పదిహేనేళ్ల పదో తరగతి చిరుప్రాయం
భవిష్యత్ బాటకు దారి తీసే తొలి పాదం
లేత మెదళ్లలో పడ్డ విజ్ఞానవిత్తనాలు
పై చదువుల వృక్షాలకు విరబూసే ఫలాలు
~
అరమరికలు లేని ఆ స్నేహాలు
స్వచ్ఛంగా ప్రవహించే సెలయేళ్ళు
ఎప్పుడు తలిచినా ఆ జ్ఞాపకాలు
ఒకేలా ఎగసిపడే సంతోష తరంగాలు
దాదాపు అర్ధ శతాబ్ది క్రితం, కొందరు విద్యార్ధులకి గడిచింది ఆ పదోతరగతి కాలం. కొన్నిచోట్ల స్పష్టంగా, కొన్నిచోట్ల మసక మసకగా గుర్తొచ్చే అనుభూతులు. ఆ సహాధ్యాయులు, ఆ గురువులు, ఆ పవిత్ర స్థలంలో, ఆ చదువులమ్మ చెట్టు నీడలో.. మళ్ళీ అందరూ కలిసే ఒక కల నిజమవుతుందని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. కనీసం ఊహించను కూడా లేరు. ఒకోసారి సినిమాల్లో, నవలల్లో కూడా కనబడని సస్పెన్స్ సంఘటనలు వాస్తవాలై రూపుకడతాయి. అది కదా జీవితం! అదే జీవితం మరి! కల్పనల కన్నా అద్భుతాలు మన కళ్లెదురుగానే జరుగుతాయి. సరిగ్గా అలాగే జరిగింది.
గత రెండు సంవత్సరాలుగా వివిధ సంస్థల్లో పని చేసి వరసగా రిటైర్ అవుతున్న ఉద్యోగులు, ఆంధ్ర ప్రదేశ్‌లో పచ్చని చేలతో, తోటలతో అలరారే పశ్చిమ గోదావరి జిల్లాలో, ‘ఉండి’ అనే అందమైన గ్రామంలోని, జిల్లా పరిషత్ హైస్కూల్లో పదోతరగతి కలిసి చదివిన విద్యార్థులు. ఇప్పుడు వారంతా ఆ హైస్కూల్ ప్రాంగణంలో తిరిగి కలిశారు. పండగ చేసుకున్నారు. పరవశించిపోయారు. ఆనాటి స్నేహాల్ని కలబోసుకున్నారు. ఆనాటి గురుతుల్ని చూసుకున్నారు. సరదా సన్నివేశాల్ని గుర్తుచేసుకున్నారు. గుర్తుపట్టలేని వారిని గిల్లి గుర్తుతె చ్చుకుని పెనవేసుకున్నారు.
అనుకోకుండా ఈ బాచ్‌లో టెన్త్ చదివిన, బుడుగులాంటి ముళ్ళపూడి వెంకటరమణ (విశ్రాంత AGM,INDIAN BANK), మహానటి లాంటి మారెళ్ల సావిత్రి (విశ్రాంత ఉపాధ్యాయిని, గురుకుల పాఠశాల) కలిశారు. బొత్తిగా ఖాళీగా ఉండి, ఏమీ తోచని వీళ్ళిద్దరూ తమతో ‘ఉండి’ హైస్కూల్లో పదోతరగతి చదివిన వాళ్ళందరినీ ఓ పెద్ద వలేసి పట్టేద్దామని నిర్ణయం తీసుకోవడంతో ఒక సరికొత్త థ్రిల్లింగ్ మరియూ సర్ప్రైజింగ్ నిజ జీవితకథకి తెరలేచింది. వాళ్ళు చేసిన వల ఒక వ్వాట్సాప్ గ్రూప్. దాని పేరు UNDI X BATCH 1974-75. అలా, ఎక్కడెక్కడో దాగిన, విడిపూలలా ఉన్న బ్యాచ్ మిత్రులందరినీ ఒక వాట్సాఅప్ దారంతో దండ కట్టి దానిని ఉండి హైస్కూల్లో నిలబెట్టాలన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
