[శ్రీ మొలుగు కమలాకాంత్ గారు రచించిన ‘ముట్టిందే మట్టి – పట్టిందే బంగారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ‘అభినందన’ సంస్థ (విజయనగరం) ఫిబ్రవరి-మార్చ్ 2025లో నిర్వహించిన హాస్య కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ.]
వెరైటీ కోసం బిడాల్, మూషిక లాంటి పేర్లు కూడా పెట్టేస్తున్న ఈ రోజుల్లో గుర్నాథం కొడుక్కి మృత్తిక్ అన్న పేరు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే, వాడు సార్థక నామధేయుడై, ఏది ముట్టుకున్నా మట్టే అన్న కీర్తి గడించటం విశేషం.
బాల్యంలోనే అగ్గిపెట్టె తెమ్మంటే ప్రతి పుల్లా వెలుగుతోందో లేదో టెస్ట్ చేసి మరీ తెచ్చాడు. మరి ఏ వస్తువైనా పరీక్షించే కొనాలని వాళ్ళ మామయ్య చెప్పాడాయే! ఆగస్టు 15 కి క్లాసు రూముల డెకరేషన్ పోటీలు పెడితే అంతా సిద్ధమయ్యాక జడ్జీలు మార్కులు వేసే సమయానికి ఫ్యాన్ స్విచ్ మీద తల పెట్టి నిద్రపోయిన ఘనుడు మనవాడు. దాంతో రాత్రంతా కష్టపడి చేసిన డెకరేషన్ అంతా నాశనమై క్లాసుకి రావలసిన ప్రైజ్ కూడా పోయింది.
గుర్నాథం ఎందరు డాక్టర్లకి చూపించినా ఈ మట్టిబుర్ర ఎదగట్లేదు. పైగా ముట్టిందల్లా మట్టి అవుతున్నా పట్టిందల్లా బంగారం కావాలని, లాటరీ టికెట్లు, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్, కోడిపందాల వంటి వాటిలో వేలు పెట్టడమే కాదు వేలకి వేలు పెట్టి వాళ్ళ నాన్నని నిలువునా ముంచేవాడు. ఊళ్లోని మిగతా వాళ్లంతా మనవాడు ఎటు పందెం కడతాడో చూసి, దానికి రివర్స్‌లో కాసి గెలిచేవాళ్ళు.
కుర్రాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మృత్తిక్ అడుగు పెట్టాడంటే చాలు – మన దేశం వాడు అవుట్ అవ్వాల్సిందే లేదా పరాయి దేశం వాడు బ్యాటింగ్ అయితే బాల్ బౌండరీ దాటాల్సిందే. ఊరంతా కలిసి మనవాడికి ఐరన్ లెగ్ అని పేరు పెట్టేశారు.
ఇక లాభం లేదని గుర్నాథం మన వాడిని ఊళ్లో ఉన్న ఒక కంపెనీలో చిన్న ఉద్యోగానికి కుదిర్చాడు, నానా తంటాలూ పడి. మనవాడు కాలు పెట్టిన గంటలో సర్వర్లు డౌన్ అయ్యి రెండు రోజుల దాకా రెస్టోర్ కావన్నారు. వెంటనే మన వాడు వాళ్ళ జిఎంకి ఉచిత సలహా ఒకటి పారేశాడు, “బాధపడకండి! మా ఇంటి పక్కన శంకర విలాస్ హెూటల్లో చురుకైన సర్వర్లు ఇద్దరు ఉన్నారు. ఏది ఆర్డర్ చేసినా ఇట్టే తెచ్చేస్తారు. పోనీ, ఈ రెండు రోజులూ వాళ్ళని ట్రై చేస్తే పోలా” అని. దాంతో చేరిన రోజు సాయంత్రానికే ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చి పంపారు.
బండ బూతులు తిట్టిన తండ్రి గుర్నాథం “వెధవ సలహాలు ఇవ్వకు” అని సలహా ఇచ్చి కొడుకుని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మేనేజర్‌కి అసిస్టెంట్‌గా ఉద్యోగం వేయించాడు. వెళ్ళగానే మన వాడు బాసుని అడిగాడు “ఎందుకండీ! ఆ ఎక్స్‌రే ఫిలిమ్స్ అలా పారేస్తున్నారు?” అని.
“అవన్నీ నిరుటివి, పేషెంట్స్ తీసుకోకపోతే మిగిలిపోయినవి” చెప్పాడు మేనేజర్ రామకృష్ణ.
“అదేనండీ, నేననేదీ.. పాపం డబ్బులు కట్టి ఎక్స్‌రేలు తీయించుకోలేని పూర్ పేషెంట్స్ వందలమంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా!” అన్నాడు మృత్తిక్. దిమ్మ తిరిగిపోయింది మేనేజర్‍కి.
“నీ గురించి మీ నాన్న చెబితే ఏమిటో అనుకున్నా, ఈ చెత్త సలహాలు ఆపి, ఈ రాత్రి ఐసీయూలో డ్యూటీ చెయ్యి. ఎవరితోనో మాట్లాడకుండా ఉండు”, కోపంగా చెప్పి వెళ్ళాడు.
