Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా కల సాకారమవునా!

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘నా కల సాకారమవునా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కల నన్నెప్పుడూ వెంటాడుతునే ఉంటుంది
తూరుపున లేసూరీడు తూరుతూ ఉన్నప్పడు
తెల్లటి పంచె, పై జుబ్బాలలో ధీమాగా నే కూర్చొని
ఆ వెలుతురులో తెల్లని కాగితంపైన ఏదో రాస్తున్నట్టు

బహూశా నా మనసు ఏదో కోరుకుంటున్నట్టుంది
అనుభవించిన భావావేశాలను అక్షరీకరించమనేమో!
మధురానుభూతులను ఓ చోట చేర్చి చూడాలనేమో!
అది నా మాట పాటించకపోయినా తన మాట నేను వినాలిగా..

ఆ మనసును ఊరట పరచాలని తలచిన నేను
అనివార్యమై మలి సంధ్యలోకి ఒదుగుతూ ఉన్నా..
అనుదినం తొలి సంధ్యను అభ్యర్థిస్తూనే ఉంటాను
ఉత్పేరకమై నా కలాన్ని ముందుకు నడిపించమని

ఆ ఉదయం నా ఆశనెప్పుడు అడియాశ చేయలేదు
ప్రతి రోజూ నన్ను సరికొత్తగా పలకరిస్తూనే ఉంటుంది
నా కోసం ఏం తీసుకొచ్చావని మురిపెంగా నేనడిగితే
భావవేశపు తావి అబ్బిన అక్షర గుచ్ఛాలని
బహూకరిస్తునే ఉంటుంది.. నిరవధికంగా!!!

Exit mobile version