[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]
సుబ్బలక్ష్మి మేడం:
పాఠశాలలో సామాన్య శాస్త్రానికి సుబ్బలక్ష్మిమేడం గారు వచ్చి చెప్పేవారు. సుబ్బలక్ష్మి మేడం గారు నెల్లూరు బాలాజీ నగర్ నుంచి రాజుపాలెం పాఠశాలకు వచ్చేవారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు రోహిణి వాళ్ళ అమ్మానాన్న మేడం గారిని సంతోషంగా ఆహ్వానించి వస్త్రాదులతో గౌరవించారు. ఇంకా ఎవరు వచ్చినా ఏ సమయంలోనైనా వచ్చిన వారిని చాలా శ్రద్ధగా చూసేవారు. ఆ పుణ్యఫలం ఏమో గురువును సేవించిన భాగ్యం ఏమో ఆ ముగ్గురికి అంటే రోహిణికి అక్కకు తమ్ముడు కృష్ణకి చక్కనైన జీవితాలు ఏర్పాటయ్యాయి.
గురువు యొక్క ప్రాముఖ్యత:
తల్లి తండ్రి గురువు దైవం. తల్లి జన్మనిస్తే తండ్రి పెంచి పెద్ద చేస్తారు. అక్షర జ్ఞానంతో పాటు విద్యను వివేకాన్నినేర్పించేది గురువు. దేవుని పూజలో కానీ ఏదైనా ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో కానీ ప్రప్రథమంగా గురువునే ప్రార్థిస్తాము. వివిధ నీతి కథల ద్వారా జీవితాన్నిఎలా మలచుకోవాలో నేర్పించేది గురువు. ఈ ప్రపంచం అంటే పుస్తకం. పుస్తకాలు ఎలా చదవాలి ఎలా ముందుకెళ్లాలి దారి చూపి మార్గదర్శి గురువు. తల్లిదండ్రులు గురువును ఆచార్యదేవోభవ అని చెప్తారు అందుకే కాబోలు. గురువుకు సంబంధించిన ఈ వాక్యాలు నన్నుఈ స్థాయికి తీసుకువచ్చిన నా పాఠశాల కళాశాల గురువులందరికీ అంకితం.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గురువుని సేవించే భాగ్యం నా స్నేహితురాలికి కలిగింది.
తొమ్మిదవ తరగతి-హిందీ మాస్టర్ చిరు మందలింపు:
అప్పుడే పాఠశాలలో చేరడం కదా అప్పుడప్పుడే నేర్చుకోవడం కొత్తగా ఉండింది. పదవ తరగతికి వచ్చేసరికి కాస్త చదవడం నేర్చుకున్నాను.
నేను చదివిన విధానం:
హిందీ, ఆంగ్లం మిగతా అన్నిఅంశాలు బట్టీపట్టి చదివేదాన్ని. ఎందుకంటే నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందువల్ల బట్టీపట్టవలసి వచ్చింది. హిందీ బట్టీపట్టి కంఠస్థం చేసిన దాన్నిఒక పది సార్లు చూడకుండా రాసేదాన్ని. ఆంగ్లము బట్టిపట్టి కంఠస్థం చేసిన తర్వాత రాని ఆంగ్ల పదాలకు స్పెల్లింగ్ నేర్చుకొని ఒక్కొక్క సమాధానం పది సార్లు చూడకుండా రాసేదాన్ని. ఇలా కష్టపడి నేర్చుకున్నాను. నాకు జ్ఞాపకశక్తి పెరగడం కోసం నాన్న ఆయుర్వేద మందులను తెచ్చి తినిపించే వారు. ఇంకా అన్నిఅంశాల ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి ముఖ్యమైన ప్రశ్నలు రాయించుకొని తెచ్చిఇచ్చేవారు నాన్న. నేను ఎక్కువ శాతం అవే కంఠస్థం చేసేదాన్ని. ఒక్కొక్క సబ్జెక్టులలో 15 – 20 కంటే ఎక్కువ సమాధానాలు ఉండేవికావు, పదవ తరగతిలో తెలుగులో సాధారణ వ్యాసం ఒకటి రాయాల్సిఉంటుంది. అది మాత్రం గ్రంథాలయాలు అనే వ్యాసం మాత్రమే నేర్చుకుని ఉండినాను.
