Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-10

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 5: 1951-1956 – రెండవ భాగం

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే

నంద్ ప్రకాష్ బక్షి, కమలా మోహన్‍ల వివాహం లక్నోలో అక్టోబర్ 2, 1954న జరిగింది. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం, ఇదే తేదీన, బక్షి, ఆయన కుటుంబం ‘పాకిస్తాన్’ నుండి తప్పించుకుని శరణార్థులుగా భారత్ వచ్చారు.

వారి వివాహం జరిగిన తొలినాళ్లలో, బక్షి భార్య (మా అమ్మ) ఆరోగ్యం బాగా లేదు, కాబట్టి నాన్న సెలవు తీసుకొని ఢిల్లీకి వెళ్లి తన తండ్రిగారి ఇంట్లో ఆమెను చూసుకోవాల్సి వచ్చింది. నాన్నశాంతిసమయ   పోస్టింగ్‌లో ఉన్నారు కాబట్టి, సెలవు దొరికింది. మామూలుగా అయితే, ఆయన పగటిపూట, తన సైనిక బాధ్యతలను నిర్వర్తించేవారు, లేదా, ఇంట్లో ఉంటే, తన తండ్రికి, భార్యకు సేవలు చేసేవారు; ఇక రాత్రి సమయంలో తన గానంతోనూ, రచనలతో స్నేహితులను అలరించేవారు.

చాలా సంవత్సరాల తరువాత, 1967లో, గీత రచయిత ఆనంద్ బక్షికి ఇ.ఎమ్.ఇ.లో తన బ్యాచ్‌మేట్ అయిన మేజర్ గుర్మీత్ ఎస్. సెఖోన్ (6వ మహర్ రెజిమెంట్, బోర్డర్స్) నుండి ఇన్‌ల్యాండ్ లెటర్ వచ్చింది. రేడియోలో బక్షి ఇంటర్వ్యూ విన్నాక, స్టార్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌లో బక్షి ఫోటో చూసినప్పుడు తాను ఆ లేఖ రాయాలని నిర్ణయించుకున్నానని మేజర్ గుర్మీత్ చెప్పారు.

ఆయన ఇలా వ్రాశారు, ‘ఆనంద్, క్యాంప్‍లో నాతో పాటు నివసించిన తోటి సిపాయిగా నేను నిన్ను గుర్తుంచుకుంటాను. మనమిద్దరం పాడటానికి ఇష్టపడేవాళ్ళం. మనం పాడిన పాటలను ఒకరికొకరం  వినిపించుకునేవాళ్ళం. నువ్వు పాడుతున్నప్పుడు తల ఎక్కువగా కదిలించేవాడివి.  ఎల్లప్పుడూ ఉత్సాహంగా నాతో, “గుర్మీత్ పాజీ, ఈ రాత్రి నేను రాసిన కొత్త రచన మీకు వినిపించబోతున్నాను” అనేవాడివి. నీకు రాయడం కూడా ఇష్టం. మనిద్దరం కలిసి నాటకంలో నటించాం, నా ముఖం ముదిరే వరకు నేను స్త్రీ పాత్రలు పోషించాలని నువ్వు నాతో అనేవాడివి. నువ్వు వెళ్ళిపోయాకా, నాకు గడ్డం పెరిగి, మగవాడిగా కనిపించే వరకు నేను నాటకం వేయలేదు తెలుసా? మన ఇ.ఎమ్.ఇ. రోజుల్లో నువ్వు నా నోట్‌బుక్‌లో పాటలు రాసేవాడివి. నా దగ్గర నీ చిరునామా లేదు, కాబట్టి నేను ఈ లేఖను ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్‌కు పంపాను. అది నీకు చేరుతుందని ఆశిస్తున్నాను.’

