Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-14

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం:

మా పెద్ద చిన్నాన్న, పెద్దత్త నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారిద్దరూ చాలా పెద్దవాళ్లు రాలేరు. నా వద్దకు అందుకని ఫోన్లోనే మాట్లాడుతూ నా యోగి క్షేమాలు చూస్తూ ఉంటారు. ఇంకా చిన్నత్త, మామయ్య, చిన్న చిన్నాన్న, పిన్నమ్మ, ఇంకా చిన్న నానమ్మ, వాళ్ల పిల్లలు, చిన్నాన్న పిన్నమ్మ అత్త మామయ్య వాళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ధైర్యం చెప్పి.

తరువాత కొన్నాళ్లకు పురుషోత్తం సార్‌ను అడిగాను మీటింగులు జరగటం లేదా అని. అప్పుడు చెప్పారు మీటింగులు నిర్వహించేది పురుషోత్తం సార్ స్నేహితులు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అవధానం రఘు కుమార్ గారు అని. అప్పుడు నేను ప్రతివారం అటెండ్ అవుతాను మీటింగ్‌కు అని చెప్పాను పురుషోత్తం సార్‌తో. సార్ అప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి రఘు కుమార్ సార్ నంబర్ ఇచ్చారు.

రఘుకుమార్ సార్‌తో పరిచయం:

రఘు కుమార్ సార్‌కు ఫోన్ చేసి ప్రతివారం మీటింగులకు అటెండ్ అవుతాను అని చెప్పగానే వారి గ్రూపులో నన్ను జాయిన్ చేసుకున్నారు. ఆ గ్రూప్ పేరు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రతివారం అటెండవసాగాను. ఈ గ్రూపులో అందరూ పెద్ద పెద్ద పొజిషన్‍లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన పెద్దవారు అందరూ. రఘు కుమార్ సార్ నన్ను గ్రూపు సభ్యురాలుగా ఆ పెద్దవారికి ఎంత విలువ ఇస్తున్నారో నన్ను కూడా వారితో సమానంగా మీటింగ్‌లో జాయిన్ అయినా వెంటనే నాకు వెల్కమ్ చెప్పడం కానీ చివరలో అభిప్రాయం చెప్పమని పిలవడం నన్ను స్పీకర్స్‌కు పరిచయం చేయడంలోనూ ఆ పెద్ద వాళ్లకు ఎంత విలువ ఇస్తున్నారో నన్ను కూడా అలానే చూస్తున్నారు. ఇది నా అదృష్టమనే చెప్పాలి.

తాతగారి జీవన్ముక్తి గ్రంథ ఆవిష్కరణ:

ఇదిలా ఉండగా మా తాతగారి జీవన్ముక్తి పుస్తకం మా గురువులైన శ్రీ కాళిదాసు పురుషోత్తం సార్, శ్రీ మాచవోలు శివరామ ప్రసాద్ సార్‌ల కృషి శ్రమ వలన పుస్తకం అచ్చు రూపుదిద్దుకొని మా గురువుల చేతనే 25 నవంబర్ 2022 న మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరింపబడింది. ఈ పుస్తకావిష్కరణకు పురుషోత్తం సార్ ఆహ్వానం మేరకు మా కాలేజీలో పని చేసి రిటైర్ అయిన రమణయ్య గారు, రోహిణి ఆహ్వానం మా కాలేజీలో పనిచేసి రిటైర్ అయిన వెంకట రమణాచారి గారు, ఇంకా రోహిణి ద్వారా పరిచయం అయిన మా ఊరు తుమ్మగుంటకు మరియు మా కుటుంబానికి సంబంధించిన రిలేటివ్ అయిన విజయమ్మ అంటీ కూడా వచ్చారు. ఇంకా నా క్లాస్‌మేట్ నిర్మల, పల్లా వెంకటేశ్వర్లు వచ్చారు. ఇది మా కుటుంబ సభ్యులకు అందరికీ చాలా ఆనందదాయకం. నా గురువుల కృషి శ్లాఘనీయం. నా విషయానికొస్తే నా గురువులు మా తాత గారి పుస్తకం చేయడం అన్నది నా అదృష్టం. ఏ జన్మ పుణ్యఫలమో మా నాన్న పోయి నేను ఇంకా బతుకుతున్నందుకు ఈ మేలు అన్నా జరిగింది.

మా గురువుల సూచనల మేరకు తాత గారి గ్రంథం:

నా గురువుల సూచనల మేరకు మా తాత గారి జీవన్ముక్తి పుస్తకాన్ని వివిధ ప్రాంతాలకు లైబ్రరీలకు ఆశ్రమాలకు నా చేతులతోనే పంపించాను. పురుషోత్తం సార్ సూచన మేరకు తాత గారి పుస్తకం పంపిణీ క్రమంలో వారి స్నేహితులు బంగారు రామాచారి గారు, నాగసూరి వేణుగోపాల్ గారు పరిచయమయ్యారు ఇది నా అదృష్టం.

రఘు కుమార్ సార్ నా ఆహ్వానం మేరకు:-

ఆ తరువాత కొన్ని రోజులకు అవధానం రఘు కుమార్ గారు ఏదో పుస్తకావిష్కరణ కోసం నెల్లూరు వచ్చారు. నా ఆహ్వానం మేరకు పురుషోత్తం సార్ రఘుకుమార్ సార్‌ను మా ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు రోహిణి కూడా వచ్చింది. ఇంకా నాకు బాగా సన్నిహితురాలైన పండితారాధ్యుల లలిత అంటీ కూడా వచ్చింది.

ఇది కూడా చాలా చాలా ఆనందం. ఆరోజు రఘుకుమార్ సార్ ఒక గంట మా ఇంట్లో ఉండినారు. అంత బిజీగా ఉన్న సార్ అంత సేపు ఉండగలగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా తాతగారి జీవన్ముక్తి పుస్తకాల పంపిణీ క్రమంలో పురుషోత్తం సార్ సూచించిన వారి స్నేహితులైన బంగారు రామాచారి గారు ఇంకా నాగసూరి వేణుగోపాల్ గారు పరిచయమయ్యారు అని రాశాను కదా!

బంగారు రామాచారి గారు:

బంగారు రామాచారి గారు “నన్ను సార్ అని పిలవకమ్మా, బాబాయి అని పిలు” అని ఆప్యాయంగా మాట్లాడుతారు.

నాగసూరి వేణుగోపాల్ గారు:

ఇక నాగసూరి వేణుగోపాల్ గారు అయితే నెల్లూరు వచ్చి మా ఇంటికి వచ్చారు. నా ఆహ్వానం మేరకు. చాలా సంతోషం వేసింది అప్పుడు కూడా. వేణుగోపాల్ గారు అయితే “నన్ను అన్నయ్యా అని పిలువమ్మా” అన్నారు. అసలు వీరందరూ ఇంత పెద్ద వాళ్ళు ఆయుండి కూడా నాకు ఇంత విలువ ఇచ్చి ఇంత ఆప్యాయంగా మాట్లాడటం ఎంత సంతోషాన్నిస్తోందో చెప్పలేను. వీరిద్దరూ ఇంకా నాకు కొన్ని పుస్తకాలు కూడా పంపారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు.

సుధీమతి మేడం:

ఇంకా రఘు కుమార్ సార్ సి.ఎస్.డి గ్రూప్ లో సుధీమతి మేడంను పరిచయం చేసుకున్నాను. మేడం చాలా మంచివారు. పరిచయం చేసుకున్న ఒక వారానికల్లా అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి నా గాజుల డిజైన్లు అటు అమెరికాలోనూ ఇటు ఇండియాలోని వివిధ రాష్ట్రాలలో మేడంకు తెలిసిన వాళ్ళ కందరికి పోస్ట్ చేసి అసలు ఒక సంవత్సరంలో 30 వేల రూపాయల ఆర్డర్ ఇప్పించారు. సుధీమతి మేడం ద్వారా కస్తూరి మేడం సరోజ గారు పరిచయమయ్యారు.

కస్తూరి మేడం:

సుధీమతి మేడం ద్వారా వీరి స్నేహితురాలు కస్తూరి మేడం చాలా ఆర్డర్లు ఇచ్చారు.

