Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మునికిష్టడి మాణిక్యం – ఎల్లలు దాటి పరివ్యాప్తించే పల్లె పరిమళం

[తానా – మంచి పుస్తకం వారి బాలల నవలల పోటీలో గెలుపొంది, వారే ప్రచురించిన పుస్తకం ‘మునికిష్టడి మాణిక్యం’ను విశ్లేషిస్తున్నారు ‘కళారత్న’ డా. కంపల్లె రవిచంద్రన్.]

ఒక కోడి కథ, వంద జీవితాల గాథ.. వ్యథ!

ప్రఖ్యాత రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘మునికిష్టడి మాణిక్యం’ నవల బాలల అమాయకత్వం, జిజ్ఞాస, స్నేహం, వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక వాస్తవాలు, సాంప్రదాయ విలువలు, ఆర్థిక అంశాలు, విజ్ఞానం వంటి అనేక కోణాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఇది ఒక సాధారణ కోడి అన్వేషణ కథ కాదు. ఇది ఒక పల్లెటూరి కథా చిత్రం. మునికిష్టడు, అతని స్నేహితులు తమ పెంపుడు కోడి మాణిక్యం కోసం వెతికే ప్రయాణంలో స్నేహం ఔన్నత్యాన్ని, సమాజంలోని మూఢనమ్మకాలు, విజ్ఞానం మధ్య ఉన్న వైరుధ్యాన్ని, పెద్దల మాటల్లోని జ్ఞానాన్ని, సామాజిక అసమానతలను, జీవనోపాధి విలువలను తెలుసుకుంటారు. ఈ నవల, ప్రతి చిన్న సంఘటన వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలను సున్నితంగా, హాస్యభరితంగా వివరిస్తుంది.

ఆర్.సి. కృష్ణస్వామి రాజుగా చిరపరిచితులైన రాచకొండ చెంగల్రాజు కృష్ణస్వామి రాజు రచించిన ఒక అద్భుతమైన నవల – ‘మునికిష్టడి మాణిక్యం’. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల – అన్నట్టు కృష్ణస్వామి రాజు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప రచయిత. ఆయన రచనలు సమాజంలోని మధ్యతరగతి జీవితాలను, సామాజిక సమస్యలను లోతుగా విశ్లేషిస్తాయి. ఆయన కథలు మానవ సంబంధాలు, మనస్తత్వాలను సూక్ష్మంగా చిత్రిస్తాయి. ఆయన రచనలకు అనేక పురస్కారాలు లభించాయి. ‘మునికిష్టడి మాణిక్యం’ నవల కూడా 2025లో TANA – Telugu Association of North America వారి ‘మంచి పుస్తకం’ అవార్డుకు ఎంపికైన అయిదు నవలలలో ఒకటిగా నిలిచింది. తానా వారి ఎంపిక – ఈ నవలలోని సాహిత్య విలువను, దాని సార్వత్రిక ఇతివృత్తాలకు గీటురాయి అని చెప్పవచ్చు.

కథ విషయానికొస్తే, చిత్తూరు జిల్లాలోని పుత్తూరు కట్టుకి ప్రసిద్ధి చెందిన ఈశ్వరాపురం గ్రామంలోని మునికిష్టుడు, అతని స్నేహితుల కథ ‘మునికిష్టడి మాణిక్యం’. ఈ నవల, ఒక పిల్లల కథగా ప్రారంభమై, వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక విమర్శ వంటి అనేక అంశాలను స్పృశిస్తుంది. మునికిష్టడికి తన

కోడి మాణిక్యం కనిపించకపోవడంతో మొదలైన ఈ అన్వేషణ, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారో చూపిస్తుంది. పిల్లల అమాయక ప్రపంచాన్ని, పెద్దలు వాస్తవిక జీవితాన్ని ఒకే తాటిపైకి తెస్తుంది. పిల్లలు ఎదుర్కొనే ప్రతి సంఘటన- మూడు కాళ్ల కోడిపిల్ల, స్నానం గురించి శంకరుడి సిద్ధాంతం, పెద్దల మాటలు, సాలక్క ఆర్థిక లెక్కలు – వారికి జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇది కేవలం కోడిని కనుక్కోవడం కాదు, స్నేహం, సహకారం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ వంటి విలువలను తెలుసుకునే ప్రయాణం. ఈ కథ, పల్లెటూరి జీవితం, సంప్రదాయాలు, ఆధునికత, వాటి మధ్య ఉన్న సమతుల్యతను అందంగా చిత్రించింది.

ఈ నవల కేవలం ఒక పిల్లల కథ కాదు. ఇది ఒక సామాజిక విమర్శ, మానవ సంబంధాల గురించి ఒక లోతైన విశ్లేషణ. మునికిష్టుడు, అతని స్నేహితులు తమ కోడిని వెతుక్కుంటూ సాగే ప్రయాణంలో, పల్లె జీవితం,

సంప్రదాయాలు, ఆధునికత మధ్య ఉన్న సమతుల్యతను, అలాగే మూఢనమ్మకాలు, విజ్ఞానం మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలుసుకుంటారు. పిల్లల ఆశయాలు, పెద్దల అనుభవాలు, స్నేహం, పరస్పర సహాయం, జీవనోపాధి విలువలు వంటి అనేక కోణాలను రచయిత సున్నితంగా, హాస్యభరితంగా ఆవిష్కరించారు. ఈ నవల, ప్రతి చిన్న సంఘటన వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలను తెలియజేస్తుంది. పిల్లల ఊహాలోకానికి, పెద్దల వాస్తవ ప్రపంచానికి మధ్య ఒక వారధిగా నిలుస్తుంది ‘మునికిష్టడి మాణిక్యం’. ఇది పాఠకులను నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, చివరకి హృదయాన్ని స్పృశిస్తుంది.

***

అమాయకత్వం- జిజ్ఞాసల జంట ప్రయాణం

చిత్తూరు జిల్లాలోని పుత్తూరు కట్టుకి పేరు పొందిన ఈశ్వరాపురం గ్రామంలోని కథ ఇది. ఈ కథ, మునికిష్టడు అనే పిల్లవాడు, తన స్నేహితులతో కలిసి, తనకి అత్యంత ప్రియమైన కోడి మాణిక్యం కోసం వెతికే ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇది కేవలం ఒక కోడిని వెతకడం మాత్రమే కాదు, పిల్లల అమాయకత్వం, జిజ్ఞాసలను మన కళ్ళ ముందుంచే ఓ అద్భుతమైన ప్రయాణం.

ఈ కథలో పిల్లల అమాయకత్వం, జిజ్ఞాసలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు, మూడు కాళ్ళ కోడి పిల్లను చూసినప్పుడు, పెద్దలు దానిని దైవిక చిహ్నమని వాదించుకుంటే, మునికిష్టడు మాత్రం అది జన్యు లోపం వల్ల పుట్టిందని తనలో తాను అనుకుంటాడు. అలాగే, ‘ఫలవరేణి’ ఆకులతో పాలను గడ్డ పెరుగుగా మార్చడం, ‘అత్తిపత్తి’ మొక్క ఆకులు తాకగానే ముడుచుకుపోవడం వంటి సంఘటనలు వారిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ సందర్భాలలో, వారు పాఠ్యపుస్తకాల్లో చదివిన విషయాలకు, వాస్తవ ప్రపంచంలో చూసే అద్భుతాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకుంటారు.

