[బోరి మురళీధర్ గారి ‘మౌనం ఎరుపు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత శ్రీ బోరి మురళీధర్ గారి తాజా కథాసంపుటి ‘మౌనం ఎరుపు’. ఇందులో 14 కథలున్నాయి. ఈ కథలు 1989 – 2020 మధ్య ప్రచురితమైనవి.
~
సాధారణంగా, ఏ వర్గానికి చెందిన మహిళ అయినా, పేద కావచ్చు, సంపన్నురాలు కావచ్చు – తన భర్తని మరొక స్త్రీతో పంచుకోడానికి అంగీకరించదు. కానీ ‘భూమి తల్లి’ కథలో పోసాని ఆ పని చేస్తుంది. మొదట అందరిలానే తనూ మొగుడు లింగయ్యని ఆడిపోసుకుంటుంది. లింగయ్యతో ఉంటున్న గంగామణి దగ్గరకెళ్ళి నిలదీస్తుంది. అయితే గంగామణి చెప్పిన సంగతులు, అన్న మాటలు పోసాని నిర్ణయాన్ని మారుస్తాయి. లోకం తీరుకి వెరవకుండా, గంగామణిని తన ఇంటికే తెచ్చుకుని, అందరూ కలిసి ఉంటారు. మరి పోసాని నిర్ణయాన్ని ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? “దునియకు భయపడకుండా, మనకు మంచిగనిపించినట్లు బతకాల” అని చెప్పిన పోసానిని – “ఇసుంటి మంచితనమూ ఆళ్ళకు ఎరుకలేదు! ఇసుంటి ధైర్యమూ ఆళ్ళకు ఎరుకలేదు!” అంటూ ఊశక్క అభినందిస్తుంది. పోసానిది రాజీయా లేక తెగింపా అన్న సందేహం కలిగినా, సమాజంపై ఆమెకున్న అవగాహనని గ్రహించాకా, ఆ సందేహం పటాపంచలవుతుంది.
కుటుంబంలో తల్లి విలువని, పిల్లల జీవితాలకో దారి చూపేందుకు ఒంటరి తల్లి పడే యాతనలని ‘అమ్మ కధా భరిస్తుంది’ కథ చెబుతుంది. కొడుకుల పట్ల తల్లి ప్రేమని చాటుతూనే, రెక్కలొచ్చిన కొడుకులు ఎగిరిపోయిన వైనాన్ని వెల్లడిస్తుంది. ఒక అమ్మకి వివిధ సందర్భాలలో ఎదురైన పరిస్థితులను ఆమె ఎదుర్కున్న తీరుని వివరించి, ‘అమ్మ కదా! భరిస్తుంది!’’ అని రాయడం చక్కని ప్రయోగం, కథలో ప్లో ని నిలిపి ఉంచడంలో ఉపయోగపడింది. మీడియా రంగంలోని పెడధోరణులను వ్యంగ్యాత్మకంగా ఎండగడుతుందీ కథ. కథని బస్సు ప్రయాణంతో మొదలుపెట్టి, బస్సు ప్రయాణంతోనే ముగించడం చక్కని టెక్నిక్.
తను చేస్తున్నది దొంగతనమే. కానీ దాని వెనుక ఓ తపన ఉంది, సదుద్దేశం ఉంది. అయినా ఓ ఉన్నత లక్ష్యం కోసం, కొన్ని తప్పుటడుగులు వేసినా, అతని దృష్టిలో నేరం కాదు. పైగా పెనాల్టీ కూడా కట్టేస్తున్నాడాయె! ఇంతకీ అతనేం దొంగతనం చేశాడు? తన నేరాన్ని ఎందుకు సమర్థించుకున్నాడు? తెలియాలంటే ‘వారసుడు’ కథ చదవాలి. నవ్య వారపత్రిక నిర్వహించిన ‘తురగా జానకీరాణి కథల పోటీల’లో ₹ 5,000/- బహుమతి పొందిన కథ ఇది. “కొందరి మొహాల్లోని భావాలను మనకెన్ని భాషలొచ్చినా చదవలేం”; “సమాజంలో గౌరవం పెంచేదీ, వృత్తి నైపుణ్యం పెంచేదీ ఆ మనిషి ప్రవృత్తి మాత్రమే” లాంటి చక్కటి వాక్యాల ద్వారా వాస్తవాల్ని వెల్లడించారు రచయిత ఈ కథలో.
మన ఎన్నికల విధానంలోని లొసుగుల్ని వాడుకుంటూ, ఓటర్లకి డబ్బూ, మద్యం ఎరజూపి ఓట్లు వేయించుకోడం; ప్రచార సభలకు బిర్యానీ పొట్లాలు, నగదు, సారా పాకెట్లు ఇచ్చి జనాలని తరలించడం వంటి చర్యలు ప్రమాదాలకి దారితీస్తున్నా, తమకి సంబంధం లేదని తప్పించుకునే అభ్యర్థులు, పార్టీల నిజస్వరూపాన్ని – తమ బస్తీలో పిల్లలకి ఎదురైన ప్రమాదం తర్వాత గుర్తించిన పెద్దలు – అప్పటిదాకా పాటిస్తున్న పద్ధతులకి స్వస్తి చెబుతారు. తమ ఒక్క బస్తీ మారడం వల్ల ఏమవుతుందనే సంశయం కొందరు వెలిబుచ్చినా, ఇప్పుడు జరిగిన దుర్ఘటన అన్నీ బస్తీలకు తెలుస్తుందనీ, వాళ్ళూ ఆలోచిస్తారని అంటాడు బస్తీ పెద్ద. మార్పుకి దోహదం చేసే విధంగా సాగుతుంది ‘పెయిడ్ ఓటర్స్’ కథ.
క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుండా, నిజానిజాలు పరిశీలించకుండా హడావిడిగా చట్టాలు చేసి, వాటిని అమలు చేస్తే – అందరి మేలుకి దోహదం చేయాల్సిన చట్టాలు – కొందరికి చుట్టాలయిపోతాయి. ఎందరెందరో విలువైనవాటిని కోల్పోతారు. అసంబద్ధంగా రూపొందించిన చట్టాలు, అస్తవ్యస్తంగా వాటిని అమలు చేయడం వల్ల వ్యక్తుల జీవితాలలో ఎదురయ్యే పెను సంఘర్షణలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్నటి దాకా తమదైన భూమిని నేడు చట్టం ఆసరాతో, వేరేవరో స్వాధీనం చేసుకుంటే సదరు వ్యక్తి పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబం ఏమవుతుంది? 1/70 చట్టంపై అర్థవంతమైన చర్చని లేవనెత్తుతుంది ‘మరో భూమి కథ’ అనే కథ. ఈ చట్టంపై వచ్చిన కొన్ని మంచి కథల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.
‘ఒక విధ్వంసకర ప్రయాణం’ ఇద్దరు వ్యక్తుల జీవితాలను చెబుతుంది. వారి అంతరంగ కల్లోలాలను, వారు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని నిష్పాక్షికంగా చెబుతుంది. అనుమానపు భర్త నుంచి చట్టపరంగ విడాకులు తీసుకుని కొడుకుతో తన బ్రతుకు తాను బ్రతుకుతూ, తనకి ప్రావీణ్యం ఉన్న నాట్యరంగంలో కృషి చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న నర్తకి స్వాతిని ఇంటర్వ్యూ చేస్తాడు రాంబాబు అనే విలేఖరి. ఆ ముఖాముఖి ప్రక్రియలో ఆమె కొన్ని జీవిత సత్యాలను చెబుతుంది. ఇదే జర్నలిస్టు నిత్యానందరెడ్డి అనే సామాజికవేత్తని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా తన భార్య నుంచి విడిపోయానని చెప్తాడు, కారణం ఆమె అనుమానపు వైఖరి అని చెప్తాడు. ఇద్దరి ఉదంతాలలోనూ వారి జీవిత భాగస్వాములలో తలెత్తిన లైంగిక వికారాలే వారి జీవితాల్ని కల్లోలపరిచాయని రాంబాబు గ్రహిస్తాడు. ఈ విషయంలో దిగువ వర్గాలకు తెల్సిన జీవిత సత్యం ఉన్నత వర్గాలకూ, మధ్యతరగతి వారికీ ఎందుకు తెలియదని అనుకుంటాడు. సమాజంలో మారుతున్న పోకడలకు అద్దం పడుతుందీ కథ. ఈ కథలో కొన్ని అద్భుతమైన వాక్యాలున్నాయి.
వ్యవసాయంపై మక్కువని వదులుకోలేని గంగాధర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకుని వస్తాడు. తన పొలంలోనే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ సేద్యం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన చదివిన చదువు వల్ల కలిగిన విజ్ఞానాన్ని ఆచరణలో పెడతాడు. అయితే అతనికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్ని కొత్త ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుండి ఆసరా కరువవుతుంది. వర్తమాన వ్యవసాయం రంగంలోని సమస్యలను, వ్యవసాయ పట్టభద్రుల కోణం నుంచి చెబుతుంది ‘ఒక ఆకుపచ్చని ఆశ’ కథ. అననుకూలంగా ఉన్న పరిస్థితులలోనూ, గొప్ప ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తుందీ కథ. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి గెలుచుకుందీ కథ.
