Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. సబ్బని లక్ష్మీనారాయణ చార్‌ధామ్ సాహస యాత్ర!

[డా. సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన ‘నా చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ సంకేపల్లి నాగేంద్రశర్మ.]

డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు. బహుభాషావేత్త. గత 40 సంవత్సరాల నుండి సీనియర్ సాహితీవేత్తగా సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా సమాంతరంగా సాహితీ, విహార, ఆధ్యాత్మిక, చారిత్రక యాత్రలు చేయడము, తదనంతరం ఆధారిత రచనలు చేయడం ఒక భాగంగా నిలిచిపోయింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి రావడమే కాకుండా, అంతర్జాతీయంగా రెండుసార్లు అమెరికా యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేశారు. 2018లో తన అమెరికా సందర్శనపై అమెరికా యాత్రపై ‘నా అమెరికా సాహితీ సౌహార్థయాత్ర‘ అనే ట్రావెలాగ్ పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. వీరు ఐదుసార్లు అయ్యప్ప దీక్షను తీసుకొని కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప సన్నిధానాన్ని దర్శించుకుని వచ్చారు. ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఢిల్లీ ,రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో పర్యటించి సాహితీ యాత్రలను పూర్తి చేశారు. వృద్ధాప్యాన్ని సైతం జయించి ఆరోగ్యంగా ఉండటం వలన వీరు సుమారు 64 సంవత్సరాల వయసులో ఈ ఏడాది మే నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని చార్‌ధామ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారతదేశంలో తొలి తెలుగు కాశీ యాత్రికుడిగా ఏనుగుల వీరస్వామి గారు 1830 ప్రాంతంలో పాదయాత్రతో పూర్తి చేశారు. చరిత్ర పుటలను తిరగవేస్తే అలెగ్జాండర్, మార్కోపోలో, మొగస్తనీస్, పాహియాన్, హుయన్ షాంగ్ తదితరులు ఎంతోమంది భారత్‌ను సందర్శించి యాత్రా చరిత్రలు రాశారు. భారతదేశంలో ఎంతోమంది పర్యాటక, ఆధ్యాత్మిక, యాత్రిక విహారాలపై పలు రచనలు చేశారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ తాను తిరిగిన ప్రాంతాలపై యాత్రా రచనలు చేశారు. తెలుగు యాత్రా రచనలను పరిశీలిస్తే, ఇటీవలి కాలం నుండి యాత్రా, విహార రచనలు పలువురు వెలువరిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన యాత్రా చరిత్రకారుడు ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణ, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ సాహితీవేత్త డా.ఎన్. గోపి, కరీంనగర్ యాత్రా చరిత్ర పరిశోధకులు, పిహెచ్‌డి పట్టాన్ని సొంతం చేసుకొన్న డాక్టర్ మచ్చ హరిదాస్ తదితరులు యాత్రా రచనలు చేయడంలో తమ మెలకువలను చూపించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన చరిత్రకారుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ తెలంగాణాలోని అతికష్టమైన ఏజన్సీ అడవులు, గోదావరి, కృష్ణా నదిలోయలు, కొండకోనల్లోని పర్యాటక, యాత్రా, విహార స్థలాలను సందర్శించి, రెండు పుస్తకాలు రాశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు సోదరుడు పివి మనోహర్రావు గత నలభై ఏళ్ల కిందట చైనా టిబెట్ ప్రాంతంలోని హిమసానులలో ఉన్న అతిక్లిష్టమైన ఆధ్యాత్మిక మానస సరోవరం, కైలాసగిరి సందర్శన యాత్రను పూర్తి చేసి ఒక యాత్రా గ్రంథంగా తెలుగులో వెలువరించారు. ఈ గ్రంథము అత్యంత ఆదరణ గురై రెండుసార్లు అచ్చులోకి వచ్చింది.

హిమాలయ సానువులలోని చార్‌ధామ్ యాత్ర విశ్రాంత దశలో డా. సబ్బని వారు చేయడం గొప్ప సాహసమే అని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇక్కడ యాత్రికులు రకరకాలుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కరుగుతున్న హిమాలాయాలు, ఇరుకైన ఘాట్ రోడ్లు, గుర్రాలపై, డోలీలు, గంపలు, పల్లకీలు, చివరకు నడక ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్య వయస్సులో ఉన్నవారు, ఆరోగ్యవంతులకే ఈ శీతల యాత్రలు అనుకూలంగా ఉంటాయి. సబ్బని వారు 13 రోజులలో చార్‌ధామ్ యాత్రను పూర్తిచేసుకుని తాను చూసిన అనుభవాలను ‘నా చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర’ అనే పేరు మీద ఒక పుస్తకంగా అచ్చులోకి తేవడం ఆనందంగా ఉంది.

