Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాలో నేను

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నాలో నేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కీర్తి రావడం అంటూ మొదలుపెడితే
దానికి శిఖరం అంటూ లేదు
ఆకాశమంతా తానే విస్తరిస్తుంది

ఒక ఆలోచన రూపు దిద్దుకుంది అంటే
అది అంతటితోఆగిపోదు
రచయితకు ఆ ప్రవాహంలో
ఎన్నో రచనలు పుట్టుకు వస్తాయి

స్నేహమనే లతకు ప్రాణం పోసేది
ఒక విత్తు లేదా వేరు కారణం అవుతుంది
అదే ఆధారం వెదుక్కుని అల్లుకుపోతుంది

ప్రతిఫలం ఆశించని చెలిమి
అంతరంగాన్ని తాకుతుంది
ఒక ప్రశంస చిన్న గుర్తింపు
ఆనందాలను పంచుతుంది

చెలిమిఅంటే మనిషిని
మనిషి అర్ధం చేసుకోడమూ
ఆలోచనలు పంచుకోడమూ
ప్రోత్సహించుకోడమూ
ఇద్దరి మధ్య వుండేస్నేహం
వారికిమాత్రమే అర్ధం అవుతుంది
మూడోమనిషికి చెప్పాల్సిన పనిలేదు

పరిపక్వత చెందిన వయసులో
జరిగే పరిచయాలు గౌరవమైనవి పవిత్రమైనవి
మనసును మాత్రమే చదువుతాయి

జీవితంలో స్నేహం ఒక్కటే ప్రత్యేకమైనది
భార్యాభర్తల బంధంకాదు
అది బాధ్యత
ఇష్టాలు వేరుగా వుంటాయి

గుండె నిండా నిండి వుండేది స్నేహం
కలుసుకుంటేనే స్నేహమవదు
ఒక చిన్నపలకరింపు చాలు
నువ్వు గుర్తు ఉన్నావని చెప్పేటందుకు

ఏ రంగంలో అయినా ఒక స్థాయికి చేరుకున్నాక
స్నేహితులు పెరుగుతారు
వారి స్వభావం నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి

కొందరు రచయితలు
అందరికోసము రాయగలరు
కొందరు వారి కోసం మాత్రమే రాయగలరు
కొందరికి అదే ప్రపంచం అవుతుంది

నేను ఎందుకు రాస్తున్నాను..
అలవోకగా పుట్టుకువచ్చే
ఆలోచనకు రూపం ఇవ్వడానికి
ఏదో ఆశించికాదు సుమా

ఒకసారి రాసి చదువుకుంటే
మరో వూహ వస్తుంది
ఇది బాగానే వుందిలే..
అనుకుని పంపించాక చదివితే
విచిత్రం మరో ఆలోచన తడుతుంది
అంటే సాహిత్యం అనేది
తనివితీరని దాహం అన్నమాట

అందుకే మెదడు పనిచేసినంత కాలమూ
సాహిత్యం కూడా జీవిస్తుంది
ఎవరు రాసినా ఆకట్టుకునేలా వున్నా
చదివి తీరాలి
అప్పుడు వారి తప్పులను కూడా
మనం సరిచేయగలం
ఇలా రాస్తే ఇంకా బాగుండును
అని మనం చెబితే ‘అవును ఇలా కూడా బాగుంది’
అని ఒప్పుకునే సంస్కారం చాలామందికి ఉండదు
నేను మాత్రం ఒప్పుకుని
మెరుగుపరచుకుంటాను
ఎందుకో మరి
అసలు చదవనివారే ఎక్కువ
చదివినా రచయితతో
పంచుకునేవారు ఇంకా తక్కువ

Exit mobile version