[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన తాడూరి స్నిగ్ధ గారి ‘మూగమనసులు’ అనే కథని అందిస్తున్నాము. ఇది 2వ, చివరి భాగం. మొదటి భాగం ఇక్కడ.]
అందుకే అతనికి సర్దుకుపోయే గుణం ఉన్న జానకి గారంటే అంత ఇష్టం. నందిత కూడా జానకి గారిలా నోట్లో నాలుక లేనట్లు ఉండేసరికి అతనికి ఆమె అంటే ఇష్టం.
నందిత పుట్టినప్పుడు స్వీట్లు పంచిన ఆయనే రాధ పుట్టినప్పుడు జానకి చనిపోయేసరికి శని అనుకున్నాడు.
కాని కన్న కూతుర్ని తానే అలా అంటే పెళ్ళి చేయాలనుకునే సమయాల్లో ఇబ్బంది అవుతుందని తల్లిని కసురుకునేవాడు.
ఆడపిల్ల నోరు తెరవడమే పాపం అనుకునే రోజుల్లో రాధ మాటలు ఆ ఇంట్లో మామూలు తుఫాను తేలేదు.
“రాధా, నువ్వు ఆడపిల్లవి అని మర్చిపోతునట్లు ఉన్నావు. పెద్దవాళ్ళతో మాట్లాడే తీరేనా అది? మీ అమ్మ అక్కలు ఎంత అణుకువగా ఉండేవాళ్ళు? నువ్వు మనింటికి కళంకం అవ్వకు. నాన్నమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. వచ్చేవారమే నిశ్చితార్థం పెట్టుకుందాం” అని అన్నాడు రాఘవయ్య కోపంగా.
“నేనేం తప్పు చేసానని క్షమించమని అడగాలి నాన్నా” అని; “అయినా నా చదువు ఇంకా పూర్తి కాలేదు నాకిప్పట్లో పెళ్ళి చేసే ఆలోచనలు మానుకోండి నాన్నా” అని నిదానంగా చెప్పడానికి చూసింది.
“ఇప్పటికి చదివిన చదువులు చాలమ్మా. ఇంకా చదివి ఇంకెన్ని మాటలు నేర్చుకుందాం అని ఈ ఆరాటం? ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండు” అని అరిచింది శకుంతల.
“నువ్వు ఆడదానివేనని మర్చిపోకు నాన్నమ్మా” అని అంది రాధ.
“అవ్వా అవ్వా ఎంత నోరు వేసుకొని అరుస్తోంది. మా రోజుల్లో అయితే కాల్చి వాతలు పెట్టేవాళ్ళు. దీన్ని శారద అతిగారాబం చేసి చెడగొట్టింది. ఎవరైనా దీని మాటలు వింటే మనింటి పరువేం కావాలి?” అని మోత్తుకుంది శకుంతల.
మాట మాట పెరిగింది. చివరికి “ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. రేపే నిశ్చితార్థం. వచ్చే వారమే పెళ్ళి. అదే సంబంధం ఖాయం చేస్తున్నా” అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాఘవయ్య.
నందితను ఉన్న ఊర్లో తెలిసిన కుటుంబంలోకి ఇచ్చుకున్నారు. అబ్బాయి ఉద్యోగ రిత్య పట్నంలో ఉంటున్నారు.
కాని రాధకు వచ్చిన సంబంధం బయటిది. ఎలాగోలా పిల్లల్ని పట్నం పంపాలి అనుకుంటున్న మనుషులు కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసుకున్నారు.
వారసుడు లేదు కాబట్టి ఆస్తి కూతుర్లకే వస్తుంది అని కట్నం ఆశతో “మీకు మంచి మంచి పట్నం సంబంధాలు వస్తున్నాయి రాఘవయ్య గారు. మీ బావగారి మాటలు విని (అని శ్రీధర్ గారిని ఉద్దేశించి) బంగారం లాంటి సంబంధాలను చెడగొట్టుకోకండి” అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు బానే మెదడుకి ఎక్కించారు.
ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండరు కాని ఇలాంటి విషయాల్లో బంధువుల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రం బాగా పనికొస్తారు ఇలాంటి పనిపాట లేని మనుషులు.
రాధ మాటలకు కోపంలో ఉన్న రాఘవయ్య మగ పెళ్ళివారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్ళి ఏర్పాట్లు చేశాడు.
“కనీసం వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన పిల్లను ఎలా ఇస్తాము అన్నయ్యా. తర్వాత ఏమైనా తేడా జరిగిన దాని తల రాత అని దాని పాటికి దాన్ని వదిలేస్తారు, కాని చేరదియ్యరు కదా. అయినా సంబంధం అడిగిన వాళ్ళు రేపే నిశ్చితార్థం అంటే ఎలా ఒప్పుకున్నారు అని కూడా ఆలోచించలేకపోతున్నావా?” అని నిలదీసింది శారద.
ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు బాగా తలకి ఎక్కించుకున్న రాఘవయ్య “నా కూతురు జీవితం బాగుండాలి అంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. బయట వాళ్ళు జోక్యం చేసుకోకపోతే మంచిది” అనేసి వెళ్ళిపోయాడు.
ఆ మాటలను శారద తీసుకోలేకపోయింది. రాధను చిన్నప్పటి నుంచి తన కూతురులా పెంచుకుంది. రాధ తమ ఇంట్లో కన్నా శారద వాళ్ళింట్లోనే ఎక్కువ ఉండేది. తమ ఇంట్లో ఉన్న కొద్ది సమయం కూడా శారద గారి బలవంతం మీదే ఉండేది. అది కూడా పూర్తిగా సొంతోళ్ళకి దూరం చేస్తున్నారు అని అంటున్న ఊరి వాళ్ళ నోర్లకి తాళం వేయడం కోసమే.
తెలిసిన వాళ్ళంతా ఏమి ఆశించకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమో ఎవరికి తెలుసు ఆస్తి కోసం కుట్రలు పన్నుతున్నారేమో అనేవాళ్ళు.
తల్లి లేని ఆడపిల్లల్ని ఒకనాడు చూసుకున్న పాపాన పోలేదు కాని ఇలాంటి విషపు మాటలు మాత్రం బానే పండించారు.
అసలైతే నందితను వాళ్ళ కొడుకు వంశీకృష్ణకు చేసుకుంటారేమో అనుకునే వాళ్ళు ఊర్లో.
కాని శ్రీధర్ గారి కుటుంబంలో ఎవరికి అలాంటి ఆలోచనే లేదు.
ఒకానొక రోజు ఈ మాటలు ఆ నోట ఈ నోట మారి వంశీ చెవుల్లో పడ్డాయి.
అప్పుడతడు “నందితను నా చెల్లి మానసతో సమానంగా చూసాను. నాకు కాని తనకు కాని అలాంటి ఆలోచనలు లేవు. మీరు పుట్టించకండి కూడా” అని గట్టిగానే అన్నాడు.
ఇప్పుడిలానే అంటాడు కాని అప్పటికి నందితనే చేసుకుంటాడులేండి అని అప్పట్లో అందరూ చెవులు కోరుక్కున్నారు.
ఆడపిల్లపై అలాంటి మాటలు రావడం మంచిది కాదనుకొని అప్పటి నుంచి కొంత కాలం పై చదువుల కోసం పట్నం వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. కొన్ని నెలల్లో ట్రైనింగ్ పూర్తయ్యి డ్యూటీలో చేరుతాడు.
రాధ పెళ్ళి విషయం విని నందిత, మానస, వంశీలు ఇంత హడావుడిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆశ్చర్యపోయారు.
ఉన్న ఫలంగా పెట్టుకునేసరికి నందిత భర్తకు కుదరక రాలేదు. తన పిల్లలతో నందిత మాత్రమే వచ్చింది.
మానస తన కుటుంబంతో వచ్చింది. వంశీ మాత్రం రాలేదు.
“అప్పుడే రాధకు పెళ్ళి చేయాల్సిన తొందర ఏం వచ్చింది నాన్నా?” అని అడిగింది నందిత.
చివరికి తను కూడా అతన్ని ప్రశ్నిస్తుండేసరికి తట్టుకోలేక “ఏమ్మా నువ్వు మాత్రం పెళ్ళి చేసుకొని భర్త పిల్లలతో సుఖంగా ఉంటావా. అత్తమామలు ఊరు వదిలి రారు. తోడికోడళ్ళ గొడవ లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే ఆడపడుచు. పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భర్త. వజ్రాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఇంకేం కావాలి నీకు. సంతోషంగానే ఉన్నావు కదా. నీ చెల్లి జీవితం ఎందుకు చెడగొట్టాలి అని చూస్తున్నావు?” అని అరిచి వెళ్ళిపోయాడు రాఘవయ్య.
నందిత కళ్ళల్లో నీళ్ళు చేరాయి.
‘నిజమే ఉద్యోగం చేసి నా కాళ్ళపై నిలబడలేకపోతున్నా అనే బాధ తప్ప నాకేం లోటు అనుకునే వాళ్ళే అందరూ. అయినా ఆయన నన్ను ఇంట్లోనే పడి ఉంటావుగా అన్నప్పుడు నా మనసు ఎంతలా గాయపడుతుందో నాకు తప్ప ఎవరికి అర్థం అవుతుందిలే. ఎవరితోనైనా అంటే అన్ని కాళ్ళ దగ్గరికి అందిస్తున్నప్పుడు ఇంట్లో ఉండి వండి పెట్టడానికి ఏం నొప్పి అనే వాళ్ళే కాని ఎవరు అర్థం చేసుకోరు. చేసుకోలేరు కూడా. ఆడపిల్ల ఎన్ని సాధించాలి అన్నా పెళ్ళికి ముందే. తర్వాత చూసుకోవచ్చులే అనుకునే వాళ్ళకి నా జీవితమే ఉదాహరణ’ అని నిర్లిప్తంగా అనుకొని ‘ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపాలి’ అని గట్టిగా అనుకుంది.
నిశ్చితార్థం ఇంట్లో వరకే పెట్టుకున్నారు. శ్రీధర్ గారికి ఇష్టం లేకున్నా కూతురులా పెంచుకున్న పిల్ల కదా వదులుకోలేక అక్కడికి వచ్చాడు.
తాంబూలాలు మార్చుకుని తర్వాత ఉంగరాలు మార్చుకోమనప్పుడు రాధ ఉంగరం పెట్టకుండా “నాకీ పెళ్ళి ఇష్టం లేదు” అని అందరిలో గట్టిగా చెప్పింది.
వచ్చిన వాళ్ళంతా అవాక్కయ్యారు. శ్రీధర్ గారు మాత్రం రాధ వైపు గర్వంగా చూస్తున్నారు.
శకుంతల కోపంగా అందరిలోనే రాధ జుట్టు పట్టి లాగి ఆ చెంప ఈ చెంప చెళ్లుమనిపించింది.
శారద అడ్డు వచ్చి రాధను పక్కకి తీసుకొనిపోయింది. రాఘవయ్యకి అంత మందిలో అలా జరగటం అవమానంగా అనిపించి మగపెళ్ళి వాళ్ళను జరిగిన దానికి క్షమాపణ అడిగాడు.
వాళ్ళు “మరేం పర్వాలేదు పెళ్ళి తర్వాత ఈ పొగరును ఎలా దించాలో మాకు బాగా తెలుసు” అని మరికొంత కట్నం అడిగారు.
శ్రీధర్ గారికి వాళ్ళ మాటలేమీ నచ్చలేదు.
రాధ మాత్రం “మీరా నా పొగరు దించేది. నేనేం మా అమ్మలా మెతక మనిషిని కాను అత్తింటి వాళ్ళు పోరు పడుతూ చావడానికి. మీరు తాగే టీలో ఇంత విషం పోసి ఇస్తాను. దెబ్బకు అందరూ చస్తారు” అని అంది.
రాధకు స్వతంత్రంగా తన మనసులో మాటలు బయట పెట్టే ధైర్యం ఉన్న ఇప్పుడు అనన్ని మాటలు తనకు రావు. అలా ప్రవర్తిస్తే అయినా పెళ్ళికి ముందే ఇలా ఉంది పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందో అని మాకు వద్దు ఈ పిల్ల అని వెళ్ళిపోతారు అనే ఆలోచనతో అలా మాట్లాడింది.
కాని తన ఆలోచనకు విరుద్ధంగా వాళ్ళు స్పందించారు. “వీలైనంత త్వరగా పెళ్ళి జరిపించండి” అనేసి అనుకున్నట్లే వారం రోజులకి ముహూర్తం ఉండేసరికి అదే ఖాయం చేసుకొని వెళ్ళిపోయారు.
శ్రీధర్‌కి మాత్రం అదంతా సరిగ్గా అనిపించలేదు.
అంతమందిలో రాధ అన్న మాటలకు ఎవరైనా సరే పెళ్ళి వద్దు అనుకొని వెళ్ళిపోతారు.
ఆ రోజుల్లో ఆడపిల్ల నోరు విప్పినట్లు అనిపించిన పెళ్ళి రద్దు చేసుకొని పోయిన గాథలు ఎన్నో ఉన్నాయి.
అలాంటిది రాధ మాట్లాడిన మాటలకు చిన్నపాటి యుద్ధమే జరిగేది.
కట్నం కోసమే ఇదంతానా అనుకొని ఆశ్చర్యపోయాడు.
“అంతమందిలో మన పరువు పోయేలా మాట్లాడినది ఇంటి నుంచి పారిపోయి మిగిలిన పరువు కూడా తీయకుండా ఉంటుందా రా. దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బంధించు” అని కొడుక్కి చెప్పింది శకుంతల.
అసలే రాధ చేసిన పనికి కోపంలో ఉన్న రాఘవయ్య ముందు వెనుక ఆలోచించకుండా రాధను బాగా కొట్టి గదిలో బంధించి ఎటు వెళ్ళనివ్వకుండా కాపలా పెట్టేసాడు.