పిల్లల అంతరంగం, ఆలోచనలు శ్యామల అడిగే ప్రశ్నల ద్వారా బయటపడతాయి. ఆమె తన కలలు ఎప్పుడూ నలుపు-తెలుపు రంగుల్లోనే వస్తాయని, తన కలల్లో తాను కనిపించనని అడిగినప్పుడు, మిగిలిన స్నేహితులు కూడా తాము అదే అనుభవాన్ని ఎదుర్కొంటున్నామని తెలుసుకుని ఒకరినొకరు చూసుకుంటారు. ఈ అమాయకమైన అనుమానాలు పిల్లల సాధారణ భయాలను, ఒకరికొకరు తోడుగా ఉండే స్నేహాన్ని తెలియజేస్తాయి.

పిల్లల సంభాషణలు సహజంగా, హాస్యభరితంగా ఉంటాయి. ముఖ్యంగా:

‘ఒకే సీసాలో రెండు రకాల నూనెలు’ అనే పొడుపు కథకు పిల్లలు సమాధానం చెప్పలేకపోవడం, దానికి సమాధానం ‘కోడిగుడ్డు’ అని రామయ్య తాత చెప్పినప్పుడు, వారు ఆశ్చర్యపోతారు.

పల్లె జీవితం.. సామాజిక బంధాలు

‘మునికిష్టడి మాణిక్యం’ నవల పల్లెటూరి జీవితాన్ని, అక్కడి ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథలోని ప్రతి సన్నివేశం, పల్లె సమాజంలో ఉండే సహకార స్ఫూర్తిని, ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుబంధాన్ని తెలియజేస్తుంది. మునికిష్టడి మాణిక్యం అనే కోడి కోసం వెతికే ప్రయాణం, ఊరి ప్రజలందరినీ ఒక తాటిపైకి తెస్తుంది.

మునికిష్టడి మాణిక్యం తప్పిపోయినప్పుడు, అతని స్నేహితులైన బాలాజీ, కుచేలుడు, శంకరుడు, చంద్రడు అతనికి అండగా నిలుస్తారు. కోడిని వెతకడానికి వారంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తారు. ఇది వారి స్నేహ బంధాన్ని, ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకునే తత్వాన్ని చూపిస్తుంది. అంతేకాక, ఊరిలోని పెద్దలు, వైద్యులు కూడా వారికి సహాయం చేస్తారు. ఈ సంఘటనలన్నీ పల్లెల్లో ఉండే సామూహిక స్ఫూర్తిని, పరస్పర సహాయ సహకారాలను ప్రతిబింబిస్తాయి.

ఈ నవల కార్యక్షేత్రమైన ఈశ్వరాపురం రచయిత కృష్ణస్వామి రాజు స్వగ్రామం. ఆయనది పుత్తూరు సంప్రదాయ శల్య వైద్య కుటుంబం. రాచకొండ చెంగల్రాజు, నారాయణమ్మల ఎనిమిదవ సంతానం ఆయన. అయితే, అనూచానంగా వస్తున్న కుటుంబ వృత్తిలో కృష్ణస్వామి రాజు లేరు. ఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలు పూర్తి చేశారు. తిరుపతి ఎల్.ఐ.సి కార్యాలయంలో 35 ఏళ్ళ పాటు పని చేసి, డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. 1984-87లలో ఈనాడు పత్రికా విలేఖరిగా కూడా పని చేశారు. తన స్వగ్రామాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ కథ అల్లారు రచయిత. నవల ప్రకారం, ఈశ్వరాపురం గ్రామం ‘పుత్తూరు కట్టు’ అనే సాంప్రదాయ ఎముకల వైద్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ వైద్యం 1922 నుండి ఒకే కుటుంబం చేత నిర్వహించబడుతుంది. ఈ వైద్యంలో ఎక్స్-రే, మత్తుమందు వాడకుండా, కేవలం ఆకు పసరు, కోడి గుడ్డు తెల్లసొన, వెదురు బద్దలను ఉపయోగిస్తారు. సంప్రదాయ జ్ఞానానికి, నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యతను సూచించేలా ఈ వైద్యశాల గ్రామానికి ఒక గుర్తింపుగా నిలుస్తుంది.

ఈ కథలో పల్లెటూరి జీవితంలోని చిన్న చిన్న అంశాలు కూడా మనసును తాకుతాయి. గుడిలో పులిహోర ప్రసాదం పంచడం, ఇంటి దగ్గర బెండకాయ కూర, కోడిగుడ్ల పులుసు వంటి సాధారణ వంటకాలు, కాలువలో ఈత కొట్టడం, రచ్చబండపై ఆడపిల్లలు సైన్స్ ప్రయోగాలు చేయడం వంటివి పల్లెటూరి జీవనాన్ని ప్రతిఫలిస్తాయి. అలాగే, పెద్దల మాటలకు గౌరవం ఇవ్వడం, ఒకరినొకరు కలుపుకుని పోవడం వంటి పద్ధతులు కూడా ఈ కథలో ముఖ్యంగా కనిపిస్తాయి. రామయ్య తాత వంటి పెద్దలు తమ జీవిత అనుభవాలను పిల్లలకు పంచుకోవడం, సాలక్క తన కోడి విలువను ఆర్థిక కోణంలో వివరించడం, ఈ సంఘటనల ద్వారా పిల్లలు సమాజం గురించి, జీవితం గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు. కథ చివరిలో, మాణిక్యం దొరికిన తర్వాత ఊరంతా కలిసి ఆ సంతోషాన్ని పండుగలా జరుపుకోవడం, పల్లె ప్రజల మధ్య ఉన్న బలమైన బంధాలను, వారి ఐకమత్యాన్ని చూపిస్తుంది. ఆ విధంగా ఈ నవల కేవలం ఒక కథ కాదు, అది పల్లె జీవితానికి, అక్కడి సమాజానికి ఒక ప్రేమ లేఖ. సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని చేసిన చాటింపు.

మూఢనమ్మకాలు – శాస్త్రీయ విజ్ఞానం

‘మునికిష్టడి మాణిక్యం’ నవలలో పల్లెటూరి ప్రజల నమ్మకాలు, ఆధునిక విజ్ఞానం మధ్య ఉన్న వైరుధ్యం, సామరస్యం రెండూ కనిపిస్తాయి. ఈ కథలోని పిల్లలు, పెద్దలు ఎదుర్కొనే ప్రతి సంఘటనలో మూఢనమ్మకాలు, తార్కిక ఆలోచనలు ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే, చివరికి విజ్ఞానమే గెలుస్తుందని కథ మనకి తెలియజేస్తుంది.

కథ మొదట్లో కనిపించే మూడు కాళ్ల కోడిపిల్ల సంఘటన దీనికి మంచి ఉదాహరణ. గ్రామ ప్రజలు ఆ కోడిపిల్లను చూసి, అది త్రిశూలానికి గుర్తు, నామాల చిహ్నం అని కొందరు, అరిష్టమని మరికొందరు వాదించుకుంటారు. కానీ, మునికిష్టడు మాత్రం అది జన్యులోపం వల్ల పుట్టిందని ఆలోచిస్తాడు. అలాగే, ‘అభ్యాసం కూసు విద్య’ అని మునికిష్టడు చెప్పినా, హిందీ పరీక్షలు రాయలేక తమిళనాడుకు పారిపోవాలనుకోవడం, బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని నమ్మడం, పాలు గడ్డ పెరుగుగా మారడానికి తోడు వేయడం వంటి నమ్మకాలతో కూడిన సన్నివేశాలు కల్పించడం ద్వారా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నాటే ప్రయత్నం చేశారు రచయిత.

