Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్న

[డా. రాయపెద్ది వివేకానంద్ రచించిన ‘నాన్న’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

గాలిలో తేలి వస్తున్న మా అమ్మాయి మాటలకి ఉలిక్కి పడ్డాను.

తను చాలా స్పష్టంగా చెప్పింది .

ఆ మాటలు విన్న నాకు ఒళ్ళు గగుర్పొడిచింది.

***

ఇల్లంతా పెళ్ళి సందడి. మా అమ్మాయిది పెళ్ళి.

ఉదయాన్నే హల్దీ కార్యక్రమం జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం అయితే ఈ కార్యక్రమాన్ని పెళ్ళి కూతురిని చేయటం అంటారు. ఉత్తర హిందుస్తానీ సంప్రదాయం ప్రకారం హల్దీ (పసుపు) అంటారు.

పట్టు చీరలు కట్టుకొని ముత్తైదువలు రోట్లో పసుపు కొమ్ములు దంచారు. రోకటి పాటలు పాడారు. సరసాలు ఆడారు.

ఇల్లంతా సంబరాలు.

మధ్యాహ్నం విందు భోజనం, ఇల్లంతా కోలాహలంగా ఉంది. మధ్యాహ్నం భోజనానంతరం కునుకు తీసేవాళ్ళు కునుకు తీస్తున్నారు, టీవీ చూసేవాళ్ళు టీవి చూస్తున్నారు, సెల్ ఫోన్స్ చూసుకునేవారు, కబుర్లు చెప్పుకునే వారు ఇలా ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు.

సాయంత్రం మెహందీ కార్యక్రమం ప్రారంభం అయింది.

మామిడి తోరణాల పచ్చి వాసనలు, అప్పుడే చేతులకి పెట్టిన పచ్చి గోరింటాకు తాలుకు వాసన, మల్లె పువ్వులు, అగరువత్తుల ధూపం, రాయిపై నూరిన చందనం వాసన, అత్తర్లు, పన్నీటి బుడ్డిలోంచి చిమ్మబడ్డ రోజ్ వాటర్ తాలూకు పరిమళం, ఇంటికి కొత్తగా వేసిన రంగుల తాలూకు మంద్రమైన వాసనలు, ఆవు పేడ వేసి అలికి ముగ్గులు పెట్టిన ముంగిట్లోంచి గాలిలోకి తేలి వస్తున్న వాసనలు ఇవన్నీ పెళ్ళి ఇంటికి కొత్త సొగసులు అద్దుతున్నాయి.

పట్టు చీరల పెర పెరలు, కన్నె పిల్లల పైట రెప రెపలు ఇవన్నీ ఆ వాతావరణానికి కొత్త అందాలని అందిస్తున్నాయి.

మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాలి కళ్యాణ మండపానికి.

బేగం బజార్ నుంచి జైన్ల కుర్రాళ్ళు వచ్చి కళాత్మకంగా అందరి చేతులపై చక్కగా గోరింటాకు డిజైన్లు అల్లుతున్నారు.

చుట్టూ ఇంత మంది ఆడవాళ్ళు గోల చేస్తున్న చెక్కు చెదరని ఏకాగ్రతతో మిషన్ల లాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు ఆ కుర్రాళ్ళిద్దరూ.

ఆ కుర్రాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళ చేతిలో ఎంత కళ దాగుందో కద అనిపించింది. కంప్యూటర్ డిజైన్లలాగా చక చకా డిజైన్లు వేసేస్తున్నారు చేతులపై.

కొందరికి మణికట్టు వరకు, కొందరికి ముంజేతుల వరకు, కొందరికి చేతికి వెనుక ముందు కూడా వేస్తున్నారు, కొందరికి కేవలం వేళ్ళ వరకే వెస్తున్నారు. ఎవరు ఎలా కోరితే అలా వేస్తున్నారు.

ఇక గోరింటాకు వేసుకున్న స్త్రీలందరూ పక్కకి వచ్చి కూర్చుని అవి ఆరటానికా అన్నట్టు చేతులు ముందుకు చాచి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

వాళ్ళ కబుర్లలో మెల్లిగా వరుడి ప్రసక్తి వచ్చింది.

