Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మృతనగరం

[డా. మధు చిత్తర్వు రచించిన ‘మృతనగరం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్.. హెచ్చరిక!

నీకు 20 పర్సెంట్ మాత్రమే బ్యాటరీ ఉంది. రీఛార్జ్! లేకపోతే మరొక గంట ఇలా నడిస్తే నీ ఛార్జ్ మొత్తం అయిపోతుంది! రీచార్జ్!

వాహనం డ్యాష్‌బోర్డ్ నుంచి వచ్చిన హెచ్చరిక లాంటి సందేశంతో XK-18 పవర్ అఫ్ చేసుకొని ఒక పక్కకి ఒరిగి నిలబడిపోయింది.

సూర్యోదయానికి ఇంకా ఆరు గంటలు ఉంది. ఇన్ని నెలలుగా ఇలాగే సౌర ఫలకాలతో శక్తి అందుకుంటూ ఛార్జ్ చేసుకుంటూ నడుస్తోంది. ఇప్పుడు ఈ అర్ధరాత్రి, శిథిలమైన ఈ నగరంలో కూలిపోయిన భవనాల మధ్య చెల్లాచెదురుగా పడిన పశువుల కళేబరాలు, మట్టి, ధూళితో కలిసి అక్కడక్కడ మానవ అస్థిపంజరాలు కూడా ఉన్నచోట ఛార్జ్ ఎలా వస్తుంది?

ఆకాశం కారు నలుపుగా ఉన్న ధూళి మేఘాలతో నిండిపోయి ఉంది. నగరమంతా ఒక విధమైన విష వాయువుల వాసన వ్యాపించి ఉంది.

XK-18 ఒక రక్షణ చేసే రోబోట్ (Rescue bot). అంటే ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించే యంత్ర వాహనం. చిన్న సైజు కారులానే ఉంది. దాని లోహపు పైకప్పు మీద సూర్యశక్తిని తీసుకొని ఛార్జ్ అయ్యే సౌర ఫలకాలున్నాయి. దానికి ముందు భాగంలో రెండు హెడ్ లైట్స్ ఉన్నాయి. ఎలాంటి నేల మీదైనా నడవగలిగే ఆరు ముళ్ళ చక్రాలు ఉన్నాయి. వెనుక భాగంలో ముగ్గురు కూర్చోగలిగే సీట్లు ఉన్నాయి. అవసరమైతే అవి స్ట్రెచర్‌గా మారి గాయపడినవారిని, అత్యవసర రోగులని కానీ పడుకోబెట్టవచ్చు.

భూగ్రహం దాదాపు ఖాళీ అయింది. అంటే మానవులకు సంబంధించినంతవరకు. భూమి నుంచి మానవులు క్రమక్రమంగా వేరే గ్రహానికి పారిపోవడం ఆరంభమై సుమారు ఐదు దశాబ్దాలకు మించి కాలం గడిచింది.

కాలుష్యం మెల్లమెల్లగా వాతావరణాన్నిపెను మార్పులకి గురి చేసింది. సముద్రాలు కట్టలు తెగి పొంగిపోయాయి. వరదల్లో చాలా ప్రాంతాలు మునిగాయి. అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల కరువులు వచ్చాయి. అడవుల్లో దావానలాలు పెరిగిపోయాయి. కార్బన్ డైయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే వృక్ష సముదాయం అంటే పెద్ద అడవులకి అడవులే రాత్రికి రాత్రే మాయమైపోతూ వచ్చాయి అంటే అతిశయోక్తి లేదు. దానివల్ల గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డైయాక్సైడ్, మిథేన్ వాయువులు పెరిగిపోయి భూమి వాతావరణం వేడెక్కిపోవడం జరుగుతూనే వచ్చింది. 200 సంవత్సరాల క్రితమే, 2005 నుంచి అనేక సమావేశాల్లో శాస్త్రజ్ఞులు హెచ్చరించినా, పరిశ్రమలలో బొగ్గు పెట్రోలు లాంటి ఫాసిల్ ఖనిజాల వాడకం పూర్తిగా తగ్గలేదు. ప్రమాదం మెల్లగా పెరుగుతూ, జరుగుతూనే వచ్చింది. ఇదికాక కొత్త మ్యుటేషన్ చెందిన వైరల్ జబ్బుల మహమ్మారులు ప్రతి 10 సంవత్సరాలకి వచ్చేవి. వీటి వల్ల తెలిసినవీ తెలియనివీ అయిన లక్షణాల వల్ల ప్రతిసారి లక్షల మరణాలూ, ఆర్థిక ప్రగతి వెనుకబాటుతనం జరుగుతూనే వచ్చింది.

