Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా అవగాహనలో ఆరుద్ర

[ఆరుద్ర శతజయంతి 2025 సందర్భంగా శ్రీమతి సుందరి వేణుగోపాల్ అందిస్తున్న ప్రత్యేక రచన.]

తరానికో వందకవులు… తయారవుతారెప్పుడూ / వందనూ మందలోనూ…   మిగలగలిగేదొక్కడు.

ఒకేఒక్కడు ఆరుద్రగా విఖ్యాతులైన భాగవతుల శివశంకరశాస్త్రి. శంకరుడి ఐదుముఖములు (సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన) పంచభూతతత్త్వ ప్రతీకలుగా ఉన్నట్టుగానే, అంత్య ప్రాసలు, వైచిత్రీప్రియత్వం, అభివ్యక్తిలో చతురత్వము, ఆలోచనలో అభ్యుదయము, ఆచరణలో నవ్యత అనే అయిదు లక్షణములకి చిరునామా అయిన అపరశంకరుడు ఆరుద్ర. బహుశా అందుకే ఆరుద్ర ఆరోరుద్రుడు అని ఉంటారు శ్రీశ్రీ.

విశ్వవీణారవపు విజయ గానమ్ముతో / విజయ శంఖానాద విశ్వగీతమ్ముతో / కొత్త మార్గాలపై కొత్త మార్గాలకై –కదలవే కదలవే”: (పురోగమనం కవిత),”మానవుడు ప్రతి ఒక్కడూ / మమతకు పుట్టినవాడే /దే దీప్యమాన మైన ప్రతి నరుడూ దీర్ఘతమసుడే”: (కాస్మికీయం కవిత),కసిని పెంచే మతము / కనులు కప్పే మతము / కాదు‌ మన కభిమతము”: (కూనలమ్మ పదాలు) వంటి కవితలలో ఆరుద్ర ఒక మహోన్నతమైన ద్రష్టగా, స్రష్టగా దర్శనమిస్తారు.

శ్రీశ్రీ, ఆరుద్ర ఆధునిక తెలుగు సాహిత్య యుగంలో అభ్యుదయ కవిత్వాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఉద్దండులు. మహాకవి శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన ఆరుద్ర వంటి బహుముఖ ప్రతిభాశాలి నూటికో, కోటికో ఒక్కరు ఉంటారు. ఆరుద్ర రచయిత, కవి, విమర్శకుడు, హేతువాది, తార్కికుడు, పలు భాషాకోవిదుడు, అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకుడు, సాహిత్య చరిత్ర పరిశోధకుడు, సామ్యవాద మేధావి, చలనచిత్ర రంగ ప్రముఖుడు, కాలమిస్టు, సంగీత నృత్య కళల మీద పట్టు ఉన్నవాడు, చదరంగం, ఇంద్రజాలం వంటి విద్యలలో ఎంతో అభినివేశం ఉన్నవాడు; అన్నిటిని మించి గొప్ప మానవతావాది, సమతావాది, అభ్యుదయవాది, ఆశావాది.   

సాహిత్య సేద్యం

తెలుగు సాహిత్య కృషీవలడు ఆరుద్ర అక్షరశరీరుడు, అక్షరయోగి, పరిశోధనాపరమేశ్వరుడు. కళాశాల చదువులు నేర్వని ఆరుద్ర  ప్రపంచ సాహిత్యాన్ని అలవోకగా పుక్కిట  ఔపోసన పట్టిన అగస్త్యముని. సాహిత్యం పట్ల తనకు మక్కువ, అభిరుచి కలగడానికి తండ్రి, మేనమామ వరుసైన శ్రీశ్రీ, మార్క్సిస్ట్ భావజాలాన్ని అర్థం చేసుకోవడంలో చాగంటి సోమయాజులుగారు, శ్రీయుతులు గురుజాడ అప్పారావు, అబ్బూరి రామకృష్ణారావు, తాపీ ధర్మారావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు వంటి గొప్పవారి రచనలు తనకు మార్గదర్శకాలయ్యాయని ఎంతో వినమ్రంగా చెప్పుకున్న నిగర్వి. అలాగే  ఫిడేల్ రాగాల డజన్ పఠాభి ప్రభావం గురించి “నేను కలం పట్టిన తొలి రోజుల్లో శ్రీశ్రీని ఇమిటేట్‌ చెయ్యటం మానేసి పఠాభి ప్రభావంలో పడేదాకా శ్రీశ్రీయే నన్నుగుర్తించలేదు” అన్నారు.

