Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-1

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

పూజ్యులు, పితృ సమానులు అయిన శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు; శ్రీ మాచవోలు శివరామ ప్రసాద్ గార్ల ఆశీస్సులతో నా జీవిత అనుభవాలను వ్రాయుచున్నాను.

పరిచయం

పసిపాపగా రచయిత్రి

మాది తుమ్మగుంట గ్రామం. నెల్లూరు జిల్లా. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మా నాన్న సూరం సుబ్బు సత్యనారాయణ. అమ్మ వేంకటసుబ్బు. తాతయ్య సుందరరామయ్య. నానమ్మ శారదాంబ. మా నాన్నగారికి ముగ్గురు సోదరులు. ఇద్దరు సోదరీమణులు.

తాతగారి సొంత సేద్యం

మా తాతగారు అప్పట్లో పదహారు ఎకరాలు సొంత సేద్యం చేసేవారు. మా నాన్న తాతగారికి సహాయంగా ఉండేవారు.

అమ్మకు అనారోగ్య సమస్య, నాకు పోలియో వైద్యం

అమ్మకు నేను పుట్టినప్పుడు ఆరోగ్య సమస్య వచ్చింది. నాన్న చాలా చోట్ల వైద్యం చేయించారు. చాలా పూజలు చేయించారు. కానీ ఫలితం లేదు.

ఈ క్రమంలోనే నాకు రెండో ఏట పోలియో సోకింది. నా వైద్యం కోసం నాన్న ఎన్నో చోట్లకు నన్ను ఎత్తుకుని తిరిగారు. నాకు నయం కావాలని, నేను లేచి తిరగాలని చాలా ప్రయాసపడ్డారు.

మదరాసులో వైద్యం చేయించారు.

అక్కడ బూట్లు వేసి నడిపించడం, వ్యాయామం చేయించడం లాంటివి చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత పై పద్ధతిలో నా చేత నడిపించే ప్రయత్నం బాగా చేయించారు. నడుము లోతు గుంట తవ్వి అందులో నన్ను నిలబెట్టడం, కాళ్లకు కాడ్ లివర్ ఆయిల్ మర్దన చేయడం, గురువాయూరు స్వామికి అభిషేకం చేసిన నువ్వుల నూనె నా కాళ్లకు మర్దన చేయడం ఇవన్నీ చేశారు నాన్న.

ఇదంతా చేస్తూ ఆరవ తరగతి వరకు ఇంట్లోనే నాకు చదువు చెప్పారు.

రచయిత్రి అమ్మానాన్నలు

నాన్న నాకు పొలం పనులు చూపించడం

అప్పుడు మాకు పొలాలు ఉండేవి! మా పొలాల్లో వరి పంట దుక్కిదున్నడం నుంచి రాసి పోయడం వరకు అన్నీ నాన్న నాకు చూపించారు.

తుమ్మగుంట – అయ్యప్ప గుడి

మా ఊళ్ళో అశ్వత్థ వృక్షం ఉంది. దాన్ని గురునాథ స్వామి అనేవారు.. కాలక్రమేణా ఆ వృక్షాన్ని అయ్యప్పస్వామిగా కొలుస్తున్నారు. గుడి బాగా ప్రసిద్ధి చెందింది. కార్తీక పౌర్ణమినాడు లక్ష తులసి పూజ జరుగుతుంది. నాన్న ఆ పూజలో కూర్చునేవారు. నేను కూడా నాన్న పక్కనే కూర్చొని పూజ అంతా చూచేదాన్ని.

శబరిమల యాత్ర

నా 9 ఏళ్ళ వయస్సులో నాన్న 41 రోజులు మాల వేసుకుని నాకు అయిదు రోజులు మాల వేసి శబరిమల తీసుకెళ్లారు. అప్పుడు చాలా పుణ్యక్షేత్రాలు చూచాను. రామేశ్వరం, మధుర, తంజావూరు, గురువాయూరు, శ్రీరంగం, కన్యాకుమారి, పళని.. ఇంకా చాలా క్షేత్రాలు చూశాను.

నానమ్మ – తాతయ్య

అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా అమ్మ బదులు నానమ్మే అన్నీ నాకు చేశారు. నాన్నగారు, నానమ్మ వీరిద్దరూ అమ్మను మరిపించారు.

మా తాతగారికి నా మీద చాలా వాత్సల్యం.

గురునాథ స్వామి వృక్ష మహిమ

తాతగారి పెద్దవాళ్ళ కాలంలో గురునాథ స్వామి వృక్షం మహిమకు సంబంధించిన ఒక సంఘటన జరిగిందట.

తుమ్మగుంట గ్రామానికి నాలుగు వైపులా పంట పొలాలకు సంబంధించిన చెరువులు ఉండేవి. వర్షాకాలంలో అంటే నవంబర్ నెలలో భారీ వర్షాల కారణంగా చెరువులు నిండి గ్రామంలోకి నీళ్లు రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులైనారట. ఇంక గ్రామం మునిగి పోతుందన్న సమయంలో అక్కడి ఒక బ్రాహ్మణుడు స్వామి మీద కోపం వచ్చి గొడ్డలితో గురునాథస్వామి చెట్టును నరకబోయాడు. అపుడు ఆకాశంలో ఒక మెరుపు మెరిసి, గ్రామంలోని నీళ్లంతా వెనక్కి వెళ్ళి పోయాయట. ఇది తాతయ్య పదే పదే చెప్పేవారు.

తాతయ్య చెప్పిన ఇంకో కథ –

అన్నదాన మహిమ.

పూర్వం ఒక బ్రాహ్మణుడు నిత్యాన్నదానం చేసేవాడట. ఆ బ్రాహ్మణుడు రోజూ అన్నదానం చేస్తున్నాను కదా, దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడట. కాశీకి వెళ్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని ఎవరో చెప్పారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కాశీకి ప్రయాణమైనాడు. రవాణా సౌకర్యంలేని  లేని రోజులు. కాలినడకే శరణ్యం.

అడవి దారి. మధ్యకు వచ్చేసరికి రాత్రి అయింది. అక్కడ ఆ బ్రాహ్మణుడికి ఒక బోయవాడు తారసపడ్డాడు. అతడు బ్రాహ్మణుడికి బస ఏర్పాటు చేశాడు. చారపప్పు, తేనె ఆతిథ్యం ఇచ్చాడు.

ఆ రోజు రాత్రి బ్రాహ్మణుడు నిద్రించడానికి మంచె ఏర్పాటు చేశాడు.. బ్రాహ్మణుడు మంచెపై నిద్రించగా బోయ తాను కింద మంచె చుట్టూ తిరుగుతూ తెల్లవార్లూ కాపలా కాచాడు. ఇంక తెల్లవార బోతోందనగా ఇంక పులులు సింహాలు ఏవీ రావులే.. కాసేపు పడుకుంటాను అని పడుకున్నాడు. అప్పుడే ఒక చిరుతపులి వచ్చి బోయవాణ్ణి చంపి తినేసింది. బ్రాహ్మణుడు తెల్లవారి లేచి చూస్తే బోయవాడు మరణించాడు. అది చూచి బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు. మరి చేసేదేమీలేక కాశీకి ప్రయాణమైనాడు. కాశీ క్షేత్రం లోని విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని అన్నదాన మహిమ గురించి అడగగా అమ్మవారు ప్రత్యక్షమై ఈ మహిమ గురించి తెలుసుకోవాలంటే ఈ కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తున్న రాజుగారి కోటకు వెళ్ళు. రాణి వారు ప్రసవవేదనతో ఉన్నారు. రాణి వారు ప్రసవించిన తరువాత ఆ పుట్టిన బిడ్డ అన్నదాన మహిమ గురించి చెప్తాడు అని చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో రాణి వారి అంతఃపురానికి వెళ్ళారు. రాణి వారు పండంటి మగ శిశువును ప్రసవించింది. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆ శిశువు దగ్గరికి వెళ్లి అన్నదాన మహిమ గురించి అడగగా “మీకు నేను చారపప్పు తేనె ఇచ్చినందుకు రాజు గారి కుమారుడుగా జన్మించాను. మీరు ప్రతి నిత్యం  అన్నదానం చేస్తున్నారు.. మీకు ఎంతటి భాగ్యం కలుగుతుందో చూడండి” అన్నాడు ఆ శిశువు. అన్నదాన మహిమంటే ఇదే.

నాన్నకు శస్త్ర చికిత్స

నాన్నకు నా చిన్నతనంలో ఒక పెద్ద శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తరువాత నాన్న బరువులు ఎత్తకూడదు అని వైద్యులు చెప్పారు.

ఐనా కూడా నాన్న నన్ను ఎత్తుకోవడం నాకు సేవలు చేయడం మానలేదు. నన్ను ఎత్తుకొని గురునాథ స్వామి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. అలా రోజు ప్రదక్షిణలకు తీసుకెళ్లేవారు నాన్న.

అయ్యప్ప గుడి విగ్రహ ప్రతిష్ఠ

కాలక్రమేణా అక్కడ చెట్టు చుట్టూ గుడి, అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. ప్రతిష్ఠకు కూడా నాన్న తీసుకెళ్లారు. అప్పటినుంచి అది అయ్యప్ప స్వామి గుడిగా ప్రసిద్ధి చెందింది.

పారాయణలు

ప్రతిరోజు సాయంత్రం గుడికి వెళ్లే ముందు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, ఆంజనేయస్వామి దండకం నాన్న చదువుతూ నా చేత పలికించేవారు.

అయ్యప్పస్వామికి విశేష సేవలు – ప్రముఖుల రాక ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీ అయ్యప్ప స్వామి గుడిలో సంధ్యా సమయంలో జ్యోతి వెలిగిస్తారు. ఆ రోజు రాత్రికి గ్రామోత్సవం జరుగుతుంది. దీనిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులు వస్తారు.

నాన్నకు రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారితో పరిచయం ఉండేది. నా చిన్నతనంలో లక్ష్మీ నరసా రెడ్డి గారిని జ్యోతి ఉత్సవానికి రమ్మని నాన్న ఆహ్వానించారు. నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. రెడ్డి గారు ఇంక కొంతమంది పెద్దలు  మా ఇంటికి వచ్చారు. జనవరి 14వ తేదీ. ఆరోజు జ్యోతిని దర్శించుకుని మా ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు నానమ్మ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది. లక్ష్మీ నరసా రెడ్డి గారు మా ఇంట్లో భోజనం చేసి “మంచి ఆతిథ్యం ఇచ్చారు” అని అన్నారు. “మళ్ళీ ఇంకొకసారి వస్తాను దైవ దర్శనం చేసుకోవడానికి” అన్నారు.

మదరాసులో నాకు వైద్యం

నా వైద్యం కోసం సంవత్సరానికి ఒకసారి మదరాసు వెళ్లే వాళ్లం. అక్కడ బూట్లు తీసుకునే వాళ్ళము. మదరాసు వెళ్ళినప్పుడు ఒక పది రోజులు అలా ఉండవలసివచ్చేది. వైద్యం కోసం అమ్మమ్మ బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఉదయం వైద్యశాలకు వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చి సాయంత్రంగా మదరాసులో ఎక్కడో ఒక కొత్త ప్రదేశానికి నాన్న నన్ను తీసుకెళ్లి అంతా చూపించేవారు.

ఎస్. పి. బాల సుబ్రమణ్యం గారిని కలవడం

ఆ క్రమంలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళాము. బాల సుబ్రహ్మణ్యం గారు నాన్నతో చాలా బాగా మాట్లాడారు. వాళ్ళింట్లో కాఫీ కూడా తాగాము. ఇంకా కొంతమంది సినీ ప్రముఖుల ఇళ్లకి తీసుకువెళ్లి చూపించారు నాన్న. ఇంకా మెరీనా బీచ్ పాండీ బజార్ అంతా చూపించారు.

అమ్మమ్మ ఊరు- తిరుపతి

మూడు నెలలకు ఒక సారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. పది రోజులు అక్కడే ఉండి తిరుపతిలో గుళ్ళు అన్నీ చూపించారు నాన్న. రామాలయం, ఆంజనేయ స్వామి గుడి గోవిందరాజుల గుడి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ఇంకా చాలా దేవాలయాలు చూశాను నా చిన్నతనంలోనే. సినిమాలకు కూడా తీసుకెళ్లారు నాన్న.. సినిమాలు అంటే భక్త ప్రహ్లాద, భీష్మ, పాండవ వనవాసం లాంటి పౌరాణిక చిత్రాలకు మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఇలా నా బాల్యం గడిచిపోయింది. నాకు అన్నీ తెలియాలి, నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నాన్న నాకు అన్నీ చూపించారు. నేను వికలాంగురాలిని అనే భావన రాకుండా పెంచారు.

నాకు శస్త్ర చికిత్సశబరిమల వెళ్లి వచ్చాక నాన్నకు శస్త్రచికిత్స జరిగి కోలుకున్నాక, నాకు గూడూరులో పోలియో వ్యాధి నిపుణులు డాక్టర్ వ్యాఘ్రేశ్వరులు నా కాళ్లకు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స జరిగిన తరువాత నెలరోజుల వరకు కాళ్లకు కట్టు కట్టి ఉంచారు. దీనితో వ్యాయామం గానీ, బూట్లు వేసుకొని నడవడం గానీ లేకుండా పోయాయి.

తుమ్మగుంటలో ట్యూషన్

ఇంతలో నేను ఏడవ తరగతికి వచ్చాను. అప్పుడు నాన్న తుమ్మగుంట లోనే గుప్పచ్చి సత్యనారాయణ అనే ఉపాధ్యాయులు గారి దగ్గరికి ఇంగ్లీషు గణితము సబ్జెక్టులకు ప్రైవేటుకు తీసుకెళ్లారు. ఆ సారూ నాకు ఇంగ్లీషు చదవడం గణితము అన్ని నేర్పించే ప్రయత్నం చాలా బాగా చేశారు. నాకు అప్పట్లో జ్ఞాపకశక్తి చాలా తక్కువ. దీనికోసం నాన్న మందులు టానిక్కులు ఇచ్చారు నాకు. కానీ నాకు చిన్నప్పటి నుంచి చదువు కావాలన్నా జిజ్ఞాస చాలా ఉంది. పట్టుదలగా ఉంది. బాగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అని చాలా ఆశ ఉండేది. అందుకే ఏడవ తరగతిలో తుమ్మగుంటలో కుప్పచ్చి సత్యనారాయణ సార్ వాళ్ళ ఇంటికి ప్రైవేటుకు వెళ్లి ఇంట్లో కూడా చదివేదాన్ని.

అమ్మ మరణం – ఏడవ తరగతి పరీక్షలు- గుణపాఠం

ఇంతలో అమ్మ ఆ సంవత్సరమే చనిపోయారు. అంతలో పరీక్షలు వచ్చాయి. ప్రైవేటుగా కట్టి పాఠశాలలో పరీక్షలు రాశాను. పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి. కానీ 3 పరీక్షలు తప్పాను. పునాది ఉండాలి అంటూ నాన్న ఇంకొక సంవత్సరమంతా ఏడో తరగతిలోనే ఉంచేశారు. అప్పుడు పోయిన మూడు సబ్జెక్టులు కాకుండా మొత్తం ఆరు సబ్జెక్టులు రాయాలని రూల్ ఉండేది. అందుకని అన్ని సబ్జెక్టులు రాయడానికి సిద్ధమయ్యాను.

కానీ నేను మూడు సబ్జెక్ట్ లు ఉత్తీర్ణత పొందినవి మొదటి సారి ఉత్తీర్ణత పొందాను కదా ఇంకా అవి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదని అనుకొని వాటిని పక్కనపెట్టి తప్పిన మూడు సబ్జెక్టులు మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టాను. ఫలితం మొదట తప్పిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది మొదట ఉత్తీర్ణత పొందిన మూడు సబ్జెక్టుల్లో రెండవ సారి తప్పాను.

దీనిని బట్టి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే జీవితంలో ఒక సబ్జెక్టే కాదు దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది పెద్ద గుణపాఠం నాకు అని తెలుసుకున్నాను.

నాకు చిన్నతనంలో ఏదైనా అనారోగ్యం కలిగినా జ్వరం పడిపోయి దెబ్బలు తగిలినా తుమ్మగుంటలో ఎటువంటి వైద్య సదుపాయం కానీ వైద్యుడు గాని లేని కారణంగా పక్క ఊరు విడవలూరుకి రెండు మైళ్లు నడిచి వెళ్లాలి. రవాణా సౌకర్యాలు లేవు.