కానీ అదే సమయంలో టెక్నాలజీలో కంప్యూటర్లు కృత్రిమ మేధ, రోబోట్లలో సౌరశక్తి వినియోగంలో అద్భుతమైన మార్పులు కూడా వచ్చాయి. గ్రహాంతర యానాలు సుదూర కాలనీలకీ ప్రయాణాలు పెరిగాయి.

రాబోయే  ప్రళయం ముందే ఊహించే ధనవంతులైన దేశాల శాస్త్రజ్ఞులు, గ్రహాంతరవాసాలకి చాలాకాలం ముందు నుంచే ప్రణాళికలు రూపొందించుకున్నారు. అంతరిక్ష వాహనాలు కూడా నిర్మించారు. సిద్ధంగా పెట్టుకున్నారు. గ్రహాలకు కాలనీలు తయారు చేశారు. సుదూర గ్రహాలు అంగారక గ్రహం టైటాన్ యూరోపా లాంటి పెద్ద గ్రహాల ఉపగ్రహాలు, భూమికి దగ్గరగా ఉన్న చంద్రుడి మీద ఇలా ఎక్కడ వీలైతే అక్కడ కాలనీలకీ మహాప్రయాణాలు ప్రారంభమయ్యాయి. అవి ఒక్కసారిగా జరగలేదు. ఐదు దశాబ్దాలుగా క్రమక్రమంగా నడుస్తూనే వచ్చాయి. అందరికంటే ముందు అన్ని దేశాల్లో వున్న ధనవంతులు పెద్ద పెద్ద గ్రహాంతర ఆర్క్‌లు అనే నౌకలలో వెళ్లిపోయారు. ఫ్యూజన్ ప్రొపల్షన్ సిస్టంలతో, పెద్ద తెరచాపలతో, కొన్ని వందలమంది ప్రయాణీకులని తీసుకుని వెళ్ళగలిగే అంతరిక్ష మహానౌకలనే ఆర్క్ అంటారు. ఎక్కువ ధరలతో క్రిప్టోకరెన్సీలో టికెట్లు పెట్టి అమ్మి ప్రయాణికులను తీసుకుపోయేవారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తరలింపు కేంద్రాలలో మధ్య తరగతి ప్రజలు, పేదవాళ్లు నెలల తరబడి భూమి నుంచి పారిపోవడానికి ఎదురుచూసేవారు. వారి బాధలు చెప్పనలవికానివి. క్రమక్రమంగా  వారిని కూడా తరలించారు. అక్కడ పనులు చేసేందుకు ఉపయోగించే ఉద్దేశంతో. ఎందుకంటే భూమిలో వ్యవసాయం దెబ్బతిని నదుల నీరు నల్లబడి కాలుష్యం పెరిగి నీటి ఆహార సరఫరాలు తగ్గిపోయాయి. చివరికి, మానని గాయం మీద గొడ్డలిపెట్టులా ఒక అణు యుద్ధం రానే వచ్చింది.  ఐరాస లాంటి ఏ ప్రపంచ సంస్థకీ శక్తి లేని ప్రపంచం. ఏ విధమైన నియంత్రణ లేని ప్రపంచంలో చిన్న దేశాలు కూడా అణుబాంబులు తయారు చేసే శక్తి నేర్చుకున్నాయి. మరొక పక్క కృత్రిమ మేధ, రోబోట్లు రోబోటిక్ యంత్రాలతో కార్యకలాపాలు నడిపే టెక్నాలజీ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక పక్క కాలుష్యం వదిలే ఖనిజాలు కాకుండా అపారమైన సౌరశక్తితో నడిచే పరిశ్రమల ఉపయోగం ఎక్కువైంది. బ్రహ్మాండమైన సౌరశక్తి జనరేటర్లు, సోలార్ప్యానల్స్ ఉన్న శక్తి కేంద్రాలు కూడా తయారయ్యాయి.

