[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘మర్డర్ వితిన్’. రచన శ్రీ చిట్టత్తూరు మునిగోపాల్.]
Murder within (లోపలి హత్య)
వెల్లువలా చుట్టుకు పోయింది అతడిని. గాలి కూడా చొరబడడానికి సందేహించేంతటి సామీప్యం. ఒకరి గుండె చప్పుళ్ళు మరొకరికి వినిపిస్తున్నాయి. కలయిక కోసం తహతహలాట. శరీరాల పెనుగులాటలో అపరిమిత సుఖం వెదుక్కోవాలనే వెంపర్లాట.
గోడ మీద ఏదో నీడ ప్రత్యక్షమైంది. మెల్లగా పాకుతోంది. అంతదాకా తనదే సామ్రాజ్యం అన్నట్లు రికామీగా తిరుగుతూ పురుగులను వేటాడుతున్న బల్లి, ఎక్కడిదక్కడ ఆగిపోయింది. కిచకిచ శబ్దాలు కూడా లేవిప్పుడు. కేవలం ఆ జంట గుండెల చప్పుడు మాత్రమే. నిశ్శబ్దం అంతటి భయంకరం ఇంకోటి లేదేమో.
బీరువా చాటుగా ఆగిన నీడ మెల్లగా ఇవతలికి కదులుతోంది. ఆ నీడనే గమనిస్తున్న బల్లి, భయంతో పరుగులు పెడుతూ వెళ్ళి, కరెంటు మీటరు వెనుక దాక్కుంది.
“నీ కోసం ఎంతగా ఎదురు చూశానో. ఇంత లేట్ గానా రావడం. నిన్ను ఈరోజు ఏం చేస్తానో చూడు..” గోముగా అంటూ అతడిని అలాగే బెడ్ పైకి తోసింది ఆమె.
ఇక ఎంతమాత్రం భరించలేకపోయింది గోడ మీది నీడ. ఆ నీడ చేతిలో పదునైన చాకు తళుక్కున మెరిసింది. హఠాత్తుగా వెలుగులోకి వచ్చి కసిగా చాకు పైకి ఎత్తింది..
ల్యాప్ కీ బోర్డు మీద చకచకా టైప్ చేస్తున్న లిఖిత్ చేతి వేళ్ళు ఆగిపోయాయి. కారణం.. ఆ గోడ మీద నీడ తనలా మారిపోవడం. నిప్పులు ఉమిసే ఎర్రటి కళ్ళు.. ఆపలేని క్రోధంతో అదిరే ఒళ్ళు.. చేతిలో కత్తి..
ల్యాప్ షట్ డౌన్ చేసి పైకి లేచాడు. బాల్కనీ లోకి వచ్చి సిగరెట్ ముట్టించాడు.
నాలుగైదు నెలలుగా ఇదే కథ. మొదలు ఎలా పెట్టినా.. నరేషన్ ఎలా సాగినా కథ కొంచెం నడిచే సరికి గోడ మీద నీడ, ఆ నీడ చేతిలో కత్తి. ఆ పట్టుకున్నది తనే అవుతున్నాడు. ఆలోచనలు దానికి మించి ముందుకు కదలడం లేదు. కథ ముందుకు సాగడం లేదు.
ఎప్పటినుంచి ఇలా? ఏమైంది తనకు?
తలంతా దిమ్ముగా ఉంది. నరాలు చిట్లి పోతున్నట్టు ఒకటే పోటు. సగం తాగిన సిగరెట్ పూల కుండీలో నలిపి వీధిలోకి విసిరేశాడు. మళ్ళీ వచ్చి కూర్చుని ల్యాప్ తెరిచాడు. అయిదు నిముషాలు అలాగే ఉన్నాడు. తర్వాత ఆన్ చేశాడు. వేళ్ళు కీ బోర్డు మీదికి వెళ్ళాయి కానీ కదల్లేదు. కదలడానికి అతడి ఆలోచనల్లో కథ లేదు. సన్నివేశాలను చిత్రించగలిగే ఊహలు లేవు. ఆ మనసు నిండా ఎవరి మీదో తెలియని కసి. తన కథలో ప్రతిరోజూ ప్రత్యక్షమై.. ఒకరికోసం ఒకరు తహతహలాడిపోయే జంట మీద ద్వేషం.