సరోజ గారు:

సరోజ గారు, సరోజ గారి ద్వారా ఇంకా చాలామంది పరిచయమై నాకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఫోన్ చేసి సుధీమతి మేడం మీ నంబర్ ఇచ్చారు సుధీమతి ఆంటీ మీ నెంబర్ ఇచ్చారు అనేవారు. సుధీమతి మేడం కస్తూరి మేడం నాకు చాలా దగ్గర అయిపోయారు. ఫోన్లు చేస్తే చాలా బాగా మాట్లాడుతారు.

స్పైడింగ్ లైట్:

సుధీమతి మేడం, “స్పైడింగ్ లైట్ అనే గ్రూప్ ఉంది, అందులో ప్రతి శనివారం ఆన్లైన్‍లో రచయితల జూమ్ మీటింగ్స్ జరుగుతాయి అటెండ్ అవ్వు” అని చెప్పారు. వారు చెప్పిన ప్రకారం ప్రతి శనివారం అటెండ్ అవుతూ వస్తున్నాను. స్ప్రెడింగ్ లైట్ మీటింగ్ హోస్ట్ రామ్ సార్ నన్ను అందరితో సమానంగా అభిప్రాయాలు చెప్పమని పిలుస్తారు నన్ను చాలా ప్రోత్సహిస్తారు.

ప్రముఖ సినిమా పాటల రచయిత భువన చంద్ర గారితో పరిచయం:

ఈ మీటింగ్‌లో ఒక రోజు ప్రముఖ సినిమా పాటల రచయిత భువనచంద్ర గారు పరిచయమయ్యారు. శబరిమల యాత్ర విశేషాల గురించి ఒక పుస్తకం రాయమన్నారు. రాసే విధానం ఎలా రాయాలి ఎలా రాస్తే పాఠకుల మనసుకు హత్తుకుంటుంది అనే విశేషాలను ఫోన్ ద్వారా నాకు వివరించారు చాలా ధైర్యం చెప్పారు నా గురించి ఒక మెసేజ్ కూడా చేశారు క్రింది విధంగా.

ప్రసన్నమ్మా, చాలా సంతోషం తల్లి మీరు రాసిన చిన్న మెసేజి ఎంత చక్కగా ఉంది అంటే ఎదురుకుండా కూర్చుని మాట్లాడుతున్నట్టు ఉంది. అందుకే మీరు చేసిన యాత్రల అనుభవాలు అన్ని చక్కని పుస్తకంలో రాయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎంతో మందికి అది మార్గదర్శి అవుతుంది. ఎందుకంటే చాలామంది యాత్రలకి వెళ్ళటానికి ధైర్యం చేయరు. మీ రాత వల్ల ఎంతోమంది ధైర్యం తెచ్చుకుని అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఎప్పుడు మాట్లాడదలచుకున్న చక్కగా నాతో మాట్లాడవచ్చు భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలని నిండుగా ప్రసాదించాలని కోరుకుంటూ ఆయుష్కృతిభవ శుభం తల్లి సకల శుభమస్తు.”

అట్లా రెండు మీటింగ్లకు సి.ఎస్.డి మీటింగ్ లో పృథ్వి కూడా సుధీమతి మేడం స్టూడెంట్ అవ్వడం వల్ల వారి ద్వారా పరిచయమయ్యారు. పరిచయమైనప్పటినుంచి సుధీమతి మేడంను కస్తూరి మేడంను మా ఇంటికి రండి అని పిలుస్తూ ఉండేదాన్ని. సుధీమతి మేడం స్టూడెంట్ అయినా పృథ్వి గారు కూడా వాళ్ళ రిలేటివ్స్ కోసం బ్యాంగిల్స్ చేయించుకున్నారు. అప్పుడు చాలా బాగా మాట్లాడారు మీరు కూడా నెల్లూరు రండి అని పిలిచాను.

సుదీమతి మేడం నా ఆహ్వానం మేరకు:

నా ఆహ్వానం మేరకు ఒకరోజు సర్ప్రైజింగ్‌గా సుధీమతి మేడం, కస్తూరి మేడం పృథ్వి గారు వారి అమ్మగారు అందరూ మా ఇంటికి వచ్చారు ఇది చాలా సంతోషమైనది రెండు గంటలు నాతో గడిపారు.

