[సెప్టెంబరు 10, 2025 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా, 17 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 07 సెప్టెంబర్ 2025 ఆదివారం వరకు – విశ్వనాథ సత్యనారాయణ గారిపై ప్రతి వారం ఒక ప్రత్యేక వ్యాసాన్ని అందించనున్నాము.]
(తెలంగాణ తేజం తెర తొలగిన రత్నం – నారాయణరావు – తుర్లపాటి లీలాకుమారి గారి ‘మ్రోయుతుమ్మెద, సంగీతము – అనుభూతి’ అనే పుస్తకం నుంచి కోవెల సుప్రసన్నాచార్య గారి వ్యాసాన్ని ప్ర్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము.)
1956 మార్చి 31, ఏప్రియల్ 1 తేదీలలో కరీంనగరంలో విశ్వనాథ షష్ఠిపూర్తి రెండు రోజులు జరిగింది. తొలినాడు వరంగల్ నుంచి బయలుదేరి వచ్చిన విశ్వనాథ సాయంకాలం అక్కడికి చేరుకున్నారు. ఆనాటి సాయంకాలం సభలో తన రాకను గురించి ఆయన చెప్పుకున్న పద్యాలు చిరస్మరణీయమైనవి.
‘తననీడం గనుగొంచు వచ్చిన దయా, దారింబడిన్
శ్రీమహత్ ఖనిమద్శారద – పారదాకృతిని
భూమిజాకార
తనలోతునెరుగని జనుల పూజకు తిర
స్కృతి జూపు మద్సరస్వతి సుభద్ర
తన లోతు నెరిగిన జనుల పూజకు నవా
దృతిజూపు మత్సరస్వతి సమార్ద్ర
మానకొండూర్తటాకాన గట్టున గ్రుమ్ము
లాడు సాలీండ్ల గూండ్ల విశతములు
రవి సుషమా సమాక్రాంత కాంతుల చేత
మాణిక్యకాంతులు మలసి యాడ
వెండి నీరాజనములెత్తుచుండ కదలి
వచ్చె మీ కరీంనగరము భసలవేణి
మత్సరస్వతి భావ సామ్రాజ్య లక్ష్మి
భక్తి యున్నట్టిచో మెత్తబడెడు దేవి.
ఓ కరీంనగర ప్రజా కవిత్వ
రసికనికురుంబమా! కావ్యరస రమా ని
తంబమా! యెన్ని జన్మల దాక ఋణము
నిదియు బదిబది దీర్చుచుండెదను నేను. (కేదారగౌళ)
కరీంనగరం చేరుకున్న విశ్వనాథ సరస్వతి తన ప్రతిబింబాన్ని చూచుకొంటూ వచ్చింది. బింబమున్నచోటనే ప్రతిబింబం ఉంటుంది.
పాదరసం వలె చిక్కగా ప్రవహిస్తున్నది. అది రసస్వరూప. అందువల్లనే పారమార్థికంగా వేదంలో తపసాజ్వలంతంగా వర్ణింపబడిన సీతాదేవి తాను తన అంతస్సాధనలో సీతానామకమైన యోగాన్ని ఉపదేశంగా పొందినట్లు అది నాగరీకమైందిగా ఆయన ఒకచోట చెప్పుకున్నారు. (జ్ఞానపీఠ ప్రధాన ఉపన్యాసంలో).
కరీంనగరం తెలంగాణ ప్రాంతానికి హృదయస్థానం. విశ్వనాథ కవిత్వారంభ దినాలలో భద్రాద్రి రాముని సన్నిధిలో ప్రవహించే కిన్నెరసాని ఆయన చైతన్యాన్ని ఆవరించింది. అక్కడే తెలుగు దైవమ్ము కొలువులో కిన్నెరసాని ‘వనములను దాటి వెన్నెల బయలు దాటి/తోగులను దాటి దుర్గమాద్రులను దాటి/పులుల అడుగుల నడుగులు కలుపుకొంచు/రాళ్ళవాగు దాటి పథాంతరములు దాటి/అచట కిన్నెరసాని నాయాత్మ యందు/ఇప్పటికి దాని సంగీతమే నదించు’.
