[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా జిస్సా జోస్ రాసిన, జయశ్రీ కలథిల్ అనువదించిన ‘ముద్రిత’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
‘ముద్రిత’ నవలని మలయాళంలో జిస్సా జోస్ రాశారు. ఇది ఆమె తొలి నవల. జయశ్రీ కలథిల్ ఈ నవలని ఆంగ్లంలోకి అనువదించారు.
స్వీయ-ఆవిష్కరణ, స్వేచ్ఛ కోసం సాగే అన్వేషణలో సామాజిక నిబంధనల వల్ల పరిమితమవుతున్న మహిళల సంక్లిష్ట జీవితాలను గురించి గొప్పగా వ్రాసిన నవల. ఈ నవల ఓ అసాధారణమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది: అనిరుద్ధన్ అనే వ్యక్తి తానెప్పుడూ వ్యక్తిగతంగా కలవని ‘ముద్రిత’ అనే మహిళ తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేస్తాడు. ఆమె అందరూ స్త్రీలే (తనతో పాటు మరో తొమ్మిది మంది మహిళలు) ఉన్న బృందంతో ఒడిశా పర్యటనకు సన్నాహాలు చేస్తూ – వర్చువల్‌గా అతనితో కనెక్ట్ అవుతుంది, అయితే ఆమె అదృశ్యం అవడం వల్ల, ఆ పర్యటన జరగనే జరగదు. ఈ ఉదంతం – కొంతమేరకు కథను డిటెక్టివ్ కథగా, కొంతమేరకు సన్నిహిత సామాజిక వ్యాఖ్యానంగా, ఒక మహిళ కోసం మొదలైన అన్వేషణ నుండి అనేక మంది మహిళల మధ్య పెనవేసుకున్న కథనాలు, కోరికల అన్వేషణగా మారుతుంది.
ఈ నవల బలం ఈ మహిళల బహుముఖ చిత్రణలో ఉంది – ప్రతి అధ్యాయం విభిన్న పాత్రల వ్యక్తిగత కథలోకి ప్రవేశిస్తుంది, వారి ఆశయాలు, నిరాశలు, ప్రేమ, కోపాలు, పోరాటాలు, పితృస్వామ్యం విధించిన పరిమితులకు వ్యతిరేకంగా నిశ్శబ్ద తిరుగుబాట్లను వెల్లడిస్తుంది. వీరు తమ దైనందిన జీవితాల ‘ప్రాపంచిక పరిమితుల’ను దాటి జీవించడానికి; ‘దానిని మించిన ప్రపంచాన్ని స్పృశించడానికి’ ఆరాటపడే మహిళలు. ముద్రిత అదృశ్యమవడం ఈ సామూహిక కోరికకు ప్రతీకగా మారుతుంది; అసలీ పర్యటనే – ఓ విముక్తికీ; అస్తిత్వాన్ని, స్వేచ్ఛని తిరిగి పొందే ప్రక్రియకి ప్రతీకగా నిలుస్తుంది. పాత్రల స్వరాలు విభిన్న అనుభవాలను తెలియజేస్తూనే – స్వేచ్ఛ, ఇంకా ఆత్మజ్ఞానంకై సార్వత్రిక కోరికను పంచుకుంటాయి.
జిస్సా జోస్ గారి సూక్ష్మమైన రచన – స్టీరియోటైప్‌లను విడిచిపెడుతుంది, సరళమైన వర్ణనలను వదిలివేస్తుంది. ఈ నవల స్త్రీలు ఎదుర్కొనే ఉద్రిక్తతలను, వైరుధ్యాలను ప్రదర్శిస్తుంది: వారు ఏకకాలంలో పురుషులను కోరుకుంటారు, ద్వేషిస్తారు, బంధం కోసం ఆరాటపడతారు, అయితే తీవ్రమైన స్వతంత్రంగా ఉంటారు. ఈ రచనా విధానం ఏ పాత్రనైనా కేవలం బాధితురాలిగా లేదా తిరుగుబాటుదారుగా చూపించదు; బదులుగా, దుర్బలత్వం, హాస్యం నిండిన స్పష్టమైన, నమ్మదగిన చిత్రణలను అందిస్తుంది. అయితే సాటి మలయాళీ మహిళా రచయితల అంచనాలను సవాలు చేసేలా నవలలో ‘కొంటెతనం నిండి, మలుపుల తిరిగే’ కథనాన్ని ఉపయోగించారు రచయిత్రి.
