[కుప్పిలి పద్మ గారి కథాసంపుటి ‘ముకుల’ను సమీక్షిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
నవలారచయిత్రిగా, కథారచయిత్రిగా పేరు ప్రఖ్యాతి పొందిన కుప్పిలి పద్మ గారి కథాసంకలనం ‘ముకుల’ చదివిన తర్వాత ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. ఇందులో డజను కథలున్నాయి. నిక్కచ్చిగా చెప్పాల్పిస్తే, రచయిత్రి కథా శిల్పం మీద కన్నా, కథలో వస్తువు మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. కొన్ని కథలు కోవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంతో రాసినవి, ఒక కథ ఈశాన్య భారత సుందర ప్రకృతి మధ్య తెగల మధ్య ఘర్షణలలో శాంతి, సౌభ్రాతృత్వం విచ్ఛిన్నమైన సందర్భాన్ని నేపథ్యంగా గ్రహించి రాసినది.
ఈ కథలు చదువుతున్నప్పుడు రచయిత్రిలోని కవయిత్రీ, ప్రకృతి ఆరాధన, ఆమె లోని సామాన్యుల పట్ల ఉన్న ఓ ‘కన్సర్న్’ కూడా కనిపిస్తాయి. సంపుటిలో, మొదటి కథ ‘ముకుల’ పేరే ఈ సంపుటికి పెట్టారు. కోవిడ్ అంటువ్యాధి రోజుల్లో ప్రజలు ఎవరికి వారు ఇళ్ళకే పరిమితమై వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడుతున్న సందర్భంలో మానవ సంబంధాలతో వచ్చిన మార్పులను కుప్పిలి పద్మ సున్నితంగా ఈ కథల్లో చూపించారు. ఒకటి రెండు కథలు పాఠకులకు వ్యాసప్రాయంగా అనిపించినా అనిపించవచ్చు.
~
ముకుల ఢిల్లీలో ‘ప్రతిష్ఠాత్మకమైన’ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది. అమ్మా నాన్నలకూ తమ బిడ్డ అక్కడ చదువుతున్నందుకు కాస్తంత గర్వం, ఆనందం కూడా. కలకత్తాలో జరిగిన ‘అభయ’ అత్యాచారం వార్త దేశంలో ఎక్కడెక్కడో చదువుతున్న అమ్మాయిల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తుంది. ముకుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన భయాలను, మానసిక పరిస్థితిని వివరిస్తూ బెంబేలు పడుతుంది. ఇక్కడ తల్లిదండ్రులూ అశక్తతతో, భయవిహ్వలులై, ఏం చెయ్యాలో తోచని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. ఉన్న పళంగా ఢిల్లీకి వెళ్ళడం మాటలా? రచయిత్రి ఈ నిస్సహాయ పరిస్థితిని ఎంతో సంయమనంతో కథలో ధ్వనింప చేస్తారు.
క్రమంగా ముకుల సహవిద్యార్థినిలతో చేరి ‘జస్టిస్ ఫర్ అభయ’ ఉద్యమంలో భాగస్వామయి, ఆ నిరసనల్లో తలమునకలై ఉంటుంది. యువతులు తమ శరీరాలను కనిపించేట్లు వేషధారణ చేయడం వల్లనే ఈ అనర్థాలు జరుగుతున్నాయనే పురుషాహంకారపు వాదనను కుప్పిలి పద్మగారు ఈ కథలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. ‘నిజంగానే స్త్రీలందరూ శరీరం మొత్తం కనిపించకుండా బట్టలు ధరించినా అత్యాచారాలు జరగవ’నే భరోసా లేదని కథలో అంటారు.
T ఆకారంలో స్త్రీ శరీరాన్ని చూడడం అనే అంశం, పురుషుల అవగాహనారాహిత్యం యువతుల చర్చల్లో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. పాలకపక్షం, ప్రతిపక్షంగా చీలిపోయి తమ తమ పార్టీలను సమర్థించుకోవడమేగాని, సమస్య మూలాల్లోకి వెళ్ళరు అని దీపాంజలి అనే పాత్ర ద్వారా రచయిత్రి చెప్పిస్తారు.
