[శ్రీమతి కె. వి. రాజలక్ష్మి గారి కన్నడ కథని అనువదించి ‘ముంగిట్లో వసంతం’ పేరుతో అందిస్తున్నారు చందకచర్ల రమేశ బాబు.]
“విడిదింట్లో సుస్మికి ఇవ్వాల్సిన వెండి గిన్నెలు, పట్టుబట్టలు, వాటితో పాటు బీరువాలో తన నగలు ఉన్నాయి. దేవతా సమారాధన రోజునుండి పూట పూటకూ మార్చుకుంటూనే ఉంటుంది. క్యాష్ బ్యాగ్ కూడా ఉంది. ఇప్పుడైతే ఆహ్వానితుల ముసుగులో నేరుగా రూములోకి వచ్చి ఎత్తుకు పోతారు అన్నది మనకందరికీ తెలుసు. అప్పుడప్పుడు టివిలో కూడా వస్తూ ఉంటుంది. అందరికీ పెళ్ళి ముచ్చట్లు చూడాలనే ఉంటుంది. ఎవరైనా ఒకరు ఖాయంగా ఇక్కడ కూర్చుని కాపలాగా ఉండడం మంచిది అని నా అభిప్రాయం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటావు చంద్రూ?” అత్తయ్య నా వైపు చూసింది.
“అమ్మ చెప్పేది సరిగ్గానే ఉంది కదా సుప్రీ? పెళ్ళి అంటే ఊరకే అవుతుందా? జీవితమంతా గంధంలా తీసి, కడుపు కాల్చుకుని ఇంతా చేసుంటాం. అజాగ్రత్త వలన ఒక్క క్షణంలో హుష్. కాకీ అయితే, మళ్ళీ అంతటినీ చేసుకోగలమా చెప్పు? కాలం బాగా చెడిపోయింది. రిస్కే వద్దు.” బావమరది శేఖర్ నా భార్య దృష్టిని తన వైపు తిప్పుకుంటూనే, వాళ్ళమ్మ పక్షం వహించాడు.
లాంచనంగా మా అమ్మాయి సుస్మిత పెళ్ళి పత్రిక ఇవ్వడానికి అత్తయ్యవాళ్ళింటికి ఇంటికి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వెలువడిన అభిప్రాయం ఇది. ఆమె చెప్పిన దాన్లో తప్పేమీ అనిపించలేదు. ఈ విషయంలో మా ఆవిడ ఏమీ మాట్లాడక పోయేసరికి నేను కూడా మౌనం వహించాను. అక్కడ్నుండి బాగా దగ్గరి బంధువులకు, మిత్రులకు కార్డులు ఇచ్చి ఇంటికి వచ్చే సరికి సాయంత్రం ఏడయ్యింది.
“అమ్మా! తల పగిలిపోతోంది. ఇప్పుడే కాల్ అయిపోయింది. ఒక కప్ స్ట్రాంగ్ కాఫి ప్లీజ్” ఇంటికి రాగానే కూతురు మొహం చిట్లించగానే, సర్రుమని కోపం వచ్చినా సర్దుకున్నాను. హాలులో దివాన్ పైన కూర్చున్న అక్కయ్య, నిస్సహాయ నవ్వును విసిరి లేచి వెళ్ళింది.
“ఒక నిమిషం ఆగు. డికాక్షన్ ఉంది. పాలు వేడి చేసి కలిపి ఇస్తాను.” సగం కోపంతోనే మా ఆవిడ గొణిగింది.
“రేపు ఒక ఎమర్జెన్సీ అయితే, కాఫి గీఫి అని, మీ అత్తవారింట్లో ఇలాగే అడిగితే బాగుండదు సుస్మి. కాఫీ చేసుకోవడం అంత కష్టమా? — నేను ఉద్యోగానికని ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక స్టవ్ పెట్టుకుని వంటకూడా చేసుకునేవాణ్ణి. అన్నం వండేస్తే ఏ పులిహారో, పెరుగన్నమో లేదా ఇంత ఆవకాయ కలుపుకునో తినడం – ఏదో ఒకటి జరిగేది. అంత వరకు హోటల్ ఖర్చు ఆదా కదా. మీ అమ్మను పెళ్ళి చేసుకున్నాక ఇల్లు తీసుకుంది. మీ అమ్మ నేర్పరి. ఉన్నంతలో సర్దుకుని పోయే స్వభావం. లేకపోతే ఊరి బయట ఉన్నా సరే, ఫర్వాలేదు అని సైటుకు డబ్బులు కట్టింది ఇలా బంగారంలా మారుతుంది అని అనుకోనే లేదు.”