కిన్నెర పొందిన దుఃఖము భర్త రాయై పోవటం, తాను నదిగా మారటం ఒక అద్భుత విషాద కావ్యం. రామాయణంలో వేదన పొందిన అహల్య శిలాతపస్విని అయింది. తన ఆవేదనను పరచుకొంటూ పోతున్నది. అప్పటినుంచి విశ్వనాథ సరస్వతి దానితో సమాన ధర్మం గలిగిన మరొక వాగు ‘మోదుం’ అరిపిరాల (కరీంనగరం)లో ఉన్నది. ఈ మోదుం తొలి ఆవిష్కారం మ్రోయుతుమ్మెద. ఈ ఝంకారం ఆ సరస్వతిని ఆకర్షించింది. తెలంగాణా భూమిలో, నింగిలో, గాలిలో, నీటిలో ఆతపంలో ఆయన ఈ అవిదితమైన భావుక గమ్యమైన సంగీతాన్ని – అనంత జన్మ పరంపరాగతమైన దుఃఖాన్ని స్పృశింపగలిగినాడు. అందువలననే కరీంనగరం ప్రవేశిస్తుండగానే అపరాహ్లవేళలో సాలెగూండ్ల మీద పడ్డ రవికాంతులు మాణిక్య రోచిస్సులతో వెండి నీరాజనము లెత్తినాయి. అక్కడ రచింపబడ్డ మ్రోయుతుమ్మెద ఒక మధుర గాయకుని చైతన్యాన్ని ఆవిష్కరించిన అనుభూతి కావ్యమైంది. ఆ మండలానికి చెందిన ‘రామగిరి’ కాళిదాస మేఘసందేశ నాయకుడై యక్షుని విరహగీతాలాపనకు స్థానమైంది. మ్రోయుతుమ్మెదలో ప్రస్తావనకు వచ్చిన ఓరుగంటి పద్మాక్షి గుట్ట సందర్భంలో నాటికి తెలంగాణా అంతగా కీర్తి భూషిదులు కాని కవులు – ఉదయరాజు శేషగిరి రావు, గార్లపాటి రాఘవరెడ్డి, వానమామలై వరదాచార్యుల కీర్తి వల్లరులు పూలు పూచినాయి. అప్పటికి ఇరవై యేండ్లు నిండని గొప్పకవి దాశరథి కవిత్వం ప్రస్తావింపబడింది. 1956 నుండి 1961 దాకా విశ్వనాథ రచించిన సాహిత్యంలో సింహభాగం ఇక్కడే రచింపబడింది. పునర్జన్మ, బాణావతి వంటి నవలల వస్తువు ప్రవర్తించిన చోటు తెంగాణకు తెలంగాణాలోని సంస్థానాలతోను, సారస్వత పరిషత్తు వంటి సంస్థలతోనూ ఆయన గూఢానుబంధం ఉండేది. రామాయణ కల్పవృక్షోత్సవాలు ఖమ్మంలో ఆచార్య మాదిరాజు రంగారావు ఆధ్వర్యంలో ప్రారంభమయి దేశమంతటా విస్తరించాయి. విశ్వనాథ వాఙ్మయం గురించిన ఒక అద్భుతమైన కార్యక్రమం వరంగల్లులో జరిగింది.
కరీంనగర గత ప్రజాకవిత్వ రసిక నికురుంబమన్న సంబోధన విస్తృతార్థంలో తెలంగాణానికంతా వర్తించుతుంది.
(2)
విశ్వనాథ నవలల్లో ‘మ్రోయుతుమ్మెద’ చాలా విలక్షణమైనది. ప్రక్రియారూపంలో ఒక విశిష్టమైన ప్రయోగం ఇది.
- ఇది ఒక గొప్ప సంగీత విద్వాంసుని జీవిత చరిత్ర. అద్భుతమైన ఆయన జన్మను వివరించటంలో కవి ఆ గాయకుని జీవితంలో ప్రవేశింపబోతున్న దైవ సంకల్పితమైన గొప్ప ఉపాసకుని లక్షణాన్ని, తత్సంబంధ శ్రీవిద్యా స్వరూపాన్ని విపులీకరించటం జరిగింది.
- ఆ మహా విద్వాంసుని జన్మయందలి బ్రాహ్మణత్వ లక్షణం, తాను తనను పెంచిన వారి వర్ణాన్నే ఎన్నుకోవటం, తరువాత మహా పురుషుల అనుగ్రహం వల్ల ఉపాసనలో మెట్టుమెట్లుగా ఎక్కుతూ విశ్వామిత్రుని వలె బ్రహ్మర్షిగా పరిణమించటం, (వర్ణభేదం) కులభేదం, లౌకికాచారముల కంటే మనిషి తన్నుతాను దివ్యజవుడుగా పరిణమింపజేసుకోవచ్చన్న అంశం ప్రతిపాదింపబడింది.
