Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-12

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

తెలంగాణ కోవి మెంబర్ వాణి గారితో పరిచయం:

ఇంకా కొవి మెంబర్ వాణీ గారు నాకు కొన్ని బ్యాంగిల్స్ అమ్మి పెట్టారు. ఆ తరువాత వారు సొంతంగా ఒక బ్రాహ్మణ గ్రూపు ఒకటి, ఇంకొకటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యుయర్ గ్రూప్ ఇంకొకటి క్రియేట్ చేసి అందులో నన్నుసభ్యురాలుగా చేశారు. అక్కడ నుంచి కూడా కొన్నిఆర్డర్స్ వచ్చాయి. గ్రూప్ సభ్యులందరికీ ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి డెమోలు చేయించారు. నేను కూడా ఒక రోజు నా ప్రోడక్ట్‌తో డెమో చేశాను జూమ్ మీటింగ్స్‌లో.

ఏపీ కోవిలో చేరడం:

ఆ తరువాత తెలంగాణ కోవి ప్రెసిడెంట్ లలిత మేడం ఏపీ కోవి గ్రూప్ అప్పటి ప్రెసిడెంట్ రాజమణి మేడం నంబర్ ఇచ్చి అక్కడ కూడా చేయమన్నారు. రాజమణి మేడం నన్ను ఏపీ కోవి ఫ్రెండ్స్ గ్రూప్‍లో చేర్చుకున్నారు. అక్కడ కూడా నేను డిజైన్స్ పోస్ట్ చేశాను. అక్కడ కూడా ఇంతకు ముందు గ్రూప్స్‌లో లాగానే కనిపించిన నంబర్లకు అన్నిటికీ ఫోన్లు చేసి వాళ్లతో మాట్లాడి నన్నునేను పరిచయం చేసుకుని నేను బ్యాంగిల్స్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి అని రిక్వెస్ట్‌గా అడిగేదాన్ని. వాళ్ళు తప్పకుండా చేస్తాము అని చెప్పేవాళ్ళు. ఇలా నా బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాను.

విదేశాల నుంచి ఆర్డర్స్ రావడం:

ఆ క్రమంలోనే అన్ని గ్రూపులలో ఉన్న మెంబర్స్ ఇండియాలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా కొంతమంది ద్వారా అమెరికా నుంచి కూడా ఆర్డర్స్ రావడం ప్రారంభమైనది. ఈ విధంగా గ్రూపులు పెరగడం ఆర్డర్స్ రావడంతో నా ఫోన్ వాట్సాప్ ఫుల్ అయిపోయి ఓపెన్ కాలేదు. స్పేస్ లేకుండా పోయింది. ఇక మళ్లీ భయమేసింది ఎవరిని అడగాలా ఫోన్ కొనివ్వమని. ఎవరికి చెప్పినా అందరూ ఇచ్చేది కాకుండా మళ్లీ అందరిని దీని కోసం ఇబ్బంది పెట్టవలసి వస్తుంది.

మా చెల్లి నా కోసం ఫోన్ కొనడం నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు:

ఇలా బాధపడుతూ ఉండగా మా చెల్లినాకు 64 జిబి సాంసంగ్ ఫోన్ కొనిచ్చింది. ఆ ఫోనే లేకపోతే ఇంత కష్టపడి పెంచుకున్న గాజుల వ్యాపారం అర్ధాంతరంగా ఆగిపోయేది. అప్పుడు నేను ఎంత బాధ పడవలసి వచ్చేదో తలుచుకుంటే భయమేస్తోంది. ఆ బాధను తీరుస్తూ నాకు ఫోన్ కొనిచ్చి నా చెల్లి ఒక స్థాయికి వచ్చిన నా వ్యాపారాన్ని కాపాడింది. సమస్య తీరి టెన్షన్ తగ్గింది నాకు. మళ్ళీ వ్యాపారంలో నిలదొక్కుకోగలనన్న విశ్వాసం పెరిగింది నాలో.

పాత స్నేహితులు పరిచయం:

ఇది ఇలా ఉండగా నా ఫ్రెండ్ రోహిణి వాళ్ళ ఇంటికి ఒకరోజు నార్త్ రాజుపాలెం హైస్కూల్లోమాతోపాటు చదువుకున్న సురేష్ అనే అబ్బాయి వచ్చి రోహిణిని పలకరించి ఆ తర్వాత ఫోన్లో నాతో కూడా మాట్లాడి మాతో చదువుకున్న కమలి, షిరిన్, పల్లా వెంకటేశ్వర్లు, నిర్మల, జేబీనా, కిష్టమ్మ వీళ్ళందర్నీమాతో కలిపి సురేష్ ఒకరోజు మాకు ఎవరికీ అందకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్అందరం సురేష్ కోసం చాలా బాధ పడ్డాము.

నాన్నకు ఆరోగ్య సమస్య:

ఇంకా ఏమంటే నాన్నకు అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య వస్తే నేను ఆటో అతనికి ఫోన్ చేసి పిలిచి నాన్నను జాగ్రత్తగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి చూపించి తీసుకురండి, డబ్బులు ఇస్తాను అని చెప్పేదాన్ని. నాన్న అలా ఆటో అతని సహాయంతో హాస్పిటల్‍కు వెళ్లి కొన్నిసందర్భాల్లో హాస్పిటల్లో ఒంటరిగా ఉండి సెలైన్ కూడా పెట్టించుకుని మళ్ళీ నేను ఆటో అతనికి ఫోన్ చేస్తే ఆ ఆటోలో ఇంటికి వచ్చేవారు. అలాగే నెల్లూరు సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్కన నారాయణ హాస్పిటల్ ఉండేది. అప్పట్లో అక్కడికి ఒంటరిగా ఆటోలో వెళ్లి ప్రతి నెల యూరిన్ బ్యాగ్ మార్పించుకొని ఇంటికి వచ్చేవారు. నాన్న అక్కడకు వెళ్లి వచ్చేవరకు ఆ హాస్పిటల్‌కు ఫోన్ చేసి అక్కడ పనిచేసే సిబ్బందితో, అక్కడి డాక్టర్ గారితో మాట్లాడి నాన్న ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేదాన్ని. ఇలా నాన్న గుండె ధైర్యానికి నేను మెచ్చుకోవాలో నన్నుఎత్తుకొని మోసి అలసిపోయిన నాన్నకు నేను తోడు వెళ్లలేకపోయినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. కష్టంలో ఉన్న నాన్నకు తోడు వెళ్ళలేకపోయినందుకు ఎందుకు నాకు ఈ జన్మ అనుకునేదాన్ని. కానీ నాన్న కడుపు నింపడం కోసం అయినా నేను బతికి ఉండాలి అనుకున్నాను.

పెద్ద అత్త సహాయం:

నా వీల్ చైర్ వచ్చిన కొద్ది రోజులకు మా పెద్ద అత్త వాళ్లు మా కోసం బ్రాహ్మణ కర్రీస్ పాయింట్ వాళ్ళతో మాట్లాడి నేను కూరలు చేయకుండా ప్రతి రోజు వాళ్లు ఇంటికి తెచ్చిఇచ్చేలా మాట్లాడారు. నాకు కూరలు చేసే శ్రమ తప్పించారు. మిగతావన్నీఇంట్లోనే చేస్తూ ఉండినాను. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం. ఆ క్రమంలో ఎప్పుడైనా ఒకసారి ఉదయం పూట టిఫిన్ చేయకపోతే అప్పట్లో సర్వీస్ మంత్ర అని ఒక సర్వీస్ సెంటర్ ఉండింది మన నెల్లూరులో. వాళ్లకు ఫోన్ చేసి మనకు ఏ హోటల్ నుంచి టిఫిన్ కావాలో ఆ హోటల్ పేరు, ఏమి కావాలో కూడా చెప్తే తెచ్చిఇచ్చేవాళ్ళు. వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నాక్యాబ్ కూడా బుక్ చేసే వాళ్ళు. ఈ వసతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి.

సర్వీస్ మంత్ర చేసిన సహాయం:

నాన్న యూరిన్ బ్యాగ్ మార్చుకోవడానికి వెళ్లే సుబ్రమణ్య స్వామి గుడి వద్ద ఉన్న నారాయణ హాస్పిటల్‌కు నాన్న వెళ్లాలని నేను ఫోన్ చేయగా అక్కడ హాస్పిటల్ తీసివేశారు అని చెప్పారు. ఇక అప్పుడు చింతారెడ్డిపాలెం నారాయణ హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ యూరిన్ బ్యాగ్ మార్పించుకోవాలి. అక్కడకు వెళ్లాలంటే క్యాబ్‌లో వెళ్లాలి. అంత దూరం ఆటోలో వెళ్తే నాన్నకు మళ్ళీ యూరిన్ బ్యాగ్ సమస్య వస్తుంది. ఏం చేయాలి. ఇక్కడ చిన్నాన్న మామయ్య వాళ్ళు ఆ సమయానికి హైదరాబాద్ వెళ్లి ఉండినారు. వాళ్లు రాలేని పరిస్థితి. నేను నాన్నకు తోడు వెళ్లలేని పరిస్థితి. ఏం చేయాలి చాలా దిగులు పెట్టుకున్నాను. నాన్నను ఎలా చింతా రెడ్డిపాలెం హాస్పిటల్‌కు పంపాలి? నాన్నేమో నేను ఒంటరిగా వెళ్తాను ఆటోలో అంటారు. ఎలా పంపించగలను అంత ధైర్యంగా. హాస్పిటల్లో ఒంటరిగా ఎక్కడన్నా పడిపోతే ఎవరు దిక్కు. ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు ఫోను ఎత్తుకొని పొమ్మంటే ఫోన్ ఇంట్లో పెట్టేస్తాడు. పోనీ కాగితం మీద ఇంటి అడ్రస్ నా ఫోన్ నెంబరు రాసిస్తే అది కూడా ఇంట్లో పడేసి వెళ్తారు మొండి నాన్న. చెప్పిన మాట అస్సలు విననే వినరు. ఏం చేయాలి ఏడుపు వచ్చేది. చాలా టెన్షన్ పడ్డాను ఆసారి. ఎలా ఆలోచించాలి ఏదో ఒకటి చేయాలి అని తపిస్తూనే ఉన్నాను. అంతలో ఒక ఆలోచన తోచింది. వెంటనే సర్వీస్ మంత్ర వాళ్లకు ఫోన్ చేశాను. విషయం చెప్పిక్యాబ్ బుక్ చేసి క్యాబ్‌లో నాన్నను జాగ్రత్తగా చింతారెడ్డిపాలెం నారాయణ హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లి డాక్టర్‌కు చూపించి యూరిన్ బ్యాగ్ మార్పించి మళ్లీ క్యాబ్ లోనే ఇంటికి తీసుకొని వస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తాను, కూడా ఒక మనిషి ఉండాలి అని సర్వీస్ మంత్ర వాళ్లకు చెప్పాను. వాళ్లు నా బాధను అర్థం చేసుకొని సరే తీసుకుని వెళ్లితీసుకొని వస్తాము మాకు గంటకు ఇంత ఛార్జ్ అవుతుంది అని చెప్పారు. దానికి నేను సరే అన్నాను. భువనేశ్వరి అత్త అంటే మా పెద్దత్త నాకు ఒక సలహా చెప్పింది నాన్నని అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నర్స్‌తో మాట్లాడు ఇంటికి వచ్చియూరిన్ బ్యాగ్ మారుస్తారు ఏమో అని అడుగు అని చెప్పింది. ఆ రోజు సర్వీస్ మంత్రా వాళ్లు నాన్నను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నర్స్‌తో మాట్లాడి ఇక ప్రతి నెల ఇంటికి వచ్చినాన్నకు యూరిన్ బ్యాగ్ మార్చేటట్టు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎలాగో ఫోన్ ద్వారానే ఈ సమస్య కూడా తీర్చుకున్నాను. నాన్న ఎక్కడ హాస్పిటల్‌కు వెళ్లినా డాక్టర్ గారి చేత నాకు ఫోన్ చేయించమని నాన్నకు చెప్పి నాన్న ఆరోగ్య పరిస్థితి డాక్టరు గారిని అడిగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకొని ఆ విధంగా నాన్నను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను.

క్లాస్‌మేట్ పల్లా వెంకటేశ్వర్లు:

ఇది ఇలా ఉండగా పల్లా వెంకటేశ్వర్లు నా టెన్త్ క్లాస్‌మేట్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. నాన్న ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు చాలా మంచి అబ్బాయి అని మెచ్చుకునేవారు. అప్పటికే నాకు కంటి చూపు తగ్గడంతో చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్ళే క్రమంలో పల్లా వెంకటేశ్వర్లు, షిరిన్, చిన్న చిన్నాన్న, శ్రావణ్ సార్, ఒకసారి పద్మజ వాళ్ళ వదిన పద్మజ అక్క మరియు ప్రతిసారి రోహిణి వాళ్ళ హెల్పర్ శ్యామల నాకు తోడు వచ్చేవాళ్లు. నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చి వదిలే వాళ్ళు. శ్యామల చాలా మంచి అమ్మాయి, చాలా హెల్ప్ చేస్తుంది.