“నాకు ఆ బాదరబందీ లేదు నాన్నా! సమర్థ్‌కు కూడా వెనకా ముందూ ఎవ్వరూ లేరు. సో, ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన లేదు. అదీ కాక మా అత్తగారు కూడా చాలా ఒద్దికస్తురాలు. ‘పెళ్ళయినాక కూడా నువ్వు నీ భర్త, ఉద్యోగం అనుకుని హాయిగా ఉండు’ అనేశారు. ఇంట్లో పనులకు పనిమనిషి ఉంది. వంటల్లో మామగారు అత్తగారికి చాలా సహాయ పడతారు” అంటూ తమాషాగా భుజాలు ఎగరవేస్తే, నన్ను వెక్కిరించి కెలికినట్లనిపించినా ఇది బదులివ్వడానికి సమయం కాదు అనిపించి ఊరుకున్నాను.
***
సుప్రీత రాత్రి వంటలో మునిగి ఉంటే, కూతురు మొబైల్లో మునిగిపోయింది. నేను దివాన్ పైన కూర్చుని ఆ రోజు పేపర్ ను మళ్ళీ తిరగేస్తున్నాను. చంచక్క రూములో.. పాపం, తన మూగవేదనను తలచుకుని మనసు మథనపడింది.
***
చెంచులక్ష్మి, నా మట్టుకు ఆమె చంచక్క. బంధుత్వంలో మాత్రమే ఆమె నాకు అక్క. లేకుంటే ఆమ నన్ను కనని అమ్మే! నాకూ, ఆమెకూ పధ్నాలుగు సంవత్సరాల తేడా. చంచక్క తర్వాత నీలకంఠ, నీలావతి, మధుమతి, భానుమతి, శ్రీకంఠ, తరువాత చివరిగా నేను. మొత్తం మేము ఏడుగురం. అమ్మ, నాన్న, మేం ఏడుగురు ఇంత మంది ఒక వరాండ, పెద్ద హాలు, ఒక రూము ఉన్న ఇంట్లో అద్దెకున్నాము. అప్పుడంతా అభిమానాలు ఉన్న కాలం. అద్దె ఒకట్రెండు రోజులు ఎక్కువ తక్కువ అయినా ఎవరూ మెడ పట్టుకుని గెంటేవారు కాదు. కొట్టు శెట్టిగారు, నెలవారీ సామగ్రి డబ్బులు పూర్తిగా కట్టకపోయినా, సరుకులు గొణగకుండా ఇచ్చేవారు. “మీరెక్కడికి పారిపోతారు? మీరు ఎక్కడికి వెళ్ళినా, మా కొట్టు సరుకులు మీ ఇంట్లో ఉండాలి” అంటూ మా ఋణభారాన్ని పెంచేవారు.
“నీ పేరు మాత్రం పాత పేరెందుకు అక్కా?” అని అమాయకంగా ఒక రోజు అడిగితే, “నువ్వొక్కడివే మిగిలిపోయావు చూడు ఈ ప్రశ్న అడగడానికి. నేను పుట్టింది నరసింహ జయంతి రోజట. అమ్మకు కానుపు చేసిన నర్సమ్మ కర్నూలు జిల్లా ఆమెట. అక్కడి అహోబిలం నరసింహ స్వామి ఉత్సవం గురించి వర్ణించి, సుఖ ప్రసవం కావాలని మొక్కుకుందట. ఆ రోజు రాత్రే నేను పుట్టింది. నర్సమ్మ సలహా మేరకు చెంచులక్ష్మి అనే పేరే పెట్టారు నాకు. కానీ చూశావా చంద్రూ? జీవితమంతా కష్టాలే అయ్యాయి” అని నిట్టూర్చింది.
