[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘నది పారిపోవడం లేదు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నది పారిపోవడం లేదు
గాలిని పవిత్రం చేస్తూ మోసుకెల్తోంది
రాయీ రప్పకు నునుపుదనాన్ని చేరుస్తూ సాగుతోంది
నది భయపడి పారిపోవడం లేదు
అలల్ని తోసుకెల్తూ నిమ్మళంగా
అల్లరి చేస్తూ గలగలా వెళ్తోంది
ఏ పరుగులపోటీలోనో లక్ష్యం చేరడానికి
లగెత్తడం లేదు
రెండు తీరాలనూ
సముదాయిస్తూ సరసాలాడుతూ
సంగీతమయంగా ధ్వనిస్తోంది
ఉష్ణాన్ని దోసిల్లల్లో దాచుకుని
చల్లదనాన్ని పంచుతూ జారుకుంటోంది
పంచడమే తెలిసిన నది
ప్రవహిస్తూనే వుంది పారిపోవడం లేదు
తనని కురచన చేస్తూ కుంచింప చేస్తూ
కుట్రలు చేస్తున్న మనుషుల పాపాల్ని
మూటగట్టి సముద్రంలో కలిపేందుకు నది ప్రవహిస్తున్నది
మిత్రమా!
నది పారిపోవడం లేదు

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత