[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన తాడూరి స్నిగ్ధ గారి ‘మూగమనసులు’ అనే కథని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]
అది రామాపురం అనే పేరు గల పచ్చని పల్లెటూరు. పట్నానికి చాలా దూరంగా ఉన్న ఆ ఊర్లో సదుపాయాలు కూడా చాలా తక్కువే. ఉన్న ఊర్లో వసతులు అవసరాల్ని తీర్చేలా లేకపోయేసరికి ప్రజలు పట్నం వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉండేవాళ్ళు. పట్నం వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునే వాళ్ళు కాదు.
చదువు సంధ్యల గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా బాగా చదివి మంచి ఉద్యోగం వస్తే తమ కొడుకులు పట్నం పోయి హాయిగా జీవిస్తారని వాళ్ళలా కూలి నాలి చేస్తూ బ్రతకాల్సిన అవసరం రాదని ప్రభుత్వం తరుపున వచ్చిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నచ్చజెప్పేసరికి ప్రభుత్వ పాఠశాలలో తమ కొడుకుల్ని చేర్చడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం మొదలు పెట్టారు.
బంధువుల వద్ద చెప్పుకోవడానికి బాగుంటుంది అని కొందరు కట్నం బాగా తెచ్చే పిల్లను పట్టొచ్చు అని కొందరు ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని అయితే బడిలో చేర్చారు.
కాని ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం అనే భావం తరాలుగా వాళ్ళ మనసు లోతుల్లో నిలిచిపోయి ఆడపిల్లల్ని చదివించడానికి ఎవరు ముందుకు రాలేదు.
“చదువుకున్న పిల్ల అణిగి మణిగి ఉంటుందా” అని ఒకరు.
“చదువుకున్న పిల్లకు సంబంధాలు వస్తాయా” అని ఇంకొకరు.
“మేము అయితే చదువుకున్న అమ్మాయిలను మా ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడము. మరి మా ఇంటి ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు” అని ఒకరు.
“ఆడపిల్ల చదివి మమల్ని ఉద్ధరించాల్సిన పరిస్థితిల్లో మేము లేము. ఏ మా కొడుకులు చేతకానోళ్ళా. అబ్బాయిలు సంపాదిస్తే అమ్మాయిలు ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే ఇల్లు సమాజం అంతా బాగుంటుంది. అమ్మాయిలకు వంటపని ఇంటిపని నేర్పితే చాలు. చదువులు అని మనమే వాళ్ళని చెడగొట్టకూడడు” అని ఇలా ఒక్కొకరు ఒక్కొక్క మాట అనుకొని ఆడపిల్లల్ని బడికి పంపడానికి ఇష్టపడలేదు.
అలాంటి ఆ ఊర్లో ఒక కుటుంబం రాఘవయ్య గారిది.
వాళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులే చాలా ఉన్నాయి. వాటిని తరాలుగా కాపాడుకొస్తూ వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అతనిది. భర్తకు తగ్గ ఇల్లాలు జానకమ్మ. భర్త మాటే వేదంగా భావిస్తూ ఎప్పుడు ఒక మాట ఆయన ముందు ఎక్కువ మాట్లాడలేని మృధు స్వభావి. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఉన్న ఒకే ఒక సమస్య పిల్లలు కలగకపోవడం. ఆ కాలంలో లోపం ఎవరిలో ఉన్న తప్పు ఇంటి ఇల్లాలిదే.
పిల్లలు లేకపోవడంతో జానకమ్మకు అత్తగారి పోరు మామూలుగా ఉండేది కాదు. ఆవిడ అదృష్టం బాగుంది ఊర్లో పడిన మెడికల్ క్యాంప్‌లో చూపించుకున్న కొన్ని నెలలకే ఆవిడ కడుపు పండింది.
అప్పటి నుంచి నెలలు నిండేవరకు జానకమ్మకి అత్తగారి పోరు తప్పింది.
కాని కాన్పు అయినప్పటి నుంచి ఆడపిల్లను కన్నది అని జానకమ్మని ఒకటే సాధించేది తన అత్తగారు.
లేక లేక పుట్టిన బిడ్డ కాబట్టి మొదటి సారికే ఎవరైతే ఏమిటిలే శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టింది నాకు అని ఊరంతా మిఠాయిలు పంచి సంబరపడ్డారు రాఘవయ్య గారు.
రేపో మాపో పోయే అత్త ఎలా ఉన్న కడదాకా తోడు ఉండాల్సిన భర్త బాగుంటే ఏ ఆడపిల్ల అయినా అత్తగారింట్లో సంతోషంగా సర్దుకుపోగలదు అనే మాటను జానకమ్మ గారు నిరూపించారు.
‘నందిత’ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.
రోజులు గడుస్తున్నాయి. జానకమ్మ గారు మళ్ళీ నెల తప్పిన వార్త విని “ఈసారి ఇంటికి వారసుడ్ని కనలేకపోతే నా కొడుక్కి ఇంకో పెళ్ళి చేస్తాను” అని మొదటి నుంచి బెదిరిస్తూ వచ్చింది ఆమె అత్తగారు.
పుట్టేది అమ్మాయా లేక అబ్బాయా అని నిర్ణయించేది భార్య కాదు భర్త అని తెలియని మనుషులు.
తెలిసినా కొడుకుని ఎందుకు అనుకుంటారు. ఏమైనా ఉంటే కొడల్నే అంటారు. ఎంతైనా కోడలు అంటే బయట నుంచి వచ్చిన పిల్లయే. ఎన్ని అన్నా పడాలి అనుకునే మనుషులు.
జానకి తనకు సొంత మేనకోడలు అయినా తమ ఇంటి రక్తాన్ని కడుపులో మోస్తుంది అని కూడా లేకుండా తన అత్త తనను బెదిరిస్తూ వచ్చింది.
నెలలు నిండే కొద్ది జానకమ్మలో భయం కలగసాగింది. ఈసారి ఆడపిల్ల పుడితే కచ్చితంగా తన అత్త అన్నంత పని చేసినా చేస్తుంది అని మగపిల్లాడు పుట్టాలని మొక్కని దేవుడు లేదు.
కాని ఆవిడ దురదృష్టం మళ్ళీ ఆడపిల్లకే జన్మనిచ్చింది. తనకి ఆడపిల్ల పుట్టిందని తెలిసి తన అత్త ఏం చేస్తుందో అనే భయంతో బీపి పెరిగిపోయి తన శరీరం సహకరించక కన్ను మూసింది జానకి.
ఆ క్షణం ఆవిడ అత్త పెట్టే పోరు గురించి కాకుండా తల్లి లేని ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుందో తలచుకొని ఉండి ఉంటే బాగుండేది.
అప్పటికి నందిత వయసు ఆరు మాత్రమే.
అప్పటి వరకు తనతో బానే ఉన్న నాన్నమ్మ ఇద్దరు ఆడపిల్లల్ని కని మా మీదకు వదిలేసి వారసుడిని ఇవ్వకుండానే పోయింది మీ అమ్మ అనే కోపం మనవరాలి మీద చూపించడం మొదలు పెట్టింది.
అసలే తల్లి లేక ఇబ్బంది పెడుతున్న పిల్లను దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి మనవరాలు అని కూడా లేకుండా తన మాటల సాధింపులు పెట్టేది.
మొదట్లో భార్య పోయిన బాధలో ఉన్న రాఘవయ్య ఇంట్లో సంగతులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు.
తల్లి గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాఘవయ్య చెల్లి శారదమ్మ భర్తతో మాట్లాడి కొన్నాళ్ళు అక్కడే ఉండడానికి వచ్చింది.
అక్కడ అంతా తను ఊహించినట్లే ఉండేసరికి తల్లిపై కోప్పడి నందితను దగ్గరికి తీసుకొని అమ్మలా ఓదార్చింది.
రోజులు కూడా లేని పసిపిల్లను గాలికి వదిలేసి తన పని తాను చేసుకుంటున్న తల్లిను ఏం అన్నా ప్రయోజనం ఉండదు అనుకొని తను అక్కడ ఉన్నంత కాలం ఆ బిడ్డను సాకి అమ్మలా చూసుకున్న వదినమ్మ రుణం తీర్చుకోవాలి అనుకుంది శారదమ్మ.
రాఘవయ్య జానకి గారి గురించి మెల్లిగా మర్చిపోతూ మనుషుల్లో కలవడం మొదలు పెట్టడం ఆలస్యం, “నీకేం వయసు అయిపోయింది రా ఇంకో పెళ్ళి చేసుకోని సుఖంగా ఉండక” అని కొడుక్కి చెప్పడం మొదలు పెట్టింది తల్లి శకుంతల.
తల్లి మాటలను అన్నయ్య ఎక్కడ తలకి ఎక్కించుకొని పిల్లలకి సవతి తల్లిని తెస్తాడో అనే భయం పట్టుకుంది శారదకు. అప్పటికే తను వచ్చి నెల పైనే అవుతుంది. త్వరగా రమ్మని భర్త కబురు కూడా అందింది. తనైనా ఎన్నాళ్ళని అన్నయ్య పిల్లలను చూసుకుంటూ తను కన్న పిల్లల్ని అక్కడే వదిలి ఉండగలదు.
“తల్లిని చంపుకొని పుట్టిన ఈ దరిద్రం మనకి ఎందుకు రా. చక్కగా ఇంకో పెళ్ళి చేసుకొని భార్య పిల్లలతో నువ్వు సుఖంగా ఉంటే చూస్తూ చస్తాను రా. కన్న పాపానికి పైటేసే వరకు పెంచుకొని పెళ్ళి చేసి పంపితే భారం దిగిపోతుంది” అని అంటున్న తల్లి మాటలకు “అమ్మా నా కూతుర్ల గురించి ఇంకో మాట తప్పుగా అంటే తల్లివి అని మర్చిపోవాల్సి వస్తుంది” అని బదులు ఇచ్చిన అన్నయ్యను చూసి శారద మనసు స్థిమిత పడింది.
కాని ఆ పిల్లల పరిస్థితే అర్థం కానట్లు ఉండిపోయింది.
శారదమ్మను ఉన్న ఊర్లో ఇచ్చుకున్నా తన భర్త శ్రీధర్ ఉద్యోగ రీత్యా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.
నందిత గురించి పక్కన పెడితే నెలల పసికందు ‘రాధ’ పరిస్థితికి అందరికి జాలి వేసేది.
భర్త నుంచి ఉత్తరాలు ఎక్కువ అయ్యేసరికి కొన్నాళ్ళకి శారదకు వెళ్ళక తప్పలేదు.
అన్నయ్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. భర్తకు ఎలా అయినా నచ్చజెప్పుకొని పిల్లల్ని తమ దగ్గర పెంచుకోవాలి అనుకొని భర్తతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు “నా టీచర్ ఉద్యోగాన్ని మన ఊరికి మార్చుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగం కదా మన పరిస్థితి వివరించి ఉత్తరాలు రాసినా ఇన్ని వారాలు పట్టింది. సామాన్లు సర్దడానికి ఇబ్బంది అవుతుంది అని నిన్ను రమ్మని హడావిడి చేసాను” అని చెప్తాడు.
భర్త మాటలకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి.
“నాకు మాత్రం ఎవరున్నారే. నువ్వు, అమ్మ, మన పిల్లలు తప్పా. జానకి నన్ను సొంత అన్నయ్యలానే చూసింది. చెల్లి కుటుంబం కష్టాల్లో ఉంటే అన్నగా చూస్తూ ఉండగలనా. ఊర్లో మనింటిని శుభ్రం చేయించమన్నాను. రేపే వెళ్దాం సామాన్లు సర్దు” అని శారద కళ్ళు తుడిచి వెళ్ళిపోయాడు.
‘మా అమ్మ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నన్ను ఈయనకు ఇచ్చి చేయడమే’ అనుకుంది శారద.
పెళ్ళై వారం కాకముందే తన మావయ్య, మరుదులు, ఆడపడుచు ఇంకా మొత్తం కుటుంబం ఎక్కిన బస్సుకు ఆక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతే బంధువులు అందరూ “కొత్త కోడలు అడుగు పెట్టిన వేళ విశేషం” అన్నారు.
గాయాలతో బయట పడిన అత్తగారు మాత్రం “వాళ్ళ మాటలను పట్టించుకోకు తల్లి” అని తనను దగ్గరికి తీసుకుంది.
అంత ఉత్తమమైన తల్లి పెంపకంలో పెరిగిన తన భర్త ఇలానే ఉంటాడు అనుకుంది.
చదువు నేర్పిన సంస్కారం కాబోలు నా పిల్లల్ని కూడా వాళ్ళ తండ్రి అంత ఉన్నతంగా పెంచాలి అనుకునేది.
పెళ్ళైన కొత్తలో ఓసారి అత్తారింటికి వచ్చినప్పుడు పొలాలు అన్ని చూసి వస్తూ ఉండగా దారిలో బైక్ మీద నుంచి కిందపడి శ్రీధర్‌కు గాయాలు అయితే సొంత చెల్లిలానే దగ్గరుండి చూసుకుంది జానకమ్మ.
ఆ రోజు జానకి చేసిన హడావిడి తనకు చనిపోయిన తన చెల్లెల్ని జ్ఞాపకం తెచ్చింది.
ఆ రోజే శారదతో “జానకి నాకు సొంత చెల్లితో సమానం” అని అన్నాడు. ఆ మాటను ఇంత గట్టిగా గుర్తు పెట్టుకుంటాడు అని శారద ఊహించలేకపోయింది.
మనం చేసిన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది అనే మాట నిరూపణ అయ్యింది.
సామాన్లతో ఊర్లోకి వచ్చిన శారద కుటుంబాన్ని చూసి ఊరంతా నోర్లు వెల్లబెట్టారు. ఆడపడుచులు వచ్చి ఇంటి కోడళ్లపై పెట్టనాలు చేసే రోజులు అవి.
అలాంటిది ఆ ఇంటి ఆడపడుచు అయినా శారద తన అన్నయ్య పిల్లల కోసం కుటుంబంతో సహా వచ్చేసరికి “ఇదేం చోద్యం” అని ఊరంతా గుసగుసలు ఆడసాగారు.
శ్రీధర్ ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు.