ఈ యాత్రలో భాగంగానే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా, మధుర, బృందావనం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, హృషికేష్ తో సహా చార్‌ధామ్ గా పిలువబడుతున్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలోని కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రైల్, బస్సు, గుర్రాలు, నడక మార్గాన వీరి ప్రయాణాలు సాగాయి.

ఈ సంవత్సరం మే 10వ తేదీ అక్షయ తృతీయ నాటి నుండి ఈ యాత్రకు అనుమతులు ఇచ్చారు. నవంబర్ 3వ తేదీన దీపావళి తర్వాత రెండో రోజు నుండి మూసివేస్తారు. ఈ యాత్ర వెళ్ళడానికి ఉత్తరాఖండ్ టూరిజం బోర్డు వెబ్‌సైట్‌లో తమ పేర్లను అధికారికంగా ముందు గానే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కేదార్ వెళ్ళడానికై కూడా హెలికాప్టర్ సౌకర్యానికి అడ్వాన్సుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాను హిమాలయ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న విధానాన్ని ఈ పుస్తకంలో తేటతెల్లము చేశారు. ఇతరులు ఈ పుస్తకం చదివితే ఎలా వెళ్ళాలో ఒక గైడ్‌లా మార్గదర్శక సమాచారాన్ని అందిస్తుంది. అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఎలా వ్యవహరించాలో, ఎక్కడ బస చేయాలో మొదలగు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తుంది.

డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు 27 మంది మిత్ర బృందంతో కరీంనగర్ నుండి బయలుదేరి సుమారు 15 రోజులలో ఈ యాత్రను ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా పూర్తి చేశారు. ఈ యాత్రలో తమ వాడలోని ఇరుగుపొరుగు వారు ఉండటము వల్ల వీరు చార్‌ధామ్ యాత్రను పూర్తి చేయడానికి అవకాశం కలిగింది. మే 9వ తేదీన రామగుండం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి తిరిగి మే 23వ తేదీన వారు ఈ యాత్రను రామగుండం రైల్వేస్టేషన్లో దిగడం ద్వారా పూర్తి చేశారు. 13 రోజులు 12 నిద్రలతో ఈ యాత్రను వారు పూర్తి చేశారు. తన సతీమణి శారదను తీసుకుని వెళ్లడానికి ఆరోగ్యపరంగా అవకాశం లేకపోవడం వలన తాను ఒంటరిగానే మిత్రబృందంతో కలిసి వెళ్లారు. రామగుండం రైల్వే స్టేషన్ నుండి ఆగ్రా వరకు మొదటి రోజు ప్రయాణం చేశారు. మే పదవ తేదీన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయిల చారిత్రిక నగరమైన ఆగ్రా స్టేషన్ లో దిగారు.

యమునా నదీ తీరంలో ఉన్న ఆగ్రాలో చారిత్రాత్మకమైన ఆగ్రా కోట చూశాం అని చెపుతూ, మొగలాయి చక్రవర్తి షాజహాన్ పాలరాతితో నిర్మించిన ప్రేమ సౌధమైన తాజ్ మహల్ సుందర నిర్మాణాన్ని ఆనాడు శుక్రవారం సెలవు దినం కాబట్టి చూడలేక పోయామన్నారు వారు. సమీపంలో ఉన్న రాధాకృష్ణుల భక్తి- ప్రేమ విహారాదులకు నిలయమైన మధురా, బృందావనాన్ని తిలకించి 353 కిలో మీటర్ల దూరంలో ఉన్న చార్‌ధామ్ యాత్రకు ప్రవేశ మార్గమైన హరిద్వార్‌కు ట్రావెల్ ప్యాకేజీ బస్సులో రాత్రి 10 గంటలకు బయలుదేరారు రెండవ రోజు.

మూడవ రోజు యాత్రలో దేవ భూమికి దారి అయిన హరిద్వార్‌లో పర్యటించారు. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్ హిమాలయాలకు ముఖద్వారం అని పవిత్రమైన పుణ్యక్షేత్రమని వర్ణించారు. ఇక్కడి గంగా హారతి కార్యక్రమాన్ని, నదిలో దీపాలను వదిలే విశేషాలను రచయిత వివరించారు. ఎత్తయిన కొండలపై ఉన్న మానసా దేవి మందిరాన్ని మరియు ఇతర దేవాలయాలను రోప్ వే ద్వారా సందర్శించడం ఒక అనుభూతిగా పేర్కొన్నారు. చార్‌ధామ్ యాత్ర ముఖ్యంగా హరిద్వార్, రిషికేష్, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి మొదలవుతుంది.