చివరికి ఎంత మొత్తుకున్నా వారం రోజులకు రాధ పెళ్ళి జరిగిపోయింది.
“మా వైపు ఆచారాలు వేరుగా ఉంటాయి. పెళ్ళికూతురుతో పాటు తోడు ఎవరు రాకూడదు. కొన్ని రోజులకి మేమే వస్తాము” అని చెప్పి కట్న కానుకలు అప్పుడే పుచ్చుకొని రాధను తీసుకొని వెళ్ళిపోయారు.
వాళ్ళు అటు కదిలిన గంటకు వంశీ కృష్ణ పోలీసులతో అక్కడికి వస్తాడు.
అప్పటికే రాధను వాళ్ళు తీసుకెళ్ళిపోవడంతో ఆలస్యం చేసానని బాధపడతాడు.
“ఏమయ్యా చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు, అలా ముందు వెనుక చూసుకోకుండా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయడమేనా. అయినా పద్దెనిమిది ఏళ్ళు దాటకుండా పెళ్ళి చేయడం చట్ట రీత్యా నేరం అని తెలీదా?” అని పోలీసులు రాఘవయ్య గారిని అందరిలోనే కేకలేశారు.
“నా కూతురు జీవితం బాగుండాలి అనుకోవడం తప్పా?” అని ఆవేశంగా అన్నాడు రాఘవయ్య.
“చేతురాలా కూతురి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ బాగుండాలి అనుకోవడం ఒకటి. కట్నం కూడా ఇప్పుడే పట్టుకొని పోయుంటారే” అన్నారు పోలీసులు.
శారద గారు కంగారుగా “ఏమంటున్నారండి” అని ముందుకొచ్చి అడుగుతుంది.
అప్పుడు ఒక పోలీస్ – “వాళ్ళంతా పెళ్ళి పేరుతో అమ్మాయిల కుటుంబానికి దగ్గర అయ్యి ఆచారాల పేర్లతో అమ్మాయిని ఒంటరిగా వాళ్ళతో తీసుకెళ్ళి ముందు వాళ్ళు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి డిమాండ్ బట్టి వ్యభిచార గృహాలకు లేదా ఇతర దేశాలకు అమ్మేస్తారు” అని క్లుప్తంగా చెప్తారు.
“అయ్యో నా కూతురు, నా కూతురు” అని నేలపై కులబడిపోయాడు రాఘవయ్య.
“నా మనవరాలి జీవితం ఇలా అయిపోయింది ఏంటి దేవుడా?” అని శకుంతల శోకాలులు పెడుతుంటే ‘ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నీ మనవరాలని’ అని విసుగ్గా అనుకున్నాడు వంశీ.
‘నీ ఏడుపు నా చెల్లి కోసం కాదు మీ ఇంటి పరువు పోయిందని అని తెలియని వారు ఇక్కడ ఎవరు లేరులే నానమ్మా’ అని మనసులో అనుకుంటూ చెల్లి కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నందిత.
“ఇప్పుడేం చేద్దాం సార్?” అని వంశీ కంగారుగా అడుగుతుంటే “ఆ అమ్మాయి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసే లోపే వాళ్ళని వెతికి పట్టుకోవాలి” అని చెప్పారు పోలీస్ ఆఫీసర్.
వాళ్ళ చిరునామా అని రాఘవయ్య చెప్పబోతుంటే “వాళ్ళు మీకు అన్ని సరైన వివరాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? ఒకసారైనా వెళ్ళి చూసి వచ్చారా?” అని ప్రశ్నించేసరికి మౌనంగా ఉండిపోయాడు.
ఆ ముఠా వెళ్ళిన వైపు వంశీ ఇంకా పోలీసులు వెళ్ళి వెతుకులాట మొదలు పెట్టారు.
సరిగ్గా రెండు రోజులకు వంటి నిండా గాయాలతో ఉన్న రాధతో కలిసి ఊర్లోకి అడుగుపెట్టాడు వంశీ.
పొలిమేర దాటి ఊర్లోకి వస్తున్నారో లేదో అప్పుడే అందరూ ‘రాఘవయ్య గారి కూతురు జీవితం కుక్కలు చింపిన విస్తరి అయ్యింది’ అని గుసగుసలాడసాగారు.
ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుని రాధ ముందుకు వెళ్తుంటే వంశీ చూసిన చూపులకి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చి “ఈ గాయాలు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చేసిన పెనుగులాటలో తగిలినవి. వాళ్ళిప్పుడు జైలులో చిప్ప కూడు తింటున్నారు. ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడిన తప్పుగా ప్రచారం చేసిన పరువు నష్టం కేసు కింద అందరిని జైలులో వేయిస్తాను జాగ్రత్త” అని లేని ఓపికతోనే అరిచి నీరసంగా ఇంటి దారిపట్టింది రాధ. ఆమె వెనుకే వంశీ వెళ్తాడు.
వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే “ఇంత జరిగినా ఈ పిల్లకున్న పొగరులో అణువంత కూడా కరగలేదు. ఇంకీ అమ్మాయి జీవితం ఏంటంటారు?” అని మళ్ళీ వాళ్ళ నోర్లకి పని పెట్టుకున్నారు.
రాధ తన ఇంట్లోకి కాకుండా శ్రీధర్ గారింట్లోకి వెళ్ళి శారదమ్మను చుట్టేసి గట్టిగా ఏడ్చేసింది.
రాధను క్షేమంగా చూసిన తర్వాత శారద మనసు కుదుటపడింది.
ఈ రెండు రోజులు ఏడుస్తూ ఉండిపోయిన శారదకు మనమ్మాయికి ఏం జరగదులే అని ఓదారుస్తూ ఉన్న మాటే కాని శ్రీధర్ కూడా బయటికి కనిపించనివ్వకుండా మౌనంగా రోదించాడు.
తన కంగారు బయటికి చూపిస్తే ఇంట్లో అందరూ డీలా పడతారు అని తనలో తానే మథనపడ్డాడు.
ఇప్పుడు రాధను చూసాక ప్రాణం లేచి వచ్చింది. రెండు రోజుల నుంచి ఎవరు పచ్చి మంచనీళ్ళు కూడా ముట్టలేదు.
ఎంతసేపటికి రాధ శారద గారిని పట్టుకొని ఏడవడం ఆపకపోయేసరికి “అమ్మా, అది రెండు రోజుల నుంచి ఏం తినలేదు. డాక్టర్ గారిచ్చిన మందులు వేయాలంటే ముందు తనేమైన తినాలి కదా. ముందా పని చూడు” అని చెప్పాడు వంశీ.
రాధ రావడం తెలిసి రాఘవయ్య తల్లితో కలిసి అక్కడికి వచ్చాడు.
“అమ్మ రాధా” అంటూ లోపలికి వస్తున్న రాఘవయ్యని చూసి మానస వెనుక దాక్కుంది రాధ.
“నన్ను క్షమించు తల్లి..!! నీ జీవితం బాగుందాలనే ఇలా..” అని మాట్లాడుతుంటే రాధ వినదలుచుకోనట్లుగా మొహం పక్కకి తిప్పేసింది.
ఏడ్చి ఏడ్చి తనకు తలంతా భారంగా అనిపిస్తుంటే తల పట్టుకొని అలానే నిలబడిపోయింది.
“అది కాదు తల్లి ఇలా జరుగుతుందని..” అని అంటుండగానే రాధకు తల నొప్పి ఎక్కువయ్యి ఇక ఉండలేక పడకగదిలోకి వెళ్ళిపోయింది.
రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ “రాధమ్మ” అంటూ ఆమె వెంట వెళ్ళబోయాడు.
“తనకిప్పుడు విశ్రాంతి అవసరం మావయ్య. తనని విసిగించొద్దు” అని అడ్డుపడ్డాడు వంశీ.
రాఘవయ్య ఇంకేం మాట్లాడలేక బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేశాడు.
‘భగవంతుడా..!!! చక్కగా పెళ్ళి చేసుకొని పోవాల్సిన పిల్ల జీవితం ఇలా అయ్యిందేంటి స్వామి. ఇంకెన్నాళ్ళు అది మా ఇంట్లోనే పడి ఉంటుంది’ అని తనదైన శైలిలో తను అనుకుంటూ కొడుకుని అనుసరించింది శకుంతల.
‘ఛీ ఈ ముసల్ది ఎప్పటికి మారదు. ఇంత జరిగిన పట్టనట్లు మళ్ళీ పెళ్ళి పిల్లలు అని మోత్తుకుంటుంది’ అని కోపంగా అనుకున్నాడు వంశీ.
“కాసేపు రాధను ఎవరు మాట్లడించొద్దు” అని చెప్పి కుర్చీలో వాలాడు.
నందిత లోపలికి వెళ్తున్నదల్లా వంశీ మాటలకి ఆగిపోయేసరికి “నువ్వు రాధకు తోడుగా వెళ్ళు నందు” అని చెప్పాడు.
మానస కూడా వెళ్ళబోతుంటే “మనూ…!!! అమ్మ ఒకటే ఎన్ని పనులని చేస్తుంది. వెళ్ళి సాయం చెయ్యి పో” అని చెల్లిని విసుక్కున్నాడు.
రాధను తన ఒడిలోకి చేర్చుకొని నిదానంగా వీపు సవరిస్తూ నిద్ర పుచ్చింది నందిత.
ఇందాక శారద గారి ఒడిలో రాని ధైర్యం నందిత ఒడిలో రాధకి లభించింది. బహుశా అది రక్తసంబంధం వల్ల కావొచ్చు. అమ్మ స్పర్శ తర్వాత ఆడపిల్లకు ధైర్యాన్ని ఇచ్చే స్పర్శ ఏదైనా వుందంటే కచ్చితంగా అది తన అక్కదే అవుతుంది.
నందిత ఒడిలో రాధ ప్రశాంతంగా పడుకుంది.
కాసేపటికి లోపలికి వచ్చిన వంశీ రాధను అలా చూసి చాలా బాధపడతాడు.
ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాధ అలా ఉండడం ఎవరు తట్టుకోలేకపోతున్నారు.
వంశీకు చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. అతనికి నందితని చూస్తే జానకి అత్తయ్యలానే అనిపిస్తుంది.
ఆ అమాయకమైన మొహం, మచ్చలేని మనస్తత్వం, మాట్లాడాలంటే నందిత పడే మొహమాటం – అన్ని చూస్తే అతనికి ఎప్పుడు బావగా ఆమెను ఏడిపించాలి అనిపించలేదు.
వంశీ నందితలకు రెండేళ్ల వయసు తారతమ్యం ఉండేది. కాని వంశీ రాధలకు ఇంచుమించు ఎనిమిదేళ్ళ వయసు తారతమ్యం ఉంటుంది.
ఆ వయసు వ్యత్యాసం వల్లనేనేమో సొట్ట బుగ్గలు వేసుకొని ఎప్పుడు నవ్వుతూ ఉండే రాధను చూస్తే అతనికి ఆటపట్టించాలి అనిపిస్తూ ఉండేది.
చిన్నప్పుడు తల్లి శారద వంట పనుల్లో హడావిడిగా ఉంటే అప్పుడప్పుడు అతనే మానస, నందితలకు జడలు అల్లి రిబ్బన్లు వేసేవాడు.
అలాంటిది అతనే రాధ తను స్వయంగా జుట్టు అల్లుకొని రిబ్బన్లు వేసుకొని బడికి పోతుంటే వాటిని లాగేసి ఏడిపించిన రోజులున్నాయి.
పోగు చేసుకున్న డబ్బులతో అతనితో పాటు నందితకు కూడా చిరుతిళ్ళు కొనేవాడు.
వంశీకు, మానసకు తండ్రి శ్రీధర్ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. నందితకు కూడా ఇస్తాడు. కాని ఆమె తీసుకోదు.
అందుకే వంశీనే ఆమెకి ఇష్టమైన నారింజ మిఠాయిలు,చింతపండు చాక్లెట్లు, పల్లిపట్టి, చెకోడిలు కొనిచ్చేవాడు.
కాని రాధ విషయంలో మాత్రం ఆమె పుల్ ఐస్ తింటుంటే లాక్కొని మొత్తం కరిగాకా తిరిగిచ్చి ఏడిపించిన రోజులెన్నో ఉన్నాయి.
ఇలా చాలా విషయాల్లో నందితను వెనకేసుకొచ్చినతను రాధను మాత్రం బాగా ఏడిపించేవాడు.
అలా ఆటపట్టిస్తున్నప్పుడు ఆమె చక్రాల్లాంటి కళ్ళు ఉక్రోషంతో నింపేసుకొని గుండ్రంగా తిప్పుతూ అతని మీదకు కయ్యానికి వచ్చేది.
ఆ కళ్ళు చూడడం కోసమే మళ్ళీ మళ్ళీ ఆమెను ఏడిపిస్తూ ఉండేవాడు.
ఇప్పుడవన్ని గుర్తొస్తుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
అతనికి ఏ కళ్ళైతే ఇష్టమో ఆ కన్నులే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి.
రాధను అతనలా చూడలేకపోతున్నాను. రాధకి నిద్రపోవడంతో నందిత తనను సరిగ్గా పడుకోబెట్టి వంశీతో కలిసి బయటికి వస్తుంది.
“ఏం జరిగిందిరా?” అని శ్రీధర్ గారు వివరం అడిగేసరికి తండ్రి పక్కకు చేరి మొత్తం మొదటి నుంచి చెప్పాడు.
అవతల వాళ్ళు రేపే నిశ్చితార్థం అనగానే ఒప్పేసుకునేసరికి శ్రీధర్ గారికి మనసు ఎందుకో కీడు శంకించి వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోమని వంశీకి చెప్పడంతో అతను నిశ్చితార్థానికి రాకుండా ఆ పనిలో పడతాడు.