నాకు అవార్డు:

దీనికి ముందు విషయం ఏమంటే ఏపీ కోవి వాళ్లు నాకు ఉమెన్ ఆన్ వింగ్స్ అవార్డును అనౌన్స్ చేశారు. అవార్డు ప్రధానం విజయవాడ నోవాటెల్ హోటల్లో అన్నారు. నేను అక్కడికి ఎలా వెళ్లాలి, వెళ్లలేను. రోహిణి వాళ్ళ అక్క కుసుమ అక్క అక్కడ ఉన్నారు అప్పుడు రోహిణి కుసుమక్క ఇద్దరం కలిసి మేము వెళ్లి తీసుకుంటాము అన్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత మా శైల పిన్ని కొడలి వాళ్ళ రిలేటివ్స్ వెళ్లి తెస్తారు అని చెప్పింది. అందరూ సహాయం చేస్తాము అన్నా ఒకసారి కోవి వాళ్ళను అవార్డును ఇంటికి పంపించమని రిక్వెస్ట్ చేశాను. వాళ్లు దానికి సరే అన్నారు చాలా సంతోషం అయింది. నాకు అవార్డు బిజినెస్ బాగా చేశానని బిజినెస్ కేటగిరిలో నన్ను సెలెక్ట్ చేశారు. ఇది నాకు మరొక గుర్తింపు.

నాకు అవార్డు వచ్చిన తర్వాత ఒకరోజు రోహిణితో పాటు శ్యామల గౌరీ అక్క అనే ఆమె వచ్చి నాకు ఫోటోలు వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది రోహిణి.

తిరిగి యూట్యూబ్ వీడియోస్ చేయడం ప్రారంభం:

కొన్ని సంవత్సరాల క్రితం అంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసిన మొదట్లో హౌ టు మేక్ త్రెడ్ బ్యాంగిల్స్ అని ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టాను. మళ్లీ ఆ తర్వాత నాకు అవార్డు వచ్చిన తర్వాతనే యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను.

విజయమ్మ ఆంటీ:

విజయమ్మ ఆంటీ మా రిలేటివ్. ఆమె అప్పుడప్పుడు వచ్చి నాకు చాలా సహాయం చేస్తుంది నాకు హెల్త్ బాగా లేకపోయినా ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వచ్చి నాతో ఉండి సొంత అమ్మలా వండి చేతిలోపెడుతుంది. నాకు ఈమధ్య బాగా లేక హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. తను తినకుండా నాకోసం అన్నం తీసుకుని హాస్పిటల్ కు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు అన్నం తినిపించి నాతో కొంతసేపు గడిపి ధైర్యం చెప్పి వెళ్ళేది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడింది. ఒక నెల రోజులు నాతోనే ఉండి నేను పైకి లేచిన తర్వాతనే తను వాళ్ళ ఇంటికి వెళ్లింది. ఇలాంటి అమ్మ దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఒకరోజు విజయమ్మ ఆంటీ నా దగ్గర ఉన్నప్పుడు నెల్లూరు టౌన్ హాల్‌లో ఏదో సభ జరుగుతుండగా అక్కడికి వెళ్లి వచ్చి – ఆ సభకు భువనచంద్ర గారు, శైలజ గారు, సుధాకర్ గారు, విద్యాసాగర్ గారు వచ్చారు అని చెప్పింది. అది విన్న వెంటనే నేను భువనచంద్ర గారికి ఫోన్ చేశాను మా ఇంటికి రమ్మని ఆహ్వానిద్దామని. కానీ ఆ సమయంలో సార్ సభలో ఉన్నారు అనుకుంటా ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ పెట్టాను ఎంత టైం అయినా పర్వాలేదు నేను మేలుకొనే ఉంటాను, మీరు ఫోన్ చేయండి అని చెప్పాను. నా మెసేజ్ చూసుకొని భువనచంద్ర గారు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడి ఉదయమైనా మా ఇంటికి రండి అని నేను ఆహ్వానించగా ‘ఈసారి రాలేనమ్మ టైం లేదు మరొకసారి వస్తాను నెల్లూరు వచ్చినప్పుడు’ అని చెప్పి మా ఆంటీ కి నమస్కారాలు తెలిపి నాకు ఆశీర్వచనాలు ఇచ్చి ఫోన్ పెట్టేశారు. భువన చంద్ర గారు అంత బిజీలో కూడా నా మెసేజ్ చూసి ఫోన్ చేసినందుకు నాతో పాటు ఆంటీ కూడా చాలా సంతోషపడ్డారు.

