[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]


వేదాయపాలెం నుండి మూలపేటకు మారడం:
అప్పుడు చిన్నఅత్త వాళ్ళు నెల్లూరు మూలపేటలో కాపురం ఉండేవాళ్ళు. మమ్మల్ని మూలపేట వచ్చేయండి మేము దగ్గరగా ఉండి మీకు తోడుగా ఉంటాము అన్నారు. అప్పుడు అత్త వాళ్లే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఇల్లు చూశారు. ఇక వేదాయపాలెం నుంచి మూలా పేటకు మారిపోయాము 1995 ఆ ప్రాంతంలో. ఇక్కడికి వచ్చినా కూడా ఇంటి పనులు తోనే సరిపోయేది.
నాకే తెలియని నాలోని ప్రతిభ:
కానీ నా ఆలోచనల్లో ఎటువంటి మార్పులేదు. ఏదో చెయ్యాలి అన్న తపన. ఇంటి పనులన్నీచేసి పెట్టి ఖాళీ సమయంలో పక్కింటి వాళ్ళ దగ్గర వైరు బుట్టలు అల్లడం నేర్చుకున్నాను. ఊలుతో శాలువా అల్లడం నేర్చుకున్నాను. సంక్రాంతి పండగలకు పత్రికలో వచ్చే ముగ్గులను నేర్చుకొని ఒక పుస్తకం తయారుచేశాను.1997లో అనుకుంటా ఈటీవీలో ఒక నెల రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి లోపు ప్రోగ్రామ్స్ మధ్యలో స్వాతంత్రోద్యమం గురించి రోజుకు ఒకటి చొప్పున ఏదో ఒక ప్రశ్న అడిగి కాంపిటీషన్ పోస్ట్ కార్డులో సమాధానాలు రాసి పంపమని చెప్పేవారు. ఇంట్లో నా పని చేసుకుంటూ ప్రతిరోజు ప్రశ్న రాసుకొని కాంపిటీషన్ పోస్ట్ కార్డ్ నాన్న తెచ్చి ఇస్తే దాని మీద సమాధానం రాసి ఇస్తే ప్రతి రోజు నాన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి పోస్ట్ చేసేవారు. అప్పుడప్పుడు కొన్నిప్రశ్నలకు సమాధానం తెలియకపోతే చిన్న చిన్న పాఠశాలలకు వెళ్లి అక్కడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని నాన్న తెచ్చి ఇచ్చేవారు. అవి కూడా రాసి పంపేదాన్ని. మొత్తానికి నెల రోజులకు 30 ప్రశ్నలకు సమాధానాలు కరెక్టుగా రాసి పంపాను. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపాను కాబట్టి ఏదో ఒకటి బహుమతి వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. కానీ టీవీలో ప్రకటించినప్పుడు లక్కీ డ్రా లో గెలిచిన వాళ్ళ పేర్లలో నా పేరు లేదు.
నాకు వచ్చిన జాబులు:
పైగా ఏమైంది అంటే నాకు కొన్ని జాబులు వచ్చేవి. లక్షమందిలో గెలిచారు మీకు కెమెరా పంపిస్తాం లేదా ఇంకొకటి పంపిస్తాం వెయ్యి రూపాయలు కట్టాలి లేదా 500 కట్టాలి అంటూ స్టాంప్ లేకుండా చాలా జాబులు వచ్చాయి. జాబు వచ్చిన ప్రతిసారీ రెండు రూపాలో నాలుగు రూపాయలో కట్టవలసి వచ్చేది. నాన్న తపాలా శాఖ కు వెళ్లిమాకు ఈ జాబులు వస్తే తిప్పి పంపమని ఫిర్యాదు చేసి వచ్చారు. తరువాత ఈటీవీలో రామోజీ రావు గారు ఒక ప్రకటన చేశారు. మాకు రావలసిన మీరు పంపిన సమాధానాలు ఢిల్లీలోని కొన్నికంపెనీలు అక్రమంగా కొన్నారు. డబ్బు పంపమని జాబులు వస్తే మాకు ఫిర్యాదు చేయండి అని ప్రకటన చేశారు. ఆ ప్రకారంగా నేను పంపిన జాబులు ఈటీవీకి చేరలేదు. దేనికైనా అదృష్టం భగవదనుగ్రహం ఉండాలి అనిపించింది. ఏం చేయను ఏది ప్రయత్నించినా ఇలానే అవుతోంది.