అతను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు కాబట్టి అతని పరిస్థితి వివరించి కొన్ని రోజులు సెలవు కోరి వచ్చాడు.
అక్కడి నుంచి వచ్చి ఆ ముఠా వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి వాళ్ళ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఆ వివరాలు అన్ని తప్పు అని తేలాయి. అప్పటికే నాలుగు రోజులు అయిపోయాయి.
అప్పట్లో ఫోనులు ఉండేవి కావు. ఊరికి ఒక టెలిఫోన్ బూత్ ఉండేది. దాన్ని కూడా అత్యవసరం అయితే తప్ప వాడే వాళ్ళు కాదు.
అలాంటి రోజుల్లో ఫోటోలు పంపుకోవడానికి పోస్ట్ ఆఫీస్ ఒకటే వారికి మధ్యమం.
శ్రీధర్ గారి నుంచి ఆ పెళ్ళికొడుకు ఫోటోలు వంశీకి అందేసరికి పెళ్ళి రోజు రానే వచ్చింది.
పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతో కాలంగా వెతుకుతున్న ముఠాకు సంబంధించిన వ్యక్తులని వాళ్ళ నేర చరిత్ర అంతా వంశీకి వివరిస్తూ వాళ్ళను పట్టుకోవడానికి రామాపురం వచ్చారు.
కాని అప్పటికే రాధను వాళ్ళు తీసుకెళ్ళి పోయారు.
వాళ్ళు రాధను తీసుకొని ఒక ఇంటికి వెళ్తారు. రాధకు ఆ మనుషులు ఆ వాతావరణం నచ్చకపోయినా తప్పక వాళ్ళు చూపించిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది.
కొంతసేపటికి పెళ్ళికొడుకు తండ్రిగా వచ్చినతను రాధ గదిలోకి వస్తాడు.
ఇష్టం లేకుండా జరిగినా పెళ్ళి పెళ్ళే కదా దానికి కట్టుబడి ఉండాలనుకుని “మావయ్యా” అని మర్యాదపూర్వకంగా లేచి నిలబడుతుంది.
కాని అతని చూపు ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమెను చేరి బలవంతం చేయబోయాడు.
పారిపోవాలి అని చూసినా గది బయటి వైపు తలుపులు వేసి ఉండేసరికి కుదరక అతన్ని బలంగా నెట్టేసి పై అంతస్తు అయినా జెంకకుండా కిటికి నుంచి కిందికి దూకేసింది.
ఆ ఇంటి వెనుక వైపు నుంచి పారిపోవాలని చూసింది. కాని అక్కడ అయిన శబ్దానికి మిగితావాళ్ళంత వచ్చేసారు.
పై మేడ నుంచి దూకేసరికి ఒక కాలు పట్టేసిన మానప్రాణలను కాపాడుకోవాలి అని పరుగు అందుకుంది.
కొంతసేపటికి వాళ్ళ కన్ను చూపు మేర్లలో నుంచి ఆమె తప్పించుకునేసరికి తలా ఒక దిక్కున వెతకసాగారు.
వాళ్ళ నుంచి తప్పించుకుంది అనుకున్న తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని వాచిపోయిన కాలుని చూస్తూ ఆమె పరిస్థితికి బాధపడసాగింది.
కాసేపటికి పెళ్ళికొడుకుగా వచ్చినతను ఆమెకు ఎదురుగా రావడం గమనించి ఉరకాలి అని ప్రయత్నించిన ఆమె కాలు ఆమెకు సహకరించలేదు.
వాడు ఆమెను సమిపించగానే ఇక ఆమె తప్పించుకోలేదు అని అర్థం అయ్యి చిన్నప్పుడు ఆమెకు శ్రీధర్ గారు ప్రమాద పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా ఉండి పోరాడాలి అని చెప్పాడో గుర్తు తెచ్చుకొని ఆమె నేర్చుకున్నా కరాటీ విద్యను ఉపయోగించి వాడితో పెనుగులాడింది.
ఆ క్రమంలో ఆమెకు ఎన్నో గాయాలు అయినా ఓటమిని ఒప్పుకోలేక పోరాడింది.
అప్పటికే చీకటి పడింది.ఆమె శక్తి సన్నగిల్లి పొరడలేకపోతుంటే వాడు ఆమెను అక్రమించబోయాడు.
అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళు రాధను గమనించి ఆమెకు సాయం చేసి వాడ్ని చెట్టుకి కట్టి పడేస్తారు.
వాళ్ళు రాధను ఆసుప్రతికి తీసుకెళ్ళిన తెలియని చోట ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్న తను మందులు తీసుకుంటే ఏ మత్తు పదార్థాలు కలిసి ఉంటుందో అనే భయంతో ఆహారం వైద్యం లాంటివి ఏం తీసుకోలేదు.
