సమస్య సజీవమే
నేటి రాజకీయం-
సమస్యతో సహజీవనమే-
నాయకుల జీవితం.
పరిష్కారములున్నా
కుయుక్తులతో కాలయాపన-
నాయకులకు విలాసం-
ప్రజలకు విలాపం!!
సామాజికమైనా,
సంఘమూలమైనా,
కులాల కుతంత్రమైనా,
మతాల ఉన్మాదమైనా,
కాదేదీ సమస్యకు రూపం,
అది నాయకుడిలోని-
నటనా చాతుర్యానికి-
సమస్య సజీవరూపానికి,
మరో మార్గం!!
నిగ్గదీసి అడగలేని
ఓటరు నిర్లిప్తత-
నాకెందుకనే
పలాయనవాదం,
పెళపెళలాడే
పచ్చనోటు మాటున
స్వార్ధం ఆడే వింత ఆట
చివరకు మిగిలేది
ఉద్ధారక నాయకులు
ఆడిందే ఆట,
పాడిందేపాట!!
స్వీయప్రయోజనం
లేని సమస్యకు-
నాయకునిచే పరిష్కారం,
ఎండమావిలో నీటి
చెలమ అన్వేషణే,
తివిరి యిసుమున
తైలంబు సామెతే!!
రాజకీయ ఎదుగుదలకు
సమస్య ఒక ఆయుధమై,
ఉద్యమం పేరుతో,
సామాన్యులను
సమిధలగా మార్చి,
ప్రయోజనానంతరం
నడచిన బాటనే మరచిన
విశ్వాసఘూతకులకు
కొదవలేని రణరంగం
ఈ రాజకీయం!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.