సహాయ సహకారాలు అందించిన వారి పేర్లు:

ఏది ఏమైనా నాన్న ఉన్నప్పుడు ఎన్.డి.ఆర్ ట్రస్ట్ (నెల్లూరు దశరధరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్) లాయర్ వడ్డే శ్రీనివాసరావు గారు డాక్టర్ మాలకొండయ్య గారు మరియు నాన్న ఉన్నప్పుడు, చనిపోయిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆ తర్వాత నా గురువులు, నా వ్యాపారం ద్వారా పరిచయమైన సన్నిహితులు, స్నేహితుల (తుమ్మ అరుణ గారు, ఎలిప్ ప్రెసిడెంట్ రమాదేవి మేడం, రేవతి గారు, సుమిత్ర గారు, సుధీమతి మేడం, కస్తూరి మేడం ఇంకా కొంతమంది ప్రముఖులు) సహాయ సహకారాల వలననే నా జీవనం సజావుగా సాగుతోంది. వీరందరికి నా కృతజ్ఞతా పూర్వక వందనాలు.

~

మా నాన్న గారు నాకు నేర్పిన నాలుగు మంచి మాటలు:

దైవం:

ఎల్లవేళలా దైవనామస్మరణ చేయాలి. మనకు ఏదో కష్టం వచ్చిందని దైవాన్ని నిందించకూడదు. ఏదైనా ఇబ్బంది వస్తే దైవ ప్రార్థన చేస్తూ దానికి సంబంధించిన మానవ ప్రయత్నం కూడా తోడైతే దైవం మన సమస్యను సునయాసంగా పరిష్కరిస్తుంది. అప్పటికి మనకు సమస్య తీరకపోతే అయినా కూడా దైవాన్ని నిందించవద్దు. పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితం అనుభవించవలసిందే.

విద్య-దాని అవసరం:

విద్యాధనం చాలా గొప్పది. అందువలన మనము విద్యను అభ్యసించాలి. జీవితానికి ఇది చాలా అవసరం. ఈ విద్యాసాధనలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎదుర్కొని నిలబడగలగాలి. అనుకున్నది సాధించాలి. ఈ విద్య అన్నది మన నుంచి ఎవరూ దోచుకుని పోలేరు, దొంగలు సైతం. చదివిన కొద్దీ పెరుగుతుంది. దానం చేస్తే పెరుగుతుందే కానీ తరగదు.

మర్యాద:

ఇంగ్లీష్ లో give respect and take respect అని చెప్పే వారు. ఎవరికైనా సరే మనము మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి.

మనం ఎలా ఉండాలి:

డబ్బు పరపతి మన appearance సక్రమంగా ఉంటేనే ఈ సమాజం మనల్ని గౌరవంగా చూస్తుంది.

విమర్శ:

విమర్శ అంటే ఒకరు మనల్ని విమర్శించినప్పుడు ఆ విమర్శలను మనం పట్టించుకోకూడదు. మనము ఆ విమర్శను చిరునవ్వుతో స్వీకరించి దాన్ని తట్టుకునే గుండె నిబ్బరాన్ని తెచ్చుకొని పాప పుణ్యాలు ఆ భగవంతునికి వదిలేయాలి తిరిగి మళ్ళీ వాళ్లను ఏమీ అనకూడదు. అదే మనకు శ్రీరామరక్ష.

ఉపన్యాసాలు:

ప్రముఖుల ఉపన్యాసాలు వినడం ద్వారా కొంతవరకు జ్ఞాన సముపార్జన జరుగుతుంది. అందువల్ల ఉపన్యాసాలు వినడం చాలా మంచిది.

ధైర్యం:

ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎవరితోనైనా ఎంత పెద్దవారితే నైనా ధైర్యంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అది ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోవాలి.

కాలం:

కాలాన్ని వృథా చేయకూడదు. కాలాన్ని వృథా చేస్తే వృథా అయిన కాలం మళ్లీ తిరిగి రాదు. ఎప్పటి పనులు అప్పుడు వెంటనే చేసేయాలి.