ఆరోగ్యం బాగలేక అమ్మ మంచం పట్టి, చనిపోయినప్పుడు పెద్దన్నయ్య పెళ్ళి చేసుకుని వేరే ఊళ్ళో ఉన్నాడు. పెద్దక్కేమో రెండు నెలల బాలింత. అమ్మ క్రియా కర్మల తరువాత ఐదు నెలలు ఆమెను ఈ చంచక్కే చూసుకుంది కదా! ఇంటి అజమాయిషీ అంతా ఆమెదే. సంవత్సరం లోపే కన్యాదానం చేస్తే మంచిది అనే ఆలోచనలో చంచక్కను చూడడానికి వచ్చినవాళ్ళు మధు అక్కను చేసుకుంటాం అన్నప్పుడు ఆమెకు అదెంత పెద్ద దెబ్బ తగిలి ఉండవచ్చు! వయసు, యౌవనం అందరికీ సమానమే కదా! చెల్లెళ్ళను పోలిస్తే అంతగా అందంగా లేని చంచక్కకు మళ్ళీ ఇల్లు నిభాయించే బాధ్యత పడింది. మధు అక్క భర్త ఇంటి వైపు వాళ్ళు భాను అక్కను అడుగుతూ రావడం, అంతకంటే ఎక్కువగా “రెండు వైపుల ఖర్చులూ మేమే పెట్టుకుంటాం” అనడంతో అక్క మొహం అవమానంతో కుంగిపోతుంటే, భాను అక్క సిగ్గుతో తలవంచుకుంది.
పక్క ఊరికి ఉద్యోగానికని వెళ్ళిన శ్రీకంఠను అతడి సహోద్యోగి బంధుత్వం కలుపుకుందామని అడిగినప్పుడు కాదనడానికి కారణాలు కనబడలేదు. “ఇంకెన్ని రోజులని రూములో ఉంటూ హోటల్లో తింటాడు? అది వాడి ఆరోగ్యానిక్కూడా మంచిది కాదు. పైగా అమ్మాయి ఒక్కతే కూతురు. ఇల్లూ, వాకిలి అని తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా అత్త మామల బాధ్యత తప్పదు కదా” శ్యాము మామ, నాన్నను ఒప్పుకునేట్టుగా చేశారు. చివరికి ఇంట్లో మిగిలింది నాన్న, చంచక్క, నేను.
“నేను బ్రతికి ఉన్నప్పుడే చంచు పెళ్ళి అయితే అంతే చాలు. నాకు నిశ్చింతగా ఉంటుంది. నేనైతే ఇప్పటికే పాపప్రజ్ఞతో కుమిలిపోతున్నాను” అని నాన్నఒక రోజు చెప్పుకున్నారు. అంతలోకి అక్కలు, చెల్లెలు కడుపుతో ఉంటూ ఇంటికి రావడంతో వాళ్ళ కాన్పులు, పురుళ్ళు పుణ్యాలు అమ్మ స్థానంలో ఉండి చేసిన చంచక్క, ముప్పైఅయిదును దాటింది. అక్కకొక నెలవు చూపేదాకా నేనుపెళ్ళి చేసుకోకూడదని గట్టిగా ఉన్నాను.
ఇది తెలిసే అక్క తన వైవాహిక జీవితంలో రాజీ పడిందా? కాకుంటే మరేమిటి?
పిత్రార్జితంగా వచ్చిన, అక్కడక్కడ చెక్కలూడిపోయిన చిన్న ఇల్లు, మొదటి భార్యవల్ల ముగ్గురు పిల్లలు, ఇంతే కాకుండా కేవలం పది సంవత్సరాలు మాత్రమే సర్వీసు మిగిలి ఉన్ననాగేంద్ర బావను ఆమె ఒప్పుకుంది. అక్క పెళ్ళైన ఒకే నెలలో పెద్ద అమ్మాయి పెళ్ళి చేసింది.
రెండో అమ్మాయి ఎవరినో ఇష్టపడి పెళ్ళి చేసుకుని ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చున్న ఒక్కడే కొడుకు. వీళ్ళతో అదెలా గడిపేదో.. పాపం చంచక్క!
చిన్న ఆఫీసులో ఉద్యోగంలో ఉన్న నాకు సుప్రీతతో సంబంధం కుదిరి పెళ్ళైనాక మా మామగారి సిఫార్సుతో పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. వాళ్ళే ఇచ్చిన క్వార్టర్స్. అందులోకి మారాము. అప్పటిదాకా ఒక ప్రైవేట్ స్కూల్లో టెంపరరీ టీచర్ గా పనిచేస్తున్న సుప్రీత ఉద్యోగానికి రాజీనామా చేసింది. సుస్మిత పుట్టినాక పిల్లను చూసుకోవడానికి, వాళ్ళమ్మ లేనందున, గృహిణిగా మిగిలినా, దూరశిక్షణతో తనకిష్టమైన చరిత్ర విషయంతో ఎంఎ చేసింది సుప్రీత. మా ఇంటివాళ్ళతో సులభంగా సర్దుకుపోయినా, అంటీ ముట్టనట్టు ఉంటూ నాజూకుగా ఉండింది ఆమె.