అయినా కథ మొదలు పెట్టకుండా ఉండలేకపోతున్నాడు. మొదలు పెట్టాక పూర్తి చేయలేక పోతున్నాడు.
ల్యాప్ మూసి పైకి లేచి బెడ్ రూమ్ దాకా వచ్చాడు. నిద్రలో అటునుంచి ఇటు మళ్ళింది ఊర్మిళ. సన్నటి నాసికకు అమరిన ముత్తెపు ముక్కు పుడక బెడ్ లైట్ కాంతిలో తళుక్కున మెరిసింది. ఆమె పెదవులపై ఉన్నట్టుండి చిరునవ్వు మెరిసింది. ఏదో అంటున్నట్లు పెదవులు కదులుతున్నాయి. ప్రేమ పొంగి పొర్లింది ప్రియమైన భార్య మీద. వంగి అంటీ అంటనట్లు బూరెలాంటి బుగ్గమీద ముద్దు పెదవులు ఆనించి తీసేశాడు.
ఏమిటి కలవరిస్తోంది? ఎప్పటిలా వాడి పేరేనా? చెవి ఆమె పెదవుల సమీపంలోకి తీసుకు వచ్చి వినబోయాడు.
కట్.. కరర్.. క్రీచ్.. చప్పుడు అయింది.
గాభరా పడుతూ ఆమె ముఖానికి దగ్గరగా పెట్టిన తన ముఖాన్ని ఇవతలకు తీసేసుకున్నాడు లిఖిత్. అది వీధిలోకి ఉన్న గ్రిల్ గేటు చప్పుడు. గోడవైపు చూశాడు అప్రయత్నంగా. సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి ఇరవై నాలుగు నిముషాలు అవుతోంది.
ఈ సమయంలో గేటు చప్పుడు ఏమిటి? ఎవరు తీశారు?
వాడేనా? ఎంత ధైర్యం వాడికి? తను ఉండగానే ఇంట్లో దూరుతాడా?
మరోసారి ఊర్మిళను చూశాడు. అదే ప్రశాంతత ఆమె ముఖంలో. ఇప్పుడు పెదవులపై నవ్వు లేదు. కానీ చంద్ర వంకలా వంపు తిరిగిన ఆ పెదవుల మృదుత్వం.. చచ్చేంత ఇష్టం తనకు. ఆ కనీ కనిపించని లేత ఎరుపు చీలికలు.. వాటిలోనుంచి చిప్పిల్లే మధువులు..
చూపులు తిప్పేసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడినుంచి వీధి గేటు క్లియర్ గా కనిపిస్తుంది. మామూలుగానే ఉంది గేటు. తెరిచి లేదు. మరి చప్పుడు ఎందుకు వినిపించింది.
భ్రమ పడ్డాడా తను? వాడు వచ్చేశాడేమోనని ఆందోళన చెందాడా? తల విదిలించాడు.
గేటు చప్పుడు కావడం భ్రమ ఏమోకానీ, వాడు మాత్రం భ్రమ కాదు. వాడు.. వాడు.. నిజం. అవును, ఇప్పుడు తను ఇక్కడ నిలబడి ఉన్నంత పచ్చి నిజం. ఊర్మిళ ముఖంలో ఎల్లప్పుడూ ఉట్టిపడే ప్రశాంతత అంతటి వాస్తవం.
ఆఫీసులో ఉన్నప్పుడు, బజారులో తిరుగుతున్నప్పుడు, ఏదైనా సినిమా థియేటర్ కు వెళ్ళినప్పుడు.. అప్పుడప్పుడూ తారసపడతాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా స్త్రీల అంగాంగాలను ఆబగా కళ్ళతో తినేస్తూ, తనను చూసి వెకిలి నవ్వులు నవ్వుతాడు. కొన్నిసార్లు ఊర్మిళ తన వెంట ఉంటుంది కూడా. అయినా ఆమె గుర్తించలేకపోతోంది అతడిని. లేకపోతే తెలిసినా తెలియనట్లు, గుర్తించినా గుర్తించనట్లు నటిస్తోందా?
పాపం ఊర్మిళకి నిజంగానే అతడి గురించి తెలియదేమో. ఊరికే తెలుసునని ఊహించుకుంటున్నాడేమో.