దాంతో, వాళ్ళకి జ్ఞాపకాల్లో మరుగున పడిన మాణిక్యాలన్నీ మిల మిల మెరుస్తూ దొరికేసాయి ఒక్కొక్కరూ తమకు తెలిసిన మిత్రుల నంబర్లు ఇవ్వడంతో గ్రూప్ లోకి దాదాపు అరవైమంది చేరారు. అంతా కెవ్వున కేక వేసుకుని ఈ సంక్రాంతికి కలిసి తీరాలన్నారు. ఒక రోజంతా గడపాలనుకున్నారు. ఈ కలయికకు గుర్తుగా ఆ స్కూల్లో చదువుకునే విద్యార్ధులకి ఉపయోగపడే, స్కూల్ చరిత్రలో నిలిచిపోయే మంచి పని ఒకటి చెయ్యాలని అభిప్రాయపడ్డారు. ఆనాటి స్కూల్ ప్యూపిల్ లీడర్ గొట్టెముక్కల శివరామకృష్ణరాజుని. ప్రస్తుత బ్యాచ్‌కి లీడర్‌గా మళ్ళీ ఎన్నేసుకున్నారు. శివగారు తక్షణమే స్కూల్‌కి వెళ్లి పరిస్థితి గమనించారు. పిల్లలకి త్రాగునీటికి ఒక ట్యాంక్ అవసరం ఉందని తెలిసింది. ముందుగా బ్యాచ్ లోని వారంతా చర్చించుకుని మిత్రులందరి సహకారంతో నాలుగు లక్షల రూపాయలతో, చక్కని మంచి నీళ్ల ట్యాంక్ కడదామని నిర్ణయించుకున్నారు. అప్పుడు శివగారు ఈ బృహత్కార్యానికి నడుం కట్టి, తనలాగే అంకిత భావం, నిబద్ధత ఉన్ననాటి సహాధ్యాయులతో (విశ్రాంత MEO, ఆనంద్, బుజ్జి, సుబ్బారాయుడు, విశ్వనాధరాజు, భాస్కర్‌రాజు, కృష్ణ మోహన్, కేశవ, K.వర్మ, శ్రీనివాసరాజు) ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులు వారంతా శ్రమించి చుట్టూ పంపులతో ఉన్న అందమైన నీళ్ల ట్యాంక్‌ను పిల్లల కోసం జయప్రదంగా నిర్మింపచేశారు.
13.01.2023 న, 1974-75 టెన్త్ బ్యాచ్ పూర్వవిద్యార్ధుల అపూర్వ కలయిక:
1918లో పుట్టిన ‘ఉండి’ హైస్కూల్, తన వందవ పుట్టినరోజు ఇటీవలే 2018లో జరుపుకుని ‘MEN MAY COME AND MEN MAY GO.. BUT I GO ON FOREVER’ అని చెప్పుకునే ఆ నాటి టెన్త్ పాఠం ‘రివర్ బ్రూక్’ లా, ఆ స్కూల్ అలాగే దర్పంగా నిలిచి ఉంది. తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థినీ ఆశీర్వదించి పంపిన ఆ సరస్వతీ నిలయం, గర్వంగా తలెత్తుకుని నిలబడి ఉంది. ఆనాటి బంగారు కాలానికి గుర్తుగా ప్రతి విద్యార్థి మదిలో చిరస్థాయిగా నిలబడిన అపురూప కట్టడం అది.
ఒక రోజు ముందుగా, జనవరి 12నే ‘ఉండి’ గ్రామం చేరుకున్న కొందరు మిత్రుల్ని తన ఇంటికి ఆహ్వానించారు శివ దంపతులు. శివ గారి ఇంటి ఆవరణలో వివేకానందుని విగ్రహం ఉండడం,ఆ రోజు స్వామి వివేకానందుని జన్మదినం కావడం వారికందరికీ సంతోషం కలిగించింది. ‘జాతీయ యువజన దినోత్సవం’గా పరిగణింపబడే వివేకానంద జయంతిని పురస్కరించుకుని మిత్రులంతా కలిసి వివేకానంద విగ్రహానికి పూలదండ వేసి, చికాగోలో జరిగిన సర్వమతసమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగాన్ని మొబైల్ నుంచి విని, ఆ మహితాత్మునికి నివాళులు అర్పించారు.