అక్క కష్ట సుఖాలు విచారించుకోవడానికి నేనే నెలకోసారి వెళ్ళేవాణ్ణి. బావ రిటర్మెంట్ డబ్బులన్నీ పిల్లలు ఆపోశన పట్టేశారు. పించను లేకుండా, రిటైరైనాక కూడా ప్రైవేటులో పని చేసేవారు. చాలా డస్సిపోయి, మంచం పట్టినప్పుడు, ఇల్లు గడవడానికి అక్క పడ్డ కష్టాలు పగవాడిక్కూడా వద్దనిపించింది. అప్పుడు అక్కకు పక్క రోడ్డులో ఉంటున్న వృద్ధ దంపతులకు వండి పెట్టే పని దొరికినప్పుడు పెద్ద నిధి దొరికినంత ఆనందపడింది. అలా ఒక సంవత్సరం గడిచింది. బావ కూడా గతించినాకనే అక్కకు నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి.
వైకుంఠ సమారాధన తరువాత ఆమెను ఇంటికి వదలి రావడానికి నేనే జతగా వెళ్ళాను. ఇంటికి చేరగానే అక్క వెక్కెక్కి ఏడవసాగింది. “నాకు ఒక్కత్తినే ఉండాలంటే భయంగా ఉంది. పిల్లలకెవరికీ నేను అక్కర్లేదు. నువ్వే ఏమైనా ఏర్పాటు చెయ్యి.” అని బ్రతిమాలినప్పుడు కదలిపోయాను. “ఎలాగూ వంట చెయ్యడం వచ్చు. ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చినా అక్కడ కూడా ఇదే వంటపని చేస్తూ గడుపుతాను. ఎవరికీ బరువు కావడం ఇష్టం లేదు.” అంటూ కొంగుతో ముక్కు చీదినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళు చెమర్చాయి. ఆ క్షణంలోనే నిర్ణయించాను. అమ్మ స్థానంలో ఉన్న అక్కను వదలరాదని. “నీకు తప్పకుండా ఏదైనా ఏర్పాటు చేస్తాను. దానికంటే ముందుగా ఈ ఇంటినుండి నువ్వు ఏమేం తీసుకుని వెళ్ళాలో నిర్ణయించక్కా. నేను రేపు వస్తాను.” అని చెప్పి బయటికి వచ్చాను. అన్నలతో విషయం ప్రస్తావించాను. ఎవరినుండీ ప్రోత్సాహకర సమాధానాలైతే రాలేదు. ఇక అక్కలను అడగడం ఎందుకని మా ఇంటికే తనని తీసుకుని రావాలని తీర్మానించి, సుప్రీతకు విషయం చెప్పాను.
“ఇక పైన చంచత్త మనతో ఉంటుంది. అడ్జస్టవ్వాలి.” అని సుప్రీత కూతురికి తాకీదు చేసింది. ఇంజనీయరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న పాప, అసమాధానంగానే తల ఊపింది. మరుసటి రోజు అక్క ఇంటికి వెళ్ళి పిలిచాను. “ఏ జన్మలో నువ్వు నా కొడుకుగా ఉన్నావురా!” అంటూ సంతోషంతో వెక్కింది. తరువాత సర్దుకుంది. “ఈ ఇంట్లో నా గుడ్డలు, కాయితాలను మాత్రం తీసుకున్నాను. మిగిలిన సామాన్లను పిల్లలకే వదిలేశాను. ఆడపిల్లలతో మాట్లాడి చెప్పడమూ జరిగింది.” అంది.
“స్వార్థం అనుకోకు. ఈ ఇంటి కాయితాలు ఉన్నాయా?” అని అడిగాను.
“ఆ విషయం నాకు తెలియదు. ఈ ఇంటికి పక్కన, వెనుక ఉన్నవాళ్ళంతా దాయాదులే. ఎప్పుడు, ఎంతవరకూ భాగస్వామ్యం జరిగింది అనే విషయం నాకు తెలియదు. మా చిన్న మావయ్య గారు ఆయన కొడుకుతో ఉంటున్నారు. ఎవరితోనూ వ్యవహారాలు లేవు.” అన్నది.