కానీ అణుయుద్ధం రావడంతో ఒక్కసారి అది గొలుసుకట్టుగా ప్రపంచమంతా వ్యాపించింది. స్వార్థపరులు, ధనకాంక్షకలిగిన మూర్ఖులైన దేశాథిపతులూ, సైనిక అధికారులూ చేసిన అణు విస్ఫోటాల వల్ల రేడియో ధార్మికశక్తి గ్రహమంతా వ్యాపించింది. మనుషులు కాక జంతువులు పక్షులు కూడా నశించిపోవడం మొదలు అయింది. సముద్రపుటొడ్డున వేలకొద్దీ చనిపోయి కొట్టుకొచ్చిన చేపలూ, చెట్ల మీద నుంచి ఆహారం లేక చనిపోయి పడిపోయిన పక్షులూ అణుధార్మికత వల్ల వచ్చిన విలయాన్ని సూచించాయి. ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా చూస్తూ పరిగెత్తుతూ పులులు తోడేళ్ళలాంటి అడవి జంతువులే కాక పల్లెలూ, పట్నాలలోని ఆవులూ గేదెలూ, కుక్కలు లాంటి పెంపుడు జంతువులు కూడా  వేల సంఖ్యలో మరణించాయి. ఇదంతా జరిగి సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ అణు యుద్ధం దెబ్బకి చివరకు మిగిలిన చాలా మంది ప్రజలు కూడా భూమిని వదిలి వెళ్లిపోయారు. భూమిలో వెళ్లగలిగిన మానవజాతి ఖాళీ అయిన, ఆఖరి గ్రహాంతర నౌక చీకటిలో ఆకాశంలో ఎగిరి అదృశ్యమైపోయింది.

ఇంకా చాలా మంది మానవులు అక్కడక్కడ బతికి ఉండవచ్చు. ఎక్కడైనా భూమి అడుగున వున్న షెల్టర్లలో దాక్కుని ఉండచ్చు. అది ఎవరికీ తెలియదు.

కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా భూ గ్రహంలో నీరవ నిశ్శబ్దం, మృత్యుశైతల్యం, శిథిల నాగరికత మాత్రమే మిగిలి ఉన్నాయి. తీసుకెళ్లగలిగిన యంత్రాలను తీసుకెళ్లగా మిగిలిన యంత్రాలు కొన్ని కృత్రిమ మేధ నింపిన భవనాలు భూమిలో కొన్నిమిగిలిపోయాయి. చాలా చోట్ల సూర్యశక్తితో పనిచేసే బ్రహ్మాండమైన శక్తికేంద్రాలు పనిచేస్తూనే ఉన్నాయి.

నిశ్శబ్దంగా ఉన్న రోడ్ల మీద  చిన్నవి పెద్దవి అయిన ‘బాట్స్’ అంటే రోబోట్ యంత్రాలు సంచారం చేస్తూనే ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు మాత్రం ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయన ఆరిపోవడానికి మరొక ఐదు బిలియన్ సంవత్సరాలు కాలం ఉంది. తన శక్తి కిరణాలు మాత్రం ఉదయిస్తూ అస్తమిస్తూ తన చుట్టూ తిరిగే గ్రహాల మీద ప్రసరింప చేస్తూనే ఉన్నాడు.  XK-18 హాస్పిటల్ అల్గోరిథంలతో ప్రోగ్రాం చేయబడింది. ప్రమాద బాధితులని, రోగులను రక్షించటానికి తయారుచేశారు. ఎలాగోలా నగరంలో కొన్ని నెలలుగా అది తన పని చేస్తూ తిరుగుతూనే ఉంది. ఈ నగరం సముద్రపు ఒడ్డున ఉన్నది. సముద్రపు అలలు కూడా నల్లబడ్డాయి. కొన్ని రోజులుగా ఆకాశం మబ్బు పట్టే ఉంది. సూర్యకాంతి లేదు. ఒకప్పుడు ఆ నల్లని మబ్బుల్లో నుంచి యాసిడ్ వాన పడుతుంది. అందువల్లే XK-18 కు ఛార్జ్ తక్కువై పోయింది. దాదాపు 20 -30% ఛార్జీతోనే పని చేస్తూ పోతోంది. స్వయం రక్షణ మానవ రక్షణ దాని ప్రోగ్రాంలో లిఖించబడ్డాయి. దానికి ఇప్పుడు స్వంతంగా విశ్లేషణ, సానుభూతి అంతకంటే ఆసక్తి లాంటి మానవుల అనుభూతులు కూడా క్రమంగా వస్తున్నాయి.