నాలుగవ రోజు ఋషికేష్ మరియు బర్కోట్ ప్రయాణాలు. బర్కోట్ నుండే సుమారు రెండు వందల కిలో మీటర్ల దూరం వేర్వేరుగా ప్రయాణీస్తే, యమునోత్రి, గంగోత్రి యాత్రల మార్గాలు ఉంటాయి. హరిద్వార్ నుండి రిషికేశ్ కు 20 కిలోమీటర్ల దూరం. చార్‌ధామ్ యాత్రకు వెళ్లడానికి ముందు విపరీతంగా ఉండే చలిని తట్టుకోవడానికి కావాల్సిన ఉలన్ దుస్తులను, మందులను, ఇతరత్రా సామాగ్రిని కొనుగోలు చేసుకున్నారు. గతంలో మూడు దశాబ్దాల కింద ఢిల్లీ వచ్చినప్పుడు రచయిత ఋషికేష్ క్షేత్రాన్ని సందర్శించిన జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా తీగల వంతెనలను గతంలో సందర్శించారు. ప్రస్తుతము అవి మరమ్మత్తులలో ఉన్నాయి. జానకి సేతును సందర్శించారు. ప్రపంచానికి యోగ రాజధానిగా ఋషికేష్ పిలువబడుతుంది. గైడ్ సహాయంతో త్రివేణి ఘాటును, గీతా భవన్ సందర్శించారు. ఋషికేష్ నుండి మొదటి యాత్ర యమునోత్రి. హృషీకేష్ నుండి ఐదు గంటలలో 175 కిలోమీటర్లు పయనిస్తే బర్కోట్ చేరుతారు. ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. లోయల్లో ఇరుకైన రోడ్లు. గంటల కొద్దీ ట్రాఫిక్ జాములు ఉంటాయి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. తాబేలు నడక ప్రయాణాలు ఉంటాయి. వ్యక్తిగతంగా లగేజీ ఉంటుంది. జబ్బ సంచిలో ఆహార పదార్థాలు, బట్టలు, ఇతర వస్తువులు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వరకు గజ గజ వణికే చలిలో బర్కోట్ చేరుకున్నారు. అక్కడ రాత్రి ఒక హోటల్లో తమ బృందంలో వెంట వచ్చిన మిత్రుడు కృష్ణతో బస చేశారు.

ఐదవ రోజు ప్రయాణము బర్కోటు నుండి జానకి చెట్టి వరకు 45 కిలోమీటర్ల వరకు బస్సు ప్రయాణం. జానకీ చెట్టి నుండి యమునోత్రి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. జానకి చెట్టీ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తల ఎత్తాయి. శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి వీలుగా థర్మల్ వేర్ ధరించి, ఉలన్ దుస్తులు వేసుకొని ముందుకు కదిలారు. యమునోత్రి దాదాపు 11 వేల అడుగుల ఎత్తు పైన ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ముందు జాగ్రత్త చర్యగా కర్పూరం బిళ్ళలు దస్తిలో పెట్టుకొని బయల్దేరారు. యమునోత్రి యాత్ర వెళ్ళడానికి గతంలో ఈ యాత్రలను పూర్తి చేసిన కరీంనగర్ లోని తన మిత్రులైన సురేందర్ రెడ్ది, వజ్జల ప్రకాశ్ ల సలహాలను తీసుకొన్నారు. గుర్రాలపైనే ప్రయాణం చేయడం సులభం అని చెప్పిన సలహాను ఇక్కడ వీరు అక్షరాలా పాటించారు. బస్ వెంట బోలేరో వాహనంలో ట్రావెల్ ఏజన్సీ వారి తరపునుండి భోజన సౌకర్యాల కోసం వంట వాళ్ళు వచ్చే ఏర్పాటు ఉంది. ట్రాఫిక్ జాం వల్ల జానకీ చెట్టి మార్గ మధ్యం లోనే రోడ్డు పక్కనే భోజనాలు చేశారు. ఆరోజు అర్థరాత్రి వరకు హనుమాన్ చెట్టిని దాటి జానకి చెట్టీకి చేరుకొన్నారు. అక్కడ హోటల్లో రూం తీసుకొన్నారు ఆ రాత్రికి మూడు వెయిలకు ముగ్గురికి.

