[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[రాజమండ్రిలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రముఖ సైకోథెరపిస్ట్ ప్రభాకర్‌కి సన్మానం జరుగుతుంది. సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, ఇతర పెద్దలు, ప్రేక్షకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అయినా ప్రభాకర్ ఎవరి కోసమో చూస్తున్నాడు. మొదలుపెడదామా అని సభానిర్వాహకుడు అడిగితే, మరో అయిదు నిమిషాలు చూద్దాం అంటాడు. పక్కనే కూర్చున్న భార్య, ఎవరి కోసం చూస్తున్నారని అడిగితే, మీన్స్ కోసం అని అంటాడు. వస్తానని చెప్పాడా అని అడిగితే, లేదు, కానీ తాను రమ్మని గట్టిగా చెప్పానని అంటాడు ప్రభాకర్. భర్త మనస్తత్వం గురించి ఆలోచిస్తూ, తన గతాన్ని, తమ వివాహం జరిగిన వైనం గుర్తు చేసుకుంటుంది మీనాక్షి. తమ అమ్మానాన్నలు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారనీ, ఇద్దరికీ ఎవరూ లేరని తండ్రి రాఘవ చెప్పిన మాటలూ, తనకి పదేళ్ళ వయసులో తల్లి దేవి జబ్బు చేసి చనిపోవడం, అప్పటి నుంచే తండ్రే అన్నీ అయి పెంచడం జ్ఞాపకం చేసుకుంటుంది మీనాక్షి. తాము ఎవరూ లేకుండా బ్రతికాం కాబట్టి, కూతురిని బంధువర్గం ఎక్కువగా ఉన్న కుటుంబంలో ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్న రాఘవ – ప్రభాకర్‌తో పెళ్ళి జరిపిస్తాడు. భర్త తట్టి పిలవటంతో మీనాక్షి వర్తమానంలోకి వస్తుంది. ఓ మానసిక నిపుణుడిగా ప్రభాకత్ గత పది సంవత్సరాల్లో చాలామంది మనసులకి చికిత్స చేసి మామూలు మనుషులను చేస్తాడు. విడిపోతున్న జంటలను కలిపాడు, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులను డిప్రెషన్ నుంచి బైటకి తీసుకొచ్చాడు. సభ మొదలవుతుంది. ప్రభాకర్ వల్ల మేలు పొందిన గుర్నాథం ముఖ్య అతిథి. తమ కుటుంబ సమస్యను ప్రభాకర్ ఏ విధంగా పరిష్కరించినదీ ఆయన సభకు చెప్పడం మొదలుపెడతాడు. ఇక చదవండి.]
అధ్యాయం 3
వారి మధ్యనున్నది కమ్యూనికేషన్ గాప్. ఆ సభ్యుల మధ్య అటువంటి అపార్థాలు పోవాలంటే ఏం చెయ్యాలి? తను వారి కుటుంబ సమస్యల్లో కల్పించుకున్నాడని వాళ్లకి తెలిస్తే వాళ్ళ పరువూ, మర్యాదా పోయినట్టు బాధపడతారు. వాళ్లలో వాళ్లకి ఎంతెంత భేదాభిప్రాయాలున్నా తండ్రిని కొడుకూ, కొడుకుని తండ్రీ వెనకేసుకొస్తారు తప్పితే ఇంటిగుట్టు బైట పెట్టరు.
ఎంత ఆలోచించినా ఆ కుటుంబ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఉంటుందో అర్థం కాలేదు ప్రభాకరానికి. అదే ఆలోచిస్తూ అతను కంప్యూటర్లో దీనికి సంబంధించిన విషయాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు ఆ రోజు అకస్మాత్తుగా ఆ వెబ్ సైట్లో ఒక పక్కన “ఆస్క్ మీన్స్.. మీన్స్‌ని అడగండి.” అంటూ ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ కూడా ఒక స్లైడ్ పైకీ కిందకీ వస్తూ కనిపించింది.