- గిరిక నాట్యం వల్ల ‘వేయిపడగలు’లో సిద్ధిపొందిన విధంగా సంగీత నిరంతర సాధన వల్ల దాన్ని పరమార్థసాధనకు నిశ్రేణికగా తీర్చిదిద్దుకున్న అంశం ‘నాదతను మనిశం శంకరం’ అన్న మాటలోని తాత్పర్యం మూల కేంద్రంగా జీవనమంతా నాదయోగంగా తీర్చుకున్న అంశం వ్యాఖ్యాతమైంది.
- నవలలోని చివరిభాగంలో ఆత్మకథాత్మక లక్షణం ఎక్కువగా ప్రకటింపబడిన చోట విశ్వనాథ, నారాయణరావు లిద్దరూ శబ్దమును, నాదమును ఉపకరణాలుగా ఎంచుకున్నా చివరకు ఏదో ఒక తాదాత్మ్య బిందులలో ఏకరూప సిద్ధిని పొందిన విధం నిశ్చయం చేయబడింది.
విశ్వనాథ నారాయణరావు సంగీతానుభవాన్ని వెల్లడించే పద్యసందోహం రచించినప్పుడు వారిద్దరూ సహచరులైనారేమోనని తోస్తున్నది.
విశ్వనాథ అరవై యేండ్లు దాటిన తరువాత ఇద్దరు సంగీత విద్వాంసుల వద్ద అభ్యాసం చేసి కొన్ని రాగాలపై పట్టు సాధించిన సంగతి ఈ వ్యాసకర్తకు తెలుసు.
- ఈ నవల ఆరంభంలో శ్రీ వాణీగిరిజా సమష్టి రూపమైన ఒక శక్తి అని ప్రారంభమయింది. ఇది నన్నయ్యగారి భారతారంభ శ్లోకం ఎత్తుగడ పోలి ఉన్నది. శ్రీవిద్యామంత్ర స్వరూప విభాగంలో శ్రీవాణీ గిరిజా సమష్టి రూపమైన మంత్ర ప్రస్తారము లేదని విన్నాను. ఇక్కడ బీజాక్షరములు వ్యత్యాసము వలన అడవిలో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుడు పులివాత బడ్డాడని తోస్తున్నది. వ్యత్యస్తమైన ఈ మంత్రశక్తి వలన బిడ్డ రక్షింపబడినా అతని ఉపాసనా ప్రపంచం గాన సాధన రెండూ ఎంత చిక్కులు పడ్డాయో నవల తెలియచేస్తుంది.
నవలలో ప్రధాన భాగమంతా రచయిత నాయకుని తుమ్మెద అనియే పేర్కొన్నాడు. చివరి భాగంలో వ్యవహార నామం వచ్చింది. యోగి సాధన దశలో పొందే దశలోని నాదాలలో భ్రమరనాదం ఒకటి. ఈ భ్రమరానికి పర్యాయపదం షట్పదమని. ఈ షట్పద శబ్దం గౌణంగా సుషుమ్నకు వర్తిస్తుంది. ముందు పేర్కొన్న షష్టిపూర్తి పద్యాలలో తన కవిత్వాన్ని గురించి విశ్వనాథ ‘భసలవేణి’ తుమ్మెదల వంటి జడ. ప్రతీకాత్మకంగా ఇదికూడా కుండలినీ తత్త్వాన్ని ప్రకటిస్తుంది.
- నారాయణరావును నేను సన్నిహితంగా చూచిన సందర్భాలెన్నో. ఎప్పుడో జగిత్యాల కళాశాలలో ఆయన సంగీత కచేరీ విన్నాను. తరువాత ఎన్నో సందర్భాలలో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక బ్రహ్మ తేజస్సు వెలుగులు చిమ్ముతూ వుండేది. నేను నా దేవీస్తుతి పద్యాలు వినిపిస్తుంటే వాటిలో ‘కళ్యాణి మధురరాగము కోస సౌందర్యరేఖ యనుకొంటి పూరింపలేక’ అన్న వాక్యం చదివినప్పుడు మీకు కళ్యాణిరాగమంటే అంత ఇష్టమా అని అడిగారు. నాకు రాగస్వరూపమైతే తెలియదు కాని విన్నప్పుడు కలిగే హాయి మాత్రం తెలుసు అన్నాను.
