Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరళ సుందర కావ్యం ‘నాగ్నజితీ పరిణయము’

[వల్లూరి నరసింహకవి రచించిన ‘నాగ్నజితీ పరిణయము’ అనే పద్యకావ్యాన్ని సమీక్షిస్తున్నారు ఫణిహారం వల్లభాచార్య.]

 

సాహిత్యవ్యాసంగాన్ని పరిత్యజించి పాతికేళ్ల పైన అయిపోయింది. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లీ ఒక కావ్యం గురించి మాట్లాడవలసిన అగత్యం ఏర్పడిరది. దానికి రెండు కారణాలు.. ఒకటి ఈ కావ్యాన్ని “త్రవ్వి” తీసి ప్రచురించిన వ్యక్తి కృషి కాగా రెండవది కస్తూరి మురళీకృష్ణ గారి ఆప్యాయతాపూర్వక ఆదేశం. రెండూ కాదనలేనివే అయినా వీటిలో మొదటి కారణం బలవత్తరమైనది.

ఒక వ్యక్తి తన చిన్నతనం నుంచీ ఒక మాట వింటూ వస్తున్నాడు. అదేమిటి? తమ వంశంలో తనకు పూర్వం ఎనిమిదవ తరంలో ఒక కవి వుండేవాడని, ఆయన ఒక కావ్యాన్ని రచించాడని. పెద్దవాడయ్యాక, ఆంగ్లాంధ్ర సాహిత్యాలలో అభిరుచి కలిగి కొంత కృషి చేశాక తమ పూర్వీకుడైన కవి వ్రాసిన కావ్యాన్ని వెతికి పట్టుకోవాలనే కోరిక బలవత్తరమైంది. అంత సులభమా? ఆ కవి తనకు ఎనిమిది తరములకు పూర్వుడు. రెండు దశాబ్దాల పాటు ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆ కావ్యాన్ని వెతికి పట్టుకున్నాడు. అదీ ఒక తాళపత్ర ప్రతి, అందులోనూ దాని జిరాక్స్‌ ప్రతి. దానిని ఎత్తి వ్రాసుకొని, తనకు సాధ్యమైనంతలో సవరించుకొని, తరువాత పెద్దలకు చూపించి, వినిపించి, పరిష్కరింప చేసుకొని ప్రచురించాడు. విపులమైన సాహిత్యాత్మక, చారిత్రక వివరణ అందించాడు. ఇంతకన్నా “పితౄణము”ను తీర్చుకొను మార్గము వేరేమున్నది? ఇది నా మనసును తాకి, ఈ కావ్య అధ్యయనానికి పురికొల్పింది. ఆ వ్యక్తి డాక్టర్‌ వల్లూరి విజయ హనుమంతరావు. సద్గురు శ్రీశివానంద మూర్తి గారి శిష్యుడు. పాతికేళ్ల తరువాత నేను “చేయి చేసుకోవటానికి” ఇది ప్రధాన కారణము. దానికి తోడు నావలెనే “ఏటికి ఎదురీదు” కస్తూరి మురళీకృష్ణ గారి ఆదేశమాయె! అస్తు! ఇక కావ్యంలోకి ప్రవేశిద్దాం!

నిజానికి ఈ కావ్యానికి సమీక్ష వ్రాసే అవకాశాన్ని ఈ కావ్య పరిశోధకుడు, వివరణకర్త, సంపాదకుడు డాక్టర్‌ వల్లూరి విజయ హనుమంతరావు ఎవరికీ మిగల్చినది లేదు. ఈ కావ్యం వ్యవహారం మాత్రమే కాక తమ వంశ చరిత్ర, దానికి అనుబంధంగా వున్న నాటి పాలక పోషకుల చరిత్ర, కావ్యంలో ప్రస్తావించిన ఆలయాలు, దైవతాలు, కావ్యగతములైన అనేకాంశాలను విస్తృతంగా వివరించాడు కనుక సమీక్షకు మిగిలినది లేదు. దానికితోడు ఆచార్య శలాక రఘునాథశర్మగారి పరిష్కరణ, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి మార్గదర్శనం.. నాబోటి వాడికి మిగిలినది ఏముంది కనుక వ్రాయటానికి?

అయినప్పటికీ ఆ కావ్యాన్ని చదివినప్పుడు ఒక పాఠకునిగా నాకు కలిగిన అనుభవాన్ని అయితే పంచుకోగలను కదా? అదే ఇప్పుడు నేను చేయబోయే పని.. దీనికి సమీక్ష, విమర్శ వంటి పెద్ద మాటలను నేను వాడటం లేదు.