కొన్ని రోజులకే అక్కడ ఆ ఊర్లో ఆడపిల్లల్ని ఎవరు చదివించడం లేదు అని అర్థం అవుతుంది.
నందితకు ఇప్పుడు ఆరేళ్లు. తన కూతురు మానస వయసే. మానస బడికి వెళ్ళబట్టి సంవత్సరం అవుతుంది. కాని నందిత బడి ముఖం చూసి ఎరుగదు అని తెలుసుకొని బాధపడ్డాడు శ్రీధర్.
అప్పట్లో బంధువుల ఇంటికి రాకపోకలు ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే ఈ విషయం గురించి శ్రీధర్‌కు తెలియలేదు.
ఆ ఊర్లో ఆడపిల్ల అంటే ఏమిటో అర్థం అవ్వడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు.
ఇందుకేనా తన భార్య శారద తనను అంత గొప్పగా చూసేది అని అనిపించింది శ్రీధర్‌కు.
శ్రీధర్ పుట్టింది అక్కడే అయినా చదువుల కోసం పట్నం వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగం వల్ల వేరే ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఊరి గురించి పెద్దగా అవగాహన లేదు.
అతను అంతకు ముందు ఉన్న ఊరు కూడా అలాంటిదే కాని ఆడపిల్లల్ని కనీసం పది వరకు అయినా చదివించేవాళ్ళు.
వీళ్ళను ఎలాగైనా మార్చాలి అనుకొని అంతకు ముందు ఒకే ఊరు అయినా అటు ఇటు తిరగడానికి భార్యకు ఇబ్బంది అవుతుంది అని గమనించి దాని గురించి ఆలోచించసాగాడు.
చివరకి రాఘవయ్య ఇంటి పక్కనతను కూతురు పెళ్ళి కోసం అయ్యే ఖర్చుల కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని ఊర్లో కొంత పొలం అమ్మి మరి ఆ ఇల్లు కొనేసాడు.
ఇక ఊర్లో వాళ్ళ మాటలకు అంతు లేకుండా పోయింది.
వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు బడికి పోతుంటే తాము ఎందుకు ఆడపిల్లలగా పుట్టామా అనే భావం ఆ ఊరి ఆడపిల్లల కళ్ళలో కనిపించేది.
మా అప్పుడైతే మగపిల్లల్ని కూడా చదివించలేదు. ఈ మధ్యే పట్నవాసంపై ఆశలు పుట్టి కనీసం వాళ్ళని అయినా చదివిస్తున్నారు అని భర్తకు చెప్పేది శారద.
ఇది ఇలానే వదిలిపెట్టకూడదు అనుకొని తన సహ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు.
తన కూతురు మానసను ఉదాహరణగా తీసుకోమని చెప్తూ ఉండేవాడు.
అంత చేసినా వృథా ప్రయసే అయ్యింది.
ఒకతను “ముందు మీ మేనకోడల్ని బడికి పంపగలరేమో చూడండి” అని వెటకారం ఆడాడు.
కాని శ్రీధర్‌కు నిజమే అనిపించింది.
“అందరి పిల్లలు బడుల్లో చదువుతున్నారు. మన పిల్లలకి ఏం తక్కువ బావా. మగపిల్లలు మాత్రమే చదువుకోవాలి అని లేదు కదా. మీకున్న ఇంత ఆస్తిని ఎవరికి ఇస్తారు. వాళ్ళకే కదా. మరి వాటిని కాపాడుకోవాలి అంటే తగ్గిన విద్య అవసరం కదా” అని ఎలాగోలా రాఘవయ్యకు నచ్చజెప్పాడు.
కాని శకుంతలకు మనవరాలు అలా బడికి పోవడం అసలు ఇష్టం లేదు.
మగపిల్లాడు ఉండి ఉంటే రాఘవయ్య గారు కూడా కచ్చితంగా ఒప్పుకునేవారు కాదు. అలా అని జానకి గారిని మర్చిపోయి ఇంకో పెళ్ళి చేసుకోలేక పిల్లల్ని చదివించాలి అనుకున్నాడు.
తనకున్న ఆస్తిపాస్తులు వల్ల ఇచ్చుకోగలిగే కట్నం చూసి పిల్లల్ను చేసుకోవడానికి ముందుకు వస్తారులే అనుకున్నాడు.
ఎంతైనా చదువుకున్న పిల్లకు పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం అని నమ్మే రోజులు అవి.
ఎలాగైతేనేమి నందితను బడిలో చేర్చారు. శారదమ్మ నందితకు, రాధకు అమ్మ అత్త అన్ని తనే అయ్యి చూసుకునేది.
కాలం గడుస్తూ నందిత బడి చదువు పూర్తయ్యింది. తనకు ఆ పై ఇంటర్ చదవాలి అని కోరిక ఉంది.