నాకేమైనా అనారోగ్యం కలిగినప్పుడు బూట్లు వేసుకొని నడక సాధన చేసే క్రమంలో పడి దెబ్బలు తగిలితే రాత్రి పగలు అనే తేడా లేకుండా నాన్న నన్ను ఎత్తుకొని రెండు మైళ్ళు పొలం గట్ల పైన రోడ్డుపైన కొంత కాలినడకన విడవలూరు వెళ్లి నాకు వైద్యం చేయించేవారు. శస్త్ర చికిత్స తరువాత అమ్మమ్మ ఊరు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో బూట్లతో నడక సాధన చేయడం జరిగింది.

తాతగారు నెల్లూరు వెదాయపాలెం ఇల్లు – తుమ్మ గుంట పొలం కౌలు

ఇంతలో నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే అనుకుంటా తాతగారు నుంచి నెల్లూరు వేదయపాలెం రోజు వచ్చి సొంత ఇల్లు కట్టించారు.

అప్పుడు సొంత సేద్యం చేస్తూ ఉన్నప్పుడు పనివాళ్ళు సరిగా కుదరకపోవడంతో పొలాన్ని కౌలుకు ఇచ్చేసారు తాతయ్య. దాంతో నానమ్మ తాతయ్య వాళ్ళు కొద్ది రోజులు తుమ్మగుంటలో కొద్ది రోజులు వేదాయపాలెంలో ఉండేవారు.

నా ఎనిమిదవ తరగతి

ఆ తర్వాత నేను ఎనిమిదవ తరగతి ఇంట్లోనే చదివి ప్రైవేటుగా కట్టి పాఠశాలలో పరీక్ష రాసి ఎనిమిదవ తరగతిలో ఉత్తీర్ణురాలయ్యాను.

తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఇక్కడ అప్పట్లో ఇచ్చిన బూట్లు చాలా భారంగా బరువు కావడంతో అవి వేసుకుని నడక సాధన చేయడానికి చాలా కష్టమైనది. అలాగే చాలా కష్టపడి నాన్న కొద్ది రోజులు అంటే ఎనిమిదో తరగతి పూర్తి అయ్యేవరకు నడక సాధన నా చేత చేయించారు. కానీ ఫలితం లేదు. చేసేదేమీలేక నడక సాధనను ఆపేశాము.

చదువు మీద దృష్టి

అప్పుడు నా చదువు మీద నాన్న ఎక్కువ దృష్టి పెట్టారు. తుమ్మగుంటలో ఉన్నత పాఠశాల లేదు. విడవలూరు కానీ రాజుపాలెం కానీరావాలి. విడవలూరుకి తుమ్మగుంట నుంచి బస్సు సౌకర్యం లేదు. తుమ్మగుంట నుంచి రాజుపాలానికి వచ్చాక రాజుపాలెం పాఠశాల ముందే బస్సు దిగవచ్చు. అదీ కాక రాజుపాలెం ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు రాధాకృష్ణారెడ్డి సార్, నాన్న, పెద్ద చిన్ననాన్న చదువుకునే రోజుల్లో సహ విద్యార్థి కావడం విశేషం.