ముకుల మనసులో తలెత్తిన ఆందోళనకు, సంక్షోభానికి ఆమె హస్టల్ గదిలో బాల్ బేరింగ్ చెడిపోయిన ఫ్యాన్ చేసే అసహ్యకరమైన ధ్వని ఒక ప్రతీక. ‘అభయ’ ఘోరం తర్వాత విద్యార్థినుల్లో ఏర్పడిన అభద్రతాభావాన్ని, గదులకు నిరంతరం గడియ పెట్టుకోడం, తాళం వేసుకోడం వంటి చిన్ని చిన్న అంశాల ద్వారా సూచిస్తారు.
ముకుల తల్లి పల్లెనుంచి గంట గంటకూ కూతురు క్షేమసమాచారాలు తెలుసుకోవడానికి ఫోన్ చేస్తూ ఉంటింది. ఇదంతా ‘నేచర్ మనుషులతో చేసిన అబ్యూస్ వల్లే కదా!’ అని ముకుల ఆలోచన. కథ ముగింపులో “ఇంటినీ నమ్మలేము, వీధిని నమ్మలేము, బడిని నమ్మలేము, కార్పోరేట్ (కాలేజీ) భవనాన్ని నమ్మలేము, అత్యాచారం జరగడానికి స్థల కాలాదులు ఉండవు-” అన్న మాటలు ఎంత సత్యాలో, ఎవరి శరీరాన్ని కాపాడుకోడానికి వారే తప్ప మరొకరెవ్వరు (లేరు). ‘నేనటవంటి పరిస్థితికి సిద్ధంగా ఉండాల’నే ఆలోచన అమ్మాయిలలో కలుగుతున్నట్లుంది.
కథ ముగింపులో ముకుల జ్వరం తగ్గి, వాన తగ్గుముఖం పట్టడం – ఈ భయం, ఆందోళన తాత్కాలికమే అన్న సూచన పాఠకులకు స్ఫురిస్తుంది. ముకుల తన గది గోడకు మహాత్ముడి ఫోటోను, ఆమె నేస్తురాలు తన గదిలో చేగువేరా పోస్టరును తగిలించుకోడం యువత ముందున్న రెండు మార్గాలను సూచిస్తుంది.
~
‘మెట్రోకావల’ కథలో నగరాలలో, అపార్ట్‌మెంట్ కావలివాళ్లుగా, పనివాళ్లుగా పల్లెల నుంచి నిరుపేద గ్రామీణులను తక్కువ వేతనానికి తీసుకొచ్చి నియమించుకోడం గురించిన అంశం మీద పద్మగారు దృష్టి సారించారు. కొందరు మంచం కూడా పట్టని అపార్ట్‌మెంట్ మెట్ల గదిలో, కొందరు మురికివాడల్లో ఉంటూ పనిచేస్తారు. కొన్ని చోట్ల వాచ్‌మన్ కుటుంబానికి రాత్రి, పగలు – నియమితమైన సమయమంటూ ఉండదు. ఈ కథలో బస్తీ చివర మంచం కూడా పట్టని ఇరుకు గదిని రమేష్ కుటుంబం బాడుగకి తీసుకొంటుంది. వాచ్‌మన్ రమేష్ భార్య చన్నీళ్ళకు వేన్నీళ్ళలా రెండిళ్లలో పనికి కుదురుతుంది. పసిబిడ్డ కూతుర్ని పట్టుకోడానికి రమేష్ తల్లిని పిలిపించుకొంటాడు. రమేష్, అతని భార్య, అతని తల్లి – మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు మిగలవు. రమేష్ తల్లి కూడా వేరే పనులకు కుదురుకోడంతో, బిడ్డను గదిలో తాడుతో కట్టి మొగుడు పెళ్ళాం పనులకు పోతారు – పాప ప్లాస్టిక్ బిందెలో తల దూర్చి, ఇరుక్కొని పోతుంది. మొత్తం మీద ఎలాగో బయటకి తీస్తారు. రమేష్ దంపతులకు ఈ బస్తీలో తమ పల్లెలోని స్నేహ సంబంధాలు కనిపించక, మళ్ళీ కుటుంబం పల్లెకు వెళ్ళాడానికే నిశ్చయించుకోడంతో కథ ముగుస్తుంది.
~
అస్సాం టీ తోటల నేపద్యంలో ‘మళ్ళీ తేయాకు తోటల్లోకి’ కథ రాశారు పద్మగారు. దీన్ని చిన్న నవలగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేదేమో!!
కమ్లిని కుటుంబ సభ్యులంతా శివగంగ తేయాకు తోటల్లో శ్రామికులే. అందరు కూలీలకు ఒక ఒక స్వప్నం, జీవితాశయం, ఎలాగైనా ఐ.టి.సిలో ఉద్యోగం సంపాదించుకోడం. టీ తోటల్లో ఏడాదంతా పని ఉండదు, ఐదు నెలలు టీ ఆకు కోత కాగానే తాత్కాలిక కూలీలు తమ తమ పల్లెలలకు వెళ్ళిపోతారు. శాశ్వత కూలీలు మాత్రమే మిగతా రోజుల్లో కూడా ఆ తోటల్లో ముదురు ఆకు దూస్తూ, ఇంతర పనులు చేస్తూ ఉండిపోతారు.
గోవింద్ అనే యువకుడు కూడా పడమటి కొండల్లోని గ్రామం నుంచి తేయాకు తోటల్లో, శివగంగ ఎస్టేట్లో పనికి కుదురుతాడు. కమ్లినిని ఆమె తల్లి తండ్రులు గోవింద్‍కి ఇచ్చి చేస్తారు. గోవింద్ స్వప్పం కూడా ఐ.టి.సిలో ఉద్యోగం సంపాదించుకోడమే. గోవింద్ బొగ్గు గనుల్లో పనికి వెళ్తూ, వచ్చే సంక్రాంతికి తిరిగి వస్తానని కమ్లినికి వాగ్దానం చేసి వెళ్తాడు.
కోవిడ్ దేశమంతా వ్యాపించడంలో లాక్‌డౌన్ ప్రకటిస్తారు, అన్ని రకాల రవాణా సౌకర్యాలు నిలిచిపోతాయి. వార్తాసాధనాలు కూడా సరిగా పని చేయవు, గోవింద్ ఏమయ్యాడో కమ్లినికి తెలియదు, అప్పుడే కమ్లిని, గోవింద్‍ల చిన్నారి పాప పాము కాటుకు మరణిస్తుంది, గోవింద్‌కు ఆ వార్త తెలియ చేసేందుకు కూడా వీలు కాదు. అతని ఆచూకీ కూడా కమ్లినికి తెలియకుండా పోతుంది. పరిస్థితులు, ప్రకృతి అన్నీ కలిసి ఆ కుటుంబం మీద పగ పట్టాయేమోననిపిస్తుంది. గోవింద్ లక్షల శ్రామికులతో కాలినడకన ఎలాగో ఇల్లు చేర్తాడు. కమ్లిని, గోవింద్ కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. కథ చదువుతునంత సేపూ కోవిడ్ కాలంలో నిష్పూచీగా ప్రవర్తించిన ప్రభుత్వాలు, నిరుపేద కడగండ్లు గుర్తొచ్చాయి. అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ నాటి నవలలు, కథలు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో మన టి.వి., పత్రికలు కూడా వలస కూలీల యాతనలను బాగా డాక్యుమెంట్ చేశాయి.
ఒక చిన్న వ్యవసాయ కుటుంబం ఎంతగా బాధలను అనుభవించ వలసి వచ్చిందో రచయిత్రి పద్మ ఈ కథలో చిత్రించారు.
~
‘పరిమళ కలలది యే పరిమళం!’ కథ -సాంబ్రాణి కడ్డీలు ఇంట్లో తయారు చేసి కుటుంబాన్ని జరుపుకొనే నిరుపేద బ్రాహ్మణ కుటుంబం కథ. రచయిత్రి ఆ గృహ పరిశ్రమ లోతుపాతులు సునిశితంగా పరిశీలించి రాసిన కథ. ఆడపిల్లకు పరిమళ అని పేరు పెడతారు గాని, రాత్రిపగలు ఆ కడ్డీలు చేసి చేసి ‘ఆ పరిమళం మిన్నాగులా బట్టల్లోకి, అన్నింటి లోకి – సర్వం- పాకిపోయింద’ని రచయిత్రి అన్నప్పుడు జీవితం ఎంత దారుణంగా తయారయిందా అని దుఃఖం వేసింది. కోవిడ్‌తో ఆ వ్యాపారం కూడా మూతపడి ఇబ్బందుల పాలవుతారు. ఈ కథలో భర్త శేఖరం టి.బి.తో ఆ సమయంలోనే చనిపోయినట్లు చిత్రించబడింది. టి.బి., కుష్ఠు ఈ రెండు వ్యాధులకు ప్రభుత వైద్యశాలల్లో ఉచితంగా చాలా మంచి వైద్యం అందిస్తారు. వేరు వేరు డిపార్ట్‌మెంట్లు, ఉచిత పరీక్షలు, మందులు రోగుల ఇళ్ళకే తెచ్చి ఇస్తారు. ప్రపంచ దేశాలు దాదాపు ఈ జబ్బులను నిర్మూలించాయి. మన దేశంలో కూడా ఎక్కడా అరుదుగా తప్ప ఈ రోగులు కనిపించరు.
