2. పట్టు తప్పిన సైకిలు – గట్టు తెగిన బూతులు
నేను ఏడో తరగతిలోకొచ్చినపుడు… నా దోస్త్ వేనుగోపాలుకు వాళ్లమ్మ సైకిలు కొనిచ్చె.
వాడు ఆ సైకిలేసుకుని ఊరంతా స్టయిలు కొడతా ఉండాడు. ఇస్కూలుకు కూడా సైకిల్లోనే వొస్తా ఉండాడు. ఎనకాలుండే కేరీర్‌లో పుస్తకాల సంచిని పెట్టుకుని… మేము వాణ్ణి సూడాలని బెల్లును టింగ్ టింగ్‌మని మోగిస్తా… సర్రుమని మమ్మల్ని దాటుకొని ముందుకు దూసుకుపోతా ఉండాడు.
మేము వాణ్ణి సూస్తా ఉండామని తెలుసుకుని, టకామని బారు మీదికి లేసి నిలబడి పెడల్ తొక్కతా తల ఎగరేస్తాడు.
“ఓర్నీ, ఈడూ ఈడి సైకిలూనూ… ఎంత తలబిరుసుతనం ఈడికి? ఈడికొక్కడికే పెద్ద సైకిలున్నట్టు… సూడూ నేనూ మా నాయినతో జెప్పి ఈడికన్నా మంచి సైకిలు కొనుక్కుంటానో లేదో…” అని నా మణుసులోనే సవాల్ ఇసిరినాను.
ఆ రాత్రి మా నాయినతో – “నాయినా, నాకొక సైకిలు కొనియ్యి…” అంటిని.
“ఒగటి సాలా?…” అనగానే మా రొండో అక్క కిసుక్కుమని నవ్వె.
“ఒగటి సాలు నాయినా…” అంటిని ఆ మాటలో ఉండే ఎగతాలిని అర్థం సేసుకోలేక.
“దేనికీ?” అన్నాడు మా నాయిన. “దేనికేమిటికీ ? యాడికన్నా పొయ్యొచ్చేంటందుకు.” అంటి స్టయిల్‌గా.
“ఇంత కాలమూ యాడికైనా ఎట్టా పొయ్యొస్తా ఉండావ్?” మళ్లీ అడిగినాడు. “నడుసుకుంటా….” అన్నాను నేను.
“ఇప్పుడూ అట్నే పొయ్‌రా. సైకిలెందుకూ? దుడ్డు దండగ!” అన్నాడు నాకల్లా జూస్తా.
“పో నాయినా, వేనుగోపాలు జామ్మని సైకిల్ తొక్కుకుంటా ఇస్కూలుకు వొస్తా ఉండాడు”
“వాడికుంది. సైకిలేసుకుని వొస్తాడు. నీకెందుకూ… ” అని ఏదో ఆలోచించి… “అవునొరే, అసలు నీకు సైకిలు తొక్కటం వొచ్చా?” అన్నాడు మా నాయిన. “రాదు, నేర్సుకుంటా…” అన్నాను తలెగరేస్తా.
“ముందు సైకిలు తొక్కటం నేర్సుకో. ఆ తర్వాత సైకిల్ కొనే ఇసయం గురించి ఆలోసిస్తా.” అని తేల్సి సెప్పేసినాడు.
దాంతో ఒక రోజు… సైకిలు బాడిక్కి తీసుకుని నేర్సుకోవాలని ప్రెయత్నం జేసినాను. మా రొండో అక్కను సాయానికి పిలిస్తే… “నాకింట్లో పనుండాదిరే. నేను రాను…” అంటా జవాబిచ్చింది.
సరే, అనుకొని…. నేనే ఒంటిగా సైకిలు తొక్కేటందుకు రోడ్డుమింద కొస్తిని.
కానీ, సైకిలు సక్కంగా పోకుండా పక్కకు వాలిపోతా ఉండాది. తొక్కేటందుకు వాటం దొరక్క అవస్తలు పడతా ఉండాను. ఎవురైనా సైకిల్ను పట్టుకుంటే నేను వీజీగా సైకిల్ తొక్కేద్దును అనిపించింది.
‘ఎవుర్ని అడగాలబ్బా?….’ అని ఆలోసిస్తా సైకిల్‌ను తొక్కకుండా దాన్ని ‘తోసకొస్తా’ ఉండాను. తెల్సినోళ్లంతా నన్ను, నా అవస్తను జూసి నవ్వతా ఉండారు. నాకు తల కొట్టేసినట్టనిపించింది.
ఎర్రయ్య బంకు పక్కన మర్రిమాను కింద సైకిలుకు స్టాండేసి, ఎవురు కనిపిస్తారా… అని ఎదురుజూస్తా నిలబణ్ణాను. ఇంతలో వేనుగోపాల్ గాడు తన సైకిల్ మింద సర్రుమని తొక్కుకుంటా ఇట్టే వొస్తా ఉండాడు.