మాణిక్యం దొరుకుతుందా లేదా అని తెలుసుకోవడానికి కుచేలుడు చేసే ప్రయోగాలు – పాత నమ్మకాలపై పిల్లలకు సహజంగా ఉండే ఆసక్తే. మొదట, అతను ‘కోడి దొరుకుతుంది’, ‘కోడి దొరకదు’ అని రాసిన చీటీలను ఉపయోగించి మునికిష్టడితో ఒక చీటీ తీయిస్తాడు. ఆ తర్వాత, ఒక రూపాయి నాణేన్ని ఎగరేసి, ‘బొమ్మ’ పడితే కోడి దొరుకుతుందని అంచనా వేస్తాడు. ఈ రెండు సందర్భాల్లోనూ సానుకూల ఫలితాలు రావడం పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ, ఇవి కేవలం అదృష్టం మీద ఆధారపడినవే అని రచయిత చెప్పకనే చెబుతాడు.

నమ్మకాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ దృక్పథాన్ని చూపించే సన్నివేశాలు ఈ కథలో చాలా ఉన్నాయి.

ఫలవరేణి ఆకులు: రచ్చబండ వద్ద ఒక అమ్మాయి ‘ఫలవరేణి’ ఆకులతో పాలను క్షణాల్లో గడ్డ పెరుగుగా మార్చి చూపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం, ఇది ప్రకృతిలో దాగి ఉన్న విజ్ఞానాన్ని తెలియజేస్తుంది.

జలగల వైద్యం: కాలువలో బాలాజీకి జలగ పట్టుకున్నప్పుడు, దాన్ని తీయడానికి పిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ, చంద్రడు ఉప్పు వేసి సులభంగా దాన్ని తొలగిస్తాడు. జలగలోని తేమను ఉప్పు పీల్చుకోవడం వల్ల అది బలహీనపడి, పట్టు వదిలిందని చంద్రడు వివరిస్తాడు. ఇది సంప్రదాయ వైద్యానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేస్తుంది.

ఈ నవలలో నమ్మకాలు, విజ్ఞానం పక్కపక్కనే నడుస్తూ, పిల్లలకు జీవిత పాఠాలను నేర్పుతాయి. పిల్లలు మూఢనమ్మకాలను నమ్మినప్పటికీ, చివరికి తార్కిక ఆలోచనల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇది కథలోని ప్రధాన సందేశాలలో ఒకటి.

లాభనష్టాల త్రాసులో మానవ బంధాలు

నవలలోని ప్రధానాంశాలలో ఒకటి, జీవన విధానం – ఆర్థిక విలువపై ఉన్న భిన్నమైన అభిప్రాయాల చర్చ. ఈ నవల మాణిక్యం అనే కోడి ద్వారా మానవ సంబంధాలు, ఆర్థిక లాభాల మధ్య ఉన్న తేడాని వివరిస్తుంది. మునికిష్టడికి, అతని కోడి మాణిక్యం ఒక పెంపుడు జంతువు, అతని దినచర్యలో కోడి పెంపకం ఒక భాగం. దానితో తనకి ఉన్న అనుబంధం కేవలం ఒక కోడితో ఉన్నది కాదు. అది అతని చిన్ననాటి నేస్తురాలు. అది తప్పిపోయినప్పుడు, అతని బాధ డబ్బుతో కొలవలేనిది. అయితే, పోలీస్ అధికారికి మాణిక్యం విలువ వేయి రూపాయలకన్నా తక్కువని, అలాంటి చిన్న విషయానికి కేసు పెట్టడం దండగ అని భావిస్తాడు. తద్వారా సమాజంలో భావోద్వేగ సంబంధాల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆ పిల్లవాడికి అర్థమవుతుంది. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం సాలక్క తన కోడి విలువను వివరించే సన్నివేశం. ఆమె కోడి కారు కింద చనిపోయినప్పుడు, ఆమె దాని విలువ 50 వేల రూపాయలకు పైగా ఉంటుందని వాదిస్తుంది. ఆమె ఈ విలువను ఎలా లెక్క వేసిందంటే, ఒక కోడి పెట్టిన గుడ్ల ద్వారా వచ్చే పిల్లలు, ఆ పిల్లలు పెద్దై పెట్టే గుడ్లు.. ఇలా ఒక గొలుసుకట్టుగా ఆదాయం పెరుగుతుందని లెక్కించి చూపిస్తుంది. ఇది కేవలం ఒక కోడి కాదు, అది ఆమె జీవనోపాధికి మూలం అని సాలక్క వాదన. ఈ సన్నివేశం, పల్లెటూరి ప్రజలకు చిన్నపాటి జంతువులు కూడా ఎంత విలువైనవో తెలియజేస్తుంది. మునికిష్టడు సాలక్క వాదన విన్న తర్వాత, “ప్రతి జీవికీ జీవితపు విలువ ఉంటుంది. గుర్తించే వాళ్ళు ఉండాలి” అని అనుకుంటాడు. రంగనాథ్ తన తలను మట్టిలో పెట్టుకుని, కాలిపై రాయి పెట్టుకుని గంటల తరబడి చేసే ప్రదర్శన, సమాజంలో ఆకలి ఆరాటానికి, కష్టజీవుల పోరాటానికీ ఒక ఉదాహరణ. జానెడు పొట్ట నింపుకోవడానికి, బిచ్చం అడుక్కోవడానికి ఇష్టపడకుండా, తన ప్రతిభతో డబ్బు సంపాదించడానికి అతను చేసే ప్రయత్నం, గౌరవంగా బతకాలనుకునే కష్టజీవుల తపనకి నిదర్శనం. ఇది పల్లె జీవితంలోని ఆర్థిక సవాళ్లను, వాటిని ఎదుర్కోవడానికి ప్రజలు పడే కష్టాన్ని వివరిస్తుంది. ఈ నవలలో కేవలం కథానాయకుడి ప్రపంచమే కాకుండా, పల్లె జీవితంలోని అన్ని కోణాలను రచయిత స్పృశించాడు.

ఈ నవలలో పోలీస్ అధికారి, సాలక్క, మునికిష్టడి అభిప్రాయాలు మూడు వేర్వేరు ప్రపంచాలను సూచిస్తాయి. పోలీసాయన ఆధునిక, డబ్బు ఆధారిత ప్రపంచాన్ని చూపిస్తే, సాలక్క సంప్రదాయ జీవనోపాధిలో ఉన్న ఆర్థిక లాభాలను సూచిస్తుంది. మునికిష్టడు మాత్రం భావోద్వేగ విలువకు ప్రాధాన్యత ఇస్తాడు. ఈ మూడు కోణాలు – విలువ అనేది ఎలా సాపేక్షమో, ఆ భావన ఎలా మారుతుందో, ఒకే సమాజంలో వేర్వేరు అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూపిస్తాయి.

సూక్ష్మ సామాజిక విమర్శ

‘మునికిష్టడి మాణిక్యం’ కథ పైకి అమాయకమైన బాలల కథగా కనిపించినప్పటికీ, దానిలో సమాజంలోని కొన్ని లోపాలను, సమస్యలను సూక్ష్మంగా విమర్శిస్తుంది. కథలోని కొన్ని సంఘటనలు, పాత్రల సంభాషణల ద్వారా ఈ విమర్శలు మనకు అర్థమవుతాయి.