ఆరో రోజు ఉదయం యమునోత్రి ప్రయాణం. రెండు వేల అడుగుల ఎత్తు వెళ్లాలి. ఆ రాత్రి హోటల్లో ఆగి, తెల్లారి ఉదయం 4.30 గంటలకు స్నానాదులు ముగించుకొని 2500 రూపాయల బాడుగ చెల్లించి (పోనీలు) చిన్న గుర్రాలపై బయలు దేరారు. గంటన్నర సమయంలోనే చేరుకొన్నారు యమునోత్రికి . సూర్యుడు ఉదయిస్తున్నాడు. గలగలా యమునోత్రి మెరుస్తున్న దూది లాంటి మంచు కొండల్లో నుండి ప్రవహిస్తోంది. వారు హిమాలయాలను దగ్గర నుండి చూడడం ఇక్కడే మొదటిసారిగా జరిగింది. యమునోత్రి లో ఊష్ణోగ్రత రాత్రి 3 సెంటీ గ్రేడ్ వరకు పడిపోయి పగలు 11-12 డిగ్రీల మధ్యగా ఉంటుంది. గంగానదికి యమునా నది ప్రధాన ఉపనది. గజగజ చలి. అక్కడ యమునా మాత గుడి ఉంది. అక్కడే ఉష్ణ గుండం ఉంది. గంటన్నర గడిపి, పోనీ సాయంతో వెనుదిరిగారు. అక్కడి టీ కొట్టులో కప్పు టీ 20 రూపాయలు. 30 రూపాయలకు అరలీటర్ వాటర్ బాటిల్. టీ సేవించి రెండు గంటల్లో పోనీ సాయంతో వెనుదిరిగారు. ఇక్కడ రోప్ వే సౌకర్యం కల్పించాలని రచయిత సలహా ఇస్తారు.

ఏడవ రోజు గంగోత్రి యాత్ర వివరాలు రాశారు. ఈ యాత్రలో తాను చూసిన హిమాలయ లోయల్లోని కొండల మధ్య సాగే ప్రయాణ వర్ణనలను సుందరంగా రాశారు. వంతెనలను దాటుతూ జలపాతాలను చూస్తూ తమ ప్రయాణాలు సాగినట్లు వివరిస్తారు. గంగోత్రి బెల్ట్ లోని సుందర ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యాల మధ్య కనిపించే సూర్యస్తమయ వర్ణనలను చూసి పొంగి పోతారు. అస్తమయ సమయం పశ్చిమాన కొండల వెనుక బంగారు రంగు చాయ కనిపిస్తోందని రాస్తారు. నగర జీవనం కంటే ఈ ప్రకృతి ఒడిలో రోజుల తరబడి గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆత్మీయంగా తలపోస్తారు. గంగోత్రిలో ఆ రాత్రి 8 గంటల సమయంలో గంగమ్మ గుడి దర్శనం చేసుకొన్నారు. గంగోత్రి ఆలయాన్ని 18 వ శతాబ్దంలో గోర్ఖా జనరల్ అమర్ సింగ్ థాపా నిర్మించారు. భాగీరథి దీనికి ఎడమ ఒడ్దున ఉంది.

గంగానది ప్రాముఖ్యాన్ని గూర్చి రచయిత వివరంగా రాశారు. సుమారు 2500 కిలోమీటర్లు ప్రవహిస్తూ, పశ్చిమ బెంగాళ్ దగ్గరి బంగాళాఖాతంలో గంగాసాగర్ వద్ద సముద్రంలో కలుస్తుంది. తాను 2005 లో రాసిన – నది నా పుట్టుక – లోని నదీ ప్రాముఖ్యత గల కవితలను గుర్తు చేసుకొంటారు. ఎనిమిదో రోజు గంగోత్రి నుండి ఉత్తర కాశీ వరకు తిరుగు ప్రయాణం చేస్తారు. తాను చూసిన రమణీయ దృశ్యాలను సెల్ ఫోటోల్లో, వీడియోల్లో బంధించాడు. గంగానానీ అనే ప్రదేశం వద్ద ఆగి అక్కడి వేడి కుండంలో పది రూపాయలు చెల్లించి వెచ్చటి స్నానాలు చేసి, ఏకముఖి రుద్రాక్షలు కొనుగోలు చేశారు. ఉత్తర కాశీలోని విశ్వనాధ ఆలయంలోని పెద్ద శివలింగం, అష్ట దాతు త్రిశూల దర్శనం చేసుకొన్నారు. ఆ సాయంత్రం గుప్త కాశీకి 200 కిలోమీటర్లు వెళ్ళి కేదరనాథ్ కు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