వాడు నాకాడికొచ్చి సైకిల్ నుండి కిందికి దిగకనే నేలమీంద కాలుబెట్టి స్టయిల్‌గా రొండు సేతులూ వొదిలేసి…. “ఏరా అదురు నాయాలా, మిడిగుడ్లేసుకోని ఎవురి కోసరమో ఎదురుజూస్తా ఉండావ్? ఎవురి కోసరం?” అని నాకల్లా ఎగాదిగా జూసి… “అవునొరే… నీకు సైకిల్ లేదుగదా, దీన్ని యాణ్ణిండి కొట్టకొచ్చినావ్?” అని ఎగతాలిగా మాట్లాడినాడు.
నాకు కోపం నషాళానికెక్కింది. వాడు నన్ను అదురు నాయాలా… అన్నందుకు కూడా కాదు, సైకిల్ను యాణ్ణిండి కొట్టకొచ్చినావ్ అన్నాడు సూడూ… అందుకు!
కానీ వాణ్ణి వొదిలేస్తే నాకు సైకిల్ను నేర్పించేటోడు ఇంకొకడు దొరకడని… “వొరే వేనూ… ఇది బాడిగ సైకిల్‌రా… సైకిల్ నేర్సుకుందామని ఒక గంట బాడిక్కి తీసుకుంటిని. నువ్వు సైకిల్ బాగా తొక్కతావు గదా, నాకూ నేర్పించరా… ప్లీజ్…” అన్నాను వాణ్ణి బతిమాలతా. వాడేదో ఆలోసించి, సైకిల్ దిగి, దానికి లాక్ చేసి, తాళాన్ని తన నిక్కరు జేబులో ఏసుకున్నాడు.
“అంతేనా, అయితే రారా. నీకు ఒకే ఒక్క గంటలోనే సైకిల్‌ను నేర్పించేస్తా…” అన్నాడు ధీమాగా.
“అయితే సైకిల్ని పక్కలకు వాలిపోకుండా గెట్టిగా పట్టుకోరా, నేను తొక్కతా…” అంటా ఈ పక్కనుండి ఆ పక్కనున్న పెడల్‌మింద కాలేసి సైకిలు తొక్కేటందుకు ప్రెయత్నించినాను.
“వొరే ఆగరా… నువ్వు ఈ మాదిరి ఆఫ్ పెడల్, ముక్కాల్ పెడల్ అంటా నేర్చుకుంటా పోతే…. ఎప్పిటికిరా నువ్వు దర్జాగా సీటుమింద కూసోని తొక్కేది? నాకంత టైమ్ లేదొరే… ధైర్నంగా నువ్వు స్టెయిట్‌గా సీట్ మింద కూసోని సైకిల్ తొక్కరా… నేను పట్టుకుంటాను…” అన్నాడు వాడు నాకు ధైర్నమిస్తా.
“వొరే, నేను సీటుమీదికెక్కి కూసుంటే నాకు కాళ్లు అందవురా…” అన్నాను.
“ఎందుకందదు. కుడికాలితో పెడల్‌ను గెట్టిగా కిందికి తొక్కు, ఎడమ పెడల్ పైకొస్తింది. ఎడమకాలితో దాన్ని గెట్టిగా కిందికి తొక్కు. దాంతో కుడికాలి పెడల్ పైకొస్తుంది. అంతే, మార్చిమార్చి అట్టా తొక్కినావంటే నీకు సైకిల్ వొచ్చేసినట్టే.”
“బలేబలే” ఆనందంగా తలాడించినాను. “ఊ. సీటుమెదికెక్కి కూసో. నీకెట్టా సైకిల్ రాదో నేనూ జూస్తా.” అన్నాడు పంతంగా.
వాడిచ్చిన ధైర్నంతో నేను జామ్మంటూ సీట్ మీదికెక్కి కూసున్నాను. “ఊ… తొక్కూ!” అన్నాడు వేనుగోపాల్ ఎనకనుంచి.
నేను ఉసారుగా కుడి కాలితో పెడల్‌ను గెట్టిగా కిందికి తొక్కగానే సర్ర్… మంటా సైకిలు ముందుకు కదిలింది.
“వొరే, హ్యాండిల్ బార్‌ను గెట్టిగా పట్టుకోని తొక్కు” అన్నాడు వాడు. నేను అట్నే తొక్కినాను. సైకిల్ ఇంకొంచం ముందుకు పొయ్యింది. “అంతేరా! సైకిలు నీ కొచ్చేసింది.” అని ఎనకనిండి గెట్టిగా అరిసినాడు వాడు.
కొలిమి కాణ్ణించి దుర్గమ్మ గుడి దాకా రోడ్డు కిందికి పల్లంగా ఉంటింది. నేను సైకిల్ పడిపోకుండా బ్యాలెన్స్ పడతా ఉండా. దాన్ని వాడు ఎప్పుడు వొదిలేసినాడో, ఏమో? నాకా విషయమే తెలీదు.
గుడికెదురుగుండా… గూని సుబ్బమ్మ ఇడ్లీలంగడి పెట్టుకోనుండాది. రోడ్డు పక్కనే కట్టె పొయ్యిలు ముట్టించి… ఇడ్లీ గుండాం ఒక పక్కనా, దోసె పెనుము ఇంకో పక్కనా పెట్టుకుని… సానా యేండ్లుగా టిపిను యాపారం జేస్తా ఉండాది. అక్కడ ఇడ్లీలు బాగుంటాయని మా పిన్ని ఎప్పుడూ నన్ను ఆడికే పంపిస్తాది.
