[శరీరావయవాలకు మాటలు వస్తే, అవి ఒకదానితో ఒకటి తమ బాధలు చెప్పుకుంటూ, మనుషులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నట్లు ఈ రచనలో వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్]
“అలా స్తబ్దుగా ఉన్నావేమిటి? అవునూ మొహం గoటు పెట్టుకొని ఉన్నావేమిటి? అరే ఏమైంది? మొహం ఉబ్బిపోయింది?” అంటూ కదలామెదలక కూర్చున్న మూత్రపిండాన్ని పలకరించింది క్లోమం. క్లోమం అలా పలకరించిందో లేదో మూత్రపిండం ఒక్కసారిగా ఏడ్చేసింది.
“ఊరుకో ఊరుకో ఏడవకు! ఏమైందో చెప్పు! అలా నీరసంగా ఉన్నావేమిటి?” మూత్రపిండం వీపు నిమురుతూ ఉరడిస్తూ అడిగింది క్లోమం.
“ఏం చెప్పమంటావు నా బాధ. నా మొహం ఉబ్బిపోయింది. నేనేమీ పని చేయలేకపోతున్నాను. నా కాళ్లు కూడా ఎలా వాచిపోయాయో చూడు”. అంటూ తన కాళ్ళను చూసుకోగానే మాట్లాడడం ఆపి ఏడవడం మొదలు పెట్టింది మూత్రపిండం.
“అయ్యో ఏడవకు ఏడవకు, సరే తర్వాతే చెబుదువు గానీ ముందు ఏడవటం ఆపేయ్, ఇలా కూర్చో! కళ్ళు తుడుచుకో” అని ఊరడిస్తూ “ఇదిగో కాసిని మంచినీళ్లు తాగు” అన్నది క్లోమం. ఆ మాట అనీ అనగానే మూత్రపిండం మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది.
“అరే మళ్లీ ఏమైంది నీతో ఏం మాట్లాడినా ఇబ్బందిగా ఉన్నదే” అని క్లోమం ముందుకు వంగి మూత్రపిండం భుజం తడుతూ అన్నది.
మూత్రపిండం ఏడుస్తూనే “నా ఈ పరిస్థితికి కారణం మంచినీళ్లే కదా! అందుకే నీవు మంచినీళ్లు మాట ఎత్తగానే నాకు ఏడుపు వచ్చింది” వెక్కుతూ వెక్కుతూ చెప్పింది.
“అంటే ఏమిటి! మంచినీళ్ల వలనే నీకీ పరిస్థితి దాపురించిందా! నాకు నీ విషయం వింతగా ఉన్నది నాకేమీ అర్థం కావడం లేదు” అన్నది ఆశ్చర్యంగా క్లోమం.
“నా మొహం కళ్ళు, కాళ్ళు ఇలా వాచిపోయి రోగగ్రస్థమై పోయానంటే ప్రధాన కారణం మంచినీరే. నా కడుపు లోపల రాళ్లు ఏర్పడి బాగా నొప్పి కలిగిస్తుంది. నా ఈ అవస్థలన్నింటికీ కారణం మంచినీరే!” అంటూ మూత్రపిండం చెబుతూ ఉండగానే క్లోమం మధ్యలో అడ్డు తగిలింది. “సకల జీవులకు దాహం తీర్చే మంచినీరు నీకిన్ని కష్టాలను తెచ్చిందా, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. పంచభూతాలలో ఒకటైన స్వచ్ఛమైన మంచినీరు పోయే ప్రాణాలను నిలబెడుతుంది తిండి లేకపోయినా మంచినీటితో కొన్ని రోజులు జీవించవచ్చు అని అంటారు కదా! ప్రాణాన్ని నిలబెట్టే నీరు కాసేపు గొంతు తడపకపోతే ప్రాణం పోవడం ఖాయం. అలాంటి మంచినీటిని తప్పుగా మాట్లాడుతావా?” ఆవేశంగా అన్నది క్లోమం.
“నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడతావేమిటి? మంచినీళ్లు తాకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం. నేనొక ఆడపిల్ల కడుపులో ఉన్నాను ఆ అమ్మాయి ఏ రోజూ తగినంత మంచినీరు తాగదు అందువల్లే నాకీ జబ్బులు వచ్చాయి” అన్నది మూత్రపిండం రోదిస్తూనే!
