Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్నమ్మ కతలు

[డా. మజ్జి భారతి గారి ‘నాన్నమ్మ కతలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“వస్తానాంటీ, తలుపేసుకోండి” అన్న చిన్నకోడలు ఆఫీసుకు వెళ్ళబోతూ గుమ్మం దగ్గర కాస్సేపాగింది. పెళ్లై, ఎనిమిదేళ్లయినా ఆంటీ అంటుంది గాని, అత్తయ్యా అని పిలవదు. పెద్ద ఉద్యోగం చేస్తున్నానన్న గర్వమేమో మరి! కోడలు తనకేదో చెప్పాలనుకుంటుందన్న విషయం అర్థమైంది జయమ్మకి. రెండువారాల బట్టి గమనిస్తుంది కదా! కోడలేదైనా చెప్పాలనుకుంటే, ఆఫీసుకెళ్లేముందు చెప్పి వెళ్ళిపోతుంది. కొడుకింటికి, కొడుకిల్లేమిటిలే.. కోడలింటికే.. ఎందుకంటే కొడుకు, కోడలు ఉంటున్నది కొడుకు అత్తగారింట్లో.. వాళ్ల అత్త మామలతో కలిసి.

“ఈ మహాపట్నంలో వేలకి వేలు అద్దెలు పోసి వేరేగా ఉండడమెందుకు? దానికితోడు మాకిక్కడ యింకెవరున్నారు? కొడుకెలాగూ అమెరికాలోనే వుంటున్నాడు. ఊర్లో వున్న కూతురైనా మాతోనే వుంటే బాగుంటుంది. మా ఇంట్లోనే ఉంటారు లెండి” అని కొడుకు పెళ్లయ్యాక, టీచరుగా ఉద్యోగం చేసే వియ్యంకురాలంటే “వేరేగా ఉంటారులెండి” అనలేకపోయింది. అలా కొడుకు.. కోడలితో పాటే అత్తగారింట్లో.. ఇల్లరికపుటల్లుడై పోయాడు. యెనిమిదేళ్లలో ఇద్దరు పిల్లలు. మనవడికి ఏడేళ్లు, మనవరాలికి ఐదేళ్లు. వాళ్లు పుట్టినప్పుడు బారసాలలకి, పుట్టినరోజులకి తప్పించి వాళ్ళ ఇంటికొచ్చి నాలుగు రోజులున్నది యేనాడూ లేదు.

కొడుకిల్లైతే వచ్చి ఒక నాలుగు రోజులుండే వాళ్లమేమో? వియ్యంకులింటికి చుట్టరికానికేమొస్తాం? ఇదిగో యిప్పుడు వియ్యంకులు, వాళ్ల కోడలు పురిటికని ఆరు నెలలు అమెరికా వెళ్తే, పిల్లల్ని చూసుకోవడానికని కొడుకు తీసుకొచ్చాడు. పోనీ ఈ రకంగానైనా మనవడు, మనవరాలితో కొన్నాళ్ళు గడపొచ్చని వచ్చారు. వచ్చారే గాని, అంతా కొత్తగానే ఉంది. పిల్లలూ తమకంత బాగా అలవాటవ్వలేదింకా. అలవాటవ్వడానికి వాళ్ళెప్పుడైనా వచ్చి ఒక వారం రోజులైనా తమ దగ్గర ఉన్నారా? గ్రానీ, గ్రాండ్ పా.. తప్పించి, నోరారా తాతయ్యా, నాన్నమ్మా అని యెప్పుడన్నారు?