అందుకు పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంతకు మించిన చదువులు అవసరమా అని శకుంతల మొత్తుకుంటున్నా శ్రీధర్ గారు రాఘవయ్యకు “పొద్దున్న సాయంత్రం నేనే వెళ్ళి దించి వస్తాను బావా. మన మానస కూడా తోడు ఉంది కదా” అని నచ్చజెప్పారు.
నందిత రాధలు తమ ఇంట్లో కన్న శారద వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు.
చిన్నప్పుడు శకుంతల మాటల అర్థాలు తెలియకున్నా పెరుగుతున్న కొద్ది అర్థం అవుతూ నాన్నమ్మకు దూరంగా ఉండేది నందిత.
రాధను ఎప్పుడు “పుట్టుకతోనే తల్లిని చంపిన మహజాతకురాలు” అనేది.
నందితకు నాన్నమ్మ ప్రవర్తన నచ్చకపోయినా ఎదురు మాట్లాడితే చదువు వల్లే ఇలా తయారు అయ్యింది అని ఎక్కడ చదువు మానిపిస్తారో అనే భయంతో మౌనంగా ఉండిపోయేది.
ఏది ఎలా ఉన్నా చిన్నప్పటి నుంచి మానసతో ఏది దాచకుండా అన్ని విషయాలను తన భావాలను పంచుకునేది.
ఆ మాటలన్ని అన్నయ్య వంశీకృష్ణకు తండ్రి శ్రీధర్ కు చేరవేసేది.
చదువుకుంటున్న మాటే కాని అవి తనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి అని నిస్సహాయంగా అనుకున్నాడు శ్రీధర్.
మానస నందితలు బడికి వెళ్తున్నపుడు వాళ్ళతో ఇంకో ముగ్గురు అమ్మాయిలే చదవడానికి వచ్చేవాళ్ళు.
ఇప్పుడు రాధకు తోడుగా పదిమంది అమ్మాయిలు వరకు ఉన్నారు.
సంఖ్య పెరిగిందని సంతోషించే పరిస్థితి కాదు. ఆ సంఖ్య పెరిగే వేగానికి అందరూ అమ్మాయిలు చదువుకోవడానికి రావాలంటే ఎన్ని యుగాలు పడతాయో అనేది ఊహకి కూడా అందడం లేదు.
నందిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఒకనాడు రాఘవయ్య మిఠాయిలు తీసుకొని ఇంటికి వచ్చాడు.
ఆయన చాలా సంతోషంగా “మన నందితకు మంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి మన ఊరి వాడే కాని పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి గుణవంతుడు. అబ్బాయి తల్లిదండ్రులు మన నందితను వాళ్ళ కొడుక్కి అడిగారు” అని వాళ్ళ కుటుంబం గురించి వివరాలు చెప్తున్నాడు.
“అప్పుడే నందుకి పెళ్లేంటి అన్నయ్య.అది ఇంకా చిన్నపిల్లనే కదా. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు” అంది శారద.
“నువ్వు ఉండవే. మా అప్పుడైతే దాని వయసుకు పెళ్ళై పిల్లలు ఉండేవాళ్ళు. ఏ నీకు మాత్రం ఆ వయసులోనే చేయలేదా పెళ్ళి. ఇప్పటికే చదువు చదువు అని దాన్ని చెడగొట్టారు. మంచి సంబంధం అంటున్నాడు కదా. ఇంకెన్నాళ్ళు అది మనకి బరువుగా ఉంటుంది” అని శకుంతల కూతురిని కసురుకుంటుంది.
జరుగుతున్నవి తన పెళ్ళి మాటలైనా ఏవి నందితకు ఎక్కడం లేదు.
తనకి ఇప్పుడే పెళ్ళి ఆలోచనలు వద్దు అనిపిస్తుంది. తనింకా పై చదువులు చదివి తన కాళ్ళపై నిలబడాలి అనుకుంటుంది.
“నందుకు ఇష్టమో లేదో కనుక్కున్నారా బావా” అని అడిగాడు శ్రీధర్.
“అది చిన్నపిల్ల దానికేం తెలుసు బావా. మూడు ముళ్ళు పడితే తనే సర్దుకుపోతుంది” అని అన్నాడు రాఘవయ్య.
‘ఆడపిల్ల అంటే సర్దుకు పోవాల్సిందేనా’ అని నందిత మనసు తనని ప్రశ్నిస్తుంది.
బయటికి అడిగే ధైర్యం చేయలేక తన ప్రశ్నను తనలోనే సమాధి చేసేసింది.
అప్పుడే పెళ్లెందుకు బావ అని శ్రీధర్ గారు రాఘవయ్య గారికి నచ్చజెప్పబోయారు.
“జానకి లేని లోటు వాళ్ళకి తెలియకుండా పెంచారని వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో మీ మాట కాదనలేదు బావా. ఇష్టం లేకున్నా మీ మాటకు విలువిచ్చి ఇప్పటివరకు చదవనిచ్చాము. పెళ్ళి విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి” అని రాఘవయ్య గారు అనేసారికి శ్రీధర్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు.