కాసేపు అలాగే నిలబడ్డాడు. అంతలోనే కరెంటు పోయింది. దూరంగా ఇంకో స్ట్రీట్ లోని లైట్ల నుంచి వచ్చే వెలుగు పలచగా పడుతోంది.
పొడవాటి నీడ ఇంటి వాకిట్లో పడింది. పక్క వీధిలోని లైటు వల్ల ఏర్పడిన నీడ అది. ఎవరో ఇటువైపే వస్తున్నారు. వీధి వాకిట్లోకి వచ్చేశారు. మగ మనిషి అని తెలుస్తోంది. కానీ ముఖం సరిగా కనిపించడంలేదు. ఆ మనిషి ఎవరో కనిపెట్టలేకపోతున్నాడు.
అయితే మనసు చెబుతోంది.. వాడే అని.
కానీ నేను ఇక్కడున్నప్పుడే వాడు ఎలా రాగలడు? ఎన్ని గుండెలు వాడికి? అప్పుడెప్పుడో తరచూ ఎదురుపడుతుంటే తరిమితరిమి కొట్టాడు. మళ్ళీ ఈ మధ్యనే ఇలా ధైర్యం చేస్తున్నాడు తన ఎదుటికి రావడానికి.
లిఖిత్ ఊహ నిజమవుతోంది. వీధి గ్రిల్ గేటు ముందుకు వచ్చి నిలుచున్నాడు వాడు. దూరంగా ఆగివుంది ఒక వాహనం నిశ్చలంగా. ఒక్క క్షణం అటుఇటు చూసి, వాడు గేటు మీద చెయ్యి వేశాడు.
కిర్.. ర్ర్.. కట్టక్.. క్రక్.. టప్ర్.. అదోలాంటి చప్పుడుతో తెరచుకుంది గేటు. ఆ చప్పుడంటే చాలా ఇరిటేటింగ్ లిఖిత్ కు. ఆ గేటు గుండా వాడు ఎప్పుడో ఒకప్పుడు తన ఇంట్లో దూరుతాడని ముందే తెలిసినందువల్ల వచ్చిన ఇరిటేషన్ కావచ్చు అది.
లోపలికి నడుస్తూ తల పైకి ఎత్తి బాల్కనీ వైపు చూశాడు వాడు. చప్పున పక్కకు తప్పుకున్నాడు లిఖిత్. రెండు క్షణాల తర్వాత ఇవతలికి వచ్చాడు. ఇంటి డోర్ తెరిచారు ఎవరో. దానికి గుర్తుగా లోపలినుంచి సన్నగా వెలుగు బయటకు పడుతోంది.
ఎంతకు తెగించింది ఊర్మిళ. బిచ్.. ఎంతగా ప్రేమించాడు తను? ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాడు.
దుఃఖం తన్నుకుని వచ్చింది. క్రోధంతో కళ్ళు ఎరుపెక్కాయి. ఆవేశం ఆపుకోలేకపోతున్నాడు.
మళ్ళీ సన్నగా నొప్పి బయలుదేరింది. తలలో నరాలు చిట్లిపోతున్నాయి. శరీరం పట్టలేని ఆవేశంతో అదుపు తప్పుతోంది.
అంతలోనే బాల్కనీ ఉన్న గదిలోకి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. వారిలో ఒకరు ఊర్మిళ. ఆమె పక్కన తెల్లగా, సన్నగా, కొద్దిగా నెరిసిన చెంపలతో, హ్యాండ్సమ్ గా.. ఎవరా వ్యక్తి? తరచూ తనకు కనిపించే వ్యక్తి కాదు ఇతడు. వేరేవరో.. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు.
నిజమేనా.. ఎప్పుడూ చూడలేదా తను అతడిని?
లేదు, చూశాడు. ఎక్కడ.. ఎక్కడ..?
ప్రశాంతమైన గది. అందులో ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు అతడు. అతడు అంటే.. స్త్రీల అంగాంగాలనూ ఆబగా చూస్తూ ఇటీవల తరచూ కనిపిస్తున్న వ్యక్తి. అతడి ఎదుటే. ఇదిగో ఇప్పుడిక్కడ ఉన్న తెల్లటి సన్నటి వ్యక్తి, ఊర్మిళ ఎదుటి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశారు.
రెండుమూడుసార్లు జరిగింది ఇలా. చూశాడు తను. అయినా ఏమీ చేయలేకపోయాడు.
వాళ్ళిద్దరూ కలిసి తనమీద దాడి చేస్తే.. హతమారిస్తే.. అందుకే మౌనం వహించాడు చూసి కూడా.. జరిగిపోయిన దృశ్యాలు ఏవో లీలగా గుర్తుకు వస్తున్నాయి.
ఈసారి అలా కాదు. చేయాలి, ఏదో ఒకటి చేసి తీరాలి.
అటుఇటు చూశాడు. ఒక సన్నటి ఇనుప రాడ్ కనిపించింది. పూల కుండీలలో మన్ను తవ్వి గుల్ల చేయడానికి ఉపయోగిస్తుంది ఊర్మిళ ఆ రాడ్ ను. ఈమధ్యనే పాడైన వీధి గ్రిల్ గేటు తీసివేసి కొత్త గేటు ఫిక్స్ చేశారు. అప్పుడు తుక్కుకు వేసిన, తుప్పు పట్టిన పాత గేటు తాలూకు ఇనుప చువ్వ అది. రెండు అంగుళాల మందం, మూడు అడుగుల పొడవుతో, పదునైన చివరలతో షార్ప్ గా ఉంది. ఎందుకైనా ఉపయోగపడుతుందని ఊర్మిళ తీసి ఉంచింది.
దీనితో తల మీద చంపాలా.. లేక గుండెల్లో పొడిచి ప్రాణం తీయాలా? దేనికైనా ఉపయోగపడే ఆయుధం ఇప్పుడు తన చేతుల్లో ఉంది.
అది కాదు, ముందుగా ఎవరిని చంపాలి? ఆగంతకుడినా.. కాక నమ్మక ద్రోహం చేసిన ఊర్మిళనా?
గదిలో ఆ ఇద్దరే ఉన్నారు. వారిద్దరూ కలిసి ల్యాప్ ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆగంతకుడు తల వంచి తెరచి ఉన్న ల్యాప్ లోకి చూస్తున్నాడు ఆసక్తిగా.
ఏముంది అక్కడ.. అతను అసంపూర్తిగా వదిలేసిన కథ కదా. ఎందుకు చూస్తున్నారు దాన్ని?
కాసేపు అలాగే చూసిన ఆగంతకుడు నిటారుగా నిలబడి ఊర్మిళ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఏదో అడుగుతున్నాడు. ఆమె అతడికి ఇంకేదో చెబుతోంది.
ఇద్దరూ కూడబలుక్కుంటున్నారు. అవును, తనను ఎలా అంతం చేయాలా అని ప్లాన్ వేస్తున్నారు. ఇక్కడ, ఈ బాల్కనీలో ఉన్నానని తెలిసిపోయి ఉంటుంది వారికి.
ఎలా.. ఇప్పుడెలా? ఏమి చేయాలి? వీరినుంచి ఎలా తప్పించుకోవాలి? లేదా ఇద్దరినీ ఒకేసారి ఎలా అంతం చేయాలి?
తల తిరిగిపోతోంది. నరాలు చిట్లుతున్నాయి. కనుగుడ్లు ఎర్రగా మారుతున్నాయి. పట్టలేని ఆవేశంతో శరీరం అదురుతోంది లిఖిత్ కు.
బాల్కనీ వైపు రెండు అడుగులు వేశారు ఆ ఇద్దరూ. లిఖిత్ గుప్పిట్లో ఐరన్ రాడ్ బిగుసుకుంటోంది. ఇక మూడు అడుగులు వేస్తే బాల్కనీ చేరుకుంటారు. తను ఇక్కడ ఉన్నట్లు పసిగట్టేశారు. బతకనివ్వరు తనను. వారికన్నా ముందే దాడి చేయాలి. ఒకేసారి ఇద్దరి తలలూ పగులగొట్టాలి. ఆపైన గుండెల్లో పొడిచి.. మరింతగా బిగిసింది రాడ్. అతడి నుదుటి నుంచి స్వేదం ధారాపాతంగా కారుతోంది.
ఆగిపోయారు అంతలో ఇద్దరూ. ఏదో మాట్లాడుకున్నారు. ఊర్మిళ ఎవరికో ఫోన్ చేస్తోంది.