మొట్టమొదటి సారి స్కూల్ జీవితం

రాధా కృష్ణారెడ్డి సార్ నా ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం ద్వారా తొమ్మిదో తరగతిలో రాజుపాలెం ఉన్నత పాఠశాలలో చేర్చుకున్నారు. నిజమైన విద్యార్థి జీవితం ఇక్కడ నుంచి ప్రారంభమైనది. స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అని నాన్న పదే పదే చెప్పేవారు. తుమ్మగుంటలో బస్సు ఎక్కాలంటే ఇంటి దగ్గర నుంచి బస్సు ఆగే ప్రదేశానికి కాలినడకన పొలం గట్ల పైన కాలువలు దాటుకుంటూ వచ్చి బస్సు ఎక్క వలసి ఉంది. నానమ్మ నేను పాఠశాలకు బయలుదేరక ముందే భోజనం తయారుచేసి ఇచ్చేది. నాన్న ఇంటి వద్ద నుంచి బస్సు ఆగే ప్రదేశానికి ప్రతిరోజు నన్ను నా పుస్తకాల సంచిని మొసుకొని పొలం గట్ల మీద నడుచుకుంటూ కాలువలు దాటుకుంటూ వచ్చి బస్సు ఎక్కేవారు. మొట్టమొదటిగానేను తెలుగు ఉమామహేశ్వర రావు సార్ తరగతిలో కూర్చున్నాను. మొదటిసారి నేను పాఠశాల తరగతి గదిలో తోటి విద్యార్ధినులతో ఉండడం సార్ పాఠం చెప్తూ ఉంటే వినడం చాలా కొత్తగా అనిపించింది. వెంటనే కాస్త ధైర్యం తెచ్చుకొని సార్‌తో “నేను ఇదే మొదటిసారి పాఠశాలకు వచ్చిపాఠాలు నేర్చుకోవడం. చాలా కొత్తగా ఉంది. ఈ ఇక్కడ ఎలా ఉండాలో నాకు తెలియదు. మీరే చెప్పండి సార్” అని అడిగాను. అప్పుడు సార్ ధైర్యం చెప్పారు. అప్పట్నుంచి ఏ సబ్జెక్టు సారైనా చెప్పే పాఠాలలో సందేహాలు ఉన్నా ఏమైనా తెలియకపోయినా అడిగితే ఓపికగా చెప్పేవారు అందరు సార్లు. తొమ్మిదవ తరగతి చదువుతుండగా పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులు పదవి విరమణ చేయుచుండగా సార్‍కు సన్మాన సభ జరిగింది. ఆ సభలో నేను శబరిమల వెళ్ళినప్పుడు నేర్చుకున్న అయ్యప్ప స్వామి భజన పాటను పాడాను. ప్రధానోపాధ్యాయులుతో సహా అందరు సార్లు మేడమ్స్ సహ విద్యార్థినులు అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. రోజు తుమ్మగుంట నుంచి రాజుపాలెం వచ్చి పాఠశాలలో చదువుకుని మళ్లీ తుమ్మగుంట వెళ్ళేదాన్ని. నా సహ విద్యార్థిని రోహిణి ప్రాణ స్నేహితురాలు అయింది. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం మధ్యాహ్నం పాఠశాల అయిన అయిన తరువాత రోహిణి వాళ్ళ ఇల్లు పాఠశాలకు ఎదురుగానే కావడంతో రోహిణి ఇంటికి వెళ్లి భోజనం చేసేవాళ్ళము. నేను తీసుకు వెళ్ళిన భోజనమే కాకుండా రోహిణి వాళ్ళ అమ్మగారు ఇంకా వేడి వేడిగా భోజనం పెట్టేది. తుమ్మగుంటలో ఒకరోజు బస్సు కోసమని పాఠశాలకి రావడానికి బయల్దేరాము. అది బాగా వర్షాకాలం. బాగా వానలు పడ్డాయి. పొలం గట్ల మీద నాన్న ఎత్తుకుని రావడంలో నాన్న కాల్లు కాస్త జారడంతో నాన్న చేతిలో నుంచి నేను జారి బురదలో పడిపోయాను. అప్పుడు నాన్న అక్కడ నీళ్లతో నా మీద ఉన్న బురద కడిగి పాఠశాలకు తీసుకుని వెళ్లడానికి రాజుపాలెం వచ్చి రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మగారు కన్నతల్లిలా నాకు స్నానం చేయించి దుస్తులు వేసి పాఠశాలకు పంపింది.

రోహిణివాళ్ళు ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవులు అయ్యారు. దీన్ని బట్టి నాన్న నాకు చెప్పిందేమిటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అనుకున్నది సాధించే ప్రయత్నం చేయాలి కానీ సమస్యలు వచ్చాయని వెనుకకు తగ్గకూడదు అని చెప్పారు.