ఉత్సాహవంతులైన కొందరు విద్యార్థులు 13వ తేదీన ఉదయమే లేచి ‘ఉండి’ గ్రామంలోని వందల ఏళ్లనాటి రామాలయం, శివాలయం, వెంకటేశ్వరాలయం, సుబ్రమణ్యేశ్వరాలయం, చెన్నకేశవాలయం మొదలైన గుళ్లను సందర్శించుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప నాటకాలు చూసిన సుబ్బారాయుడు గుడి ప్రాంగణాన్నీ, బాపూజీ వచ్చారని చెప్పుకునే గాంధీ సెంటర్‌నీ దర్శించుకున్నారు. ఆనాడు తిరుగాడిన వీధులనూ, స్నానాలు చేసిన చెరువునూ, కాలవనూ, ఆ పాత లోగిళ్లనూ, వాకిళ్ళనూ చూసి ముచ్చట పడుతూ ఆ రోజుల అనుభవాల్ని కలబోసుకున్నారు. వారానికి రెండు చొప్పున మారిన పాత సినిమాలనల్లా చూసిన మిత్రులు ఆనాటి ‘ఉండి టూరింగ్ టాకీస్’ ని కూడా గుర్తుచేసుకున్నారు.
ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకల్లా 1974-75 టెన్త్ బ్యాచ్ పూర్వవిద్యార్థులంతా, ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచీ హాజరై, ఉత్కంఠభరితంగా సమావేశం అయ్యారు. కొందరు తమ జీవన సహచరులను కూడా తీసుకొచ్చారు. ఒక అత్యంత అద్భుతమైన, అపురూపమైన సన్నివేశం అప్పుడక్కడ రూపు కట్టింది. ఆ కలయికలో అందరూ మైమరచిపోయారు. మెరిసిపోయారు. ఆనందంగా మిత్రులంతా ‘అలాయ్ బలాయ్’ తీసుకుని, కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసారు.ఆ తరువాత సిద్ధంగా ఉన్న త్రాగునీటి వాటర్ ట్యాంక్‌ని, ఆనాటి సైన్స్ మాష్టారూ, డ్రిల్ల్ మాష్టారూ, NDS మాష్టారూ, NCC మాష్టారూ, సుశీల మాడం గారూ కలిసి అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించి, దానిని ప్రేమతో ప్రస్తుత స్కూల్ విద్యార్థులకు అంకితం చేసారు.
అలనాడు నిత్యం ఉదయాన్నే ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ఒక చోట నిలబడి చేసే అసెంబ్లీని, ఆ రోజున మధుర జ్ఞాపక మననం కోసం నిర్వహించారు. ఆనాటి హెడ్ మాష్టారు గారు కీ. శే. రాఘవరాజు గారి స్థానే వారి కూతురూ, అల్లుడూ అయిన అన్నపూర్ణ దంపతులు నిలిచారు. ఆనాటి స్కూల్ ప్యూపిల్స్ లీడర్ శివ, ఈనాడూ అందరికీ అట్టెన్షన్ చెప్పారు. అలాగే ఆనాడు రోజూ ప్రతిజ్ఞ చెప్పే, నేటి విశ్రాంత మేనేజర్, UNION బ్యాంకు ఆఫ్ ఇండియా, రమణ కుమార్ ఆ రోజూ చెప్పారు. ఇంగ్లీష్ ఎవరికీ కష్టం కావొద్దని ఎంతో శ్రద్ద తీసుకుని ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన హెడ్ మాష్టారిని అంతా తలుచుకున్నారు. లెక్కల మాష్టారు శ్రీ వెంకటేశ్వర్లుగారు పంపిన సందేశాన్ని వైజాగ్ నుంచి హాజరైన P.కనకదుర్గ చదివారు. అలాగే సాహిత్యం పై అభిరుచి కలిగించిన కీ.శే.అల్లూరి సుబ్బరాజుగారుగారినీ, దేశ భౌగోళిక సరిహద్దులనుంచి రాజకీయాల వరకూ చెప్పి విద్యార్ధులకి ప్రపంచంపై ప్రాథమిక అవగాహన కలిగించిన సోషల్ టీచర్లు కన్నె మాష్టారినీ, హనుమంతరావుగారినీ, బొత్తిగా రాని హిందీ సబ్జెక్టుని ఎంతో ఓపికగా పిల్లలకి వివరించి హిందీభాషని నేర్చుకోమని ఛాలెంజ్ విసిరిన కీ.శే. అన్నపూర్ణ మాడం గారినీ గుర్తుచేసుకున్నారు. టీచర్ లంతా కలిసి పిల్లల భవిష్యత్తుకు హృదయపూర్వకంగా గట్టి పునాది వేసిన బంగారు రోజులవి. చివరగా అంతా వందేమాతరం చెప్పుకుని ముఖ్య కార్యక్రమానికి కదిలారు.