తొమ్మిదో రోజు యాత్ర ఉత్తర కాశీ నుండి కేదార్ వెళ్ళే ప్రయాణపు మార్గంలోని పలు అంశాల గూర్చి రాశారు. గుప్తకాశీకి వరకు సాగిన బస్సు ప్రయాణాన్ని వర్ణించారు. బస్సు డ్రైవర్ల అపసోపలను తెలుపుతాడు. మార్గమధ్యలో ఆగిన నౌళి గ్రామంలో ఆగిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. కేదార్‌లో ప్రవహించే మందాకినీ నదీ ప్రవాహాల పక్క నుండి ప్రయాణించారు. మధ్యాహ్నం వరకు గుప్తకాశీకి చేరుకొన్నారు. అక్కడ ఆగి హోటల్ లో కాలకృత్యాలు తీసుకొని, సోన్ ప్రయాగ్, గౌరీ కుండ్ చేరుకొని కేదార్ నాథ్ యాత్రను మొదలు పెట్టినారు. గౌరీ కుండ్ నుండి కేదార్ 18 కిలోమీటర్లు ఉంటుంది.

పదవరోజున అనగా మే 18 వ తేదీన కేదార్ నాథ్ యాత్రానుభవాలను రాశారు. సీతాపూర్ నుండి నాలుగు అయిదు కిలోమీటర్లు నడిస్తే సోన్ ప్రయాగ్ వస్తుంది. ట్రెక్కింగ్ యాత్రాప్రయాణాల్లో తోడుగా కృష్ణ ఉన్నాడు. గౌరీ కుండ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ చేరాలి. ఇక్కడ నడక లేదా గుర్రాల సాయంతో వెళ్ళాలి. పోనీ గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి రోప్ వే ఏర్పాటు చేస్తే సులభంగా కేదార్ చేరే అవకాశం ఉందని రచయిత అంటారు. ప్రకృతి అనుకూలిస్తేనే ఈ చార్‌ధామ్ యాత్రలు విజయవంతం అవుతాయని రచయిత అనుభవంగా చెప్పారు. సరైన గైడెన్స్ కూడా అవసరమని నొక్కి చెబుతారు. కేదార్ దగ్గిర టెంట్‌లు, హోటల్ గదులు కిరాయలకు ఇస్తారు. అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. కేదార్ నాథ్ చేరడానికి, కేదార్ నాథ్‌లో బస చేయడానికి జరిగిన అసౌకర్యాలను, తప్పిదాలను, మోకాళ్ళ నొప్పులను, చలిని , అపసోపలను రచయిత వివరంగా రాశారు. ఆ రాత్రి కిరాయికి తీసుకొన్న టెంట్ గదిలో బస చేశారు గుడి దగ్గర.

కేదార్ నాథ్ 12 వేల అడుగుల ఎత్తున ఉంది. పంచకేదార్ ల వివరాలు, కేదార్ అంటే క్షేత్రానికి ప్రభువు అని అర్థం. పంచపాండవులు స్థాపించిన కేదార్ క్షేత్ర వైశిష్ట్యాన్ని గూర్చి రాశారు. 2013 లో జరిగిన కేదార్ నాథ్ విలయాన్ని కళ్ళకు కట్టినట్లుగా రాశారు. కేదార్ నాథ్ గుడి వెనక వచ్చిన భీమశిల గూర్చి వివరించారు. అక్కడ 2021 నుండి జరుగుతున్న ఆదిశంకరాచార్య విగ్రహం, సమాధి పనుల అభివృద్ది ప్రాజెక్ట్ గూర్చి రాశాడు. ప్రధాని మోడీ చొరవతో సాగుతున్న ఆదిశంకరాచార్య ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు సాగుతున్నాయని, నత్తనడకన సాగుతున్న ఈ పనులు పూర్తయితే యాత్రికులకు విశాలమైన స్థలం వినియోగంలోకి వస్తుందని రాశాడు. గుడి వద్ద నాగసాదువులు కనిపించినట్లుగా రాశారు. కేదార్ గుడి వెనకాలే మెరిసే మంచు పర్వతాల దృశ్యాలు కనిపిస్తాయని, చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ యాత్ర మరింత క్లిష్టమైనదని, జీవితంలో చూడాల్సిన జ్యోతిర్లింగ క్షెత్రమని రచయిత రాసుకొన్నారు.