“ఓహో మంచినీరు తాగకపోవడం వల్ల నీకి జబ్బులు వచ్చాయా! మరి సరిగా చెప్పవేం? నేను మంచినీటి వలనే ఇలాంటి జబ్బులు వచ్చాయనుకున్నాను. అదేమిటి నేను ఎప్పుడూ వినలేదే అనుకున్నాను అందుకే ఆశ్చర్యం అనిపించింది. సరే ఇంతకు మంచినీరు ఎందుకు తాగటం లేదట” ఆరాగా అడిగింది క్లోమం
“అదే నేను ఇందాక చెప్పాను కదా! నేనొక ఆడపిల్ల కడుపులో ఉంటున్నానని. ఆడపిల్లకు చాలా చోట్ల బాత్‌రూములు అందుబాటులో ఉండవు. బాత్‌రూములు తక్కువగా ఉండటం వలన మూత్ర విసర్జన కష్టం కదా! ఎక్కువసార్లు మూత్ర విసర్జన జరగకుండా ఉండాలంటే మంచినీళ్లు తాగటం మానేయాలి అనుకుంటారు. అందుకే చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటే మంచినీరు తాగరు. వారు మంచినీరు తాగకపోతే నా పని ఎలా జరుగుతుంది. దేహంలోని విసర్జకాలను నేను జల్లెడ బట్టి నీటితో కలిపి బయటికి పంపించే డ్యూటీయే కదా నాది, మరి మంచినీళ్లు లేకపోతే దేహంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను బయటికి ఎలా పంపించాలి దాని వల్లే నాకీ బాధ” బోరు బోరున ఏడుస్తూ తన బాధను వెళ్ల గక్కింది మూత్రపిండం.
“వాళ్లు మంచినీళ్లు తాగకపోతే నువ్వేం చేస్తావు దానికి నువ్వు బాధపడి ఏం ప్రయోజనం. వారి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించకు. వాళ్లకే అనారోగ్యం వస్తుంది. వారి ఆరోగ్యం గురించి వారికి శ్రద్ధ లేదా” అని క్లోమం కొద్ది కోపంతో అన్నది.
“వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉంటే నాకీ బాధ ఉండదు. వారికి శ్రద్ధ లేకపోవడం వల్లే నాకీ కష్టాలు వస్తున్నాయి. నేను వ్యర్థాలను బయటికి పంపకపోతే నాకే నష్టం జరుగుతుంది. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఇల్లంతా దుర్గంధమయం అయినట్లుగా ఈ వర్గాలంతా నా కడుపు లోపలే ఉంటే అనారోగ్యం సంభవిస్తుంది. వాళ్లకు డయాలసిస్ అవసరం పడుతుంది. నన్ను ఇబ్బంది పాలు చేసి వారు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏమిటో ఈ తెలివి తక్కువ మనుషులు. నాగరికత పెంచుకున్నాం, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని విర్రవీగే మనుషులు వారికి వారే సొంతంగా జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. “ అని మూత్రపిండం వాపోయింది.
“ఓహో అలాగా! చక్కగా సమయం ప్రకారం మంచినీరు తాగితే ఇన్ని సమస్యలు ఉండవు కదా! చిన్న జాగ్రత్త పాటిస్తే పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చు. ఆడపిల్లకు తగినన్ని బాత్‌రూములు కట్టించవచ్చు కదా! దీనివల్ల ఎంతో ఉపయోగముందని తెలుసు కదా! తెలిసీ పరిష్కరించకపోవడం ఎంత తప్పు” క్లోమం ఆవేశంగా అన్నది.
“నా బాధ కూడా అదే కదా! ఏం చెయ్యను. ఏమి చేయలేకనే ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతో తెలివిగల మానవులు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? నా బాధలు ఎప్పుడూ తీరతాయో! ఎప్పుడైతే పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడే నా బాధలు మాయమవుతాయి. దానికోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ క్లోమం చెయ్యి పట్టుకుని నడవలేక నడుస్తూ వెళ్ళిపోయింది మూత్రపిండం.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.