పదవ తరగతి క్లాస్మేట్స్, ప్రస్తుతం
మూలపేట ఇళ్ళు మారడం:
మూలపేట లోనే చాలా ఇళ్లు మారాము. ఆ క్రమంలో మూలపేటలో లిటిల్ ఏంజెల్స్ పాఠశాల వీధిలో ఒక ఇంట్లో ఉండినాము. అప్పుడు నాకున్న కొద్ది పరిజ్ఞానంతో చిన్నపిల్లలకి ప్రైవేటు చెప్పాలని ప్రయత్నం చేశాను. ఒక బాబుని పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు. మేము ఉన్న ఇల్లు గల వాళ్ల అమ్మాయి ఆ బాబుని ఇంటిలోకి పంపించి తలుపు వేసింది. అసలే ఆ బాబు అల్లరి, ఎక్కువ మొండి చేస్తాడు. తలుపు వేసేసరికి భయపడి పెద్దగా ఏడుస్తూ ఇల్లంతా పరిగెత్తడం మొదలు పెట్టాడు. నాన్న నేను వాడిని పట్టలేక పోయాము. కుదురుగా కూర్చొనే లేదు. తలుపు తీసి బయటకు పంపి చేయాల్సివచ్చింది. తర్వాత ఇల్లు గల ఆమె నా కోసం చాలా ప్రయత్నం చేసింది. ఏ పాఠశాల పిల్లలు ఆ పాఠశాలకే ప్రైవేటుకు వెళ్తారు విడిగా రారు అని చెప్పారు. ప్రయత్నించి ప్రయత్నించి చేసేదిలేక ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాను. విధి వ్రాతను ఎవరు తప్పించగలరు.
నాన్నకు కంటి శస్త్ర చికిత్స:
ఆ తరువాత కొద్దిరోజులకు నాన్నకు కన్నుశస్త్రచికిత్స జరిగింది. అప్పుడు చిన్నత్త మామయ్య పెద్ద చిన్నాన్న వాళ్ళు సహాయం చేశారు. అప్పుడు నాన్నకు కన్నుశస్త్రచికిత్స చేసిన డాక్టర్ గారు రెండవ కన్నుశస్త్రచికిత్స చేసుకోవలసిన అవసరం లేదని చెప్పారు. అందుకని నాన్న రెండవ కన్ను చూపించుకోనే లేదు. ఇది అలా ఉండగా నాకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వంట చేయలేకపోతే చిన్న అత్త సహాయం చేసింది. తరువాత కొద్దిరోజులకు మూలపేట లోనే మళ్లీ ఇల్లు మారాము. ఈ ఇల్లు కూడా అత్త వాళ్లకు దగ్గరగానే ఉండేది. ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఏదో చేయాలన్న తపనలో ఎటువంటి మార్పులేదు. ఆరోగ్యం బాగున్నాబాగా లేకపోయినా ఇంటి పనులు ఎక్కువగా ఉన్నాఈ ఆలోచన మాత్రం వదిలే దాన్నికాదు. ఇంటి పనులు పూర్తిచేసుకున్నాక టీవీ సీరియల్స్, పాత సినిమాలు చూసేదాన్ని. కానీ ఏ మాత్రం తృప్తిలేదు. కొంచెం కూడా సంతోషం అనేదే లేదు. నేను చిన్నప్పుడు పోలియో చికిత్సకు సంబంధించిన బూట్ల కోసం మద్రాస్ వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నామని ఇదివరకు రాశాను కదా. అప్పుడు వాళ్ల అమ్మాయిల దగ్గర చేతితో కుట్టే ఎంబ్రాయిడరీలో ప్రాథమిక కుట్లు నేర్చుకొని ఉండినాను. ఆ ప్రకారంగా నాకు చేతి ఎంబ్రాయిడరీలో కాస్త పరిజ్ఞానం ఉంది.
నా దశ మారింది:
ఒక రోజు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఈటీవీ 2 లో మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ‘సఖి’ అను కార్యక్రమం వస్తోంది అందులో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్నారు నేర్చుకోవచ్చు కదా అని నాకు సూచన ఇచ్చారు. అంతే ఇక నాకు సంతోషం పట్టలేదు. కానీ ఒక పక్క భయం. టీవీలో కదా ఎంబ్రాయిడరీ చెప్పడం అది నేను అర్థం చేసుకోగలనో లేదో అని ఒక పక్క సందేహం తోనే గబగబా ఇంటి పనులు ముగించుకొని భోజనం చేసి రెండు గంటలకల్లా టీవీ ముందు కూర్చునేదాన్ని.