ఇక్కడ సాధువులు దోమతెరలు లాంటి ప్లాస్టిక్ కవర్ తో చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉన్నారు. మంచుకొండల్లో వారి జీవనం విలక్షణమని రచయిత అంటాడు. కేదార్ నాథ్ గోపురాలు గుడిలైట్లలో వెలిగి పోతున్న దృశ్యాన్ని చక్కగా వర్ణించారు. భైరవనాథ స్వామి దేవాలయం, సిద్ది పేట జిల్లా వారి ఉచిత బోజనాలు పెట్టడాం, రుద్రమెడిటేషన్ గుహలు, కేదార్ ను అంటుకొని పారే మందాకినీ నది పుట్టిన ప్రదేశం చోరాబరి తాల్, సమీప వాసుకి తాల్, బ్రహ్మనాభి కమలం పూలు గూర్చి రచయిత ఆసక్తిగా రాశారు.

11 రోజున ఉదయత్పూర్వం జరిగిన కేదార్ దర్శనం గూర్చి రాశాడు. అభిషేకం టిక్కెట్ తీసుకొని అయిదుగురం దర్శనానికి బయలు దేరారు. అరగంటలో గుడిలోకి చేరారు. త్రిభుజాకార బండ రూపంలో శివలింగం ఉంది. ఇది గోవు యొక్క మూపుర భాగం. దర్శనం, నెయ్యితో అభిషేకం చేసుకొన్నారు. కర్ణాటకకు చెందిన వీర శైవ జంగం సమాజానికి చెందిన పూజారులే ఇక్కడ పూజలు చేస్తారు. కేదార్ లో జియో, ఏయిర్ టెల్ సెల్ సిగ్నల్స్ చక్కగానే పనిచేస్తున్నాయి. అక్కడి నుండి రెండు వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి, ఇంటి వద్ద అమర్చిన సిసి కెమెరాల దృశ్యాలు చూడడం, వాటి పనితనం, అమెరికాలో ఉన్న పెద్ద కొడుక్కి పోన్లు చేసి మాట్లాడం, కుటుంబ సభ్యులతో , మిత్రులతో మాట్లాడడం వంటి విషయాల గూర్చి రాసిన వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆ రోజు కేదార్ నాథ్ లో రద్దీ బాగా ఉంది. ఉదయం పది గంటల సమయంలో రెండు కిలోమీటర్ల వరకు దర్శనం లైన్లు ఉన్నాయని రాశాడు.

కేదార్ నాథ్ కు హెలికాప్టర్ సౌకర్యం పావుగంట మాత్రమే నని, రెండు గంటల్లో ప్రత్యేకమైన విఐపి దర్శనం చేసుకొని తిరిగి రావచ్చునని రాశాడు. సరైన గైడెన్స్ ఉంటే ప్రయాణం సులభం అవుతుందని రాశాడు. వాతావరణం అనుకూలతలపై హెలికాప్టర్ ప్రయాణ సౌకర్యం ఆధారపడి ఉంటుందని రాశాడు. కేదార్ నాథ్ నుండి గౌరీకుండ్ వరకు పోనీ గుర్రాల సాయంతో 18 కిలోమీటర్ల దూరం వరకు వెనక్కి వచ్చారు. పిసినారితనం ప్రదర్శిస్తే యాత్రలో అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రచయిత బల్లగుద్దినట్లుగా స్పస్టం చేశారు.

కేదార్ నుండి చివరి ప్రయాణమైన బద్రీనాథ్ ప్రయాణం చక్కగా రాశారు. అక్కడి నుండి జీప్ ఎక్కి సోన్ ప్రయాగ్ చేరుకొన్నారు. నాలుగు కిలోమీటర్లు నడిచి సీతాపూర్ బస్ పార్కింగ్‌కు చేరుకొన్నారు. మార్గమధ్యంలో ఉన్న త్రియుగ్ నారాయణ క్షేత్ర ప్రాధాన్యత గూర్చి రాశారు. ఆ క్షేత్రం సోన్ ప్రయాగ్ కి అయిదు కిలో మీటర్లు ఉంటుంది. ఇక్కడ మూడు యుగాల నుండి హోమం మండుతూనే ఉందని, అందుకే త్రియుగ్ నారాయణ క్షేత్రమని పేరు వచ్చిందని రాశాడు. ఇక్కడే చతురస్రాకారపు రాతి పలకపై శివపార్వతుల వివాహం జరిగిందని రాశాడు. చూసే అవకాశం దక్క లేదని రాశాడు.

