[గజల్ (ఖండగతి) రూపంలో ఈ కవితని అందిస్తున్నారు పారుపల్లి అజయ్ కుమార్.]
విరజాజి పువ్వులే రువ్వుతూ నా ఎంకి
నా వంక చూసింది నవ్వుతూ నా ఎంకి..
ఏడేడు జనుమలలో నీ తోడు నేనంది
గుసగుసగ చెవికొరికి చెప్పుతూ నా ఎంకి..
గుండె గదిలో నీవు కొలువై వున్నావంది
ఎనలేని ప్రేమలను తెలుపుతూ నా ఎంకి..
మోముపై కురులతో మబ్బులా కమ్మేసె
వయ్యారి నడకతో కులుకుతూ నా ఎంకి..
తన జాడ చెప్పకనె దూరంగ పోయింది
మదిలోన విరహాన్ని రేపుతూ నా ఎంకి..
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి.
సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్’ పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు.
ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.