రచయిత్రి కోవిడ్ వ్యాధి వ్యాపించిన కాలంలో ముఖ్య ఘట్టాలన్నింటినీ కథలో డాక్యుమెంట్ చేశారు.
~
‘నా స్నేహితురాలు మణిపూర్ ఎక్స్’ కథలో సుందర ప్రకృతి, వనాల మధ్య అనేక తెగల సాయుధ ఘర్షణలు, విముక్తి పోరాటాలు జనజీవనాన్ని అల్లకల్లోలం చేశాయి. ఈ అశాంతి ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. మణిపూర్‌లో ఒక స్నేహితురాలికి, భారతదేశంలో శాంతియుత పరిస్థితులున్న రాష్ట్రంలోని ఆమె నేస్తురాలికి మధ్య జరిగిన లేఖా రూపంలో, అక్కడి పరిస్థితులు, ప్రజల ప్రత్యేక జీవనవిధానం, వేషధారణ, హస్తకళలు మొదలైన విషయాలు కథలో నిక్షిప్తమయ్యాయి. మనకు అంతగా తెలియని జీవితంలో ఒక ఖండాన్ని ఈ కథ ప్రదర్శిస్తుంది. ఇటువంటి కథలు మరిన్ని వచ్చినప్పుడే అక్కడి జనజీవితం, సంస్కృతి ఇక్కడి వారికి పరిచయం అవుతుంది. అభినందనీయమైన ప్రయత్నం.
“యిప్పుడు యీ వంకలూ, లోయలూ, మైదానాలు విడిపోయాయి!”
~
‘యింద్రధనస్సు జార్చుకున్న రంగుల్లో చంద్రవంకకి చిక్కుకున్నది యే రంగు!’ – కథకు – ‘కోవిడ్ మరోసారి మూడో అలగా తిరగబెడ్తుందా? మరొకమారు లాక్‌డౌన్ తప్పదా?’ అని ప్రజలు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యాన్ని ఇతివృత్తంగా రచయిత్రి గ్రహించారు. వస్తువు భయదమైన కోవిడ్ జ్వరం కావచ్చుగాని, కథలో కవితా పాదాల వంటి వాక్యాలు ఏదో లేపనంతో మనసును సమాధాన పెడతాయి. “కళ్ల నిండా తీర్చిన నల్లని కాటుకపై దిగులు రంగు వొత్తుగా కమ్ముకుంటుంటే..” వంటి వాక్యాలు తరచూ కనిపిస్తాయి ఈ కథలో సంజన, ఆమె తమ్ముడు సిలిగురి నుంచి హైదరాబాదు వచ్చి ఏదో పనుల్లో కుదురుకుంటారు. సంజన, వందన అనే వివాహిత నడుపుతున్న హైక్లాస్ బ్యూటీ పార్లర్‍లో చేరి మంచి పనిగత్తెగా తెచ్చుకొని కస్టమర్ల ఆదరాన్ని, అభిమానాన్ని సంపాదించుకుంటుంది. కోవిడ్ వ్యాపించడంతో కన్వెన్షనల్ నెససిటీస్, విలాసాలకు ప్రజలు దూరమవుతారు. కరోనా సమయంలో సంజన పని చేసే బ్యూటీపార్లర్ కూడా మూతపడి పూట గడవడం కష్టమవుతుంది. కరోనా కాస్తంత నెమ్మదించిన తర్వాత యజమానురాలి ఆజ్ఞ ప్రకారం ‘వేల్యూడ్’ కష్టమర్స్ ఇళ్ళకు వెళ్ళి మేకప్ వంటివి చేసి వస్తుంటుంది. ఒకరోజు ఆమె పరిచయస్థురాలు ఇంటికి వెళ్ళి మేకప్ చేసి తిరిగి వస్తూంటే, తన భర్తకి కాస్త బాడీ మసాజ్ చేయమని పురమాయిస్తుంది. ఆ చెత్త వె..వ తుండు కట్టుకొని పడకగదిలో ఉంటాడు. కోవిడ్ వ్యాధి మనుషులనెంత దయనీయ స్థితికి నెట్టిందో అ కథ గుండెలు కరిగిపోయేట్లు చెప్తుంది. కోవిడ్ కథల్లో తలమానికమైన కథ ఇది. కోవిడ్ సమయంలో ఏ కోమల చర్మ స్పర్శ కోసం సంజన ముని వేళ్లు తపించాయో, అది ఈ స్పర్శ కోసమేనా!
