[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]
శబరిమల యాత్రలో గురువాయూర్ విశేషాలు
ఇంకా నాన్న నేను శబరిమల వెళ్ళినప్పుడు విశేషాలన్నీ చెప్పాను. వాటిల్లో గురువాయుర్ గురించి అక్కడ శ్రీకృష్ణ స్వామి గురించి చెప్పాను. అక్కడ శ్రీకృష్ణుడు ఉదయం పూట బాలుడిగా మధ్యాహ్నం సమయంలో నడివయసులో రాత్రికి వృద్ధుడిగా కర్ర పట్టుకొని దర్శనమిస్తాడు. అక్కడ మూడుపూటలా ఇలా అలంకారం చేస్తారట. అక్కడ ఆలయ ప్రాంగణంలో పెద్ద ఏనుగు దాని ముందు ఒక పెద్ద పళ్లెం నిండుగా గురిగింజలు ఉంటాయి. ఆ ప్రక్కనే త్రాసు కూడా ఉంటుంది. ఎవరైనా మొక్కుబడి అనుకోవాలి అంటే ఏనుగు ముందు ఉన్న పళ్లెం లోని గురిగింజల్లో డబ్బులు వేసి మూడు సార్లు దోసిలితో ఎత్తి మళ్లీ పళ్లెంలో వాళ్లకు కావలసినది అనుకుంటూ వేయాలి. మొక్కుబడికి సంబంధించి అక్కడ ఒక కథ చెప్పారు. అదేమంటే ఒక ఆమెకి పోలియో వచ్చి నడవలేని కుమారుడు ఉన్నాడు. అతని ఆలయానికి తీసుకుని వచ్చి బాబు నడిస్తే బాబు బరువు గల టెంకాయ నారా ఇస్తానని మొక్కుకుందట. తరువాత కొద్దిరోజులకే బాబు నడిచాడట. అప్పుడు మొక్కుబడి తీర్చుకోవడానికి మళ్ళీ బాబుని తీసుకొని ఆలయానికి వచ్చిందట. ఆ తర్వాత బాబుని తులాభారంలో కూర్చో పెట్టింది, ఆమె బాబు నడిస్తే టెంకాయ నారా ఇస్తానని మొక్కుకుంది కదా. ఆ క్షణంలో తులాభారంలో టెంకాయ నారకు బదులు అరటి పండ్లు వేసింది. ఎన్ని పళ్ళు వేసిన త్రాసు తూగలేదు. చివరికి అరటిపళ్ళు తీసివేసి త్రాసులో టెంకాయ నార వేసిన వెంటనే త్రాసు లేచింది. కాబట్టి మనం భగవంతుడికి ఏది అనుకుంటే అదే ఇవ్వాలి, ఇది అక్కడి కథ. నేను నడిస్తే నా బరువు గల అరటి పళ్ళు ఇస్తానని మొక్కుకున్నాడు నాన్న.