ఆయన అబిప్రాయములో కవి అన్నవాడికి ఒక ప్రత్యేకమైన సిద్దాంతం ఉండాలి. తన కాలానికేది అవసరమో గుర్తించ లేనివాడు మంచికవి కానేరడు. అతను తను నమ్మిన సిద్ధాంతాల ప్రాతిపదికగా నిజాయితీతో చేసిన రచనలే రాణిస్తాయి”. కావాలి కవిత హృదయానికి నరిష్మెంటు / కారాదు ఏనాడు పనిష్మెంటు. సాహిత్య సృజన అనేది సమకాలీన కలుషిత సమాజప్రక్షాళన కోసమే కాని వ్యక్తిగత ఆనందానికోసం ఎంత మాత్రము కాదు అన్న స్పృహ కలిగిన ఆరుద్ర, తాను ఎంతగానో ఆరాధించే మార్క్సిజము ప్రాతిపదికగా జీవితాంతము తన రచనవ్యాసంగాన్ని కొనసాగించారు. తార్కిక దృష్టితో ఎటువంటి అంశాన్నయినా పరిశీలించగల సమగ్రమైన శాస్త్రీయ దృక్పథమే ఆయన ప్రతిభకు గీటురాయిగా నిలిచి, ఆయనకు పాఠకుల మనస్సులలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆరుద్ర దృష్టిలో ఆధునికమన్న మాట ఎప్పుడూ సాపేక్షమే. సంప్రదాయానికి విరుద్దంగా రాస్తే ఆధునికం అవ్వదు. పాత సంప్రదాయాన్ని జీర్ణం చేసుకుని కొత్త సంప్రదాయానికి పునాదులు వేసేదే నిజమైన ఆధునికం.

బొంబాయిలోని రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుమస్తా, ఆనందవాణి పత్రిక  సంపాదకుడు, విశాఖ హర్బర్లో గుమస్తా, ఫోటోగ్రాఫర్, మద్రాసు ఢంకా పత్రిక ఫ్రూఫ్ రీడర్ ఇలా ఉదరపోషణ నిమిత్తం ఎన్నో ఉద్యోగాలను చేపట్టినా, ఉత్తేజం కలిగినప్పుడు కవితలు రాసుకొంటూ, వృత్తివల్ల చలనచిత్రాలకి పాటలు వ్రాస్తూ, ప్రవృత్తివల్ల పరిశోధనలు చేసుకొనే ఆరుద్ర, పాండిత్య ప్రకర్ష, సృజనాత్మకత, విడవకుండా చదివించే నైపుణ్యం మెండుగా, నిండుగా ఉన్న ఒక నడిచే నిఘంటువు, మాట్లాడే విజ్ఞానసర్వస్వం. ఆజన్మ హేతువాది అయిన ఆరుద్ర, పురాణాలు, ఇతిహాసాలన్నిటిని కూలంకుషముగా అధ్యయనం చేసి, అపరిమితమైన జ్ఞాపకశక్తితో వాటి అర్థాలను, విశేషాలను సందర్భస్ఫూర్తితో  వివరించే పౌరాణికులు.ఆయన సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ, చేయని ప్రయోగం లేదు. తెలుగు సాహిత్యంలో గేయాలు, గేయనాటికలు, కథలు, నవలలు, అపరాధపరిశోధనా నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, సాహిత్య విమర్శ, వ్యంగ్య రచనలు, పుస్తకపీఠికలు, పుస్తక విమర్శలు మొదలైన ఎన్నోప్రక్రియలలో అతి దురంధరులు. ప్రయోగశీలత, శబ్దాశ్రయ చమత్కారాలతో కూడిన చిన్నపదాలతో అతి స్పష్టమైన భావప్రకటన, ఆరుద్ర మార్కు దేశీయత, తెలుగిళ్ళలోని ఆత్మీయతలు, చమత్కార సంభాషణలతో నిండిన ఆయన రచనలు నాటికీ, ఈనాటికీ, ఏనాటికీ నిత్యనూతనములు