సఖి ప్రోగ్రాం:
సఖి కార్యక్రమం నాలుగు భాగాలు ఒక్కోభాగం ఒక్కోదానికి సంబంధించింది. సైకాలజిస్టులు ఫ్యాషన్ డిజైనర్స్, చిట్కాలు చెప్పే నిపుణులు, వైద్య సలహాలు ఇచ్చేవాళ్ళు ఇట్లా రకరకాలుగా సినిమా వాళ్ళతో సంబంధం లేకుండా అన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలు వచ్చేవి.
సఖి-చూడండి -చేయండి:
వాటిలో భాగమే ‘చూడండి. చేయండి’ అనే కార్యక్రమం. ‘చూడండి. చేయండి’ కార్యక్రమం వారంలో మూడు రోజులు వచ్చేది. ఒక వారం మాత్రం చేతి ఎంబ్రాయిడరీ ఇందులోనే నేర్పించేవారు. వారానికి ఒక కుట్టు నేర్పించేవారు. మిగతా రెండు రోజులలో చేతివృత్తులకు సంబంధించిన చీరల మీద బ్లాక్ ప్రింట్ రకరకాల రోజా పూలు తయారు చేయడం, గ్లాస్ పెయింటింగ్ చీరల మీద పెయింటింగ్ ఏంబోజ్ పెయింటింగ్ అద్దకం వేయడం నిరుపయోగమైన వస్తువులతో కళాత్మకమైన గృహాలంకరణ వస్తువులు తయారుచేయడం ఇలాంటివి ఎన్నో నేర్పించేవారు. నేను అన్నిచూశాను కానీ చేతితో కుట్టే ఎంబ్రాయిడరీ మాత్రమే ప్రయత్నించాను. మధు ఫ్యాషన్ డిజైనర్, ఎంబ్రాయిడరీకి సంబంధించి కొన్నిమెలకువలు చెప్పేవారు. పాత పట్టుచీరలను కొత్తవి గా ఎలా చేయాలో అద్భుతంగా చూపించేవారు. ఇలా సఖి కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు కదా. నేను పనిచేసి అలసిపోయి నిద్ర వస్తున్నా బలవంతంగా నిద్ర మేల్కొని అన్నికార్యక్రమాలు శ్రద్ధగా చూసేదాన్ని. తెలియని విషయాలు ఎన్నోతెలుసుకొని అర్థం చేసుకునే దాన్ని.
నాన్నకు రెండవ కంటి సమస్య:
ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత నాన్నకు శస్త్రచికిత్స చేయని కన్నునుంచి నీరు కారడం విపరీతమైన నొప్పి ప్రారంభమైనది. నాన్న తట్టుకోలేకపోయారు. నేనేమో బయటికి వెళ్లిఎవరినీ పిలవలేని పరిస్థితి కదా. అప్పుడు మాకు ఫోన్ కూడా లేదు. నాన్ననే మా ఇంటి యజమానులు పైన ఉంటే అక్కడికి చిన్నగా అర్ధరాత్రి వెళ్లి వాళ్లను లేపి వాళ్ల ఫోన్ నుంచి చిన్నత్త వాళ్లకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి మామయ్య వచ్చి, దైర్యంగా ఉండండి ఏం కాదు తడిగుడ్డ పెట్టుకోండి, ఉదయం ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను అన్నారు. తెల్లవారాక నాన్నను మామయ్య ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వెంటనే శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. నాన్నకు చూపు వచ్చింది. అందరం చాలా సంతోషించాము.
మొట్ట మొదటిసారిగా కీప్యాడ్ ఫోన్ కొనడం:
ఆ రోజు రాత్రినాన్న కన్నునొప్పితో బాధ పడ్డారు కదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఫోన్ చేయడానికి ఫోన్ అవసరమవుతుందని పెద్ద చిన్నాన్న డబ్బులు ఇస్తే చిన్నత్త మామయ్య వాళ్ళు ఫోన్ కొని తెచ్చారు. అంతే నాకు సంతోషం పట్టలేదు. ఇక ఆ ఫోన్ నేను వాడడం ప్రారంభించాను.
