Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-13

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

ఆపద్బాంధవులు:

ఒకరోజు మధ్యాహ్నం నాన్న బాత్రూంలో నుంచి ఎంతసేపటికి రాలేదు. అప్పుడు నేను మంచం మీద పడుకొని ఉన్నాను. లేవలేక పక్కింటి అంటీ అని పిలిచి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నేను లేస్తాను వెళ్లి నాన్నని చూడాలి అని అడిగాను ఆమె వచ్చి లేపగా వెళ్లి చూసేసరికి నాన్న బాత్రూంలో కొళాయి పట్టుకొని గోడకు అనుకొని నిలబడి వణుకుతున్నాడు. అమ్మో భయమేసింది. ఏం చేయాలో తోచలేదు చాలా బాధపడ్డాను. జీవితాంతం నన్ను మోసిన నాన్నను అలా చూసేసరికి నా బాధ చెప్పడానికి అలవి కావడం లేదు. అప్పుడు హాల్లోకి వచ్చి కిటికీలోంచి చూడగా మల్లికా సుభాషిణి కనిపించారు. వాళ్లను పిలిచి నాన్న పరిస్థితి చెప్పాను. అప్పుడు వెంటనే ఆ పక్కనే వేరే వాళ్లకు సామాన్లు మోస్తున్న పని వాళ్ళను ఇద్దరినీ తాతయ్య బాత్రూంలో ఉన్నారు తాతయ్యకు కరోనా లేదు మేము వెళ్లి వస్తుంటాము. ప్రసూనక్క డబ్బులు ఇస్తుంది కొంచెం వెళ్లి తాతయ్యను ఇంట్లోకి తీసుకురండి అని రిక్వెస్ట్ చేశారు. వెంటనే ఆ పని వాళ్లు వచ్చి నాన్నను పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టారు. నేను డబ్బులు ఇవ్వబోగా వాళ్ళు తీసుకోలేదు. ఆ టైం కు ఆ భగవంతుడు ఆ పని వాళ్లు, మల్లిక సుభాషిణి వాళ్ల రూపంలో వచ్చాడని చెప్పగలను. ఈ మల్లికా సుభాషిణి వీళ్ళిద్దరి రుణం నేనేమి తీర్చుకోగలను. చిన్న అత్తకు ఫోన్ చేసి విషయం చెప్పి బాగా ఏడ్చేశాను. అప్పుడు చిన్న అత్త పెద్ద కొడుకు నెల్లూరు వచ్చి ఉండడంతో ఆ అబ్బాయి మామ కలిసి కేర్ టేకర్‌ను మాట్లాడి సాయంత్రం కల్లా కేర్ టేకర్స్ వచ్చేలా చూశారు. అంతే వాళ్ళు వచ్చాక నాన్న ఆరోగ్య సమస్య ఎక్కువ పైకి లేవలేని స్థితి అయింది. మధ్యలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అప్పుడప్పుడు కంటి చెకప్ వెళ్లి వస్తూ ఉండినాను కదా నాకు ఆరోగ్యశ్రీ మీద కేటరాక్ట్ కంటి ఆపరేషన్ ఏప్రిల్ 26 2021 హాస్పిటల్‌లో జాయిన్ కమ్మని చెప్పారు. నేను చెకప్‌కి వెళ్ళినప్పుడు. మూడు రోజులు హాస్పిటల్ లోనే ఉండాలి అన్నారు. అప్పుడు నాన్నను కూడా హాస్పీటల్‍కి తీసుకెళ్లి నాతో అక్కడ పెట్టుకోవడమా లేక ఇంట్లోనే నాన్నకు ఒక తోడును ఏర్పాటు చేసి నేను హాస్పిటల్‌కి వెళ్లడమా ఇవి రెండే మార్గాలు. అది కరోనా టైం కదా నాన్నను అలా బయటికి తీసుకెళ్ళి నాన్నకు ఏదైనా అయితే చాలా కష్టమైపోతుంది.

నీలావతి:

ఇది అంతా అలోచించి అన్ని దారులు వెతికి చివరకు మా అమ్మ చెల్లెలు పిన్నమ్మ కూతురు నీలావతిని రిక్వెస్ట్ చేసి ఆ మూడు రోజులు నాన్న దగ్గర ఉండి నాన్నకు అన్ని చూసుకోమని చెప్పాను ఆ అమ్మాయి సరే వస్తాను అని చెప్పింది కూడా. కానీ నాన్న ఏమో నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను అని ఒక్కటే చిన్నపిల్లవాడిలా ఏడుస్తూనే ఉండినాడు. ఎంతో నచ్చ చెప్పేదాన్ని నాన్న నీలావతి బాగా చూసుకుంటుంది. నీకేం భయం లేదు నేను ఫోన్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేస్తాను ఆపరేషన్ చేయించుకొని. నాకు కన్ను కనిపించడం లేదు కదా నాకు కన్ను కనిపించకుండా నేనేమీ పని చేయకుండా ఉన్నాను ప్లీజ్ నాన్న ధైర్యంగా ఉండు అని చెప్పే దాన్ని. కానీ నాన్న ఒకటే ఏడుపు. అప్పుడు వెనకింటి సుభాషిణి అక్క ఎందుకు అలా దిగులు పడతారు అంకుల్ మీరు ధైర్యంగా ఉండి అమ్మాయికి ధైర్యం చెప్పి ఆపరేషన్‌కు పంపాలి. మీరే కళ్ళు నీళ్లు పెట్టుకుంటే అమ్మాయి ఏమైపోతుంది అని మీరు ధైర్యంగా ఉండండి అంత మంచే జరుగుతుంది అని చెప్పేది. ఏమో కానీ నాన్న అంతా విని మౌనంగా ఉండేవారు. ఇది అప్పటి నిర్ణయం అంటే నాన్నకు జ్వరం రాకముందు.

