వో హాల్ హై కి తౌబా తేరీ హర్ అదా మస్తానీ, మేరీ హర్ నిగాహ్ దీవానీ’
అన్ని పాటలు ఆయనే రాయగా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా అవకాశం ఆనంద్ బక్షికి ఎలా వచ్చింది? దీనికి ఆయన స్నేహితుడు, మోహ్యాల్ బంధువు, స్టార్ నటుడు-దర్శకుడు-నిర్మాత సునీల్ దత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ పరిశ్రమలో ఎవరూ ఎవరికీ సహాయం చేయరు’ అని సునీల్ దత్ నాన్నకి చెప్పారు. ‘రాజ్ కపూర్ శైలేంద్రతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాజ్ కపూర్‌ను కలవడానికి నేను మీకు సిఫార్సు లేఖ ఇస్తాను. అయితే నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించుకో.’ నేను 1998లో సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు, నాన్న నాతో, “ఇక్కడ, నీ సొంత జీవిత చరిత్ర నువ్వే రాయాలి” అని అన్నారు. రచయితగా నా మొదటి పుస్తకం – డైరెక్టర్స్ డైరీస్ – లో అంకితం వాక్యాలుగా నేను ఆయన చెప్పిన ఈ కొటేషన్‌ని ఉపయోగించాను.
అది 1959 సంవత్సరం. 1961లో హిట్ అయిన ‘మెహందీ లగీ మేరే హాత్’ సినిమా నిర్మాతగా పనిచేసిన హిరేన్ ఖేరా, ఆ సమయంలో రాజ్ కపూర్ కార్యదర్శిగా ఉన్నారు. ఆనంద్ బక్షి – రాజ్ కపూర్‌ని కలిసినప్పుడు, తాను శైలేంద్రతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని బక్షితో చెప్పారు, ఎందుకంటే వారిది బాగా స్థిరపడిన బృందం. తమ సమావేశానికి ముందు, ఆయన కార్యాలయంలో రాజ్ కపూర్‌ను కలవడానికి వేచి ఉండగా, బక్షి తన కవితలను హిరేన్ ఖేరాకు వినిపించారు. ఒక హాబీగా కవిత్వాన్ని చదవడానికి ఇష్టపడే ఖేరా, ఈ కవితలను ఇష్టపడ్డారు, తాను నిర్మాతగా మారినప్పుడు, తన మొదటి చిత్రానికి పాటలు బక్షితో రాయిస్తానని వాగ్దానం చేశారు.
కాలక్రమేణా, ఆనంద్ బక్షి, హిరేన్ ఖేరా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్నేహితులయ్యారు. ఈ నలుగురూ ఇప్పటికీ పరిశ్రమలో ‘స్ట్రగులర్స్’ గానే ఉన్నారు, ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. వారు చెంబూర్‌లోని ఖేరా ఇంటికి పావ్ (గోధుమ రొట్టె) తీసుకొని వెళ్ళేవారు, ఖేరా పప్పు వండేవారు, కొన్నిసార్లు ఉసల్ పావ్‌ను తయారు చేసేవారు, అది ఆనంద్ బక్షికి, లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌కు ఇష్టమైనది.
1960లో, ఖేరా తన మొదటి చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినప్పుడు, ఆయన తన స్నేహితుడు ఆనంద్ బక్షికి అవకాశం ఇవ్వలేకపోయారు. హస్రత్ జైపురి, డిఎన్ మధోక్ ఈ చిత్రానికి ఇద్దరు గీత రచయితలు. అయితే, కొన్ని కారణాల వల్ల వారు ఆ చిత్రం చేయలేకపోయారు. దాంతో అన్ని పాటలు రాయడానికి ఖేరా, ఆనంద్ బక్షిని సంప్రదించారు. ఆ చిత్రం, దానిలోని ఆరు పాటలలో నాలుగు కూడా విజయవంతమయ్యాయి. అప్పటికే, బాగా ప్రసిద్ధులైన స్వరకర్తలు కళ్యాణ్‌జీ-ఆనంద్జీలతో ఆనంద్ బక్షి పనిచేసిన మొదటి సినిమా కూడా ఇదే. అయితే, నాన్నకి మొదటి ఆల్ ఇండియా హిట్ ఇంకా నాలుగు సంవత్సరాల దూరంలో ఉంది, నాన్నకి ఇంటి పేరుగా మారిన ఆల్ ఇండియా బ్లాక్‌బస్టర్ ఆరు సంవత్సరాల దూరంలో ఉంది.
మూడు సంవత్సరాల తరువాత, 1965 లో, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, హిరేన్ ఖేరా, ఆనంద్ బక్షి మరోసారి ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ సినిమా కోసం కలిసి పనిచేశారు, అది భారతదేశమంతటా మొదటి హిట్ అయింది. ఈ సినిమా పాటలన్నీ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి! ఆనంద్ బక్షి ఇప్పుడు బొంబాయి చిత్ర పరిశ్రమలోని ప్రసిద్ధ గీత రచయితలలో ఒకరయ్యారు.