అలా రోజు తుమ్మగుంట నుంచి రాజుపాలెం ఉన్నత పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. రోహిణితో పాటు కమలి, షిరీన్, జేబీనా, నిర్మల, పల్లా వెంకటేశ్వర్లు, కిష్టమ్మ ఇంకా మరొక ముగ్గురు స్నేహితురాళ్లు ఉండేవాళ్ళు. అందరం కలిసి చదువుకునే వాళ్ళం. రోహిణి వాళ్ళ నాన్నగారు రాజుపాలెం తపాలా ఆఫీసు మాస్టరు. కమలీ వాళ్ళ నాన్నగారు రాజుపాలెం బ్యాంకు మేనేజరు. మాది ఏ సెక్షన్ రోహిణి కమలి. బి సెక్షన్‌లో జెబీనా చదువులో మంచి తెలివిగలవాళ్ళు. రోహిణి కమలి జెబీనా నేను ముందు బెంచీలో కూర్చునేవాళ్ళం. గణితం ఉపాధ్యాయులు శ్రీధర్ సార్ వచ్చి రోహిణి కమలీ ఇద్దరు పొడవు గా ఉన్నారని వెనక వాళ్ళకు ఉపాధ్యాయులు చెప్పేది కనిపించదని ఇద్దరిని వెనక బెంచీలో కూర్చోపెట్టారు. అప్పుడు గణితం మాస్టర్‍ -ని రోహిణినీ, కమలినిని నాతో పాటే మొదటి బెంచీలో కూర్చొనివ్వమనీ ఏడుస్తూ వేడుకున్నాను. నా తరువాత మాస్టర్ వచ్చిన ఇదే పని చేస్తారు అని గణితం మాస్టర్ ఏడవవద్దు అంటూ నాకు సర్ది చెప్పారు.

ఏమి చేయలేక నేను ఊరకుండి పోయాను. అంతలోకమలి వాళ్ళ నాన్నగారికి వేరే ఊరికి బదిలీ అయింది. దాంతో కమలి వాళ్ల నాన్న గారితో వేరే ఊరు వెళ్ళి పోయింది. అది కార్తీక మాసం అనుకుంటా. తుమ్మగుంట లో ప్రతి కార్తీక పౌర్ణమికి అయ్యప్ప స్వామి గుడిలో లక్ష తులసి పూజ జరుగుతుంది. నేను రోహిణికి తుమ్మగుంట అయ్యప్ప స్వామి గుడిలో జరిగే లక్ష పూజకు వెళ్దామని రమ్మని పిలిచాను. ఇంకా ఎవరైనా ఆడపిల్ల తోడు ఉంటే రావడానికి బాగుంటుంది అంది. ఇది మాట్లాడుకుంటుంటే తెలుగు సారు వచ్చారు తరగతికి. అప్పుడు రోహిణి మేము మాట్లాడుకున్నదంతా సార్‌కి చెప్పింది. అప్పుడు అమ్మాయికి ఇంకా ఎవరైనా తోడు ఉండాలికదా రావడానికి అన్నారు. రోహిణికి వేరే తోడు లేని కారణంగా నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పింది.

తుమ్మ గుంట – లక్ష పూజ

ఇంకా నేను నాన్న లక్ష తులసి పూజకు తుమ్మగుంటకు వెళ్ళాము.

లక్ష తులసి పూజలో పూజ చేయడానికి నాన్న కూర్చున్నారు. నేను బయట అందరూ స్త్రీలు కూర్చున్నచోట గుర్తున్నాను. ఒకపక్క అయ్యప్ప స్వాములు శరణు ఘోషలు చేస్తూ భజనలు చేస్తున్నారు. ఒక పక్క లక్షా అర్చన మరొక పక్క అయ్యప్పల శరణు ఘోషతో భక్తుల జనసందోహంతో అయ్యప్ప ఆలయం నిండిపోయింది. అంతలో అయ్యప్ప ఆలయ ప్రధానార్చకులు భట్టారం చంద్రశేఖర స్వామికి అయ్యప్పస్వామి పూనకం రావడంతో మిగతా పూజారులు శాంతింపజేశారు. ఆ సమయంలో చంద్రశేఖర స్వామి వెలిగే కర్పూరం అమాంతం మింగేసే వారు. పూజాది కార్యక్రమాలు అయినతరువాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రక్క రోజు పాఠశాలకు వచ్చి రోహిణికి గుడి విషయాలు పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో చెప్పాను.

(ఇంకా ఉంది)

Exit mobile version