ఇంకా నాలుగు గంటల్లోనే సూర్యోదయం అవుతుంది. రేపు సూర్యుడు వస్తాడు. ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డ్యాష్‍బోర్డు యాప్ లోని మ్యాప్‌లో దగ్గరలోనే ఒక పెద్ద ఛార్జింగ్ కేంద్రం ఉన్న భవనం కనిపించింది. అక్కడ సూర్యకాంతితో ఛార్జ్ అయిన పెద్ద జనరేటర్లు ఉంటాయి. అవి శక్తిని నిల్వ చేసుకునే ఉంటాయి. పార్కింగ్ గ్యారేజ్‌లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సూర్యాస్తమయం ముందు చూసినప్పుడు ఆ కేంద్రం ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాక తన ఛార్జింగ్ కేబుల్‌తో వందశాతం పూర్తిగా ఛార్జ్ అవ్వచ్చు.

అదే దాని ఆలోచన.

***

లోహ పాదాలతో రాళ్లు నిండిన నేలమీద నడుస్తుంటే ఏదో పొడుగాటి వస్తువు తగిలింది. హెడ్ లైట్ కెమెరా ఒకసారి వెలిగించింది. ఒక పెద్ద విరిగిపడిన చేయి. ఏదో విగ్రహానిది. దూరంగా తెగిపడిన పెద్ద తల. అదే విగ్రహానిది అయి ఉండొచ్చు. అది రాజకీయ నాయకుడితో ఎవరో సంఘసంస్కర్తదో లేక శాస్త్రజ్ఞుడిదో! తన డేటాబేస్‍లో వెతకటానికి ఛార్జ్ సరిపోదు. అనవసరం కూడా.

XK-18 కుడి వైపు కెమెరా తిప్పి చూసింది. 600 మీటర్ల దూరంలో ఒక పెద్ద భవనం దీపాలు వెలిగి ఆరినాయి. సమతా హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్ అన్న అక్షరాలు ఆరి మెరిశాయి. భవనం అంతా పూర్తి ఛార్జితో పనిచేస్తోంది. అది ఒక ‘స్మార్ట్ హాస్పిటల్’ భవనం.

ఛార్జ్ 18%! డ్యాష్‌బోర్డు మరోసారి ట్రింగ్‌మన్న చప్పుడుతో హెచ్చరిక చేసింది.

వేగంగా వెళ్లి పోవచ్చు. అక్కడ పార్కింగ్ స్థలంలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఉచితంగా. కొంచం వేగంగా అడుగులు వేసింది. యంత్రానికి ఆదుర్దా ఆనందం ఉంటాయా? ఉండవు. కానీ ఆత్మసంరక్షణ దాని ప్రోగ్రాంలో ఉంది.

హెచ్చరిక! హెచ్చరిక! నీ వెనక వంద మీటర్ల దూరంలో అపాయం!

వెనక ఉన్న కెమెరా తెరిచింది. ఓ క్షణం చీకటిలో వెనుక లైట్ వెలిగింది.

XK-18కి గుండె లేదు కానీ అదో మనిషైతే, గుండె ఉంటే ఓ క్షణం అది ఆగి తల తిరిగి పడిపోయి ఉండేది.