మధు ఫ్యాషన్ డిజైనర్‌తో పరిచయం:
అప్పుడు సఖిలో కార్యక్రమాలు చేసే వాళ్ళ నంబర్లు కార్యక్రమం జరిగేటప్పుడు కింద వేసే వాళ్ళు. అందులో ఫ్యాషన్ డిజైనర్ మధు నంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి ఎంబ్రాయిడరీలో మెళకువలు అడిగి తెలుసుకునే దాన్ని.
శోభారాణి మేడం నంబర్ కోసం పోరాటం:
అలాగే ‘చూడండి చేయండి’ కార్యక్రమంలో వారానికి ఒకసారి వచ్చే చేతి ఎంబ్రాయిడరీ ఎపిసోడ్లో ఎంబ్రాయిడరీ చెప్పే శోభారాణి మేడం యొక్క నంబర్ కూడా వేసేవాళ్ళు. కానీ అది వేసి త్వరత్వరగా తీసేసే వాళ్ళు. చాలా రోజులు నేను రాసుకోలేక పోయాను. ఎలాగైనా సరే ఆమె నంబర్ తీసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నాను. రాసుకోలేక పోతున్నాను త్వరగా తీసేయడం వల్ల ఏం చేయాలో ఆలోచించాను. అదే ఈటీవీ 2 లో సాయంత్రం ప్రపంచ వింతలు విశేషాలు తెలిపే ఔరా అనే కార్యక్రమం వచ్చేది. దానికి కూడా నంబర్ వేసేవాళ్ళు. ఆ నంబర్ రాసుకోనీ వాళ్లకు ఫోన్ చేశాను. నాకు ‘సఖి’ కార్యక్రమం నెంబరు కావాలి అని అడిగాను. వాళ్లు నన్ను ‘సఖి’ కార్యక్రమానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. ఏ సమయంలో ఏ కార్యక్రమం వస్తుంది. అందులో ఎవరు వస్తారు అంటూ ప్రశ్నలు వేశారు. నేను అన్నిటికీ సరైన సమాధానాలు ఇచ్చాను. అప్పుడు వాళ్లు నాకు ‘సఖి’ కార్యక్రమానికి సంబంధించిన నంబర్ ఇచ్చారు. అంతే ‘సఖి’ కార్యక్రమానికి సంబంధించిన నా కార్యాలయానికి ఫోన్ చేశాను. అక్కడ కూడా వాళ్లు నేను ఏ విధంగా ‘సఖి’ కార్యక్రమం చూస్తున్నాను అందులో ఏ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి అందులో వచ్చేవాళ్ల పేర్లు అన్నిఅడిగారు. వాళ్ల ప్రశ్నలన్నిటికీ నేను సరైన సమాధానాలు ఇచ్చాను. అప్పుడు కానీ చేతి ఎంబ్రాయిడరీ చెప్పే శోభారాణి మేడం నంబర్ ఇవ్వలేదు. ఆ మేడం నెంబర్ తీసుకోవడానికి ఇలా అవస్థ పడ్డాను. ఎలాగైతేనేమి సాధించాను నంబర్. ప్రతి వారం ఎంబ్రాయిడరీ కార్యక్రమం అయిన వెంటనే శోభారాణి మేడంకు ఫోన్ చేసేదాన్ని. అలా ఆమెను పరిచయం చేసుకుని ప్రతి వారం ఆమె చెప్పే కుట్టుమెలకువలు ఫోన్లో అడిగి తెలుసుకునే దాన్ని. ఏ రోజుకారోజు సాయంత్రం కల్లా ఆమె చెప్పిన కుట్టు డిజైన్ ఒక గుడ్డ మీద కుట్టేదాన్ని.


నాన్న నా మెటీరియల్ కోసం పడ్డ శ్రమ:
ఒక్కొక్కసారి వాటికి సంబంధించిన దారాలు మిగతా వస్తుసామగ్రి ఇంట్లో లేకపోతే నాన్న మూలపేట నుంచి ఆటోలో గాంధీ బొమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి చిన్న బజారు, పెద్ద బజారు ఇంకా చాలా చోట్ల కాలినడకన తిరిగి తిరిగి తెచ్చి ఇచ్చేవారు. అన్ని విధాలా నాన్న నా ఎదుగుదలను ప్రోత్సహిస్తూ, నన్నుఒక మనిషిగా నిలబెట్టారు. ఏమి చేసినా నాన్న ఋణం నేను తీర్చుకోలేను.