తెలుగు సాహిత్యంలో ఇంత వైవిధ్య రచనలు చేసిన రచయితలు బహు అరుదు. నండూరి రామ మోహన్ గారి  మాటల్లో “సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు, సాహిత్యం అంబరమైతే, ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు. కేవలం కవిత్వాన్నే తీసుకున్నా, అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో. కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు, ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది; జరుగుతోంది”

వచనకవితలకే ఆరుద్ర ప్రాధాన్యము. ఆయన రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందినవి; త్వమేవాహమ్, సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్యోపనిషత్‌, ఇంటింటి పజ్యాలు, కూనలమ్మ పదాలు, సినీ వాలి, అరబ్బీ మురబ్బాలు, కేరా శతకం, వేమన వేదం, మన వేమన, వ్యాసపీఠం, గురుజాడ గురుపీఠం, రాముడుకి సీత ఏమవుతుంది?, గుడిలో సెక్స్, నాట్యశాస్త్రానికి సంబంధించిన హస్తముద్ర లక్షణపదాలు వంటివి ఉన్నాయి.

ఆరుద్ర అవిశ్రాంత సాహితీ యోధుడు. ఏ పనిచేసినా, ఏ రచన చేసినా విపులంగా, సవివరంగా, పరిశోధనా పద్దతిలో సమగ్రంగా చేసేవారు. తెలుగు సాహిత్య చరిత్రను సమగ్ర ఆంధ్ర సాహిత్యము అనే పేరుతో పదమూడు   సంపుటాలుగా తెలుగు ప్రజలకు అందించిన మహాపరిశోధకుడు. ఈ గ్రంథం ఒక మహా అత్యద్భుతమైన రచన. దీనిని సామాన్యుడి కోసమే వ్రాసాను అని ప్రకటించినా, వాస్తవములో ఎంతో అపురూపమైన ఈ గ్రంథం పండితులకు, పరిశోధకులకు, విద్యార్థులకు నిత్య అధ్యయన కరదీపిక.

తెలంగాణాలో 1940 దశాబ్దంలో రజాకార్ల పైశాచిక చర్యలకు బలైపోయిన అభాగ్యస్త్రీల గురించి చదివి చలించిపోయి, తెలంగాణాలో నిజాము అరాచక పాలన, రజాకార్ల దుండగాలు, సాయుధ పోరాటము ఇతివృత్తంగా ఆరుద్ర వ్రాసిన మహాకావ్యం త్వమేవాహమ్. ఆరుద్ర చేసిన రచనలన్నిటిలో, ముఖ్యంగా కవితా రచనల్లో మకుటాయమానమైనది త్వమేవాహమ్. ఆరుద్రది ధ్వని ప్రధానమైన కవిత. త్వమేవాహమ్ లో మహాధ్వని ఉంది”:-దాశరథి. “కొరకరాని కొయ్యగా కొంతమంది పైకి కనిపించే ఈ కావ్యం మ్రింగుడు పడిన కొలది తియ్యటి తేనెల తేన్పులు వస్తుంటాయి. మేధస్సు పని చేసిన కొలదీ ఆరుద్ర ఈ కావ్యంలో పొందిన మహోద్రేకంతో ఆవేశంతో పాఠకుడు తాదాత్మ్యం పొందుతాడు”:- తుమ్మల వెంకట రామయ్య, “దీన్ని సాహిత్యంలో కవిత్య వర్షపు చుక్క పడని కరువు ప్రాంతంగా చెప్పాలి”:- గుంటూరు శేషేంద్రశర్మ, “ఆద్యంతం చమత్కారాన్ని, కొత్తదనాన్ని నింపుకున్న కవితాయాగం”:- సినారె”.  “నిప్పులు చిందే  నిరాశావాదం”- శ్రీశ్రీ

చిన్ని పాదములందు / చివరి ప్రాసల బిందు / చేయు వీనుల విందు / ఓ కూనలమ్మ. సంప్రదాయసిద్ధమైన దేశీ ఛందస్సులో వ్రాయబడిన కూనలమ్మ పదాలు సహజమైన ఆదిప్రాసలు, పాదాల మధ్య ఆద్యక్షర మైత్రితో అలరారుతూ చాలా శ్రావ్యముగా, చెవులకు ఇంపుగా ఉంటాయి. ప్రసిద్ధ అమెరికన్ కవి ఆగ్డెన్ నేష్ స్పూర్తితో కుటుంబజీవితంలోని అనేక అంశాల గురించిన వర్ణనలతో కూడిన ఇంటింటి పజ్యాలను ఆయన  బాణీలోనే రాసారు. మచ్చుకు: త్యాగరాజు గారింట్లో దోమలు మాత్రం / బాగా అభ్యసించాయి సంగీతశాస్త్రం 

సినీవాలి – ఆధునిక పారిశ్రామిక జీవితంలోని యాంత్రికతను కృత్రిమతను, విఫలతను అందువల్ల జనించే నైరాశ్యాన్ని అనేక కోణాలలో పరిశీలించి నిజాయితీగా చిత్రీకరించిన కావ్యం.