తరువాత అందరూ మీటింగ్ హాల్లో హాజరయ్యి ముందుగా ఆనాటి తీపి గురుతులుగా ఈనాటికీ నిలిచి ఉన్న మాష్టార్లందరినీ విద్యార్థులంతా కలిసి సత్కరించుకున్నారు. స్టూడెంట్స్‌తో, ఎంతో సరదాగా స్నేహంగా ఉంటూ ఆసక్తికరంగా పాఠాలు చెప్పి, ఎంతో మంది పైచదువుల్లో సైన్స్ ని ఎంచుకోవడానికి దోహదం చేసిన సైన్స్ మాష్టారు శ్రీ ప్రసాదరావు గారిని సన్మానించుకున్నారు. ఆయన బ్యాచ్ విద్యార్థులందరికీ, వారి మీద ప్రత్యేక అభిమానంతో, ప్రతి విద్యార్థికీ పేరుతో సహా వేయించి తన సొంత ఖర్చుతో ఆయన పేరున ఒక జ్ఞాపికను అందజేశారు. విద్యార్థులంతా ఆ ప్రత్యేక బహుమతిని తమను మురిపించిన మరో అదృష్టంగా భావించారు. గురువుల వాత్సల్యానికి అవధులుండవు కదా! అందుకే వాత్సల్యాన్ని జలధితో పోల్చారేమో!
ప్రతి విద్యార్థితోనూ సన్నిహితంగా ఉంటూ వారిని మలిచిన నిజమైన గురువులు వారు. మంచి జీతాలకు నిరంతరం స్కూల్స్ మారిపోయే మాష్టార్ల కాలం కాదది. స్టూడెంట్స్‌ని కన్నబిడ్డల్లా ప్రేమించిన అధ్యాపకులున్న మంచి రోజులవి. విద్యార్థులకు చక్కని నడవడి, సంస్కారం నేర్పించి, విలువైన జీవితాన్నిచ్చేవి ఆనాటి పాఠశాలలు.
తరువాత, వేదికపై వ్యాఖ్యాతలుగా రమణ, ఆనంద్, మరికొందరు మిత్రులు నిలబడి అక్కడికి హాజరైన పూర్వ విద్యార్థులందరినీ పేరు పేరునా పిలిచారు. వారంతా ఒక్కొక్కరూ తమ పరిచయం, ప్రస్తుత నివాసం చెబుతూ చదువుకునే రోజుల నాటి అనుభూతుల్నీ, టీచర్లనూ గుర్తుచేసుకున్నారు. తర్వాత ప్రతి ఒక్కరికీ విద్యార్థుల నాటి నేటి ఫొటోలతో తయారు చేసిన ఒక స్కూల్ జ్ఞాపికను అందజేసి, షాల్ కప్పి సన్మానించుకున్నారు. అలాగే వేదికపై నాటి నేటి ఫొటోలతో BACKDROP కూడా అందంగా అమరింది.