పదవ తరగతి-సెలవుల్లో పరీక్షలకు సిద్ధం కావడం:
అంతలో సంవత్సర పరీక్షలకు చదువుకోడానికి సెలవులు ఇచ్చారు. అప్పుడు రాజుపాలెం నుంచి నెల్లూరు వేదాయపాలెం సొంత ఇంటికి వెళ్లిపోయాము. నాన్న నేను అక్కడ నానమ్మ తాతయ్య వాళ్లతో ఉండిపోయాము. నేను అన్నిఅంశాలు నాకు వచ్చిన వరకు ముందు కంఠస్థం చేసిన వాటిని మళ్లీ చదివాను. నేర్చుకున్న అంతవరకు అన్నిక్షుణ్ణంగా నేర్చుకున్నాను. తాతయ్య అప్పుడప్పుడు ఆంగ్ల వ్యాకరణము ఆంగ్లం చదవడం నాకు తెలియనివి కొంచెం నేర్పించేవారు. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నా శాయశక్తులా నేర్చుకున్నాను.
పదవ తరగతి పరీక్షలు-తృతీయ శ్రేణిలోఉత్తీర్ణత:
అంతలో పదవ తరగతి పరీక్షలు రానే వచ్చాయి. పరీక్షలకు నెల్లూరు వేదాయపాలెం నుంచి రాజుపాలానికి రావలసి వచ్చింది. మా ఇంటి నుంచి వేదాయపాలెం రైల్వేస్టేషన్ కొంచెం దగ్గర. మా ఇంటికి వెనక ఒక స్థలం ఆ తర్వాత రైల్వేగేటు రైలు పట్టాలు ఉండేవి. మా ఇంటి నుంచి బస్టాప్‌కు కొంత దూరం నడవాలి. నాన్న ఇంటి నుంచి బస్ స్టాప్‌కు రోజు ఎత్తుకొని తీసుకుని వచ్చేవారు. ఒకరోజు వేదాయపాలెం నుంచి రాజుపాలానికి వచ్చేసరికి పరీక్షాసమయం దగ్గర పడింది. అప్పుడు బస్సు దిగి నాన్న నన్ను ఎత్తుకొని పాఠశాలలోకి పరుగెడుతుంటే నా ఉపాధ్యాయులు గారు “నిదానంగా రండి మీ అమ్మాయికి కొంచెం ఎక్కువ సమయం ఇస్తాము” అని అన్నారు. అప్పుడు నాన్న, నేను చాలా సంతోషించాము. తెలుగు పరీక్ష రోజు పద్యభాగంలోని పద్యాలు గద్యభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు వ్యాకరణం నాకు తెలిసిన వరకు రాశాను. ఆ తర్వాత సాధారణ వ్యాసం రాయవలసి ఉంది. మూడు వ్యాసాలు ఇచ్చిఅందులో ఒకటి ఎంపిక చేసుకొని రాయమని వుంది ప్రశ్నాపత్రంలో. సాధారణ వ్యాసం గ్రంథాలయం ఒకటే నేర్చుకుని ఉండి నాను. ఇంకేమీ రావు. ప్రశ్నాపత్రంలో నేమో పుస్తక పఠనం గురించి రాయమని ఉంది. మిగతా రెండు నాకు అసలు రావు. తెలుగు సార్ ఏదీ వదలకుండా రాయమన్నారు. రాయవలసిన అన్నిప్రశ్నలకు సమాధానాలు కొంచమైనా రాస్తే మార్కులు వస్తాయి అని చెప్పారు. అప్పటివరకు నేను ప్రతి ఒక్కటి కంఠస్థం చేసి నేర్చుకునే రాసేదాన్నికానీ సొంతంగా రాయడం అలవాటు కాలేదు. మొట్టమొదటిసారిగా తెలుగు పరీక్ష నాడు పుస్తక పఠనం గురించి రాసే ప్రయత్నం చేశాను. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం వివేకం పెరుగుతుంది కొంచెం రాసి మిగతాదంతా నేను నేర్చుకున్న గ్రంథాలయాల గురించి వ్యాసం రాశాను. పరీక్ష రాసి బయటకు వచ్చిబస్ స్టాప్ దగ్గర బస్ కోసం కూర్చుని ఉంటే తెలుగు సార్ వచ్చారు. పరీక్ష ఎలా రాశావు అమ్మ అని అడిగారు. అప్పుడు ముందుగా పుస్తక పఠనం గురించి పైవిధంగా రాశాను మిగతాదంతా గ్రంథాలయం గురించి రాశాను అని చెప్పాను. సార్ ఓకే అన్నారు. ఇంగ్లీష్ ఇంకా మిగతా సబ్జెక్టులలో ఫిజికల్ సైన్స్ కన్నా నాచురల్ సైన్స్ బాగా