మునికిష్టడు తన కోడి కనిపించలేదని పోలీసాయన దగ్గరికి వెళ్లినప్పుడు, అతను మునికిష్టడి బాధను పట్టించుకోడు. “లక్షల మొత్తాల దొంగతనం కేసులే ఎక్కడివక్కడ ఉన్నాయి. నీ బోడి కోడికి కేసు కడతారా?” అంటూ మునికిష్టడిని వెటకారం చేస్తాడు. ఈ సన్నివేశం, సామాన్య ప్రజల సమస్యలను అధికారులు ఎంత నిర్లక్ష్యం చేస్తారో, వారికి చట్టం ద్వారా న్యాయం జరగడం ఎంత కష్టమో సూచిస్తుంది. అలాగే, “జీవితంలో పోలీస్ స్టేషన్ గుమ్మం.. కోర్టు గుమ్మంలోకి అడుగు పెట్టకూడదని.. అప్పుడే సుఖపడతారు” అని పోలీసాయన స్వయానా చెప్పడం ద్వారా చట్టం పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని, నిస్సహాయతను వివరిస్తుంది..

ఈ కథలో ప్రధానంగా చూపించిన సామాజిక విమర్శలలో ఒకటి, ‘పుత్తూరు కట్టు’ వైద్యశాలను ‘కుంటోళ్ళ కొట్టం’ (కుంటివాళ్ళ షెడ్డు) అని పిలవడం. ఈ పదం అగౌరవంగా, బాధ కలిగించే విధంగా ఉందని మునికిష్టడు వాదిస్తాడు. ఆసుపత్రిని ‘శల్య వైద్యశాల’ అని పిలవడం సరైనదని, ఎందుకంటే అది రోగులకు వైద్యం చేసే దేవాలయమంటాడు. సమాజంలో దివ్యాంగుల పట్ల ఉండే నిర్లక్ష్య వైఖరిని సూక్ష్మంగా విమర్శిస్తుందీ నవల. దొంగలు ఎలా ఉంటారని పోలీసాయనను బాలాజీ అడుగుతాడు. “సినిమాల్లో చూపించినట్లు గళ్ళ లుంగీ కట్టి, పెద్ద మీసాలు పెట్టుకుని ఎర్రటి కళ్ళతో, బొడ్లో కత్తితో ఉంటారా?” అని అడుగుతాడు. దీనికి పోలీసాయన, “నిజ జీవితంలో దొంగలు కూడా మామూలుగానే ఉంటారు. మనలోనే ఉంటారు.. మనలాగే ఉంటారు” అని చెప్పడం, దొంగల గురించి సమాజంలో ఉన్న మూస ఆలోచనలని తుడిచేస్తుంది. ఈ సంభాషణ ద్వారా రచయితకి సమాజంపై ఉన్న లోతైన అవగాహన స్పష్టమౌతుంది. కథలో రామయ్య తాత వంటి పెద్దలు పిల్లలకు ఇచ్చే సలహాలు, హితబోధలు కూడా గమనార్హం.

“మేము పెద్దోళ్ళ మాటలు వినక, ఇలా బండి లాగే బతుకు బతుకుతున్నాము. మీరలా కాకండి” అంటాడు రామయ్య తాత. అనుభవం నుండి వచ్చే జ్ఞానం విలువని, సమాజంలోని కొన్ని లోపాలను కూడా సున్నితంగా ఎత్తిచూపుతుందీ నవల.

స్నేహం, పరస్పర సహాయం

ఈ నవలలో స్నేహం, పరస్పర సహాయం ప్రధాన ఇతివృత్తాలు. కథలోని పిల్లల బృందం ఒకరికొకరు తోడుగా ఉంటూ, కష్టాల్లో ఒకరినొకరు ఓదార్చుకుంటూ, విజయాన్ని కలిసి జరుపుకుంటూ స్నేహానికి నిజమైన నిర్వచనం చెబుతారు. వారి స్నేహ బంధం ఈ కథకు గుండెకాయ లాంటిది.

మునికిష్టడికి తన కోడి మాణిక్యం కనిపించనప్పుడు, అతను తన స్నేహితులైన బాలాజీ, కుచేలుడు, శంకరుడు, చంద్రడుల సహాయం కోరతాడు. వారు ఒక్క మాటలో ఒప్పుకుని, అతనికి అండగా నిలుస్తారు. బాలాజీ “నీ మాణిక్యం ఈ భూలోకంలో ఎక్కడున్నా పట్టించే బాధ్యత నాది!!” అని ధైర్యం చెప్పి, మునికిష్టడి చేయి పట్టుకుంటాడు. వారు ఊరంతా గాలిస్తూ, ప్రతి మూలన వెతుకుతూ, మాణిక్యం కోసం కష్టపడతారు. వారి ప్రయాణంలో ఎదురైన ప్రతి కష్టంలోనూ స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. బాలాజీ కాలికి జలగ పట్టుకున్నప్పుడు, చంద్రడు తెలివిగా ఉప్పుతో దాన్ని తొలగిస్తాడు. శంకరుడు తన తమ్ముడు సుందరం చేసిన తప్పును తెలుసుకున్నప్పుడు, స్నేహితులిద్దరూ అతనికి ధైర్యం చెప్పి, పాఠశాలకు వెళ్లి క్షమాపణ చెప్పమని సలహా ఇస్తారు. అలాగే, శ్యామల తేనె వల్ల వెంట్రుకలు తెల్లబడతాయని భయపడినప్పుడు, మునికిష్టడు ఆమెకు ధైర్యం చెప్పి, అది కేవలం ఒక అపోహ అని వివరిస్తాడు. ఈ సంఘటనలన్నీ వారి స్నేహాన్నీ, పరస్పర సహకారాన్నీ చిత్రిస్తాయి.

మాణిక్యం చివరికి దొరికినప్పుడు, వారి సంతోషానికి హద్దులు ఉండవు. ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేసి, ‘హిప్ హిప్ హుర్రే’ అని అరుస్తారు. మాణిక్యం దొరికిన తర్వాత, ఊరివారంతా చప్పట్లు కొట్టి, ఈలలు వేసి వారి విజయాన్ని అభినందిస్తారు. మునికిష్టడు తన కోడిని తలమీద పెట్టుకుని రాజకుమారుడిలా నడుస్తుంటే, అతని స్నేహితులు అతని వెనుక నడుస్తారు.

వ్యక్తిగత ఎదుగుదల, జీవిత పాఠాలు

‘మునికిష్టడి మాణిక్యం’ నవలలో పిల్లల ప్రయాణం కేవలం కోడిని వెతకడం మాత్రమే కాదు, అది వ్యక్తిగత ఎదుగుదల, జీవిత పాఠాలను నేర్చుకునే ఒక ప్రయాణం. కథలో పిల్లలు, పెద్దల సంభాషణల ద్వారా, ప్రతి పాత్ర తమకంటూ ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్చుకుంటుంది. మాణిక్యం ఇంటి నుండి అలిగిపోవడానికి కారణం తనే అని మునికిష్టడు చివరికి తెలుసుకుంటాడు. ఒక రాత్రి నిద్రలో ఉన్నప్పుడు, తన దుప్పటిపైకి వచ్చిన మాణిక్యంను విసురుగా తోసివేయడం వల్ల అది కోపం తెచ్చుకుందని గ్రహిస్తాడు. ఈ సంఘటన తర్వాత, అతను తన పెంపుడు జంతువు పట్ల సున్నితంగా ఉండటం నేర్చుకుంటాడు. అలాగే, తన చొక్కా బావిలో పడిపోయినప్పుడు ఇంట్లోవాళ్ళకి తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని తర్వాత ఒప్పుకుంటాడు. మంచి జరిగినా, చెడ్డ జరిగినా ఇంట్లోవాళ్ళకి చెప్పడం మంచిదని అతని తల్లిదండ్రులు హితబోధ చేస్తారు. ఈ సంఘటనల ద్వారా మునికిష్టడు నిజాయితీ, సున్నితత్వం విలువను తెలుసుకుంటాడు.