కావ్యము “నాగ్నజితీ పరిణయము”. కవి 18వ శతాబ్దికి చెందిన వల్లూరి నరసింహ కవి. భాగవత గతమైన నాగ్నజితీ పరిణయ గాథకు ఇది విపుల రూపము. పోతన మహాకవి శ్రీమదాంధ్ర మహాభాగవత రచనలో కేవలం 19 పద్య, వచనాలలో వ్రాసిన ఈ కథను ఈ కవి ఏడు వందలకు పైగా పద్య, వచనాలలోకి విస్తరించాడు. కథ చిన్నది. శ్రీకృష్ణుడు ఏడు వృషభాలను లొంగదీసుకొని నాగ్నజితిని వివాహమాడటం. అంతే! దీనిని ఏడు వందల పద్య, వచనాలకు విస్తరించటంలో కవి ప్రతిభ ఇమిడి వుంటుంది. తన వంశావళికి సంబంధించిన ఎనభై పద్యాలను ప్రక్కన పెట్టినా దాదాపు ఆరువందలకు పైగా పద్య, వచనాలకు విస్తరించాలి. ఇదీ కవి తలకెత్తుకొన్న పని.

ఈ కావ్యం ప్రబంధఫక్కీలో నడిచిందని వేరే చెప్పక్కర్లేదు. ప్రబంధం అనగానే కథాగతాంశాలకు ఆలంబనగా. పాత్రల మనస్స్థితికి దర్పణంగా వర్ణనలు వుంటాయి కదా? ఇక్కడే ఈ కవికి వెసులుబాటు దొరికింది. నిజానికి పురాణాదులలో కొద్దిపాటి నిడివిలో చెప్పిన కథలను విస్తరించటానికి మన తెలుగు కవులు అందరూ వాడుకొన్న పద్ధతే ఇది. దానికి ఈ కవి అపవాదమేమీ కాదు. అయితే ఒక్కొక్క కవి యొక్క ఊహాశాలిత, పాండిత్యము, రచనా సంవిధానము ఆ కవికే ప్రత్యేకం కనుక ఒక దానికి మరొక దానితో పోలిక లేదు. తులనాత్మక అధ్యయనం చేయవచ్చునేమో కానీ, ఒకదానికి ఇది నకలు అనటం సరి కాదు. అలా అని అలాటి “నకలు” కావ్యాలు లేవని కాదు. అవి కాలపరీక్షకు నిలబడలేదు. ఈ కావ్యం కొన్ని శతాబ్దాల పాటు కనుమరుగుగా వుండి ఇప్పుడు వెలుగు చూసింది కనుక ఇకపై ప్రబంధ సాహిత్య వేదిక మీద ఈ కావ్యస్థానాన్ని అంచనా వేయవలసి వుంటుంది.

కావ్యావతారికలో ఇష్టదేవతా వందన సందర్భంలో ఈ కవి చేసిన శాంభవీ వర్ణన చాలా గొప్పది. చూడటానికి చాలా చిన్న విషయం అనిపించవచ్చు కానీ, చదవగానే నన్ను ఆకట్టుకొన్న పద్యం అది..

“భామల్‌ నాథులు వేరెయున్న నవినాభావంబు సిద్ధించునే
పూమొగ్గం గల తావినా నెనయ సొంపుంబెంపునుం జేయునౌ
గామాదృక్కుల కాంతికోటి గని వేడ్కన్‌ శంకరు న్వేడి తా
సామేనన్‌ నెలకొన్న శాంభవికి నిష్ఠన్‌ సాగి నే మ్రొక్కెదన్‌”

దాంపత్య భావనకు మూలకందంగా లేదూ ఈ పద్యం? ఈనాటి యువతీయువకులకు పాఠం కూడా కాదూ? భార్య భర్త పూవూ తావీ. చదవగానే చటుక్కున శ్రీపరాశర భట్టరులు లక్ష్మీనారాయణుల గురించి చెప్పిన ఇదే భావన మనసులో మెదిలింది!