~
‘యే శిశిరమూ చెప్పని వూపిరి వునికి కథ!’ కథ కూడా లాక్ డౌన్ తాలూకు అనుభవాలే!
ఐదెకరాలు, అంతకన్నా తక్కువ భూమి ఉన్నవారికి పథకాల డబ్బుకోసం, ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక లాభాల కోసం గ్రామంలో సొంత సేద్యం చేసే అన్న – తమ్ముడు తాను పొలం వదులుకుంటున్నట్లు పత్రాలు తయారు చేయించి, తమ్ముడి సంతకం కోసం పాలేరు, వృద్ధుడు, ఎన్నడూ నగరం మొహం చూడని ముసలయ్యను హైదరాబాదు పంపుతాడు. ఆ వెంటనే నగరంలో లాక్‌డౌన్ ప్రకటిస్తారు, జనజీవితం స్తంభించి పోతుంది. కొంతకాలం తప్పనిసరై ముసలయ్య హైదరాబాదులో తన యజమానుల ఇంట్లో బందీగా ఉంటాడు. అతనికి ఈ జీవితం అలవాటు లేదు, పల్లె తప్ప. ఒకరోజు వీధిలో జనం మాటలు నెత్తిన పెట్టుకొని గుంపులు గుంపులుగా వెళ్ళడం చూచి, ముసలయ్య కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు గాని, అతనేమయ్యాడో ఎవరికీ తెలియదు. ఎందరు అనామకంగా చనిపోయారో! తప్పగొట్టుకొని ఏ కొత్త ప్రదేశం చేరారో!
~
‘యెండా వాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు’ కథలో – కౌమార దశలో ఉన్న యువతీయువకుల ఆశలకు, ఆశయాలకు, కోరుకున్న జీవితానికి – వారి తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకొన్న ఆశలకు మధ్య మానసిక సంఘర్షణని కథ పేరు బాగా సూచిస్తుంది. అమ్మా నాన్న, ఆధునికులు, యవ్వనంలో ఏవేవో ఆశలు, ఆశయాలు – ఇప్పుడు కౌమార దశలో ఉన్న ముద్దుల కుమార్తె ఎక్కడ చెడు స్నేహాలతో పాడైపోతుందోననే భయం. ఆ పాప పేరు స్వేచ్ఛాగీతిక. అమ్మానాన్నలు పెట్టిన హద్దుల్ని, అతిక్రమించి తన దారిలో తాను పయనించాలనే సంకల్పం ఆమెది. ఆ యువతి తన స్వేచ్ఛను సంపాదించుకోవడానికి సైకలాజికల్ బ్లాక్‍మెయిల్ పూనుకొని విముక్తి సాధిస్తుంది. ప్రతి తల్లిదండ్రుల జీవితంలోను ఇటువంటి సమస్య ఎదురవుతూనే వుంటుంది. కథ శీర్షిక సూచించినట్లు ఎంతో సున్నితంగా సమస్యను పద్మగారు కథలో చిత్రించగలిగారు.