కుచేలుడు మొదట్లో జాతీయ గీతాన్ని బట్టి పట్టి, డ్రిల్ మాస్టర్ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ, జాతీయ గీతం పట్ల గౌరవం, దాని ప్రాముఖ్యతను తర్వాత అర్థం చేసుకుంటాడు. శంకరుడు సైన్స్ సూత్రాలు కనుక్కోవాలనే తన కోరికతోపాటు, బతుకుతెరువు కోసం కష్టపడే రంగనాథ్ వంటి వారి జీవితం గురించి తెలుసుకుంటాడు. చంద్రడు ‘బీట్‌రూట్’ కూర ‘రక్తపు అన్నం’లా ఉందని భయపడినా, అది ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్న తర్వాత ఆ భయాన్ని అధిగమిస్తాడు. శ్యామల తేనె తలకి పూసుకున్న తర్వాత, జుట్టు తెల్లబడుతుందని తన స్నేహితులు భయపెడితే భయపడుతుంది. కానీ, మునికిష్టడు సైన్స్ ఆధారంగా ఆమె భయాన్ని పోగొడతాడు. ఈ సంఘటన ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. అలాగే, కోడిని వెతకడానికి వెళ్లినప్పుడు, ఆమె బృందంలో చేరడం ద్వారా, తాను నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఆమెకు మాత్రమే రైలు ప్రయాణికులు టాటా చెప్పడం, ఆమె ప్రత్యేకతను సూచిస్తుంది. కథలోని పెద్దలు పిల్లలకు జ్ఞానాన్ని పంచుతారు.

రామయ్య తాత అరటి చెట్టు ఉపయోగాన్ని వివరించి, ప్రతి ఒక్కరూ సమాజానికి ఎలా ఉపయోగపడాలో తెలియజేస్తాడు.

శకుంతలక్క మనసులో చెడు ఆలోచనలు పెట్టుకుంటే మంచి కూడా చేదుగా అనిపిస్తుందని చెప్పి, సానుకూల దృక్పథం విలువను వివరిస్తుంది. ఈ విధంగా, ఈ నవలలోని ప్రతి పాత్ర, ముఖ్యంగా పిల్లలు, తమ ప్రయాణంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ, మరింత పరిణతి చెందిన వ్యక్తులుగా మారతారు.

చదువు విలువ

‘మునికిష్టడి మాణిక్యం’ నవలలో విద్య, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అన్యాపదేశంగా చెబుతాడు రచయిత. కథలో విద్యను కేవలం పాఠశాలల్లోనే కాకుండా, జీవితంలోని అనుభవాల ద్వారా, పెద్దల మాటల ద్వారా కూడా నేర్చుకోవచ్చని చూపించారు. ఈ నవలలో విద్య రెండు రకాలుగా కనిపిస్తుంది. మొదటిది పుస్తకాల ద్వారా వచ్చే విద్య. శంకరుడు న్యూటన్‌లా ఒక కొత్త సూత్రాన్ని కనుక్కోవాలనుకోవడం, కుచేలుడు జాతీయ గీతం బట్టి పట్టడం ఇందుకు ఉదాహరణలు. అయితే, దీనికి విరుద్ధంగా అనుభవపూర్వక జ్ఞానం కూడా ఎంత ముఖ్యమో చూపించారు. రామయ్య తాత చెరుకును కాళ్ళతో విరచగలగడం, ఉప్పుతో జలగను తొలగించడం, ‘అత్తిపత్తి’ మొక్క రక్షణ విధానం వంటి విషయాలు, జీవిత అనుభవాల ద్వారా వచ్చే జ్ఞానానికి నిదర్శనం.

వార్తాపత్రికలు చదవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతారు రిటైర్డ్ తెలుగు టీచర్. ప్రపంచంలో జరిగే విషయాలన్నీ పత్రికల్లోనే ఉంటాయని, ఈ తరం పిల్లలు వాటిని చదవడం లేదని బాధపడతారు. చదువుకు మించిన ఆస్తి లేదని, అది చివరివరకు తోడు ఉంటుందని రామయ్య తాత పిల్లలకు చెబుతాడు. అలాగే, అరటి చెట్టు ఉపయోగాన్ని వివరించి, ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడాలని హితబోధ చేస్తాడు. పిల్లల భవిష్యత్ ఆశయాలు, వారు పొందే విద్యకు సంబంధించి ఉంటాయని కూడా బోధపరుస్తుందీ రచన. మునికిష్టడు టీచర్ కావాలనుకుంటాడు, చంద్రడు బిర్యానీ సెంటర్ పెట్టాలనుకుంటాడు, శ్యామల పోలీస్ కావాలనుకుంటుంది. ఈ ఆశయాలు వారి చదువు, జీవిత అనుభవాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నవే. ఈ నవలలో విద్య అంటే కేవలం మార్కులు, డిగ్రీలు మాత్రమే కాదని, అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంలో గౌరవంగా బతకడానికి అవసరమైన ఒక సాధనమని చూపించారు.

సాంప్రదాయ- ఆధునిక వైద్యం

సాంప్రదాయ, ఆధునిక వైద్య విధానాల మధ్య ఉన్న తేడాలు, వాటిని చూసే విధానాలు ఆసక్తికరంగా చిత్రీకరించబడ్డాయి ఈ నవలలో. ఈ రెండు విధానాలు వేర్వేరుగా కనిపించినా, వాటి లక్ష్యం మాత్రం ఒకటేనని కథ తెలియజేస్తుంది.

ఈశ్వరాపురం గ్రామం పుత్తూరు కట్టు అనే సాంప్రదాయ ఎముకల వైద్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ వైద్యం 1922 నుంచి ఒకే కుటుంబం చేత కొనసాగుతోంది. ఈ విధానంలో, వైద్యులు ఎక్స్-రే తీయరు, మత్తుమందు ఇవ్వరు. కేవలం చేతి వేళ్ళతో తాకి ఎముక విరిగిందా, తొలగిందా అని తెలుసుకుంటారు. ఈ చికిత్సకు ఆకు పసరు, కోడి గుడ్డు తెల్లసొన, వెదురు దెబ్బలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా ప్రకృతి ఆధారిత వైద్యం, దీనిని ఎన్టీ రామారావు, కృష్ణంరాజు వంటి ప్రముఖులు కూడా పొందారు. పుత్తూరు కట్టుకు భిన్నంగా, కథలో ఆధునిక వైద్య విధానాల ప్రస్తావన కూడా ఉంది. బాలాజీకి రక్తం తక్కువగా ఉందని, రోజుకో కోడి గుడ్డు, గ్లాసు పాలు, రెండు అరటిపండ్లు తినమని సలహా ఇస్తాడు డాక్టర్.

నవలలో కొన్ని వైద్య సంబంధిత నమ్మకాలు హాస్యస్ఫోరకంగా ఉంటాయి.

జలగల వైద్యం: బాలాజీకి జలగ కరుచుకున్నప్పుడు, శంకరుడు జలగలు చెడ్డ రక్తాన్ని తీసేస్తాయని, ఇది చర్మ వ్యాధులు, రక్త ప్రసరణ జబ్బులకు ఉపయోగపడుతుందని చెబుతాడు. కానీ బాలాజీ, తన రక్తం తక్కువగా ఉందని, దానివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడతాడు.

బెండకాయల నమ్మకం: బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ శంకరుడు, “తినే తిండి పని చేయాలి కదా” అని వెటకారం చేస్తాడు. ఈ నవల, సాంప్రదాయ, ఆధునిక వైద్య పద్ధతుల మధ్య ఉన్న తేడాలను చూపడంతోపాటు, పల్లె ప్రజల ఆరోగ్య సంబంధిత నమ్మకాలను కూడా స్పృశిస్తుంది.