తరువాత 11 పద్యాలలో సంస్కృతాంధ్ర కవులను అందరినీ పేరు పేరునా స్మరించిన ఈ కవి తాను చేపట్టిన ఇతివృత్తానికి ఆకరమైన తెలుగు భాగవత కర్త పోతనను ఎక్కడా స్మరించలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం! ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారు ఈ విషయాన్ని వివరిస్తూ “ఒక చిత్రమైన విషయం ఏమిటంటే బమ్మెర పోతన మార్గాన్ని ఎంతో భక్తితో అనుసరించిన ఈ కవి పూర్వకవి స్తుతిలో ఆయనను పేర్కొనలేదు. దీనికి కారణం ఆయన నాటి కవులు ‘రేఫమ్ములు ఱాలును గలసి ప్రాసకములైన కతమ్మున’ లాక్షణికులు పోతన లక్ష్యములను ఉదాహరించలేదన్న సంప్రదాయాన్ని అనుసరించటం కావచ్చును” అని చెప్పారు. ఈ కవిపై పోతన ప్రభావం ఇబ్బడిముబ్బడిగా వుందని కావ్య సంపాదకులూ చెప్పారు. కావ్యాన్ని చదువుతున్నప్పుడు అది స్పష్టంగానే కనిపిస్తుంది కూడా.

ఈ సందర్భంలో నాకు.. వ్యక్తిగతంగా.. అనిపించినది ఏమంటే “నన్నయయు తిక్కనయు నన్నావేశించిరి” అన్నట్టు ఈ కవి పోతనను తనలోనికి ఆవాహన చేసుకున్నాడు. ఆ మహాకవితో అభేదాన్ని, తాదాత్మ్యతను అనుభవించాడు. తానే ఆయనగా మారిపోయాడు. ఇక వేరే స్తుతించడం ఎందుకు? అన్యాపదేశంగా ప్రతిపద్య నిరూపణగా ఈ కవి చేసినది పోతన మహాకవిని స్తుతించటమే! ముఖ్యంగా కందపద్య రచనలో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి..

పాత్రంబులఖిలతా సిత
దాత్రంబులు సుకృత హేతు ధర్మాకర స
త్సూత్రంబులు శ్రోతృ సుధా
సత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్‌!
హర్తనములు రిపుతతికి వి
కర్తనములు మంగళ మిహికారాశికి స
ద్వర్తనములు బుధులకు శ్రీ
నర్తనములు నందనందను కీర్తనముల్‌!

ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో పోతనను “చెవులకు వినిపించే” పద్యాలెన్నో కూర్చాడు నరసకవి.

శరీరాంగాలు వున్నందుకు ప్రయోజనం ఏమిటి శ్రీహరిసేవ తప్ప? అని పోతన అన్నదే నరసకవీ అంటాడు అదే ఫక్కీలో..

కరములు నెమ్మేన గల్గినయందుకు
శ్రీమనోనాథు బూజింపవలయు
రసన వక్త్రమున నుల్లసమైనందుకు
శ్రీహరి కీర్తన సేయవలయు
తల యెత్తినందు కార్తత్రాణ పారీణ
వినతు లెన్నేని గావింప వలయు
పదయుగము మెయిని వాటిల్లుటకును కే
శవు ప్రదక్షిణ మొనర్చంగవలయు

కన్నులీ శరీరమునందు గల్గుటకును
శ్రీపతి పదాంబుజంబు లీక్షింప వలయు
హృదయపద్మ మంగంబునం దొడవుటకు
పూరుషోత్తమాస్థానత బూన్ప వలయు!

పేరు చెప్పకపోతే పోతన పద్యమే అనుకోమా? ఇంతకన్నా ఆ మహాకవికి నరసకవి పట్టిన పద్యహారతి ఏముంటుంది? అలా అని పోతన భావాన్నే నరసకవి అనుసరించాడని అనటానికీ వీలు లేదు. పోతన పట్ల ఎంత భక్తిని ప్రదర్శించాడో అంతకంత తన భావగాంభీర్యాన్నీ చూపించాడు. పై పద్యంలో చివరి రెండు పంక్తులు “శరీరంలో హృదయం అనే పద్మం వున్నందుకు దానిని పురుషోత్తమునకు ఆస్థానం చేయాలి” అని పోతనకు కొంత “చేర్పు” చేశాడు ఈ కవి!

ప్రబంధకావ్యాలలో నగర వర్ణన ఒకటి కదా? నగ్నజిత్తు నగరాన్ని వర్ణిస్తూ ఆ నగరంలోని చాతుర్వర్ణ్యాన్ని వర్ణించాడు నరసకవి. దానిలో ఒక పద్యం ప్రగాఢభావ బంధురమే కాక నేటి సామాజిక విమర్శకులకు చెంపపెట్టు లాటి సమాధానం..

ధరణిపు కోటకైన పితృదేవతముఖ్యులకైన తృప్తి కా
కరమగు గాదె మత్కరము గావున పాదజులంచు నెంచకుం
దురు వడి యట్టి పాదజలజోద్భవ గంగ పవిత్రవృత్తి యే
గురియదు గాదె యంచు నుతి గొందురు పాదజులప్పురంబునన్‌!