కేర్ టేకర్లు వచ్చిన తర్వాత నాన్న పరిస్థితి:

కేర్ టేకర్లు వచ్చిన తర్వాత ఇంట్లో సెలైన్లు పెట్టి ట్రీట్మెంట్ వెంకటేశ్వర్లు డాక్టర్ గారి సలహా తీసుకుంటూ ఇప్పించాను. ఫలితం లేకపోవడంతో కేర్ టేకర్ ఇంక ఇలా కాదు అక్కా, తాతయ్య గారిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లవలసిందే అని చెప్పింది. అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి నాన్న పరిస్థితి చెప్పి హాస్పిటల్‌కి పంపిస్తాను అని చెప్పాను. అయితే అతనికి ఒక కేక్ టేకర్‌ని పెట్టి పంపించు ఈ టైంలో ఎవర్ని నేను చేర్చుకోవట్లేదు నీకోసం నేను చేర్చుకుంటున్నాను అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు మామయ్యకు ఫోన్ చేసి విషయం చెప్తాను. ఆ టైంలో పేషంట్లను ఎవర్ని వెహికల్‌లో తీసుకోబోము అని చెప్పారు. కానీ మామకు తెలిసిన ఒక ఆటో అతను నేను తీసుకెళ్తాను అని మామ ఒక మాట ఇచ్చారు. మామ వెళ్లమనగా అతను వచ్చాడు నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి.

నాన్నను హాస్పిటల్‌లో చేర్చడం:

అప్పటికే నాన్న ఆహారం సరిగా తీసుకోక నీరసంగా కళ్ళు మూసుకుని పడుకొని ఉండేవాడు. అప్పుడు నేను లేపి నాన్న నువ్వు హాస్పటల్ కు వెళ్లి డాక్టర్ గారికి చూపించుకొని బాగా బలం తెచ్చుకొని ఇంటికి నడిచి రావాలి అని చెప్పి లేపాను. నాన్న సుతారాము హాస్పిటల్‍కి వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఆటో అతను వచ్చేలోపే పెద్ద చిన్నాన్న హాస్పిటల్ లో నాన్నకు కావలసినవన్ని సర్ది పెట్టు అని చెప్పగా నేను కేర్ టేకర్ చేత సర్దించాను. ఈ విషయం కూడా నాకు తోచలేదు చిన్నాన్న చెస్తే గాని నాకు ఒకటే దిగులు నాన్న ఎప్పటికి కోలుకుంటాడు అని అంతేకానీ నాకు ఇంకేమి తోచట్లేదు మైండ్ పనిచేయట్లేదు. ఆటో అతను వచ్చే సమయానికి కరెంటు పోయింది. నాన్నను కిందకు దించాలంటే ఆటో అతను ఒక్కరే సరిపోరు. జ్వరంతో ఉన్న నాన్నను పట్టుకోడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ సమయంలో. సమయానికి మా పక్కింటికి ఒక కొరియర్ బాయ్ వచ్చాడు. అపరిచితుడు. అతను కనిపించగానే వెంటనే పిలిచి మా నాన్నకు బాగాలేదు హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలి ఆటో వచ్చి ఉంది లిఫ్ట్ లేదు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను. దైవం మానుషరూపేనా అంటారు కదా అది ఇదియేనేమో. నాన్నను రెడీ చేసి కుర్చీలో కూర్చోబెట్టి ఆటో తను కొరియర్ బాయ్ ఇద్దరు కలిసి కిందకు మోసుకొని వెళుతుంటే నేను వెళ్ళను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఒకటే పెద్దగా అరుపులు కేకలు పెట్టాడు నాన్న. వెంట కేర్ టేకర్ వెళ్ళింది. అది చూసి నా గుండె లలిసిపోయేలా ఏడ్చాను ఏమి చెప్పేది నా బాధ. ఆరోజు ఏప్రిల్ 24 2021 నాన్నను హాస్పిటల్ లో చేర్చింది. తీరా హాస్పిటల్ కు వెళ్ళాక నేరుగా రూమ్ లోకి తీసుకొని వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందట. అక్కడి నర్సు నాన్నను హాస్పిటల్ లోకి తీసుకొని వెళ్లడానికి ఒప్పుకోలేదట. ఎక్కువసేపు నాన్నని నిలబెట్టి పట్టుకోవాల్సి వచ్చిందట తీసుకొని వెళ్ళిన కేర్ టేకర్ ఆటో డ్రైవర్ చెప్పారు. కారణమేమంటే డాక్టర్ గారు నర్స్‌కు చెప్పలేదట లోపలికి తీసుకొని రమ్మని మరిచిపోయారట.

