Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముసలి దంపతులు – చామ దుంపలు

మణిపురి జానపద కథలకు డా. తోంబాసింహ్ చేసిన హిందీ అనువాదం ఆధారంగా డా. బి.వి.యస్. మూర్తి కూర్చిన తెలుగు కథల నుంచి అందిస్తున్న బాలల కథ ‘ముసలి దంపతులు – చామ దుంపలు‘.

ఆటవెలది:

చపలబుద్ది వాని సలహాలు వికటించు,
చేరి వృద్ధిజేయు స్వీయ కృషియె;
కోతమూక కధలొ కలిగెనా కష్టాలు
తెలుగు బాలలార తెలుసుకొనుడు.

పూర్వం కెంగ్‌చుప్ గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులుండేవారు. వాళ్లకి ఒక్కడే కొడుకు. వాడు రాజుగారి సైన్యంలో చేరడం వల్ల ఇల్లూ, పొలం పనులు ముసలి వాళ్లే చూసుకోవలసి వచ్చింది. ముసలితనంతోపాటు అమాయకత్వం కూడ వాళ్లకి కొంచెం జాస్తి. ఇంటి పెరటి పొలంలో వాళ్లు వేరుశనగ, కందమూలం, ఆలుగడ్డలు లాంటివి ఏవి నాటినా తరచుగా కోతుల మూక వచ్చి దుంపల్ని, గింజల్ని ఏరి కొరికి పాడుచేస్తూ ఉండేవి.

ఒకమారు ముసలి వాళ్లు పొలంలో చామదుంపల్ని నాటారు. అయితే ఎప్పటిలాగే కోతుల మూక వచ్చి నాటిన దుంప్న ఏరి పీకడం ప్రారంభించాయి. కాని ఈమారు ముసలి దంపతులు జాగ్రత్తగా వలపన్ని కోతుల మూక నాయకుణ్ణి పట్టుకున్నారు. వాడు తెలివైన ఘటం. ఈ అమాయకపు ముసలి దంపతుల్ని కబుర్లు చెప్పి మెల్లగా బుట్టలో వెయ్యడం ప్రారంభించాడు.

“ఓ ముసలయ్యా! ముసలమ్మా! మేము చాలా ప్రాంతాల్లో చాలా చాలా పొలాల్ని, పంటల్నీ చూస్తూంటాం. ఎక్కడ, ఎప్పుడు ఎలా కృషిచేస్తే మంచి పంట వస్తుందో మాకు బాగా తెలుసు. మీ పొలంలో కూడా సరిగా విత్తుతున్నారో లేదో చూడ్డానికి వచ్చాం కాని మీ పంట పాడుచెయ్యడానికి కాదు. మీరు పిచ్చివాళ్లలాగ ఉన్నారు. చామదుంపల్ని ఇలా నాటుతే పంట బాగుండదు. దుంపల్ని బాగా ఉడికించి, వాటిని కొద్దిగా ఉప్పు జల్లి అరటి ఆకుల్లో బాగా చుట్టి ఒక్కొక్కచోట ఒక్కొక్క శేరు దుంపల్ని నేలలో జానెడు లోతున పాతాలి. నాల్గు రోజుల్లో మొలకలు వచ్చి ఒకనెల అయ్యేసరికి మంచి పంట చేతికి వస్తుంది” అని చాల నమ్మకంగా చెప్పాడు.

ఈ మాటలతో పాపం! అమాయకపు ముసలి దంపతులు ఆలోచనలో పడ్డారు. అప్పుడు కోతి మూకనాయకుడు వాళ్లని నమ్మించడానికి ఇంకా ఇలా అన్నాడు. “కావలిస్తే నాటిన దుంపల్నించి మొలకలు వచ్చే వరకు నన్ను నాల్గు రోజులు మీ దగ్గర బందీగా పెట్టుకోండి. మీకే ప్రత్యక్షంగా చూపిస్తాను.”