చదివేదాన్ని. కానీ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ కన్నా నాచురల్ సైన్స్ ప్రశ్నాపత్రం చాలా కష్టంగా వచ్చింది. ఫిజికల్ సైన్స్ బాగా రాసి నేచురల్ సైన్స్ కొంచెం కష్టంగా రాశాను. అప్పుడు నాచురల్ సైన్స్ చెప్పే సుబ్బలక్ష్మిమేడంకి నా మీద కాస్త కోపం వచ్చింది. ఏమి చేయను, నాచురల్ సైన్స్‌లో నాకు వచ్చింది మాత్రమే రాయగలిగాను. గణితము సబ్జెక్టుకు శ్రీధర్ సార్ మొదట్లో వచ్చేవారు. ఆ సార్ తరగతికి వస్తుంటే అందరికీ చాలా భయం. అయితే లెక్కలు ఆ సార్ చెప్తే చాలా బాగా అర్థమయ్యేవి. తరువాత శ్రీధర్ సార్‌కు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి వచ్చివేరే చోటికి బదిలీ కావడంతో వీరి స్థానంలో వెంకటేశ్వరరావు సార్ వచ్చారు. వెంకటేశ్వర రావు సార్ గణితములో మాత్రికలు చెప్తే బాగా అర్థమయ్యేవి. నేను మాత్రికలు బాగా చేసే దాన్నిఅప్పట్లో. గణితం పరీక్షలో నేను బాగా చేసింది మాత్రికలే. సాంఘిక శాస్త్రానికి శకుంతల మేడం వచ్చేవారు. సాంఘిక శాస్త్రం బాగా చదివేదాన్నికానీ ప్రపంచ దేశ చిత్ర పటాలలో గుర్తుపేట్టడం నాకు కష్టం. పరీక్షల్లో చిత్రపటాలు గుర్తుపేట్టడం తప్ప మిగతా అంతా బాగా రాశాను. 1989 లో పదవ తరగతి తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాను. జరీనా పాఠశాలకి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. రోహిణి కూడా పాఠశాలకి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
పరీక్షలు అయిపోయాయి.
పదవ తరగతి పరీక్షలు అయిపోయాక నానమ్మ తాతయ్యలతో మేము – రెండవ చిన్నాన్న కుటుంబం:
అప్పుడు వేదాయపాలెంలో నానమ్మ తాతయ్య వాళ్లతో ఉన్నాము. మా రెండవ చిన్నాన్న వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ అత్తగారింట్లో బాడుగకు ఉండేవారు. రెండవ చిన్నాన్నకు ముగ్గురు అమ్మాయిలు. ఆ ముగ్గురు నాకు చెల్లెళ్ళు. ముగ్గురు అమ్మాయిలు తరచూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళలో పెద్ద అమ్మాయి పేరు భార్గవి. వాళ్ళ పాఠశాలలో పూసలతో పర్సులు అల్లడం నేర్పించారని నాకు దానికి సంబంధించి ఒక చిన్న కిటుకు నేర్పించింది, తానే పూసలు వైరు కొనుక్కొని తెచ్చింది. అప్పుడు అది చిన్నపిల్ల, ఏడవ తరగతి చదువుతోంది. నేను భార్గవి చెప్పిన కిటుకు ఆధారం చేసుకొని ఒక పర్సు అల్లాను.
నేను పనికిరాని వస్తువులతో గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం:
ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గర ఖాళీ అయిన కొబ్బరినూనె సీసాతో పైనాపిల్ ఇంకా గొడుగు ఫ్లవర్‌వాజులు తయారుచేయడం నేర్చుకున్నాను. ఫ్లవర్‌వాజులు చేసి ఇంట్లో అద్దాల అలమారాలో అందంగా అమర్చాను, నానమ్మ తాతయ్య వాళ్లు వాటిని చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు. ఫ్లవర్‌వాజులు అవి మా అత్త వాళ్ళకి పెద్ద చిన్నన్నా వాళ్ళకి కూడా చేసి ఇచ్చాను.