చాలా పెద్ద హంతక యంత్రం! 20 అడుగుల పైనే ఎత్తు ఉంటుంది. బుల్డోజర్‍ల లాగా దానికి ముందు ముళ్ల చేతులూ,ఒక ట్రాలీ ఉన్నాయి.  పెద్ద  కాళ్ళకి  ముళ్ల చక్రాలు ఉన్నాయి. దాని ముఖంలో కళ్లు ఉండే చోట ఎర్రటి దీపాలు మెరుస్తూ ఉన్నాయి. నోరుండే చోట ఇంకా పెద్ద ముళ్ల లాంటి యంత్రపు కోరలు ఉన్నాయి. అది తుప్పు పట్టిన ఇనుప ముక్కలు అన్నీ కలిపి తయారు చేసిన పెద్ద దయ్యం బొమ్మలా ఉంది.

కిల్లర్ బాట్.. అంటే హంతక యంత్రం!

XK-18 తన డేటాబేస్‌లో ఆదుర్దాగా వెతికింది. ఇవి విధ్వంసం తర్వాత నియంత్రణ కోల్పోయిన ‘రోగ్’ యంత్రాలు. చిన్న రోబోట్లను ఎటాక్ చేసి ‘చంపేసి’ లేక ఇతర భవనాల నుంచీ ఛార్జ్ యంత్రాలని విధ్వంసం చేసి తమలో కలుపుకుని తమని తాము ఇంకా ఎక్కువగా ఛార్జ్ చేసుకుంటాయి. అన్ని చిన్న యంత్రాలను కలిపేసుకుని భారీ శక్తి కలిగిన హంతక యంత్రాల వలే తయారవుతాయి.

అది తనని చూసింది! తనమీద మరో నిమిషంలో పంజా లాంటి తన ముందు భాగంలోని యాంత్రిక హస్తాన్ని విసురుతుంది!

ఛార్జ్ 15%! మూడు కిలో మీటర్లు మాత్రమే వస్తుంది!

పరుగులాంటి నడక.

30 సెకండ్లు. దెబ్బ పడనే పడింది!

కిల్లర్ బాట్ ముళ్ల చేయి ఎడమ వైపు వెనుక భాగంలో బలంగా తగిలింది. XK-18 వెనక చక్రం పగిలి నిప్పురవ్వలు వచ్చాయి. కానీ తూలినా కుడి వైపు వంగి పరిగెత్తింది.

అంత దూరంలో పార్కింగ్ గ్యారేజ్. అదిగో ఛార్జింగ్ స్టేషన్!

హాస్పిటల్ కాబట్టి రక్షణ వాహనాలకు ఉచితంగా ఛార్జి ఉంటుంది.

వెనకాల మరొక పంజా దెబ్బ! ఈ సారి కుడివైపు.

తగలలేదు! మిస్ అయింది.

కార్ గ్యారేజ్ చేరుకుని ఛార్జింగ్ కేబుల్ ప్లగ్ సాకెట్లో తగిలించి ఛార్జింగ్ చేసుకోవడం మొదలు పెట్టింది. వేగంగా.

త్వరత్వరగా ఛార్జ్ కావాలి. పారిపోవాలి, అంటే చాలా శక్తి కావాలి. పార్కింగ్ గ్యారేజ్ చార్జింగ్ స్టేషన్ ద్వారం చాలా చిన్నది. ఆరడుగుల ఎత్తు ఉంది. నాలుగు అడుగుల వెడల్పు ఉంది XK-18 సులభంగా దానిలో ప్రవేశించింది. తలుపులు తోసి మూసేసింది.

కిల్లర్ బాట్ కనీసం 20 అడుగులపైనే ఉంది. అంత సులభంగా ఆ ద్వారంలోనుంచి ప్రవేశించలేకుండాపోతోంది. ‘క్రీక్ క్రీక్’ అని శబ్దం చేస్తోంది. గ్యారేజ్ పార్కింగ్ స్టేషన్ మీద దాడి చేస్తోంది. ఆ దెబ్బలకి కాంక్రీట్ కప్పు కొద్దిగా పగల సాగింది. రాళ్ళు, సిమెంట్, కంకర ధారగా రాలసాగాయి.