అపురూపమైన ప్రయోగశీల కవి ఆరుద్ర గురించిన అందమైన ఆణిముత్యాల సరాలు  

ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగల సంవిధాన విధాత ఆరుద్ర- శ్రీశ్రీ

నవ్యకవిత్వానికి నయాగరా/ఆర్ద్రతకు మరోపేరు ఆరుద్రజగ్గయ్య

ఆరుద్ర నీ ముద్రల ఔదల దాల్చి/విద్రుమ శోభతో వెలిగేటి వాణి – కాటూరి వేంకటేశ్వరరావు

సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర. అంత్యప్రాసలే ఆయన వ్రాలుముద్ర. మాటలు వన్‌డడంలో గడసరి. పాటలు పేనడంలో పొడగరి. జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి. పొయట్రిక్స్‌ ప్రయోగించడం సరేసరి. అర్జెంట్‌ రచనల్లో కూడా మరి అరమెరుపైనా తప్పనిసరి – ముళ్లపూడి

ఆరుద్ర కవితలో భావప్రాధాన్యతతో పాటు అభ్యుదయ దృక్పథం ఒక ప్రత్యేకత, శ్రీశ్రీ పక్కన నిలువదగిన కవి ఆరుద్ర దేవులపల్లి రామానుజరావు

అభ్యుదయ కవిత్వానికి ఆదిరుద్రుడు శ్రీశ్రీ, రెండో రుద్రుడు ఆరుద్ర. శ్రీశ్రీ తర్వాత వెంటనే స్ఫురించే పేరు ఆరుద్రదే. అభ్యుదయ కవిత్వానికి ఒకరు మార్క్స్‌, మరొకరు ఏంగెల్స్‌ నండూరి రామమోహన్‌ రావు.

చలనచిత్ర కళామతల్లి సేవలో – ఇదేమి లాహిరి ఇదేమి గారడీ

చలనచిత్ర రంగంలోకి 1948లో అడుగిడిన ఆరుద్ర, అంత్యప్రాసలతో అలవోకగా కవిత్వం రాయగల నేర్పరి అయినందున, పాటలు రాయడం నల్లేరు మీద నడక అయింది. దాదపు మూడు దశాబ్దాలకి పైగా సాగిన ఈ వృత్తిలో సుమారు 150 చిత్రాలకి మాటలు, దగ్గరదగ్గర 500 చిత్రాలకు 1,500 పాటలు సమకూర్చారు. ఆయన కలం నుండి జాలువారే ప్రతీ అక్షరం వన్నె తరగని ఒక ఆణిముత్యమే. ఆయనలో ప్రతిభకు పట్టం కట్టి  చలన చిత్రరంగం దోసిళ్ళతో వాటిని తనివితీరా ఏరుకుంది. ఆయన వ్రాసిన మాటలు, పాటలు, ఆయన పద ప్రయోగాలు సందర్భోచితమైన భాషతో, భావంతో అలరారుతూ, అంతర్లీనంగా ఒక సందేశాన్నో, చరిత్రనో, కథనో,  సూటిగా, స్పష్టంగా, వ్యంగ్యం, హాస్యం మోతాదు మించకుండా వివరిస్తూ మనలను మాధుర్యంతో అలరిస్తూ అంత్యప్రాసలతో సాహిత్యపు గుబాళింపులు వెదజల్లుతూ వుంటాయి.