బిస్మిల్ సయీదీ గారి వద్ద బక్షి కవిత్వం ‘ట్యూషన్లు’ బాగా జరుగుతున్నాయి. కాబట్టి, ఆయన బొంబాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన రెండో ప్రయత్నాన్ని రూపొందించసాగారు. అయితే, తనకు ఇంకా ఆ అదృష్టం రాలేదని భావించారు. గతంలో ఒకసారి విఫలమయ్యారు, మరొక వైఫల్యాన్ని భరించలేరు. కాబట్టి రెండవసారి సైన్యం నుండి నిష్క్రమించడానికి ఆయనకి తన ప్రతిభపై నమ్మకం కంటే ఇంకా ఎక్కువ అదృష్టం అవసరం ఉంది. పైగా ఇప్పుడు పెళ్ళి కూడా అయింది, భార్య కొన్ని నెలల్లో బిడ్డను ప్రసవించనుంది. అదృష్టంపై, దేవుడిపై గట్టి విశ్వాసంతో పాటు తక్దీర్, తద్బీర్‌లపై కూడా తీవ్రమైన నమ్మకం ఉన్న బక్షి, మరోసారి రంగంలోకి దూకడానికి ముందు – పై నుండి – ఒక సంకేతం కోసం ఎదురు చూశారు.

ఆనంద్, కమలా బక్షి దంపతుల మొదటి సంతానం సుమన్ (పప్పీ) 1956 మే 14న పుట్టింది. ‘బేటియాన్, పియోహ్ దే లియే అచ్చా నసీబ్ లాండి హై’ (కూతుళ్లు తమ తండ్రులకు అదృష్టాన్ని తెస్తారు) అని తన నానమ్మ (బిజీ) ఒకసారి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు ఆనంద్ బక్షి. సుమన్ జననం శుభసూచకం, ఆయన దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో, ఆ అద్భుతం సంభవించనుంది!

చాలా ఏళ్ళ తరువాత, నాన్న మాతో ఇలా అన్నారు, ‘వ్యక్తికి  కల ఒక అవకాశం. మీరు దానిని అందుకోవడంలో అపాయం ఉండవచ్చు, మీరు ఆ అవకాశాన్ని అందుకోకపోవడం మరీ ప్రమాదకరం. అంతేకాకుండా, ఒక వంతెన రాకముందే మీరు దానిని దాటలేరని సైన్యం నాకు నేర్పింది. కానీ ఒక రోజు మీరు దాటవలసిన వాటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. పైగా దాటలేని వంతెన లేనే లేదు.’

కూతురి జననం – తను ప్రస్తుతం ఉన్న సైన్యానికి, తాను ఎప్పుడూ ఉండాలని కోరుకునే గీత రచయితకు మధ్య ఉన్న అగాధాన్ని దాటడానికి – ఆయనకు అవసరమైన వంతెనగా మారింది.

ధైర్యం అంటే, ఎటువంటి పరిష్కారమూ లేకపోయినా, కష్టతరమైన ప్రాంతంలోకి ఒక అడుగు ముందుకు వేయడం అని బక్షి ఎప్పుడూ నమ్మేవారు. అందుకని, ఏదో విధంగా సహాయం లభిస్తుందని నమ్మారు. అందుకే, బక్షి తన రాజీనామా లేఖలో ‘నా స్వంత అభ్యర్థన మేరకు డిశ్చార్జ్’ అని ప్రస్తావిస్తూ రెండవసారి తన పత్రాలను నమోదు చేశారు. ‘బంబై, వాపస్ ఆ రహాఁ హూఁ మై’ (బొంబాయి, నేను తిరిగి వస్తున్నాను)! పరిమితంగా ఉన్న, దాచుకున్న డబ్బుతో, తన కుటుంబం, భార్య, అత్తమామల అనుమతి లేకుండా, ఈసారి శాశ్వతంగా తన యూనిఫామ్‌ను వదిలేశారు.

మా నలుగురు తోబుట్టువులలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని నేను ఒకసారి నాన్నను అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు, ‘పప్పీ (సుమన్). నేను ఈ స్థితికి చేరుకునే ముందు, మీ నలుగురిలో తను మాత్రమే ఆర్థికంగా నా దారుణమైన రోజుల్ని, కోపాన్ని, నా నిరాశను అనుభవించింది. మీరు ముగ్గురూ నా మంచి రోజుల్లో పుట్టారు. నా తొలి బాధల భారాన్ని భరించింది పప్పి మాత్రమే.’

ఆయన జీవితంలోని తదుపరి అధ్యాయానికి, సినిమాల్లో ఆయన తొలినాళ్ళకు వెళ్లే ముందు, సైనిక జీవితం ఆయనకు ఏమి ఇచ్చిందో దాని గురించి ఆయన ఆలోచనలను పంచుకుంటాను.