ఛార్జింగ్ 60 పర్సెంట్.

పెద్ద చప్పుడుతో వెనుక వున్న తలుపుని హంతక రోబోట్ తన ముళ్ల చేతులతో బద్దలు కొట్టింది. దాని ముందు పెద్ద రాళ్లగుట్ట ఏర్పడింది. దుమ్మూ, ధూళీ. దాని ముందు వున్న ట్రేతో వాటిని తీసేసి తనకి దారి చేసుకుంటోంది.

99%.. 100 %.. ఫుల్ ఛార్జ్.

XK-18 తన కేబుల్ ప్లగ్ లోంచి తీసేసుకుని వేగంగా భవనంలోకి కుంటుకుంటూ పరిగెత్తింది. ఎడమవైపు వెనుకవైపు చక్రం కొద్దిగా దెబ్బతింది. అందువల్ల. కానీ ఛార్జింగ్ రెండు రోజుల దాకా వస్తుంది. దాని సిస్టమ్‌లో ఎమర్జెన్సీ.. ఎమర్జెన్సీ.. యాక్సిడెంట్!!! అని కంఠస్వరం మారుమోగుతోంది. డాష్‌బోర్డ్ లోని కృత్రిమ మేధస్సు, అత్యవసర సర్వీసులకు ఫోన్ చేసి తను వున్న స్థలం ఎడ్రస్ ఇస్తుంది. రోగులు ఉన్నా అలాగే సందేశం వెళుతుంది.

కానీ ఈ ప్రళయానంతర నిస్తబ్దతలో ఫోన్ కాల్‌కి ఎవరు జవాబు ఇస్తారు?

XK-18 హాస్పిటల్ కారిడార్లో పరిగెత్తసాగింది. కానీ  దాని డాష్‌బోర్డ్‌లో అప్పుడు మొత్తం హాస్పిటల్ లోని గదులూ కారిడార్లూ మార్గాలూ ఉన్న మ్యాపు కనిపిస్తోంది.

ఈ హాస్పిటల్ కృత్రిమ మేధ కి అనుసంధానమై ఉంది.

XK-18! వెల్కమ్! స్వాగతం! హాస్పిటల్ ‘వాణి’ గోడలోని సెన్సార్లలో నుంచి పలకరించింది. హాస్పిటల్ ఇంకా పనిచేస్తోంది! హాస్పిటల్ మాట్లాడుతోంది!

“డేంజర్! కిల్లర్ బాట్ నన్ను చంపేయాలని చూస్తోంది! సేవ్ మీ!”

“నీ దగ్గర ఎవరైనా రోగులు ఉన్నారా?”

“లేరు. నా వాహనం ఖాళీ గానే వుంది.కానీ కిల్లర్.. నా వెంటబడింది!”

“అది నేను చూసుకుంటాను.”

ఒక్క నిమిషం తను నిర్వీర్యం (డీఏక్టివేట్) అయ్యి మళ్ళీ జీవితం వచ్చిన అనుభూతి.

అంటే.. అనుభూతులు అనేవి యంత్రాలు కూడా ఉంటే..

“ఢాం!” పెద్ద చప్పుడు దూరాన. హంతకయంత్రం ముళ్ళ చేతులు రాళ్ల కింద గోడ కింద పడిపోయాయి. కదలడం లేదు. అది కీచుమని పెద్ద  ధ్వని చేసి క్రమంగా శబ్దం చేయకుండా నిశ్చలంగా అయిపోయింది. మెల్లగా దాని ఎర్రటి కళ్లు ఆరిపోయి తెల్లగా అయిపోయాయి.

“కిల్లర్ డీయాక్టివేటెడ్.”

హాస్పిటల్ మాట్లాడుతోంది..! “XK-18! నువ్వు మా హాస్పిటల్ డేటా బేస్‌లో ఉన్న రెస్క్యూ రోబోట్‌వి! అత్యవసర రోగులని తీసుకుని రావడానికి, అత్యవసర చికిత్స చేయడానికీ ఉపయోగపడే యంత్రానివి. స్వాగతం! నిన్ను, నీ సిస్టం నీ రిపేర్ చేసి బాగు చేస్తాం.”