సుస్మితా కాలేజికి వచ్చేసమయానికి ఇప్పుడున్న ఇల్లు కట్టించాము. రెవెన్యూ సైట్. అక్కడక్కడా ఇళ్ళు వచ్చాయి. రిస్క్ తీసుకుని రెండు రూముల ఇల్లు కట్టాము. మా కాలనికి ఐదు కిలోమిటర్ల దూరంలో ఇంజనీయరింగ్ కాలేజి వచ్చినాక మా జాగాకు వెల పెరిగింది.
చంచక్క వచ్చిన కొత్తలో అయిష్టంగానే తన రూము షేర్ చేసినా, తరువాత మూడు నాలు నెలల్లో మేడపైన ఒక చిన్న రూము కట్టించింది మా పాపకు నెమ్మది కలిగించింది. తన మేనత్తతో అంత ఆత్మీయంగా అయితే మసలుకునేది కాదు. నేను కూడా ఏం చెప్పలేదు. సుప్రీత మాత్రం అందరినీ బ్యాలన్స్ చేస్తూ పోయేది. నా మట్టుకు నాకు ఆమె నాకు దేవతలాంటిదే.
***
కాలింగ్ బెల్ మోత విని ఆలోచనల నుండి బయటికి వచ్చి తలుపు తీశాను. ఎదురుగా కాబోయే వియ్యంకుడు, ఆయనతో పాటు మరో పెద్దాయన. “రండి. లోపలికి రండి” అని ఆహ్వానించి “సుప్రీ”అని మా ఆవిణ్ణి పిలిచేసరికి, ఆమె వంటింటి నుండి నవ్వుతూ వచ్చి లోపలికి తీసుకువచ్చింది.
“ఈయన శశిశేఖర్ అని మా కుటుంబ మిత్రుడు. రేపు రాత్రి అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. పెళ్ళికి ఉండడం లేదు. ఎలాగూ ఈ వైపు వచ్చాము. మిమ్మల్ని కలిసి వెళదాం అని వచ్చాము.” అని వియ్యంకుడు అనగానే “ అయ్యో! దానికేముంది? మంచి పనే.” అన్నాను. “సుస్మిత పైనుంది. ఉండండి, పిలుస్తాను.” అంటూ ఆమెను కాల్ చేసి రమ్మన్నాను.
“కాలం ఎలా మారిపోయింది చూడండి. ఇంట్లోనే ఉన్నా పిలుపుకంటే మొబైలుకే విలువ జాస్తి” అంటూ మాట కలుపుతూ నవ్వు విసిరారు శశి శేఖర్ గారు. “వి హ్యావ్ టు ఆక్పెట్ ది బిట్టర్ రియాలిటీ. మా ఇంట్లోనూ అంతే. పక్క రూములో ఉన్నా మెసేజ్, వాట్సప్. ఇంతకీ ఇంట్లో ఎవరెవరున్నారు?” ఆయన ప్రశ్నకు బదులిచ్చేంతలో సుస్మిత వచ్చి “నమస్తే అంకుల్” అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది.
“మేము ముగ్గురం, మా అక్క.” అన్నాను. అంతలో సుప్రీత చంచక్కను హాల్లోకి తీసుకొచ్చింది.
అక్కను చూడగానే “మీరు భానుమతిగారి అక్కగారు కదా? నేను ఆవిడ చిన్నత్త కొడుకుని. పెళ్ళిలో చూసింది. వదినగారు మీ గురించి చెప్తూనే ఉండేవారు.” అంటూ శశి శేఖర్ ఆశ్చర్యపడుతూ అన్నారు.
“ఓహో! ఔనా? గుర్తులేదు. ఎక్కడో, అందరూ బాగుంటే అంతే చాలు.” చంచక్క ముక్తసరిగా మాట్లాడింది.
“మీ తమ్ముడి అమ్మాయి వీళ్ళింటికి వస్తోంది అంటే పుణ్యం అనుకోవాలి. ఎంత సంస్కారవంతులుగా ఇంటి వాళ్ళను చూసుకునేవారు అని భాను వదిన మాటల్లో విన్నాను నేను.” అంటూ ఆయన ఒకే ధాటీగా అంటూంటే అక్క కళ్ళలో సంతోషాశ్రువులు.