హాస్పిటల్లో నాన్న చివరగా మాట్లాడిన మాటలు:

తర్వాత మళ్లీ డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని నాన్నను హాస్పిటల్‌లో చేర్చుకున్నారు. సెలైన్ పెట్టడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆరోజు రాత్రి కేర్ టేకర్ కు వీడియో కాల్ చేసి నాన్నతో మాట్లాడాను నాన్న కూర్చున్నారు. నన్నెందుకు హాస్పిటల్ లో చేర్చావు నేను ఇంటికి వచ్చేస్తాను నీకు తోడు ఎవరున్నారు అక్కడ అని గోల చేశాడు. నాన్న నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు నువ్వు డాక్టర్ గారి దగ్గర మందులు తీసుకొని నడుచుకుంటూ రా నాన్న అందుకోసమే నిన్ను హాస్పిటల్ లో చేర్చాను అని చెప్పాను నాకేం భయం లేదు నాన్న పక్కన అమ్మాయి హర్షిత వచ్చి నా దగ్గర పడుకుంటుంది అని అబద్ధం చెప్పాను. ఏం చేయను నాన్న కొంచెం మనశ్శాంతిగా ఉండడం కోసం చెప్పాను అంతే. మళ్లీ పక్క రోజు ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చేస్తాను రోహిణి వాళ్ళ ఆయన డాక్టర్ గారికి చెప్పి ఈ డాక్టర్ గారితో మాట్లాడమని నన్ను డిశ్చార్జ్ చేయించు అని చాలా బాధతో చెప్పాడు. నాన్న అలాగా డిశ్చార్జ్ చేయిస్తాను కానీ నీకు కొంచెం శక్తి రావాలి కదా శక్తి వస్తే నిన్ను అలాగే వెంకటేశ్వర్లు డాక్టర్ గారే ఇంటికి పంపించేస్తారు అని చెప్పాను. ఇంకా నేమో కేర్ టేకర్ వద్ద ఉన్న డబ్బులు చూసి నీకు డబ్బులు ఎక్కడివి అని అడిగాడట మీ అమ్మాయి ఇచ్చింది అని చెప్పిందట. ఆ డబ్బులు డాక్టర్ గారికి చూపించకు నన్ను డిశ్చార్జ్ చేయరు అని చెప్పాడట కేర్ టేకర్‌కు. ఆరోజు రాత్రి మా చిన్న అత్త నాన్నకు వీడియో కాల్ చేసి పలకరించింది అప్పుడు అత్తతో ఏంటమ్మా నాకు ఈ కర్మ నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడట. అలాగే వచ్చేస్తూ కొంచెం తగ్గి నీకు శక్తి వస్తే ఇంటికి తీసుకొచ్చేస్తాము అని ధైర్యం చెప్పిందట అత్త. అంతే ఆ రోజు రాత్రి అత్త నాకు కూడా ఫోన్ చేసి మీ నాన్నతో మాట్లాడాను ధైర్యం చెప్పాను తగ్గిపోతుందిలే త్వరగా ఇంటికి తీసుకొని వస్తాము అని నాకు కూడా ధైర్యం చెప్పింది. సరే తప్పదు కాబట్టి ఆ రోజు కూడా అన్నం తిని పక్కింటి లీలేష్ కు ఫోన్ పక్కన పెట్టుకో పొద్దున ఫోన్ చేస్తాను నువ్వు వచ్చి నన్ను లేపు అని అని చెప్పి పడుకున్నాను. పడుకున్నానే కానీ ఏంటో మనసులో అలజడి నాన్నను కేర్ టేకర్ మేలుకొని సెలైన్ చూస్తుందో లేదో నిద్రపోతుందో భయపడుతూ రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేస్తూనే ఉండినాను.

అది ఏప్రిల్ 26, 2021 నాన్న మరణం:

ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు. భయం ఎక్కువై వేకువ జామున 4:00 అప్పుడు పల్లా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి మాట్లాడాను. ఏం కాదు భయపడకు ప్రసూనా, నాన్నకు బాగా అవుతుంది అని ధైర్యం చెప్పాడు. ఆ టైంలో రోహిణి డిస్ట్రబ్ చేయకూడదని రోహిణికి ఫోన్ చేయలేదు. హాస్పిటల్ కు వెళ్ళిన మొదలుకొని రోహిణి నాకు ధైర్యం చెబుతూనే ఉంది. తనకు బాగాలేదు అని చెప్పిందే కానీ ఏం బాగాలేదో చెప్పలేదు. సరే తెల్లవారి ఐదున్నర అయిన తర్వాత పక్కింటి లీలేష్‌కు ఫోన్ చేశాను. లీలేష్ వచ్చి నన్ను లేపాడు. లేచి మళ్లీ హాస్పిటల్‌లో ఉన్న కేర్ టేకర్ కు ఫోన్ చేశాను. అప్పుడు కూడా కేర్ టేకర్ ఫోన్ ఎత్తలేదు. నాకు టెన్షన్ పెరిగిపోయింది. అలాగే కళ్ళు తిరుగుతుంటే కాస్త పాలు తాగి పని చూసుకుని వచ్చి ఆరు గంటలకు మళ్లీ కేర్ టేకర్‌కు ఫోన్ చేశాను. అప్పుడు ఎత్తింది “ఏమీ లేదు అక్కా, తాతయ్యకు సీరియస్‌గా ఉంది” అని చెప్పింది. నాకు భయం మొదలైంది. వెంటనే మామయ్యకు ఫోన్ చేశాను నేను కనుక్కుంటాను అన్నారు మామయ్య. అరగంట తొలి తరువాత మళ్లీ కేర్ టేకర్ ఫోన్ చేశాను. అప్పుడు కేర్ టేకర్ హాస్పిటల్లో ఇంకెవరో ఒక అతనికి ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించింది. అతను చెప్పాడు మీ నాన్నగారు వెళ్లిపోయారు తిరిగిరాని లోకాలకు అని చెప్పేసాడు. నాకేమైందో నాకే తెలియలేదు ఆ మాట వినడంతో ఒక్క క్షణం ఆగి పెద్దగా కేకలు పెట్టేసాను. ఏడవడం మొదలు పెట్టేసాను. చిన్న అత్తకు ఫోన్ చేశాను. మేము వస్తున్నాము నిన్ను కిందకు తీసుకొని వెళ్తాము అని చెప్పింది. ఆ తరువాత అలానే ఏడ్చుకుంటూ రోహిణికి, పల్ల వెంకటేశ్వర్లుకు, పిన్ని కూతురు నీలావతికి ఫోన్ చేసి చెప్పాను అలానే. అప్పుడు రోహిణి నాకు ధైర్యం చెబుతూ తను కూడా ఏడ్చేసి అసలు విషయం చెప్పింది. అప్పుడు తనకు కరోనా అట, రూమ్‌లో ఉండిపోయింది తను కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. నాన్నను తీసుకొని వస్తే నాకు వీడియో కాల్ చేసి చూపించు అని చెప్పింది. నేను సరే అన్నాను అలా ఏడ్చుకుంటూ. నాన్నను ఇంటికి తీసుకొని రావడానికి హాస్పిటల్లో కార్యక్రమాలన్నీ మామయ్యే చూసుకున్నారు అంబులెన్స్ అంతా మామయ్య మాట్లాడారు. మామయ్య కేర్ టేకర్ కు అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది నువ్వు వెళ్లి ఆ అమ్మాయిని బాగా చూసుకో అని చెప్పాడట. కేర్ టేకర్ నాన్నను తీసుకొని వచ్చినా అంబులెన్స్ లోనే వచ్చింది అప్పటివరకు నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఒకరిద్దరూ పలకరించారు అంతే. ఆనాటి నా పరిస్థితి వర్ణనాతీతం. ఎవరికి రాకూడదు ఆ బాధ. నాన్నని ఇంటికి తీసుకొని వచ్చారు. నన్ను కిందికి తీసుకుని పోవాలని అనుకొని వీలుకాక నాన్ననే పైకి తీసుకుని వచ్చి వాకిట్లోనే పడుకోపెట్టేశారు. ఈ లోపల ఒకరిద్దరు మాత్రమే పైకి వచ్చారు. వారిలో ఒకరు కార్తీక్ మా చిన్న అత్త చిన్న కొడుకు. మా రెండో చిన్నాన్న భార్య మంజుల పిన్నమ్మ ఆ తర్వాత మా పిన్ని కూతురు అంటే అమ్మ చెల్లి కూతురు నీలావతి వచ్చింది. మిగతా అందరూ కిందనే ఉండిపోయారు కారణం ఇక్కడ చుట్టుపక్కల కరోనా ఉండడమే. ముఖ్య కారణం అందరూ పెద్దవాళ్లు.

ఆనాటి నా ఒంటరితనం – ఇక్కడి వారి సహాయ సహకారాలు:

ఆనాటి నా బాధ ఏమని చెప్పను.. ఎలా చెప్పను. నాన్నను ఐదు నిమిషాలు మాత్రమే ఉంచారు. ఆ ఐదు నిమిషాలలో రోహిణికి వీడియో కాల్‌లో నాన్నను చూపిస్తూ ఏడుచుకున్నాను. అంతే నాన్న తీసుకుని వెళ్ళిపోయారు. నాన్నను చిన్న చిన్నాన్న చిన్న అత్త చిన్న కొడుకు చివరి వరకు వెళ్లి ఆ రోజు కార్యక్రమం జరిపించారు. అయిపోయింది. నాన్నకు నాకు రుణం తీరిపోయింది. అందరూ వస్తారని ఎదురు చూశాను తెలియక కానీ ఎవరు రాలేదు. అందరూ ఫోన్లు చేసి పలకరిస్తూనే ఉండినారు ఆ రోజంతా. కేర్ టేకర్ నాకు తోడు ఉండింది. పక్కన వాళ్ళు తినడానికి ఇచ్చారు. ఆ రోజంతా సుబ్బమ్మ అంటి వంట చేసుకుని లోపలికి వచ్చి నన్ను పట్టుకొని నాకు ధైర్యం చెబుతూ అన్నం తినిపించింది. ఇంత మంచి ఉదార స్వభావం ఎవరికి ఉంటుంది. సుబ్బమ్మ ఆంటీ. ఇంకా మల్లికా, సుభాషిణి, లీల అక్క ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చాలా సహాయం. పల్లా వెంకటేశ్వర్లు రాజుపాలెం నుంచి వచ్చాడు. అతను వచ్చే సరికి నాన్నను తీసుకెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు ఒక రెండు గంటలసేపు ఉండి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. సరే ఆ రోజు అయిపోయింది. పక్క రోజు మామయ్య చెప్పారు ఈ పది రోజులు కేర్ టేకర్ నీకు తోడుగా ఉంటుంది ధైర్యం తెచ్చుకోవాలి. తరువాత నీ గురించి మీ పెద్ద చిన్నాన్న నిర్ణయిస్తారు. ధైర్యంగా ఉండు అని చెప్పారు మామయ్య. ఆ పది రోజులు ఏదో గడిచాయి. మా పెద్ద చిన్నాన్న నాన్నకు క్రతువులు చేయించాలని చాలా ప్రయత్నం చేశారు. చాలా మథనపడ్డారు. కరోనా కారణంగా నాన్నకు క్రతువులు చేయించడానికి వీలు కాలేదు. నాన్నకు అది కూడా దక్కలేదు. 11వ రోజు పురోహితుణ్ణి పిలిచి పుణ్యావచనం మాత్రమే చేయించుకున్నాను. అది కూడా మా పెద్దత్త చెప్పిన ధైర్యం వల్లనే జరిగింది.

