Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా రుబాయీలు-14

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
మాధుర్యం కోకిల గొంతులోనె ఉంటుందా
తన్మయత్వం సంగీతంలోనె ఉంటుందా
జీవితకాలపు సాఫల్యం భౌతికేతరం!
ప్రకృతి కాకున్నమార్గం వేరే ఉంటుందా

2.
సౌమ్యుడిని అన్యాయంగ నరికేస్తే దిక్కెవడు
బలహీనున్ని పలుమార్లు చంపేస్తే దిక్కెవడు
నడుములో కొడవళ్ళ జతను నింపుకుంది భామిని
కలికి కరవాలానికి రూపమైతే దిక్కెవడు

3.
వేచిన ఇరు ఎడబాటుల నడుమలు అమృతం
పలికిన ప్రతిపలుకులలో ఆ కొసలు అమృతం
నా బులుపుపై పైవాడికి కన్నుకుట్టగ
జంటగా వెలిసిన మన సమాధులు అమృతం

4.
అలలెంత ఘోషించినా తీరం చేయందించదని తెలుసు
కాదంబినెంత ఉరిమినా ఆకాశం కిమ్మనదని తెలుసు
ఇల నిండిన ప్రేమ పందిళ్లు నీలో అంకురించని క్షణం
వేడిన నా వలపు బాణాలే నను ప్రహరిస్తాయని తెలుసు

5.
చీకటిని దాచేస్తుంది వెలుగు
చీకటిన దాగుంటుంది వెలుగు
మనసుకు గమ్యం మృగ్యమైతే
దారులను చూపిస్తుంది వెలుగు

6.
నీ కోసమే వేచిన క్షణంలో నా విలువ తెలుస్తుంది
నీ కళ్ళలో నింపిన కాంతిలో నా ప్రతిభ తెలుస్తుంది
నా ఎద నిండా నీ ఊహకు మించిన ప్రేమను నింపాను
కాలం పరీక్షతో సాకారమగు నీ కల తెలుస్తుంది

7.
దూరం పెంచుతుంది వైరం
ప్రాణం కోరుతుంది వైరం
న్యాయాన్నన్యాయం మేస్తే
ధర్మం నేర్పుతుంది వైరం

8.
కళ్లెదుటె కనబడుతూ పనులను అడ్డుకుంటావెందుకు
అరచేయి అందించమంటె వెనుకడుగు వేస్తావెందుకు
ఎందరికో ఐనవాడిని నీ వాడనౌతానంటే
అహింసావాదినని తెలిసీ తెగ హింసిస్తావెందుకు

9.
జగమేలే దైవానికి గురుతు విగ్రహం
సర్వాంతర్యామికో సేతువు విగ్రహం
నిగ్రహంతో మనసా ఆయన్ని స్మరించి
ఇలంతా కంటే ఇంకెందుకు విగ్రహం

10.
దరహాసం చెదరనివ్వకు వదనం
కష్టాలొస్తె జారుకోకు వదనం
కాలమందరికీ ఒకలా ఉండదు
దర్జాను తగ్గించమాకు వదనం

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version