ఆరుద్రకు  చాలా వేగంగా డబ్బింగ్ రాయగలరని పేరుంది. ఆయనలోని ఉరవడి, ఆవేగము హిందీ చిత్రం ఆహ్కు  తెలుగు అనువాదమైన ప్రేమలేఖలుకు కూర్చిన పాటలు, వ్రాసిన మాటలు ఆ చిత్ర విజయంలో కీలకపాత్రను  పోషించాయి. మూల చిత్రాలలో కన్నా ఆరుద్ర సందర్భోచితమైన పదాల అల్లిక శబ్దశక్తుల మేళవింపుగా వ్రాసిన  అనువాద పాటలలో గడుసుతనపు పోకడలు, చమత్కారపు ధోరణులను గమనిస్తే అవి అనువాదాలని అసలు అనుకోలేము. అందుకే ప్రముఖ చలనచిత్ర పరిశోధకుడు శ్రీ పైడిపాల తెలుగు చలన చిత్రరంగంలో అనువాద రచనకు ఆద్యులు అయిన  శ్రీశ్రీని నన్నయతోను, తెలుగుతనానికి, తెలుగు నుడికారానికి  అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఆరుద్రని  అభినవ తిక్కన అని ప్రశంసించారు.

ఆయన పాటలలో మేలైనవి అని కొన్నిటిని ఎన్నిక చేసుకోవడమంటే ఆయనకు అన్యాయము చేసినట్టే. అయినా రెండు మూడు పాటల గురించి వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. ఉయ్యాల-జంపాల లోని కొండగాలి తిరిగిందీ ఒక  ప్రత్యేకమైన పాట. ఈ పాటలోని పదాలు పైకి మామూలుగా కనిపించినా, ఒకింత శ్రద్ధతో పరిశీలిస్తే అవి నిగూఢమైన అర్థంతో ఉంటాయి. ప్రియురాలిని చూసి ఆనందపడుతున్న ప్రియుడి స్థితిని దశలవారీగా పొంగిపోవడం, గంతులు వేయడం, నాట్యం చేయడం, వలపులోని తీవ్రతను మొగలిపువ్వు, నాగుపాము (రెండూ పరస్పరాశ్రితాలు) మధ్య ఏర్పడిన బంధం, వయసు అందం విడదీయరానివి అని ప్రేమ గురించి వర్ణిస్తూనే ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అని వేదాంతం చెప్పారు. వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి) తెలుగువారి వైభవానికి,  శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం (పెళ్ళిపుస్తకం) పెళ్ళితంతులోని పరమార్థానికి ప్రతీకలుగా ప్రతి తెలుగువాడి గుండెల్లోనూ నిలిచిపోయే గీతాలు.

పరమ  నాస్తికులు, హేతువాది అయిన ఆరుద్ర  రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల గురించి రాసిన పాటలు భావస్ఫోరకమే కాదు చాలా చాలా విజయవంతము కావడం ఒక విచిత్రం.  రాయినైనా కాకపోతిని (గోరంత దీపం), అందాలరాముడు ఇందీవర శ్యాముడు (ఉయ్యాలా-జంపాల), ఎవరుకన్నారెవరుపెంచారు (ముద్దుబిడ్డ), సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం చిత్రాలలోని పాటలు వాటిలో ఎన్నదగినవి.

ఆరుద్ర అధ్బుతమైన ప్రతిభాశాలి. ఓ విశ్వవిద్యాలయం. ఆయన రచనలే అనేక మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను ఇప్పించాయి. ఆయన మార్గదర్శకత్వంలోనే సుప్రసిద్ధ భరతనాట్య విదుషీమణి సప్నసుందరి దేవదాసీల నాట్య విద్య గురించి  పరిశోధన చేస్తే, ఆరుద్ర గారు దానికి ‘విలాసినీ నాట్యం’ అని నామకరణము చేసారు.

నా దృష్టిలో ఆయనకు దక్కిన బిరుదులు, పొందిన సన్మానాలు;- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ విమర్శకుని పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ పరిశోధకుడి అవార్డు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు, గురజాడ గురుపీఠం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ బిరుదు మొదలైనవి:- ఎన్నదగినవి అయినా, ఎందుకో ఆరుద్రకు రావాల్సినంత గుర్తింపు గాని, ఘనత గాని దొరకలేదు. తెలుగుసాహిత్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అయిన ఆరుద్ర రచనాకాలాన్నిసముచిత రీతిలో గౌరవించుకోలేని పామరులము మనము.

ఆరుద్ర కంటె గొప్ప వారిని చూడవచ్చు, ఆరుద్ర కంటె తక్కువ వారిని చూడవచ్చు, కాని ఆరుద్ర లాంటి మరొకరిని మాత్రం చూడలేము.

Exit mobile version