ఈ పద్యం ఇప్పటి కాలంలో “మేమే చేశాం, మా పండితులే చేశారు, మా గ్రంథాలే చేశాయి, మమ్మల్ని క్షమించండి” అంటూ వదరే “అపాలజిస్టు”లకి, కువ్యాఖ్యానాలకు భ్రమసిపోయి “యుగయుగాలుగా తమను అవమానిస్తున్నార”ని ఘోషించే వారికి వినిపించి, రోజుకో సహస్రం “ఇంపొజిషన్‌” వ్రాయించాలి. ఇంతకీ ఏం చెబుతున్నాడు నరసకవి ఈ పద్యంలో?

“నేల నేలే రాజుకు భోగభాగ్యాలకు అదే నేలను దున్ని సంపద సృష్టించే తమ చేయే ఆధారం. పితరులకు, దేవతలకు తృప్తి కలిగించే గోక్షీరాన్ని, ఘృతాన్ని అందించే చేయి తమదే. పాదజులము విష్ణుపాదాల నుండి పుట్టామని చులకన చేయవద్దు, అన్నిటినీ పవిత్రం చేసే గంగ కూడా అక్కడే పుట్టింది సుమా!” అని స్పష్టంగా పలికి, “ఆ నగరంలోని సమస్తజనుల గౌరవాన్ని పొందుతున్నారు శూద్రులు” అంటాడు నరసకవి. ఆనాటి శూద్రలు ఎంత అభిమానధనులో ఈ పద్యం చెబుతుంది.

కోసల దేశాధీశుడైన నగ్నజిత్తుకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సుదంత అని పేరు పెట్టారు. నగ్నజిత్తు కూతురు కనుక నాగ్నజితి. ఆమె యౌవనవతి అయింది. ఆ క్రమంలో నరసకవి చేసిన ఒక ఊహ అనిదంపూర్వమైనది అనిపించింది. ఈ పద్యంలో ఆమె నితంబము, ఉరోజ సౌష్ఠవాన్ని చెప్పదలుచుకున్నాడు. కవి. రెండూ శైలసదృశాలే. పాపం ఆ రెండిటి నడుమ వున్నది “మధ్యం”.. అదా నాజూకైనది, వున్నదా లేదా అన్నట్లున్నది. రెండు శైలముల మధ్య ఈ “మధ్యం” ఓర్వగలదా? అందుకే బ్రహ్మ దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించి అమలు చేశాడుట! స్త్రీలకు నాభిదేశం నుంచి పైకి సాగే నూగారుతో ఆ మధ్యానికి ఊతమిచ్చాడుట! ఎంత సుందరమైన ఊహ! చూడండి..

రమణి నితంబబింబము ధరాధరరాజి విరాజితంబుగా
కమలభవుండు సూత్రసమ కల్పన జెందిన మధ్యమిట్టి భా
రమునకు నాగుటెట్లని కరంబు కుచాద్రుల కెత్తి కట్ట నా
సుమహిత లీల రజ్జువన శోభిలె నారు జగత్ప్రసిద్ధిగన్‌!

సరే.. ఆ నాగ్నజితికి ఒక చిలుక శ్రీకృష్ణ వైభవాన్ని వివరించి చెబుతుంది.

ఆడుపుట్టువు పుట్టిన యందు కట్టి
పతిని చెట్ట వట్టిన యట్టి పడతి పడతి
పలుకు లిక వేయు నేటికి తలచి చూడ
దాని పుట్టువె సఫలమై తనరు నబల!

అని కూడా అనేస్తుంది. దానితో “నాగ్మజితీకాంత హృదయమునకు, నుద్భవించె గోవింద సంయోగ వాంఛ!” ఆ చిలుక అంతటితో ఆగిందా అంటే ఊహూ! ఆగలేదు. “ఇదుగో.. వెయ్యిమాటలెందుకు? ఈ రాజకుమార్తె కన్య కనుక, ఈమె కృష్ణుని చేరే మార్గం చూడాలి. లేకపోతే ఈ వయోవిభవమ, ఈ రుచిరత్వము ఇతరుల పాలైతే అడవి గాచిన వెన్నెలైపోదూ?కనుక ఆ దారేదో చూడండి మరి” అని కూడా చెప్పింది ఆ చిలుక. ఆ తరవాత వసంత వర్ణన సందర్భంగా నాగ్నజితి చెలులతో ఉద్యానవిహారం చేస్తున్నప్పుడు వారి మాటలలో నరసకవి తోటలలో పూలచెట్ల “దోహద క్రియ”లను విపులంగా చెబుతాడు. ఒక్కొక్క చెట్టు యువతుల స్పర్శాదికముల చేత వికసిస్తుందని అంటారు. వాటిని వివరంగా వర్ణిస్తాడు కవి. తరువాత ప్రబంధ సహజమైన జలక్రీడలు, మన్మధోపాలంభనం, చంద్రదోయం..ఇలా సాగుతుంది నరసకవి కల్పనావైభవం. ఈ సందర్భంలోనే తారకాపంక్తి వర్ణనం చాలా అందంగా, గంభీరంగా చేస్తాడు. ఆ పద్యాన్ని చూస్తుంటే రాయల వారి “ఖనటత్పయోబ్ధి వీక్ష్య..” అనే గరుడ వర్ణన గుర్తుకు వస్తుంది. అది ప్రళయ భీకరంగా వుంటే, ఇది అదే కట్టుబడిలో వున్నా భావసౌకుమార్యం వల్ల సౌమ్య సుందరంగా భాసిస్తోంది. అది ఇది..