‘మెహందీ లగీ మేరే హాత్ నే – మేరే కెరీర్ కే దర్వాజే ఖోల్ దియే (ఈ సినిమా నా కెరీర్ కి తలుపులు తెరిచింది). అప్పటి వరకు నేను చాలా కోపంగా ఉండేవాడిని. నా ప్రతిభను నా కుటుంబం, నా అత్తమామలతో సహా ఎవరూ నమ్మకపోవడం నాకు ఆగ్రహం తెప్పించింది. గతాన్ని పరిశీలిస్తే, అది నాకు నిజంగా సహాయపడింది; నేను చాలా కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించింది. 70వ దశకం వరకు నేను సరైనవాడిని అని నిరూపించుకోవడానికి – కోపధారిగానే ఉన్నాను. దాని కారణంగా నా కుటుంబం బాధపడి ఉండాలి. కానీ నేను ఆ కోపం శక్తిని ఎక్కువగా నా పనిలోకి మళ్ళించాను. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ న్యాయమైన కోపాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించడం ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన భావోద్వేగం. 1970ల ప్రారంభంలో, నా సొంత ఇల్లు ఏర్పర్చుకోడం, నా కుటుంబానికి ఆర్థికంగా లోటు లేకుండా చేసిన తర్వాత మాత్రమే నేను కొంచెం విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాను. కానీ రాయాలనే నా ఆకలి లేదా మక్కువ అలాగే ఉంది, ఎప్పుడూ తగ్గలేదు. నేటికీ, ప్రతి పాట నాకొక పరీక్షే, ప్రతి పరీక్షకు ముందు నేను ఈసారి విఫలమవుతానేమోనని ఇప్పటికీ అనుకుంటున్నాను..’
ఈ సినిమా పాటలు రాసినందుకు ఆనంద్ బక్షికి రూ. 250 పారితోషికం ఇచ్చారు. సినిమా, ఆయన పాటలు హిట్ అయినప్పుడు, అతను విటి స్టేషన్‌లోని ప్రసిద్ధ షేర్-ఎ-పంజాబ్ రెస్టారెంట్‌కి వెళ్లి, తనకిష్టమైన తందూరి చికెన్ తిన్నారు. విటి స్టేషన్‌లో బెస్ట్ బస్సు దిగినప్పుడు, తన కుర్తా జేబు కత్తిరించి, పర్స్ దొంగిలించారని నాన్న గ్రహించారు. జేబుదొంగను పట్టుకోవడానికి కొన్ని కిలోమీటర్లు బస్సును వెంబడించారు కానీ విఫలమయ్యారు. ఆర్థికంగా స్థిరపడినప్పుడు మనం పుట్టడం ఎంత అదృష్టమో తెలియజేయడానికి ఈ సంఘటనను మాకు వివరించారు నాన్న.
1980లో, ‘పైసా యే పైసా, పైసా హై కైసా, నహీ కోయి ఐసా, జైసా యే పైసా, కే హో ముసీబత్, నా హో ముసీబత్’ అని రాశారు (కర్జ్ చిత్రం కోసం). మా నలుగురు తోబుట్టువులలో నా అక్క సుమన్ మాత్రమే నాన్న ‘చెడు’ రోజులను చూసింది, అందుకే ఆమె ఎల్లప్పుడూ తనకిష్టమైన బిడ్డగానే ఉంటుందని నాన్న అనేవారు.
ఇక్కడ కాస్త, పక్కదారి పడదాం. నాన్న జీవితం గురించి లోతైన అవగాహన పొందడానికి, నేను ఒక సంఘటనను చెప్పాలనుకుంటున్నాను. నామ్మ జీవితంలోని ఆఖరి వారాలలో, తీవ్రమైన ఆస్తమా కారణంగా శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నప్పుడు, నేను “మీరు మాలో ప్రతి ఒక్కరితో భిన్నంగా ఉన్నారు. మీరు నాకు, రాణికి ఇచ్చినంత స్వేచ్ఛ, అక్కకీ, అన్నకీ ఇవ్వలేదెందుకు?” అని అడిగాను. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత, తగినంతగా స్పందించడానికి తన ఊపిరితిత్తులలోకి శ్వాస నింపుకోవడానికి ప్రయత్నిస్తూ, “ఒక సిపాయిగా, ప్రతి డ్రిల్‌తో నేను తదుపరిసారి మెరుగ్గా కవాతు చేయడం నేర్చుకున్నాను. నా సైనిక రోజుల్లో నేను రాసిన ప్రతి కవితతో, మెరుగ్గా రాయడం నేర్చుకున్నాను. ప్రతి పాటతో, నేను తదుపరిసారి మంచిగా రాయడం నేర్చుకున్నాను. అదేవిధంగా, ప్రతి బిడ్డతో, నేను మంచి తండ్రిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నేను అలా పుట్టలేదు, ప్రతి బిడ్డ నాకు కొన్ని విషయాలు నేర్పింది, తదుపరి బిడ్డను పెంచేటప్పుడు నేను వాటిని ఉపయోగించాను. నేను వివక్ష చూపాలని అనుకోలేదు. నా పాటలు సంవత్సరాలుగా నన్ను మంచి మనిషిగా మార్చినట్లే, నా ప్రతి బిడ్డ నన్ను మంచి తండ్రిగా మార్చారని నేను ఆశిస్తున్నాను.” అన్నారు.