మా పెద్ద చిన్నాన్న నా కోసం తీసుకున్న నిర్ణయం:

ఆ తరువాత మా పెద్ద చిన్నాన్న ఫోన్ చేసి అమ్మా నువ్వు ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇక జీవితాంతం కేర్ టేకర్ ఉండదు. ధైర్యం తెచ్చుకొని ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో బయటకు వెళితే అక్కడ నచ్చకపోతే ఇంటికే తిరిగి రావాలి. ధైర్యంగా ఉండు సరేనా జాగ్రత్త. మేమందరము నాన్న ఉన్నప్పుడు ఎలా డబ్బులు పంపుతూ ఉండినామో అలానే ప్రతి నెల నీకు పంపుతాము అని చెప్పారు పెద్ద చిన్నాన్న. అప్పుడు నాకు అర్థం కాలేదు చిన్నాన్న ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్న తర్వాతనే నాకు అర్థమైంది చిన్నాన్న ఎందుకు చెప్పారో. అప్పుడు పది రోజులు కాదు ఒకటిన్నర నెల ఇద్దరు కేర్ టేకర్లను పెట్టారు. అందరూ కలసి. ఈ లోపు నేను ఒంటరిగా ఉండడానికి కావలసిన సదుపాయాలు మళ్లీ నేను ఒంటరిగా పడుకుంటే పైకి లేవడానికి తగిన వసతిని మనుషుల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాను నాన్న గురించి ఏడుస్తూనే. రోజులు గడుస్తున్నాయి. ఇంచుమించు 18, 19 రోజులు పైన అయింది.

నా గురువులను కలవడం:

మా అమ్మ చెల్లెలు పిన్ని కూతురు నీలావతి ఫోన్ చేసి కరోనా కారణంగా మాచవోలు భాస్కరం గారు పేద బ్రాహ్మణులకు ధన సహాయం చేస్తున్నారని ఎవరైనా ఉంటే చెప్పమన్నారని నీ పేరు ఇవ్వమంటావా అని నన్ను అడిగింది. మా మేనత్తలను కనుక్కొని చెప్తాను అని చెప్పాను. వాళ్లు సరే అన్నాక నీలావతికి చెప్పాను నా పేరు ఇవ్వమని. నీలావతి తన భర్త చేత భాస్కరం గారికి చెప్పించి నా పేరు ఇచ్చిది. అకౌంట్ నంబర్ భాస్కరం గారికి నన్ను ఇవ్వమని ఆయన నంబర్ నాకు ఇచ్చింది. కరెక్ట్‌గా అప్పుడు నాన్న చనిపోయి 20 రోజులు అయింది. ఈ 20 రోజులు నాన్న కోసం ఏడుస్తూనే ఉన్నా భాస్కరం గారి నంబర్ ఇచ్చింది భయమైన ఇక మాట్లాడాలి ఆ సార్‌తో. నా గాజుల బిజినెస్‍కు సంబంధించిన వాళ్లు అప్పటివరకు అవసరాన్ని బట్టి గవర్నమెంట్ ఎంప్లాయిస్‌తో మాట్లాడానే తప్ప నేను ఎవరితోనూ మాట్లాడలేదు. అయినా సరే నన్నే అకౌంట్ నెంబర్ చెప్పమని చెప్పడంతో నేనే ఫోన్ చేశాను. అదే చాలా మంచిదయింది ఒకరకంగా అదృష్టం కలిసి వచ్చింది. ఆ సార్ ఎత్తారు. ఇలా చెప్పాను వివరం ఓకే అమ్మ అకౌంట్ నెంబర్ పెట్టండి అన్నారు. ఎందుకో సడన్‌గా మాచవోలు భాస్కరం గారు అనగానే నాకు శివరామ ప్రసాద్ సార్ పేరు తోచి మీకు శివరాం ప్రసాద్ సార్ తెలుసా తెలిస్తే కనుక నేను ఆ సార్ స్టూడెంట్ ని ప్లీజ్ దయచేసి ఆ సార్ నంబర్ ఇవ్వండి అని రిక్వెస్ట్‌గా అడిగాను భాస్కరం గారు తెలుసమ్మా ఇస్తాను అని వెంటనే ఇచ్చేశారు. ఆహా ఏమి నా సంతోషం పట్టరాని ఆనందం. ఏదో తెలియని ధైర్యం. ఒకచోట పోగొట్టుకున్నది ఇక్కడ దొరికింది అన్న ఆనందం. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలనుకున్న శివరాం ప్రసాద్ సార్‌తో. కానీ ఆరోజు గురువారం రాత్రి నాకు నంబరు ఇచ్చింది పొద్దు పోయింది. రాత్రి 9:30. రాత్రిపూట పక్క రోజు శుక్రవారం అయినాయి. ఆ టైం లో నాన్న చనిపోయిన విషయం చెప్పకూడదు కదా. ఫోన్ చేయకుండా ఆగలేక శివరామ ప్రసాద్ సార్ కు మెసేజ్ చేశాను. నేను ఫలానా అని శనివారం కాల్ చేస్తాను అని చెప్పాను సార్ చూసుకొని అలాగే అమ్మ అని మెసేజ్ చేశారు ఆహా ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేను. బలవంతంగా శనివారం దాకా ఆపుకున్నాను ఫోన్ చేయకుండా. ఎలాగో శనివారం వచ్చింది. అంతే ఉదయం 11 గంటలకు అలా సార్‌కు ఫోన్ చేశాను. విషయం సార్ కు చెప్పి బోరున ఏడ్చేశాను. నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి మేమంతా ఉన్నాం అని ధైర్యం చెప్పారు ఈ మాట నాకు నాన్న చెప్పినట్లుగా ఉంది నాన్ననే శివరామ ప్రసాద్ సార్ రూపంలో వచ్చి పలకరించారేమో అనిపించింది. ఆ తరువాత శ్రీ కాళిదాసు పురుషోత్తం సార్ నంబర్ ఇచ్చారు. ఇంకా రామకృష్ణ సార్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ ఇద్దరు సార్లకు కూడా ఫోన్లు చేసి మాట్లాడాను ఇద్దరూ చాలా ధైర్యం చెప్పారు. పురుషోత్తం సార్ కూడా శివరామ ప్రసాద్ సార్ లాగే నన్ను వాళ్ల సొంత బిడ్డగా అంగీకరించి ధైర్యం చెప్తున్నారు. వీళ్లు ఇస్తున్న ధైర్యమే నా బలం నేను ఒంటరిగా ఉండడానికి వీళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం నా ఒంటరి జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడిపిస్తోంది. అలాగే నా ప్రాణ స్నేహితురాలు రోహిణి, నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ధైర్యం చెప్పే విధానం అంతా ఈ విధంగా ఒంటరిగా ముందుకు నడవడానికి నాకు దారి దొరికింది. అప్పటినుంచి నాకు రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేసి అది సారు వాళ్ళు కానీ నేను చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తూ నాకు ధైర్యం చెబుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు.

