Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-9

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

శోభారాణి మేడంతో పెంచుకుంటున్న పరిచయం:

అప్పటికి నాకు టీవీ ద్వారా ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్న శోభారాణి గారితో ప్రతి వారం ఎపిసోడ్ అయిపోయిన వెంటనే కాల్ చేసి మాట్లాడుతూ ఎంబ్రాయిడరీలో నాకున్న సందేహాలను తీర్చుకుంటూ వచ్చిన ఆర్డర్లను చేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యాను.

కొత్త ఇంటికి వెళ్లే ప్రయత్నాలు – చిన్న అత్త మామయ్య సహాయ సహకారాలు:

అంతలో నాన్న కొత్త ఇంటికి అంటే పెద్ద చిన్నాన్న మా కోసం కొన్న ఇంటికి వెళ్లడానికి మంచి రోజు తెలుసుకోవడానికి సిద్ధాంతి దగ్గరకు వెళ్ళారు. మంచి రోజు పెట్టించుకుని వచ్చారు నాన్న. ఇల్లు మారడానికి సంబంధించిన మిగతా పనులు చిన్న అత్త మామయ్య వాళ్లు చూసేవాళ్ళు. మూలాపేట నుంచి వచ్చేస్తున్నాము కాబట్టి ఒకసారి శివాలయం వెళ్లిరావాలి అనుకున్నాము. సోమవారం అయితే మంచిదని అనుకున్నాం.

మూలపేట-శివాలయ దర్శనం:

అయితే ఒక సోమవారం ఇంటి పనులు చేసుకొని ఒకసారి శివాలయం వెళ్లినాము. ఆ టైం గుడి మూయడానికి అరగంట టైం మాత్రమే ఉండింది. ఆ టైంలో దర్శనం చేసుకొని పూజ చేయించుకుని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నవగ్రహాల దగ్గర నాన్న నన్నుకింద కూర్చోపెట్టినారు. అప్పుడు నేను కింద జరుగుకుంటూ నవగ్రహాల చుట్టూ అంటే అక్కడ నవగ్రహాలకు అభిషేకం చేసిన నీళ్లు వెళ్లే చిన్న కాలువ లాంటి చోటి వరకు ప్రదక్షిణం చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. అలా నేను సొంతంగా ప్రదక్షిణం చేసినందుకు. ఇది ఎందుకు చెప్పాను అంటే మనం మన శరీరంలో ఏదైనా లోపం ఉంటే దానిని పట్టించుకోకుండా మనం శరీరం సహకరించినంత వరకు శరీరంలోని అవయవాలు పనిచేయగినంత వరకు మనం చేయగల పనులు చేసే ప్రయత్నం చేయాలి, నాకు ఓపిక లేదు అని ఏ పని చేయకుండా కూర్చోకూడదు. ఇది నా విశ్వాసం. అందుకే ఇలా చేశాను. చిన్నప్పుడు నాన్న తుమ్మగుంటలో కానీ ఎక్కడకు వెళ్లినా గుళ్ళ చుట్టూ నన్నుఎత్తుకొని ప్రదక్షిణలు చేసేవారు.

గురువులు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు, శ్రీ శివరామప్రసాద్ గారు, నేస్తం రోహిణిలతో

కళ్యాణితో పరిచయం – వ్యాపార పరంగా సహకారం:

మూలపేటలో ఉన్నప్పుడే కళ్యాణి అనే ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి మూలపేట లిటిల్ ఏంజెల్ స్కూల్ దగ్గరలో వాళ్ల ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ పెట్టుకుని ఉండేది. ఆ అమ్మాయికి కూడా చేతి ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చు. ఆ అమ్మాయికి ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడు తీసుకొని కొన్ని నాకు తెచ్చి ఇచ్చేది. ఆ అమ్మాయి ఇచ్చిన సమయం మించిపోకుండా కుట్టి ఇచ్చేదాన్ని, ఇంటి పనులు చేసుకుంటూ. అక్కడ అయితే డైరెక్ట్‌గా నాకు వచ్చే ఆర్డర్లు అప్పుడప్పుడు తగ్గినా అమ్మాయికి షాప్ కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడు నాకు తెచ్చిఇవ్వడం వల్ల నా సమయం వృథా కాకుండా ఎప్పుడూ పని ఉండేది. రెండు విధాల ఆర్డర్లు వచ్చేవి. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండడం నాలో నామీద ఒక నమ్మకాన్ని పెంచింది. పెద్ద చిన్నాన్న వాళ్లు కొన్న ఇల్లు పరమేశ్వరి నగర్. అక్కడకు వెళ్తే నాకు ఎంబ్రాయిడరీ ఆర్డర్లు వస్తాయో లేదో అనే భయం పట్టుకుంది. కానీ వెళ్ళాలి తప్పదు. అప్పటికే తాత ఇచ్చిన డబ్బులు నాన్న దగ్గర అయిపోవస్తున్నాయి. అందుకే మేము ఇబ్బంది పడకూడదని పెద్ద చిన్నాన్న, చిన్న చిన్నాన్న ఇంకా చిన్న అత్త పెద్ద అత్త వాళ్ళందరూ ఆలోచించి నాన్నకు సహాయం చేయాలని నిశ్చయించుకొని అందులో భాగంగా పెద్ద చిన్నాన్న ఇల్లు కొన్నారు. వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండగా ఇల్లు మారే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.

చిన్నాన్న ఇంట్లో నాకు అనుకూలమైన ఏర్పాట్లు:

పెద్ద చిన్నాన్న కొన్న ఇంట్లో నాకు అనుకూలంగా వసతులను ఏర్పాటు చేయించే పని మా చిన్న మామయ్య (చిన్నత్త భర్త) తీసుకున్నారు. ఇక్కడికి వచ్చాక నేను నాన్న ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మాకు అనుకూలమైన వసతులను ఏర్పాటు చేశారు అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.

మూలపేటలో శ్రీలతతో పరిచయం:

అక్కడ ఉన్నప్పుడే ఎదురింటిలో శ్రీలత అనే ఒక అమ్మాయి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్లు. ఆ శ్రీలత అనే అమ్మాయి నాకు చాలా బాగా దగ్గరయింది. ఆ అమ్మాయికి విక్రమ సింహపురి యూనివర్సిటీలో అధ్యాపకురాలుగా ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి కూడా తన డ్రెస్ పైన చేత చేతి ఎంబ్రాయిడరీ చేయించుకుంది. అంతేకాక నాకు చాలా సహాయంగా ఉండేది. ఖాళీ టైంలో నా దగ్గరకు వచ్చి నాకు తోడుగా ఉండేది, ఎన్నోవిషయాలు ఇద్దరం పంచుకునే వాళ్ళం. ఆ క్రమంలో నేను నా చిన్ననాటి విషయాలు చెప్పేదాన్ని. అందులో భాగంగా నా చిన్నతనంలో నేను పాఠశాలలో చేరకముందు ఇంట్లోనే ఉండి చదువుతున్నప్పుడు ఇంట్లోఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో ఉండింది. ఆ రేడియోలో చిన్నపిల్లల బాలల కార్యక్రమాలు ఇంకా నాటికలు హరికథలు వినేదాన్ని. ముఖ్యంగా చిన్న పిల్లల బాలల కార్యక్రమంలో కథలు కవితలు చిన్నపిల్లలు చెప్తుంటే నేను విని వాటిని అర్థం చేసుకొని ఒకసారి ఇష్టం ఇష్టం కష్టం కష్టం అనే పేరుతో ఒక కవిత రాసి విజయవాడ రేడియో స్టేషన్‌కు అనుకుంటా అక్కడికి పంపాను. ఇంకా శ్రీరామనవమి వచ్చినప్పుడు భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం శ్రద్ధగా వినే వాళ్ళం ఇంట్లో అందరం. ఇవన్నీ నేను శ్రీలతకు చెప్పేదాన్ని.