సోన్ ప్రయాగ్ నుండి అపసోపలు పడి తుంపర్ల వర్షం లో నడక ద్వారా సీతాపూర్ పార్కింగ్ ప్లేస్ దాటి రాంపూర్ ఎగ్జిట్ పార్కింగ్ కు చేరుకొని, బస్సులో బద్రినాథ్ ప్రయాణం చేశారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎదురైంది. రాత్రి పది గంటలకు ప్రయాణమైన బస్సు షెడ్యూల్ ప్రకారం 200 కిలోమీటర్లు ప్రయాణించి, బద్రీనాథ్ కు చేరాలి. పీపల్ కోట్ లో బస చేయాలి. ఆలస్యం అవడం వల్ల బస చేయకుండానే రాత్రి 10 గంటల నుండి ప్రయాణం సాగింది. సాధారణ సమయం 8 గంటలు. అనుకూలంగా లేకపోతే 16 గంటలు కూడా అవుతుంది. మార్గమధ్యమంలో తెల్లారి ఉదయం 8 గంటలకు గోపేశ్వర్ హోటల్ లో ఆగి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేశారు. వెంట వచ్చే బోలేరో వాహనం కుక్ మధ్యాహ్న బోజనం ఏర్పాటు చేశాడు. తోవలో డాఖిమఠ్, అగస్త్యముని, రుద్రప్రయాగ, కర్ణ ప్రయాగ, జోషిమఠ్ లాంటి ప్రముఖ ప్రదేశాలు ఉంటాయి. గోపేశ్వర్ నుండి బద్రి 95 కిలోమీటర్ల ప్రయాణం. ఈ రోజు సాయంత్రం బద్రినాథ్ ప్రయాణం చేరుకొని, వెనుదిరగాలి. సాయంత్రం 5 గంటలకు బద్రీకి బస్సు చేరింది. అంటే ఒక స్టే తో 19 గంటల ప్రయాణం చేశారు.

రచయిత ఇక్కడ అదే రోజు బద్రీనాథ్ ఆలయ దర్శనం చేసుకొన్నారు. ఈ క్షేత్ర ప్రాధాన్యత గూర్చి వివరంగా రాశారు. పక్కనే అలకనంద నదీ వేగంగా పారుతూ ఉంది. చమోలి జిల్లాలో బద్రినాథ్ దేవాలయం ఉంది. బద్రి నాథ్ 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. బద్రిలో యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేదార్ కంటే బద్రి ప్రయాణం సులువని రచయిత చెప్పుకొచ్చాడు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. పదివేల అడుగుల పైనేఉంది. ఈ హిమాలయాలు ఉత్తర దిక్కున రక్షణగా కోట గోడలుగా ఉన్నాయి. కేదార్ లో శివుడు, బద్రిలో మహావిష్ణువు కొలువై ఉండి సమస్త భారతజాతిని కాపాడుతున్నారని రచయిత పొంగిపోయి రాశారు. బదరిక అంటే రేగు పండ్లు అని అర్థం. బదరికా వనం, బదరికాశ్రమం అని కూడా అంటారు. చలిని లెక్క చేయక మహావిష్ణువు తపస్సు చేసినపుడు మహాలక్ష్మీ భార్య బద్రి రేగు చెట్టయి రక్షణగా నిలిచిందట. మహాభారతంలో పేర్కొన్న నరనారాయణులు అర్జునుడు, కృష్ణుడు ఇక్కడే తపస్సు చేశారు కనుక, దీన్ని నరనారాయణ క్షేత్రమని పిలుస్తారు.

బద్రీ వద్ద అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి. ఇండో చైనా సరిహద్దు గ్రామమైన, భారత్ చివరి గ్రామమైన మనా గ్రామం, సరస్వతీ నది, పాండవుల స్వర్గద్వారం, మహాభారతం రాసిన వ్యాస గుహ, లిఖించిన గణేశ గుహ ఇవన్నీ ఉన్నాయి. సమయం లేక పోవడం వల్ల చూడలేక పోయినట్లు రాశారు. ఇవన్నీ బద్రీనాథ్ నుండి అయిదారు కిలో మీటర్ల దూరంలో ఉంటాయని రచయిత పేర్కొన్నారు. ఆదిశంకరులు స్థాపించిన జోషీ మట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతల కాలంలో బద్రీ దేవాలయాన్ని మూసి వేసి, ఆ విగ్రహాలను జోషిమట్ లోని నరసింహ స్వామి దేవాలయానికి తరలించి ఆరు నెలలు పూజలు చేస్తారు. కేదార్ లో అయితే ఊకి దేవాలయానికి తరలించి పూజలు చేస్తారు.