పేపర్-ముగ్గులు-పదవినోదం:
ఇంకా పేపర్లో వచ్చే ముగ్గులు చూసి నోటుపుస్తకంలో వేయడం నేర్చుకున్నాను. ఇంకా పేపర్లో వచ్చే పదవినోదం పజిల్స్ పూరించే ప్రయత్నం చేసేదాన్ని.
నన్ను కళాశాలలో చేర్చే ప్రయత్నాలు -విమర్శలు:
ఇంక నాన్న నన్నుకళాశాలలో చేర్చడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంక విమర్శలు మొదలయ్యాయి.
నడవలేని పిల్ల దానిని ఎందుకు కష్టపడి చదివించడం. అది చదివి ఎవరిని ఉద్ధరించాలి. అంత అన్నం పెడితే సరిపోతుంది కదా అన్న మాటలు బయట వాళ్లు నానమ్మ తాతయ్య లతో చెప్పిబాధ పెట్టేవాళ్ళు. నానమ్మ తాతయ్య వాళ్లు కానీ నాన్న గాని ఆ మాటలు ఏమి పట్టించుకోలేదు. నాన్నకు నన్ను బాగా చదివించాలని ఆశ. నాకు చదువుకోవాలన్న ఆసక్తి బలంగా ఉండింది. అప్పుడు మేము వేదాయపాలెం సొంత ఇంట్లో నానమ్మ తాతయ్య లతో ఉండేవాళ్ళం కదా. అప్పుడు మా మూడో చిన్నాన్న ఇంట్లో టీవీ కొనుక్కొచ్చి పెట్టారు. అప్పుడు టీవీలో హిందీలో మహాభారతం వచ్చేది. ఇంకా పంచతంత్రం కథలు కూడా వచ్చేవి. తాతయ్యకి టీవీ ఎక్కువసేపు పెట్టకూడదు. తలనొప్పిఅని చెప్పేవారు. కానీ టీవీలో వచ్చే మహాభారతం మాత్రం నానమ్మ తాతయ్య వాళ్లు చూసేవాళ్ళు. వాళ్లతో పాటు నేను నాన్న కూడా చూసే వాళ్ళం. నానమ్మ సాయంత్రం ఏడు గంటలకు దూరదర్శన్ చానల్లో రెండు సీరియల్స్ చూసేది. అప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి నేను కూడా చూసే దాన్ని. అలా అలవాటైపోయింది. ఇదంతా రాయడానికి కారణం ఉంది. అది ముందు ముందు వస్తుంది.
నాన్న నిర్ణయం -సర్వోదయ కాలేజ్:
నాన్న నన్ను కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్చడానికి సర్వోదయ కళాశాల అయితే బాగుంటుంది అక్కడ బాగా అందరూ అధ్యాపకులు బాగా చెప్తారని అని తెలుసుకుని అక్కడే చేర్చాలని పట్టుపట్టారు నాన్న. అక్కడ వద్దని కొంతమంది అడ్డుచెప్పగా నాన్న పట్టించుకోలేదు. నానమ్మ తాతయ్య వాళ్లు కూడా నన్నుసర్వోదయ కళాశాల లోనే చేర్చమన్నారు. అంతేకాదు నాన్న నన్నువేదాయపాలెం నుంచి బస్సులో ఎత్తుకొని తీసుకుని రావడానికి సర్వోదయ కళాశాల వీలుగా ఉంటుందని నాన్న ఆలోచన. నాకు చదవడానికి వీలుగా ఉంటుందని హెచ్.ఇ.సి గ్రూపు తీసుకున్నాను. నాన్నకు కూడా నేను ఇదే చదవాలనే ఇష్టం.