నందిత తనకి ఇప్పట్లో పెళ్ళి వద్దు అని చెప్పితే తన వంతు ప్రయత్నం చేసేవాడు.
కాని నందితకు ఆ ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. ఆ అబ్బాయి కూడా మంచివాడు అని తెలుసుకొని పెళ్ళి తర్వాత కూడా అమ్మాయిని చదవనిస్తామనేసరికి శ్రీధర్ గారి కుటుంబానికి పెళ్ళికి అభ్యంతరం చెప్పడానికి కారణం దొరకలేదు.
అనుకున్నట్లుగానే పెళ్ళి చూపులు నిశ్చితార్దం అన్ని సజావుగా జరిగిపోయి పెళ్ళి తేదీ దగ్గరికి వచ్చింది.
పెళ్ళి రేపు అనగా ముందు రోజు రాత్రి నందిత శారద గారిని చుట్టేసి ఏడ్చేస్తుంది.
మొదటి సారి మానసతో కాకుండా నేరుగా శ్రీధర్ గారితో మాట్లాడింది.
“అబ్బాయి నచ్చలేదా తల్లి” అని లాలనగా అడిగాడు.
“అలాంటిదేం లేదు మావయ్య. అప్పుడే పెళ్ళి అంటే భయంగా ఉంది. నాకు ఇంకా చదువుకోవాలి అని ఉంది” అని ఏడుస్తూ చెప్పింది పదహారేళ్ళ నందిత.
“ఇప్పటికే ఆలస్యం అయ్యింది తల్లీ. నిన్ను ముందు నుంచే అడుగుతూ వచ్చాను కదమ్మా. ఇంతవరకు వచ్చాక ఏం చేయలేమురా” అని అన్నాడు బాధపడుతూ.
“మావయ్యా, ఒకటి అడగనా” అంటుంది సందేహిస్తునే.
“అడుగమ్మా” అని ఆయన అనగానే “అందరూ ఆడపిల్లలకి మానసకు లాగా అర్థం చేసుకునే తండ్రి ఎందుకు లేరు మావయ్య” అని అంది.
“నేనే కాదు మావయ్య నాకు తోడుగా చదువుకున్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు కూడా తన మనసులో భావాల్ని ధైర్యంగా తమ కుటుంబం ముందు పెట్టలేకపోయారు. తండ్రి తాగొచ్చి తల్లిని కొడుతున్న తను మాట్లాడితే ఏం అవుతుందో అని తనలో తనే భయపడుతూ ఉండేది ఒకమ్మాయి. ఇంకో అమ్మాయికి తన బావతో చిన్నప్పుడే పెళ్ళి అనుకున్నారంట. తన జీవితంలో కీలకమైన విషయంలో తన అభిప్రాయం అవసరం లేదా మావయ్య. ఏమైనా ఎక్కవ మాట్లాడితే అప్పటికప్పుడే పెళ్ళి చేసి పంపుతారేమో అని భయంతో చస్తుంది తను. ఇంకో అమ్మాయి నాలానే నేనేమైనా మాట్లాడితే నా చెల్లిని నా అంత కూడా చదివించరేమో అని భయపడి పెళ్ళికి తలవంచి ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది మావయ్య” అని తలవంచుకొని చెప్పింది నందిత.
అదే మొదటి సారి నందిత అంతగా మాట్లాడడం. శ్రీధర్ గారికి తన మనసులో భావాల్ని చెప్పేసి తన ఇంటికి వెళ్ళబోయింది.
మళ్ళీ ఆగిపోయి “మావయ్యా ఒక మాట” అనింది.
నందిత మాటలకు ఆలోచనలో ఉండిపోయిన శ్రీధర్ గారు ఏంటి అన్నట్లు చూసాడు.
“నేను ఎలానో ధైర్యంగా నా మనసులో ఉన్న మాటల్ని బయట పెట్టలేకపోయాను. కనీసం రాధను అయినా నాలా కాకుండా ధైర్యంగా తిరగబడేలా పెంచండి మావయ్య. తనకి ఇప్పుడు పదేళ్లు కదా మావయ్య. ఇప్పటి నుంచి ప్రయత్నించిన నాలా కాకుండా ఉంటుందేమో” అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.
నందిత అలా ఏడుస్తూ వెళ్ళేసరికి తన మనసంతా చేదు తిన్నట్లు అయిపోయింది. తనని కన్న కూతురులా పెంచుకున్నాడు. కాని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి.
“నిజమే నందు చెప్పేది అక్షరాలా నిజం. వాళ్ళ చదువు వాళ్ళకి ఏ ధైర్యం ఇవ్వలేనప్పుడు అది వృథానే కదా. కనీసం రాధను అయినా శివంగిలా తయారు చేయాలి” అనుకున్నాడు.
