Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మృత్యువు

[‘మృత్యువు’ అనే శీర్షికతో 13 పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]


~
1.
మరణ మెప్పుడు వచ్చునో నరయ లేము
పుట్టినవి యెల్ల నొక నాడు గిట్ట వలయు
జనన మరణ చక్రము బడి, జనులు కర్మ
ఫలమనుభవించు వారీ ప్రపంచమునను

2.
గతపు జన్మ పాపములను కడిగి వేయ
వ్యాధి రూపానుభవములు వచ్చు నిపుడు
పాపములు తొలగ, శుచియై వరలు జనులు
జీవన విధాన మియ్యది,చిత్ర మగును

3.
మరణ కాలము నెరుగము మనము, కనుక
విధుల పరిపూర్తి సలుపుట ప్రథమ మగును
బాధ్యతలు తీర్ప కృషి సల్ప భద్ర మగును
చింత ఇసుమంత లేక తా చేయ పనులు
ధన్యుడగు జీవి మాన్యుడై తనరు సతము

4.
పరులు మరణించ, చూచుచు నిరత మిలను
తాము మరణించ బోమని తలచ జనులు
వింతగా తోచు, చిత్రమౌ విషయ మిద్ది
మరణమున కతీతులు కారు మనుజు లకట!

5.
మరణ మంత మొందించును మన పనులను
దేహ మంతమై నశియించి తీరి పోవు
కార్యముల బాధ్యత లుడుగు కర్మ గతిని
పంచ భూతాలలో జేరి పతన మగును

6.
అందు గల ఆత్మ నిత్యమై అందు కొనును
వేరు దేహంబు, పరమాత్మ వెలుగ జేయు
నవ్య జీవిగా జనియించు, దివ్యు కృపను
వేషమును,పేరు మారును భాష కూడ

7.
అయిన దేహ భ్రాంతిని వీడ నలవి కాదు
నాది, నాదని యేడ్చు నీ నరులు సతము
మరణ మొసగు విముక్తి సంబంధములకు
మృతుల గూర్చి యేడ్వగ నేల? సతి, సుతులును

8.
కాయమది కట్టె మంటల కాలి పోవు
బూది జలముల కలుపగా పోవు కరిగి
శవము శల్యముల్ భూమిని శకలములుగు
రూపు రేఖలు, నామంబు రూపు మాయు
మరణ మీ రీతి మార్పుల బఱగ జేయు.

9.
ఎంత ఏడ్చిన రాబోదు, అంతరించు
దేహము తిరిగి, వృథ గాదె దీని బాధ
సుఖము, దుఃఖములను బాధ చూడ బోదు
మరణ మది వైరమున కంతమై పరగును

10.
మృతుడు తిరిగి రాడన్నది సతము నిజము
వేరు జన్మ కలుగునని వేద వాక్కు
స్వర్గ, నరకము లున్నవో పరము డెఱుఁగు
కర్మ ఫలమున మరు జన్మ కలుగు ననరె!

11.
చచ్చు వారి కంత్య క్రియలు జరుపు వారు
తద్దినంబులు పెట్టుచు ధన్యులగును
బ్రాహ్మణులకు దక్షిణ లిచ్చి పంపువారు
నమ్మకమ్మును, ఆచార మిమ్మహి నిలి
పి, కడు శ్రద్ధ నెరపు వారు ప్రేతములకు
కొందరాక్షేపణలు చేయు చుందు రిపుడు

12.
భర్త మరణింప నరకంబు భార్య కగును
భార్య మరణింప,పెండ్లాడు భర్త మరల
కొన్ని ఆచారములు భీతి గొలుపు, గాన
ఆడ, మగ యను భేదంబు, నవల నెట్టి
బుద్ధిమంతుల పథమున బోవ మేలు

13.
చదివి యన్నియు శాస్త్రాలు మదిని నిలుచు
దేహ మోహమమితముగ,ధీరు లయిన
మాయ తప్పించు కొనలేరు మానవు లిల
భ్రాంతి వీడిన గాని,శుభములు లేవు.

Exit mobile version