ఇప్పుడైనా వాళ్లకవి నేర్పించి, తన చేతులతో వండి, గోరుముద్దలు తినిపిద్దామన్న ఆశ. చెప్పకేమి! పెద్దకొడుకు పిల్లలతో ఆ ముచ్చట్లేవీ తీరలేదు. పెద్దకోడలు చుట్టాలమ్మాయే. కొడుక్కి ఢిల్లీలో ఉద్యోగం. సెలవలకి వస్తారు గాని, ఒక్క రోజుకన్నా యెక్కువ తమింట్లో ఉండరు. ఉన్నన్నాళ్ళూ, పుట్టింటిలోనే ఉంటుంది. పోనీ తామైనా, ఢిల్లీ వెళ్లి పిల్లలతో గడుపుదామంటే, కోడలు అంటీ ముట్టనట్టుగా, ఉంటుంది. కొడుకూ యేమనడు. ఏమీ అనలేడనే విషయం అర్థమయ్యాక, పిల్లలతో గడపాలనే కోరికను చంపుకొని, వాళ్ళెప్పుడొస్తే అదే మహాభాగ్యమనుకొని కాలక్షేపం చేస్తున్నారు.

పోనీ యిన్నాళ్లకు, ఈ రకంగానైనా రెండో కొడుకు రమ్మన్నాడు కదా! వీళ్ళతోనైనా నోరారా కబుర్లు చెప్పి, తనకొచ్చిన కథలు చెప్దామనుకుంటే, ఇక్కడంతా ఇంగ్లీషే. స్కూల్లో సంస్కృతం చెప్తారట గాని, తెలుగు చెప్పరట. ఏమి స్కూల్లో! ఏమిటో! ఇంట్లో ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారు. పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పేది వియ్యంకురాలు. లెక్చరరుగా రిటైరైన ఈయనే, అంత గబగబా మాట్లాడలేరు ఇంగ్లీషులో. అటువంటిది తానెక్కడ మాట్లాడగలదు? టెన్త్ అనిపించుకున్నా, పల్లెటూరి చదువులు. ఏదో, అర్థమవుతుంది గాని..

అసలిక్కడికొచ్చాక కాలక్షేపమై చావడం లేదు. వంటమనిషి వుంది. అందుకని వంటపని కూడా లేదు. తాము వున్నన్నాళ్ళు మాన్పించమంటే, మరలా అవసరమైనప్పుడు దొరకరు కాబట్టి మాన్పించనని చెప్పేసింది కోడలు. పోనీ రాత్రికైనా వంట చేస్తానంటే, బలవంతంగా ఒప్పుకుంది. వచ్చినప్పుడే చెప్పేసింది, పిల్లలొక పద్ధతిలో పెరుగుతున్నారు, వాళ్లకి లేనిపోని, కొత్త అలవాట్లు చెయ్యొద్దని. పిల్లలు అల్లరి చెయ్యకుండా బాగానే ఉంటున్నారు, కాని ఏదో లోపమనిపిస్తుంది.

అసలు పిల్లలన్నాక ఎలా ఉండాలి? నవ్వుతూ, తుళ్లుతూ గలగల పారే సెలయేర్లలా ఉండాలి. మరి వీళ్లో! కీ ఇచ్చిన మరబొమ్మల్లా అనిపిస్తున్నారు. అన్నీ టైము ప్రకారమే జరగాలి. ఆఖరికి తిండి కూడా.. పిల్లలున్న యిల్లులా లేదు. దాన్నే క్రమశిక్షణ అంటే, మరీ అటువంటి క్రమశిక్షణ అవసరమా అనిపిస్తుంది. హోం వర్క్ చేశాక, రోజూ గంటన్నర కార్టూన్ సినిమాలు. వాటి బదులు మన కథలు చెప్పుకుంటే ఎంత బాగుంటాయో! అదే మాట కోడలితో అంటే, ఏమనుకుందో సరే అంది. దానికే పొంగిపోయింది తాను.