తుమ్మగుంటలో ఉన్నప్పటి ఇంకొక విషయం:

ఏమంటే నా చిన్నతనంలో తుమ్మగుంటలో ఉన్నప్పుడు మా తాతగారు సొంతంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు మా తాతగారు నానమ్మ నెల్లూరు వేదాయపాలెంలో వున్న ఇంటికి వెళ్లి ఉన్న సమయంలో తుమ్మగుంటలో నేను నాన్న మాత్రమే ఉన్న సమయంలో పొలాలకు నీళ్లు సరఫరా చేసే ఇంజన్‌కు సంబంధించిన రెండు రాడ్లు ఇంటిలో ఒకచోట పెట్టి ఉండగా రాత్రి 10 గంటల సమయంలో నేను అటుగా జరుగుకుంటూ వెళ్లివాటి మీద పడిపోయాను. తలకు బాగా దెబ్బ తగిలి ఎక్కువ రక్తం పోయింది. అప్పుడు నాన్న తలకు కట్టుకట్టి విడవలూరుకు ఆ సమయంలో ఎత్తుకొని తీసుకుని వెళ్ళారు. అప్పట్లో తుమ్మగుంటలో ఒక మందుల షాపు కానీ ఒక డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ ఏమీ లేవు. ఏమి బాగా లేకపోయినా విడవలూరుకు కానీ వావిళ్ళకు కానీ వెళ్ళవలసిందే. ఈ కారణం చేతనే ఆ సమయంలో విడవలూరుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే నా తలకు కుట్లువేశారు అంత పెద్ద దెబ్బ తగిలింది. ఇంకొక విషయం ఏమంటే ఆ సమయంలో తుమ్మగుంట నుంచి విడవలూరుకు వెళ్లేదారిలో పెద్దగా వీధి లైట్లు ఉండేవి కాదు. దూర దూరంగా ఉండేవి. ఇంకా వెళ్లేదారిలో పాములు తేళ్లు అక్కడక్కడ తాగుబోతులు ఉండేవాళ్ళు. నాకు పాములు తేళ్లు అన్నా తాగుబోతులన్నావిపరీతమైన భయం. ఎక్కడ వాళ్లు వచ్చి నాన్నను నన్నుకొడతారేమో అని భయమేసేది. చాలా చిన్న పిల్లను కదా. కానీ నాన్న మాత్రం వాటిని అన్నిటిని దాటుకొని ధైర్యంగా నన్నుఎత్తుకొని క్షేమంగా తీసుకొని వెళ్లి వచ్చేవారు. అంతేకాదు నాకు జ్వరం వచ్చిన ఇంకేదైనా బాగా లేకపోయినా ఇంకా నేను బూట్లు వేసుకొని నడవడం (ప్రాక్టీస్) అలవాటు చేసుకునే క్రమంలో ఎన్నోసార్లుపడి దెబ్బలు తగిలినప్పుడు ఇలాగే విడవలూరు కానీ వావిళ్ళకు కానీ తీసుకొని వెళ్లేవారు నాన్న. అంతా కాలినడకే. ఇంకా మా నానమ్మ తాతయ్య వాళ్లకు ఏవైనా మందులు అవసరమైతే విడవలూరుకు కానీ వావిళ్ళకు కానీ కాలినడకన వెళ్లి మందులు తెచ్చి ఇచ్చేవారు. ఇలా నాన్న ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు.

ప్రభుత్వం ఇచ్చే చక్రాల సైకిల్ కోసం నాన్న ప్రయత్నం – సఫలం:

ఇంకొక విషయం ఏమంటే వేదాయపాలెంలో ఉన్నప్పుడు నాన్న నాకోసం ప్రభుత్వం (గవర్నమెంట్) వాళ్లు ఇచ్చే మూడు చక్రాల సైకిల్ కోసం అప్లై చేశారు. మూడు చక్రాల సైకిల్ వచ్చింది వేదయపాలెంలో ఉండగానే. కానీ అందులో నాన్న ఎత్తి కూర్చోపెడితేనే నేను దానిని కొంతవరకే తిప్పగలిగాను. అది అలవాటు అవడం కోసం ప్రయత్నం కూడా చేశాను. కొన్ని కొన్నిసార్లు నాన్న వెనుక నుంచి నెట్టేవారు. అది నడపడానికి నా శక్తి సరిపోలేదు. ప్రయత్నం అయితే చేశాను. అప్పుడే నాకు గవర్నమెంట్ వాళ్లు ఇచ్చేమూడు చక్రాల సైకిల్ ఉపయోగం లేదని అర్థమైనది. ఈ విషయాలన్నీశ్రీలతతో పంచుకొనే దాన్ని. అప్పుడు శ్రీలత “మీ నాన్న చాలా గొప్పవారు, నీ కోసం చాలా చేస్తున్నారు, ఇలాంటి నాన్న ఎవరికి ఉండరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అక్కా” అని నాన్నను చాలా మెచ్చుకునేది.