- మ్రోయుతుమ్మెద మొత్తం నవల నిరంతరం ఈ తుమ్మెద ఝంకారం వినవస్తూనే ఉంటుంది. నారాయణరావు పుట్టిన సందర్భంలో – తైవారేసరికి అతడు ఆ భీకర కాంతారంలో బ్రతికి ఉండటం, పక్షుల కిలకిలారావాలు పెంచుకున్న తల్లిదండ్రులు వచ్చేదాకా అతనిని సంగీత చైతన్యంతో సజీవంగా ఉండేటట్లు చేసినాయి.
ఆయన సంగీత ప్రపంచంలోనికి అడుగుపెట్టడం ఇది తొలిమెట్టు. ఇక్కడినుంచి నారాయణరావును సంగీత విద్యాధిదేవత లోగొన్నది. వెలిగందుల మఠంలోని భిక్షకుల పాటలు – ముఖ్యంగా నీలకంఠం స్వరసంపుటి అతనికి తొలి విద్యా గురువు. అది ఒక వైలక్షణ్యాన్ని అతనిలో సంతరించి పెట్టింది. నారాయణరావు పెరుగుతున్నాడు. అతనిలో సంగీతం పెరుగుతున్నది. ఆ సంగీతంలో ఒక సహజోద్గమమైన మాధుర్యం పెంపొందుతూ వచ్చింది. పక్షుల కిలకిలారావాలలో ఉండే అంతర్గత చైతన్యం క్రమంగా వేములవాడ దేవస్థానంలో స్వామికోసం అక్కడి జనం పాడే మంగళహారతులతో ఉండే ఒక దేశీయ స్పర్శ. ఈ రెంటికి మధ్య ఒక సేతు నిర్మాణం జరిగింది. ఫూల్‌చంద్ కావచ్చు, వెంపటి వెంకట నారాయణ కావచ్చు, మరొకరు కావచ్చు. ఆయన ఏకసంథాగ్రహణం వల్ల ఒక అవిదితమైన వేదన, సంగీత పిపాస వల్ల శిఖరాలను అధిరోహిస్తూ పోయినాడు.
తనలోని అవిదితమైన వేదన వల్ల నారాయణరావు ఒక ఆర్తిని పొందుతూ వచ్చారు. ‘బద్ధ్వాక శైః యమభటాః’ మొదలైన కరావలంబ స్తోత్రం చదువుతూ – ‘దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా’ మొదలైన సౌందర్య లహరి అన్వేషణ అతన్ని ఒక అన్వేషణ వైపు లాగుకొని పోయింది.
దాంతో అతడు శ్రీదేవీ ఉపాసకుడైనాడు.
(3)
నారాయణరావులో సంభవించిన పరిణామాలన్నీ అతణ్ణి పుటపాక ప్రతీకాశునిగా తీర్చిదిద్దింది. నారాయణరావులో సంభవించిన పరిణామం శాస్త్రీయమైన మార్గంలో సాగిందనటానికి వీలు లేదు. ఫయ్యాజ్‍ఖాన్‌ను చేరుకున్నా అతడు ‘తానొక్కడు’గానే ఉన్నాడు. శ్రీ విద్యా ఉపాసకుడైనా – పూజ్య హరిహరానంద సరస్వతీ స్వామికి అంతేవాసియైనా – పాదుకాంత దీక్షాపరుడైనా తనలో ఒక వెదుకులాట ఉండేది. లౌకిక జీవితంలోని ఎగుడుదిగుళ్లుండేవి.
విశ్వనాథతో సమావేశం పెరగిన తరువాత తనలో భావుకత్వం పెరిగింది. నిత్య జపశీలం వల్ల అంతర్ముఖ లక్షణం పెరిగింది. ఆయన పాడితే దాని లోతులను వ్యాఖ్యానింప గలిగేవాడు. అవిదితంగానో విదితంగానో ఆయనకు సన్నిహితంగా బాలా త్రిపురసుందరి తిరుగుతున్నట్లుగా ఇతరులు గమనించ గలిగేవారు. విశ్వనాథకు సంగీతానుభవం సిద్ధించేది. ఆయన ఆ అనుభవాన్ని కవితారూపంలో ముద్రించలిగేవాడు. మ్రోయుతుమ్మెద చివరి భాగం అంతా విశ్వనాథ పొందిన సంగీతానుభవ శబ్దికరణమే. ఒకసారి తనకు ఓపిక లేక పోవటం వల్ల వేములవాడకు రాలేనంటే, ఓపిక తెప్పిస్తానని నారాయణరావు దేశికారి రాగాన్ని పాడి ఓపిక తెప్పిస్తాడు. దానిలో ముఖ్యమైన ధైవతస్వరం ప్రాణం నిలబెట్టింది.
