[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నాకు సిగ్గులేదు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సంఘటనల్లో
అదే సారూప్యత అగుపిస్తుంటుంది
వ్యథార్థుల బాధ
అవగతమవుతూనే ఉంటుంది
గొంతులోని దుఃఖం
గోచరమవుతూనే ఉంటుంది
చెంపలు జారే కన్నీటిచెమ్మ
చేతి స్పర్శను పలుకరిస్తూనే ఉంటుంది
అవును..!
వాళ్ళు బాధితులే.. పీడితులే!
స్పందించే హృదయాలకు
సూటిగా జవాబుకై సంధించిన ప్రశ్నలే!!
కానీ..!
కులాన్ని పరిశీలించి చూశాకే
నా కలం కదులుతుంది
బలాలను బాగా బేరీజు వేశాకే
నా గళం ఎలుగెత్తుతుంది
మతమేదో తెలుసుకున్నాకే
మౌనాన్ని విడనాడి
నా అభిమతం వ్యక్తమవుతుంది
చీల్చేదో కూల్చేదో
ఎజెండా ఏదో నిశ్చయమైతేనే
నా సంఘీభావం ప్రకటితమౌతుంది
బేరసారాలు పూర్తయితేనే
లాభనష్టాలు స్పష్టమయితేనే
నా ప్రతిచర్య బహిర్గతం అవుతుంది
అవును..!
నాకు సిగ్గులేదు.. షరంలేదు
నిజంగానే నాది ఓ నిర్లజ్జ బతుకు
ఒకసారికి ఒకలా.. మరోసారికి వేరేలా
పక్షపాతంతో ప్రవర్తిస్తున్నందుకు
పశ్చాత్తాపపడను నేనెన్నడూ
ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.