ఆశ్చర్యపోయాడు ప్రభాకరం. సైకాలజీ సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కప్పుడు రిఫరెన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేసే ప్రభాకర్ అప్పటిదాకా అన్నీ ఇంగ్లీషులోనే చదివాడు. తెలుగులో కూడా ఆ సబ్జెక్ట్ మీద సలహా లిచ్చేవారున్నారన్న ఆ స్లైడ్ చూసాక అసలు వాళ్ళెవరా అని చూసాడు. పూనా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ దగ్గర పని చేస్తున్న ఒక రీసెర్చ్ స్కాలర్ ఇచ్చిన ప్రకటన అది.
ఇంక ప్రభాకర్ ఆనందానికి అవధుల్లేకపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఉన్న ఆర్టికిల్స్ ఎన్ని చదివినా, అతను ప్రైవేటుగా ఎం.ఎ పరీక్షలు రాయడం వల్లా అందులోనూ తెలుగు మీడియంలో రాయడం వల్లా ఆ ఆర్టికిల్స్ పూర్తిగా అర్థమయేవి కావు. అసలు కొన్ని టెక్నికల్ పదాలు అస్సలు అర్థమయ్యేవి కావు. అస్తమానం డిక్షనరీ చూసుకుంటుండడం, ఆ డిక్షనరీలో ఇచ్చే అర్థానికి ఆ సబ్జెక్ట్‌ని అన్వయించుకోవడం అతనికి చాలా కష్టమయ్యేది. అందుకని ఆ మీన్స్ పెట్టిన స్లైడ్ చూడగానే తను ఆలోచిస్తున్న గుర్నాధంగారి కేసు గురించి వివరాలు తెలుగులో టైప్ చేసి, దానికి పరిష్కారం చెప్పమని ఆ మీన్స్ ఇచ్చిన మైల్ ఐడికి మెయిల్ చేసాడతను.
మర్నాడు ప్రభాకరం నిద్ర లేచి చూసుకునేసరికి దానికి చికిత్స ఏమిటో ఆ మీన్స్ అన్నాయన సమాధానం ఇచ్చాడు. చదివి థ్రిల్లయిపోయాడు ప్రభాకరం.
దాని పేరు “మిరాకిల్ క్వశ్చన్..” ——-
మానసికవైద్యుడు కుటుంబసభ్యులని విడివిడిగా “రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఒక అద్భుతం జరిగినట్లు కల వచ్చిందనుకోండి. ఉదయం లేచేక ఆ అద్భుతం నిజమయినప్పుడు అది ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు..” అనడిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కొక్కరకం సమాధానాలిస్తారు. ఆ సమాధానాలను బట్టి వైద్యుడు వారు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని, అది నెరవేర్చుకుందుకు వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళనే అడిగి, ఏం చెయ్యాలో వాళ్ళకే తెలిసేటట్లు చేస్తాడు. ఆ సలహాయే పాటించాడు గుర్నాధం కేసులో ప్రభాకరం.
ఒకరోజు తమ రెండుకుటుంబాలూ కలిసి పిక్నిక్ వెళ్ళేలా ప్లాన్ చేసాడు. అక్కడ ఈ మిరాకిల్ క్వశ్చన్ అడిగాడు. ఎవరేం రాస్తున్నారో ఎవరికీ తెలీదనే ఉద్దేశ్యంతో మర్నాడు లేవగానే తమకి ఏ అద్భుతం జరిగితే బాగుంటుందో అందరూ రాసారు.
ఇంట్లో ప్రతివాళ్లకీ ఇంకొకరంటే అభిమానమే.
అందుకే కొడుకు చంద్రం రేపటికోసం ఆలోచించి పొదుపు చెయ్యట్లేదని, తండ్రి గుర్నాధం తన మనవరాలి పెళ్ళీ, మనవడి చదువూ దృష్టిలో పెట్టుకుని తను బాంక్ లో దాస్తున్నసగం పెన్షన్ గురించి రాస్తూ, అది మనవల అవసరాలకి ఉపయోగపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంటూ రాసాడు.