‘సైన్యంలో ఉన్న కాలంలో నేను దేశవ్యాప్తంగా రైళ్లలో మాత్రమే ప్రయాణించినందున, సైన్యం, ఇంకా భారతీయ రైల్వేలు కూడా నాకు సమయం విలువను, నిబద్ధతను నేర్పించాయి – నిర్మాతలకు, దర్శకులకు సమయానికి పాటలు అందించేటప్పుడు అవే నేను ఆచరించిన ఆదర్శాలు. సీనియర్ల పట్ల గౌరవం, ఆర్డర్ పట్ల గౌరవం. నా నిర్మాతల అవసరాలను నేను చూసుకున్నాను, ఎందుకంటే వారు సీనియర్ అధికారి ఆదేశాల వలె ఉద్యోగం చేయడానికి నాకు జీతం ఇస్తున్నారు ♣. సైన్యం, రైల్వేలు నాకు సమయపాలన నేర్పాయి. నా కారణంగా ఒక్క పాట రికార్డింగ్ ఆలస్యం లేదా రద్దు చేయబడిందని నేను అనుకోను. మా సినిమాల బాక్సాఫీస్ విజయం కంటే, నా క్రమశిక్షణకు నా నిర్మాతలు, దర్శకులు నన్ను ఎక్కువగా గౌరవిస్తారు. సైన్యం నాకు లౌకికవాదాన్ని నేర్పింది. 1947లో “ద్వేషం, ఇంకా రాజకీయాల” కారణంగా నేను రాత్రికి రాత్రే శరణార్థిని అయినప్పటికీ, నేను వివిధ మతాల సైనికుల మధ్య సంతోషంగా జీవించాను. సైన్యంలో లాగా, మేము సినీరంగం వాళ్ళం నవ్వుతాం, ఏడుస్తాం, కలిసి పాడుతాం. మేము జాతీయ సమైక్యతకు అద్భుతమైన ఉదాహరణ. కాకపోతే, ఒకటే లోపం! ఇక్కడ విజయాన్ని అందరూ స్వీకరిస్తారు, కానీ సినిమా వైఫల్యానికి బాధ్యత వహించడానికి ఎవరూ ఇష్టపడరు. నేను సైన్యం నుంచి వచ్చేశాకా కూడా, వారి వినోద కార్యక్రమాల కోసం నటులు, స్టార్ గాయకులు, ఇంకా స్వరకర్తలను తీసుకురావడానికి నేను వారికి సహాయం చేసాను. ఎందుకంటే, ఎంతో ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన తర్వాత వారికి కొంత విశ్రాంతి అవసరం కాబట్టి. నా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ (ఇన్‌ఫెంట్రీ డివిజన్) సైన్యంలో రన్నరప్‌లు ఉండరని, విజేతలు మాత్రమే ఉంటారని చెప్పేవారు. విజేతగా ఉండు, ఖైదీగా ఉండు లేదా చనిపో అనేవారు! నేను విజేతగా, నంబర్ వన్‌గా ఉండటానికి ప్రయత్నించాను. నేను సైన్యంలో నేర్చుకున్న ఈ అభ్యాసాలన్నింటినీ నా రచనా వృత్తికి అన్వయించుకున్నాను. నాకు ప్రతి పాట రోజువారీ ఆర్మీ డ్రిల్ లాంటిది.’

సైన్యం నుండి రెండవసారి వైదొలగాలని నిర్ణయించుకున్న తరువాత, ఆనంద్ బక్షి తన గురువు బిస్మిల్ సయీదీని మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదం కోసం అడిగారు. జూలై 12, 1956న, సయీదీ గారు బక్షికి అత్యంత ప్రోత్సాహకరమైన లేఖ రాశారు:

అజీజీ వ ముహా-హబీబీ ఆనంద్ ప్రకాష్ సాహబ్ బక్షి!