నా కళాశాల జీవితం:
కళాశాల ప్రారంభమైనది కళాశాలకు రావడం ప్రారంభించాను. తరగతులు మొదలయ్యాయి. కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు. కొత్త అధ్యాపకులు. అంతా కొత్త కొత్తగా ఉండింది. రోజు కళాశాలకు రావడం పాఠాలు వినడం చదువుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉండింది. తెలుగు సబ్జెక్టు శివరామ ప్రసాద్ సార్ గిరిజా మేడం ఇంగ్లీష్ కు ఆరోగ్యస్వామి సార్ నాగరాజు సార్ చరిత్రకు హేమలత మేడం అర్థశాస్త్రానికి రామ కోటేశ్వర రావు సార్, పౌర శాస్త్రానికి పురుషోత్తం సార్ ప్రభుదాస్ సార్ వచ్చిచెప్పేవారు. క్రమం తప్పకుండా తరగతులు జరిగేవి. ఇంకా సహారా విద్యార్థులలో మాలిని హరిత ఉండేవారు. హరిత చాలా బాగా చదువుతుంది. మాలిని కూడా బాగానే చదువుతుంది. హరిత వెనక బెంచీలో కూర్చుంటుంది. మాలిని మొదటి బెంచీలో నా పక్కనే కూర్చుంది. నాకు బాగా దగ్గర స్నేహితురాలు అయింది.
విద్యార్థి జీవితం చాలా గొప్పది. ఇప్పుడు ఉన్న సంతోషం ఆనందం మళ్ళీ రావు. అధ్యాపకులతో వినయ విధేయతలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని నాన్న పదే పదే చెప్పేవారు. జీవితాన్నిసరి అయిన విధంగా సక్రమమైన పద్ధతిలో మలచుకోవాలి చెడు దారిలో వెళితే జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పేవారు నాన్న. పాఠాల విషయానికొస్తే తెలుగు గద్యభాగం శివరాం ప్రసాద్ సార్ తరగతిలో పాఠం వివరించగా ఇంటికి వెళ్లి టెక్స్ట్ పుస్తకంలో వీలైనంత వరకు చదివి మిగతా గైడ్ లో చదివేదాన్ని. తెలుగు ఉపవాచకం ధర్మ విజయం ఉండింది. ఇది గిరిజ మేడం చెప్పారు. ధర్మ విజయం బాగా అర్థమై గుర్తుండి పోవాలంటే పాండవ వనవాసం సినిమా చూడమన్నారు గిరిజా మేడం. ఒకసారి గిరిజా మేడం తరగతికి ఒక సన్నటి సూది తీసుకొని వచ్చి మాకు అందరికీ చూపించి ఎవరైనా చనిపోతే వాళ్ల కళ్ళను దానం ఇవ్వమని చెప్పండి కళ్ళు చనిపోయిన వారి నుంచి ఈ సూదితో తీస్తారు అని చెప్పింది. ఒకరినుంచి తీసిన కళ్లు దానం చేస్తే ఇద్దరికీ చూపు నిచ్చిన వాళ్ళం అవుతాం. ఇద్దరికి జీవితాన్నిఇచ్చిన వాళ్లమవుతాం అని చెప్పింది గిరిజా మేడం.
ఇంకొకటి ఏమిటంటే ఎంత తప్పుచేసిన వారైనా వారికి భోజనం పెట్టేటప్పుడు సంతోషంగా పెట్టాలి. ఆ తర్వాతే వారి తప్పును ఎత్తిచూపాలి. భోజనం చేసేటప్పుడు వారిని విమర్శించకూడదు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది గిరిజా మేడం. పౌర శాస్త్రానికి పురుషోత్తం సార్ వచ్చి చెప్పేవారు. పురుషోత్తం సార్ నోట్స్ కూడా చెప్పేవారు. నాకేమో త్వరత్వరగా రాయడం అంత బాగా రాదు. నిదానంగా రాసేదాన్ని. అక్షరాలు కూడా అంత బాగా ఉండవు. అయినా కూడా సార్ చెప్పింది విషయం పూర్తిగా వచ్చేలా రాసుకునే దాన్ని. తరగతిలో అలా రాసుకొని ఇంటికి వచ్చిమళ్ళీ నోట్స్ రాసేదాన్ని. దీనినే ఎక్కువ కంఠస్థం చేసేదాన్ని. ఇక చరిత్ర విషయానికి వస్తే హేమలత మేడం తరగతిలో పాఠం వివరించగా ఇంటికి వెళ్ళాక మేడం తరగతిలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు టెక్స్ట్ పుస్తకంలో గుర్తుపెట్టుకొని నోట్స్ రాసుకొనే ప్రయత్నం చేసేదాన్ని. ఎక్కువ శాతం దీనినే కంఠస్థం చేసేదాన్ని. అర్థశాస్త్రానికి వస్తే రామకోటేశ్వరరావు సార్ తరగతిలో చెప్పగా ఇంటికి వెళ్లి టెస్ట్ పేపర్లో సమాధానాలు కంఠస్థం చేసేదాన్ని. ఆంగ్లము గైడ్లో కంఠస్థం చేసేదాన్ని. నాన్న నా చదువు కోసం పడుతున్న కష్టం ఇంతా అంతా కాదు.