తుమ్మగుంట – రాజుపాలెం
ఒకరోజు తుమ్మగుంట నుండి రాజుపాలెం పాఠశాలకు రావడానికి బస్సు ఎక్కాము తుమ్మగుంటలో. బస్సులో ప్రయాణికులతో బాగా రద్దీగా ఉంది. కొంత దూరం వరకు అంటే తుమ్మగుంట పక్క ఊరు చౌకచర్ల ఊరి వరకు నాన్నా నన్ను ఎత్తుకునే బస్సులో నిల్చుకున్నారు. ఆ తరువాత నన్ను కూర్చోబెట్టడానికి సీటు దొరికింది. కానీ నాన్నకి సీటు దొరకలేదు రాజుపాలెం వరకు. ఆ మధ్యలో బస్సు కండక్టర్ డబ్బుల కోసం నాన్న దగ్గరికి వచ్చారు. అప్పుడు నాన్న చొక్కా జోబిలో నుంచి డబ్బులు తీయడానికి ప్రయత్నించగా పెట్టుకున్న డబ్బులు జోబిలో లేవు. ఎవరో ఆ డబ్బులు తీసేసారు. ఆ కండక్టరు తెలిసిన అతనే కాబట్టి రేపు ఇస్తానని నాన్న చెప్పారు. పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో పుస్తకాల సంచి తీశాను. అప్పుడు జామెంట్రీ బాక్స్ కూడా లేదు. ఆ రోజు సాయంత్రం పాఠశాల వదిలిన తరువాత ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవని హిందీ మాస్టర్‌ని రేపు ఇస్తానని చెప్పి డబ్బులు అడిగి తీసుకున్నారు నాన్న. అన్న మాట ప్రకారం బస్సు కండక్టర్‌కి, హిందీ మాస్టర్‌కి పక్క రోజు డబ్బులు ఇచ్చేసారు నాన్న. అప్పట్లో నెల్లూరు నుంచి రామతీర్థం వెళ్లే బస్సులు టైం కు సరిగా వచ్చేవి కావు సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి వెళ్లాలంటే బస్సులు సరిగా వచ్చేవి కావు. ఒక్కొక్కసారి బస్సు కోసం ఎదురు చూసి బస్సు వచ్చేదాకా ఉండేసరికి సాయంత్రం బాగా చీకటి పడేది. అప్పటికి ఒక్కోసారి బస్సులు రాకపోతే ఎవరైనా స్కూటర్ మీద వెళ్తుంటే లేక లారీ లోను ట్రాక్టర్ లోను ఎక్కి తుమ్మగుంట చేరేవాళ్ళం. చీకటి పడే సరికి ఇంట్లో నానమ్మ తాతయ్య వాళ్లు మేము ఇంకా ఇల్లు చేరలేదని చాలా దిగులు పెట్టుకునేవాళ్ళు. నన్ను చదివించడం కోసం నాన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఇంటి కోసం నాన్న
నాన్న నాకోసమే కాదు ఇంటి కోసం కూడా చాలా కష్టపడ్డాడు. తాతయ్య సొంత సేద్యం చేసేటప్పుడు పశువులు, పాడి ఉండేవి. వాటిని చూసుకోవడానికి పశువుల కాపరి కూడా ఉండేవాడు. సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి పశువుల కాపరి మారుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పశువుల కాపరి మానేసినప్పుడు ఇంకొకరు దొరికేవాడు కాదు. అప్పుడు పశువులకు నీళ్లు పెట్టడం ఇంట్లో అందరికీ (నానమ్మ తాతయ్య నేను నాన్న) నీళ్లు చేతితో కొట్టే బోరింగ్ నుంచి నీళ్లు తోడేవాడు. చేతితో కొట్టితే ఆ బోరింగులో నుంచి 200 అడుగుల లోతు నుంచి నీళ్లు రావాలి. వర్షాకాలం అయితే సులభంగా నీళ్లు కొట్టవచ్చు. కానీ ఎండాకాలంలో నీళ్లు బాగా అడుక్కు పోతే నాన్న నీళ్లు తోడుతుంటే అరిచేతులు బొబ్బలెక్కేవి. నాన్న పశువులకు నీళ్లు పెడితే మా రెండో చిన్నాన్న పశువులకు గ్రాసం వేసేవాళ్ళు.