నా గురువులకు నా ప్రాణ స్నేహితురాలిని పరిచయం చేయడం:

శివరామ ప్రసాద్ సార్‌కు పురుషోత్తం సార్‌కు రోహిణి పరిచయం చేశాను. రోహిణి కూడా అప్పుడప్పుడు సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఈలోపు ఒకటిన్నర నెల పూర్తయింది కేర్ టేకర్‌లు వెళ్లిపోయారు.

ఒంటరి జీవితం ప్రారంభం:

ఒంటరి జీవితం మొదలైంది. ఇంచుమించు నాన్న చనిపోయిన ఒక నాలుగు ఐదు నెలల తరువాత మా చిన్నాన్నలు మేనత్తలు అందరూ కలిసి నాకు కంటి ఆపరేషన్ చేయించారు. మా చిన్న అత్త భర్త మామయ్య నా దగ్గరుండి నా ఆపరేషన్ విషయాలు అన్నీ చూసుకున్నారు. ఏ కష్టం వచ్చినా మామయ్యే ముందు ఉంటారు. మళ్లీ నేను కోలుకునే వరకు కేర్ టేకర్‌ను పెట్టారు. తర్వాత నేను నా పనులు నేను చేసుకోవడం ప్రారంభించాను. కేర్ టేకర్లు ఉండగానే ఆపరేషన్ అయిన 15 రోజులకే డాక్టర్ గారి సలహా మేరకు చిన్నగా గాజులు చేయడం స్టార్ట్ చేశాను. అందువల్ల నాకు ఎటువంటి. ఇబ్బంది కలగలేదు.

వాణి గారు- డెమోస్:

ఆ తర్వాత హైదరాబాద్ బ్రాహ్మణ గ్రూప్ అడ్మిన్ వాణి గారు గ్రూప్ సభ్యుల నందరిని ఒకటి చేసే ప్రయత్నంగా అంటే బిజినెస్ పెరగడం కోసం జూమ్ మీటింగులు, ఆ తరువాత డెమోస్ స్టార్ట్ చేసింది. అందరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. డెమోస్ ద్వారా వాళ్ల వాళ్ల వ్యాపారాలు ఒకరికొకరు తెలుసుకొని ఆర్డర్లు వచ్చే అవకాశం కలిగింది.

దివ్య తో పరిచయం:

ఆ గ్రూప్ లో దివ్య అనే ఒక అమ్మాయి ఉల్లుతో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తుంది అద్భుతంగా. ఆ అమ్మాయి నా డెమో చూసి నన్ను మెచ్చుకొని నాకు రెండు యూకే ఆర్డర్లు ఇప్పించింది. అప్పటికే అంతకుముందు నాకు అమెరికా ఆర్డర్లు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా యూకే ఆర్డర్ రావడంతో నాకు చాలా సంతోషమై వెంటనే శివరామ ప్రసాద్ సార్‌కు ఫోన్ చేశాను పొద్దున్నే. సార్ విష్ యు గుడ్ లక్ అమ్మా అని ఆశీర్వదించారు చాలా సంతోషం వేసింది. ప్రతి ఒక్క దాంట్లో పురుషోత్తం సార్ శివరామ ప్రసాద్ సార్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ధైర్యం చెబుతూ ముందుకు నడిపిస్తున్నారు. దివ్యకు ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమైన టీవీ సీరియల్ నటి మేఘన గారికి నేను గాజులు గిఫ్ట్‌గా పంపాను. ఆమె నన్ను ప్రమోట్ చేస్తూ వీడియో చేసి ఇంస్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ తరువాత టీవీ యాంకర్ శ్రీలత అనే ఆమెకు కూడా దివ్య ద్వారానే గాజులు పంపాను. ఆమె కూడా నన్ను ఇంస్టాగ్రామ్‍౬లో ప్రమోట్ చేసింది. నాకు ఇంకా కొన్ని ఆర్డర్లు కూడా ఇప్పించింది. మేఘన గారి వీడియో ఇంస్టాగ్రామ్ లో చూసి మేఘన గారి ఫ్రెండ్ పల్లవి వివేక గారు నాకు ఆర్డర్ ఇచ్చారు గాజులు. ఆమె నేను చాలా దగ్గర అయ్యాము. దివ్య నాకు మంచి ఫ్రెండ్.