ఇంతలో… ఒక కారు సర్రుమంటా రోడ్డుమింద దూసుకెళ్లింది. ఆ బయ్యానికి హ్యాండిల్ బార్‌ను కొంచిం పక్కకు తిప్పి పట్టుకొంటిని. అంతే! సైకిల్ నేరుగా సుబ్బమ్మ ఇడ్లీ అంగట్లోకి దూరేసింది.
ఏం జరిగిందో ఏమో? తెలుసుకునే లోపల… సుబ్బమ్మ తిట్ల దండకం మొదలు పెట్టేసింది. నన్ను రకరకాలుగా శాపనార్థాలు పెడతా ఉండాది. “నా బట్టా… ఇడ్లీలన్నీ నేల పాలయ్యె గదరా… నీ సేతులూ కాళ్లూ ఇరగా! పిండంతా దొర్లించేస్తివి గదరా… నీకు పిండం బెట్టా! ఆడ యాడన్నా సావకుండా సైకిలు తొక్కేటందుకు నా అంగడే దొరికిందా రా నీకు, శనిబట్టిన నా కొడకా… వీడి సావెత్తా….” అంటా నోటికొచ్చిందంతా తిడతా ఉండాది ముసిల్ది.
దొరికితే యాడ సావగొడుతుందోనని కింద పడినోణ్ణి పైకిలేసి పారిపోయేటందుకు ప్రెయత్నిస్తిని.
సేతిలో దోసె గెంటితో నా మిందికి ఉరకతా వొచ్చింది సుబ్బమ్మ. అంతే! సైకిల్ను పైకెత్తి నిలబెట్టి స్పీడుగా తోసుకుంటా ఆణ్ణిండి దూరంగా దౌడు తీస్తిని. తిరిగి జూస్తును గదా దూరంగా వేనుగోపాల్ నన్ను జూసి పగలబడి నవ్వతా ఉండాడు.
పండ్లు పటపటమని కొరికి… రామ్‌నగర్ వైపుకు సైకిల్‌ను తిప్పేసి… సుబ్బమ్మ బారినుండి తప్పించుకొంటిని.
కొంచేపటికి స్తిమితపడి… రోడ్డుమింద పోతా ఉండే ఒకాయిన్ని టైమెంతయ్యిందని అడిగినా. ఆయిన టయిం సెప్పినాడు. ఇంకా ఇరవై నిమిషాలుండాది, సైకిలను తిరిగిచ్చేటందుకు. సైకిల్‌కు ఎట్టా బాడిగె ఇస్తా ఉండాము, టైమ్ కాకుండానే ముందుగానే ఎందుకివ్వాలనుకుని, రోడ్డుపక్కన ఒక పెద్ద రాయి కనిపిస్తే దాని మింద నిలబడి సైకిల్ సీటుమింద కూసింటిని. హ్యాండిల్ బార్‌ను గెట్టిగా పట్టుకుని పెడల్‌ను గెట్టిగా కిందికి తొక్కినాను. అది రయ్ మని ముందుకు కదిలింది.
రోడ్డు మింద ఒక పెద్దాయన నడుసుకుంటా పోతా ఉండాడు. ఏమి జరిగిందో ఏమో, కంట్రోల్ తప్పి ఆయన కాళ్ల సందన నా సైకిల్ సెక్రం దూరేసింది. ఆయన ఢమాలని నేలమీద పడిపోయె. నేనూ పడిపోయినాను.
ఆయన లేసి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలు పెట్టినాడు. నేను లేసి నిక్కర్ని ఇదిలించుకుని “యోవ్, నీకు సెవులు ఇనిపిస్తా ఉండాదా, లేదాని? ఎంత సేపు బెల్లు కొట్టినా పక్కకు తప్పుకోకుంటే నేనేం జెయ్యాల? నీకు సెవుడో, ఏమో? నీ సెవుడు వల్ల నన్నుకూడా నేలమింద పడేస్తివి కదయ్యా” అంటా సైకిల్ను పైకి లేపి ముందుకు ఉడాయిస్తిని.
అట్టా ఆ దినం నేను అయన దెబ్బల్నిండి తెలివిగా తప్పించుకుంటిని. కానీ, మీకొక ఇసయం సెబతా ఇనండి. ఈ ఇసయాన్ని ఆ పెద్దాయనకు మటుకు సెప్పమాకండేం?
“ఎంతసేపు బెల్లు కొట్టినా ఇనిపించదా, నీకు సెవుడా, ఏందీ?” అని ఆ దినం నేనాయన్ను దబాయించినాను గుర్తుందా. అసలు ఇసయం ఏందంటే… ఆ దినం నేను బాడిక్కి తీసకొచ్చినాను జూడండి… ఆ సైకిలుకి అసలు బెల్లే లేదు.
(మళ్ళీ కలుద్దాం)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).