పశు నష్టం
తర్వాత రెండో చిన్నాన్న ఉద్యోగం వచ్చి నెల్లూరు వచ్చేసారు. తుమ్మగుంట ఊరి బయట ఇతర కుటుంబాల కాలనీ ఉండేది, అందులో బానవుడు అనే ఒక వ్యక్తి రాత్రిపూట ఊరంతా నిద్రించుచుండగా ఎవరో ఒకరి ఇంటికి వచ్చి ఏదో ఒక పశువుని తీసుకొని వెళ్లి విషం పెట్టి చంపేవాడు, ఆ మరుసటి రోజు ఆ పశువు యజమాని చనిపోయిన పశువును అతనికి ఇచ్చేసేవారు. ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ఒకసారి సంక్రాంతి పండుగకు నానమ్మ తాతయ్య వాళ్లు తుమ్మగుంట నుండి వేదాయపాలెం వెళ్లారు. అప్పుడు తుమ్మగుంటలో నేను నాన్న మాత్రమే ఉన్నాము, ఆరోజు రాత్రి అంటే సంక్రాంతి ముందు రోజు భోగి నాడు రాత్రి తెల్లవారితే సంక్రాంతి అనగా నాన్న పశువుల అన్నింటిని పశువుల శాలలో కట్టివేసి ఇంట్లో పడుకున్నాము. పశువుల పాకలో మంచి వయసులో ఉన్న కోడెదూడ ఉండేది. ఆ కోడె దూడ బాగా హుషారుగా దుక్కి దున్నడం బండి లాగడం లాంటి పనులు చేసేది. దానిని విక్రయిస్తే కూడా చాలా డబ్బులు వస్తాయి. ఆ రోజు రాత్రి నాన్న పశువుల పాక లోనే మిగతా వాటితోపాటు కట్టారు. తెల్లవారి లేచి చూసేసరికి పశువుల పాకలో ఉండవలసిన కోడెదూడ లేదు. అదే పలుపు విప్పుకొని పోయిందేమో ఊరంతా వెతికారు. చివరికి అది వేరేవాళ్ళ పొలంలో చనిపోయి పడివుంది. అంత మంచి కోడెదూడ చనిపోయినందుకు అదీ పండగ పూట సంక్రాంతి రోజు ఇలా జరగడం చాలా బాధాకరం. తాతయ్య వచ్చి రాత్రి నువ్వు బయట పడుకోవచ్చు కదా అని నన్ను అరిచారు. అంటే నాన్నను ఏమి అనలేక నన్ను అరిచారు. అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఏం చేస్తారు తాతయ్య. అంత మంచి కోడెదూడ అంత కిరాతకంగా చంపివేయబడితే ఎవరికైనా చాలా బాధ కదా! మా చిన్న నానమ్మ అంటే నానమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఎద్దును కూడా అతను చంపేశాడు. అతడు ఆ పని చేసేటప్పుడు ఎవరూ చూడకపోవడంతో అతని చర్యలు అతను ఉన్నన్ని రోజులు జరిగాయి. ఎవరికీ తెలియకుండా ఇలాంటి కిరాతకం చేసేవాడు అతను. ఇంక ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకోలేదు. దానికి తోడు నానమ్మ తాతయ్య వాళ్లు కూడా తుమ్మగుంటలో లేరు కదా!
తుమ్మగుంటలో సంక్రాంతి
నా చిన్నప్పుడు అయితే సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకునే వాళ్ళం. అప్పుడు పెద్ద చిన్నాన్న పిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దర్ని తీసుకొని తుమ్మగుంటకు వచ్చేవాళ్ళు. పెద్ద చిన్నాన్న హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గణితం ఆచార్యులుగా పని చేసేవారు. పిన్నమ్మ కూడా హైదరాబాదు బీహెచ్ఈఎల్‌కు సంబంధించిన పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలు. వీరికి అబ్బాయి అమ్మాయి. పెద్ద చిన్నాన్న అప్పట్లో అంటే చిన్నాన్నకు వివాహం కాకముందు అమెరికా వెళ్లి ఏడు సంవత్సరాలు పరిశోధన చేసి వచ్చారు. అమెరికా నుంచి వస్తూ అందరికీ బహుమతులు తెచ్చారు. ఇందులో భాగంగా నాకు కరెంట్‌తో నడిచే కారు బొమ్మ, ముత్యాల హారం తెచ్చారు.