కొందరు తమ స్పందనలో “మనం అదృష్టవంతులం. చక్కని అంకితభావమున్న గురువుల వద్ద చదివాం. ఇరుగు పొరుగుల్ని ప్రేమించే మనుషులున్న ఆకుపచ్చని పల్లెటూళ్లలో పుట్టి పెరిగాం. ఎన్నో మంచి లక్షణాలను చిన్నప్పటినుంచే అలవరచుకున్నాం. స్కూల్‌కి నడిచి వెళ్లే క్రమశిక్షణలో పెరిగాం” అని మనసు లోని భావాలను పంచుకున్నారు.
హెడ్ మాష్టారు హృద్యంగా చెప్పిన రవీంద్రనాథ్ టాగోర్ గారి చిన్న కథ ‘హోమ్ కమింగ్’ అందరి మనసుల్లోనూ మెదిలింది. టెన్త్ క్లాస్ లోని, The purpose of the rules of the road is to make the roads safe for everybody అని చెప్పిన ఇంగ్లీష్ మొదటిపాఠం ‘RULES OF THE ROAD’ నిత్యం ట్రాఫిక్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. తెల్లని కాంతి సప్తవర్ణముల మిశ్రమం అని చెప్పిన సైన్స్ ల్యాబ్ లోని చక్రం జీవితం అంతా రంగుల భ్రమ అనే జీవన తాత్వికతను ఆ నాడే సూచించిందేమో!
“LIFE IS NOT A DREAM.BUT IT IS REAL AND PURPOSEFUL.DEATH IS NOT ITS GOAL.TIME PASSES QUICKLY AND DEATH IS FAST APPROACHING.SO IN THIS BATTLE FIELD OF THE WORLD WE MUST BE HEROES” అని సమ్మరీ రాసుకున్న “THE PSALM OF LIFE” పాఠం కొందరు మననం చేసుకున్నారు.
‘మనమంతా కలిసి ఆడుతూ, పాడుతూ చదువుకున్న ఈ పవిత్ర ప్రదేశంలో ఈ రోజు ఇలా అందరూ కలవడం మన జీవితాల్లో ఒక సువర్ణ ఘట్టం’ అని ఏకగ్రీవంగా అందరూ అంగీకరించారు. కలలాంటి ఈ కలయిక సందర్భంగా విద్యార్థులంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గురువులకు అభివందనాలు తెలియచేసారు. తాము చదివిన స్కూల్, జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తంగా చెక్కుచెదరకుండా ఉందనీ, తమ భావి జీవితాలకి పునాది ఇక్కడే పడిందనీ కొందరు తమ పరిచయ ప్రసంగాల్లో చెప్పుకున్నారు. నేడు చక్కని వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దింది గుడి లాంటి ఈ చదువులమ్మ బడే అని అంతా అన్నారు. ఈ సమ్మేళనం ద్వారా అందరూ రిఫ్రెష్ అయ్యి చైతన్యం నింపుకుని యూత్‌ఫుల్‌గా మారిపోదామని తీర్మానించుకున్నారు. టచ్ లో ఉందామని ఒట్లు కూడా వేసుకున్నారు.