~
‘గోడలకావల వనాలు’ కథ కూడా అడాలసెన్సు దశను గురించే. కుమార్తె బహుశా వామపక్ష భావజాలం వైపు మొగ్గి, ఏ నిరసన ప్రదర్శనల్లోనో పాల్గొని జైలు పాలవుతుంది. ప్రతీపశక్తులు ఆ యువతి ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి విజయగర్వంతో వెళ్ళిపోతారు. ఆ దంపతులు “కొన్నిసార్లు గోడలకావల వనాలుంటాయి, విరబూస్తాయి” అని గ్రహిస్తారు.
~
‘యెందుకంటే’ – యవ్వనంలో అతివాద, వామపక్ష ఉద్యమాల్లో తలమునకలైన యువజనులు తర్వాత పాలక పక్షాలలోకి మారి, ఆ జండాలు మోసి అధికారం లోకి వస్తారు. కథ చదివి తమను గురించేనా అని భుజాలు తడుముకునేవారు అధిక సంఖ్యలో ఉన్నారు కనుక ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
~
‘రేపటి వేకువలో విచ్చుకునే పువ్వులు’ కథలో “ఎవరైనా ఏ విషయమైనా నేర్వలేకపోయినా పర్వాలేదు గాని, మైండ్‍సెట్ మారాలి” అని రచయిత్రి ప్రతిపాదిస్తారు. అతి గారం చేసి, ముద్దు చేసి, ‘నో’ అని దేనికీ చెప్పలేక పిల్లల్ని పెంచితే జీవితంలో వాళ్ళు ఎంత రికామీగా, నిర్బాధ్యంగా వ్యవహరిస్తారో, ఈ కథ చెబుతుంది. ‘పర్వాలేదు, పెళ్ళయితే అమ్మాయి మారిస్తుందిలే’ అని పెళ్ళి చేస్తే, ఆ యువతి కాలేజీ హాస్టల్ జీవితంలో లాగే నిర్బాధ్యంగా జీవిస్తుంది. పెళ్ళిచూపుల్లో తనకు ‘స్విమ్మింగ్, డ్రైవింగ్, బంగీ జంప్’ అన్ని విద్యలూ వచ్చని చెప్పిన అమ్మాయికి కాఫీ ఎలా తయారు చేయాలో కూడా తెలీదని ఎలా అనుకుంటారు?
~
ఈ కథ సంకలనం లో చివరి కథ ‘యిక్కడ అందని వూపిరి, యే సీమవనాల్లో చిక్కుకు పోయింది!’. అమెరికా వెళ్ళి స్థిరపడిన వెంకట్ భార్యాబిడ్డలతో తన ఊరికి వచ్చేస్తాడు. కోవిడ్‌తో తండ్రి మరణించినపుడు చివరి చూపులు కూడా లేక, పశ్చాత్తాపం అతనిలో ఈ నిర్ణయానికి కారణం కావచ్చు.
~
‘ముకుల’ కథల సంపుటంలో అనేక అంశాలు, నా వంటి వారికి పరిచయం లేనివి చర్చకు వచ్చాయి. శిల్పం మీది దృష్టి తక్కువ అని మొదటే అన్నాను. మరొక ఇబ్బంది విపరీతంగా ఇంగ్లీషు సంభాషణలు తెలుగు అచ్చులో! నిజంగా అవసరమా అంత ఇంగ్లీషు! అని నా వరకు అనిపించింది. ముకుల తెలుగమ్మాయే. కొందరికి ‘ళ’ అక్షరం లేదు. తెలుగులో ‘ముకుళ’ అని ఉంటే బాగుంటుందా? ఏమో?
కోవిడ్ మానవ సంబంధాలన్నింటిని విచ్ఛిన్నం చేసింది. డబ్బు ఖర్చు పెట్టగలిగినవారు ఎలాగో కొంతవరకు బైటపడ్డారు. సినిమా గాయకులు బాలును ఆ వ్యాధి బలి తీసుకొంది.
శ్రీమతి కుప్పిలి పద్మగారి లాగా మరింత మంది రచయితలు ఆనాటి పరిస్థితులను కథలుగా, నవలుగా రాయవలసిన అక్కర ఉంది.
***
ముకుల (కథా సంపుటి)
రచన: కుప్పిలి పద్మ
ప్రచురణ: ముక్త ప్రచురణలు
పేజీలు: 230
వెల: ₹ 250/-
ప్రతులకు:
అన్ని ప్ర్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/dp/B0DV4MWBS3
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.