శ్రీలత నా బిజినెస్ పెంచడం కోసం చేసిన ప్రయత్నం:

శ్రీలత విక్రమ సింహపురి యూనివర్సిటీలో అధ్యాపకురాలు కదా, ఒకసారి తన విద్యార్థులను మా ఇంటికి తీసుకుని వచ్చి నన్ను వాళ్లకు పరిచయం చేసి నేను చేతి ఎంబ్రాయిడరీ చాలా బాగా చేస్తాననీ, వాళ్లకు తెలిసిన వాళ్లకు ఎవరికైనా చెప్పి ఆర్డర్లు ఇప్పించమని వాళ్లను కోరింది. వాళ్లు నా పనితనాన్ని చూసి మీరు టీవీ చూసి ఇంత నేర్చుకున్నారా అని ఆశ్చర్యపోతూ మిమ్మల్నిచూసి చాలా నేర్చుకోవాలి అని అన్నారు. శ్రీలత వాళ్ళ అమ్మ కూడా నాన్న ఇంట్లోలేనప్పుడు ఎప్పుడైనా నాకు ఏదైనా అవసరమైతే వచ్చి సహాయం చేసేది.

అమృత అక్క పరిచయం:

ఇంకా ఎంబ్రాయిడరీ విషయానికి వస్తే రోహిణి అమృత అనే ఆమెను పరిచయం చేసింది. ఆమె కూడా నాకు ఎంబ్రాయిడరీ చేయడానికి ఒక చీర ఆర్డర్ ఇచ్చింది. ఇంకా ఏమంటే ఆ అమృత గారు గుడ్డతో హ్యాండ్ బ్యాగులు తయారు చేయించి అమ్మేవారు. నాకు హ్యాండ్ బ్యాగులు కొన్ని ఇచ్చి మారు వ్యాపారానికి అమ్మమని ఇచ్చింది. అది కూడా సైడ్ బిజినెస్గా ఉంటుందని చాలా ప్రయత్నం చేశాను. ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. దాన్ని సద్వినియోగపరచుకోవాలి అన్నదే నా ధ్యేయం. ప్రయత్నం చేశాను శక్తివంచన లేకుండా, కానీ ఫలితం అన్నది కొంత వరకే దక్కింది. ప్రయత్నం మన వంతు ఫలితం అన్నది దైవాధీనం అని తెలుసుకున్నాను. ఫలితం దక్కలేదని నిరుత్సాహపడకూడదు. పడలేదు కూడా. ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా అని.

పూలు అమ్ముకునే రత్నమ్మ ద్వారా ఉమా ఆంటీ పరిచయం:

అంతేకాదు మూలపేటలో ఉన్నప్పుడు ఒక పూలు అమ్ముకునే అమ్మాయి ద్వారా నెల్లూరులో పేరుగాంచిన కెవిఆర్ పెట్రోల్ బంకు వాళ్ళ బంధువులు ఒకరు ఉమా ఆంటీ అనే ఆమె పరిచయమై ఎంబ్రాయిడరీ ఆర్డర్ ఇచ్చింది రెండుసార్లు. వాళ్లు ఎవరిళ్లకు రారట. కానీ నా మంచితనము వలన ఏమో తెలియదు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ పూర్తిచేసిన తర్వాత ఆమె స్వయంగా కారులో వచ్చి నాకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి తను చేయించుకున్న చీర తీసుకొని వెళ్ళింది. అప్పుడు ఆమె కూడా నాన్న ఎంత గొప్పవారు అని అనేది. ప్రతి ఒక్కరూ నాన్నను మెచ్చుకునేవారే. ప్రతి ఒక్కరూ నన్ను అదృష్టవంతురాలిని అనేవారు. ఇంకా ఇలా వచ్చిన ఆర్డర్లు చేసుకుంటూ మళ్ళీ టీవీలో సఖి ప్రోగ్రాంలో వారానికి ఒక ఎపిసోడ్‌లో శోభారాణి మేడం నేర్పించే కొత్త కొత్త డిజైన్లు చూసి నేర్చుకుంటూ ఆమెకు ఫోన్లు చేస్తూ నాకేమన్నాసందేహాలు ఉంటే తీర్చుకుంటూ నా పనిని కొనసాగించాను.

శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు, శ్రీ అవధానం రఘుకుమార్ గారు, శ్రీమతి లలిత గారితో

శోభారాణి మేడం-నా ఆహ్వానం:

శోభారాణి మేడం నీవు నన్ను టీవీలో చూస్తున్నావు నేను నిన్ను చూడలేదు. ప్రస్తుతం మనం ఫోన్లో మాత్రమే మాట్లాడుకుంటున్నాం, డైరెక్ట్‌గా నిన్ను కలవాలి, నేను నెల్లూరు వస్తాను అని చెప్పడం ప్రారంభించింది. అప్పుడు నాకు పట్టలేని ఆనందం. టీవీలో ఎంబ్రాయిడరీ నేర్పించే మేడం ఇంటికి వస్తున్నారు అంటే ఎంత ఆనందపడిపోయానో చెప్పలేను. ఇంకా చెప్పాలంటే ఆమె నా జీవితానికి దారి చూపించిన మార్గదర్శి కదా, ఆమె వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆమెకు ఏమీ మర్యాదలు చేయాలి ఇవే ఆలోచనలు. శ్రీలతకు చెప్పాను ఆమెను ఎలా రిసీవ్ చేసుకుందాం. నువ్వు వస్తావా నాకు సహాయంగా అని అడిగాను శ్రీలతను. అలాగే మేము వెళ్లి రిసీవ్ చేసుకుని తీసుకొని వస్తాం అంది. ఆ మాట నాకు కొండంత సంతోషాన్నిఇచ్చింది. అప్పట్లోమా ఇల్లు ఒక సన్నటి వీధిలో ఉండేది. కార్లు రావు. రోడ్డుమీద ఆగి నడుచుకుంటూ రావాలి మా ఇంటికి. ఆటో అంటే అతి కష్టం మీద వస్తుంది. ఆమె కారులో వస్తుందో ఆటోలో వస్తుందో నాకు తెలియదు. వస్తాను అని చెప్పగానే నాకు ఇన్ని ఆలోచనలు. పైఇబ్బంది కారణంగానే టెన్షన్ పడ్డాను. ఆమెను ఇంటికి ఎలా తీసుకురావాలి అని టెన్షన్ పడ్డాను. కానీ ఆ మేడం వస్తే నాకు చాలా సంతోషం కదా. నేను పడుతున్న శ్రమకు గుర్తింపు. ఇంకా ఏమంటే ఆ మేడం ఫలానా రోజు వస్తాను అని రెండు రోజులు ముందుగా ఫోన్ చేసి చెప్పమని చెప్పాను. ఇక ఆమె ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ ఎంత ఇలాంటి ఆలోచనలు ఉన్నా నా పని ఆపను. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూనే ఉండేదాన్ని. నా శరీరం సహకరించినంత వరకు. అప్పుడు బాగా కష్టపడేదాన్ని. అప్పుడు డాక్టర్ చెప్పిన కష్టేఫలి అన్న మాటను ఆచరణలో పెట్టడం మరచిపోలేదు. ఎప్పటికీ మరిచిపోను కూడా.