ఎలా అయితేనేం బంధుమిత్రుల సమక్షంలో నందిత పెళ్ళి ఘనంగా జరిగింది.
వాళ్ళు అన్నట్లుగానే పెళ్ళి తర్వాత నందిత ఆ ఇంట్లో కాస్త సర్దుకున్నాకా తనని డిగ్రీలో చేర్చారు.
ఆరు నెలలు తిరిగేసరికి నందిత శుభవార్త చెప్పింది. రాఘవయ్య గారింట్లో పండుగ వాతావరణం నెలకొంది.
పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. తొలి కాన్పులోనే వారసుడిని ఇచ్చేసరికి అత్తింటి వాళ్ళు సంబరపడ్డారు.
నందితకు కూడా మగపిల్లాడు అయితేనే బాగుండు అనిపించింది.
ఆడపిల్ల పుడితే ఎన్ని ఎదురుకోవాలో తనకు తెలుసు కాబట్టి తన బిడ్డ తనలా అవ్వడం తనకి ఇష్టం లేక మగపిల్లాడు పుట్టాలని కోరుకుంది.
ఈనాటి కాలానికి అలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. మన చుట్టూ మన బందువర్గాల్లోనే ఎందరో ఉంటారు.
నందిత నీళ్ళు పోసుకున్నప్పటి నుండే కాలేజీకి వెళ్ళడం మానేసింది.
ఇంట్లోనే చదువుకుంటూ కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్ళి వచ్చేది.
తను బాగా చదువుతుంది అని వచ్చిన స్కాలర్‌షిప్ అంతా అటెండెన్స్ ఫీస్ కట్టడానికే అయిపోయింది.
బాబుకు రెండేళ్లు వచ్చేసరికి తన డిగ్రీ పూర్తి అవుతుంది. బాబును అత్తమామలకు అప్పజెప్పి తన శ్రీధర్ మావయ్యలా టీచర్ అవ్వాలి అనుకొని బి.ఎడ్.లో చేరింది.
తన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నెల తప్పింది. ఈసారి పండంటి ఆడపిల్లను కన్నది.
ముందే ఒక అబ్బాయి ఉండేసరికి ఈసారి ఆడపిల్ల పుట్టిన తన అత్తింటి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
కాని తన చదువు మళ్ళీ అక్కడికే ఆగిపోయింది. అప్పటినుంచి తన చదువులు పరీక్షలు పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడానికే అన్నట్లు అయిపోయింది.
పాపకు రెండేళ్లు వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే “చదివింది చేసింది చాలు కాని పిల్లల్ని మంచిగా పెంచుకో” అని అత్తింటి వాళ్ళు అడ్డు పుల్ల వేసారు.
వాళ్ళు అడ్డు చెప్పకున్నా బాబుకి బడిలో చేరే వయసు వచ్చింది.
తల్లిగా తన బాధ్యతను విమర్శించలేదు కదా. ఇక చదువు ఉద్యోగం అనే అంశాలు తన జీవితంలో లేవని తన పిల్లల్ని అయినా బాగా చదివించాలి అనుకునేది నందిత.
అప్పుడప్పుడు తనకి ‘చదువు వల్ల వచ్చే ఆత్మాభిమానానికి అమ్మాయిలు అర్హులు కాదేమో’ అనిపించేది.
మళ్ళీ అంతలోనే ‘ఛా ఛా ఇలా ఆలోచిస్తున్నానేంటి అమ్మాయిలందరూ కాదు ధైర్యంగా తన మనసులో మాటలు చెప్పలేని నాలాంటి ఆడపిల్లలు మాత్రమే. ఆడపిల్ల మాట్లాడాల్సిన సమయంలో తన నోరు మూగబోతే జీవితాంతం తన మనసు మూగబోవాల్సి వస్తుంది’ అని సర్దిచెప్పుకునేది.
ఈ ఆరేళ్లలో మానస చదువు పూర్తి చేసుకొని బ్యాంక్ ఎంప్లాయ్‌గా ఉద్యోగం సంపాదించింది.
కొన్ని నెలల క్రితమే తనకి దూరం బంధువులు బావ వరుస అయ్యే అతనితో పెళ్ళి జరిగింది.
మానస చదువు పూర్తైన తర్వాత పెళ్ళి పిల్లలు అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు వచ్చాకే తన పెళ్ళి చేసారు.
కాని నందితకు పెళ్ళి అంటేనే పూర్తిగా అవగాహన లేని వయసులో టీనేజ్ కూడా పూర్తి కాకుండానే పెళ్ళి అయిపోయింది.
అంత అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి ఇద్దరి పిల్లల తల్లి అయ్యింది.
ఇప్పటికి శ్రీధర్ గారికి అమాయకంగా ఉండే నందిత మొహం తను ఏడుస్తూ అన్న మాటలు తరుచూ గుర్తు వస్తూ అతన్ని కలవరపరిచేవి.