తుమ్మగుంట లోని మా ఇల్లు
తుమ్మగుంట లోని మా ఇల్లు పెద్దది. ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉండేది. ఇంటికి ఉత్తరం పక్క ఇంటికి దూరం పశువుల పాక, గడ్డివాము ఉండేవి. ఇంటికి దక్షిణం వైపు ఇంటి ముందు ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లు మందార చెట్టు దాసాని చెట్టు మల్లె చెట్టు సన్నజాజులు సంపెంగలు చెట్లు డిసెంబరం పూల చెట్ల పొద లేడీ కనకాంబరాలు చేమంతి చెట్లు ఉండేవి. ఇంటి వెనుక తులసి కోట ఉండేది. ఇంకా దక్షిణం వైపు ఇంటి వెనకాల దక్షిణం వైపుఉన్న ఖాళీ స్థలంలో తాతయ్య మిరప చెట్లు వంకాయ బీన్స్ పందిరి చిక్కుళ్ళు పొట్లకాయ సొరకాయ బీరకాయ పాదులను పాలేరు చేత వేయించేవారు వాటి వాటి కాలంలో. టమోటా చెట్లు అక్కడక్కడ పడి మొలిస్తే వాటిని తీసి బోరింగ్ నీళ్ళు పారే ప్రదేశంలో పందిరి కట్టి నాటేవారు తాతయ్య. ఇంటిముందు కాగితాల పూల చెట్టు కూడా ఉండేది. ఇంకా రకరకాల క్రోటన్ చెట్లు ఉండేవి.ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి గుడిలో కార్తీక పౌర్ణమికి జరిగే లక్ష తులసి పూజకు ఇంట్లోని మందార చెట్టు ఆకులను పూజ కోసం ఇచ్చేవాళ్ళం. డిసెంబరం పూలు డిసెంబర్ జనవరి నెలల్లో చాలా పూలు పూచేవి. నాలుగు రంగులలో చాలా చూడడానికి అందంగా ఉండేవి. డిసెంబరాల చెట్ల పక్కన లేడీ కనకాంబరాల చెట్లు ఉండేవి. ఇంకా అటిక మామిడి ఆకు కోడిజుట్టు ఆకు లాంటివి పడి మొలిచేవి. కూరగాయలు ఏమీ లేనప్పుడు అటిక మామిడి ఆకు కోడిజుట్టు ఆకులతో నాన్నమ్మ పప్పు చేసేది. చాలా రుచిగా ఉండేది. ఇంకా జామ చెట్టు బాదం చెట్టు గూడా ఉండేవి. బాదం చెట్టు ఆకులతో నానమ్మ విస్తరాకులు కుట్టేది. బర్రెలు, ఆవులు పాలు ఇచ్చేవి. నానమ్మ కుంపటిలో పాలు కాచేది చాలా రుచిగా ఎర్రగా ఉండేవి. పాలు పెద్దచిన్నాన్న చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తాగేవాళ్ళు. మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది.
తుమ్మగుంట – లక్ష్మి నారాయణ స్వామి గుడి
తుమ్మగుంటలో మా ఇంటి పక్కనే లక్ష్మీ నారాయణ స్వామి గుడి ఉండేది. ఆ గుడిలో సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరిగేవి. ఉత్సవాలప్పుడు హరికథా కాలక్షేపం జరిగేది. కానీ కాలక్రమేణా హరికథలకు భక్తులు ఎవరూ రాకపోవడంతో సినిమాలు వేయడం ప్రారంభించారు. ఇంకా కీలు గుర్రాలు బ్యాండ్ మేళాలు నెమళ్ళ వేషాలు ఉత్సవం వెనకాల తిరిగేవి. ఉత్సవాల అప్పుడు గ్రామంలో అక్కడ అక్కడ చలువ పందిళ్ళు వేసేవాళ్ళు. ఉత్సవ ఊరేగింపు అప్పుడు చలువ పందిళ్లలో స్వామి వేంచేసినప్పుడు భక్తుల పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పంచ కజ్జాయం వడపప్పు పానకం పంచామృతం ప్రసాదాలు పంచి పెట్టే వాళ్ళు. ఉత్సవాలప్పుడు స్వామిని అమ్మవార్లను చాలా అందంగా అలంకరించే వాళ్ళు. చివరి రోజు స్వామి వార్లకు ఏకాంత సేవ అయిన తర్వాత ఏకాంత సేవ సమారాధన జరిగేది. ఆ సమారాధనకు మేమందరము వెళ్ళేవాళ్ళం. తుమ్మగుంటలో ఏ గుడిలో సమారాధన చేసిన వంటలు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా పిండి మిరియం చాలా బాగా ఉంటుంది.