బద్రీ సమీపంలోని అలకనందా తీరంలో బ్రహ్మకపాలం ఉంది. ఇక్కడే పెద్దలకు పిండాలు పెట్టుకొంటారు. కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణులు బద్రీ గుడిలో పూజారీలుగా ఉంటారు. కేదార్, బద్రీ దేవాలయాల పాలన చూడడానికి స్వతంత్రంగా ఒకే కమిటీ ఉంటుంది. 18 వ శతాబ్దంలో కాశ్మ్రీరీ రాజ గులాబ్ సింగ్ చే కొత్తగా నిర్మాణం చేయబడింది. యాబై అడుగుల గోపురం. ఒక అడుగు లోపున బద్రీనాథుడి నల్ల రాతి (విష్ణుమూర్తి)విగ్రహం ఉంది. పార్కింగ్ నుండి గుడి వరకు అరగంట కాలి నడక ప్రయాణం ఉంటుంది. అలకనంద నదీ దాటి ఇనుప బ్రిడ్జి పై వెళ్ళాల్సి ఉంటుంది. తప్తకుండ్, నారద కుండ్ అనే వేడి నీటి కుండాలు ఉంటాయి. అక్కడ స్నానాలు చేది రాత్రి 9 గంటల వరకు దర్శనాలు చేసుకొని, ఆ రోజు రాత్రి జీయర్ స్వామి ఆశ్రమంలో టిఫిన్స్ తిని బస చేశారు. తెల్లవారి అనగా మే 21 వ తేదీన బ్రహ్మకపాలం లో అలకనంద నదీ తీరాన పిండప్రదానాలు చేసుకొని, హరిద్వార్ మీదుగా అక్కడి నుండి ఢిల్లీకి బయలు దేరారు. బద్రీ నాథ్ నుండి హరిద్వార్ 307 కిలో మీటర్ల దూరం ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యమంలో ఎనిమిది దశాబ్దాల నాటి ధారీ దేవాలయంలో ఆగారు. ధారీ దేవతను ఉత్తరాఖండ్ పోషక దేవతగా, చారుధామ్ రక్షకురాలిగా పిలుస్తారు. మార్గ మధ్యమంలో ఉన్న దేవ్ ప్రయాగ గూర్చి రాశాడు. ఇక్కడ అలకనంద, గంగోత్రి నుండి వచ్చే భాగీరథీ నదులు వచ్చి, సంగమమై గంగానదిగా పారుతుంది. దేవ్ ప్రయాగ పంచ ప్రయాగ క్షేత్రాలలో చివరిది. విష్ణు, నంద, కర్ణ, రుద్ర, దేవ్ ప్రయాగలు కలిసి పంచ ప్రయాగ్ లుగా పిలుస్తారు. ప్రయాగ్ అంటే సంగమం అని అర్థం. దేవ ప్రయాగలో సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది. దేవ ప్రయాగ నుండి హరిద్వార్ 91 కిలోమీటర్లు. హరిద్వార్ చేరాక మరో బస్సు ఎక్కి 222 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి అయిదారు గంటల్లో మే 22 న ఉదయం ఢిల్లీకి చేరుకొన్నారు. డిల్లి కరోల్ బాగ్ లాడ్జిలో బస చేసి స్నానాదులు ముగించి, టిఫిన్ చేసి డిల్లీలో స్వామి నారాయణ మందిరం మధ్యాహ్నం లోగా దర్శించుకొని వచ్చి, భోజనాల తర్వాత డిల్లీ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 4 గంటలకు రైలు ఎక్కితే 23 మధ్యాహ్నం వరకు రామగుండం రైల్ స్టేషన్లో దిగి బొలెరో వాహనం లో ఇంటికి చేర్ వరకు మధ్యాహ్నం మూడు దాటింది. అలా మా చార్‌ధామ్ యాత్ర విజయవంతంగా ముగిసింది అంటారు రచయిత. చార్‌ధామ్ యాత్ర చేయబోయే వారికి ఒక గైడ్ బుక్‌లా సబ్బని తన యాత్ర అనుభవాలు రాయడం అభినందనీయం.

***

నా చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర
రచన: డా. సబ్బని లక్ష్మీ నారాయణ
ప్రచురణ: కస్తూరి విజయం
పేజీలు: 174
వెల: ₹ 320/-
ప్రతులకు:
డా. సబ్బని లక్ష్మీనారాయణ,
# 6-6-302, సాయినగర్,
కరీంనగర్- 505001,
మొబైల్: 8985251271.
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/Chardham-Adhyathmika-Yatra-Sabbani-Laxminarayana/dp/819744756X

Exit mobile version