Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇల్లు, కుటుంబం కోసం ఓ మహిళ తపన ‘మదర్ ఆఫ్ పెర్ల్’ నవల

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా మేరీ మోరిస్సీ రచించిన ‘మదర్ ఆఫ్ పెర్ల్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి. ఇంటర్నేషనల్ మదర్స్ డే ప్రత్యేకం.]

తొలిసారిగా 1996లో ప్రచురించబడిన ‘మదర్ ఆఫ్ పెర్ల్’ నవల మేరీ మోరిస్సీ రాసిన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన తొలి నవల. ఇది ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనతో ముడిపడి ఉన్న ముగ్గురు ఐరిష్ మహిళల జీవితాలను ప్రదర్శిస్తుంది. 1950లలో జరిగిన ఒక బిడ్డను దొంగిలించి వేరొకరి బిడ్డగా మార్చిన నిజ జీవిత ఉదంతం నుండి ప్రేరణ పొందిన మోరిస్సీ ఈ నవల రాశారు. ‘లోటు, ప్రేమ, అపరాధం’ భావనలు నిండిన ఈ నవలని – కఠినమైన, తీర్పులు చెప్పే సమాజంలో నివసిస్తున్న మహిళల నిశ్శబ్ద పోరాటాల గురించి లోతైన, ఆలోచనాత్మక కథనాన్ని అందించే నవలగా మార్చారు రచయిత్రి. ఈ నవల నమ్మకంతోనూ, అత్యంత శ్రద్ధతోనూ వ్రాయబడింది. ఈ నవల కఠినమైన ఇతివృత్తంతో పాఠకులను కదిలించేలా, వాస్తవ ఘటనని ప్రతిబింబించేలా సాగుతుంది.

మేరీ మోరిస్సీ

కథ మూడు భాగాలుగా చెప్పబడింది, ప్రతి ఒక్కటి ఒక మహిళపై దృష్టి పెడుతుంది. మొదటి భాగం ‘ఐరీన్ రివర్స్’ అనే యువతిని పరిచయం చేస్తుంది, ఆమె క్షయవ్యాధితో బాధపడుతూంటుంది, కోలుకోవడానికి ఆమెను శానిటోరియంకు పంపిస్తారు. ఆమె కుటుంబం ఆమెకు నయం చేయడం కంటే ఆమెను దాచిపెట్టడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. ఆమె చాలా కాలం అక్కడే ఉండిపోతుంది. అక్కడ ఆమె స్టాన్లీని కలుస్తుంది, చివరికి వారు వివాహం చేసుకుంటారు. కానీ  తనకు పిల్లలు పుట్టరని ఐరీన్ తెలుసుకున్నప్పుడు, ఆమె దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తీసుకుంటుంది – ఆమె ఆసుపత్రికి వెళ్లి వేరొకరి బిడ్డను ఎత్తుకొస్తుంది. ఆమె ఆ బిడ్డకు ‘పెర్ల్’ అని పేరు పెట్టి ఆమెను తన సొంత బిడ్డగా పెంచుతుంది, ప్రేమ మాత్రమే పరిస్థితులను చక్కదిద్దగలదని నమ్ముతుంది.

ఆ పాప ‘రీటా గోల్డెన్’ అనే టీనేజ్ అమ్మాయి కూతురు, ఆమె చాలా చిన్న వయసులోనే గర్భవతి అవుతుంది, పైగా తాను తల్లి కావడానికి సిద్ధంగా ఉందో లేదో తెలియదు. తన బిడ్డను పోగొట్టున్నప్పుడు, రీటా దుఃఖిస్తుంది, అపరాధ భావనలో కూరుకుపోతుంది – పాపని పోగొట్టుకున్నందుకు మాత్రమే కాదు, ప్రసవానికి ముందు కలిగిన సందేహాల వల్ల కూడా. మోరిస్సీ రీటా పాత్రను కరుణతో చిత్రీకరించారు, ముఖ్యంగా ఎవరి మద్దతు ఉండని మహిళలపై అంచనాల భారం, అవమానపు బరువు ఎంత భారీగా ఉంటుందో ఈ పాత్ర ద్వారా రచయిత్రి ప్రదర్శిస్తారు.

కథలో కేంద్ర బిందువుగా ఉన్న పెర్ల్, తన గతం గురించి నిజం తెలుసుకోకుండానే పెరుగుతుంది. ఆమె పెద్దయ్యాక, ఏదో కోల్పోయిన్నట్లు ఆమెకు అనిపిస్తుంది – వింత జ్ఞాపకాలు, సమాధానాలు లేని ప్రశ్నలు, ఇంకా అసలు తానెవరో తెలుసుకోవాలనే గట్టి అవసరం ఆమెను వెంటాడుతాయి. ఆమె ప్రయాణం నిశ్శబ్దంగా, బాధాకరంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటూ, కోరికతో నిండి ఉంటుంది. మోరిస్సీ పెర్ల్‌కు సున్నితమైన, శక్తివంతమైన స్వరాన్ని ఇచ్చారు. దాంతో ఆమె సత్యం కోసం, గుర్తింపు కోసం జరిపే అన్వేషణ చాలా వాస్తవమైనదిగా, సాపేక్షమైనదిగా మారుతుంది.

ఈ నవల 1950ల నాటి ఐర్లాండ్‌ను ఎంత బాగా చూపిస్తుందంటే అది ఒక అందమైన లేదా ఆదర్శవంతమైన ప్రదేశంగా కాదు, ప్రజలపై తరచుగా కఠినంగా తీర్పు చెప్పే సంఘంగా, ప్రతిష్ఠను కాపాడుకోవడానికి రహస్యాలను కాపాడే సమాజంగా ప్రదర్శిస్తుంది. శానిటోరియంలో ఉండడం నిస్తేజంగా, ఒంటరితనంగా అనిపిస్తుంది, కానీ బయటి ప్రపంచం కూడా  ఓదార్పుని తక్కువే ఇస్తుంది. మోరిస్సీ రచన సరైన పాళ్ళలో భావోద్వేగాలతో సరళంగా, మనోహరంగా ఉంటుంది. కథను మరీ భారంగా చేయకుండా ఆమె తన పాత్రల రోజువారీ పోరాటాలను చూపిస్తుంది.

చివరగా, ‘మదర్ ఆఫ్ పెర్ల్’ నవల ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది: ఒకరిని తల్లిదండ్రులను చేసేది ఏమిటి? అది జన్మనివ్వడమా, బిడ్డను పెంచడమా లేదా అంతకంటే లోతైనదా? మోరిస్సీ సులభమైన సమాధానాలను అందించరు, కానీ, లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ,  ప్రేమ అనేది ఇప్పటికీ ప్రజల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతుందో ఆమె వెల్లడిస్తారు. ఈ పుస్తకం విడుదలైనప్పుడు విస్మరించబడి ఉండవచ్చు, కానీ ఇది పాఠకులు మరిచిపోలేని శక్తివంతమైన, మనసును హత్తుకునే కథగా నిలిచిపోయింది. కుటుంబం, గుర్తింపు, ఇంకా దృఢసంకల్పం వంటి ఇతివృత్తాలపై అల్లిన కథలను ఆస్వాదించే పాఠకులకు, ఇది సూచించదగిన నవల.

***

Book Title: Mother of Pearl
Author: Mary Morrissy
Published By: Vintage
No. of pages: 240
Price: Kindle Edition ₹ 392.96
Link to buy:
https://www.amazon.in/Mother-Pearl-Mary-Morrissy-ebook/dp/B015COLCQY

Exit mobile version