మ్రోయుతుమ్మెదలో ఈ చివరిఘట్టం అంతా జీవునికీ అతని చిత్తానికీ సంగీతం ఆయనలో నుంచి విశ్వనాథ లోనికి ప్రాకించగలిగిన ఒక అనుభవ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తుంది. గౌతమరావు, శ్రీరామమూర్తి వంటి సహృదయు లెంతమంది ఉన్నా ప్రధాన వ్యక్తులు నారాయణరావు విశ్వనాథలే. ధ్వణ్యాలోకం చెప్పిన విధంగా మిగిలినవారంతా ఈ ఇద్దరి అనుభవ ప్రపంచంలో లీనమైన వారే ‘సరస్వత్యాఃతత్త్వం కవి సహృదయాఖ్యం విజయతే’ అన్నదే ముఖ్యమైన స్థితి.
ఒకవిధంగా అధ్యయనం చేసి చూస్తే నవల అంతా తుమ్మెద ఝంకారమే. నారాయణరావు గొంతే, దానివెంట కన్నీళ్లలో కరిగిపోతున్న విశ్వనాథ జీవన స్వరమే.
ఈ స్వరం ముఖ్య ప్రాణమును కదలిస్తుంది. ‘కోరి కబేలాకు తీసుకొని పోవుచున్న పశువు – దారి ప్రక్కనబోవుచున్న గడ్డి బండిపై తారాడు పసుల తీరుగా నున్నది జనుల భోగాశ – అన్న మధ్యాక్కరలలోని జీవుని ప్రవృత్తిలోని వైవిధ్యము, చాపల్యము, క్లేశము మనకు గోచరిస్తాయి.
ఈ నారాయణరావు కుమారుడు రామ్ నారాయణ్ గాఢ శబ్దదీప్తి కలిగిన కవి. అతని లఘు కవితలలో ఈ విశ్వమానవ సంవేదనల స్ఫూర్తి హృదయ కవాటాన్ని తట్టి లేపుతుంది.
మ్రోయుతుమ్మెదలో మనకు కానవచ్చే మరొక బలమైన పార్శ్వం మనిషి తనలో తాను పరిణమించి ఉన్నత జీవనాన్ని అందుకునే తీవ్ర ప్రయత్నం. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. కామక్రోధాదులను ఒక్కో అంశం దాటుతూ చివరకు వశిష్ఠునితో సమానమైన స్థితిని పొందుతాడు. శ్రీరామచంద్రునికి గురువవుతాడు. ఈ నవలలో నారాయణరావు అధిరోహణం అట్లాగే కనిపిస్తుంది. మహాభారతంలో కర్ణుని స్వరూపం వేరు. అతని స్పర్థ అంతా ఆత్మన్యూనతా భావంలో నుంచి వచ్చిందే. అందువల్లనే ఆ కథ విషాదాంతం అయింది. విశ్వామిత్రుడు క్రమంగా మెట్లెక్కి గాయత్రీ మంత్రద్రష్ట అయినాడు.
ఈ నవల సామాన్యమైన నవలా రూపాన్ని అతిక్రమించింది. సంగీత విద్యా చరిత్ర అయింది. ఆత్మకథ అయింది. అనేకోపాసనా రహస్యాలను ఇమిడించుకొన్నది. నారాయణరావుకు తన తల్లి సంగీత విద్యాదేవత దర్శనమిచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. కొంత కవిత్వమున్నది. అంతా ఒక అన్వేషణ. ఒక జీవన రహస్యాన్ని వివృతం చేసే లక్షణం. మధ్య యుగాలనుంచి ఈనాటి దాకా భారతీయ సంస్కారంలో కలిగిన మార్పులను తెలియజేసే ఆఖ్యానం. భావుక లోకం లోనికి చేసిన ఒక రహస్య ప్రయాణం.
గ్రంథం ప్రారంభంలోనే ప్రణవోపాసనతో ఆరంభం అవుతుంది. ప్రణవం మూడు స్వరాలను కలిపి చేయవలసిన సాధన. అకారము సృష్టి ఆరంభము. అది వట్టి ఆకాశము ఉకారము బహుస్యాం ప్రజాయేయ అన్న సంకల్పము. నానా జంగమ స్థావరాత్మకమైన సృష్టి ఆవిష్కారము. మకారము చివరి దశ. ఉపసంహారము.