ఎంబ్రాయిడరీ వ్యాపారం ప్రారంభించడం:
అలా కొంత అనుభవం వచ్చిన తర్వాత అందరికీ చెప్పిబయట వాళ్లకు చీరల మీద, బ్లౌజుల మీద డిజైన్లు కుట్టే వ్యాపారం మొదలు పెట్టాను. ఎలాగైతేనేమి అంతో ఇంతో సంపాదించడం మొదలు పెట్టాను. డిగ్రీఅయిపోయిన 10 సంవత్సరాల తర్వాత. వారానికొక కుట్టుకొత్త కొత్త డిజైన్లు నేర్పించేది శోభారాణి మేడం. ఆమెతో బాగా పరిచయం పెంచుకున్నాను. ఆమె నన్నుచాలా ప్రోత్సహించేది. ఆర్డర్లు కూడా బాగా వచ్చేవి.
‘సఖి’తో నా అనుభవం:
అప్పుడప్పుడు సఖి ఆఫీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఈ రోజు ఏమి ఏమి కార్యక్రమం వచ్చింది మేము రికార్డు రాయాలి కొంచెం చెప్పండి దయచేసి అని అడిగేవారు. అప్పుడు నాకు తెలియలేదు ఆ ప్రశ్న నేను సఖి కార్యక్రమం చూస్తున్నానో లేదో అని నన్నుపరీక్షించడానికి అడుగుతున్నారని. వాళ్లు అడిగిన ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు చెప్పేదాన్ని. అలా నేను వాళ్ల దృష్టిలో పడ్డాను.
తంజావూర్ పెయింటింగ్ ప్రాముఖ్యత (నేను తెలుసుకున్నంత వరకు):
ఇంకా ‘చూడండి. చేయండి’ లో తంజావూరు పెయింటింగ్ అద్భుతంగా నేర్పించేవారు. తంజావూరు పెయింటింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అది ఎంత కష్టమో అంత అద్భుతమైన కళ. చాలా అందమైన బొమ్మలు చూపించేవారు. దాని విలువ వేలల్లోఉంటుందని చెప్పేవారు.
ఇంకా ఎన్నో:
క్లేతో అందమైన ఆకృతులను నేర్పించేవారు. రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేయడం నేర్పించేవారు. ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళకు వితంతువులకు యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎద్దన పూడి సులోచనారాణి గారు సలహాలు సూచనలు ఇచ్చేవారు.
సంస్థల పరిచయం:
ఇంకా COWE (confederation of women’s entrepreneurs of India) అధినేత సౌదామిని గారు, ALEAP (association of lady entrepreneurs of India) వ్యవస్థాపకురాలు ప్రెసిడెంట్ అయిన రమాదేవి గారు వారి వారి సంస్థల కార్యకలాపాల గురించి వివరించేవారు. COWE కాని ALEAP కానీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితులలో ఉన్న స్త్రీల కోసం ఇంట్లోనే ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళునిలబడి సంపాదించకోవడానికి స్వయం ఉపాధిని కల్పిస్తాయి, ఈ సంస్థలు. ఉత్సాహవంతులైన స్త్రీలకు ఎవరికి దేని మీద శ్రద్ధ ఉందో అందులో శిక్షణ ఇచ్చివారికి కొంత ప్రభుత్వం నుంచి, మరికొంత బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించి వారికి కొంత మార్కెటింగ్ కూడా చూపిస్తారు. ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలనే మహిళలకు ఇది ఒక గొప్ప వరం.