ఇల్లు నడిపే బాధ్యత తనదనీ, భార్య ఉద్యోగం అంటూ మొదలుపెడితే ఇంటా బయటా చేసుకోలేక అలిసిపోతుందనీ, ఆ విషయంలో భార్య తనని అర్థం చేసుకుని రోజూలా సణగకుండా తనని చిరునవ్వుతో పలకరించినట్టు చంద్రం రాసాడు.
ఇంజనీరింగ్ పూర్తయాక అన్నగారు తనని చిన్న చిన్న ఉద్యోగాలెందుకూ, మంచిదొస్తుందీ అంటూ ఏ ఉద్యోగంలోనూ చేరనివ్వట్లేదని విష్ణుకి విసుగు. అందుకే చిన్నదో పెద్దదో ఏ ఉద్యోగం వచ్చినా సరే అందులో చేరిపోయినట్టు విష్ణు రాసాడు.
ఎమ్.ఎ. పాసయి, అన్ని అర్హతలున్నా కూడా డబ్బుకి ఇబ్బంది పడతాడు తప్పితే తనని ఉద్యోగం చెయ్యనివ్వటం లేదని భార్య సుగుణ కంప్లైంట్. అందుకే భర్త తను ఉద్యోగంలో చేరడానికి ఒప్పుకున్నట్టు సుగుణ రాసింది.
అందరి సమాధానాలు విన్నాక గుర్నాధంగారి కుటుంబం కలిసికట్టుగా, ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలిసిందతనికి.
ఒక స్నేహితుడిలా రోజూ వాళ్ళింటికి వెడుతూ ఒకరి మనసులో ఉన్న భావం ఇంకోరికి తెలీకపోవడం వల్ల వచ్చిన ఆ సమస్యని ప్రభాకరం అందరినీ కూర్చోబెట్టి, మనసు విప్పి మాట్లాడేటట్టు చేసి, ఆ కుటుంబంలో మళ్ళీ ఆనందం నింపాడు. అదేమీ అంత తేలిగ్గా అయిపోలేదు. ఒక్కొక్కరితో మాట్లాడడం, వాళ్ళకి ఇంకొకరి మనసులో మాటను విప్పి చెప్పడం, ఇద్దరి మధ్యనున్న అపోహలు తొలగించడం, అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడేటట్టు చేయడం అంత సులభమూ కాదు, అంత వెంటనే అయేదీ కాదు. దానికోసం ప్రభాకరం చాలా శ్రమ పడ్డాడు. దాదాపు రెండునెలల ప్రయత్నం తర్వాత కుటుంబంలో అందరూ కలిసి ఒకచోట చేరి మాట్లాడుకునేదాకా తెచ్చాడు. మరో రెండు నెలలకి వారి మధ్యనున్న అపోహలు కూడా పోయి అందరూ హాయిగా, ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ ప్రక్రియలో అడుగడుగునా దేని తర్వాత ఏం చెయ్యాలో ప్రభాకరం ఈ మెయిల్లో ఆ మీన్స్‌ని అడుగుతూనే ఉన్నాడు. ప్రభాకర్ అడిగిన మర్నాడే ఆ మీన్స్ కూడా సమాధానం ఇస్తూనే ఉన్నాడు.
తండ్రిలాంటి గుర్నాథంగారు తన గురించి చెపుతున్న మాటలు పూర్తయేసరికి మళ్ళీ ఈ లోకంలో కొచ్చాడు ప్రభాకరం. గుర్నాథంగారి తర్వాత ప్రభాకరం దగ్గరికి చికిత్స కోసం వచ్చినవాళ్ళు ఇంకా చాలామంది అతను తమ కుటుంబాలనెలా నిలబెట్టాడో చెప్పారు.