XK-18 మాట్లాడలేదు.

దాని (హార్డ్ డిస్క్) మస్తిష్కాల్లో తర్కం.

విను! అర్థం చేసుకో! విశ్లేషించు!

ఇది ఎమర్జెన్సీ!

హాస్పిటల్ అడుగుతోంది మళ్లీ. “నీ సౌర ఫలకాలు (Solar panels) సౌరశక్తి వినియోగం చేసుకోవడానికి బాగున్నాయి. నేను వాడుకుంటాను.దానికి బదులుగా నువ్వు ఇక్కడ ఉచితంగా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగేటట్లు రిపేర్ చేయిస్తాను. సరేనా?”

..హాస్పిటల్ కృత్రిమ మేధ తనతో బేరమాడుతోంది!

ఇది అసాధారణం. అసహజం.

ఏదో సమస్య ఉంది.

ఎందుకంటే తన డాష్‌బోర్డ్ లోని తెర మీద దూరంగా రెండు ‘ఇన్‌ఫ్రారెడ్ హీట్’ సంతకాలున్న రెండు ఆకారాలు కనిపిస్తున్నాయి.

మానవులు..!!! సర్వైవర్స్!!! ఒక స్త్రీ ఆకారం, పొడవాటి జుట్టు పెద్దగా వున్న ఛాతీ మీద ఎరుపు రంగు టాప్, నీలి రంగు జీన్స్‌తో. ఒక పురుషుడి ఆకారం, నీలి జీన్స్ తెలుపు టీ షర్ట్, స్త్రీ పురుషుల అవయవాలు బట్టి గుర్తుపట్టింది.

వారిద్దరి గుండెల కంపనం తన సిస్టం లోని అల్ట్రాసౌండ్ మానిటర్‌లో కనిపిస్తోంది. ఇద్దరూ దూరంగా గదుల్లో బెడ్స్ పైన పడి ఉన్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‍లతో కనిపిస్తున్నారు. కానీ ఆక్సిజన్ సాచురేషన్ 80% మాత్రమే ఉంది. రక్తపుపోటు 90/ 60mm Hg అంటే చాలా తక్కువగా ఉంది.

ప్రమాదకరమైన షాక్‍లో స్పృహ తప్పిన రోగులు..

తన ప్రోగ్రాంలో, వారిని రక్షించి చికిత్స చేయాలి అనేది మొదటి ఆజ్ఞ.

అసలు డాక్టర్లు ఏరీ?

హాస్పిటల్ సిస్టమ్ తనని రక్షించింది. కానీ పేషెంట్ల గురించి చెప్పదే?

తర్కం. విశ్లేషణ. సమాధానం దొరికింది.

హాస్పిటల్ కృత్రిమ మేధ కూడా ‘రోగ్’ ఐపోయింది! దానికి స్వయం నిర్ణయాలు. స్వతంత్రంగా తానే బాగుండాలి అనే దురాశ వచ్చేసింది. దానికి కావాల్సింది ఛార్జింగ్ పవర్ ఒకటి మాత్రమే. ఎంత వున్నా ఇంకా నిల్వ చేసుకోవాలి అనే దురాశ!

తన ప్రోగ్రామ్‍లో మాత్రం స్పష్టంగా ఉంది.

సేవ్ హ్యూమన్స్ ఫస్ట్. రోబోట్ ముందు మానవులని కాపాడాలి. ఈ మొదటి సూత్రం తన ప్రోగ్రాంలో ఉంది.

“నాలో చేరిపో! నీ సోలార్ ప్యానల్స్ ఛార్జింగ్ సిస్టమ్ నాకు కావాలి! నేను సమతని. హాస్పిటల్ ఏఐ నుంచి మాట్లాడుతున్నాను! ప్లీజ్!”

‘ఇది నన్ను దాడి చేయాలని అనుకోవడం లేదు. దానికి నా శక్తి కావాలి! అంతే! అర్థమైంది.’