కిరాయి హంతకులను పిలుస్తున్నారా? ఎంతగా నమ్మాడు దీన్ని తను. చివరకు ఇలా చేస్తోంది. దుఃఖం మళ్ళీ తెరలుతెరలుగా తన్నుకుని వచ్చింది.
వదలకూడదు.. నమ్మకద్రోహం చేసిన దీన్ని క్షమించ కూడదు..
“బిచ్.. ఐ విల్.. ఐ విల్.. కిల్.. ల్.. ల్.. య్.. య్..”
దబ్బుమని శబ్దమయింది. అంతే.. తర్వాత అంతా నిశ్శబ్దం.
***
“ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నా ఇలా చేస్తున్నాడంటే.. మీరు డేంజర్ సిచ్యుయేషన్ లోకి వెళ్లిపోయారు. నేను మీ ఇంటికి వచ్చేముందే ఎందుకైనా మంచిదని ఇన్‌స్పెక్టర్‌కు కాల్ చేశాను. ఆయన సమయానికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ..”
“అవును డాక్టర్. నా దగ్గరగా వచ్చి, అంతలోనే బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడాయన. నేను పిలుస్తున్నా పట్టించుకోలేదు. ట్రాన్స్‌లో ఉన్నట్టున్నాడు. అందుకే రాత్రి నాకు అనుమానం వచ్చి మీకు కాల్ చేశాను.”
“ఎన్నాళ్ళనుంచి ఇలా?”
“ఆరేడు నెలల నుంచీ డాక్టర్. ఒక జంట.. వాళ్ళను హత్య చేయడానికి కసిగా కదిలే నీడ.. పాత్రలు అవే. దృశ్యాలు మాత్రం మారిపోతుంటాయి. కానీ ఇంతదాకా పూర్తి చేయలేదు. టైప్ చేయడం.. డిలీట్ చేయడం.. ఇంతే.”
“మీ మీద హత్యాయత్నం జరిగిందా ఎప్పుడైనా?”
“అవును డాక్టర్, జరిగింది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు.”
“ఎలా? ఎక్కడ?”
“ఇంట్లోనే. ఒకసారి కత్తితో, ఇంకోసారి రాడ్‌తో.”
“ఎవరు కాపాడారు?”
“మా ఆయనే డాక్టర్. రెండుసార్లూ ఆయనే అడ్డుపడ్డారు.”
“హంతకుడినీ, లిఖిత్‌నీ ఇద్దరినీ ఒకేసారి చూశారా ఎప్పుడైనా?”
“అంటే?”
“అంటే.. మీ ఆయన రాకముందే హంతకుడు పారిపోయాడా లేక మీ ఆయన వచ్చి అతడిని తరిమికొట్టాడా?”
“లేదు డాక్టర్, ఎవరో వస్తున్నట్టు పసిగట్టి హంతకుడు రెండుసార్లూ పారిపోయాడు. అతడిని తరుముకుంటూ కేకలు వేస్తూ వెనుకే మా ఆయన పరుగెత్తడం నేను చూశాను.”
“అప్పుడైనా హంతకుడిని, మీ ఆయనను ఇద్దరినీ ఒకేసారి చూడగలిగారా?”
“లేదు, మా ఆయన అరుపులు, కేకలు మాత్రం విన్నాను. ఆయన తిరిగి వచ్చి చెబితేనే తెలిసింది, హంతకుడు తప్పించుకుని పారిపోయాడని.”
“సో.. మీరు ఎప్పుడూ ఒకేసారి ఇద్దరినీ చూడలేదంటారు. పోనీ హంతకుడి ముఖమైనా చూశారా?” ఊర్మిళతో డాక్టర్ సంభాషణ వింటూ అంతదాకా మౌనంగా ఉన్న ఇన్‌స్పెక్టర్ విజిత్ అడిగాడు.
“లేదు, ఎప్పుడూ అతడి ముఖానికి అడ్డుగా టవల్ లేదా కర్చీఫ్ ఏదో ఒకటి ఉండేది.”
“స్ప్లిట్ పర్సనాలిటీ..” సాలోచనగా అన్నాడు డాక్టర్ చక్రధర్.
“అంటే డాక్టర్?”
“ఒకరు ఇద్దరుగా ప్రవర్తించడం.”
“అర్థం కాలేదు డాక్టర్..”