దుర్గ గారు:

ఇంకా దుర్గ గారు ఆ గ్రూప్ లో నాకు ఏదైనా మెటీరియల్ దొరకకపోతే ఆమె తీసుకునే చోట వాళ్ల నంబర్ నాకు ఇచ్చి చాలా సహాయం చేశారు దుర్గ గారు.

అనురాధ గారు:

ఈ గ్రూప్ నుంచి అనురాధ గారు పరిచయమయ్యారు అనురాధ గారిది సొంత ఊరు నెల్లూరే. కాబట్టి నెల్లూరు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు. అనురాధ గారు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొక విశేషమేమంటే అనురాధా గారు మా గురువులైన శివరామ ప్రసాద్ సార్ రిలేటివ్ స్నేహితురాలట. ఇది తెలిసి చాలా సంతోషమైనది.

మా అరుణ అక్క:

ఇంస్టాగ్రామ్ మా పెద్దత్త కోడలు అరుణ అక్క లోకల్ యాప్‌లో నా గురించి ఒక ఆర్టికల్ రాసింది. గతంలో నేను ఒక స్టేజి కి వచ్చిన తర్వాత. ఇంకా తన తరఫున కొన్ని ఆర్డర్లు ఇప్పించింది. అప్పుడు మా పెద్దత్త పెద్దబ్బాయి నన్ను ఇంస్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు.

యస్ శ్రీ లలితా బ్రెడ్ బ్యాంగిల్స్ స్టోర్:

ఇంస్టాగ్రామ్ లో నేను నా బ్యాంగిల్స్ కు ఎస్ శ్రీ లలిత త్రెడ్ బ్యాంగిల్స్ స్టోర్ అని పేరు పెట్టుకున్నాను. ఎస్ అంటే నన్ను పెంచి అమ్మ చేసే సేవలన్నీ చేసిన శారదాంబ మా నానమ్మ పేరు శ్రీ లలిత అంటే నేను కొలిచే అమ్మవారి పేరు. అలా రాయించుకున్నాను. ఆ తర్వాత దివ్య ద్వారా ఇంకా కొన్ని ఆర్డర్లు వచ్చాయి ఇంకా ఆ గ్రూపులో వాళ్లు కూడా కొంత సపోర్ట్ చేశారు.

తాత గారి జీవన్ముక్తి గ్రంథం గురించి నా గురువులతో:

పురుషోత్తం సార్ శివరామ ప్రసాద్ సార్ వాళ్లతో మాట్లాడుతున్న క్రమంలో మా తాతగారు జీవన్ముక్తి అనే పుస్తకాన్ని రాశారు. మా పెద్ద చిన్నాన్న దాన్ని అచ్చు వేయించే ప్రయత్నం చేశారు ఎందుకో అది కుదరలేదు అది ఇప్పుడు మా పెద్ద చిన్నాన్న దగ్గర ఉంది హైదరాబాదులో అని చెప్పాను మీకు చూపిస్తాను అని కూడా అడిగాను. అప్పుడు ఇద్దరు సార్లు ఒకే తెప్పించు అన్నారు. పెద్ద చిన్నాన్న కు చెప్పాను. చిన్నాన్న వెంటనే నేను పోస్ట్ చేస్తాను అని చెప్పారు. పోస్ట్ చేశారు కూడా.

మా పెద్ద చిన్నాన్న చేసిన పోస్ట్-దానిని ఇంటికి తెప్పించుకోవడానికి నా పోరాటం:

కారణం తెలియదు కానీ ఆ పోస్ట్ నా అడ్రస్ కు రాకుండా నెల్లూరులో వేరే చోటికి వెళ్లిపోయింది. ఇక నాకు ఒకటే టెన్షన్ ఎందుకంటే మళ్లీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందంటే మళ్ళీ మా పెద్ద చిన్నాన్న శ్రమపడి మళ్లీ బయటికి వచ్చి పోస్ట్ చేయాలి వెనక్కి వెళ్తే మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ఒకటే టెన్షన్ నాకు ఏం చేయాలో తెలియలేదు ఒక గంట సేపు. తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ లో పాత పోస్ట్ మాన్ సంపత్ నంబర్ దొరికింది. అతనికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి అది వెనక్కి పోకుండా నా అడ్రస్ కే వచ్చేటట్లు చేసుకున్నాను ఈ క్రమంలో చాలా శ్రమ పడ్డాను. నా చేతికి వచ్చాక వాటిని జిరాక్స్ కాపీలుగా తీయించి ఇద్దరు సార్లకు పంపించాను. వారిద్దరూ ఆ పుస్తకాన్ని చూస్తున్నారు.

