Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా బిడ్డ

[శ్రీ వకుళాభరణం రాంనరేశ్ కుమార్ రచించిన ‘నా బిడ్డ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

ఎంతో ఉన్నతాశయంతో ఎగిరి వెళ్లెను నా బిడ్డ
ఏడు సంద్రాల ఆవలికి ఎగిరి వెళ్లెను నా బిడ్డ
ఏమి తింటదో నా బిడ్డ ఎలాగుంటదో నా బిడ్డ
నవ్యభాషలు నేర్చి భవ్యపథముకై వెళ్లెను నా బిడ్డ
పాశ్చాత్య దేశానికి పరుగులిడెను నా బిడ్డ
ఏమి తింటదో నా బిడ్డ ఎలాగుంటదో నాబిడ్డ

నాకు ఒక కంట కన్నీరు రా నా బిడ్డ
మరో కంట పన్నీరు రా నా బిడ్డ
నీవెదుగుతున్నావని ఆనందించాలో లేక
నీవెగిరి వెళ్తున్నావని బాధపడాలో
తెలియకుందిరా నా బిడ్డ
ఏమి తింటవో నా బిడ్డ ఎలాగుంటవో నా బిడ్డ

ఆశయం ఎంత ఉన్నతమో ఆచరణ అంత కఠినమురా నా బిడ్డ
ఆత్మవిశ్వాసం తోడుగా అందలాలు ఎక్కాలిరా నా బిడ్డ
ముళ్లబాటలు తోసుకుని, రాళ్ళ గుట్టలు దాటుకుని
పూలబాటలో సాగాలిరా నా బిడ్డ
విద్యాగంధ పరిమళాలు వెదజల్లాలిరా నాబిడ్డ
ఏమి తింటవో నా బిడ్డ ఎలాగుంటవో నాబిడ్డ

విమానం ఎక్కితివిరా నా బిడ్డ విహంగం వలె సాగితివిరా నా బిడ్డ
ఆకాశ వీధుల్లో అల్లంత వెళుతున్నావురా నా బిడ్డ
నీ ఆశయం తోడుగా అభివృద్ధి పథమున సాగాలిరా నా బిడ్డ
ఏమి తింటవో నాబిడ్డ ఎలాగుంటవో నాబిడ్డ

ఇక్కడేమో అమ్మచేసిన అప్పాలు తింటివి
దోస్తులతో మటను బిర్యానీ మంచిగుంటదంటివి
నాన్నమ్మతో అరిసెలు అంటివి
అమ్మమ్మతో చికెన్ అంటివి
చెల్లెమ్మతో రీల్స్ చేస్తివి అమ్మతో సినీరీల్స్ చూస్తివి
ఇప్పుడెట్లుంటావురా నా బిడ్డ
ఒంటరి పోరు సాగించాలిరా నాబిడ్డ
ఏమి తింటవో నా బిడ్డ ఎలాగుంటవో నా బిడ్డ

కృష్ణుడు సాందీపని ఆశ్రమానికి వెళ్లినట్లు
రాకుమారులు గురుకులాలకు వెళ్లినట్లు
సౌఖ్యాలను వీడి సాధనా పథమున సాగితివిరా నా బిడ్డ
విద్యనెంతో నేర్చి విజయ పథం పట్టాలిరా నా బిడ్డ
ఏమి తింటవో నా బిడ్డ ఎలాగుంటవో నా బిడ్డ
ఏదేమైనా జయోస్తుదిగ్విజయోస్తు

(ఇది తన కూతురుని ఉన్నత చదువులకు విదేశాలకు పంపిన ఒక తండ్రి మనసు మాట)

Exit mobile version