‘జీవన పరిమళం’ గొప్ప కథ! ఓ రచయిత బాధ్యత ఎలాంటిది? మంచి చదువరి ఎలా ఉండాలి? సంఘానికి సాహితీవేత్తలు ఎలాంటి మార్గదర్శనం చేయాలి? సాహితీవేత్తలంటే, సమాజానికి బయటివారు కాదు, లోపలివారేనని చెబుతూ, వ్యక్తులుగా సంఘానికి ఉపయోగపడేలా జీవితం గడపాలని సూచిస్తుందీ కథ. ఒక మంచి రచయితకీ, ఉత్సాహవంతుడైన పాఠకుడికీ మధ్య జరిగిన సంభాషణ ఈ కథకి ఆయువుపట్టు! అనుభవానికీ, అనుభూతికీ మధ్య ఉండే సున్నితమైన భేదాన్ని ఈ కథ వెల్లడిస్తుంది.
అకారణ రాగద్వేషాల ప్రపంచం నుండి, పొరుగువాడి మీద అసూయపడని చోటుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గిట్టనివాడి పతనంలో సంతోషాలను వెతుకున్నే దౌర్భాగ్యాన్ని వదుల్చుకోవాలంటే ఏం చేయాలి? ‘వెనక్కి నడుస్తున్న మనిషి’ కథ చదివితే తెలుస్తుంది. పురోగమనం వైపు వెళ్తున్నామని భ్రమ పడుతూ ఆధునిక మానవుడు తనకి తాను చేటు చేసుకుంటున్న వైనం కరోనాతో అందరికీ తెలిసొచ్చింది. కరోనా ప్రభావం వల్ల కొందరిలోనైనా తమ జీవితాలలోని కృత్రిమతపై విరక్తి కలిగి బతుకులో సహజత్వం వైపు మళ్ళేలా ప్రేరేపించింది. అలా వెనక్కి మళ్ళిన మనుషుల్లో తిరిగి దురాశ చెలరేగకూడదని రచయిత ఆశించినట్టే, పాఠకులూ కోరుకుంటారు.
“చావు కన్నా, చావు భయమే భయంకరమైనది” అని చెప్తుంది ‘అతని స్పర్శ కోసం!’ కథ. అవసానదశలో ఉన్నప్పుడు పిల్లల స్పర్శని ఆస్వాదించాలని, తనివితీరా మాట్లాడుకోవాలన్న తండ్రి ఆశ – పిల్లలకి చాదస్తంలా అనిపిస్తుంది. ఆసుపత్రిలో ఉన్న తండ్రిని తాకితే, ఏవైనా జబ్బులు తమకి సోకుతాయేమని భయం! జీవితపు మలిదశని అత్యంత ఆర్ద్రంగా ప్రదర్శిస్తుందీ కథ. మనసు భారమవుతుందీ కథ చదివాకా.
‘కొత్త నిర్వచనం’ ఈ సంపుటిలోని ఓ బోల్డ్ కథగా పరిగణించవచ్చు. స్త్రీలు బహిరంగంగా చర్చించలేని, మగవాళ్ళు బాహటంగా చెప్పుకునేవైన శారీరక వాంఛల విషయంలో మంజుల అనే రచయిత్రి, సారథి అనే రచయితల మధ్య జరిగిన చర్చ.. ఈ అంశాలకి కొత్త నిర్వచనాన్నిస్తుంది. ఒకానొక సందర్భంలో తనతో గడిపిన స్త్రీపై తనకేదో హక్కు వచ్చిందని భావించే పురుషుల ధోరణికి చెంపపెట్టు ఈ కథ. “మనమంతా పక్కవాడి బతుకులోని ఘర్షణనో, బక్కవాడి బతుకులోని బాధలనో మన రచనల్లోకి దించి వాటినే కళాఖండాలుగా భ్రమింపజేస్తున్నాం గానీ, మన బతుకుల్లోనే మనం గుర్తించడానికి భయపడే సహజసిద్ధమైన, అనివార్యమైన బలహీనతల్ని రచనల్లోకి దించడానికి భయపడుతున్నాం” అంటుంది మంజుల. ఇది 1995 నాటి కథ. బహుశా ఇప్పటికీ పరిస్థితులేం మారలేదు.