గగన స్పృశద్రాత్రికాంతామణీ శిరో
మానితాభరణ సన్మౌక్తికములు
సాంధ్యవేళా నటచ్ఛాంకర మూర్ధ ని
ర్జర సమర్పిత సుమ సముదయములు
త్రిభువన విజయ సందీప్తాంగజ మహోగ్ర
చాపగళత్సూన సాయకములు
కైరవిణీ చంద్ర కళ్యాణ సమయ క
ల్పిత వియదుల్లాభసిత మణులన

నటదభవ శీర్ష గత వియన్నదీ తరంగ
ఘట్టనోద్భూత సలిల శీకరము లనగ
పెక్కు విలసిల్లె లెక్కకు మిక్కిలగుచు
గగన రంగంబునను తారకాగణంబు!

కట్టుబడి ప్రౌఢంగా వుంది.. భావం? సౌమ్యంగా వుంది! ఇది నిజంగా కవిప్రతిభా విశేషం. గగనతలంలో సాక్షాత్కరించిన తారకలు.. ఆకాశాన్ని స్పృశిస్తున్న రాత్రి అనే మగువ శిరస్సున దాల్చిన ఆభరణాలలోని ముత్యాలట, సంధ్యాకాలంలో నటిస్తున్న శివుని శిరస్సుపై దేవతలు సమర్పించిన పూలట, ముల్లోకాలనూ జయించే మన్మధుని మహోగ్ర ధనువు నుంచి వెలవడిన సుమబాణములట, కలువకూ చంద్రునికీ జరిగే కల్యాణ సమయంలో ఆకాశాన్ని అలంకరించిన తెలిమణులట, నృత్యం చేస్తున్న శివుని జటలలో పరస్పరం కొట్టుకొంటున్న గంగానదీ తరంగాలనుండి ఎగసి పడిన నీటి తుంపరలట! సుకుమారమైన వర్ణనకు పరమగంభీర పద గుంభన చేయటం నిపుణుడైన కవికే సాధ్యం! అట్టి నిపుణుడు ఈ నరసకవి! కేవల పద్యరచనలోనే కాదు.. వచన రచనలోనూ ఈ కవి పోహళింపు ద్యోతకమవుతుంది. వెన్నెలను వర్ణిస్తూ (అచ్చులో) నాలుగు పుటల వర్ణన వుంది. సంప్రదాయ కావ్య వచన రచనలో ఔత్సాహికులకు ఇది ఒక పాఠ్యపుస్తకం! సరే.. విరహిణులకు అది సహించరానిదే కదా? నాగ్నజితి వేదనను చూచి ఒక చెలి తాను ద్వారకకేగి శ్రీకృష్ణునికి ఆమె అవస్థను విన్నవిస్తానని బయలుదేరి, ఆ పని చక్కబెట్టుకొని వస్తుంది రుక్మిణి కోసం అగ్నిద్యోతనుడు చేసినట్టు! పాపం ఆ విప్రునికి రుక్మిణీ కల్యాణ సందర్శనయోగం లేదేమో కానీ ఈ చెలికత్తె మాత్రం తిరిగి వచ్చి తాను పని చక్కబెట్టానని నాగ్నజితికి చెప్పగలిగింది.