ఊరి పెద్దల సమక్షంలో అతనిచేత బాగుపడిన కుటుంబాల మధ్య అంతమంది ఆహూతుల ముందు భార్య మీనాక్షి పక్కనుండగా పూలదండ వేయించుకుని, శాలువా కప్పించుకుని, సన్మానపత్రం చదివించుకున్న ప్రభాకరానికి ఆ రోజు ఎన్నడూ లేనంత సంతోషంగా అనిపించింది. తనకి జరుగుతున్న ఈ సన్మానంలో భార్యకి కూడా స్థానం కల్పించాలని ఆమెని వెంటపెట్టుకొచ్చాడతను. ఒకసారి ప్రేమగా భార్య వైపు చూసుకుని గర్వపడ్డాడు ప్రభాకరం.
అధ్యాయం 4
ఇంటికి రాగానే తన మెడలోని దండ మీనాక్షి మెడలో వేసాడు, “ఇదేమిటీ!” అంది మీనాక్షి నవ్వుతూ. “నిజం మీనూ, నీ సహకారం లేకపోతే నేను సాయంత్రాలు ఇలా ప్రాక్టీస్ పెట్టగలిగేవాడినా! అమ్మా, నాన్న పోయిందగ్గర్నించీ నువ్వు వాళ్ళు చెప్పినట్టే ఇంట్లోనూ బైటా మా కుటుంబ సాంప్రదాయం పాటిస్తూ, నా గౌరవం నిలబెడుతున్నావు. ఒక ఇంటి గౌరవం ఆ ఇంటి ఇల్లాలి మీదుంటుందన్న మాట నువ్వు ఋజువు చేసావు” అన్నాడు.
“మరిందాకా ఈ గౌరవమంతా ఆ ఎవరో మీన్స్ది అన్నారు” అంది నవ్వుతూ.
“అది పూర్తిగా కేసుల గురించి. ఇది పూర్తిగా ఇంటి గురించి. దేనికదే” అన్న ప్రభాకరం మాటలకి “ఏం, ఇంట్లో వుండేవాళ్ళకి అలాంటి కేసుల గురించి తెలీదంటారా!” అంది కూపీ లాగుతున్నట్టు.
“ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్నీ, మొగుణ్ణి చూసుకునేవాళ్లకి అంతంత పెద్ద పెద్ద విషయాలేం తెలుస్తాయీ నీ పిచ్చి కానీ..” అంటూ, “తొందరగా వడ్డించెయ్యి మీనూ, బాగా ఆకలేస్తోంది. నేనీ లోపల ఆ మీన్స్‌కి నా థాంక్స్ చెప్పేసొస్తాను” అంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు ప్రభాకరం.
అలా అతన్ని చూస్తున్న మీనాక్షికి తను ఈ ఇంటికి కోడలిగా వచ్చిన వైనం గుర్తుకొచ్చింది.
అటూ ఇటూ తమవాళ్ళంటూ ఎవరూ లేకుండా ఒకరైన అమ్మానాన్నలు ఒకరికొకరయి తనని ప్రాణంగా చూసుకున్నారు. తల్లి పోయేక తండ్రి తన అన్నగారయిన రంగనాథం అడ్రసు కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అతని ప్రయత్నం ఫలించలేదు కానీ మీనూ సైకాలజీలో ఎం.ఎ పాసయి, పి.హెచ్.డి. చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది.
ఆ మర్నాడు మీనూ సెమినార్ కోసం ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా ఆ రోజు రాఘవకి రంగనాథం దగ్గర్నుండి ఒక ఉత్తరం వచ్చింది.
“చిరంజీవి తమ్ముడు రాఘవని ఆశీర్వదించి అన్నయ్య వ్రాయునది..
ఎప్పట్నించో ప్రయత్నిస్తుంటే ఇప్పటికి నీ అడ్రసు దొరికింది. వచ్చేనెలలో మా పెద్దమ్మాయి కరుణ పెళ్ళి. నువ్వూ, మరదలూ మీ కుటుంబంతో రండి. ఎదురుచూస్తుంటాను..”