ఆకాశంలో చంద్రుని చూపిస్తూ, పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తూ, కథలు చెబితే ఎంత బాగుంటుందో! తనకి చిన్నప్పటినుండి ఎంత కోరికో? తన పిల్లల చిన్నప్పుడు, ఆ పని తన అత్తగారు చేసేవారు. మనవళ్ళకి తానూ అలా చెయ్యాలన్న కోరిక తనకి. ఇప్పుడీ మహా పట్నంలో చంద్రుడెక్కడ కనిపిస్తాడు. హాలులోనే అటూ, యిటూ తిరుగుతూ వాళ్లకు తినిపిస్తుంది. అన్నీ చిన్నప్పటినుండే అలవాటవ్వాలన్నది కోడలి అభిప్రాయం.. ఆఖరికి తిండి కూడా వాళ్లంతట వాళ్లే తినాలని. పెద్దవాళ్లు పెడితే, రెండు ముద్దలెక్కువ తింటారని తన నమ్మకం. ఏదో తామున్న ఈ ఆరునెలలైనా, తన చేత్తో తినిపించాలని తన తాపత్రయం. కోడలికది నచ్చలేదనే విషయం, తనకర్థమవుతూనే ఉంది. ఇప్పుడేమి చెప్తుందో?

“పిల్లలకి స్టడీరూమ్ లోనే తినిపించండి. ఇంకెక్కడా వద్దు. ఎంగిలి పడుతుంది” అనేసి వెళ్ళిపోయింది. మనసుకి చివుక్కుమనిపించినా, వద్దనలేదు కదా అని సమాధాన పడింది. తాను గమనించలేదు గాని, “మనమల్లరి చేస్తే మమ్మీ కెమెరా ద్వారా చూస్తుంది” అని పిల్లలు మాట్లాడుకుంటుంటే అర్థమైంది, ఆ గదిలో సీసీ కెమెరాలు పెట్టించిందని. అంతకుముందు ఒకటి రెండుసార్లు, పిల్లలకు తినిపిస్తుంటే కోడలు అక్కడక్కడే తచ్చాడడం గమనించింది గాని, మరీ తనమీద యిలా నిఘా పెడుతుందనుకోలేదు. అంత అపనమ్మకమా తనమీద? మనసుకి చాలా కష్టమనిపించింది. రేపే ఇక్కడినుండి వెళ్ళిపోదామన్నంత దుఃఖమొచ్చింది. కన్నీరాగలేదు. ఈ విషయం ఆయనకి, కొడుక్కి తెలిస్తే బాగుండదని, దుఃఖాన్ని కడుపులోనే దాచుకుంది జయమ్మ.

ఇది జరిగి రెండు రోజులు, “ఇలా చెప్తున్నానని, యేమీ అనుకోకండి, పిల్లలకు అన్నం పెట్టే ముందు, కాస్త స్నానం చేసి బట్టలు మార్చుకుంటే బాగుంటుందని..” అనేసి వెళ్ళిపోయింది. తామిక్కడ వుండడం కోడలికస్సలు యిష్టం లేదా? కొడుకు బలవంతం మీద ఒప్పుకుందా? పెద్ద కోడలే నయమేమో! ముఖం మీదే చెప్పేసేది. చిన్నకోడలిలా డొంక తిరుగుడుగా కాకుండా! నిట్టూర్చింది జయమ్మ. ఇంకెన్నాళ్లులే! కళ్ళు మూసుకుంటే నాలుగు నెలలు యిట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత యెటూ తమని రమ్మనరు. కోడలి మనసు తెలియని ఆయన, పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఆయన సరదా ఎందుకు పాడు చెయ్యాలనుకుంటూ, మనసులోనే బాధను దాచుకుంది. రోజులు గడుస్తున్న కొద్ది పిల్లలు బాగా మాలిమి అయిపోయారు. వీళ్లను విడిచి వెళ్లాలంటే, యెలా అన్న దిగులు పట్టుకుంది జయమ్మకిప్పుడు.