నగ్నజిత్తు తన కుమార్తెకు వీర్యశుల్క సమన్వితమైన స్వయంవరాన్ని ప్రకటించాడు. దేశదేశాల రాజులు వచ్చారు. శ్రీకృష్ణుడు తన చెలికాడైన అర్జునునితో కదలివచ్చాడు. సుయోధనుడు కూడా కర్ణసమేతుడై వచ్చాడు. శిశుపాలుడూ వచ్చాడు. నగ్నజిత్తు వద్దనున్న ఏడు భయంకరైమన వృషభాలను లొంగదీసినవాడు విజేత. దేశదేశాల రాజులు ఆ వృషభాలను చూచి, “ఇది మన వల్ల అయే పని కాద”ని తప్పుకున్నారు. అలా తప్పుకోవటానికి వారిలో వారు అనుకున్న కారణాలు హాస్యస్ఫోరకంగా వుంటాయి. అంతేకాదు.. ఈనాడు కూడా ఏదో చేసేద్దామని బయలుదేరి వచ్చి ఆ పని తమకు సాధ్యం కాదని తెలిసి చెప్పుకొనే వంకలు కూడా ఇలాగే వుంటాయి.

అవి ఎటువంటి వృషభములో నరసకవి చేసిన వర్ణనలో కొన్ని విశేషాంశాలున్నాయి. ఒక పద్యంలో త్రిపురాల్ని కూల్చిన పరమశివుడే ఆ వృషభాల రూపంలో వచ్చాడని అంటాడు. ఆ తరువాతి పద్యం గమనించ వలసినది. చూడండి..

నందికేశ్వరుని కానందంబు రెట్టింప
నిట్టి రూపములు వహించెనొక్కొ
ధర్మాధిదైవతోత్కర్ష తెల్లముగాగ
నిట్టు సప్తత మన్ను మెట్టె నొక్కొ
సురభి నిజాగ్ర విస్ఫురణ చూపగ వృషా
ధిప రూపమున బ్రవర్తించె నొక్కొ
తన పేరు మ్రోచె గావున మహేంద్రుండిట్టు
సారంబు గల్గ ప్రసాద మొనర

జేసేనో కాకయున్న నిస్సీమ విక్ర
మ క్రమక్షీణ దుర్దమ మహితసార
మగుచు వృషసప్తకంబు మిన్నంది మెలగ
గంటిమే వింటిమే ధాత్రి మంటు మిటుల!

నందీశ్వరునికి రెట్టింపు ఆనందం కలిగించటానికి అనేది సాధారణ విషయమే. తరువాత ధర్మాధిదైవతోత్కర్ష తెలిసేటట్లుగా ఏడు రూపాలు ధరించాయి అనటం వైదిక విజ్ఞానం వున్న వారికి మాత్రమే సాధ్యం. ధర్మదేవత వృషరూపంతో వర్తిల్లుతుందని వేదవచనం కదా! ఇలాటి వైదిక, యోగ శాస్త్ర విశేషాలు నరసకవి చాలానే చెప్పాడు. ఈ ఏడు వృషభాలను లొంగదీయటం అనేది సప్తచక్రాత్మకమైన కుండనిలీ యోగంగా అభివర్ణించారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులవారు తమ ముందుమాటలో. అలాగే శ్రీరాముడు చేసిన సప్తతాళ భేదనం కూడా ఈ సందర్భంలో స్మరణీయమని కూడా సూచించారు. వారి సూచనను అనుసరించి అధ్యయనం చేయవలసి వుంటుంది బుద్ధిమంతులైన కావ్యపాఠకులకు. “చేదుకొన్నంత వారికి చేదుకొన్నంత”! కనుక నేను వాటి జోలికి పోవటం లేదు.

ఇక అక్కడికి వచ్చిన రాజులను ఉద్దేశించి నగ్నజిత్తుజు వాటిని లొంగదీయమని చెప్పగానే ఆ రాజులొక్కొక్కరూ జారుకొన్నారు. దానికి వారు చెప్పిన కారణాలు నేటికీ అలవి కాని పని తలపెట్టి “స్వస్వరూపజ్ఞానం” కలగ్గానే తప్పుకొనే వాళ్లు చెప్పే వంకల లాగే వున్నాయి.

కర్ణాటక రాజు “శకునం చూసుకోకుండా వచ్చినందుకు ఫలితం” అంటూ కూలబడ్డాడు! కళింగుడు “నేను వెడదామనుకొన్నాను కానీ ఎవరో తుమ్మారు” అని కూచున్నాడుట! ఆంధ్రనృపాలుడు “ఎందుకులే పదిమందిలో నవ్వులపాలు కావటం” అని వూరుకొన్నాడట! కాంభోజపతి “రారాజు వుండగా ఇంకెవరు సమర్ధులు” అని మొహం వంచుకున్నాడుట! చేయలేని పనికి పూనుకొని చేతకాక ఇప్పటికీ ఇలాటి “కుంటి సాకులు” చెప్పడం మానవనైజం కాదూ? అర్జునుడు మాత్రం “శ్రీకృష్ణు సొమ్మతివ యంచు మది నెఱింగి సమ్మదమున బొదలి యుండె”.