ఖుద్రత్ నే ఆప్ కో షాయరానా సలాహియతెఁ అతా కీ హైఁ. జహాఁ తక్ ఆప్ కీ ఫిక్ర్ కా తాల్లూక్ హై, వో బంద్ కె బయాన్ పర్ మున్‍హసిర్ హై. ముతాలబా భీ నిహాయత్ హీ జరూరత్ చీజ్ హై. అల్ఫాజ్ కా ఇంత్‍ఖాబ్ ఔర్ ఉన్ కీ నశిస్త్ మే షేర్ కీ అసర్ అంగ్రేజీ కా రాజ్ ముమ్జర్ హై. ఖుదా ఆప్ కో ఉర్దూ షాయరీ కె కాబిల్-ఎ-ఫఖ్ షాయర్ హోనే కా మకామ్ అతా ఫర్మాయే.

దుఆగో

బిస్మిల్ సయీదీ, ఢిల్లీ

అనువాదం:

ప్రియమైన, ఆదరణీయ, గౌరవనీయులైన ఆనంద్ ప్రకాష్ సాహెబ్ బక్షి! దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి చక్కని కవితా సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రసాదించాడు. మీ విషయానికొస్తే, కవి ఊహ విషయానికొస్తే, అది ఒక కవితలో వ్యక్తీకరించబడిన భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనా విధానం చాలా ఉన్నతమైనది. కవిత్వం రాయడానికి జీవిత అనుభవాలు ముఖ్యమైనవి. కవిత్వాన్ని, కథలను నిరంతరం చదవడం, అధ్యయనం చేయడం కూడా అంతే అవసరం; అంతేకాకుండా, పదాల ఎంపిక, కవితలో వాటి అమరిక మీ రచనను సముచితంగా, ఆకట్టుకునేలా చేయడానికి కీలకం. ఆకట్టుకునేలా, భావ ప్రకాశకమైన కవిత రాయడం యొక్క రహస్యం పదాల ఎంపిక, ఇంకా వాటి అమరికలో దాగి ఉంది. ఉర్దూ షాయారీ ప్రపంచంలో మీకు గర్వించదగ్గ, గౌరవనీయమైన స్థానాన్ని దేవుడు మీకు కల్పించాలని కోరుకుంటున్నాను.

మీకు నా ఆశీస్సులు.

మీ శ్రేయోభిలాషి.

ఈ దశలో బక్షిని ఎక్కువగా ప్రోత్సహించిన విషయం ఏమిటంటే, సైన్యం నుండి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు, సయీదీగారిచ్చిన ప్రశంస: ‘అజీజీ-ఓ-ముహిబ్బి భక్షి, తుమ్ కో ఫారసీ నహీఁ ఆతీ, లేకిన్ తుమ్హారీ తబియాత్ మే ఫారసీ హై, తుమ్హారే మిజాజ్ మే ఫారసీ హై. ఔర్ ఏ తుమ్హారే బహుత్ కామ్ ఆయేగీ’ (ప్రియమైన బక్షి, మీకు ఫారసీ తెలియదు, కానీ ఫారసీ మీ ఆత్మలో ఉంది, ఫారసీ మీ స్వభావంలో ఉంది, ఇది మిమ్మల్ని మంచి స్థానంలో నిలుపుతుంది).

బక్షి సినిమా నిర్మాతల తలుపులు తట్టడానికి చాలా కాలం ముందు, ఒక ప్రఖ్యాత కవి ఆయనకి ఇచ్చిన అత్యుత్తమ ప్రశంస ఇది.

***

ఆయుధాలకు (తుది) వీడ్కోలు

1956 ఆగస్టు 27న, ఆనంద్ ప్రకాష్ బక్షి – బొంబాయిలో పాటల రచయితగా తన రెండవ దృఢ సంకల్ప ప్రయత్నం కోసం సైన్యం నుండి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. మొత్తంగా, ఆయన ఎనిమిది సంవత్సరాలు భారత సైన్యంలోనూ, అంతకు ముందు రెండు సంవత్సరాలు రాయల్ ఇండియన్ నేవీలో సేవలందించారు.

