Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముంబై నగరం

[ఆచార్య దిలీప్ మెహ్రా హిందీలో వ్రాసిన కవితని అనువదించి అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

నువ్వు కూడా చూసే ఉంటావు
అరుణాచలం నుండి నేరుగా
ముంబైకి వెళ్ళే ఆకాశంలో..
కిరణాలతో ఒక వంతెన..
అచ్చంగా.. ఇంద్రధనుస్సులా!

సముద్ర వలయాకార అభివందనం
చెన్నైకి ఢిల్లీలోని జంతర్ -మంతర్‌లా కనిపిస్తుంది

ఆగ్రాలోని తాజ్ మహల్
కొన్ని కిరణాలను
తనలో ఇముడ్చుకుని శోభిస్తుంటుంది..

జైపూర్ లోని హవామహల్ గవాక్షాలు కూడా
ఆకాశమంతటినీ తమ కళ్ళల్లో విలీనంచేసుకోవాలని
తహతహలాడుతుంటాయి!

ఈ సుందర దృశ్యాలను
సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నిలబడిన
పటేల్ ప్రతిమ సున్నితంగా స్పృశిస్తుంది!

హైదరాబాద్‌లో చార్మినార్ మీద కూర్చున్న పావురాలు
ఉదయపు తాజాపవనాలలో తడిసిపోవటానికి
సుదూరాకాశంలోకి ఎగిరిపోతున్నాయి!.

వీటన్నిటినీ నాశనంచేయటానికి
ఎన్ని ప్రయత్నాలు జరిగాయో!
కానీ ఈ వంతెనకు ఆపదలు వచ్చినప్పుడల్లా

ఆదుకున్నవి..
తులసీదాస్ చౌపాయీలు;
కబీర్ దోహాలు; గాలిబ్ గజళ్ళు;
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాలు;
సుబ్రమణ్యభారతి కవితలు; నిరాలా పద్యాలే!

నువ్వెప్పుడైనా
ముంబైలోని ఎత్తైన భవనాలమీద నిలబడి చూడు
ఇక్కడికి వచ్చి ఈ వంతెన సముద్రంలో విలీనమవుతుంది!

ఇక్కడినుంచి దేశమంతా కనిపిస్తుంది
సంపూర్ణంగా.. స్వచ్ఛంగా.. నిర్మలంగా.. నిశ్చలంగా..
ప్రతి భారతీయుని ఆశలన్నీ ఫలించే చోటు
స్వప్ననగరం ముంబై!

ఇక్కడ కేవలం నీటిగోడలుంటాయి
అనేకమంది పథిక నీడల మహా వటవృక్షమిది!

భాషా సంస్కృతులు ఇక్కడికిచేరి రెక్కలు విప్పుకుంటాయి.
అందరికీ..
ఏకత్వం, బంధుత్వం, సోదరత్వ పాఠాలను
హిందీయే నేర్పిస్తుంది!
మతం, జాతి భేదాలు ఇక్కడికొచ్చాక మాసిపోతాయి!

బట్టలుతికే చాకిరేవు నుండి
‘హాజీఅలీ’ దర్గా వరకు
కనిపించే మనుషుల వదనాలన్నీ
దేశ ఐక్యతకు సాక్ష్యాలు!
రాజధాని నుండి దీనికిదూరం ఎంతైనాగానీ..
కొత్తరోడ్డుమీద ఆరుగంటలవుతుంది!

ముంబైలోని ‘చౌపాటీ’
భారతీయులందరినీ ఆకర్షిస్తుంది

ఈ దేశస్థులంతా.. బాలీవుడ్ సినీతారలనీ;
నారీమన్ పాయింట్‌నీ;
‘గేట్ వే ఆఫ్ ఇండియా’నీ
చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు!

ఇక్కడివాళ్ళు దేశమంతటి కోసం సంపాదిస్తారు
ప్రతి రోజూ ఇక్కడి ఉపాహారంతో
కార్మికులు కడుపు నింపుకుంటారు!

సాక్షాత్తూ సంపదకు అధిదేవత.. మహాలక్ష్మి;
సిద్ధివినాయకుడు గణపతి,
ఇక్కడ విరాజిల్లుతుంటారు!

భజనలతో ప్రతిధ్వనించే ముంబాదేవి ప్రాంగణం..
అధ్యాత్మికతలో మునిగిన పాలరాతి ఇస్కాన్..

అన్ని ఆకాంక్షలూ ఇక్కడికొచ్చి సంపూర్ణమౌతాయి,
కొత్త ఆశలు చిగురిస్తాయి!

ఈ ప్రదేశం కేవలం ఒక నగరం కాదు
యువభారత స్వప్నాల ముఖ్యకేంద్రం!

ఇది ముంబై నగరం.. ముంబై నగరం!!

హిందీ మూలం: ఆచార్య దిలీప్ మెహ్రా
తెలుగు అనువాదం: డా. సి. భవానీదేవి

Exit mobile version