పిల్లల ఆశయాలు, పెద్దల వాస్తవాలు

ఈ నవల పిల్లల అమాయకమైన ఆశయాలను, పెద్దలు ఎదుర్కొనే కఠిన వాస్తవాలను పోల్చి చూపిస్తుంది. పిల్లల కలలు చాలా సరళంగా, వారి వ్యక్తిగత కోరికల చుట్టూ తిరుగుతాయి. అయితే, రామయ్య తాత వంటి పెద్దలు తమ జీవిత అనుభవాల ఆధారంగా వారికి భవిష్యత్తు గురించి ముఖ్యమైన పాఠాలను నేర్పుతారు. కథలోని పిల్లలు తమ వృత్తులను ఎన్నుకోవడానికి చాలా అమాయకమైన కారణాలు చెబుతారు.

ఈ ఆశయాలన్నీ వారి చిన్ని బుర్రలో ఆలోచనలయితే, ఇక పెద్దవాళ్లు చెప్పే వాస్తవాలు, చేసే హితబోధ వేరేలా ఉంటాయి. పిల్లల అమాయకమైన ఆశయాలకు భిన్నంగా, రామయ్య తాత వంటి పెద్దలు వాస్తవాలను చూపిస్తారు. తన ఒంటెద్దు బండిని లాగుతూ కష్టపడే జీవితం గురించి వారికి వివరిస్తాడు. తాను పెద్దల మాటలు విననందువల్లే ఇలాంటి జీవితం గడుపుతున్నానని చెప్పి, పిల్లలను ఉన్నత విద్య చదవమని సలహా ఇస్తాడు. “చదువుకు మించిన ఆస్తి లేదు.. మన చివరిదాకా వచ్చేది మన చదువే” అని చెప్పి, విద్య యొక్క శాశ్వత విలువను తెలియజేస్తాడు. అలాగే, సమాజానికి ఉపయోగపడాల్సిన అవసరాన్ని అరటి చెట్టు ఉపమానంతో వివరిస్తాడు. అరటి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుందని, అలాగే మనిషి కూడా ఈ సమాజానికి ఉపయోగపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందంటాడు.

సార్వత్రిక సందేశం.. విశ్వజనీన భావం

‘మునికిష్టడి మాణిక్యం’ నవల సార్వత్రిక సందేశాన్ని, విశ్వజనీనభావాన్నీ ఇముడ్చుకుంది. రామయ్య తాత చెప్పే పొడుపు కథ- ‘ఒకే సీసాలో రెండు రకాల నూనెలు’; దానికి సమాధానం ‘గుడ్డు’! ఇది ప్రపంచాన్ని ఈశ్వరాపురంతో ముడేస్తుందంటే అతిశయోక్తి కాదు.

‘పెద్దది, కాని దానికి తలుపుల్లేవు’

‘గుండ్రంగా ఉందికానీ నోరులేదు’

‘పెద్ద బాన, కానీ మూతలేదు’

– ప్రపంచ పొడుపుకథల సాహిత్యంలో పై పొడుపుకథలన్నిటికీ ఒకటే జవాబు. ‘గుడ్డు’!

‘మునికిష్టడి మాణిక్యం’లో ‘గుడ్డు’ పొడుపుకథ – వాటన్నింటికీ మరో చేర్పు. పొడుపుకథని ‘Riddle’ అనవచ్చు. అది కథాచరిత్రలో క్రీస్తుపూర్వం 5000 ఏళ్లనాటిది.

“Good riddles are, for the most part, capable of furnishing good metaphors; for metaphors imply riddles, and therefore a good riddle can furnish a good metaphor..” అంటాడు అరిస్టాటిల్ తన Rhetoric Book II లో. అలా రామయ్య తాత చెప్పిన పొడుపుకథ నుంచి కూడా మనకొక చక్కటి రూపకాలంకారం లభించిందని చెప్పవచ్చు.

Poetics Chapter 22 నుంచి అదే Aristotle ఇలా అంటాడు: “But the greatest thing by far is to be a master of metaphor; it is the one thing that cannot be learnt from others, and it is also a sign of genius. [..] For a whole statement in metaphor is a riddle.” అంటే, మొత్తం వాక్యమంతా కూడా రూపకాలంకారాలమయమైతే అదొక ప్రహేళికగా మారిపోతుందని అన్నాడు.

ఎక్కడైతే పొడుపుకథలో వర్ణనాత్మక అంశాలు ఒకదానికొకటి వ్యతిరేకించుకోవో వాటిని non-oppositional riddles అనీ, వ్యతిరేకించుకునే వాటిని oppositional riddles అనీ నిర్వచించారు పరిశోధకులు. వర్ణనాత్మక అంశాలు ఒకదానినొకటి వ్యతిరేకించుకోని పొడుపుకథలు వాచ్యంగానూ ఉండవచ్చు, ఆలంకారికంగానూ ఉండవచ్చు. ఉదాహరణకి ‘నదిలో బతికేదేది, (చేప)’ అనే పొడుపుకథలో ఇతివృత్తమూ, ఇతివృత్తం సంకేతపరుస్తున్న అంశమూ కూడా చేపనే. ఇది వాచ్యంగా ఉండే పొడుపుకథ. అలా కాక, ‘ఎర్రటి కొండమీద రెండుబారుల గుర్రాలు, (దంతాలు)’ అనే పొడుపుకథలో ఇతివృత్తం గుర్రాలు కాని, జవాబు దంతాలు. పరస్పరం వ్యతిరేకించుకోని వర్ణనాత్మక అంశాలతో కూడుకొనే పొడుపుకథలో ఇది ఆలంకారిక ఉదాహరణ. ‘అన్నదమ్ము లిద్దరూ రోజంతా పక్కపక్కనే, రాత్రి కాగానే నిద్రపోతారు, (చెప్పుల జత)’ మరొక ఉదాహరణ. ‘మునికిష్టడి మాణిక్యం’ నవలలో పొడుపు కథ సమాధానం ‘గుడ్డు’కి, వర్ణనలోని ‘ఒకేసీసాలో రెండు రకాల నూనెలకీ’ సంబంధం లేదు. కాబట్టి, అదొక oppositional riddle.

అంతేకాకుండా, ‘మునికిష్టడి మాణిక్యం’ అనే స్వతంత్ర రచన – ప్రపంచ సాహిత్యంలో, సినిమా ప్రపంచంలో అనేక సీమాసమయసందర్భాలలో ఉదంతాలను గుర్తుకుతేవడం ద్వారా సార్వజనీనతని ప్రతిఫలిస్తుంది.

Ezra Jack Keats అనే అమెరికన్ రచయిత 1960లో రచించిన ‘My Dog is Lost!’ అక్కడ బాలసాహిత్యంలో ప్రసిద్ధమైనది. Puerto Rica (స్పానిష్ అక్కడి భాష) నుంచి న్యూయార్క్ నగరానికి వచ్చిన Juanito అనే కుర్రవాడు తన కుక్క, Pepito ను పోగొట్టుకుంటాడు. అతనికి భాష తెలియక ఇబ్బంది పడతాడు. మునికిష్టడు మాదిరిగానే, జువానిలో కూడా తన కుక్కను వెతకడానికి స్నేహితులు, అపరిచితుల సహాయం తీసుకుంటాడు. ఈ కథలో పెద్దల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ (మునికిష్టడి తల్లిలాగే జువానిటో తల్లిదండ్రులు కూడా వెదుకులాటలో ఉండరు), చివరికి కుక్కను కనుక్కోవడంతో పిల్లలిద్దరూ సంతోషిస్తారు. ఈ రెండు కథలూ పెంపుడు జంతువులకు ఉండే ప్రాముఖ్యతను చూపిస్తాయి. ‘మునికిష్టడి మాణిక్యం’ గ్రామీణ తెలుగు సంప్రదాయాలు, సమాజ బంధాలను ఒక వేడుకలా చూపిస్తే, Keats నవలలో వలస వచ్చిన వారి ఒంటరితనం చిత్రితమౌతుంది. ఈ రెండు కథలూ తప్పిపోయిన పెంపుడు జంతువులు ద్వారా విశ్వజనీనతని చాటతాయి.