సరే.. చివరికి శ్రీకృష్ణుడు ఆ ఏడు వృషభాలను లొంగదీసుకున్నాడు. నాగ్నజితిని వీర్యశుల్కగా గెలుచుకున్నాడు. ఇక అక్కడి నుంచి పెళ్లి వేడుకలు, భోజనాలు.. ఆ భోజనాలలో అన్నీ తెలుగువారి వంటకాలే! వివాహ సందర్భంలో తలబ్రాల గురించి నరసకవి వ్రాసిన పద్యం మనకు “జానక్యా: కమలామలాంజలి పుటేయా: పద్మరాగాయితా: “అనే శ్లోకాన్ని గుర్తు చేస్తుంది. సీతమ్మ చేతిలోని ముత్యాల తలబ్రాలు పద్మరాగ మణులలా వున్నాయి. వాటిని రామయ్య తలపై పోయగానే అవి కుందపుష్పాలలా కనిపించాయి. అవి ఆయన శరీరంపై జాలు వారుతుంటే ఇంద్రనీల మణులలా దర్శనమిచ్చాయి. ఇక్కడ కూడా అదే జరిగింది..

జలజాతాక్షుడు దోయిలించి సతి శీర్షంబందగా నట్ల త
ల్లలనారత్నము శైరి మౌళిపయి హేలన్‌ నింపగా బొల్చు నా
తలబ్రాలాస్య పయోద సన్నిభ కచోద్యన్మేళనంబంట యా
జలదాంతర్గత మౌక్తికంబులని యెంచన్‌ రaల్లునన్‌ రాలుచున్‌!

అక్కడ ఆ శ్లోకంలోనివి సీతమ్మ చేతిలోని తలబ్రాలు మాత్రమే. ఇక్కడ ఇద్దరి చేతుల్లోనుంచి జారిన తలబ్రాలు. అవెలా వున్నాయి? స్వామి చేతిలోని తలబ్రాలు ఆమె తలపై, ఆమె చేతిలోనివి ఆయన శీర్షంపై పడి “రaల్లునన్‌” జారాయి. అవెలా వున్నాయి? వదనంపై, మేఘసన్నిభమైన కేశపాశంపై పడి సముద్రంలోని ముత్యాలలా వున్నాయిట! ఒక పద్యమో, శ్లోకమో మనకన్నా ముందుంటే అదే భావాన్ని చెప్పదలచుకుంటే దానికి “పై మాట” చెప్పాలి. అదే ఇక్కడ నరస కవి చేసిన పని.

తరువాత శ్రీకృష్ణుడు నాగ్నజితిని తోడ్కొని అర్జునుడు వెంట రాగా ద్వారకకు బయలు దేరాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ నగ్నజిత్తు తమను కన్యాదానానికి పిలిచి, ఏడు వృషభాలను తెచ్చి అవమానించి, చివరకు “ఆత్మీయ కుల పౌరుషాదుల నెంచక తనయను దెచ్చి యాదవున కిచ్చి”నాడని ఆగ్రహించి దారి కాచారు. వారందరినీ కృష్ణార్జునులు ఓడించారు. శ్రీకృష్ణుడు నాగ్నజితితో ద్వారక చేరాడు. తరువాత జరుగ వలసిన తంతు జరిపి నూత్న దంపతుల శృంగారకేళిని వర్ణిస్తాడు నరస కవి. అక్కడితో కావ్యం సంపన్నమవుతుంది.

స్థూలంగా ఇవీ కావ్య విశేషాలు. నిజానికి నేను ముందే చెప్పినట్లు ఈ నరస కవికి ఎనిమిదవ తరము వాడైన ఈ కావ్య సంపాదకుడు డాక్టర్‌ వల్లూరి విజయ హనుమంతరావు సమీక్షకులకు ఏమీ మిగల్చనంత వివరణ ముందుగానే అందించేశాడు. కనుక నేను ఈ కావ్యం చదివినప్పుడు కనిపించిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించాను.

మరొక్క రెండు విషయాలను ప్రస్తావించి ముగిస్తాను..

