[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ముముక్షువులు’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 4వ అధ్యాయం, 41వ శ్లోకం:
యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ॥
ఓ ధనంజయా( అర్జునా), కర్మఫలాలన్నింటినీ త్యజించి, మనసా వాచా కర్మణా భక్తి యోగం లోనే వర్తిస్తూ, భగవంతుడు, వేదాలు అందించే దివ్య జ్ఞాన సంపదతో హృదయంలో ఉత్పన్నమయ్యే అన్ని సందేహాలను పటాపంచలు చేసుకున్న మానవుడు, నిరంతరం హృదయంలో ప్రకాశించే ఆత్మలోనే రమిస్తూ వుంటాడు. అట్టివాడు తాను చేసే కర్మల వలన ఉత్పన్నమయ్యే ఫలాలతో బంధితుడు కాడని పై శ్లోకం భావం.
వేదాలన్నీ భగవంతుని వాక్కులే అని అంటారు. అట్టి వేదాలలో నిర్వచించిన ఆత్మజ్ఞానముతో మనస్సులో అరిషడ్వర్గాలను నశింపచేసుకొని, ఇందియ నిగ్రహలోలుడై అనుక్షణం భగవంతుని సన్నిధిని అనుభవించగలిగినవాడే భగవంతుని సంపూర్ణ కృపకు పాత్రుడవుతాడు. అట్టి వారిని ముముక్షువులని అంటారు. వారు ఎన్నటికీ కర్మఫలములచే బంధితులవరు.
ముముక్షువుల స్థితిని అందుకోవడం చాలా కష్టం కాని అసాధ్యం కాదు. అలాంటి వ్యక్తులు తమ ప్రతి చర్యను, కర్మను భగవంతుని సేవగా చేస్తారు. భక్తితో చేసే వారు చేసే పనులు వారిని బంధించవని శ్రీ కృష్ణుడు పై శ్లోకం ద్వారా చెబుతున్నాడు.
అట్లే జగద్గురు శ్రీ ఆదిశంకరులు ముముక్షుత్వం గురించి అద్భుతంగా చెప్పారు. ఆత్మజ్ఞానం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ముముక్షువులే. ముముక్షువు అంటే మోక్ష కాంక్ష కలిగిన వారు. జనన మరణ చక్ర భ్రమణం నుండి విడుదల కోరుకునే వారు. ఎన్ని సాధనాలు చేసినా ఆత్మజ్ఞానం లేకుంటే ఉన్న స్దితి నుండి ఉన్నత స్దితికి ఎన్నడు ఎదగలేవు. జనన మరణ చక్రం నుండి విముక్తి కోసం తీవ్రంగా ఆరాటపడేవాడు ముముక్షువు. ముముక్షుత్వం అనేది వైరాగ్యం మరియు భవ విరక్తి (దానిని శాస్త్రం భావోద్వేగ నిర్లిప్తత అని చెబుతోంది) అభివృద్ధి చెందడానికి బలాన్ని ఇచ్చే శక్తి. మానవుడు సాధక దశ నుండి సంపూర్ణ భగవద్ భక్తుని స్థాయికి చేరుకోవాలంటే ముముక్షువు దశను చేరుకోవడం అవశ్యం అని జగద్గురువు ప్రభోధించారు. ముముక్షత్వం గురించి ఉపనిషత్తులలో ఒక చక్కని శ్లోకం వుంది.
శ్లోకం:
నిత్యానిత్య వస్తు వివేకః ఇహాముత్రార్థ ఫలభోగవిరాగః।
శమాదిషట్క సంపత్తిః ముముక్షుత్వంచేతి॥
అంటే నిత్యం, అనిత్యం అయిన వస్తువులందు వివేకం, ఇహపరలోక భోగాలను కోరకుండా ఉండడం, శమము ఆదిగా గల ఆరు సంపదలను కలిగి ఉండడం, మోక్షాన్ని పొందాలనే ఆకాంక్ష చిత్తమందు దృఢంగా ఉండటం అనే నాలుగు విధానాలు సాధకుని సాధనలో అత్యవసరాలని ఈ శ్లోకం అర్థం. ఇట్టి సాధనలను క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో చేసేవారే శ్రీఘ్రముగా ముముక్షత్వం స్థితిని చేరుకోగలరు.