మొదటిసారి కరోనా టైం:

అది కరోనా మొదటిసారి స్టార్ట్ అయిన టైం. నాన్నను దేనికి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేశాను. వెళ్తానని మొండి చేస్తుంటే అత్త వాళ్లకు చెప్పి భయం పెట్టించాను. ఎలాగైనా సరే నాన్నను కాపాడుకోవాలి అన్న తాపత్రయమే నాలో ఉంది. దాని వల్లనే ఇవంతా చేశాను. ఈ కరోనా టైంలోనే నాన్నకు ఒకసారి కడుపులో ఇబ్బంది చేసి చాలా నీరసం అయిపోయారు. మామూలుగా అయితే ఆటోలో వెళ్లి వెంకటేశ్వర్లు డాక్టర్ గారి దగ్గర సెలైన్ పెట్టించుకుని వచ్చేవారు. కానీ అది కరోనా టైం కదా ఆ టైంలో నేను నాన్నను బయటికి పంపించడానికి ఇష్టపడలేదు. ఫోన్లోనే డాక్టర్ గారి సలహాలు తీసుకుంటూ డాక్టర్ గారు చెప్పిన మందులు తెప్పించుకొని వాడుతూ రోహిణి సలహ మేరకు డాక్టర్ గారిని అడిగి అన్ని రకాల లిక్విడ్స్‌తో నాన్నకు శక్తివస్తుందా అని అడిగితే వస్తుంది అని డాక్టర్ గారు చెప్పారు. అంతే నేను తిన్నానో లేదో నాకు తెలియదు గంట గంటకు నాన్నకు రకరకాల ద్రవపదార్థాలు ఇంట్లోనే చేసి ఇస్తూ నాన్న తాగేలా చేస్తూ నాన్నకు శక్తివచ్చేవరకు ద్రవ పదార్థాలు ఇచ్చాను. భగవంతుడి దయవల్ల ఎలాగో నాన్నకు శక్తివచ్చింది. అలా నాన్నను హాస్పిటల్ కు పంపించకుండా ఇంట్లోనే ద్రవపదార్థాలు ఇచ్చి శక్తి వచ్చేలా చేసుకున్నాను. వీల్ చైర్ లోనే తిరుగుతూ గంట గంటకు నాన్నకు అందించాను. ఎలాగో ఆసారి నాన్నను కాపాడుకోగలిగాను. అందుకు రోహిణికి, ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

శ్రావణ్ సార్‌తో పరిచయం, ఫిజియోథెరపీ:

కరోనాకు రెండు సంవత్సరాల ముందు జరిగిన ఒక ముఖ్యమైన విషయం రాయడంలో జాప్యం జరిగింది. అదేమంటే నేను చిన్నప్పుడు అంతా, పడుకుంటే ఏదో ఒకటి పట్టుకొని నాకు నేను సొంతంగా లేచే దాన్ని. కానీ మూలపేటలో బాడుగ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఆరోగ్య సమస్య వచ్చి నడుము నొప్పితో చాలా రోజులు బాధపడినప్పటినుంచి నడుం నొప్పితగ్గినా పడుకుంటే నేను సొంతంగా పైకి లేవలేక పోయేదాన్ని. అప్పటినుంచి నాన్నే లేపేవారు. నాన్నకు క్రమేణ శక్తితగ్గడంతో భుజం నొప్పులతో బాధపడుతున్న టైంలో ఇక్కడ అపార్ట్మెంట్‍లో మా ఇంటి పక్కన సుభాషిణి అనే ఆమె అత్తగారికి మోకాలు ఆపరేషన్ అయి ఫిజియోథెరపీ చేయడానికి డాక్టర్ శ్రావణ్ గారు వచ్చి ఫిజియోథెరపీ చేస్తూ ఉండినారు. మంచంలో ఉన్న ఆమె శ్రావణ్ సార్ ఫిజియోథెరపీ చేయడంతో కొద్దిరోజులలోనే లేచి ఆమె సొంతంగా తన పనులు తాను చేసుకో గలుగుతూ ఉండినది. అది చూసి నేను శ్రావణ్ సార్‌ను పిలిచి నేను ఇలా పడుకుంటే లేవలేకుండా ఉన్నాను మా నాన్నకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను సొంతంగా లేచే మార్గం చెప్పండి అని అడిగాను. మీరు ఎంత ఫీజు తీసుకుంటారు అని కూడా అడిగాను. ఆ సార్ ఒక మార్గం చెప్పారు, నేను సొంతంగా లేవడానికి రోజు వచ్చి ఫిజియోథెరపీ చేయిస్తానన్నారు మీ దగ్గర ఫీజు ఏమీ తీసుకోను వద్దు. మీ శాటిస్ఫాక్షన్ కోసం మీరు పూర్తిగా లేచాక మీకు తోచినది ఇవ్వండి అన్నారు. శ్రావణ్ సార్ చాలా గొప్ప వ్యక్తి. అతను నా దగ్గర డబ్బులు తీసుకోను అన్నారని కాదు స్వతహాగా శ్రావణ్ సార్ చాలా గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తిత్వం గలవారు. నాకంటే చిన్నవారు. నాకు ఫిజియోథెరపీ చేయడానికి వచ్చి నాకు సొంత తమ్ముడు అయిపోయారు, అంత గొప్ప వ్యక్తి. మంచి మనస్తత్వం. ప్రతి ఒక్కరిని గౌరవభావంతో పలకరిస్తారు. మంచి నడవడిక. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. ఈ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