తుమ్మగుంట – శివాలయం
ఇలాగే శివాలయం ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది. అయినా సరే నాన్న శివాలయం ఉత్సవాలు ఎప్పుడు గుడికి తీసుకెళ్లేవారు. అక్కడ కూడా మొదట్లో హరికథా కాలక్షేపాలు ఉండేవి, కాలక్రమేణా సినిమాలు వేయడం ప్రారంభించారు. లక్ష్మీ నారాయణ స్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ స్వామివారి కల్యాణ మహోత్సవాలు చాలా వేడుకగా జరిగేవి. లక్ష్మీ నారాయణ స్వామి గుడి మా ఇంటి పక్కనే కావడంతో అన్ని వేడుకలు చాలా చక్కగా చూసేవాళ్ళం. అలాగే శివాలయం కూడా వెళ్లేవాళ్లం. ఉత్సవ ఊరేగింపు వెనుక వేద పారాయణ పెట్టించే వారు తాతయ్య. ఒక సంవత్సరం వేదపారాయణం చేయడానికి బ్రాహ్మణులు కుదరకపోవడంతో రథోత్సవం రోజు రథం లాగిన వాళ్లకు అన్న సమారాధన చేయించారు తాతయ్య. ఆ రోజే ధర్మకర్తలు ఏకాంత సేవ సమారాధన చేస్తారు.
తుమ్మగుంట – అయ్యప్ప గుడి ప్రత్యేక పూజలు
ఇంకా అయ్యప్ప గుడిలో ప్రత్యేక పూజలు, అప్పుడు అయ్యప్పల భజనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏ పూజ జరిగిన ముందు అశ్వత్థ వృక్షానికే. తుమ్మగుంటలో అయ్యప్ప స్వామి వృక్ష స్వరూపుడై ఉన్నాడని ప్రతీతి. వృక్షం ముందు ఒక హాలు. ఆ హాలు ప్రక్కనే అయ్యప్ప స్వామి మూలవిరాట్టు. మూలవిరాట్టుకు ముందుభాగంలో ఒకపక్క వినాయకుడు మరొక ప్రక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠితమై ఉంటారు. ఇంకా గుడి ప్రాంగణంలో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఉంటారు. వృక్షం శాఖలు గుడి పైన వాలి ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి జరిగే లక్ష తులసి పూజ వృక్షం మొదలు దగ్గర పెద్ద అయ్యప్ప పటం పెట్టి వృక్షం మొదలు ముందు ఉన్న హాలులో చిన్న చిన్న పటాలు పెట్టి బ్రాహ్మణులు ఈ లక్ష పూజను నిర్వహిస్తారు.
లక్ష పూజ జరిగే హాలులోకి స్త్రీలకు ప్రవేశం లేదు. పురుషులు చొక్కాలు వేసుకుని ప్రవేశింపరాదు అనే నియమం ఉండేది. స్త్రీలు లక్ష పూజ జరిగే హాలుకి ఎదురుగా మూలవిరాట్టుకు ఎదురుగా ఆలయ ప్రాంగణంలో కూర్చోవచ్చు. స్త్రీలు లక్ష పూజ జరిగే హాల్లోకి మాత్రమే వెళ్ళకూడదు. కానీ గుడి ఆవరణ అంతా తిరగొచ్చు. ప్రదక్షిణలు చేయొచ్చు. గుడి ఆవరణలో కళ్యాణ మండపం ఉంది. అక్కడ వివాహాలు కూడా చేసుకుంటారు. మా చిన్న నానమ్మ కూతురు అంటే మా చిన్న అత్త వివాహం అక్కడే జరిగింది. అయ్యప్ప గుడిలో వివాహం జరిగిన వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అని అంటారు. శబరిమల వెళ్లాలనుకున్నా వాళ్ళు అంటే ఆ గ్రామం చుట్టు పక్కల గ్రామాల వాళ్లు అక్కడికే వచ్చి మాల ధారణ చేసుకుంటారు. గుడి ప్రధాన అర్చకులు మాల ధారణ జరిపిస్తారు. మాల ధారణ ధరించినవారు అక్కడ భజనలు చేస్తారు. సకాలంలో వర్షాలు పడకపోతే కుంభాభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
తుమ్మగుంట – నవంబర్ నెల
తుమ్మగుంటకు రామతీర్థం సముద్రం ఆరు మైళ్లు అని తాతయ్య చెప్పేవారు. నవంబర్ నెలలో భారీ వర్షాలు అప్పుడు సముద్రం ఉగ్రరూపం యొక్క శబ్దం తుమ్మగుంటకు వినిపించేది. కాస్త భయంకరంగానే అనిపించేది. నవంబర్ నెల వస్తే తుమ్మగుంటలో ఉండకూడదని తాతయ్య అంటూ ఉండేవారు.