అడవిలో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుడు క్రమంగా మకారోపాసనలో సంలీనమైనాడు. దాంతో దంపతులిద్దరూ మృత్యువును పొందినారు. ఉపాసన ఫలితం వ్యర్థం కాలేదు. బాలుడు బ్రతికినాడు. మకారము నాదమైంది. అదే మ్రోయుతుమ్మెదయైంది.
ఔపాస్యునకు ఉపాసకునకు నడుమ భేదము తొలగిపోయింది. ఇది ఎక్కడో ఉపనిషత్తులలో చెప్పబడిన అంశం. ఆ ఉపాసకుని నుండి బాలునకు సంక్రమించడం వల్ల అది మొత్తం గ్రంథం అంతా మ్రోగుతూ వచ్చింది. ఉపసంహారంలోనూ ఈ ఉపాసనాంగం స్పృశింపబడుతోంది.
‘మ్రోయుతుమ్మెద’ ఎంత ప్రతీకాత్మకమైన నవలయో అంత మానవీయ స్పర్శగల నవల. నారాయణరావును పెంచిన తల్లిదండ్రుల వాత్సల్యము అసాధారణమైంది. అతని సంసార వ్యామోహము తక్కువైనదేమీ కాదు. అతని జీవితంలో నరహరి నిర్వహించిన పాత్ర అసాధారణమైంది. అనేక కాలం వారిద్దరూ అనుభవించిన దారిద్య్రం, దుఃఖం, వేదన సామాన్యమైనవి కావు. ఈ మానవీయ లక్షణం దీన్ని సజీవమైన ఇతిహాసంగా పరిణమింప చేస్తుంది.
మ్రోయుతుమ్మెద ఒకవిధంగా సంగీతము, ఉపాసన. ఇతరాంశాలు ప్రక్కన పెడితే ఒక ముక్తిమార్గం వైపు ప్రయాణించే జీవుని ప్రయాణం. ‘సంగీత జ్ఞానము, భక్తివినా సన్మార్గము గలదే ఓ మనసా’ అన్న త్యాగరాయస్వామి సూక్తి నారాయణరావు విషయంలో సార్థకమవుతుంది. ఇక్కడ భక్తి అనే శబ్దాన్ని ఆర్తి అని మారిస్తే ఇంకా సరిపోతుంది.
సంగీతం సాహిత్యం రెండూ జన్మజన్మల నుండి సాగివచ్చే అంశాలు. మాధుర్యం, భావుకత రెండూ ఈ పాథేయంలో కలిసే ఉంటాయి. జీవులు మననశీం కలిగి ఉంటే అది జీవన లక్ష్యం చివరి దాకా చేరుస్తుంది. ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మవిద్యలు ఏ అంచుదాకా ప్రయాణింప జేస్తవో ఈ లలిత కళలు – సరస్వతీ ఆవిష్కారాలు అలాగే చివరి అంచుదాకా చేరుస్తవి.
మ్రోయుతుమ్మెద ఈ విషయంలో విశ్వనాథ, నారాయణరావు అనే ఇద్దరు మహానుభావులకు ప్రతిష్ఠా స్థానమైంది.
మ్రోయుతుమ్మెదలోని కవి విశ్వనాథ, గాయకుడు నారాయణరావు. ఇద్దరూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతస్థాయికి చెందినవారు. వారు మంత్రించిన విభూతి ఇస్తే ఆధివ్యాధులు తొలగిపోయేవి. ఒక గణితశాస్త్ర ఆచార్యులు పుత్రుని మనోవ్యాధివలన దుఃఖంలో మునిగివుంటే అతనికి ఒక రుద్రాక్ష భుజానికి కట్టి ఉపదేశించి దుఃఖాన్ని తొలగించారు. అట్లాగే ఒక వ్యక్తిని మంత్రోపదేశం చేసి మంచి కవిగా తీర్చిదిద్దారు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. విశ్వనాథ విషయంలోనూ అనేక సందర్భాలలో ఆధివ్యాధులు తొలగడం, కోరికలు తీరడం, వాంఛితాలు సిద్ధించడం ఎందరికో అనుభవంలో ఉంది.
భావుకులు జయింతురు గాక!
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.