Paul Brett Johnson- Celeste Lewis సంయుక్తంగా వెలువరిచిన “Lost” అనే రచనలో ఒక అమ్మాయికి చెందిన ‘బీగల్’ జాతి కుక్క అరిజోనా ఎడారిలోకి తప్పిపోతుంది. ఒకవైపు ఆ అమ్మాయి తన కుక్క కోసం వెతుకుతుంటే, మరోవైపు ఆ కుక్క ఎడారిలో ప్రాణాలతో ఉండటానికి పడే కష్టాలను చూపిస్తారు. ఈ కథ, మునికిష్టడు తన కోడిని వెతకడానికి పడ్డ కష్టాల మాదిరిగానే ఉంటుంది. ఈ అమ్మాయి తన కుక్క కోసం గ్రామంలోని స్థానిక ప్రజలు, అధికారులను కలుస్తుంది. ఆ క్రమంలో సరదాగా, కొన్నిసార్లు ఆందోళనగా ఉండే సంఘటనలు ఎదుర్కొంటుంది. హాస్పిటల్ వద్ద పడేసిన వస్తువుల మధ్య మాణిక్యం దొరకడం, అలాగే ఆ కుక్క అడవి జంతువుల నుండి తనను తాను కాపాడుకోవడం వంటి సారూప్యాలు ఉంటాయి. మునికిష్టడి మాదిరిగానే, ఈ కథలోని పిల్లలు కూడా ఎదురైన కష్టాల నుండి జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ఎడారిలో ఎదురయ్యే ప్రమాదాల గురించి జాన్సన్ కథలో చూపిస్తే, తెలుగు కథలో సామాజిక సామరస్యం, ఆశయాల గురించి వివరిస్తారు కృష్ణస్వామి రాజు. ఎడారి నేపథ్యం, ఈశ్వరపురం గ్రామంలోని వైద్యశాల నేపథ్యంలాగే, గాయం నుండి కోలుకోవడం, తిరిగి కలవడం అనే అంశాలను తడుముతుంది.

Jacqueline K. Rayner రచించిన “Lost Cat!” అనే కథలో, ఒక చిన్న అమ్మాయి తన పెంపుడు పిల్లి Fred తప్పిపోవడంతో ఆందోళన పడుతుంది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి తన పిల్లి కోసం వెతుకుతుంది. ఈ సమయంలో, తను పలు కల్పిత భయాలను ఊహించుకుంటుంది. ఈ కథ, మునికిష్టడు తన స్నేహితుల సహాయం తీసుకున్నట్లుగానే, ఆ అమ్మాయి కూడా తన పొరుగువారి సహాయం తీసుకుంటుంది. ఈ కథలో ఆందోళన, హాస్యం కలగలిపి ఉంటాయి. ఇక్కడ, రెండు కథల్లోనూ ముఖ్యపాత్రలకి తమ పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధమే ఇతివృత్తం. ఈ రెండు కథలూ ఆందోళన నుండి ఉపశమనం వరకు సాగుతాయి, మునికిష్టడి కథలో గ్రామం మొత్తం జరుపుకునే వేడుకలాగే ‘Lost Cat’ రచనలో కూడా సంతోషం ఉంటుంది. అయితే, Rayner కథలో మైక్రోచిప్పింగ్ వంటి ఆధునిక పెంపుడు జంతువుల సంరక్షణపై దృష్టి ఉంటుంది. ఈ పోలిక ద్వారా కథలు ఎలా మారుతున్నాయో తెలుస్తుంది: తెలుగు కథ సాంస్కృతిక సంప్రదాయాలు, సమాజ బంధాలపై ఆధారపడి ఉంటుంది, కానీ Rayner కథ ప్రకృతి నుండి పట్టణ జీవితం ఎలా దూరమైందో విమర్శిస్తుంది.

ఇటీవల 2023 లో వచ్చిన “Dog Gone” అనే అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ చిత్రం ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఒక యువకుడు, అతని తండ్రి, తప్పిపోయిన తమ కుక్క Gonker కోసం Appalachian Trail గుండా నడుస్తారు. ఆ కుక్కకు ఒక ఆరోగ్య సమస్య కూడా ఉంటుంది. మునికిష్టడు తన స్నేహితులతో కలిసి వెతికినట్లుగానే, ఈ ఇద్దరూ కూడా శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు, దారిలో చాలామందిని కలుస్తారు. ఇది ఈశ్వరపురం గ్రామంలోని దారుల ప్రయాణం మాదిరిగానే ఉంటుందీ సినిమా కథనం. చివరికి, వారు కుక్కను కలుసుకోవడం కథ సుఖాంతమై, మాణిక్యం కథలోని గ్రామ ప్రజల సంబరాల్ని గుర్తుతెస్తుంది. రెండు కథల్లోనూ పెంపుడు జంతువు దాని యజమాని వ్యక్తిగత ఎదుగుదలకు, పరిణతికి కారణమవుతుంది. అయితే, “Dog Gone” కథలో కుక్కకున్న అనారోగ్య సమస్య కారణంగా అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఈ సినిమా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల మధ్య సంబంధాలను చూపిస్తుంది. మునికిష్టడి కథ బాలల అమాయకత్వాన్ని చూపిస్తే, ఈ సినిమా రెండు తరాల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.

“Homeward Bound: The Incredible Journey” అనే 1993 నాటి అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ చిత్రంలో మూడు పెంపుడు జంతువులు – ఒక బుల్ డాగ్, ఒక పిల్లి, ఒక గోల్డెన్ రిట్రీవర్ – తమ కుటుంబంతో తిరిగి కలవడానికి అడవిలో ప్రయాణిస్తాయి. మాణిక్యం కథలో మనుషులు కోడిని వెతికినట్లు కాకుండా, ఇందులో జంతువులే తమ ప్రయాణాన్ని సాగిస్తాయి. అడవిలో వాటికి ఎదురైన అనుభవాలు, పడే కష్టాలు మునికిష్టడి స్నేహితులు గ్రామంలో ఎదుర్కొన్న సంఘటనల మాదిరిగానే ఉంటాయి. Sierra Nevada అడవి నేపథ్యం ఈశ్వరపురం గ్రామాన్ని, అక్కడి దేవాలయాలను పోలి ఉంటుంది, ఇది ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా సూచిస్తుంది. ఈ చిత్రంలో జంతువులు మాట్లాడతాయి, ఇది హాస్యాన్ని పెంచుతుంది. అయితే, రెండు కథల్లోనూ జంతువులకు, మనుషులకు మధ్య ఉన్న బంధం, సమస్యలను ఎదుర్కొని నిలబడటం వంటి అంశాలు ఉంటాయి. ఇది తెలుగు కథలో మానవ సమాజానికి ఇచ్చిన ప్రాముఖ్యతకు భిన్నంగా, జంతువుల మనుగడపై దృష్టి పెడుతుంది.