ఈ మాటల్ని ముసలివాళ్లు నిజంగా నమ్మడం ప్రారంభించారు. కోతి నాయకుణ్ణి తాడుతో పొలంలో చెట్టుకు కట్టి ఉంచారు. వాడు చెప్పినట్లే రెండు బస్తాల చామదుంపల్ని చచ్చీ చెడి ఉడికించి ఉప్పు జల్లి అరటి ఆకుల్లో చుట్టి జానెడు లోతున పొలం అంతటా పాతడం ప్రారంభించారు. సాయంకాలం వరకూ కష్టపడడం వల్ల అలసిపోయి రాత్రి ఒళ్లెరగక నిద్రపోయారు. కాని చీకటి పడడంతోనే కోతుల మంద తమ నాయకుడి దగ్గరకు వచ్చి వాడు చెప్పినట్లు పాతి పెట్టిన చేమదుంపల్ని తీసుకుని విందు చేసుకున్నాయి. తమ నాయకుడికి కూడా కొన్ని దుంపల్ని ఇంకా వేరు జాగాల నుంచి తెచ్చిన కాయల్ని పళ్లనీ తినడానికి ఇచ్చాయి. తరవాత నాయకుడి సలహా ప్రకారం అడవిలో పడిఉండే దురద చేమదుంపల్ని తెచ్చి పొలం అంతటా నాటాయి.

ముసలి దంపతులు కోతి నాయకుణ్ణి కట్టి ఉంచినా వాడికి అతిథి మర్యాదలు చేయడం ప్రారంభించారు. దుంపల నుండి మొలకలు వచ్చి రోజు రోజుకీ ఒక్కొక్క ఆకు తొడుగుతుంటే ఈ మర్యాదలు ఎక్కువ కాజొచ్చాయి. నాలుగైదు రోజుల తర్వాత మొక్కలు కాస్త నిలదొక్కుకున్నాయనిపించినాక కోతి నాయకుడికి పళ్లూ ఫలాలు సుష్టుగా పెట్టి వదిలి పెట్టారు. వాడు నెల రోజుల తర్వాత పంట తీసే సమయానికి తన మూకతో వచ్చి సాయపడతానని చెప్పి వెళ్లిపోయాడు.

ఒక నెల తిరిగేసరికి కోతులన్నీ చెప్పినట్లు వచ్చి ముసలి దంపతులకి చామదుంపల్ని తవ్వి తియ్యడంలో చాలా సాయపడ్డాయి. అడివిలోంచి తెచ్చిన దురద దుంపలు తవ్వి నీరు పెట్టిన మంచి పొలంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ పంట చూసిన ముసలి వాళ్ల ఆనందానికి అంతులేకపోయింది. ఆ సంతోషంలో కోతులకి ఇంట్లో ఉన్న వేరుశనగ కాయలు ఇవ్వడమే కాకుండా కోతులు పెరట్లో చెట్లనున్న అరటి, జామ పళ్లు కూడా తెంపినా ఏమీ అనకుండా ఊరుకున్నారు. మర్నాటికి సైన్యం నుంచి శలవు మీద ముసలి దంపతుల కొడుకు వస్తున్నాడని కబురు వచ్చింది. ఇంటినిండా చేమదుంపల పంట పుష్కలంగా బస్తాలలో ఉంది. ఈ సందర్భంలో చుట్టు ప్రక్కల వాళ్లందర్నీ పిలిచి విందు చెయ్యాలని నిశ్చయించారు.

మర్నాడు విందు ప్రారంభం అయింది. దగ్గరి ఇళ్ల వాళ్లంతా వచ్చారు. మొదటగా చామదుంపల పులుసు అందరికీ ఇచ్చారు. రుచి బాగుందని అందరూ దుంపల్ని నమలడం ప్రారంభించారు. అంతలో అందరికీ నాలుక, నోరు దురద ప్రారంభం అయింది. విందు అంతా గందరగోళం అయి అంతా నోటి దురద విరుగుడుకి నూనె కోసం ఎగబడారు. ఈ హడావుడిలో ఎవరో నూనె కుండ క్రింద వెయ్యడం వల్ల చాలామంది జారిపడ్డారు. కోతుల మూక ఇదే అదనని ఇంట్లో విందుకోసం వండి పెట్టిన మిగిలిన పదార్థాలనన్నింటినీ చెట్ల పైకి ఎత్తుకపోయాయి.

అప్పుడే ఇంటికి చేరుకున్న ఆ ముసలి దంపతుల కొడుకు సంగతి అంతా తెలుసుకుని తన చేతిలోని లాఠీతో దొరికిన కోతులన్నిటినీ కొట్టి తరిమేడు. తర్వాత ఆ కోతులు మరెప్పుడూ ముసలి వాళ్ల పొలంకేసి చూడనైనా లేదు.

హిందీ: డా. తోంబా సింహ్, తెలుగు: డా. బి.వి.స్. మూర్తి

Exit mobile version