రామతీర్థం- రామలింగేశ్వర స్వామి గుడి
రామతీర్థంలో రామలింగేశ్వర స్వామి గుడి ఉంది. ఆ శివలింగం శ్రీ రాములవారు సీతమ్మని వెతుక్కుంటూ వెళ్తూ లింగ ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అలా శ్రీరాముడి చేత ప్రతిష్ఠితమైన శివలింగం అది. అందుకే అక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా పిలువబడతాడు.
ప్రతి జ్యేష్ఠమాసంలో రామలింగేశ్వరునికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక బయట ఊర్ల నుంచి కూడా భక్తులు వస్తారు. అమావాస్యకు ముందు తీర్థవాది జరుగుతుంది.
తుమ్మగుంట మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో ఉప్పలపాడు అని ఒక ప్రాంతం ఉంది. దీనిని చిన్న రామతీర్థం అని కూడా అంటారు. అక్కడ అప్పట్లో ఇండ్లు ఏమి ఉండేవి కావు. రామతీర్థం ఉత్సవాల అప్పుడు అక్కడకి అంగళ్ళు చలివేంద్రలు రామతీర్థానికి వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు. అక్కడ అంటే చిన్న రామతీర్థంలో అంగళ్ళు మట్టి వస్తువులు కుండలు పిల్లలు ఆడుకునే వస్తువులు వస్తాయి.
ప్రతి సంవత్సరం చిన్నప్పుడు నాన్న నన్ను ఉప్పలపాడుకి ఎత్తుకెళ్లి అక్కడ కుండ బుడ్లు రంగు కాగితాలతో చేసిన కంటి అద్దాలు బొమ్మ వాచీలు బెలూన్లు బొమ్మలు లాంటివి ఎన్నో కొని ఇచ్చేవారు. ఒక సంవత్సరం మాపెద్ద చిన్నాన్న పిల్లలు తమ్ముడు చెల్లెలు ఆ ఉత్సవాల టైంలో తుమ్మగుంట వచ్చి ఉండినారు. ఆప్పుడు నాతోపాటు తమ్ముడు చెల్లెల్ని తీసుకెళ్లి నాన్న అన్నీ కొని ఇచ్చారు.