1956 సెప్టెంబర్ ప్రాంతంలో, కెప్టెన్ వర్మ సిఫార్సు లేఖతో రెండవసారి మాజీ సిపాయిగా బొంబాయికి వచ్చారు. ఆయన వద్ద అరవై కవితల మాన్యుస్క్రిప్ట్ ఉంది, అలాగే తన సహచరులు, సీనియర్లు, ఇంకా, ముఖ్యంగా, అతని గురువు బిస్మిల్ సయీదీ గారి నైతిక మద్దతు, ప్రోత్సాహం కూడా ఉన్నాయి. తనలో కొంత అనిశ్చితి ఉన్నా, దృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ రెండవ దఫా జీవితం తన దారికి ఏ వర్ణాలను తెస్తుందో అని ఎదురు చూస్తున్నారు.

బక్షి భార్య కమల, పెళ్ళయ్యాక దాదాపు నాలుగు సంవత్సరాలు ఢిల్లీలో తన అత్తమామల వద్ద నివసించారు. 1958లో, ఆమె తొలిచూలు బిడ్డతో కలిసి తన పుట్టింటికి చేరారు. సైన్యం నుండి రెండవసారి  వైదొలగాలనే తన నిర్ణయాన్ని తన కుటుంబం వ్యతిరేకించడంతో, ఆమె అక్కడే ఉండి ఉంటే, తాను లేకపోవడంతో, ఆమె కొంత ఇబ్బందిని ఎదుర్కొనేదని బక్షి భావించారు. తన మామ అమర్ సింగ్ మోహన్, తన కుటుంబంలాగే సైన్యం నుండి వైదొలగాలనే తన నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ, తన భార్యనీ, కూతురుని పుట్టింట్లో చక్కగా చూసుకుంటారని, వారికి సహాయసహకారాలు లభిస్తాయని బక్షి భావించారు.

సినిమాలలోని అభద్రతా జీవితం కోసం భార్యను, అప్పుడే పుట్టిన కూతురిని విడిచిపెట్టాలని తన అల్లుడు తీసుకున్న తొందరపాటు, నిర్లక్ష్య నిర్ణయం చూసి, 1958 నాటికే పదవీ విరమణ చేసి, పెన్షన్ మీద జీవిస్తున్న అమర్ సింగ్ భయపడ్డారు, అసహ్యించుకున్నారు! ఆయన కూడా మోహ్యల్ వంశానికి చెందినవారే, పైగా అప్పుడే బిడ్డ పుట్టిన, మోహ్యల్ ఫౌజీ, సినిమాలలో కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని వదిలి తన భార్యను పుట్టింటికి (తాత్కాలికంగా అయినా) ఎందుకు పంపుతాడో, తరువాత పదేళ్ళయినా ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అత్యవసర సమయాల్లో రెండుసార్లు బొంబాయిలోని బక్షికి కొంత డబ్బు పంపినప్పటికీ, వారి అన్ని రాతపూర్వక ఉత్తర ప్రత్యుత్తరాలలో అతన్ని తీవ్రంగా మందలించేవారు. ఒక దశలో ఆయన బక్షికి మరింత మద్దతుగా ఒక రూపాయి కూడా పంపడానికి నిరాకరించిన సమయం వచ్చింది.

తరువాతి రోజుల్లో నాన్న మాతో ఒప్పుకున్నారు – తన కల కోసం తన కుటుంబాన్ని కూడా పణంగా పెట్టానని! కానీ చివరికి గీత రచయితగా ఎదిగినప్పుడు ఆయన తన శక్తికి మించి మాకు ఇవ్వడానికి అదే కారణం. ప్లాన్ బి లేదు.

జమానే మే అజీ ఐసే కయీ నాదాన్ హోతే హైఁ, వహాఁ లే జాతే హైఁ కశ్తీ జహా తూఫాన్ హోతే హై

– జీవన్ మృత్యు

ప్రపంచంలో కొందరు ఎలాంటి అమాయకులుంటారంటే, వారు తూఫాను ఎక్కడ చెలరేగుతోందో అక్కడికే తమ నావౌ తీసుకువెళ్తారు.

ఫుట్‌నో‌ట్:

ఈ గీత రచయిత తన పని పట్ల సరిగ్గా ఇలాంటి వైఖరినే కలిగి ఉన్నారని చిత్రనిర్మాత సుభాష్ ఘాయ్ తరువాత ధృవీకరించారు.

సుభాష్ ఘాయ్ కూడా ఈ వాదనను ధృవీకరిస్తారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version