‘ఈ వెధవలింతే! పేదల మీద జాలే ఉండదసలు’ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు మృత్తిక్. ఇంకో గంటలో మేనేజర్ రామకృష్ణకి ఫోన్ వచ్చింది – ఐసీయూలో ఉన్న ఆరుగురు పేషెంట్స్ స్పృహ తప్పారని.
“ఏమైంది?” కంగారుగా అడిగాడు మృత్తిక్‍ని.
“చలికాలం కదా సార్! అనవసరంగా కరెంటు దండగ ఎందుకు? పవర్ సేవ్ చేద్దామని నేనే ఆపేశాను” గర్వంగా చెప్పాడు మృత్తిక్. దాంతో ఆ ఉద్యోగమూ రెండో రోజే ఊడింది.
ఇంకీ ఊళ్లో లాభం లేదని, కొడుకుని తీసుకొని అన్నగారు వెంకట్రావ్ ఇంటికి కైకలూరు తీసుకెళ్లింది తల్లి రత్తమ్మ. సరదాగా మేనమామతో రొయ్యల చెరువు దగ్గరకి వెళ్ళాడు. మురిసిపోతున్న మేనల్లుడిని చూసి “ఒరేయ్! నీకు అంత సరదాగా ఉంటే ఓ రెండు గంటలు ఇక్కడే ఉండిరా! పాలేరుని పంపిస్తా. భోజనం టైమ్‌కి వద్దువు గానీ”, అంటూ వెళ్ళాడు వెంకట్రావ్.
అలాగే రెండు గంటలు సరదాగా గడిపి ఇల్లు చేరాడు. మర్నాడు చెరువు దగ్గరకు వచ్చి వలేద్దామని చూస్తే ఒక్క రొయ్య లేదు.
“మనుషులు మనమెవరం లేనప్పుడు, ఎదవ రొయ్యల కోసం మోటర్ ఎందుకు దండగని, పవర్ ఆఫ్ చేసి వచ్చా మావయ్యా!”, ఏదో ఘనకార్యం చేసినట్లు చెబుతున్న మేనల్లుడిని వంగదీసి గుద్ది, “అక్షరాలా రెండు లక్షలు నాశనం చేశావు కదరా దరిద్రుడా”, అంటూ చెల్లినీ, మేనల్లుడినీ ఇంట్లోంచి తన్ని తరిమేశాడు వెంకట్రావ్.
కన్నకొడుకని చూడకుండా దుమ్మెత్తిపోశారు గుర్నాథం, రత్తమ్మ.
“ఏవండీ! కనీసం పెళ్లి చేస్తేనన్నా వీడు దారికి వస్తాడేమోనండీ”, అంది తల్లి.
“ఆ వస్తాడు! ఈ నాశనగొట్టు వెధవకి పిల్లనిచ్చే దౌర్భాగ్యుడెవరని? చూస్తూ చూస్తూ ఓ అమాయకురాలి గొంతు కోయడం ఎందుకు?”అన్నాడు గుర్నాథం కోపంగా.
“అవున్లెండి, నన్నివ్వలా? ఆరోజు నేను మాత్రం అమాయకురాలిని కాదా? అప్పుడు నా మీద ఎవరు జాలిపడ్డారు?” మొగుడికి చురకలంటించి, వారం తిరిగేలోగా కొడుక్కి పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది రత్తమ్మ.
ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 3:30. మృత్తిక్ పెళ్లిచూపులు కృత్తికతో. ‘పేర్లు బాగానే కలిశాయే’, అనుకున్నారు పిల్ల తల్లిదండ్రులు. పెళ్ళివారొచ్చిన ఐదు నిమిషాల్లో పవర్ పోయింది. “రోజూ పోదే”, అన్నాడు పిల్ల తండ్రి. ‘దీన్నే మృత్తిక్ ఎఫెక్ట్ అంటారు’ అనుకున్నాడు గుర్నాథం అదేదో ‘రామన్ ఎఫెక్ట్’ లాగా.
“అమ్మాయిని ఏమన్నా అడుగు బాబూ” అన్నారు పెళ్లివాళ్లు మృత్తిక్‍తో.
“ఏం వద్దు! అడిగేది ఏమీ లేదు”, అన్నాడు గుర్నాథం, ‘వీడు నోరెత్తితే ఏం నాశనం అవుతుందో’ అన్న భయంతో.
“మా అమ్మాయి పుట్టినప్పటినుంచి పట్టిందల్లా బంగారం అంటే నమ్మండి”, గొప్పగా చెప్పాడు పిల్ల తండ్రి.
“అయితే ఇంకేం! మేమూ ఇలాంటి పిల్ల కోసమే చూస్తున్నాం! శుభస్య శీఘ్రం!!” అన్నాడు గుర్నాథం.
“ఆ.. మావాడు పట్టిన ప్రతిదాన్నీ మీ అమ్మాయి పట్టిందంటే చాలు.. మట్టైనా బంగారం అవుతుంది”, అంటూ ముక్తాయిస్తున్న రత్తమ్మని అయోమయంగా చూశారా పిల్ల తల్లిదండ్రులు.