“చెప్తాను. మీవారు మిమ్మలను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్ళయిన కొద్దికాలం వరకు, మీ మీద ప్రేమ చెరగలేదు. ఆ తర్వాత కూడా లవ్ ఎక్కడికీ పోలేదు కానీ, అతడిలో బయటి అందాలపై మోజు పెరిగింది. కొన్నిసార్లు అవతలి స్త్రీలు పాజిటివ్‌గా స్పందించి ఉండవచ్చు కూడా. తనలాగే మీకు కూడా బయటి రుచులపై కోరిక పెరిగి ఉంటుందని ఊహించుకున్నాడు. తనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన స్త్రీలలో మిమ్మల్ని చూశాడు. అదే సమయంలో ఒక రచయితగా లిఖిత్ సృష్టిస్తున్న పాత్రలు, వాటి నేర స్వభావాలు అతడిపై ప్రభావం చూపుతూ వచ్చాయి. ఆ పాత్రల్లో మిమ్మల్ని, మీతోపాటు మరో పురుషుడిని ఊహించుకుని మీ మీద లోలోపల ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషం ఎంతగా పెరిగిపోయింది అంటే, తనే హంతకుడిగా మారి మిమ్మల్ని హత్య చేయాలనుకునేంతగా.”
“అంత ద్వేషం పెంచుకుంటే మర్డర్ జరగాలి కదా. అందుకు అవకాశాలు బోలెడు ఉన్నాయి లిఖిత్‌కు..” అప్పటిదాకా మౌనంగా ఉన్న ఇన్‌స్పెక్టర్ విజిత్ జోక్యం చేసుకున్నాడు.
“అక్కడికే వస్తున్నాను. లిఖిత్‌లో ఎప్పుడైతే హత్య చేయాలన్న ఇంటెన్షన్ కలుగుతుందో, దాదాపు అదే సమయంలో ఊర్మిళ గారి మీద ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా బహిర్గతమవుతుంది. అంటే, లఖిత్ ఒక్కరే.. అటు హంతకునిగా, ఆవెంటనే పెళ్లికి పూర్వపు ప్రేమికునిగా రెండు పాత్రల్లోకి మారిపోతారు. భార్యపై దాడి చేసింది తనే అని తెలియక, లేని హంతకుడిని పట్టుకోవడానికి వెంట పడుతారు.” ఊపిరి పీల్చుకున్నాడు డాక్టర్.
“సో.. హంతకుడు, రక్షకుడు ఇద్దరూ లిఖితే అని చెబుతారు. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. ప్రాపర్ మెడికల్ రిపోర్ట్స్ లేకపోతే కచ్చితంగా చట్టం లిఖిత్‍నే శిక్షిస్తుంది.” ఇన్‌స్పెక్టర్ విజిత్ చెప్పాడు.
“ఇది సైకలాజికల్ ప్రోబ్లమ్. చాలా మందికి ఈ సమస్యలు అర్థం కావు. కథలు చెబుతున్నట్టు అనిపిస్తాయి కూడా. కానీ సైకలాజికల్ డిజార్డర్ ఇది. ప్రస్తుతానికి లిఖిత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సమయం ఉంది. కోర్టు మెట్లు ఎక్కే సమయానికి ప్రాపర్ మెడికల్ రిపోర్ట్స్ బిల్డప్ చేయగలననే అనుకుంటున్నాను.” విశ్వాసంతో చెప్పాడు డాక్టర్.
“డాక్టర్, మా వారిని ఎలాగైనా మీరే సేవ్ చేయాలి.” దుఖంతో పూడుకుపోతున్న గొంతుతో వేడుకుంది ఊర్మిళ.
“పేషెంట్‌ను కాపాడడం నా బాధ్యత తల్లీ, డోంట్ వర్రీ.” బెడ్ మీద ఆపస్మారక స్థితిలో ఉన్న లిఖిత్‌ను చూస్తూ గది బయటకు అడుగులు వేశాడు ప్రముఖ సైకియాట్రిస్ట్ చక్రధర్. ఆయనను అనుసరించాడు ఇన్‌స్పెక్టర్ విజిత్.
శ్రీ చిట్టత్తూరు మునిగోపాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం అనే చిన్న గ్రామం. చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. గత మూడునాలుగేళ్ల నుంచి కథలు రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో పలు కథలు ప్రచురితం.