పెళ్ళికూతురు మెహందీ పెట్టించుకుంటూ ఉంది. ఆమెకి ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేకంగా ఏర్చి కూర్చి పెట్టుకున్న డిజైన్ చాలా శ్రద్ధగా వేస్తున్నరు ఆ జైన్ల కుర్రాళ్ళు.

పెళ్ళికూతురి చేతి డిజైన్ కనీసం గంట సేపు పడుతుంది అని ముందరే చెప్పి మిగతా ఆడవాళ్ళందరికీ వేసాక తనకి డిజైన్ వేయటం మొదలెట్టారు.

టీవీలో క్రికెట్ చూస్తూ మగాళ్ళు కూడా కొందరు అక్కడే కూర్చున్నారు, వారితో పాటు నేను కూడా కూర్చున్నాను.

ఎవరో అడిగారు పెళ్ళి కూతుర్ని “అమ్మాయి నీవు ఎందరో వరుళ్ళని రిజెక్ట్ చేశావు, మంచి మంచి సంబధాలు వస్తే వద్దన్నావు, ఈ కుర్రాడు అందంగా ఉన్నాడు కాదనం, మంచి ఎమ్మెన్సీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, అదీ కాదనం.

ఇన్ని సంబంధాలని కాదని, ఆ తరువాత ఇతన్ని కూడా ఎన్నో ప్రశ్నలు అడిగిన తర్వాత వరుడిగా ఎన్నుకున్నావు కద, ఇతనిలో నీకు ప్రత్యేకంగా నచ్చిన అంశం ఏమిటి? ‘అందులోనూ ఈ కుర్రాడి కుటుంబం తెలుగు వాళ్ళు కాదు. రాజస్థానీ వాళ్ళు అంటున్నావు. అఫ్ కోర్స్ హైదరాబాద్‍లో పుట్టి పెరగటం వల్ల అతనికి తెలుగు తెలిసి ఉంటే తెలిసి ఉండవచ్చు గాక. కానీ మన తెలుగువాళ్ళు కాని ఈ సంబంధాని’కి ఎందుకు అవునన్నావు?”

హాలంతా ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది.

వాళ్ళ సందేహం సహేతుకమైనదే. దాదాపు ఆరేడు నెలల నుంచి వచ్చిన ఎన్నో సంబంధాలని మా అమ్మాయి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

పిల్లల అభిప్రాయాలకి విలువ ఇవ్వాలనే దృక్పథం ఉంది నాకూ మా ఆవిడకి కూడాను.

అందుకే ఎక్కువ ఏమీ తర్కించకుండా తన అభిప్రాయాలని గౌరవిస్తూ ఆయా సంబంధాలని తిరస్కరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ, ఆ సంబంధాలని సున్నితంగా పక్కన పెట్టాము. కొందరు మధ్యవర్తులు నొచ్చుకోవడం కూడా జైరిగింది. వాళ్ళ బాధ వాళ్ళకి ఏదో అవమానం జరిగిందని కాదు. అమ్మాయి ఇంత మంచి సంబంధాలని వదులుకుంటోందే అని.

చాలా సంబంధాలు పెళ్ళిచూపుల వరకూ కూడా రాలేదు, అమ్మాయి తను వారితో ఫోన్‌లో మాట్లాడుతాను అని అడిగి వారితో ఫోన్‌లో మాట్లాడేడి. తాను ఫోన్‌లో మాట్లాడే దశలోనే అనేక సంబంధాలని వద్దంది.

కొన్ని సంబంధాలని పెళ్ళిచూపుల దశలో వద్దంది.

కానీ మా ఇద్దరికీ ఒక్కటే భరోసా. తను ఏ నిర్ణయం తీసుకున్నా సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది అని.

తన ఆలోచనలు ఎప్పుడూ నేల విడిచి సాము చేయవు. ప్రతి విషయంలో తనకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. దీన్నే కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే ‘విజన్’ అని చెప్పవచ్చు.

అందువల్ల మేము భరోసాగానే ఉండినాము.

కానీ ఒక దశలో మాక్కూడా భయం పట్టుకుంది తను అన్న ఒక మాటతో. “నా అభిప్రాయాల ప్రకారం వరుడు దొరకని పక్షంలో ఒంటరిగానన్నా మిగిలిపోతాను కానీ రాజీ పడి ఎవర్నంటే వాళ్ళను చేసుకోను” అంది ఇటీవల ఒకసారి. అప్పుడు కలిగింది భయం మాకు.

ఆ దశలో దగ్గరి బంధువులు, పెద్ద వాళ్ళు మమ్మల్ని నిందించారు కూడా.

‘పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛని ఇచ్చి ఇంతకు తెచ్చుకుంటున్నారు ఈ కాలపు తలి తండ్రులు’ అని కూడా అనిపిచ్చుకున్నాము.

మేము చేయగలిగేదేమి లేదు కద. కేవలం కాలం చేతిలో సమస్యని పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాము.

ఆ దశలో ఈ సంబంధానికి అమ్మాయి ఓకే అంది.

ఫాన్ చేసే చప్పుడు మినహా ఇంకే శబ్దం వినపడటం లేదు. అప్పటికే నేను టీవి మ్యూట్‌లో పెట్టేశాను.

అందరూ ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

తను డిప్లొమేటిక్‌గా నవ్వి ఊరుకుంది.

వాళ్ళు వదిలితేగా, “చెప్పే వరకు ఊర్కోము” అని ప్రకటించారు.

తన రెండు చేతులకి గోరింటాకు పెట్టే పనిలో బిజీగా ఉన్న కుర్రాళ్ళకి తెలుగు తెలియకపోవటం వల్ల కావచ్చు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు.

ముంగుర్లు నుదుటి మీద అడ్డుపడుతూ ఉండగా తన పక్కనే ఉన్న మా అమ్మాయి స్నేహితురాలు సవరించింది.

ఎవరో వచ్చీ రాని హిందీలో అడిగారు ఆ మెహందీ కుర్రాళ్ళని “పెళ్ళీ కూతురు మాట్లాడవచ్చా” అని.

చేతులు కదల్చకుండా మాట్లాడవచ్చు అని ఆ కుర్రాళ్ళు అనుమతి ఇచ్చారు.

ఇక తప్పేట్టు లేదు తనకి.

చిన్నగా నవ్వి చెప్పటం మొదలెట్టింది.

గాలిలో తేలి వస్తున్న మా అమ్మాయి మాటలకి ఉలిక్కి పడ్డాను.

తను చాలా స్పష్టంగా చెప్పింది .

ఆ మాటలు విన్న నాకు ఒళ్ళు గగుర్పొడిచింది.

“నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే ఇష్టం. మా నాన్న లాగా అందరూ ఉండాలని కోరుకునే దాన్ని”

జనాలు ఆసక్తిగా వింటూ ఉన్నారని గమనించాక తను కాస్త సిగ్గు పడి మంద్రంగా చెప్పటం కొనసాగించింది

“మా నాన్నని ఎప్పుడు విసుక్కునే దాన్ని నిజానికి, మా ఫ్రెండ్సందరి నాన్నలలాగా నువ్వు ఎక్కడికి టూర్లని, పార్టీలని తిరగవు, ఎప్పుడూ మాతోనే ఉంటావు, సినిమాలకి వెళ్ళినా, షికార్లకి వెళ్ళినా అమ్మతోనో, మాతోనో వెళతావు అని, నిజానికి క్రమంగా తెలిసి వచ్చింది అలా ఉండటమే గొప్ప అని. మా నాన్న కంప్లీట్ ఫామిలీ మాన్. అలాగని ఆయనకి స్నేహితులు లేరని కాదు. ఆయనకి సమాజంలో అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తులతో పరిచయాలున్నాయి. అందర్నీ ఆయన గౌరవిస్తారు, వారందరూ ఆయన్ని గౌరవిస్తారు.. వాళ్ళందరికీ ఆయన సమయం కేటాయిస్తారు. కానీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా అమ్మకి చెప్పి గానీ ఇంట్లోంచి బయటకి కదలరు. బయటికి వెళ్ళిన మనిషి సిటీలోనే కావచ్చు ఎక్కడికైనా చేరుకోగానే అమ్మకి ఫోన్ చేసి క్షేమంగా చేరానని చెబుతారు. ఆఫీస్‌కి చేరుకోగానే విధిగా ఒక అయిదు నిమిషాలు అమ్మతో ఫోన్‌లో మాట్లాడతారు, ఆపై పనుల్లో తలమునకలు అవుతారు.

ఏదైనా వేరే ఊరికి చేరుకోగానే వెంటనే అమ్మకి ఫోన్ లోనో మెసేజ్ లోనో ఆ విషయం తెలియజేస్తారు.