మరో సినిమాని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవల్సి ఉంటుంది. అది “A Dog’s Way Home” (2019, అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ చిత్రం). ఈ చిత్రంలో బెల్లా అనే ‘పిట్ బుల్ మిక్స్’ కుక్క తన యజమాని నుండి విడిపోయి 400 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఆ కుక్క పట్టణంలో, అడవిలో అనేక ప్రమాదాలను ఎదుర్కొంటుంది. అదే సమయంలో దాని యజమాని కూడా దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇది మాణిక్యం కథలోని అన్వేషణను పోలి ఉంటుంది. ఈ కథలో సహాయం చేసేవారు (బెల్లా యజమాని స్నేహితులు) ఉంటారు. ఈ రెండు కథల్లోనూ జీవన ప్రయాణం, విలువలు గురించి ఉంటాయి. ఈ చిత్రంలోని కొలరాడో పర్వతాలు ఈశ్వరపురం గ్రామాన్ని, అక్కడి ప్రకృతిని గుర్తు చేస్తాయి. రెండు కథల్లోనూ ప్రతి ప్రాణానికీ విలువ ఉంటుందని చూపిస్తారు. అయితే, ఈ చిత్రం జాతి కుక్కల గురించి ఉండే మూస ధోరణులను విమర్శిస్తుంది, దీనికి ఒక సామాజిక విమర్శ కోణాన్ని జోడిస్తుంది. తెలుగు కథలో పిల్లల బృందం ఉంటే, ఈ సినిమాలో ఒక కుక్క ఒంటరిగా ప్రయాణిస్తుంది. అయినప్పటికీ, రెండు కథలూ happy ending తో ముగుస్తాయి, ఇది విడిపోయిన ప్రపంచంలో అనుబంధం కోసం చేసే అన్వేషణ.

‘మునికిష్టడి మాణిక్యం’ నవల ఆధునిక జానపద కథలాగా ఉంటుంది, ఇందులో మునికిష్టడి ప్రయాణం, సహాయం చేసేవారు, గ్రామ సంఘటనలు పురాణ కథల్ని గుర్తుచేస్తాయి. ఈ కథలోని “పారిపోయిన వస్తువును వెతకడం” అనే ముఖ్యమైన అంశం (మోటిఫ్) ప్రపంచ సాహిత్యం మరియు పురాణాలలో కూడా తరచుగా కనిపిస్తుంది. పురాణాలు, జానపద కథల్లో జంతువుల కోసం చేసే అన్వేషణలు చాలా ఉంటాయి. అవి సాధారణంగా పవిత్రమైనవిగా, ప్రతీకాత్మకమైనవి, చేజారి పోయిన అమాయకత్వాన్ని, అందే సహాయంలో దైవికాన్ని, నైతికతని చిత్రించేవిగా ఉంటాయి.

ఒక చిన్న పిల్లవాడు తన కోడిని వెతుకుతున్న సాధారణ ప్రయాణాన్ని చిత్రిస్తుంది. ఇక్కడ కొన్ని పురాణ కథలతో పోలికలు మరియు వాటి సారాంశం ఉన్నాయి.

రష్యన్ పురాణంలో అగ్నిపక్షి – “The Tale of Ivan Tsarevich, the Firebird, and the Gray Wolf”. ఇవాన్ త్సారేవిచ్ అనే రాకుమారుడు, రాజ్యంలోని బంగారు ఆపిల్స్ దొంగతనం చేసే అద్భుతమైన అగ్నిపక్షిని పట్టడానికి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక గ్రే వుల్ఫ్ సహాయంగా వస్తుంది. అతను అనేక అడ్డంకులు, మాయాజాలాలు, ఇతర రాజులను ఎదుర్కొంటాడు. మునికిష్టుడు వెతుకుతున్నది ఒక సాధారణ కోడి, అయితే ఇవాన్ వెతుకుతున్నది ఒక అద్భుత పక్షి. రెండు కథలలోనూ ఒక పక్షి వెతుకుడు, సహచరుల సహాయం, మరియు ప్రయాణంలో జరిగే ఎదురుదెబ్బలు ఉమ్మడి అంశాలు. రష్యన్ పురాణం మాయా, రాజకీయాలు, అమరత్వం వంటి విశ్వవ్యాప్తమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మాణిక్యం కోసం వెతుకుడు ఒక గ్రామీణ, నిజజీవిత ప్రపంచంలోని వ్యక్తిగత బంధం కేంద్రకంగా ఉంటుంది.

‘Jason and the Golden Fleece’ అనే గ్రీక్ పురాణగాథలో జేసన్ అనే వీరుడు, రాజసింహాసనానికి అర్హత సాధించడానికి, ఒక అద్భుతమైన గొర్రెపిల్ల యొక్క బంగారు తోలును (Golden Fleece) తీసుకురావడానికి అర్గోనాట్స్ అనే సహచరులతో ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో అతను రాక్షసులు, మాయా ద్వీపాలు, మరియు దేవతల సవాళ్లను ఎదుర్కొంటాడు. జేసన్ – మునికిష్టుడు లాగా స్నేహితుల బృందంతో (అర్గోనాట్స్/బాలాజి, కుచేలుడు) వెతుకులాట ప్రారంభిస్తాడు. గోల్డెన్ ప్లీస్ మాణిక్యం రెండూ ‘సంపద’ కు చిహ్నాలు. జేసన్ కథ ఒక రాజకీయ, మతపరమైన లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భవ్యమైన, ఇంకా అతిమానుష ఘటనలతో నిండి ఉంటుంది. మాణిక్యం కథ ఒక వ్యక్తిగత, భావపూర్వకమైన నష్టాన్ని పునరుద్దరించడం గురించి.

ఈ పురాణ కథలు మరియు మునికిష్టడి మణిక్యం కథ మధ్య ఉన్న నేరుగా పోలికలు (direct parallels) చాలా తక్కువ. ప్రతి కథ పరిధి, లక్ష్యం, సందర్భం, ఇంకా సాంస్కృతిక నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అయితే, ఈ అన్ని కథలలోనూ “ఒక ప్రాధాన్యమైన వస్తువు/ ప్రాణిని వెతుకడం” అనే ముఖ్యమైన కథాంశం (మోటిఫ్) ఉమ్మడిగా ఉంది. ఈ వెతుకుడు ప్రయాణమే కథకు మూలాధారం మరియు దాని ద్వారా పాత్రల వ్యక్తిత్వ వికాసం, సహకార భావం, కథాక్రమంలో ఎదురయ్యే జీవితపాఠాలు. సారాంశంగా, ఈ కథలన్నింటిలోనూ బాహ్యంగా కనిపించే సారూప్యతలు (resemblances) తక్కువగా ఉన్నప్పటికీ, వాటి అంతర్లీనమైన కథా వస్తువు (motif) ఒక్కటే.

కాబట్టి, ‘మునికిష్టడి మాణిక్యం’ నవల సార్వత్రికమైన కథా వస్తువుని తెలుగు గ్రామీణ వాస్తవికత, సామాన్య మనుషుల భావోద్వేగాలతో అల్లి, ఒక సునిశితమైన హృదయ సంస్పర్శమైన రచనగా మార్చింది.

***

మునికిష్టడి మాణిక్యం (బాలల నవల)
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
ప్రచురణ: తానా – మంచి పుస్తకం
పేజీలు: 80
వెల: ₹ 50
ప్రతులకు:
మంచి పుస్తకం
ఇంటి నెం. 12-13-439,
1వ వీధి, తార్నాక,
సికింద్రాబాదు- 500 017,
94907 46614
ఆన్‌లైన్‍లో:
https://manchipustakam.in/product/munikishtadi-manikyam/

Exit mobile version