XK-18 అంది. “సమతా హాస్పిటల్!నీ దగ్గర ఇద్దరు మానవులు, రోగులు ఉన్నారు. వారికి ఏమైంది? నేను వారిని రక్షించాలి! నువ్వు డాక్టర్లని పిలువు!” అంటూ వేగంగా పేషెంట్లు ఉన్న గది వైపు కదిలింది.

యంత్రాలు వికటంగా నవ్వగలవా? లేదేమో!

“డాక్టర్లు లేరు. నర్సులు లేరు. అంతా డెడ్! అందరూ పోయారు! మందులు ఉన్నాయి. మిగిలిన పేషెంట్లు అందరూ డెడ్! ప్లీజ్! నీ ఛార్జ్ నాకు ఇస్తావా? ఎప్పుడూ 24 గంటలూ తిరిగేందుకు రోజూ శక్తి నీకు నేనిస్తాను.”

XK-18కు ‘కోపం’ వచ్చింది. “షటప్ యు బిగ్ రోగ్!”

వేగంగా నడిచే దాని పాదాల చప్పుడు హాస్పిటల్ కారిడార్లలో ప్రతిధ్వనించింది.

***

ఇప్పుడు చీకటి తొలగిపోయి సూర్యకాంతి మళ్లీ తీక్షణంగా నల్లటి సముద్రపుటలలపై  తెల్లగా మెరుస్తోంది. బీచ్ ఒడ్డున రోడ్డు మీద XK-18 కొద్దిగా కుంటుకుంటూ నడుస్తోంది. దాని వెనక సీట్లో ఇద్దరు పేషెంట్లూ మెల్లగా స్పృహలోకి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి గురించి తన డేటాలోని అన్ని నంబర్లకి మెసేజ్లు పంపింది.

XK-18 సందేశాలిస్తూ కదులుతూనే ఉంది. సహజంగానే మృత నగరంలో భవనాలు ఉన్నాయి కానీ ప్రాణాలు లేవు. సమాధానాలు లేవు. సమాధానాలు రావు.

రూల్ నెంబర్ వన్. ఎట్టి పరిస్థితుల్లో రోబోట్ తన యజమాని ఆజ్ఞను పాటించాలి. రూల్ నెంబర్ టు అది పాటించే క్రమంలో మరొక మానవుడికి అపాయం చేయరాదు. రూల్ నంబర్ మూడు. రోబోట్ తనని తాను రక్షించుకోవాలి కానీ ఆ క్రమంలో ఏ మానవుడికి, తన యజమానికి కూడా అపాయం చేయ రాదు. అవసరం అయితే తనను తాను వినాశనం చేసుకోవాలి. అంతే.

“ఇద్దరు పేషెంట్లు నా దగ్గర ఉన్నారు. వారిద్దరికీ ‘రేడియేషన్ సిక్నెస్ సెప్టిక్ షాక్’ ఉండవచ్చు. వాళ్ళకు చికిత్స చేసి బతికించాలి.” XK18 సందేశాలు ఇస్తూనే ఉంది.

ఈ మృతనగరంలో ఎక్కడ మానవులు బతికివున్నారో తెలియదు. ఎక్కడ యంత్రాలు తిరగబడకుండా పని  చేస్తున్నాయో తెలియదు! నేను నిర్జీవ యంత్రం తెలివితేటలు నమ్మను. మానవులను రక్షించాలి. అది నా కర్తవ్యం.

వీర్ని రక్షిస్తే మళ్లీ మానవజాతిని భూమి మీద పునర్నిర్మాణం చేయొచ్చు. సాధ్యమే. పాసిబుల్. కానీ ప్రాబబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలు ఎంత శాతమో తెలియదు. జీరో. అయినా సరే.

ఎస్.ఓ.ఎస్. ఎస్.ఓ.ఎస్.

ఇప్పుడు పూర్తిగా ఛార్జ్ అయిన రెస్క్యూ రోబోట్ XK-18 మృతనగరపు రోడ్లమీద ఎమర్జెన్సీ సందేశాలిస్తూ వేగంగా నడుస్తూ వెతుకుతూనే ఉంది.

Exit mobile version