[షేక్ కాశింబి గారు రచించిన ‘నాయకుడు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కంటి చూపుతోనే..
చంటోడి ఆకలిని కనిపెట్టి..
కడుపు నింపే మమతామయి
‘కన్నతల్లి’లా ఉండాలి!
ప్రతి మొక్కకున్న కొమ్మనీ, రెమ్మనీ
ప్రీతిగా పట్టి చూసి
పోషకాల నందించే బద్ధుడైన
‘తోటమాలి’లా ఉండాలి!
సమాజపు నాడి చూసి
సమస్యని నిర్దారించి..
చికిత్స చేసే.. నిపుణుడైన
‘వైద్యుడి’లా ఉండాలి!
ఇంటివాడే తప్పినా.. ధర్మం
కంటి నలుసులా తీసేసి
ఏ శిక్షకైనా వెనుకాడని.. స్థిరచిత్తుడైన
‘న్యాయమూర్తి’ అయ్యుండాలి!
ఏనాడో రాబోయే కొఱతల్ని
ఈనాడే అంచనా వేసి
సమృద్ధికి బాటలు పరిచే
‘దూరదర్శి’ అయ్యుండాలి!
సురక్షిత సమాజం కోసం
నిరంతరం చెడుతో తలపడుతూ
ప్రాణాల్ని సైతం అర్పించగల
‘వీర సైనికు’డై ఉండాలి!
గాలివాటు వాగ్దానాలు చేసి.. ఆనక
గాలికే వదిలేయక
అన్న మాటకి కట్టుబడి.. కాటికాపరి అయిన
‘హరిశ్చంద్రు’డై ఉండాలి!
అవకాశపు పాదరసంపై కాలూని
అవతలికో.. ఇవతలికో.. జారుకోక
సిద్ధాంతాలకు మానవతాస్పర్శని జోడించి
ఆచరించి చూపే ‘సంకల్పబద్ధు’డై ఉండాలి!