సఖి కి జాబులు:
ఒకసారి సఖి కార్యక్రమం వాళ్ళు స్వశక్తితో ఎదిగిన వారి గురించి జాబులు రాయమని వాటిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతి ఇస్తామని ప్రకటన చేశారు. ఎంబ్రాయిడరీ చెప్పేశోభారాణి మేడం నా గురించి సఖికి జాబు రాయమని ప్రోత్సహించింది. ఎవరు ఏం పని చేస్తున్నారో వాటికి సంబంధించిన ఫోటోలు కూడా పంపమన్నారు అప్పుడు నా దగ్గర కీ ప్యాడ్ ఫోన్ మాత్రమే ఉండింది. చిన్నత్త చిన్న కుమారుడు కార్తీక్ వచ్చి తన ఫోన్‌తో నేను కుట్టిన ఎంబ్రాయిడరీ డిజైన్లను ఫోటోలు తీసి ప్రింట్ చేయించి నాకు తెచ్చిఇచ్చి ‘సఖి’కి పంపించుకో అక్కా అన్నాడు. నేను జాబు రాసి ఫోటోలు జతచేసి ఇవ్వగా నాన్న పోస్ట్ చేశారు. కొన్నిజాబులు ఎంపిక చేసి సఖి కార్యక్రమంలో చదివారు. ఆ క్రమంలో నా జాబు కూడా చదివారు. నేను కుట్టిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఫోటోలను సఖి కార్యక్రమంలో చూపించారు.
కాకినాడకు చెందిన సావిత్రి:
ఆ క్రమంలో కాకినాడ అనుకుంటా కాకినాడకు చెందిన సావిత్రి అనే చూపు లేని అమ్మాయి గురించి జాబు చదివారు. అమ్మాయి చదువుకొని కంప్యూటర్ కోర్స్ నిపుణత సాధించి వాళ్ళ అన్న పెట్టిన శిక్షణా కేంద్రంలో ఎంతోమందికి ఉచితంగా కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారని ఆ జాబు లోని సారాంశం. లక్కీ డ్రా లో అమ్మాయికి ప్రథమ బహుమతి వచ్చింది. లక్కీ డ్రా లో నాకు ఏ బహుమతి రాకపోయినా ఆ అమ్మాయికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి శుభాకాంక్షలు తెలపాలని అనుకున్నాను. ఆ ఆలోచన రాగానే ‘సఖి’ కార్యాలయానికి ఫోన్ చేసి సావిత్రి నెంబర్ కావాలి అని అడిగాను. నేను వాళ్లకు బాగా తెలుసు కాబట్టి నేను అడిగిన వెంటనే ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చారు. నెంబర్ దొరికిందే తడవుగా ఆ అమ్మాయికి ఫోన్ చేసాను. శుభాకాంక్షలు చెప్పి నీ గురించి ఈ కార్యక్రమంలో వచ్చిందని చెప్పగా ఆమె ఆశ్చర్యపోయింది. ఆ జాబు నేను రాయలేదు ఎవరు రాసి ఉంటారు అని ఆశ్చర్యపోయింది. నేను చూడలేదు ఆ కార్యక్రమానికి సంబంధించిన సీడీ కావాలి అని అడిగింది. నేను వెంటనే ‘సఖి’ కార్యక్రమానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చాను. అప్పుడు ఆ అమ్మాయి ‘సఖి’ కార్యాలయానికి ఫోన్ చేసి తన జీవిత కథకు సంబంధించి ప్రసారమైన సీడీ అడిగింది, వాళ్ళు ఇవ్వమన్నారు. అప్పుడు నన్ను అడిగి ఇప్పించమని కోరింది. అప్పుడు సఖి వాళ్లను ఎంతో బతిమాలి చూశాను. ససేమిరా వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వాళ్లు ఇవ్వరని చెప్పేసాను ఆ అమ్మాయికి. కాస్త నిరుత్సాహ పడింది.
సఖి వంట – ఇతర కార్యక్రమాలు:
ఇంకా సఖీ కార్యక్రమంలో రోజుకు ఒక వంట నేర్పించేవారు. నేను వాటిలో కొన్నికొన్నిచేసి నాన్నకు పెట్టేదాన్ని. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు ఆ కోర్సుకు సంబంధించి విద్య అర్హతలు కోర్సు కాలపరిమితి వాటి గురించి వివరిస్తూ, భోజన మర్యాదలు నేర్పించేది. సైకాలజిస్ట్ పద్మజ గారు స్త్రీలు కొన్నికుటుంబాలలో పడే ఇబ్బందుల గురించి వరకట్న సమస్యలు ఇంకా కుటుంబ సమస్యల గురించి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. చిన్న పిల్లల డాక్టర్ ఒకరు శిశు సంక్షేమం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పేవారు.
(ఇంకా ఉంది)
92916 35779
prasunasuram@gmail.com
1 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*