Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాకెంతో ఇష్టం

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘నాకెంతో ఇష్టం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దేవాలయం వంటి
గర్భాలయంలో దాచి
నవమాసాలు మోసి
అందమైన ఆకృతినిచ్చి
ప్రాణంపోసి మానవతను
లోకానికి పంచమని
తన ప్రతిరూపమై నన్ను
ఈ భూమ్మీదకు తెచ్చిన
అమ్మంటే నాకెంతో ఇష్టం

కడుపులో పేగు కదలగానే
మెత్తని తన చేతులతో నిమిరి
అంతులేని ఆత్మస్థైర్యాన్నందించిన
అమ్మంటే నాకెంతో ఇష్టం

రక్తాన్ని పాలగా మార్చి
స్తన్యాన్నందించి ఆకలి తీర్చి
ఉంగాలతో ఊహలను సమకూర్చి
ఉళుళుళులతో తత్వబోధచేసి
ఉగ్గుపాలతో ఆనందాలను పంచిన
అమ్మంటే నాకెంతో ఇష్టం

ఆటపాటలతో అక్షరాలను నేర్పించి
ఎదుగుదలకు చేయూతనిచ్చి
బతుకు విలువను చూపి
నాకు వెన్నుదన్నుగా నిలిచిన
అమ్మంటే నాకెంతో ఇష్టం

తప్పు చేసిన వేళల దండించి
తప్పటడుగులు పడకుండా
జీవిత పాఠాలు నేర్పించిన
అమ్మంటే నాకెంతో ఇష్టం

కష్టాలు కలిగిన సమయాన
చిరునవ్వుతో ధైర్యాన్నందించి
మనసుకు స్వాంతన చేకూర్చే
అమ్మంటే నాకెంతో ఇష్టం

అపర సృష్టికర్త అమ్మ
ఆది గురువు అమ్మ
జీవితానికి మార్గదర్శి అమ్మ
అమ్మంటే నాకెంతో ఇష్టం

ఎన్నిజన్మలెత్తినా
ఎంత చేసినా తీరనిది
తీర్చలేనిది అమ్మ ఋణం.

Exit mobile version