రోజూ ఆరు గంటల్లోపే యింటికొచ్చే కోడలు, ఈ మధ్య లేటుగా వస్తుంది. తామింట్లో వుంటున్నామనా? కొడుకూ గ్రహించినట్టున్నాడు. అడిగితే “పనెక్కువైందిలే” అనేసింది. ఆఖరికి సెలవు రోజుల్లో కూడా ఇంట్లో ఉండడం లేదు. ఇంత కష్టపడుతూ, ఆ ఉద్యోగం చేయనక్కర్లేదు, మానెయ్యమని కొడుకు గొడవ చేస్తున్నాడు. “కొన్నాళ్లేలే” దాటవేస్తుంది కోడలు. “కళ్ళు మూసుకుంటే, మరో మూడు నెలలు యిట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత మీ మధ్య యీ గొడవలుండవు” మనసులోనే అనుకుని, “ఈ మూడు నెలలూ పిల్లలతో సరదాగా గడపాలి. తర్వాత యెటూ కుదరదు” మనసుని దృఢం చేసుకుంది జయమ్మ.

***

“మా ఆఫీసులో చిన్న ప్రోగ్రాం వుంది. ఫ్యామిలీతో వెళ్లాలి. అత్తయ్యగారిని నాతో తీసుకువెళ్తాను. మామయ్యగారిని, పిల్లల్ని తీసుకొని ఐదు గంటలకు వచ్చెయ్యండి” అన్న కోడలి మాటలకు ఆశ్చర్యపోయింది జయమ్మ, మొదటిసారి అత్తయ్య అని తనని పిలిచినందుకు.

కారు తిన్నగా బ్యూటీపార్లర్ ముందు ఆగింది. కోడలి కోసమనుకుంటే, “ఈవిడ నా ఫ్రెండే. ఇక్కడ రెస్ట్ తీసుకోండని” చెప్పి వెళ్ళిపోయింది. వాళ్లో బెడ్ మీద పడుకోమని, వద్దంటున్నా వినకుండా ముఖాన్ని క్రీములతో మసాజ్ చేస్తుంటే, హాయిగా అనిపించి, తెలియకుండా నిద్ర పట్టేసింది. ఛీ,ఛీ.. యిలా పడుకుండి పోయానేమిటని లేచి చూస్తే, పక్క బెడ్ మీద కోడలు. సిగ్గుగా అనిపించింది, ఈ వయసులో తనకివన్నీ యేమిటని. “మీ అత్తగారు చాలా అందంగా వున్నారు”, కాంప్లిమెంట్ యిచ్చిందావిడ. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట. ఆఫీసులో ఫంక్షనంది, ఈ నలిగిపోయిన బట్టలతో యెలా!

కోడలేమనుకుంటుందోనని తటపటాయిస్తుంటే, చీర మార్చుకురండత్తయ్యా అని కోడలిచ్చిన చీర చూసి, ఆశ్చర్యపోవడం జయమ్మ వంతయింది. మొన్నెప్పుడో పిల్లలకు బట్టలు కొనాలి రమ్మంటే తోడువెళ్ళి, కోడలు పిల్లల బట్టలు చూస్తుంటే, ఖాళీగా యెందుకని చీరల వైపు వెళ్లి చూస్తే, తన చూపుని కట్టిపడేసిందీ చీర. రేటు చూస్తే ఐదువేలు. ఈయనని కొనమన్నా “ఇంట్లోనే వుంటావు. నీకెందుకంత ఖరీదైన చీరలనేస్తారు”. ఎవరు పెట్టి పుట్టారో ఈ చీర కట్టుకోవడానికనుకుంది. ఐనా కోడలు తనకింత ఖరీదైన చీర ఎందుకు కొన్నాది? ఆఫీసు వాళ్ల దగ్గర, మంచిదాన్ని అనిపించుకోవడానికా?

ఇంతలా తయారై వెళ్లే, ఆ ఫంక్షన్ ఏమిటనే కుతూహలం జయమ్మలో. పుస్తక ఆవిష్కరణ “నాన్నమ్మ కతలు” అన్న పెద్ద బ్యానర్, ఫంక్షన్ హాల్ బయట. చిన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివేదో! పెళ్లయ్యాక అన్నీ బంద్. ఆవిడెలా వుంటుందో! ఏమి కథలు వ్రాసిందో! చూడాలన్న కుతూహలం జయమ్మలో. కారు చూడగానే అందరూ వచ్చి, కోడలితో పాటు, జయమ్మను కూడా ఆహ్వానించారు. ఆఫీసులో కోడలికి పలుకుబడి ఎక్కువే అన్నమాట.

“ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసినదిగా శ్రీవాణిగారిని ఆహ్వానిస్తున్నాం” అనగానే చప్పట్ల మధ్య కోడలు స్టేజి ఎక్కింది. ఉపన్యాసాలు చెప్పుకునే ముందు ఒక వీడియోని చూద్దామని చెప్పి, కోడలు క్రిందకు దిగగానే, పెద్ద స్క్రీన్ మీద.. ‘జయంతి చెప్పిన కథలు’ అంటూ హెడ్డింగ్.

***

చూస్తున్న జయమ్మ నిజంగా జరుగుతుందా లేక కలకంటున్నానా అన్న భ్రమలో పడిపోయింది. “అదిగో మా నాన్నమ్మ” మనోజ్, మనోజ్ఞల కేకలు. స్క్రీన్ మీద తనే.. మనోజ్, మనోజ్ఞలకు కథ చెప్తుండగా.. తను కథలు చెప్పితే వినడానికి యింత బాగుంటాయా! నమ్మలేకపోతోంది జయమ్మగా పిలవపడే జయంతి. కథ అయిపోయాక హాల్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

స్టేజ్ మీదకు వెళ్లిన శ్రీవాణి ఈనాటి పుస్తక రచయిత్రి శ్రీమతి జయంతి గారిని, ఆవిష్కర్త శ్రీ రంగారావు గారిని స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నానని, వారు రాగానే పుష్ప మాలాలంకృతులను చేసి, పుస్తక పరిచయం మొదలుపెట్టింది.

“నాన్నమ్మ కతల రచయిత్రి, ఈ వీడియోలో ఉన్న జయంతిగారు మా అత్తగారే అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ముందుగా మా అత్తగారికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరిలాగే నేను కూడా నాన్నమ్మలు, అమ్మమ్మలు, ముద్దు చేసి పిల్లలను పాడు చేస్తారనే అభిప్రాయంలోనే ఉండేదాన్ని. మా అమ్మ టీచరుగా పని చేసింది కాబట్టి, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం అలవాటే.

మా అమ్మ అమెరికా వెళ్లడంతో, పిల్లల్ని చూసుకోవడానికి మా అత్తగారిని ఊరి నుండి పిలిపిస్తానని, మా వారంటే ముందుగా నేను వద్దన్నాను. ఆయన పట్టుపడితే, అవుననక తప్పలేదు. పిల్లలెక్కడ క్రమశిక్షణ తప్పిపోతారోనన్న భయం నాది. అందుకని వాళ్లు రావాలంటే పిల్లలెలా వుండాలోనన్న విషయంలో పిల్లలకి, మావారికి కూడా ఆంక్షలు పెట్టాను. ఇంగ్లీష్ ఎంత బాగా వస్తే అంత గొప్ప అన్న భ్రమలోనే ఉండేదాన్ని.

కాని క్యారెట్ కూరను ఆమడ దూరంలో పెట్టే నా కూతురు, క్యారెట్ కూరని ఇష్టంగా తినడం గమనించి, కనుక్కుంటే క్యారెట్ తినకపోతే కళ్ళు కనిపించక, సోములా నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను మమ్మీ అని నా కూతురంటే, సోము ఎవరా అని ఆరా తీస్తే, వాళ్ల నాన్నమ్మ చెప్పిన కథలో ఒక క్యారెక్టర్ అని అర్థమైంది.

ఈ కథల సంగతేమిటో తెలుసుకుందామని, మా అత్తగారు పిల్లలకి కథలు చెప్తున్నప్పుడు చాటుగా వింటే అర్థమైంది, ఆవిడ కథలలోని క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉంటాయో, అవి పిల్లల మనసులను మంచి వైపు ఎంత బాగా మార్చగలవోనని! ఆవిడ చెప్పే కథల ముందు, చాలా కార్టూన్ సినిమాలు పసలేనివని అనిపించింది.