ఉప్పలపాడులో రామతీర్థం ఉత్సవాలకు ప్రత్యేకంగా తీర్థవాదికి వచ్చే భక్తుల కోసం తుమ్మగుంట బ్రాహ్మణులు చలివేంద్రలు ఏర్పాటు చేసే వాళ్ళు. నీరు మజ్జిగ అంటే నిమ్మరసం కర్వేపాకు ఉప్పు వేసిన పల్చటి మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేసే వాళ్లు. మేమందరం చలివేంద్రాలకు వెళ్ళేవాళ్ళం. సముద్ర స్నానానికి చాలామంది భక్తులు వెళ్లేవారు. తీర్థవాది వెళ్ళిన పక్క రోజు వర్షం పడేది. తీర్థవాదికి వచ్చిన భక్తులు సముద్ర స్నానం చేయగా సముద్రం పవిత్రతను కోల్పోయిన కారణంగా శుద్ధి చేయడం కోసం వర్షం పడుతుందని పెద్దలు చెప్పేవాళ్ళు. ఈ విధంగా రామతీర్థం రామలింగేశ్వరునీ ఉత్సవాలు వైభవంగా జరిగేవి,
తుమ్మగుంట పేరు – ఆవిర్భవం
పూర్వం శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో ఆయన దేశ సంచారం చేస్తూ వచ్చి ఒక ప్రాంతంలో బస చేయగా అక్కడ ఒక గుంట ఆ గుంటలో నీరు పక్కనే తుమ్మ చెట్లు ఉండగా కృష్ణదేవరాయల ఏనుగులు గుంటలో స్నానం చేశాయని అందువల్ల అది ఏనుగు గుంట ఆనీ ఆ గుంట ప్రక్కన తుమ్మ చెట్లు ఉన్నందువల్ల ఆ ప్రాంతానికి తుమ్మగుంట అని కృష్ణదేవరాయలు నామకరణం చేశారని పెద్దలు అంటుండేవారు. దీనికి ఎటువంటి రుజువులు గాని శిలాశాసనాలు గాని లేవు.
తుమ్మగుంటలో మా ఇంటి వెనకాలే గుంట ఉండేది. వర్షాకాలంలో గుంట నిండి ఆ నీరంతా మా ఇంటి ఆవరణంలోని తులసి కోట వరకు వచ్చేవి. ఆ గుంట అవతలి పక్క పంట పొలాలు ఉండేవి. వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు పంట పొలాలకు నీరు అవసరమైతే గుంటలో నుంచి తలుము తొక్కడం చేసేవాళ్ళు. ఇలాపంట పొలాలకు గుంట లోని నీటిని అందించేవారు.
మా పొలాలు
మాకు పడమటి చేను తూర్పు చేను అని రెండు పక్కల పొలాలు ఉండేవి. తూర్పు చేనులో పంట పొలాలకు నీటిని అందించడం కోసం భూమిలో నుంచి నీటిని తోడడానికి ఇంజన్ ఉండేది. పడమటి చేనుకు నీటిసరఫరా చేయడానికి తుమ్మగుంట గ్రామానికిముందు గ్రామం చౌకచర్ల చెరువు నుంచి కాలువల ద్వారా నీటి సరఫరా జరిగేది.ఇంకా పొలం గట్ల పైన తాటి చెట్లు ఈత చెట్లు ఉండేవి.
తుమ్మగుంట బ్రాహ్మణుల కథ
తుమ్మగుంట గ్రామం బ్రాహ్మణులకు పెట్టింది పేరు. పూర్వకాలంలో తుమ్మగుంటలో 300 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట. అక్కడి బ్రాహ్మణులు మడి ఆచారాలు కచ్చితంగా పాటిస్తారు. వేద పారాయణ చేయడంలో నిష్ణాతులు అక్కడి బ్రాహ్మణులు. పూర్వకాలంలో అక్కడ వేద పాఠశాల నడిపే వారిని పెద్దలు చెప్తూ ఉండినారు. ఎవరికైనా తేలు కుట్టిన పాము కరిచినా మంత్రం వేసేవాళ్ళు. క్షణాల్లో ఆ బాధ తగ్గిపోయేది. ఒకప్పుడు మా తాతగారు కూడా తేలు మంత్రం వేసేవారు. ఇంకా పూర్వపు బ్రాహ్మణులు దెయ్యాల చేత తలుము లెత్తించే వారిని నానుడి. మొత్తం మీద అక్కడి బ్రాహ్మణులు మంత్రవేత్తలుగా ప్రసిద్ధికెక్కారు. పూర్వం అమ్మమ్మకు మేనమామ నక్క రాఘవయ్య గారు వేద విద్యలో దిట్ట అని పెద్దలు చెబుతుండేవారు.
(ఇంకా ఉంది)
prasunasuram@gmail.com