***
వాళ్ళు అలా వెళ్ళగానే సుస్మిత హఠాత్తుగా చంచక్కను హత్తుకుని “అయామ్ సారీ అత్తా” అంటూ గద్గదితురాలైంది. అది ఎందుకో అని అవాక్కయ్యే వంతు నాదయ్యింది. “ఏమయ్యింది సుస్మి? సారీ ఎందుకు?” అంటూ అక్క కూడా అంతే భావుకురాలై సుస్మిత తల నిమిరినప్పుడు “లేదత్తా. నేను మీకు సరిగ్గా గౌరవం ఇచ్చేదాన్నికాదు. మిమ్మల్ని బాగా నొప్పించాను. నాన్న మీ గురించి ఎంత చెప్పినా నాకు తలకెక్కలేదు. మిమ్మల్ని ఒక అడ్డంకి అనే అనుకుని ఇల్‌ట్రీట్ చేశాను. నన్ను క్షమించండి, ప్లీజ్” అనింది.
“చూడు. పెళ్ళవుతోన్న పిల్లవి. ఇలా సాయంత్రం దీపం పెట్టే వేళలో కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు. నువ్వు ఎప్పటికైనా నా ముద్దుల కోడలివే. నా బంగారానివి సరేనా! కళ్ళు తుడుచుకో” అంటూ ఓదార్చింది అక్క.
నేను, మా ఆవిడ మొహాలు చూసుకున్నాం. సుస్మితలోని ఈ మార్పుకు కారణమైన శశి శేఖర్‌కు మనస్సులోనే వందనాలు అర్పించాం.
***
రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు సుప్రీత కొత్త విషయం ప్రస్తావించింది. ఆమె స్నేహితురాలి స్కూల్లోని ఒక టీచర్ మెటర్నిటీ లీవ్ పైన వెళుతున్నారట. నీకు ఇష్టమైతే రెకమండ్ చేస్తానన్నదట. స్కూల్ వ్యాన్ ఉందట. ఉదయం ఎనిమిది గంటలకు వెడితే, సాయంత్రం నాలుగున్నర, ఐదుకు ఇంట్లో ఉండచ్చు. ఎలాగూ సుస్మిత పెళ్ళైనాక తీరికే కదా. వెళ్ళొచ్చా అని.
“దానికేమమ్మా! హాయిగా వెళ్ళు. టీచింగ్ నీకిష్టమే కదా? ప్రైమరి పిల్లలకు ఇంట్లో ట్యూషన్ చెప్పేదానివి కదా? అత్తకు వంటిల్లు అప్పజెప్పెయ్యి. రుచిరుచిగా చేసి పెడ్తారు. ఇల్లుకూడా మేనేజ్ చేస్తారు. నువ్వు స్కూలుకు వెళ్ళినా నేను ఇక్కడికి హాయిగా రావచ్చు. సరే కదా అత్తా?” కూతుర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
“నాకేం అభ్యంతరం లేదు. కొత్తదీ కాదు. నన్ను మీరంతా సహిస్తున్నారు. దాని ఋణం ఇలాగైనా తీర్చుకునే చిన్న అవకాశం నాకు.” చంచక్క మొహమాటంగానే బదులిచ్చింది.
“ఋణం, గిణం అని పెద్ద మాటలు చెప్పకండి వదినా. మీరు మాతో ఉంటోంది మా అదృష్టం.:” అంటూ మా ఆవిడ మనసారా చెప్పగా విని నాకు తృప్తిగా అనిపించింది.
“అలాగైతే నేను స్కూల్లో చేరతాను అని కన్ఫర్మ్ చేయనా”
“ఆలస్యం చేయద్దు. అవకాశం ఇంటి దాకా వచ్చింది. కొన్ని సార్లు నిర్ణయం చెప్పడానికి ఆలస్యమైతే చేయి జారి పోయే చాన్సుంటుంది.” అని కూతురు తొందర పెట్టింది.
ఇంట్లో మళ్ళీ హితకరమైన వాతావరణం.. వేడితో అలమటిస్తున్న భూమిని చల్లబరచడానికేమో అన్నట్టు బయట జల్లు ప్రారంభమయ్యింది.
కన్నడ మూలం: శ్రీమతి కె.వి.రాజలక్ష్మి
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు