Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గాఢత నిండిన నానీల సంపుటి ‘నానీల తీరాన..’

[ఎన్. లహరి గారి ‘నానీల తీరాన..’ అనే నానీల సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి సత్యగౌరి మోగంటి.]

దవడానికి నాలుగే వాక్యాలు. కానీ ఆ నాలుగు వాక్యాల లోతు మహా సముద్రమంత భావంతో నిండి ఉంటుంది.

కవిత్వం రాయాలంటే ఊహాత్మక శక్తి మాత్రమే కాదు ఈ ప్రపంచాన్ని తన మనసుతో చూడగలగాలి. లహరి సున్నిత మనస్వి.

మనుషుల పట్ల అనుబంధాల కోసం తపన గలది. మాటల్లో ఆత్మీయత తొణికిసలాడుతుంది. తన ఆలోచనల నిండా సామాజిక చైతన్యం, స్ఫూర్తి కనబడతాయి.

రైతుల పట్ల ఆమె బాధ కలచివేస్తుంది. తన ఊరు పట్ల స్పృహ, పర్యావరణం, సమకాలీన సమస్యల పట్ల చైతన్యం ఒకింత వ్యంగ్యం ఈమె సొంతం.

అందుకే వాటన్నింటినీ తన ఊహాశక్తిలో ప్రాణం పోసి అక్షర రూపం ఇచ్చింది.

~

కొన్ని నానీలు..

‘వజ్రాలు నాకెందుకు
మంచి అక్షరాలు కావాలి
కావ్యాలు
సృష్టించడానికి’

‘ఒంటి నిండా
విలువైన ఆభరణాలు
హృదయంలోనే
దయ నిండుకుంది’

మన సమాజంలో కరువైన దయ పట్ల తన బాధ వ్యక్తీకరణ బావుంది. చిన్నకారు రైతుల, సన్నకారు రైతుల బాధలను ఈ అక్షరాలలో ఒంపింది.

‘కల్లంలో రైతు
కలలు ఆరబెట్టాడు
వర్షం
కల్లలు చేసింది’

మనం ఎలా ఉండాలో.. చెప్పకనే చెబుతోంది కవయిత్రి ఈ నానీలో..

‘చిరునవ్వు, కోపం
రెండూ నీలోనే
ఏ ఆయుధం తీస్తావో
నీ చేతుల్లోనే’

ప్రేమ గొప్పతనం చూడండి..

‘అన్నింటికీ
కొలమానాలు
కనిపెట్టాడు మనిషి
ఒక్క ప్రేమకు తప్ప’

ఈ నానీలలో సత్యం.. వైరాగ్యం.. కూడా వ్యక్తమవుతాయి.

‘వందెకరాలు
సంపాదించాడు
ఆఖరి పట్టా
ఆరడుగుల జాగాకే’

మట్టి పరిమళం గొప్పతనాన్ని ఎంత చక్కగా చెప్పిందో చూడండి

‘ఎన్నో వాసనలు
తెలుసు నాకు
వర్షంలోని మట్టి వాసనకు
ఏదీ సాటిరాదు’

నేటి బంధాల గురించి వాస్తనాన్ని కళ్ళుకు కట్టింది..

‘బంధాల దారం
తెగిపోయింది
కానీ మనసుకు తెలియడం లేదు’

‘ఉమ్మడి కుటుంబం
సమూహ గీతం
నేను భార్య పిల్లలు
స్వార్థపు అఖాతం’

‘ఆస్తి కోసం
అక్క చెల్లెళ్లకు మాటల్లేవు
ఇంతేనా
అనుబంధాలు’

~

ఈ నానీలు చదువుతున్నంత సేపూ గాఢత కనబడుతుంది.

ఎందుకంటే అంతర్వాహినిలా ప్రేమ, కరుణ, లలిత లావణ్యమైన భావన ప్రవహిస్తూంటుంది. అది మన మదిని తాకుతుంది.

ఈ నానీలలో తను స్పర్శించని అంశం లేదు. చక్కని వర్థమాన కవయిత్రి లహరి.

అభినందనలమ్మా.

మరిన్ని ఉన్నత శిఖరాలనధిరోహించాలని ఆశ్వీరదిస్తూ అభినందనలతో..

***

నానీల తీరాన (నానీల సంపుటి)
రచన: ఎస్. లహరి,
పేజీలు: 90,
వెల: ₹ 150/-,
ప్రతులకు:
ఎన్ లహరి,
ఫ్లాట్ నెం.301, శ్రీరామ్ హోమ్స్,
హెచ్.ఐ.జి. 96, ఫేజ్-IV కాలనీ,
వనస్థలిపురం, హైదరాబాద్- 500070

 

 

 

Exit mobile version