మా నాన్నకి ఎటువంటి దురలవాట్లూ లేవు. కాఫీలు టీలు కూడా పరిమితికి మించి త్రాగరు. తిండి యావ లేదు. సిగరెట్లు, ఆల్కహాల్‌కి ఆమడ దూరంలో ఉంటారు. ఆయన పాన్ నమిలింది కూడా అరుదుగా చూశాను.

ఆయనలో సెన్సాఫ్ హ్యూమర్ పాళ్ళు ఎక్కువ. మాట్లాడుతూ మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తారు మధ్యలో. పదాల మీద భాష మీద పట్టు ఎక్కువ ఉంది మా నాన్నకి.

ఏ విషయమైనా ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం మాకు కల్పించారు. మేము నాన్నని ఒక స్నేహితుడిగా భావిస్తామే తప్ప అనవసరంగా భయభక్తులు ప్రదర్శించాలనే నియమం ఏర్పాటు చేయకపోవటం వల్ల మేము హాయిగా ఉంటాము. తను మాతో ఎక్కువ సమయం గడపలేకపోయినా ఇంట్లో మా అమ్మని మాకు గొప్ప స్నేహితురాలిగా ఏర్పాటు చేసారు.

కార్ డ్రయివింగ్, కావచ్చు, కంప్యూటర్ వాడటంలో కావచ్చు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కువ శ్రమ పడకుండా ఆట్టే నేర్చేసుకుంటారు.. ఇలా ఒకటి కాదు మా నాన్నలో నాకు ఎన్నో అంశాలు నచ్చినవి ఉన్నాయి. వీటి ఆధారంగా నేను కొన్ని బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేసుకున్నాను నాకు కాబోయే వరుడి గూర్చి.

వాటి ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను నాకు అమ్మా వాళ్ళు చూపిన వరుళ్ళందరినీ. నా ఎక్స్‌పెక్టేటేషన్స్‌కి అనుగుణంగా లేని ఎన్నో సంబంధాలు తిరగగొట్టాను నిర్మొహమాటంగా.

నాకు వరుడు అమెరికాలో ఉన్నాడా, ఆస్తిపరుడా, అందగాడా, పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడా అన్నవి కాదు ప్రాధాన్యత ఉన్న అంశాలు. మా నాన్నకున్నట్టు మంచి గుణాలు ఉంటే చాలు, అతనితో జీవితం హాయిగా ఉంటుంది అని నాకు అనిపించేది. ఈ క్వాలిటీలు ఉంటే చాలు, జీవితంలో ఎప్పటికైనా విజేతగా మారవచ్చు, డబ్బులు గిబ్బులు హోదా గీదా అన్నీ అవే వస్తాయి. ఈ క్వాలిటీలు ముఖ్యం అని అనుకున్నాను. ఈ కుర్రాడిలో ఈ గుణాలు అన్నీ ఉన్నాయి అనిపించింది.”

తను చెప్పటం ముగించే సరికి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి.

***

ఎప్పుడూ నన్ను విసుక్కుంటూ కోప్పడుతూ హాయిగా చలాకీగా చిన్నపిల్ల లాగా ఉన్న తనలో ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయని తెలిసి ఒళ్ళు గగుర్పొడిచింది.

అఫ్ కోర్స్ వరుడ్ని నేను కూడా కలిసి మాట్లాడుతూనే ఉన్నాను, నాకు కూడా అతను చాలా నచ్చాడు. అదెందుకో అన్నది నాకు ఇప్పుడు అర్థం అయింది.

***

నేను నా సహజ ప్రవర్తన తోనే అలా మెసలుకున్నాను ఇన్నాళ్ళు. నిజానికి తాను ఏనాడు ఆయా అంశాలని ప్రత్యేకంగా ప్రశంసించలేదు నా ఎదుట.

మనం చెప్పేది విని నేర్చుకోరు పిల్లలు, మనం చేసేది చూసి నేర్చుకుంటారు అని చెపుతారు పెద్దలు. థాంక్ గాడ్ నాకు ఇంత మంచి సంస్కారాలని అందించిన మా నాన్న గారిని ఒక క్షణం గుర్తు తెచ్చుకున్నాను.

నాన్నకి ప్రేమతో.

Exit mobile version