నిద్ర పోవాలన్న ఏం జరుగుతుందో అనే భయంతో నీరసంగా ఉన్న అలానే మొండిగా కూర్చుంది.
ఆసుపత్రి వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మిగిలిన పోలీసులు ఆమెను కలిసి వివరాలు కనుక్కొగా వంశీతో వెళ్ళిన పోలీసులు వెతుకుతున్న అమ్మాయి ఇంకా ఈమె ఒకరే అని నిర్ధారణ అయ్యి వాళ్ళకి విషయం తెలియజేశారు.
వంశీ అక్కడికి రాగానే “బావా” అని అతని వద్దకు వెళ్ళి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది.
అంతవరకు మొండిగా ఉన్న ఆమెకు వంశీ రాకతో వచ్చిన ధైర్యంతో వైద్యం తీసుకొని ఊరి బాట పట్టింది.
ఇదంతా విన్న అక్కడి వాళ్ళ కళ్ళు వర్షించాయి.
‘ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది’ అనుకుంది శారద.
‘తనకు నేర్పిన విద్య తనకు ఉపయోగపడింది’ అని గర్వంగా అనుకున్నాడు శ్రీధర్.
‘రాధ కాబట్టి అంత ధైర్యంగా పోరాడింది.నేనైతేనా..’ అని ఆ ఊహకే భయపడిపోయి తన కూతుర్ని కూడా తన చెల్లిలా పెంచాలనుకుంది నందిత.
రాధకు గాయాలు మానేవరకు అక్కడే ఉండి తనతో రోజు కొన్ని ప్రేరణ పూరితమైన మాటలు చెప్తూ చిన్నప్పటి విషయాలు గుర్తు చేస్తూ ఆమె మానసిక పరిస్థితిని కూడా మామూలు స్థితికి తెచ్చాడు వంశీ.
ఆమె మళ్ళీ కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టాక రెండు రోజులు ఉండి మళ్ళీ ట్రైనింగ్ కు వెళ్ళిపోయాడు వంశీ.
అక్కడ ఉన్నని రోజులు వంశీ కళ్ళలో రాధ పై ఇష్టం రాధ కళ్ళలో వంశీ పై ఆరాధన శ్రీధర్ దృష్టిని దాటిపోలేదు.
ఆరేళ్ళ తర్వాత..
వంటికి పట్టు వస్త్రాలు మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి పాపిట్లో సింధూరం సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు బిడియంతో తడబడుతున్న అడుగులతో భర్తతో కలిసి అత్తారింట్లోకి అడుగు పెట్టింది రాధ.
కూతురి మొహంలో సంతోషాన్ని చూసి ‘ఇంత మంచి సంబంధం పక్కనే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. ఇకపై నా కూతుర్లు ఇద్దరు పిల్లపాపలతో సంతోషంగా ఉంటే అదే చాలు’ అని మనస్పూర్తిగా అనుకున్నాడు.
జంటగా ఇంట్లోకి అడుగు పెట్టిన రాధ వంశీకృష్ణలను చూసి ముచ్చటపడ్డారు శ్రీధర్ గారి దంపతులు.
ఈ ఆరేళ్ళలో వంశీ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ అదే పట్నంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు.
రాధ చదువు పూర్తయి చిన్న వయసులోనే కలెక్టర్ అయిన మహిళల జాబితాలో చేరిన తర్వాత, ఆమె మనసు తెలుసుకున్నాకే ఆమెను పెళ్ళి చేసుకొని అతని ఇంటి ఇల్లాలిని చేసుకున్నాడు.
‘రాధకున్న ధైర్యంలో నాకు అణువంత ఉన్న ఇలా మూగబోయిన మనసుతో మిగిలిపోయేదాన్ని కాదేమో. ఆడపిల్ల జీవితం బాగుండాలంటే ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. తనకు ఏ పరిస్థితినైనా ఎదురించగల గుండె ధైర్యం ఉండాలి. శ్రీధర్ మావయ్య నన్ను రాధను ఒకేలా పెంచాడు. నేను ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు తను వినియోగించుకుంది. మా ఇద్దరి జీవితాల్లో అంతే తేడా. మనకు బాగుపడ్డాలి అని పట్టుదల లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. నా మనసు మా అమ్మ మనసు మూగమనసులైనా కనీసం నా చెల్లి మనసైన మా మనసుల్లా ముగబోలేదు. అక్కడికి సంతోషం’ అనుకుంటూ మనస్ఫూర్తిగా రాధ వంశీకృష్ణల జంటను దీవించింది నందిత.
(సమాప్తం)