మాట – దెబ్బ:

కొట్టిన దెబ్బ మాసిపోతుంది. మాట మాత్రం నిలిచిపోతుంది జీవితాంతం. అందుకని మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.

ఇవే మా నాన్నగారు నాకు నేర్పిన మంచి మాటలు.

సారాంశం:

అమ్మ చనిపోయిన వెంటనే వేరే వాళ్ళు  కొందరు నాన్నకి నన్ను ఏదైనా హాస్టల్ లో పెట్టమని సలహా ఇచ్చారు. అక్కడ అయితే నడక నేర్పించవచ్చు ఏదైనా వృత్తిపరమైన విషయాలు నేర్పించవచ్చు అని చెప్పేవారు. నీకు కాస్త శ్రమ తగ్గుతుంది, అప్పుడప్పుడు వెళ్లి చూసి రావచ్చు అని కూడా చెప్పారు. కానీ మా నాన్నగారు అవేవీ పట్టించుకోకుండా నన్ను పెంచి పెద్ద చేయడంలో ఎన్నో కష్టనష్టాలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు భరిస్తూ నేనే ప్రపంచంగా నాకు ఎటువంటి కష్టం కలగకుండా జీవితాంతం కష్టమంతా తానే భరిస్తూ నన్ను పెంచి ఇంత దాన్ని చేశారు. నేను పెరిగి పెద్దయ్యాక ఎన్నో విమర్శలు అవమానాలు భరిస్తూ మా నాన్న ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని తోడుగా చేసుకుని వచ్చిన అవకాశాలను నాకు అనుకూలంగా మార్చుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

ఇవే నా జీవిత అనుభవాలు.

(సమాప్తం)


కృతజ్ఞతలు:

మా గురువులు పితృ సమానులు అయిన శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు, శ్రీ మాచవోలు శివరామ ప్రసాద్ గార్ల ప్రేరణ, ఆశీస్సులతో నా జీవితంలోని అనుభవాలను కూర్చి కధా రూప కల్పన చేయడం జరిగింది. దీనిని నేను రాయడానికి తగిన సలహాలు సూచనలు నా గురువులు ఇద్దరు ఇచ్చారు.

దీనిని నేను google docs లో రాశాను. నా చిన్ని గురువులైన రుషిత, సాయి (మా ఇంటి పక్కన పిల్లలు) వాళ్ళు google docs ను డౌన్లోడ్ చేసి తెలుగు వాయిస్ టైపింగ్ పెట్టించారు. అప్పుడు నేను మాట్లాడుతూ ఇది మొత్తం రాయగలిగాను, మరో పక్క నా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ చేసుకుంటూ.

అప్పుడే నడక ప్రారంభిస్తున్న చిన్నపిల్లకు తండ్రి వేలు పట్టి నడక నేర్పినట్టుగా నా గురువులిద్దరూ నా రచన శైలికి సానపట్టి నేర్పించిన వారు ఇరువురికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నా జీవితయానం కథను అంకితం ఇస్తున్నాను.

ఇక ‘సంచిక’లో ప్రచురణ ప్రారంభంలోనే నా జీవితయానం ఎందరికో ఆదర్శం కావాలి అని ఆశీర్వదించిన సినిమా పాటల రచయిత భువనచంద్ర సార్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇక చదువుతూ వారి వారి అభిప్రాయాలు కొందరు పత్రిక ద్వారా కొందరు వాట్సాప్ లో కొందరు కాల్ చేసి చెప్పిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇంకా దీనికి తగిన సూచనలు సలహాలు ఇచ్చిన ప్రముఖ రచయిత శ్రీ నాగసూరి వేణుగోపాల్ అన్నయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను.

ఇంత గొప్ప ‘సంచిక’ పత్రికలో అతి సామాన్యమైన నా జీవిత యాత్ర అనుభవాలను వారం వారం ప్రచురించినందుకు కస్తూరి మురళీకృష్ణ గారికి, కొల్లూరి సోమ శంకర్ గారికి, సంచిక టీం మొత్తానికి నా హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను.

సెలవు.

Exit mobile version