సమకాలీన రాజకీయాలపై, రాజకీయ పద్ధతులపై, ప్రచార పటాటోపాలపై గొప్ప సెటైర్ ‘మాట్లాడే దిష్టిబొమ్మలు’ కథ. మామూలు దిగువ మధ్యతరగతి మనిషైన తన బావమరిది ఉన్నట్టుండి ధనవంతుడయిపోతే.. అందుకు కారణాలేమయి ఉంటాయని బావ పాత్ర ఊహిస్తున్న కారణాలు నవ్విస్తాయి. రాజకీయ పార్టీల మీటింగులకు, నేతలు ఒకరినొకరు దెప్పిపొడుచుకోడానికి – దిష్టిబొమ్మలని తయారు చేసి అమ్మాలన్న ఆలోచన వచ్చిన బావమరిది – ఆ ఆలోచనకి మరింత సృజనాత్మకతని జోడించి.. ఇంతింతై.. నబోవీధిపైనంతై అన్నట్టుగా ఎదిగిపోతాడు. ఈ కథ నవ్విస్తూనే, వ్యంగ్య బాణాలు విసురుతూనే, ఆలోచింపజేస్తుంది, కఠోరమైన వాస్తవాలపై మనసుని మళ్ళిస్తుంది.
ఫ్రెండ్‌షిప్ డే నేపథ్యంలో ఓ కూతురు తన తండ్రిని నీ ఆప్త మిత్రుడెవరు అని ప్రశ్నిస్తుంది. తనకి ఆప్త మిత్రుడెవరో గుర్తు చేసుకోడానికి తండ్రి తన జీవితాన్నంతా పునశ్చరణ చేసుకుంటాడు. కూతురితో సరదాగా తన భార్యే తన బెస్ట్ ఫ్రెండ్ అంటే, ఆ అమ్మాయి.. భార్య బెటర్ హాఫ్ అవుతుందని గాని బెస్ట్ ఫ్రెండ్ కాదని తేల్చేస్తుంది. అప్పుడతను తామిద్దరూ ఒకరికొరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదా అని తర్కించుకుంటాడు. చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అతను గుర్తిస్తాడు. దాంపత్యాన్ని స్నేహంగా మార్చుకోమని సూచించే ఈ కథ 2013 నాటి ‘సరసమైన కథలు’ కథాసంకలనంతో స్థానం దక్కించుకోడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కథలో భార్యాభర్తల మధ్య అవ్యక్తంగా అనురాగమే గోచరించింది కానీ, సరసమైన కథల్లో ఉండే సరసాలేవీ లేవని నాకనిపించింది. ఏదేమైనా చక్కని కథ. పాఠకులని కాసేపు అంతర్ముఖులని చేసే కథ.
ఇక చివరి కథ, పుస్తకం శీర్షికగా ఒదిగిన కథ ‘మౌనం ఎరుపు’. కొన్ని కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. నో వర్క్ నో పే అన్న నిబంధన శ్రామికులకే కానీ, అధికారులకి వర్తించదా అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఓ గిరిజన ప్రాంతానికి అధికారిక పర్యటనకి వచ్చిన అధికారి, అనుకోకుండా పెద్ద వాన పడి, వాగు పొంగడంతో, గిరిజన గ్రామంలో రెండు రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో గిరిజనులకీ అధికారికి మధ్య జరిగిన సంభాషణలో – నో వర్క్ నో పే పద్ధతి గురించి చర్చ జరుగుతుంది. తాము పనికివెళ్ళకపోతే జీతం తెగ్గోస్తారనీ, మరి ఆ అధికారి పని చేయకుండా తమతో పాటే రెండు రోజులు ఖాళీగా గడిపితే ఆ రెండు రోజులకు అతనికి డబుల్ పే ఇవ్వడంలోని మర్మమేమిటో వాళ్ళకి అర్థం కాదు. వారు మౌనం వహిస్తారు, ఆ యువకుడి ముఖం ఎర్రబడుతుంది. వాళ్ళు తనని దోపిడివర్గానికి ప్రతినిధిగా భావిస్తారేమోనని అనుకుంటాడు అధికారి. ఇంతలో వాగులో నీరు తగ్గిపోవడంతో, అక్కడ్నించి బయటపడే అవకాశం దొరుకుతుంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుందీ కథ.
~
ఈ కథలు పాఠకుల మనసుల్ని కదిలిస్తాయి. మనుషుల్ని (సమాజాన్ని) ప్రశ్నిస్తాయి. వ్యవస్థలని నిర్వీర్యం చేయడం పట్ల ఆవేదనని వ్యక్తం చేస్తాయి. నిస్సహాయతల నుంచి తిరుగుబాట్లు తలెత్తుతాయన్న సూచనని చేస్తాయి. వ్యవస్థలను మెరుగుపరచడానికి వ్యక్తి-స్థాయి ప్రయత్నాలను ప్రదర్శిస్తాయి.. ఒకరితోనైనా మొదలైతే.. మార్పు తప్పక వస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆశావాదంతో, సంతృప్తితో పుస్తకం చదవడం ముగిస్తారు పాఠకులు.
***
రచన: బోరి మురళీధర్
పేజీలు: 148
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
~
బోరి మురళీధర్:
8074360923
~
శ్రీ బోరి మురళీధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-bori-muralidhar/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.