పెళ్ళి తర్వాత నందిత పుట్టింటికి వచ్చినప్పుడు రాఘవయ్య గారి వద్ద కన్న శ్రీధర్ గారి ఇంట్లోనే ఎక్కువ ఉండేది.
నందితది తన తల్లి జానకి స్వభావమే. ఆరేళ్లు తల్లి నీడలో పెరిగిన పిల్ల కాబట్టి మొదట్లో శారద గారితో కలవలేకపోయేది.
నిదానంగా అలవాటు పడింది. రాధ మాత్రం పుట్టినప్పటి నుంచి మాటల్లో వినడం తప్ప తల్లిని నేరుగా చూసింది లేదు కాబట్టి తన మనసులో శారద గారికే ఎక్కువ స్థానం ఉండేది.
అందుకేనేమో శ్రీధర్ గారి కుటుంబంతో నందితకు కన్న రాధకే చేరువ ఎక్కువ ఉండేది.
నందితకు ఇచ్చిన మాట కోసమైనా రాధను ధైర్యంగా మాట్లాడగలిగేలా తయారు చేయాలి అనుకొని తనకి చదువుతో పాటు ఎన్నో విషయాలు చెప్తూ లోకజ్ఞానం అందిస్తూ ఆత్మ సంరక్షణ కొరకు కరాటే వంటి విద్యలు కూడా నేర్పించాడు.
అది తనకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆ వయసులో రాధకు తెలీలేదు.
రాధకు సివిల్స్ గురించి పూర్తి అవగాహన కలిగిస్తూ తనను కలెక్టర్ అవ్వడానికి మొగ్గు చూపేలా చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తూ వచ్చాడు శ్రీధర్.
మావయ్య మాటలను విని శ్రద్ధగా చదువుకుంటూ బడి చదువులు పూర్తి చేసుకుంది.
రాధ ఇంటర్‌లో చేరిన మొదటి రోజుల్లోనే తనకో సంబంధం వచ్చింది.
“మంచి పట్నం సంబంధం తల్లి. నీ పెళ్ళి కూడా చేసేస్తే నా భాధ్యతలు అన్ని తీరిపోతాయి” అని ఆనందంగా చెప్పారు రాఘవయ్య గారు.
“అప్పుడే రాధకు పెళ్ళేంటి అన్నయ్య. నందితకు వద్దు అన్న అప్పట్లో తొందరపడి పెళ్ళి చేసేసారు. ఏ నా కూతురు మానసకు పెళ్ళి అవ్వలేదా. మంచి భర్త దొరకలేదా. కనీసం రాధను అయినా తన కాళ్ళ మీద నిలబడనివ్వండి” అని గట్టిగానే వాదించింది శారద.
శారద మాటలకు రాఘవయ్య ఆలోచనల్లో పడడం గమనించి తల్లి శకుంతల శారద మీదకు కయ్యిమంది.
“పుట్టుకతోనే తల్లిని మింగేసిన దానికి బంధువర్గాల్లో నుంచి చేసుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడే. అదృష్టం బాగుంది మంచి పట్నం సంబంధం వచ్చింది. ఎలాగైనా పట్నం సంబంధాలు పట్టాలి అని చూస్తున్న ఈ రోజుల్లో వెతుక్కొని మరి సంబంధం వస్తే మనమే మన కాళ్ళతో తన్నేసుకుందామా” అని అరిచింది శకుంతల.
అంతసేపు మౌనంగా ఉన్న రాధ “నాన్నమ్మా, నేనేం నా తల్లిని చంపుకొని పుట్టినదాన్ని కాదు. నువ్వు మనవడి కోసం పెట్టిన పోరు పడలేక నీ కోడలు బీపీ పెరిగి చనిపోయింది. మా అమ్మను చంపింది నేను కాదు నువ్వే” అని ఎదురు తిరిగింది.
చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మాటలే అయినా కుక్కలే కదా మోరిగేవి అనుకొని రాధ సరిపెట్టుకునేది.
ఈసారి పెళ్ళి ప్రస్తావన కూడా ఎత్తేసరికి ఉండలేక అనేసింది.
రాధ తిరిగి మాట్లాడేసరికి శ్రీధర్ గారికి ఇన్నాళ్ళ అతని కష్టం ఫలించింది అనిపించింది.
కాని మనవరాలు తనకు ఎదురు చెప్పడం శకుంతల తట్టుకోలేకపోయింది.
“ఒరేయ్ రాఘవ చూస్తున్నావా నీ కూతుర్ని. నన్నే ఎదిరించి మాట్లాడుతుంది రా. మనింటి పరువు తీయడానికే దాపురించింది” అని ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది.
నిజానికి రాఘవయ్యది కూడా ఆడపిల్ల అణిగి మణిగి ఉండాలి అనుకునే మనస్తత్వమే.
(ముగింపు వచ్చే వారం)