9. ‘ఘమ్-ఎ-హస్తి సే బేగానా హోతా, ఖుదాయా కాష్ మైఁ, దీవానా హోతా’ – వల్లా క్యా బాత్ హై (1962); సంగీతం రోషన్
ఇక్కడ ఆనంద్ బక్షి పాత్ర బాధను హృదయపూర్వకంగా వివరిస్తున్నారు. ఆయన ఒకప్పటి తన సొంత బాధను వ్యక్తం చేసి, అదంతా ఒక కలలా మారిపోవాలనే తన కోరికను వెల్లడించారని నేను నమ్ముతున్నాను, ‘జో దేఖా హై, సునా హై, జిందగీ మేఁ, వో బన్ కే దర్ద్ రహ్ జాతా నా జీ మేఁ, ఫకత్ ఏక్ ఖ్వాబ్, ఏక్ అఫ్సానా హోతా.’
10. ‘మేరీ తస్వీర్ లేకర్ క్యా కరోగే తుమ్, మేరీ తస్వీర్ లేకజ్, దిల్-ఎ-దిల్ జీర్ లేకర్, లూటీ జాగీర్ లేకర్, జాలీ తక్‍దీర్ లేకర్..’ – కాలా సముందర్ (1962); సంగీతం ఎన్. దత్తా
ఇది ఆనంద్ బక్షి తొలి ఖవ్వాలి. ఇది పెద్ద హిట్ అయింది. స్వరకర్త ఎన్. దత్తా ఆనంద్ బక్షిని తన ఇంటికి రమ్మని కోరారు. దత్తా తాను ఒక సినిమా కోసం కంపోజ్ చేస్తున్న ఖవ్వాలి కోసం ‘టెస్ట్ లిరిక్స్’ ఎవరి చేతైనా రాయించాలని అనుకున్నారు. ఎందుకంటే అసలు గీతాన్ని సాహిర్ సాబ్ రాయబోతున్నారు. ఆనంద్ బక్షి ‘మేరీ తస్వీర్ లేకర్ క్యా కరోగే తుమ్’ అనే ముఖ్‍డా రాశారు. దత్తా డమ్మీ పాట మీద ట్యూన్ కంపోజ్ చేశారు. సాహిర్ సాబ్ వచ్చారు, సాహిత్యం విన్న తర్వాత, బక్షిని మరింత రాయమని ప్రోత్సహించారు. మిగిలిన కవితా పాదాలని విన్నాకా, ఆ పాటని ఆనంద్ బక్షి చేతే రాయించమని సిఫార్సు చేశారు. దయాళువైన సాహిర్ సాబ్ చేసిన మరో దయగల చర్య ఇది, కొత్త రచయిత పట్ల అభద్రతా భావం లేకుండా, తనను గీత రచయితగా ఎంచుకున్న చిత్రంలో రాయడానికి తాను అనుమతించడం.
చివరికి, ఆనంద్ బక్షి ఈ చిత్రానికి ఐదు పాటలు రాశారు. ఇది 1962లో జరిగింది. సాహిర్ గారిని అభినందిస్తూ, నేనొక విషయం చెప్పాలి. చిత్రనిర్మాత యష్ చోప్రాకు సాహిర్ మంచి స్నేహితుడు. యష్‍జీతో తరచుగా, ‘మీరు ఎప్పుడూ నాతోనే ఎందుకు పని చేస్తారు? ఆనంద్ బక్షిని ఎందుకు తీసుకోకూడదు? అతను చాలా బాగా రాస్తాడు’ అని చెప్పేవారట సాహిర్. 1989లో, సాహిర్ మరణించిన తర్వాతే, యష్ చోప్రా, ఆనంద్ బక్షికి ‘చాందిని’ సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఈ ఖవ్వాలి పాటని, బక్షి అద్భుతంగా రాశారు. ఇది ప్రశ్నోత్తరాల శైలిలో వ్రాయబడిన పాట. పురుష పాత్ర – తన ఫోటో ఎందుకు అవసరమో తెలుసుకోవాలని స్త్రీ పాత్రని సరదాగా డిమాండ్ చేస్తుంది. ఆమె దానికి సమాధానంగా అంతే స్థాయిలో జవాబిస్తుంది, ఆ జవాబు అతని తెలివితేటలకు అనుగుణంగా ఉంటుంది. ప్రతి పాదంలో వారి ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. ఈ పాట పూర్తిగా ఆనందం కలిగిస్తుంది. ఏదైనా పాట లాగే, పాటను బాగా అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఆ సినిమా చూడాలి.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.