కథకి బలం, కథ చెప్పే విధానం బట్టి, చెప్పేవాళ్లను బట్టి వస్తుందని అర్థమైంది. మూడేళ్లుగా మేము చెయ్యలేనిది, ఒక క్యారెక్టరుతో చెప్పించడం ద్వారా, రెండు వారాల్లోనే మా అమ్మాయి క్యారెట్టును ఇష్టపడేటట్లు చేశారంటే.. ఈ కథను మిగిలిన వాళ్లు వింటే.. మరికొంతమందికి ఉపయోగ పడుతుందన్న భావంతో ఈ కథలను వీడియో తీసి నా ఫ్రెండ్సుకి పెడితే, వాళ్ళ పిల్లలు బాగా వింటున్నారని, ఇంకా వీడియోలు పెట్టమని అడిగారు. అప్పుడే అనిపించింది ఈ కథలను పుస్తకరూపంలో తేవాలని, యూట్యూబ్ లో పెట్టాలని.

రాము, సోము అనే రెండు క్యారెక్టర్సుని సృష్టించి, వాళ్ల ద్వారా మంచిని, చెడుని పిల్లలకి సులువుగా అర్థమయ్యేలా చెప్పడం.. కథలు చెబుతూ, మధ్య మధ్యలో, పిల్లల ప్రవర్తన ఎలా ఉంటే అందరూ మెచ్చుకుంటారో, అమ్మానాన్నలు చెప్పిన మాట వింటే వాళ్ళకి వాళ్ల భవిష్యత్తు ఎంత బాగుంటుందో, సమాజమంటే ఏమిటి? అందులో మనమెలా ఉంటే బాగుంటుంది? మనకున్న దాన్ని నలుగురితో కలిసి పంచుకోవడంలో ఉన్న ఆనందం.. చిన్న ఉదాహరణల ద్వారా చెప్పడం..

ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? ఏ రకంగా తగ్గించవచ్చో.. మన కంచంలో అన్నం రావాలంటే, దాని వెనక రైతన్నల శ్రమ యెంత వుంటుందో పిల్లలకు తెలియజెప్పడం, వాళ్ల చిన్ననాటి కబుర్లు, ఆప్యాయతలు, అనుబంధాల గురించి చెప్తుంటే.. అందరి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పిల్లల్లో పెరగడం.. ఇలా ఆవిడ సృశించని విషయం లేదంటే ఆశ్చర్య పోనక్కరలేదు. మా అత్తయ్య వచ్చిన నెల రోజుల్లోనే పిల్లలు ఎంత యాక్టివ్ గా, మారారో చూస్తుంటే నాకే ఆశ్చర్యమనిపించింది.

పిల్లలకు వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళకి అందించినందుకు.. హాట్సాఫ్ అత్తయ్యా మీకు. అందుకే మీ కథలను పుస్తకరూపంలో, ఆడియో రూపంలో తీసుకొచ్చాను. మీరు నన్ను క్షమించాలి! మీ పర్మిషన్ లేకుండానే యివన్నీ చేసినందుకు. అంతే కాదు, యిన్నాళ్లూ మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోయినందుకు కూడా, సభాముఖంగా నేను మీకు క్షమార్పణ కోరుకుంటున్నాను.

చివరగా నాలాంటి వాళ్ళకి నాదొక సలహా. ఇప్పటి నుండే చదువుల కోసం, పిల్లలను యంత్రాల్లా మార్చకండి. వాళ్లను అమ్మమ్మలకు, నాన్నమ్మలకు దగ్గర చెయ్యండి. వాళ్లలోని బాల్యాన్ని బయటకు తియ్యండి.” స్టేజి మీద శ్రీవాణి ప్రసంగం సాగుతుంది.

