అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, తెలుగు శాఖ మరియు పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలను ఫిబ్రవరి 21 న జరుపుకున్నారు.
ఈ సందర్భంగా యువ కవయిత్రి ఎన్. మౌనిక రచించిన ‘మౌన మొగ్గలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో మన తెలుగుభాష కనుమరుగైపోతున్న దశలో ఉందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. తమ కళాశాల విద్యార్థిని మౌనిక రాసిన ‘మౌన మొగ్గలు’ బాగున్నాయని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థినులు రచనలు చేయడానికి కృషి చేయాలన్నారు.


ముఖ్యఅతిథి, ప్రముఖ న్యాయవాది, రచయిత బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ నేడు మహిళాలోకం చదవడానికి ప్రధానకారణం తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, ఆమె వారసత్వాన్ని నేటి విద్యార్థినులు కొనసాగించాలన్నారు. ఆంగ్లభాష మోజులో పడి మన తెలుగుభాషను నిర్లక్ష్యం చేయడం వల్ల మన ఉనికిని కోల్పోతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలన్నారు.
గ్రంథావిష్కర్త, ప్రముఖ కవి, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్దన మాట్లాడుతూ తెలుగుభాషలో కవిత్వం రాయడం వలన తెలుగుభాష సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కవిత్వం రాయడం అలవాటు చేసుకోవాలన్నారు.
ఆత్మీయ అతిథి, ‘మొగ్గలు’ సృష్టికర్త, పాలమూరు సాహితి అధ్యక్షులు డా. భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పురుడుపోసుకున్న మొగ్గలు ప్రక్రియలో ఇప్పటివరకు నలభైకిపైగా పుస్తకాలు వెలువడ్డాయన్నారు. నేటికీ వివిధ సామాజిక మాధ్యమాలలో విరివిగా మొగ్గల కవిత్వం వస్తుందన్నారు.
అనంతరం పాలమూరు యువకవుల వేదిక జిల్లా అధ్యక్షులు బోల యాదయ్య పుస్తక సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉప ప్రధానాచార్యులు డా. పద్మ అనురాధ, అమీనా ముంతాజ్ జహాన్, ఐ.క్యూ.ఎ.సి. కోఆర్డినేటర్ డా.శ్రీదేవి, తెలుగు శాఖాధ్యక్షులు డా. నాగులవరం లక్ష్మీనరసింహారావు, ఉర్దూ శాఖాధ్యక్షులు డా. మహమ్మద్ అహ్మద్, తెలుగు శాఖ విభాగం అధ్యాపకులు సునీత, హేమలత, ప్రభాకర్, శ్రీకృష్ణుడు, లింగమయ్య, డా.సయ్యద్ అస్మా తదితరులు పాల్గొన్నారు.