ఉత్తరం అందుకున్న రాఘవ పొంగిపోయేడు. చాలా సంవత్సరాల తర్వాత తండ్రి మొహంలో ఆనందం చూసింది మీనూ. అన్నకి తన మీదున్న ప్రేమ గురించి ఉబ్బితబ్బిబైపోతూ మీనూకి కథలు కథలుగా చెప్పాడు. ఆ రాత్రే రామనాథం ఉత్తరంలో రాసిన ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసాడు. అవతల్నించి “హలో” అని వినిపించగానే ఇటు రాఘవకి నోట మాట రాలేదు.
అవతల్నుంచి “హలో హలో” అని ఒకటికి రెండుసార్లు వినిపించాక కాస్త తెప్పరిల్లి, “అన్నయ్యా.. నేను.. నేను..” అన్నాడు తడబడుతూ.
“రాఘవా… రాఘవేనా!” అవతల్నుంచి ఆశ్చర్యానందాలతో వినిపించింది రంగనాథం గొంతు.
“అవునన్నయ్యా.. నేనే.. మీ అడ్రసు కోసం చాలా ట్రై చేసాను. దొరకలేదు. నీ ఉత్తరం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది అన్నయ్యా..”
“అవున్రా.. ఈ ట్రాన్స్ఫర్ల వల్ల ఒక పెర్మనెంట్ అడ్రసు అంటూ లేకుండా పోయింది. ఈ మధ్యే రిటైర్ అయ్యేను. ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు అమ్మేసి, రాజమండ్రిలోనే ఇల్లు కొనుక్కుని ఇక్కడే సెటిలైపోయేను. నువ్వెక్కడ ఉన్నావోనని అప్పట్నించీ ప్రయత్నిస్తూనే ఉన్నానురా.. అమ్మ నీ బెంగతోనే పోయింది. మొన్నీమధ్య మన పెద్దత్తయ్యగారి బుల్లాడికి నువ్వు పూనాలో కనిపించావని చెప్పగానే పూనాలో ఉన్న నాకు తెలిసినవాళ్లని నీకు తెలీకుండా నీ గురించి కనుక్కోమని చెప్పేను. తెలిస్తే మళ్ళీ నువ్వు ఊరు మార్చేస్తావేమోనని భయం. అప్పుడే ఆర్నెల్లయింది వాళ్లకి చెప్పి.. వాళ్ళూ క్రితంవారం నీ అడ్రసు పంపించారు. నీకింకా మా మీద కోపం పోలేదేమోనని భయపడుతూనే నీకు ఉత్తరం రాసేను. నువ్వు ఫోన్ చెయ్యడం చాలా సంతోషంగా ఉందిరా.. మీరంతా ఓసారి ఇటువైపు రండి.”
అవతల్నించి రామనాథం చెపుతున్నది వింటున్న రాఘవ అన్నగారికి తన భార్య పోయిన విషయం, ప్రస్తుతం తన కూతురు మీనాక్షి, తనూ మాత్రమే ఉంటున్న విషయం చెపుతూ.. వచ్చే నెలలో పెళ్ళికి పదిరోజుల ముందే వచ్చేస్తామని చెప్పేడు. చాలా సంవత్సరాల తర్వాత తండ్రి మొహంలో అంత సంతోషం చూసింది మీనూ.
సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయేడు రాఘవ. మామ్మగురించీ, తాతగారి గురించీ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అలిసిపోయేడు. అన్న రామనాథానికి తనంటే ఎంత ప్రాణమో చెప్పేడు.
వచ్చే నెలలో పెళ్ళికి పదిరోజులముందే రాజమండ్రి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు తండ్రీ కూతురూ.
మీనూ సెమినార్ పూర్తయి ఢిల్లీ నించి వచ్చేసరికి రాజమండ్రి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తానని చెప్పేడు.
(సశేషం)
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.