కావ్యాధ్యయనం, కవుల స్వభావంపై నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. అవి కావ్యశాస్త్ర మూలకములనే నా దృఢవిశ్వాసం కూడా. అలాటి వాటిలో తెనాలి రామకృష్ణ కవిని గురించిన “వికట కవి” అనే దానిపై నా నిష్కర్ష ఒకటి. ఈ “వికట కవి” అనే మాటను పట్టుకొని మన తెలుగువాళ్ళు ఆ మహాకవిని ఒక “జోకర్‌”గా పరిగణించారు. ఇది 18వ శతాబ్దం నాటికే వుందని ఈ నరస కవి ఆ కవి గురించి చేసిన స్తుతితో స్పష్టమవుతోంది. ఇది చూడండి..

“రంగుగ పాండురంగని తెరంగలరంగ రచించి వేడ్క మీ
రంగ ఛలోక్తులన్‌ నృపు గవంగ నొనర్చు..
తెనాలి రామలింగ శశలింగకళానిధిం గణించెదన్‌”

అంటాడు నరస కవి. పండితుడు, కావ్యరచనా విశారదుడు అయిన నరస కవి కూడా “లోకోక్తి”కి వశమై పోయి “ఛలోక్తులన్‌ నృపు గవంగ నొనర్చు” అనటం నాకూ బాధను, కించిదాశ్చర్యాన్ని కలిగించింది.

ఇక రెండవ విషయం.. భక్తి పారవశ్యంలో కవులు క్రమాన్ని మరచిపోతారు. త్యాగరాజ స్వామి “జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయకా”అంటూ మొదలు పెట్టి మధ్యలో “దధి పయోధివాస హరణా!” అంటారు. “పెరుగు, పాలు వుండే కుండలను అపహరించివాడా!” అంటే శ్రీకృష్ణుని నామాన్ని ఆ కీర్తనలో స్మరిస్తారు. రాముడైనా, కృష్ణుడైనా ఒకరే కదా? అని ప్రశ్ణించవచ్చు. నిజమే! రాముడూ, కృష్ణుడూ ఒకరే! కానీ కృష్ణుడు “జానకీ నాయకుడు” కాడు, “రుక్మిణీ వల్లభుడు”. జానకీ నాయకుని సంబోధించేటప్పుడు కృష్ణ ప్రసక్తి ఔచిత్యభంగం. అలా అని నేను త్యాగరాజస్వామివారి భక్తిప్రపత్తులను తక్కువ చేయటం లేదు.. కోప్పడకండి. భక్తి పారవశ్యంలో జరిగే తృటుల గురించి చెప్పటానికే ఈ ప్రస్తావన చేశాను. అంతే.

అలాగే నరసకవి కూడా నాగ్నజితి వద్ద చిలుక చేసిన శ్రీకృష్ణ వర్ణన వ్రాస్తూ ఆ పద్యంలో ఒక పాదంలో ఇలా అంటాడు.. “పాండుసూనుల ప్రతిపక్ష కైతవమున కౌరవేశ్వరు నేల గలిపినాడు” అప్పటికి కౌరవేశ్వరుడు “నేల గలువలేదు”. ఇలాటివి భక్తిపారవశ్యంలో చేసే వర్ణనలుగా మనం భావించాలి.

మొత్తం మీద ఈ కావ్య పరిశోధకుడు, వివరణకర్త, సంపాదకుడు చెప్పగా మిగిలిన అంశాల పరామర్శ మాత్రమే నేను చేసినది. పద్యరచనాసక్తులైన ఔత్సాహికులకు ఈ కావ్యం ఒక సరళ మార్గాన్ని సూచిస్తుంది. ఒక అధ్యయన గ్రంథంగా ఉపయోగిస్తుంది. కనుక పద్యరచనాసక్తులు, పద్యకవితా ప్రియులు కూడా అవధరించ వలసిన సరళ సుందర కావ్యం ఇది. దాదాపు నాలుగన్నర శతాబ్దాలు కనిపించికుండా దాగి వున్న తన పూర్వీకుని కావ్యాన్ని శ్రమకోర్చి వెలికి తీసి ప్రచురించి “పితౄణము”ను తీర్చికొన్న మిత్రుడు డాక్టర్‌ వల్లూరి విజయ హనుమంతరావును మరొక్కసారి అభినందిస్తూ..

***

నాగ్నజితీ పరిణయం (పద్య కావ్యము)
రచన: వల్లూరి నరసింహకవి
సంపాదకులు: డా. వల్లూరి విజయ హనుమంతరావు
పేజీలు: 299
వెల: ₹ 300/-
ప్రతులకు:
డా. వల్లూరి విజయ హనుమంతరావు
3-30-5, ‘శివానంద’, చర్చి రోడ్
సుబ్బారావు పేట,
తాడేపల్లిగూడెం 534101
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
ఫోన్: 9492494399

Exit mobile version