తిరుపతి బర్డ్స్ హాస్పిటల్:

నా చిన్నతనంలో తిరుపతిలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి తిరుపతి బర్డ్స్ హాస్పిటల్‌లో బూట్ల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయికి రెండు చేతులు లేవు. కృత్రిమ చేతులు పెట్టి ఆ చేతులకు పెన్ అమర్చి ఆ అమ్మాయి చేత రాయడం ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మా నాన్న ఆ అమ్మాయి దగ్గరకు నన్ను ఎత్తుకొని వెళ్లి ఆ అమ్మాయి రాసే రైటింగ్ చూపించారు. అసలు నమ్మశక్యంగా లేదు. అంత అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి చేతివ్రాత. నా ఊహ కందలేదు. ఆ అమ్మాయి రాయడం వెనక ఉన్న కృషి, శ్రమ పట్టుదల ఏకాగ్రత ఎంత గొప్పగా ఉంది. ఇదే నేర్చుకోవాలి నాకు అనిపించింది. కానీ నా నడక ప్రాక్టీస్‌లో నా శరీర శక్తికి ఆ బూట్ల బరువుకు సరిపడలేదు. మోయలేకపోయాను. ఏం చేస్తాం నా దురదృష్టం. అందరికీ అన్నిఆ భగవంతుడు ఇస్తే భగవంతుని తలుచుకునే వాళ్లు ఉండరేమో. ఇందుకే ఇలా భేదాలు పెడతాడేమో. ఏది ఏమైనా పూర్వజన్మ కృతం అని సరి పెట్టుకోవాల్సిందే అని నాకు అనిపించింది.

నా మనసుకు తోచిన విషయాలు:

అన్ని సమస్యలు పూర్వజన్మ కృతం అని సరిపెట్టుకోకూడదు. నా జీవితంలో అలా జరిగింది అంతే. ప్రతి ఒక్కరి జన్మకు అర్థం పరమార్థం ఏదో ఒకటి వాళ్ల వాళ్ల జీవితాలను సన్మార్గం దిశగా పయనిస్తూ వాళ్ల ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి కనీసం మన పక్క వారికి ఎంతో కొంత మేలు చేయాలి అన్న ఆశతో జీవించాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానిని సాధన చేస్తూ తనను తాను నిరూపించుకుంటూ అలాగే పక్కవారికి కొంతవరకైనా సహాయపడగలగాలి. ఇదే జీవిత పరమార్థం. ఈ విధంగా నేను కొంత వరకైనా చేయగలిగానని చెప్పగలను. ఆ వివరాలు ముందు ముందు రాస్తాను. అక్కడ మూలపేటలో ఆ ఇంట్లోఉ న్నన్నిరోజులు శ్రీలతతో పైవిధంగా అనుభవాలు చెప్తూ ఉండేదాన్ని. ఆ అమ్మాయి కూడా నాకు ఎంబ్రాయిడరీ ఆర్డర్లుఇ ప్పించడానికి చాలా ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నన్ని రోజులు భగవంతుడి దయవల్ల నాకు ఎప్పుడూ ఆర్డర్లు వచ్చేవి. టీవీలో చూపించే కొత్త కొత్త డిజైన్లు శాంపిల్స్ వేసుకుంటూ ఇటు వచ్చిన ఆర్డర్లు చేసుకుంటూ ఎప్పుడు బిజీగానే ఉండేదాన్ని. ఇక మూలపేట నుంచి పరమేశ్వరి నగర్‌లో చిన్నాన్న కోన్న ఇంటికి వచ్చే ప్రయత్నాలు దాదాపు పూర్తయినాయి.

కొత్త ఇంటి గృహప్రవేశం:

అది 2010 జూన్ అనుకుంటా పెద్ద చిన్నాన్న కొన్న ఇంటికి వచ్చేసాం. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత చిన్నాన్న మా కోసం కొన్న సొంత ఇంటికి వచ్చినందుకు నాన్నకు నాకు చాలా ఆనందం కలిగింది. మేము ఇంటికి రావడానికి కావలసిన సదుపాయాలు అన్నిచిన్నత్త భర్త మామయ్య చిన్నత్త చాలా సహాయం చేశారు. ఎంత సంతోషం అనిపించినా చిన్నత్త మామయ్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరమయ్యామన్న బాధ ఉండనే ఉండింది. అక్కడ ఉన్నాము కాబట్టి నాన్న ప్రతిరోజు చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక గంట కూర్చొని వచ్చేవారు. అప్పుడు ఆ ఆనందమే వేరు. బంధుత్వాలు ఆప్యాయత అనుబంధం రక్త సంబంధం యొక్క గొప్పతనం అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. నేను రక్తసంబంధం విలువ గురించి రాయడంలో ఉద్దేశం ఏమంటే బంధాలకి అనుబంధాలకి విలువ ఇవ్వాలి. అది అయిన వాళ్ళు అయినా గురువులైన స్నేహితులైన ఎవరికైనా సరే వాటిని కాపాడుకుంటూ మనం మనుగడ సాగించాలి. ఇది నా అభిప్రాయం. కొత్త ఇంట్లో చేరాక చుట్టుపక్కల కొత్తవాళ్లు కొత్త పరిచయాలు చాలా బాగా ఉండిన్నాయి. కానీ చాలా దిగులేసింది. నాది ఒకటే ఆలోచన కదా! అదేమంటే ఇక్కడికి వచ్చినాక అందరూ కొత్త వాళ్లునా ఎంబ్రాయిడరీ బిజినెస్‌ను ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేయరు, ఆర్డర్లు వస్తాయో లేదో అనే సందేహం, భయం కూడా. కానీ అంతకుముందే మూలపేటలో ఉన్నప్పుడు రోహిణి తరఫున వచ్చిన పుష్ప ఆంటీ ఇచ్చిన చీరలు ఇంకొక అమృత అక్క అనే ఆమె ఇచ్చినవి పూర్తికాలేదు ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడికి వచ్చిన తరువాత ఇల్లు సర్దుకొని అవి కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ నేను అందరికీ కొత్త కదా నా వర్క్ అందరూ బాగుంది అన్నారు. అది చాలా పెద్ద వర్క్స్ కాబట్టి చాలా రోజులు పట్టింది. విసుకు లేకుండా ఒకటే ఇన్నిరోజులు కుడుతున్నావ్ నీ ఓపికకు మెచ్చుకోవచ్చు అనేవాళ్ళు ఇక్కడివాళ్లు. అప్పుడు నేను చెప్పేదాన్నిమొదలుపెట్టిన పనిని పూర్తిచేయాలి అన్న సంకల్పమే నా శక్తినా బలం అని. నిజంగా నా వర్క్ బాగా ఉంది కాబట్టే టీవీలో టెలికాస్ట్ చేశారు. మూలపేటలో ఉన్నప్పుడు అన్ని ఆర్డర్లు వచ్చేవి. ఇది 5 అంతస్తుల అపార్ట్మెంట్.

అపార్ట్మెంట్‌లో పద్మజతో పరిచయం:

మా పైఫ్లోర్‌లో పద్మజ అనే ఒక అమ్మాయి నాకు బాగా దగ్గరై నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూసి బాగా ఇష్టపడి నాకు చాలా వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ అమ్మాయి నన్ను బాగా సపోర్ట్ చేసింది. పద్మజ అనే అమ్మాయి నాకు చాలా అంటే అన్నిరకాలుగా సపోర్ట్‌గా ఉండేది. మా నాన్న కూడా అమ్మాయి అంటే చాలా అభిమానించేవారు. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు. వాళ్ల పెద్ద వదిన చిన్న వదిన కూడా బాగా దగ్గరయ్యారు. నేను చేసే పనికి నాకు చాలా విలువ ఇచ్చేవాళ్ళు.

SNB Towers అపార్ట్మెంట్ వాసుల సహాయ సహకారాలు:

ఇక్కడ అందరూ నాకు సపోర్ట్ గానే ఉన్నారు. నాన్నకు కూడా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు ఏమి కావాలన్నా ఎవరో ఒకరు తెచ్చిపెట్టేవాళ్ళు. అలా అందరూ సహాయంగా ఉంటున్నారు. ఉన్న చీరలను కుట్టుకుంటూ కొత్త ఆర్డర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎందుకో ఇక్కడ పెద్దగా ఈ వర్క్స్ కుట్టించుకోవడానికి ముందుకు రాలేదు. పద్మజ మాత్రం చాలా ఇష్టపడేది. కొత్త వర్క్ ఏముందని అడిగి మరీ కుట్టించుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ పరంగా ఇక్కడ పద్మజ మాత్రమే ఉత్సాహం చూపించింది.