రోహిణి కుటుంబం:
రోహిణి ఇంటర్మీడియట్‌కు కే.ఏ.సి. కళాశాలలో చేరింది. రోహిణి వాళ్ళ తమ్ముడు పదవ తరగతి మేము చదువుకున్న రాజుపాలెం పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ అబ్బాయి కూడా పదవ తరగతి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. రోహిణి వాళ్ళ నాన్నగారు పదవిలో ఉండగానే హఠాత్తుగా పరమపదించారు. సజావుగా సాగిపోతున్న వాళ్ల జీవితాలకు తీరని లోటు ఏర్పడింది. చాలా ఇబ్బందులు పడ్డారు. నేను రోహిణి ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాశాము. నేను ఇంటర్ తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాను. రోహిణి ఇంటర్మీడియట్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
ఇంటర్మీడియట్ – పరీక్షలు అయిపోయాక:
సెలవులలో నేను ఏదో ఒకటి చేసేదాన్ని. పూసలతో దండలు చేయడం, పేపర్లో ముగ్గులు నోట్స్‌లో వేయడం ఇలా ఏదో ఒకటి చేసే దాన్ని. ఇంకా మా రెండో చిన్నాన్న కు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లు సెలవులకు ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్లతో సరదాగా గడిపేదాన్ని. వేదాయపాలెం సొంత ఇంట్లో రెండు కిచ్చిలి చెట్లు సీతాఫలం చెట్టు నందివర్ధన చెట్టు దాసాని చెట్టు మల్లెచెట్టు ఇంటి ఆవరణలో ఉండేవి. బావి ఉండేది ఉండేది. అందరికీ నాన్నే నీళ్లు తోడి పోసేవారు. నాన్న కానీ తాతయ్య గాని సీతాఫలం గాని రామా ఫలంకానీ బొప్పాయి పండు కానీ మాకు ఎవరికీ పెట్టలేదు. ఎందుకంటే సీతాఫలం కానీ రామా ఫలం కానీ జలుబు చేస్తుందని బొప్పాయి పండు వేడి చేస్తుంది అని పెట్టేవారు కాదు. ఒకసారి రెండవ చిన్నాన్న పిల్లలు వచ్చినప్పుడు పెద్ద చెల్లెలు ఇంట్లో సీతాఫలం చెట్టుకు పండు ఉంటే అది కోసుకొని వచ్చినాన్న తాతయ్య వాళ్ళకు తెలియకుండా తెచ్చి నన్ను తినమని ఇచ్చింది. పెద్దవాళ్ళకు తెలియకుండా ఇలాంటి పిచ్చిపని చేసాము.
రోహిణి వాళ్ళ పెద్దమ్మ కుటుంబం:
ఒక విషయం గుర్తుకు వచ్చింది. అదేమిటంటే నేను రోహిణి 9వ తరగతిలో ఉన్నప్పుడు రోహిణి వాళ్ల పెద్దమ్మ వాళ్ళు రాజుపాలెం వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. రోహిణి వాళ్ల పెద్దమ్మ కూతురు రాణీ అని ఒక అక్క ఉండేది. అక్కకు చిన్నప్పట్నుంచి కాస్త మాట్లాడడం వచ్చేది కాదు. అయితేనేమి చాలా తెలివైనది. నేను రోహిణి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నన్నుచాలా పలకరించేది. తన సైగలతో బాగా చదవాలి ఉద్యోగం చేయాలి అని చాలా ప్రోత్సహించేది. ఎందుకో తెలియదు ఆ అక్క అంటే నాకు చాలా ఇష్టం.
(ఇంకా ఉంది)
prasunasuram@gmail.com