వింటున్న జయమ్మ, కాదు.. జయంతిలో, గత నాలుగు నెలల జ్ఞాపకాల తుట్ట కదిలింది. తాను పిల్లలకు కథలు చెప్తున్నప్పుడు, తనతో ఎప్పుడూ చనువుగా లేని కోడలు, ఆ దగ్గరలో తచ్చాడుతుంటే, నిజం చెప్పొద్దూ.. తనేమి చెప్పి వాళ్ళ డిసిప్లిన్ ని చెడగొడుతుందో అన్న అనుమానంతో, ఆ చుట్టుపక్కల తిరుగుతుంది అనుకుంది గాని, తాను చెప్పే కథ వినడం కోసమలా చేసిందని తెలియలేదు. కోడలు తనను గమనిస్తుందని తెలియగానే, కథ సరిగ్గా చెప్పలేకపోయేది. తన చెప్పే కథలు వింటే కోడలేమంటుందోనన్న భయముండేది. కోడలికది అర్థమైనట్టుంది. గదిలో సీసీ కెమెరాలు పెట్టించి, అక్కడే కథలు చెప్పమంది. తానేమో, తన మీద నిఘా అనుకుంది. ఎంత పొరపాటు ఆలోచనో తనది!

ఆ రకంగా తన కథలన్నీ ఆడియో, వీడియోలు చెయ్యడానికన్నమాట. వీడియోలో బాగా కనిపించడానికి, శుభ్రంగా తయారై కూర్చోమన్నది. ఈ పుస్తకం తేవడం కోసం సెలవు రోజుల్లో కూడా పనిచేసిందన్నమాట. అమ్మానాన్నల తర్వాత తనలోని టాలెంటును అర్థం చేసుకున్నది కోడలొక్కర్తే. అయ్యో! అటువంటి కోడల్ని యెంత అపార్థం చేసుకున్నాను.

చిన్నప్పటి నుండి తనకి కథలు వ్రాయాలనే కోరికుండేది. ఒకటి రెండు కథలు వ్రాసి భర్తకు చూపిస్తే, ఇంట్లో పనీ, పాటా వదిలేసి కథలు రాశానంటావేమిటని తిడితే, ఆ ఆలోచననే తుంచి పారేసింది. ఇప్పుడు కోడలు పుణ్యమా అని తన కోరిక తీరింది. ఒక్క కూతురైనా ఉంటే బాగుండేదనుకుంది యిన్నాళ్లూ. ఇప్పుడా లోటు తీరిపోయింది.

“ఇన్నాళ్లూ బాగా చదువుకున్న వాళ్లే, పిల్లలను క్రమశిక్షణలో ఉంచగలరు. బాగా పెంచగలరు. మా అత్తగారి లాంటి వారికేమి తెలుసనే భ్రమలో ఉండే దానిని. ఇప్పుడు ఆ భ్రమలన్నీ పటాపంచలు అయిపోయాయి. మా పిల్లల, ఆలోచనా ధోరణిలో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో! చూస్తే నాకే ముచ్చటేస్తుంది. పిల్లలను ర్యాంకులు తెచ్చే యంత్రాల్లా చూడకుండా, మంచి, చెడూ నేర్పిస్తూ, వారిని పిల్లల్లాగే పెరగనిస్తే, అది వారి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందనే విషయం నాకిప్పుడు అర్థమయింది. ఇకనుండీ నేను కూడా మా అత్తగారి స్కూలే! మరి మీరు కూడా అంతే కదా!” అంటూ శ్రీవాణి ప్రసంగం సాగుతుంటే, తనలో ఉన్న ప్రతిభను కోడలు అర్థం చేసుకోవడమే కాకుండా, నలుగురి ముందు దాని గురించి గొప్పగా చెప్తుంటే, అటువంటి కోడలు దొరికిన తన అదృష్టానికి, జయంతి కళ్ళల్లో ఆనందభాష్పాలు జాలువారుతున్నాయి.

Exit mobile version