అనంతరం అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనం చేశారు. ఆ బంగారు రోజుల్లో పిల్లలతో మమేకమై ప్రేమతో వారికి, అరువులు కూడా ఇస్తూ, పుల్ల గుచ్చిన ఐస్ కాండీ అమ్మే ఐస్ సుబ్బరాజును కూడా పిలిచి అతని ఋణం తీర్చుకోవాలనిపించి టీచర్ల సన్మానం తర్వాత ఐస్ సుబ్బరాజుకు కూడా సన్మానం చేసి బట్టలు పెట్టడం జరిగింది. ఆయన మరింత పెద్ద మనసుతో భోజనాలు అయిన తర్వాత అందరికీ ఉచితంగా ఐస్ కాండీలు తెచ్చి పంచాడు. ప్రేమను పంచి ఇవ్వడంలో ఇప్పటికీ తనదే పై చెయ్యి అని నిరూపించుకున్నాడు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో, APIIC విశ్రాంత GM గౌరీలక్ష్మి, R & B విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీమన్నారాయణ, CBIT విశ్రాంత ఆచార్యుడు, ఎం.వెంకట్రామరాజు, విశ్రాంత లెక్చరర్ మల్లేశ్వరరావు, BHEL విశ్రాంత ఇంజనీర్, శ్రీ వెంకటేశ్వర్లు, విశ్రాంత జియాలజిస్ట్, మహా సిమెంట్, PVRS రాజు, ఇంకా విశ్రాంత ఉద్యోగులు గేదెల రామారావు, వెంకటేశ్వరరావు, నెలబాలరావు, కృష్ణ, అర్జునరాజు, శ్రీను, ఆంజనేయరాజు, రాజేంద్రరాజు, సుబ్బరాజు, బలరామరాజు, సీతారామరాజు, సుబ్బతాతరాజు, K.కృష్ణంరాజు, రవికిషోర్, రామదాసు, గణేశ్వరరావు, నాగేశ్వరరావు, P.కృష్ణంరాజు, రామకృష్ణ, సత్యనారాయణ, పుల్లారావు, ఏసురత్నం ఇంకా శ్రీమతులు అన్నపూర్ణ, లీలాకుమారి, అరుణకుమారి, కృష్ణకుమారి, KVL మొదలైన స్నేహితులు యాభై మంది ఉన్నారు.
జ్ఞాపకాల పొరల్లో స్వచ్ఛమైన ముత్యాల్లా మెరుస్తున్న పదవతరగతి పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనాటి సహాధ్యాయులంతా ఆ రోజు ఆత్మీయాలింగనాల మధ్య నవ్వుల పువ్వులు జల్లుకుంటూ ఒక రోజంతా గడపడం అనేది ఆ విద్యార్థులకు కలిగిన ఆకస్మిక అదృష్టం. ఆ విధంగా మరొక మరపురాని అనుభూతిని వారి అనుభవాల పేటికలో భద్రంగా దాచుకుని రెట్టించిన ఉత్సాహంతో “ఫిర్ మిలేంగే” అనుకుంటూ కరచాలనం చేసుకున్నారు. ఏమైనా 47 ఏళ్ల తర్వాత, పదిహేనేళ్ల బాల్యంలో కలిసి స్కూల్ ఫైనల్ చదువుకున్న సహవిద్యార్థులను కలవడం అనేది వారందరి జీవితాల్లోనూ అందమైన మేలిమలుపు.
సూత్రాలు తెలుసుకుని లెక్క చెయ్యాలనే ఉత్సాహం, ఆనాడే కలిగించి తద్వారా జీవితపు లెక్కల్ని కూడా కొన్ని నియమాల ఆధారంగా సులువుగా ఎలా చెయ్యాలో నేర్పించిన వారి ప్రియతమ లెక్కల మాష్టారు, శ్రీ వెంకటేశ్వర్లుగారు ఆ రోజు రాలేకేపోవడం వల్ల, నలుగురు విద్యార్థులు వెళ్లి, ఆయనని హైద్రాబాద్‌లో వారి నివాసంలోనే సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకి కూడా ఆ నాటి ట్యూషన్ ముచ్చట్లను గుర్తుచేసి సంతోషంగా పంచుకున్నారు.
ఏటిలోని కెరటాలలా గడిచిన జీవితంలోని ఆనందపు క్షణాలు, మదిలో అలలు అలలుగా మౌనంగా మెదులుతూనే ఉంటాయందరికీ. వాటిని అప్పుడప్పుడూ అయినా తీరిక చేసుకుని, మననం చేసుకుంటేనే కదా జీవన మాధుర్యం మదిలో పొడగట్టేది! రాబోయే మరో మంచిరోజు కోసం ఎదురు చూసే ఉత్సాహం కలిగేది!
(వ్యాసకర్త అల్లూరి గౌరీలక్ష్మి పై ఉత్సవంలోని ఒక విద్యార్థిని.)