మహిళా పోలీసు వనితను ముఖ్య కథకురాలిగా ఎంచుకోవడం వల్ల కథకు భారతీయ కల్పనలలో అరుదుగా కనిపించే ఒక ప్రత్యేకమైన దృక్పథం లభించింది. వనిత పాత్రను లోతుగా, సానుభూతితో చిత్రీకరించారు; సంస్థాగత ఉదాసీనత, చిన్న చిన్న అవమానాలను ఎదుర్కున్నప్పటికీ ఆమె మౌనంగా దర్యాప్తు కొనసాగిస్తుంది, పట్టుదలను, భావోద్వేగ మేధస్సును ప్రదర్శిస్తుంది. ఆమె ప్రయత్నాల ద్వారా, నవల మహిళల కథనాల బహుళ తంతువులన్నీ సమన్వయమవుతాయి, అదే సమయంలో చట్టం అమలు, సమాజంలోని లింగ వివక్ష సమస్యలను కూడా ప్రస్ఫుటం అవుతాయి. వనిత ఉనికి – స్త్రీ సంఘీభావం, అస్పష్ట ప్రతిఘటనపై దృష్టి నిలపడం ద్వారా కథ నిర్మాణాన్ని సుసంపన్నం చేస్తుంది.
ఆంగ్లంలో జయశ్రీ కలథిల్ గారి అనువాదం చక్కగా ఒదిగింది. జయశ్రీ మూల భాషలోని వ్యాకరణానికి శైలికి విధేయంగా ఉంటూనే – ఇంగ్లీష్ వెర్షన్‌ను హాయిగా చదవగలిగేలా, సహజమైన రచనగా చేస్తూనే, ఇతర అంశాలేవీ జొప్పించకుండా లేదా భారీ సాహిత్య వివరణను అందించకుండా జిస్సా జోస్ మలయాళ వచనాన్ని సున్నితమైన సమతుల్యతతో అందించారు. ఈ ‘ఉత్కృష్ట అనువాదం’ మూలంలోని సాంస్కృతిక మార్పులు, కథనం స్వరాన్ని నిలిపి ఉంచి, మలయాళం గురించి తెలియని పాఠకులు – పాత్రలకు, ఇతివృత్తాలకు కొత్తవాళ్ళగా భావించకుండా సన్నిహితంగా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది.
సమకాలీన కేరళ నేపథ్యంలో రచించబడిన ‘ముద్రిత’ నవల వ్యక్తిగత అంతర్గత జీవితాలను అన్వేషించడమే కాకుండా, వాటిని ఒక స్పష్టమైన సాంస్కృతిక సందర్భంలో పొందుపరుస్తుంది. ఈ నవలలో స్థానిక పురాణాలు, నదులు, దేవాలయాల ప్రస్తావనలు ఉన్నాయి. ఈ నవల – గతంలోని, వర్తమానం లోని స్త్రీల అనుభవాల మధ్య సంబంధాలను ప్రదర్శిస్తుంది. ప్రాచీన, ఆధునికాంశాలను ఈ విధంగా పొరలుగా విభజించడం కథ పరిధిని విస్తరిస్తుంది, ఈ స్త్రీల ప్రయాణాలను స్త్రీ పట్టుదల, ఆశలకి సంబంధించిన గొప్ప, నిరంతర చరిత్రలో భాగంగా చేస్తుంది. దేవతామూర్తులను, ఇంకా 64 మంది దేవలోకపు స్త్రీలను పూజించే అరుదైన ప్రదేశంగా పేర్కొనబడిన హీరాపూర్‌లోని చౌసత్ యోగిని ఆలయం, కాలక్రమేణా మహిళల వైవిధ్యమైన, శక్తివంతమైన గుర్తింపులను వేడుక చేసుకునే నవల ఇతివృత్తాన్ని ప్రతిధ్వనిస్తుంది.
చివరగా, జయశ్రీ కలథిల్ అనువదించిన, జిస్సా జోస్ రాసిన ‘ముద్రిత’ హృద్యమైన నవల, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు, అంతకు మించి అంతర్దృష్టి నిండిన నవల. తప్పిపోయిన వ్యక్తికై అన్వేషణ అనే ఉదంతంతో ప్రారంభమై; స్త్రీల కోరిక, కర్తృత్వం, సంఘీభావం గురించి శక్తివంతమైన, బహుభాషా కథనంగా ఉద్భవించేలా – తన ఆధారాంశాన్ని అధిగమించింది. నవలలోని స్పష్టమైన పాత్రలు, సంక్లిష్టమైన కథనం, ఆలోచనాత్మక అనువాదం – సమకాలీన భారతదేశంలో గుర్తింపు, స్వేచ్ఛ బంధాల చక్రవ్యూహంలో సరైన దిశను చూపే మహిళల స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. నవలలోని వెంటాడే భావోద్వేగాల ఆకర్షణ, పొరలుపొరలుగా చేసిన సామాజిక వ్యాఖ్యానం – విమర్శకుల ప్రశంసలు పొందాయి. బహుళ సాహిత్య అవార్డులకు అర్హమైన తొలి నవలగా చేస్తాయి.
***
Author: Jissa Jose
Translator: Jayasree Kalathil
Published By: HarperCollins India
No. of pages: 320
Price: ₹ 599/- Paperback
Link to buy:
https://www.amazon.in/Mudritha-Novel-Jayasree-Kalathil/dp/9362131900/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.