Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడు మూళ్ళు.. జీవితం

[శ్రీమతి రాధకృష్ణ కర్రి గారు రచించిన ‘మూడు మూళ్ళు.. జీవితం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఒరేయ్ మిరపకాయ బస్తాలు ఎన్నొచ్చాయి? లెక్క సరిపోయిందా? సరిగ్గా చూశావా? ఒక్క బస్తా తేడా వచ్చినా డబ్బులు ఊరికే అచ్చుకోవాలి. ఒళ్ళు దగ్గరెట్టుకొని బస్తాలు దింపు” ఆర్డర్ వేస్తున్నాడు ఓ దుకాణం యజమాని.

“ఏ అమ్మాయి! ఇదిగో ఆ నిచ్చెనెక్కి పై అరలో ఉన్న ఆ టీపొడి బాక్సులు కిందకెయ్యి. సరుకు అట్టికెళ్లడానికి పొట్టా రిక్షా ఎంకన్న వత్తాడు. బాక్స్‌లు సిద్ధంగా ఉంటే తప్ప, అయ్యగారు అట్టుకెల్లడు. ఆడు ఒక్క నిమసం కూడా ఆగడు. ఎల్లిపోతాడు. తరువాత సావుకారు మనల్ని తిడతాడు. ఎల్లు.. ఎల్లి ఆ సరుకు తొందరగా రెడీ సెయ్యి” పురమాయిస్తున్న మరో వ్యక్తి ఇంకో కొట్టు ముందు..

“బాబు.. ఏం కావాలి.. ఇలా రండి, మాకాడ కిరాణా సరుకులు అన్నీ ఉంటాయి. ఇలా రండి” అంటూ మరో కొట్టు ముందు ఓ ముఫ్ఫై ఏళ్ల పనివాడు జనాలను అకర్షించి తమ షాపుకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

అది విజయవాడ గాంధీ మార్కెట్ సెంటర్. ఆ మార్కెట్‌ ఓ 50 హోల్‌సేల్, రిటైల్ కొట్లతో నిత్యావసర కిరాణా, ఫంక్షన్స్‌కు కావలసిన వంట సామాన్లు కొనుక్కునే జనాలతో, సరుకులు కట్టిచ్చే పనివాళ్ళతో కిటకిటలాడుతూ ఉంది. ఇక షాపుల ముందు అయితే బస్తాలు సర్దుతూ కొందరు, సరుకులను ఆటోల నుండి, లారీ నుండి దింపుతూ.. ఎక్కిస్తూ మరి కొందరితో హడావుడిగా ఉంది.

మొదటి లైన్‌లో ఎడమవైపు ఉన్న పదో కొట్టు త్రీ స్టార్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. సుశీల సరుకుల కోసం త్రీ స్టార్ కిరాణా షాపుకు వచ్చింది. ప్రతీ నెలా జీతం రాగానే అన్ని సరుకులు ఒకేసారి కొనేస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో సరుకులు నిండుకుంటే మాత్రం ఇదిగో ఇలా త్రీ స్టార్‌ షాపుకి వచ్చి కొనుక్కుంటుంది. షాపు మొదట్లో ఉల్లిపాయల చెత్తను చెరుగుతున్న రంగమ్మ.. “ఏం కావాలమ్మా” అని అడిగింది. రంగమ్మకి 30 నుంచి 35 సంవత్సరాలుంటాయి. నల్లగా ఉన్నా ముఖం కళగా ఉంటుంది. సుశీలని చూడగానే గుర్తు పట్టి కళ్ళతోనే పలకరిస్తుంది.

రంగమ్మ ప్రశ్నకి “శనగ నూనె ఉందా? సన్నావాలు ఉన్నాయా, లలితా బ్రాండ్ ఇడ్లీ నూక ఉందా?” అంటూ సరుకుల లిస్టంతా చెప్పేసింది సుశీల.

“ఓ మల్లీ..! ఇదిగో నిన్నే, ఇటు రా.. ఈ అమ్మ గారికి కావలసిన సరుకులు సెప్తారు. లిస్ట్ రాసుకో” కేకేసింది రంగమ్మ.

“వత్తనానక్కా” అంటూ మల్లి పరుగులాంటి నడకతో వచ్చింది. మల్లి చూడడానికి పెద్ద వయసున్న దానిలా ఉండదు. సన్నగా, కాసింత చామనచాయగా, ముఖంలో కొంత నీరసంతో..(నీరసం అనే కన్నా ఏదో నిరాశతో అనుకోవచ్చు), తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సుశీల వైపు చూస్తూ.. “ఊ, చెప్పండి మేడం” అంది మల్లి.

“శనగ నూనె ప్యాకెట్ ఒకటి, ఇడ్లీ రవ్వ ప్యాకెట్ ఒకటి, సన్నావాలు పావు కిలో, జీలకర్ర వంద గ్రాములు, మెంతులు వంద గ్రాములు, జీడిపప్పు వంద గ్రాములు, వెల్లుల్లి పావు కిలో..” లిస్ట్ చెబుతోంది సుశీల.

ఎడం చేత్తో లిస్ట్ రాస్తున్న మల్లిని చూసి “నీ దస్తూరీ చాలా బావుందమ్మాయి” అంది సుశీల మెచ్చుకోలుగా. మల్లి ఓ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో “థాంక్స్ మేడం గోరు. చేతిలో రాత బాగుందమ్మా. నెత్తి మీద గీతే గందరగోళంగా ఉంది” అంది.

***

మల్లి గాంధీ మార్కెట్ పక్కనే ఉన్న హెచ్.బీ.కాలనీలో తన రెండేళ్ల కూతురితో, నాలుగేళ్ళ కొడుకుతో కలిసి ఓ చిన్న గదిలో ఉంటోంది. తన ఇంటి పక్కనే ఆమె అత్త, మామ, పెళ్లికాని ఆడపడుచు ముగ్గురూ ఉంటారు.

మల్లి భర్త దుర్గారావు ఆ మధ్య బుడమేరు వాగు పొంగడం వలన వచ్చిన వరదల్లో వేరే వాళ్ళను కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయాడు. దుర్గారావు గాంధీ మార్కెట్లో త్రీ స్టార్ కిరాణా స్టోర్స్ అండ్ జనరల్ దుకాణంలోనే కళాసిగా పని చేసేవాడు. భర్త చనిపోయాక కుటుంబాన్ని పోషించడానికి మల్లి అదే షాపులో పనికి కుదిరింది. కనీసం పనిలో పడితేనైనా తన బాధలను కొంతమేర మర్చిపోవచ్చు అనుకుంది.

అదృష్టం ఒక్కసారి తలుపు తడితే, దురదృష్టం మాత్రం పగబట్టిన పాములా వెంటాడుతుంది. మల్లి విషయంలో ఇదే జరుగుతోంది. ఒక పక్క భర్త చనిపోయి బాధలో ఉంటే, మరో పక్క ఆడబిడ్డ, అత్త, మామ.. ఈ ముగ్గురూ పెట్టే ఆరళ్లు, చేసే అవమానాలు. తను పనికి వెళితే బిడ్డల సంరక్షణ మరో సమస్య అయ్యింది మల్లికి.

***

సరుకుల లిస్టు రాసుకుని దుకాణంలోకి వెళ్ళిన మల్లి.. సుశీల చెప్పిన సరుకులు ఒక కవర్లో వేసి, యజమాని వద్దకు వెళ్ళి బిల్ వేయించి ఇచ్చింది. సరుకులు వచ్చేలోగా సుశీల మనసంతా మల్లి ఆలోచనలతోనే నిండిపోయింది. ‘భర్తని తీసుకుపోయి మల్లిని రోడ్డున కీడ్చేసిన దేవుడు లేడనుకోవాలా..! దుకాణంలో ఉద్యోగం చూపించి ఎవరి మీదా ఆధారపడకుండా తన పిల్లల్ని తానే పోషించుకునేలా చేసినందుకు దేవుడు ఉన్నాడనుకోవాలా..!’ అని పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఈలోగా మల్లి ఇచ్చిన బిల్ చూసి ఫోన్ పే లో చెల్లించి సరుకులు తెచ్చి ఇంట్లో అమ్మకు ఇచ్చింది సుశీల.

రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రీస్టార్‌ షాపు నుంచి ఇంటికి బైక్‌ మీద వస్తూ కూడా సుశీల ఆలోచనలన్నీ మల్లి చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక మనిషి శాశ్వతంగా వెళ్ళిపోతే దాని ప్రభావం ముగ్గురు మనుషుల జీవితాల మీద పడింది. పైగా మరో ముగ్గురు ఈ ముగ్గుర్ని వేధిస్తున్నారు. చిత్రంగా మల్లికి బతుకు దారి చూపించింది కూడా త్రీ స్టార్‌ దుకాణమే. ఇలా ఉన్నాయి సుశీల ఆలోచనలు. ఈ ఆలోచనలతో ఎలా వచ్చిందో కూడా తెలియకుండా ఇంటికి వచ్చేసింది సుశీల. తెచ్చిన సరుకులు అమ్మకి ఇచ్చి ఏవో ఆలోచనలను ముసురుతూండగా మంచం మీద వాలిపోయింది.

***

“నూనె ప్యాకెట్లు ఎన్ని తెచ్చావు?” అరుస్తున్నట్లుగా అడిగింది సుశీల తల్లి.

“ఒక్కటే తెచ్చాను. ఒక వారం రోజులు వచ్చేలా చూడు. ఎలాగూ నెలాఖరు అవుతోంది కదా. జీతాలు వచ్చాక నెలకు కావలసిన మొత్తం సరుకులు తెచ్చుకుందాం” అని చెప్పి, తన పనిలో పడింది సుశీల.

మధ్యాహ్నం మూడున్నర అయ్యింది.. సుశీల ల్యాప్‌టాప్‌ ముందేసుకుని పనిలో పడింది.. సరిగ్గా ఆ సమయంలోనే “అవునే సుశీ.. ఒకటే ఆయిల్ ప్యాకెట్ అన్నావు! ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి” అంటూ ఎప్పటిలాగే అరుస్తున్నట్లుగా అడిగింది సుశీల తల్లి.

“మూడా..?! అదేంటి.. నేను మూడు ప్యాకెట్లు కొనలేదమ్మా!” ఆశ్చర్యంగా అంది సుశీల.

“డబ్బులు ఎంతిచ్చావు?” అడిగింది సుశీల తల్లి.

“నేను ఒక్క నూనె ప్యాకెట్‌కి, మిగిలిన సరుకులకు మాత్రమే డబ్బులిచ్చాను. కావాలంటే సరుకులతో ఉన్న లిస్ట్ చూడు..!” చెప్పింది సుశీల.

“కానీ, ఇందులో మూడు ప్యాకెట్లున్నాయి, చూడు” అంటూ చూపించింది సుశీల అమ్మ.

“అయితే రెండు నూనె ప్యాకెట్లు ఎక్కువ ఇచ్చింది ఆ షాపులో అమ్మాయి. వెంటనే వెళ్లి ఆ రెండు ప్యాకెట్లు తిరిగినిచ్చేస్తాను, ఇలా ఇవ్వు” అంటూ ఆ రెండు ప్యాకెట్లు తీసుకుంది సుశీల.

“తిరిగి ఇవ్వడం ఎందుకు?! వాటి ఖరీదు ఇచ్చేసి వచ్చేయ్. ఎలాగూ మనకు అవసరమే కదా..!” అంటూ సుశీల వాళ్ల అమ్మ వెనుక నుంచి అరుస్తూంటే.. దుకాణం దగ్గరకి బయలుదేరుతూనే.. “వద్దమ్మా, కావాలంటే మళ్ళీ కొంటాను. ఇప్పుడు మాత్రం ఆ షాపు వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాను. లేదనుకో, ఎక్కువ ప్యాకెట్లు మనకి వచ్చాయి, కాబట్టి వాటి ఖరీదు తీసుకోండి అని మనం మంచికి పోయి ఆ కొట్టువాడితో అంటే, ఆ షాపు ఓనరు ఆ పనమ్మాయిని తిడతాడు. అందరిలోనూ తిట్లు తిన్నా ఫరవాలేదు కానీ, ఆ అమ్మాయి ఉద్యోగం పోతే..?! పాపం అమ్మా, మన కారణంగా ఒకరి పొట్ట దగ్గర కూడు పోతుంది. నేనే ఓనర్‌కి తెలీకుండా ఆ అమ్మాయిని పిలిచి ఇచ్చేస్తాను” పరిణామాలను ఊహిస్తూ.. వివరిస్తూ, ఆ ప్యాకెట్లను తీసుకుని తాను సరుకులు కొన్న ఆ త్రీ స్టార్ దుకాణానికి బయలుదేరింది సుశీల.

షాపు బయటే ఉండి, తనకు సరుకులు ఇచ్చిన మల్లిని పిలిచి జరిగిందంతా చెప్పి, యజమానికి తెలియచేస్తే, జరిగిన పొరపాటును అర్థం చేసుకోకపోగా ఆమె ఉద్యోగం ఏమవుతుందోనని, తను తెచ్చిన చేతి సంచిని యజమాని కంట పడకుండా మల్లికి అందించింది. సంచి అందుకున్న మల్లి కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్ళు సుశీల చూపును దాటిపోలేదు.

***

షాపులో చేరిన ఆరు నెలల నుండి మల్లి పని చేస్తోందే కానీ, భర్త బతికుండగా తనతో ఆనందంగా గడిపిన జీవితం, భర్త చనిపోయాక జరుగుతున్న జీవితం గురించిన ఆలోచనలతో ఎక్కువ సరుకులు ఇచ్చేయడం, షాపు యజమాని తిట్లు, హెచ్చరికలు గుర్తొచ్చాయి.

“ఇదిగో మల్లి, ఇలా సరుకులు ఎక్కువ ఇచ్చేయడానికి ఇది నీ అయ్య జాగీరు కాదు. నష్టం వచ్చేది నాకు. మరోసారి ఇలా చేస్తే నిన్ను పనిలోంచి తీసేయాల్సి వస్తాది. ఇప్పటికే రెండుసార్లు లిస్ట్‌లో ఉన్న సరుకులు కన్నా ఎక్కువ సామాన్లు ఇచ్చేశావు. ఇప్పటికి నీ జీతంలో డబ్బులు కోసేస్తున్నా. ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం. మరి చెప్పడం ఉండదు. పనిలోంచి తీసేయడమే, గుర్తెట్టుకో” యజమాని హెచ్చరించడం కళ్ళముందు కదిలింది మల్లికి.

తన పరధ్యానంలో చేసిన మూడో తప్పుకు తన ఉద్యోగం పోయి, తన కుటుంబం రోడ్డున పడి ఉంటే.. భయం వేసింది మల్లికి. అసలే తన ఇంట్లో ముగ్గురు, తన అత్తమామలు ఆడబిడ్డ కలిపి ముగ్గురు.. ఈ షాపు త్రీ స్టార్స్.. ఇలా మూడు అనే సంఖ్య అంటేనే విసుగెత్తిపోయిన మల్లికి.. మళ్ళీ అదే మూడు తన పనిని కాపాడడం చిత్రమైన ఆనందాన్నిచ్చింది.

***

మల్లి ఖాళీ సంచిని సుశీలకు అందిస్తూ తన ఉద్యోగాన్ని కాపాడినందుకు ఆనందంతో నిండిన కన్నీటిని రాలుస్తూ బోలెడు ధన్యవాదాలు చెప్పింది. సుశీల మంచిపని చేశానన్న సంతృప్తితో ఇంటికి బయలుదేరింది.

సుశీల వెళ్లిన మరుక్షణం మల్లి పట్టరాని సంతోషంతో తాను తెచ్చుకున్న అన్నం డబ్బా తీసుకుని, యజమానితో, “సారూ నేను అన్నం తినొస్త. సానా ఆకలిగుంది. ఓ అరగంటలో వచ్చేత్తా” అంటూ స్టోర్ రూమ్ వైపు కదిలింది. షాపులో చేరిన తర్వాత మధ్యాహ్నం వేళ మల్లి అన్నం తినడం అతి తక్కువసార్లు చూసిన షాపు యజమాని, మల్లి నవ్వుతుండగా అయితే అస్సలే చూడని షాపులోని ఇతర పనివాళ్ళకు.. మల్లిని ఇప్పుడు ఇలా కొత్తగా చూడడం ఆశ్చర్యం అనిపించింది.

మల్లి అన్నం డబ్బా తెరిచింది.

అన్నం, కూర, పచ్చడి.. ఇక్కడ కూడా ‘మూడే’.

నవ్వుకుంది మల్లి.. పచ్చడి కలుపుకుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుంది.

Exit mobile version