రోహిణి ద్వారా పరిచయమైన శ్రీదేవి ఆంటీ:

ఇంకా రోహిణి ద్వారా పరిచయమైన శ్రీదేవి గారు (రిటైర్డ్ లెక్చరర్, నేను ఆంటీ అని పిలిచే దాన్ని) రెండు మూడు చీరలు ఆర్డర్ ఇచ్చారు కుట్టమని. ఈ ఆంటీకి కూడా నా వర్క్ బాగా నచ్చింది. నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. ఇలా వంట ఇంటి పనులు చేసుకుంటూ ఆర్డర్‌లో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ మళ్ళీ సఖి ప్రోగ్రాంలో ప్రతి రోజు వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ మళ్లీ వారానికి ఒకసారి వచ్చే కొత్త కొత్త ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూసి నేర్చుకుంటూ వాటిని మళ్ళీ ఒక గుడ్డ మీద కుడుతూ ఎప్పటికప్పుడు ఇంకా ఎంబ్రాయిడరీ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే శోభారాణి మేడంకు కాల్ చేసి నాకున్న డౌట్స్ అన్ని తెలుసుకుంటూ ఉండేదాన్ని. సమయానికి తగ్గట్టు అన్ని పనులు చేసుకునే దాన్ని.

పాత మట్టిబొమ్మలకు (దశావతారాలు) రంగులు వేయడం – నిరుపయోగమైన వస్తువులను కళాత్మకంగా తయారు చేయడం:-

ఈ పనులు చేసుకుంటూ మధ్యలో ఇంకో పని చేశాను. అదేమంటే ఆ చిన్నతనంలో తుమ్మగుంటలో నానమ్మ మేనత్తలిద్దరూ కలసి దసరాల అప్పుడు బొమ్మల కొలువు పెట్టేవారు. అప్పటి బొమ్మలు దశావతారాలు కృష్ణుడి బొమ్మలు ఇంకా చాలా బొమ్మలు ఒక అట్టపెట్టెలో భద్రపరిచి ఉండినవి. వాటిని తీసి చూడగా వాటికి రంగులు వెలిసిపోయి చాలా పాతవిగా ఉండినాయి. ఈ ఇంటికి రాగానే ఇల్లు సర్దుకొనే క్రమంలో నాన్న ఆయిల్ పెయింట్లు తెచ్చిఇవ్వగా నేను ఆ బొమ్మలకు చక్కగా రంగులద్ది కొత్త బొమ్మలుగా తయారు చేశాను. ఇంకా నిరుపయోగమైన వస్తువులతో అంటే పౌడర్ డబ్బాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, రంగు కాయితాలు టెంకాయ చీపురు పుల్లలు, కరెంటు టేపులు ఉపయోగించి ఫ్లవర్ వాజులు, అయిపోయిన పెళ్లి శుభలేఖలు చెంకీలు ఉపయోగించి అందంగా అలంకరించాను. ఇంకా పాడైపోయిన ఒక ఎర్రగడ్డలు తురుముకొది ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ధర్మకోల్ బాల్స్, టెంకాయ చీపురు పుల్లలు, రంగు కాగితాలు ఉపయోగించి అందమైన తులసి కోటను తయారు చేశాను. ఇవన్నీ సఖి ప్రోగ్రాంలో చూపించే సూచనలు సలహాలు చూసి తెలుసుకొని ఇలా తయారు చేశాను. ఇంట్లో పాతకాలం నాటి ఒక పెద్ద చెక్క బెంచి, రెండు చెక్క కుర్చీలు ఒక పట్టా కుర్చీ ఉన్నాయి. వీటన్నిటికీ నేనే స్వయంగా నాన్న సహాయంతో పెయింట్ వేశాను. పాత వస్తువులను కొత్తవిగా ఉపయోగకరంగా ఎలా తయారు చేయాలి, ఏ వస్తువు నిరుపయోగం కాదు ప్రతి ఒక్క దానిని పడేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు అన్న విషయాన్ని సఖి ప్రోగ్రాం ద్వారా నేర్చుకున్నాను. ఉద్యోగం చేయలేకపోయాను అన్న బాధ ఏదో ఒక మూల ఉన్నా దొరికిన పనిని సక్రమంగా చేయాలన్న తపన ఆరాటం నాలో ఎక్కువగా ఉండేది.

(ఇంకా ఉంది)

Exit mobile version