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
The Real Person!
The lively description by Gem Gowri is like that of an Act in Shakespeare Drama,or rather History of Good old UNDI High School. With Good wishes Ch.V..MASTARU.
మన ఆనందం కోసం, మనలో ఒకరైన, మన గౌరిలక్ష్మి, కలంతో పాటు మనసు పెట్టి, మన ఫంక్షన్ గురించి చక్కగా రాసింది. ఆమెకు అభినందన మందారమాల! 💐🌹💐🌹💐🌹💐🌹💐 ముళ్ళపూడి వెంకటరమణ
Very good write up AGL Bujji..Bhimavaram
Very nice Write Up Gowri Lakshmi Garu 👍 Arjuna Raju
నాటి చెలిమి,నేటి కలిమి అనే దానికి ఉదాహరణ గా చాలా చక్కగా వ్రాసినందుకు అభినందనలు Agl🤝💐👍 Kanaka Durga
Nicely written the entire episode. Thank you Gowri Laxmi garu for your effort. We are proud of you. 🙏🙏 Prof..రామరాజు..CBIT
మంచి స్పూర్తి నిచ్చే విషయాలు ఆనందం పొందారు Anjaneya Raju
అద్భుతమైన ఆనందం. మంచి కార్యక్రమాలు నిర్వహించారు.
మామూలుగా ఇలాంటి సమావేశాలను గురించి వ్రాసేటప్పుడు… వార్తా వ్యాఖ్యలా వ్రాస్తారు.. కానీ గౌరీ లక్ష్మి గారు”కవితాత్మకంగా తమ బడి జ్ఞాపకాలను మననం చేసుకుని.. గురువులని కలిసి వారిని సత్కరించుకోవడం.. తరగతి సహాధ్యాయులందరూ కలిసి లక్షల రూపాయలు వెచ్చించి..బడి పిల్లలకి మంచినీటి వసతిని కల్పించిన విషయాన్ని వివరించడం బావుంది.. షష్ఠి పూర్తి చేసుకున్న వారందరూ చిన్నపిల్లలయిపోయి.. హాయిగా గడపడం. ఊళ్ళో వివిధ ప్రదేశాలలో తమ జ్ఞాపకాలని నెమరేసుకోవడం..మొత్తం కార్యక్రమాన్ని, పాల్గొన్న వారందరినీ పేరు పేరు నాకు ప్రస్తావించడం హైలైట్..ఈ కార్యక్రమాన్ని అక్షరీకరించి, ఛాయాచిత్రాలని జోడించి తమ టీమ్ కి అందించారు..ఇలా పత్రికా ముఖంగా అందించడం వల్ల.. మరి కొందరు స్ఫూర్తి ని పొంది.. తమ పాఠశాలలలో కలిసి పండగ చేసుకుని.. బడికి, పిల్లలకు కానుకలందించడానికి దోహదపడుతుంది.. ఉండి పూర్వ విద్యార్థులకు,ఈ రచనను అందించిన రచయిత్రికి, ముద్రించిన సంచిక వారికి అభినందనలు, 🌹🌹🌹💐💐💐👏
ఆత్మీయ సమ్మేళనం గురించి బాగా రాశారు… అక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్టు చూపించారు.. మమ్మల్ని కూడా అక్కడకు తీసుకు వెళ్లిపోయారు… Attend కాని వాళ్ళు మీ కధ చదివితే attend ఐయినట్టే feel ఐయిపోతారు… ఇది గారంటీ… 👌👌👍 Venu Madhav
Wonderful reunion 💝 MV Ramana
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ధీరవనిత కస్తూర్బా గాంధీ
బివిడి ప్రసాదరావు హైకూలు 3
పదసంచిక-89
గొంతు గుర్తుపట్టేదాకా…
దివ్యాంగ్ నికేతన్
మర్యాదా దర్శకుడు కాశీనాథుడు
దేశభక్తి గుబాళింపజేసే కథలు
ఇంకో వర్షాకాలంలో
పూచే పూల లోన-17
ప్రశ్నార్థకం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®