పురుషోత్తం సార్- సి.ఎస్.డి మీటింగ్:

ఇది అలా ఉండగా ఒకరోజు పురుషోత్తం సార్ కాల్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది నేను మాట్లాడుతున్నాను నువ్వు అటెండ్ అవుతావా అన్నారు అలాగే సార్ నాకు ఇష్టమే అని చెప్పాను. ధైర్యంగా జాయిన్ అయితే అయ్యాను కానీ సార్ చెప్పింది విన్నాను అప్పటికి సార్ గురించి నాకు పెద్దగా తెలియదు ఆరోజు విన్నాను. ఇకపోతే ఆ హోస్ట్ సార్ నా కొత్త నంబర్ చూసి ఎవరు మీరు మాట్లాడండి ఎవరు మీరు మాట్లాడండి అని రెండు మూడు సార్లు పిలిచారు. నాకు అర్థం కాలేదు నన్ను పిలుస్తున్నారని. అయినా నాకు భయం అక్కడ అందరూ పెద్దవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞాపాటవాల ముందు నేను చాలా చిన్నదాన్ని. ఆరోజు మీటింగ్ అయిపోయింది. నేనేం మాట్లాడలేదు. అప్పుడు పురుషోత్తం సార్ అడిగారు. నిన్ను పిలిస్తే నువ్వెందుకు మాట్లాడలేదు అని. నాకు తెలియలేదు సార్ నన్ను పిలుస్తున్నారు అని చెప్పాను.

CSD జూమ్ మీటింగ్ లో పరిచయమైన సుధీమతి మేడం

సుధీమతి మేడం వారి స్నేహితులు కస్తూరి మేడం రిటైర్డ్ తెలుగు లెక్చరర్ సుధీమతి మేడం స్టూడెంట్ పృథ్వి వారి అమ్మగారు

సుధీమతి మేడం వారి స్నేహితులు కస్తూరి మేడం రిటైర్డ్ తెలుగు లెక్చరర్ సుధీమతి మేడం స్టూడెంట్ పృథ్వి వారి అమ్మగారు

గురువులిద్దరూ మా ఇంటికి రావడం:

దాని తర్వాత కొన్నాళ్లకు పురుషోత్తం సార్ శివరామ ప్రసాద్ సార్ ఇద్దరు కలిసి నా ఆహ్వానం మేరకు మా ఇంటికి వచ్చారు. అప్పుడు రోహిణి కూడా వచ్చింది. ఆరోజు ఎంత సంతోషనుంటే చెప్పలేనంత ఆనందం. ఎప్పుడో చదువు చెప్పిన గురువులను కొన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా చూడడం మాట్లాడగలడం ఇంటికి రావడం ఇదంతా ఎంత అదృష్టం తల్లి తండ్రి తర్వాత గురువే కదా అలాంటి గురువుల ఆశీర్వచనాలు ఆరోజు నేను రోహిణి ఇద్దరం కలిసి పొందాము. చాలా ఆనందంగా గడిపాము మళ్లీ మా నాన్న వాళ్ళ రూపంలో తిరిగి వచ్చినట్లుగా అనిపించింది నాకు. సార్ వాళ్లు ఇంట్లో ఉండగానే గిరిజ మేడం కాల్ చేశారు పురుషోత్తం సార్‌కు. అప్పుడు పురుషోత్తం సార్ నాకు ఇచ్చారు గిరిజ మేడంతో మాట్లాడమని. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గురువులిద్దరూ సాయంత్రం వచ్చారు. అప్పుడు రోహిణి కొంచెం ముందుగా వచ్చింది రోహిణికి తోడు ఆరోజు శ్యామల రావడానికి కుదరలేదు. రోహిణి ఒంటరిగా ఆటోలో వచ్చింది అనుకున్నాను కానీ ఆ రోజు రోహిణి తన భర్త అయిన కృష్ణ డాక్టర్ గారు ఆ అమ్మాయిని స్కూటర్ మీద తీసుకుని వచ్చి కింద వదిలి వెళ్లారు.

గిరిజ మేడంతో పరిచయం:

ఇది ఇంకొక సంతోషం ఏమని చెప్పాలి. మాటలు రావడం లేదు. అంతే గిరిజ మేడం కూడా చాలా సంతోషపడ్డారు. ఇంటికి వస్తామన్నారు మేడం కూడా. పురుషోత్తం సార్ ఇద్దరు నాకు అప్పుడప్పుడు బహుమతి రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే గిరిజ మేడం కాంటాక్ట్ లోకి రావడంతో మేడం కూడా చాలా పెద్ద సహాయం చేస్తున్నారు.

గిరిజ మేడం ద్వారా కృపావతి మేడం కూడా కాంటాక్ట్ లోకి వచ్చారు. కృపావతి మేడం కూడా నాకు గిఫ్ట్ రూపంలో సహాయం చేస్తోంది. అందరూ సార్లు మేడం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి పలకరించి వెళుతున్నారు మా నాన్న లేని దానికి వీరందరూ కాంట్రాక్టులోకి రావడం నాకు ధైర్యం చెప్పడం నన్ను ముందుకు నడిపించడం నా ఎదుగుదలకు కారకులు కావడం అలాగే నా కుటుంబం కూడా నాకు ఏ లోటు రాకుండా చూస్తూ నాకు ధైర్యం చెప్పుతూ మేమున్నాము అంటున్నారు.

నా గురువులకు నా పట్ల అభిమానం:

శివరామ ప్రసాద్ సార్ కు ఫోన్ చేసినప్పుడు నాకు పురాణాలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే పురుషోత్తం సార్ కూడా నా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. గిరిజ మేడం కృపావతి మేడం కూడా.

(ఇంకా ఉంది)

Exit mobile version