దిలీప్ అన్నతో పరిచయం:

కొన్ని కారణాల వల్ల నాకు నాన్నకు కూరలు మందులు తెచ్చిఇవ్వడానికి ఎవరు దొరకకపోతే శ్రావణ్ సార్ ఫ్రెండ్ దిలీప్ అన్న అనే వ్యక్తిని పరిచయం చేసి అతను ఫ్రీగా ఉన్న టైంలో నాకు ఏమి కావాలన్నాతెచ్చిఇచ్చేవారు, మందులు కానీ ఇంకా ఇతర వస్తువులు కాని కరోనా టైం లో కూడా తెచ్చిఇచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు నాకు సహాయం చేయడం కోసం దిలీప్ అన్నా. అంతగా అంత మంచి వ్యక్తిని పరిచయం చేసిన శ్రావణ్ తమ్ముడికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. నాకు ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పుడే శ్రావణ్ బ్రదర్‌కు వివాహం జరిగింది. రెండు సంవత్సరాలు నాకు ఫిజియోథెరపీ చేశారు ఏమీ తీసుకోకుండా. నాన్న కూడా నాన్నకు కూడా రెండు నెలలు భుజం నొప్పికి ఫిజియోథెరపీ చేశారు. కరోనా స్టార్ట్ అవడంతో రావడానికి వీలులేని పరిస్థితి ఏర్పడడంతో వచ్చి ఫిజియోథెరపీ చేయడానికి వీలు లేకపోయింది. కానీ అప్పటికే నేను 90% లేవడానికి వీలు అయ్యింది. ఆ కొంచెం నాన్న సపోర్టు ఇచ్చేవారు. ఎంత బాగా లేకపోయినా లేవలేక పోతున్నా లేవలేక లేచి నాకు సపోర్ట్ ఇచ్చిలేపేవారు నాన్న. నాన్న కు భుజం నొప్పి తగ్గకపోతే ఫిజియోథెరపీ చేశారు నాన్నకు కూడా.

కరోనా టైంలో గాజుల ఆర్డర్లు తగ్గడం- పల్లవితో పరిచయం:

కరోనా టైంలో కాస్త బ్యాంగిల్స్ ఆర్డర్స్ తగ్గినాయి. ఇంకొక విషయం ఏమంటే కరోనాకు ముందే కొద్దిరోజుల నుంచి నాకు కంటి చూపు తగ్గడంతో గాజుల మీద డిజైనింగ్ చేయడం కష్టమైంది. అప్పుడు సుభాషిణి, వాళ్ళ రిలేటివ్స్ పల్లవి అనే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిఈ అమ్మాయి గాజులు బాగా చేస్తుంది, వర్క్ బాగా నీట్‌గా ఉంటుంది, నువ్వు చేయలేకపోతే ఈ అమ్మాయికి ఇవ్వు చేసి ఇస్తుంది అని చెప్పింది. అప్పుడు నాకు వచ్చిన కొన్ని ఆర్డర్స్ నేను చేయలేనివి ఆ అమ్మాయి చేత చేయించి ఎంతో కొంత ఉడతా భక్తిగా ఆ అమ్మాయికి ఉపాధి కొంచెం కల్పించగలిగాను. అలాగే నాకు బిజినెస్ సర్కిల్ ఆగకుండా నిలుపుకోగలిగాను ఆ అమ్మాయి చేయడం వలన. నేను ఆ అమ్మాయికి ఇవ్వడం వలన ఆ అమ్మాయికి కానీ నాకు గానీ మేలే జరిగింది. అప్పుడప్పుడు ఆ అమ్మాయికి నాకు వచ్చిన ఆర్డర్స్ ఇస్తూ ఉండినాను.

నేను నాన్న అవసరాలను తీర్చే ప్రయత్నం చేయడం:

ఇంకా కరోనా టైం లో నాన్న అవసరానికి నాన్న బయటికి వెళ్ళకుండా బార్బర్‌ను కూడా ఫోన్ చేసి ఇంటికి పిలిచేదాన్ని. ఇంకా కరోనా ఎక్కువ అవ్వడంతో ఆ బార్బర్ ద్వారా నాన్నకు ఏమైనా వస్తుందేమోనని భయపడి పక్కింటి పిల్లల్నిఅడిగితే టిమ్మర్ అని ఒకటి ఉంటుంది దానితో మీరు ఈజీగా చేయవచ్చు మీ నాన్నగారికి అని చెప్పారు. అప్పుడు సబిహ ఆంటీ కూతురు ఆన్లైన్‌లో ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టింది. అది వచ్చిన తర్వాత మళ్లీ పక్కింటి పిల్లలను అడిగి అది ఎలా వాడాలి దానికి ఎలా ఛార్జ్ పెట్టాలి అని తెలుసుకొని అంతా నేర్చుకొని వాళ్ల దగ్గర నాన్నకు ఇబ్బంది లేకుండా ప్రొద్దునే వేకువ జామున నాలుగు గంటలకు లేచి నాన్నను లేపి కూర్చోబెట్టి నేను షేవింగ్ చేశాను. నాన్న తిట్టేవారు. నువ్వు వద్దు ఆడపిల్లవి నువ్వు చేయకూడదు ఈ పని అని తిట్టేవారు. అయినా సరే నాన్న ఆరోగ్యం నాకు ముఖ్యం. నాన్నను కాపాడుకోవడం నాకు అంతకన్నా ముఖ్యం. అందువల్ల అవేవీ పట్టించుకోలేదు. ఆ టైంలో ఇంట్లో పనిమనిషి కూడా మానేసింది. చుట్టుపక్కల అంతా కరోనా వచ్చింది. మేము తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాము. ఆ టైంలో కూరలు కూడా రాలేదు. ఆ టైంలో నేనే పనిమనిషి, నేనే కుక్, నేనే చాకలి, చివరకు నేనే బార్బర్, అన్నినేనే అయి నెగ్గుకు వచ్చాను. అప్పుడు నాలో ఆ భగవంతుడు ప్రవేశించి అంతా తానే అయి నా చేత చేయించాడేమో ఆ స్వామి అంతే. నేను కాదు చేసింది ఈ పనులన్నీ. ఆ భగవంతుడే నాలో ప్రవేశించి నా చేత చేయించారు.

నాలోని భయం:

ఒకటే భయం నాకు కానీ నాన్నకు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి కరోనా వచ్చినా ఎంత ఇబ్బంది. నాకు వస్తే నాన్నకు అన్నం ఎవరు పెడతారు. అదే నాన్నకు వస్తే తట్టుకునే శక్తి అంతకంటే ముందు యూరిన్ బ్యాగ్ 20 రోజులకు ఒకసారి మార్చాలి. అది మార్చకపోతే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అప్పుడు నాన్న పరిస్థితి ఏమిటి? ఇలా క్షణక్షణం మానసికంగా ఎంతో నలిగిపోయాను. రోహిణికి చెప్పి ముందు జాగ్రత్తగా కరోనా వస్తే వేసుకొని మందులు ముందుగా తెప్పించి పెట్టుకున్నాము ఇద్దరికీ. ఆ భగవంతుడు మా ఇద్దరి యందు ఉన్నారు కాబట్టి మాకు కరోనా రాలేదు.

భక్తి- పారాయణలు:

కరోనా టైంలో భక్తి టీవీ వాళ్ళు ఏవేవో పారాయణులు నిర్వహిస్తూ ఉంటే వాటిని చూస్తూ దైవ ధ్యానం చేస్తూ గడిపేశాము నాన్న నేను. ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికామనే చెప్పవచ్చు. అప్పట్లో నాన్నకు నాకు అయిన వాళ్ళందరిని అంటే చిన్నాన్నలు మేనత్తలు వాళ్ళందరు ఇంటికి వస్తే చూడాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ అప్పటి పరిస్థితులు ఒకరింటికి ఒకరు వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. ఎంతసేపు వీడియో కాల్‌లో చూసుకోవడమే జరిగింది. అంతటి కరోనా టైంలో కూడా నాన్నకు యూరిన్ బ్యాగ్ మార్చే నర్స్ వాళ్ళు టైం కు వచ్చి నాన్నకు యూరిన్ బ్యాగ్ మార్చేవాళ్ళు తగిన జాగ్రత్తలతో. అందుకు ఆ భార్యాభర్తలిద్దరికీ శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను.

నాలో పశ్చాత్తాపం:

ఒక విషయం మర్చిపోయాను. అదేమంటే ఆ నర్స్ వాళ్ళు ఇంటికి వచ్చి యూరిన్ బ్యాగ్ మారుస్తున్న మొదట్లోనే నాకు ఒక విషయం తెలిసింది. నాన్న ఆ యూరిన్ బ్యాగ్ మార్చేటప్పుడు ఎంత నరకయాతన అనుభవించేవారు స్వయంగా నేను చూస్తే కానీ అర్థం కాలేదు. ఆ బాధ చూడలేక దగ్గరకు వెళ్లి నాన్నను పట్టుకుంటే వద్దు వద్దు దూరంగా వెళ్ళుఅని అరిచేవాడు. అప్పుడు అనిపించింది నాకు నాన్న ఒంటరిగా బయటికి వెళ్లి యూరిన్ బ్యాగ్ మార్పించుకొని వచ్చేటప్పుడు కాస్త ఆలస్యంగా వస్తే నేను అరిచే దాన్ని. నొప్పికి కాసేపు కూర్చున్నాను అక్కడ అంటే హాస్పిటల్‌లో అంటే నాకు అర్థం అయ్యేది కాదు. ఆ కూర్చోనేదేదో ఇంటికి వచ్చి కూర్చోవచ్చుకదా అని అరిచేదాన్ని. అంటే నాన్న తొందరగా ఇంటికి రాలేదని నా భయం. కానీ ఆ బాధను స్వయంగా చూసేసరికి నేను ఎంత తప్పుచేశాను అన్నది నాకు అర్థమైంది. అప్పుడప్పుడు నాన్న ఇలా బాధపడుతుంటే నాకు అనిపించేది ఎలాంటి నాన్న ఇలా అయిపోయారు ఏంటి అని అనిపించేది. ఎంత ధైర్యవంతులు నాన్న.

చిన్నప్పుడు నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పేవారు కూర్చోపెట్టుకొని. తరచూ నాన్న చెప్పే మాట దానాలలో కల్లా విద్యాదానం గొప్పది. దానం చేసిన లేదా పంచితే పెరుగుతుంది తరగనిది. విద్యాధనం దొంగలు దోచుకో పోలేనిది. అలాంటి విద్యాధనం సముపార్జించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. అది ఎంత కష్టమైనా సంపాదించుకోవాలి. ఆ ప్రయాణంలో ఎన్నిఆటంకాలు వచ్చినా ఎదుర్కోని నిలబడగలగాలి. అని చెప్పేవారు. ఆ మాటలు నా మనసులో అలానే నిలిచిపోయాయి. నాన్న పదే పదే చెప్పడంతో.

నాన్న చెప్పిన రైల్వే ట్రాక్ కధ:

ఇంకొకటి ఏమిటంటే రైల్వే ట్రాక్ కథ. బ్రిటిష్ వారి పరిపాలన కాలం నాటి కథ. ఒక స్టేషన్ గార్డ్ కథ. ఒక స్టేషన్ గార్డ్‌కు ఒక చిన్న బాబు. పాకే వయసు వాడిది. వచ్చేపోయే రైళ్లకు జెండా ఊపడం అవసరాన్ని బట్టి రైలు పట్టాలు మార్చడం కదా అతని దినచర్య. ఒకరోజు ఆ చిన్న బాబు పాకుకుంటూ రైలు పట్టాల మీదకు వెళ్ళిపోయాడు. ఆ సమయానికే ఓకే రైలు పట్టాల మీద ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తున్నాయి. రెండు రైళ్లలో చాలామంది ప్యాసింజర్లు ఉన్నారు. గార్డ్ పట్టాలు మార్చడానికి వెళ్లగా పట్టాల మీద తన పిల్లవాడు ఉన్నాడు అతను ఏమీ ఆలోచించకుండా బాయ్ తలవంచి పట్టాల మధ్యలో పడుకో అని బిగ్గరగా అరుస్తూ వెంటనే పట్టాలు మార్చి వేలాదిమంది ప్యాసింజర్లను, తన బిడ్డను కాపాడుకున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి అంటే గార్డ్ చెప్పిన వెంటనే ఆ పిల్లవాడు తండ్రి మాట విని పట్టాల మధ్యలో పడుకున్నాడు. అదే మన తెలుగు వాళ్ళు అయితే నాన్నా, ఎందుకు పడుకోవాలి అని అప్పుడు ప్రశ్నిస్తారు. ఆ టైం కు రైలు వచ్చికొట్టేయవచ్చు పసిబిడ్డ ప్రాణాలు పోయేవి. అదే పిల్లవాడి కోసం గార్డ్ పట్టాలు మార్చకుండా వెళ్లి ఉంటే వేలాది ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. సారాంశం ఏమంటే అప్పటి కాలంలో పిల్లలను క్రమశిక్షణలో పెంచేవారు అని. నాన్న చెప్పేవారు ఈ కథ. మా తాతగారు మా నాన్నగారికి చెప్తే, మా నాన్న నాకు చెప్పారు ఎందుకో గుర్తుకు వచ్చింది. ఇప్పుడు రాయాలనిపించి రాసాను.

నాన్నకు శక్తి తగ్గడం:

నాన్న ఒకప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేవాడో ఇప్పుడంత బలహీన పడడం చూసి బాధ వేసి నాకు చెప్పినవి గుర్తుకు తెచ్చుకున్నాను. నాన్న నడక కూడా ఆ గోడ ఈ గోడ పట్టుకొని చిన్నగా నడవడం ప్రారంభమైపోయింది. ఒక రోజు రాత్రి 10:30 టైంలో నాన్న బాత్రూంలో నుంచి చిన్నగా సేఫ్ గా వచ్చి, హాల్లోకి వచ్చికింద పడిపోయారు. చాలా భయమేసింది. నేనేమో లేపలేను కదా ఏం చేయాలో తెలియక నాన్నని అలా చూడగానే వెంటనే నాన్న పడిపోయారు అని పెద్దగా అరిచేశాను. అంతే వెంటనే సాయి రిషిత హర్షిత వాళ్లు పరిగెత్తుకొని వచ్చి నాన్నను లేపాడు సాయి. మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవాలు.

చుట్టుపక్కల కరోనా ఎక్కువ అవ్వడం-నాన్నకు జ్వరం రావడం:

కరోనా ఎక్కువ అయిపోయింది. చివరికి మా అపార్ట్మెంట్లో కూడా ఇద్దరు ముగ్గురికి వచ్చేసింది. అది అప్పటికే పనిమనిషి మానేసి ఉంది. ఆ టైంలోనే నాన్నకు 99, 100 అలా జ్వరం రాసాగింది. రాత్రి పూట వచ్చేది టాబ్లెట్ వేస్తే ఉదయానికి తగ్గేది. అత్త వాళ్లకు చెప్పి భయపడేదాన్నికానీ నాన్నకు కరోనా లేదు. ఏదో కాస్త జ్వరం మాత్రమే మేము బయటకు వెళ్లేవాళ్ళము కాదు. ఇంట్లోనే ఉండి కిటికీ తలుపులతో సహా మూసుకొని ఇంట్లోనే పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళం. బయట నుంచి వచ్చిన వస్తువులను శుభ్రంగా కడుక్కొని వాడుకునే వాళ్ళం. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నితీసుకున్నాం. నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను కానీ నాన్నకు వేయించలేదు, పెద్ద వయసు కదా తట్టుకోలేరేమోనని భయమేసింది. ఎందుకో నాన్నకు జ్వరం తగ్గుతోంది. మళ్లీ వస్తోంది. ఒకరోజు రాత్రి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. భయమేసింది. 12 గంటల వరకు నా టెన్త్ క్లాస్ క్లాస్‌మేట్, ఈ మధ్య పరిచయమైన షిరిన్ మాట్లాడుతూనే ఉంది, ధైర్యం చెబుతూనే ఉంది. ఆ జ్వరం వచ్చినప్పుడు నేను నాన్నకు టాబ్లెట్ ఇచ్చి తల మీద తడిగుడ్డ వేసి తీస్తూ నేను సగం రాత్రి వరకు పడుకోకుండా నాన్నను చూసుకుంటూ ఉండేదాన్ని. తెల్లవారిన తరువాత నాన్న ఎంత లేవలేకపోయినా అలానే లేచి నన్ను లేపేవారు అంటే 90% నేను లేచినా కొంచెం నాన్న సపోర్ట్ ఇచ్చారు.

(ఇంకా ఉంది)

Exit mobile version